కశ్మీర్‌లో 370, 35ఎ రద్దు తర్వాత సగటు భారతీయులంతా ఉద్విగ్నతకు లోనయ్యారు. ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల ‘గ్రాఫ్’ ఆకాశమంత ఎత్తుకు చేరింది. ఈ ఇద్దరూ అవలంబించిన ‘స్ట్రాటజీ’ వారి చాణక్యాన్ని మరింత రాటుదేల్చి దేశ ప్రజల్లో వారి పట్ల అభిమానం పెరిగింది. ఇప్పటివరకూ పార్లమెంటు లోపలా బయటా మోదీ ప్రసంగాలను మాత్రమే జనం సీరియస్‌గా విన్నారు. 

ఈసారి ‘అమిత్ షా’ ప్రసంగం కాస్త మందలింపులతో ఉద్వేగంగా సాగింది. ఇది చూశాక ప్రతిపక్షాలకు ఇప్పటి వరకూ ‘మోదీ మాత్రమే మాకు నిలువ నీడలేకుండా చేస్తాడని గగ్గోలు పెట్టేవాళ్లం.. షాను చూస్తుంటే మోదీనే మంచివాడనిపిస్తుంది’ అనుకున్నారట! అయితే యథాలాపంగా గులాం నబీ ఆజాద్ బాటలో ఒక్క అడుగు కూడా పక్కకు వేయకుండా రాహుల్ గాంధీ ‘ట్వీట్’ చేయడం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. కాంగ్రెస్ నేత గులాం నబీ ఏం ‘శుద్ధ గాంధేయవాది’ కాడు. వౌలానా అబుల్ కలాం ఆజాద్‌లా, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్‌లా ఏనాడూ ‘గాంధేయ కాంగ్రెస్’ మనస్తత్వం ప్రదర్శించలేదు.

గులాం నబీ ఆజాద్ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమర్‌నాథ్ యాత్రికులు మధ్యలో విశ్రాంతి తీసుకొనేందుకు, ఇతర సదుపాయాల కోసం దేవస్థానం బోర్డు అర్జీ మేరకు నూరెకరాల అటవీ భూమిని కశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది. అదేమీ శాశ్వత నిర్మాణాల కోసం గాదు. మంచుకొండలెక్కే యాత్రికులకు దారిగుండా కనీస సౌకర్యాల కోసం మాత్రమే. దాని ఉపయోగం యాత్ర జరిగినన్ని రోజులే. 

అయితే ఆ రోజు కాంగ్రెస్‌తో సంకీర్ణం నడిపిన పీడీపీ చేతుల్లో అటవీ శాఖ ఉండడం వల్ల ఆ మంత్రి కూడా ఓకె అనగానే ఈ ఆజాద్ ఆమోదముద్ర వేశాడు. హిందూ యాత్రికుల కోసం- అదీ కనీస సౌకర్యాల కోసం టెంపరరీ టెంట్ల కోసం ఇచ్చిన స్థలం వెనక్కి తీసుకోవాలని, ఇక్కడ హిందువులు తిష్టవేస్తారనీ, దానికి ‘కాశ్మీరీయత్’ అనే ముసుగు తొడిగి ఆందోళన పుట్టించారు. వెంటనే ఇదే ఆజాద్ ప్రభుత్వం గవర్నర్ ద్వారా దాన్ని వెనక్కి ఇప్పించింది. అంటే హిందువులకు కనీస సౌకర్యాల కోసం తాత్కాలికంగా భూమిని కేటాయించడం అక్కడి నాయకులకు సుతరామూ ఇష్టం లేదన్నమాట. జమ్మూ మొదలుకొని దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన లేచింది. 

అయినా నాటి మన్మోహన్ సింగ్ సర్కారు గానీ, ఆజాద్ సర్కారు గానీ హిందువుల మనోభావాలపై కనికరం చూపలేదు. అంత నిఖార్సయిన లౌకికవాది గులాం నబీ ఆజాద్! ఆయన తోక పట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ఇన్నాళ్ళూ రాహుల్‌ను మాత్రమే బాల్య చేష్టలున్న రాజకీయ నాయకుడిగా ప్రజలు భావించేవారు. ఇపుడు ప్రియాంక గాంధీ ట్వీట్లు చూసి జనం నవ్వుకుంటున్నా రు. ‘‘ఇందిరా గాంధీలా ఆహా ర్యం వుంటే సరిపోదు. అ లాంటి నిర్భీతి కూడా ఉం డాలి’’ అంటున్నారు. 

ఆఖరుకు పి.చిదంబరం లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతే ప్రియాంక ‘ఇది పిరికిపందల చర్య’ అనడం ఆమె అజ్ఞానానికి నిదర్శనం అంటూ విశే్లషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఈ బ్యాచంతా ఒకవైపు ఇలాంటి వడ్ల గింజల్లోంచి బియ్యం తీసే పనిలో ఉండగా, అటు ‘అర్బన్ నక్సల్స్’ అయోమయంతో ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగునాట స్వయం ప్రకటిత మేధావులు, కుల పక్షపాత మీడియాలోని కొందరు హర్యాలీ మేధావులు 370 రద్దు అప్రజాస్వామికమని ఉడికిపోతున్నారు. 

జర్నలిస్ట్ లేదా ఒక మతానికి చెందినంత మాత్రాన దేశ సార్వభౌమత్వాన్ని అపహాస్యం చేయవచ్చా? ‘సంకెళ్లలో కాశ్మీర్.. కశ్మీరీల భావోద్వేగాలను ముళ్లకంచెలో బందీ చేసిన సందర్భం’ అంటూ రాష్టప్రతి ఇచ్చిన గెజిట్‌ను, పార్లమెంటును అవమానం చేసిన ఓ జర్నలిస్టు కొందరి ఆలోచనల్లో దేశం కన్నా గొప్పగా అయిపోయింది! వాళ్లందరికీ ఆదర్శమూర్తి అయిన అమర్త్యసేన్ ‘కశ్మీర్ విషయంలో ప్రభుత్వ నిర్ణయంవల్ల భారతీయుడిగా గర్వపడలేనని’ చెప్పడం విడ్డూరం. మార్కిస్ట్ మదర్సా జెఎన్‌యూలోని కొందరు విద్యార్థులు, అలాగే మణిపూర్ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, ఢిల్లీ లా స్కూల్, హెచ్‌సీయూ వంటి విశ్వవిద్యాలయ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల నాయకులు ఆయా విశ్వవిద్యాలయాల్లో మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారు.

‘తుక్డే తుక్డే గ్యాంగు’కు అధ్యక్షురాలయిన షెహ్లా రశీద్ అనే వామపక్ష విద్యార్థి సంఘ నాయకురాలు కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడ మారణహోమం జరుగుతోందని ట్వీట్ చేసింది. ఇదే యువతి గతంలో 370 ఆర్టికల్ జోలికొస్తే దేశంలో అగ్గి రగిలిస్తామని, మాకు ఆజాదీ కావాలని బహిరంగంగా టీవీ చర్చల్లో చెప్పింది. అయితే షెహ్లా చెప్పినట్లుగా పారా మిలటరీ దళాలు ఇళ్లల్లోకి అక్రమంగా చొరబడి అమానుషంగా ప్రవర్తిస్తున్నాయని ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ ఖండించారు. వాళ్లందిస్తున్న సమాచారమే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాదనకు బలం అందిస్తున్నది. ఇంకో పత్రికా సంపాదకుడు ‘పోటా టాడా చట్టాలు వచ్చినపుడు వచ్చి ప్రజాందోళన ఇపుడు రావడం లేదని’’ తీవ్రంగా బాధపడిపోతున్నాడు. రామచంద్ర గుహ అనే చరిత్ర మేధావి 370 ఆర్టికల్ రద్దును గాంధీ భుజాలపై పెట్టి తుపాకీ పేల్చాడు.

ఒకప్పుడు కాంగ్రెస్- కమ్యూనిస్టులు కలిసి ప్రభుత్వాలు నడిపారు. కొన్నిసార్లు విధానపరంగా విడిపోయారు. కానీ వీళ్లమధ్య పరస్పర సహకారం అంతర్గతంగా బలంగా ఉండేది. ఇటీవల మరణించిన కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు యస్.జైపాల్‌రెడ్డి తమకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించడమేగాక ఎన్నో సహకారాలు అందించేవాడని ఇటీవల ప్రొ. జి.హరగోపాల్ ఓ వ్యాసంలో చెప్పుకొచ్చాడు.

నక్సలైట్లను, మావోయిస్టులను, వారి అనుబంధ సం ఘాలను నిషేధించే అధికార పార్టీ బయటకు కన్పించేటట్లు చేస్తే, వారికి అంతర్గతంగా సహకరించేవారు ఉండేవారని తెలుస్తున్నది. ఇపుడు అర్బన్ నక్సల్స్ ముసుగులో అమర్త్య సేన్, షెహ్లా రశీద్ వంటివాళ్లు పరోక్షంగా మతతత్వాన్ని ఎగదోస్తున్నారు. ఇక కమ్యూనిస్టు నాయకులు, మేధావుల నోటికి మొక్కాలి. వాళ్లు ప్రతిరోజూ మతతత్వం, నియంతృత్వం, ప్రజాస్వామ్యం అంటూ వల్లించే పదాలు 1984లో సిక్కుల ఊచకోత జరిగినపుడు, తొంభయ్యవ దశకంలో పండిట్లపై జరిగిన అత్యాచారాలు ఈ పరిధిలోకి రావు. 

మాట్లాడితే కశ్మీరీల స్వేచ్ఛ, అభిప్రాయం అంటూ పిల్లి మొగ్గలు వేస్తున్న ఈ గ్యాంగ్ రాజ్యాంగంలో ‘సెక్యులరిజం’ అనే పదం ఏ దేశ ప్రజలను అడిగి చేర్చారో చెప్పగలరా? దేన్నైనా బయట ఉండి ధ్వంసం చేయడం కన్నా ప్రక్కన ఉండి నాశనం చేయడం సులభం అని బ్రిటీషువారు నేర్పిన నీతి ఈ దేశ సరిహద్దులను కాపాడే సిక్కులను హిందువుల నుండి వేరు చేయడానికి 1841 తర్వాత ఐర్లాండు నుండి భారత్‌కువచ్చిన ‘మాక్స్ ఆర్థర్ మెకాలిఫ్’ అనే బ్రిటీషు అధికారి సిక్కు మతాన్ని స్వీకరించి భాయ్ కహ్నేసింగ్ నాభా అనే సిక్కు గురువును ప్రభావితం చేశా డు. 1897లో అతను రచించిన ‘హమ్ హిందూ నహీ’ అనే చిన్న పుస్తకం సరిగ్గా వందేళ్ల తర్వాత ‘ఖలిస్తాన్’ ఉద్యమానికి దారిచూపింది. కాబట్టి పక్కనే ఉంటూ గోతి త్రవ్వుతున్న విదేశీ మానసపుత్రుల ‘అర్బన్ నక్సలిజాన్ని’ గట్టిగా ఎదుర్కొంటేనే భవిత.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *



మోదీ ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేయగానే మన ప్రతిపక్షాలతో పాటు దాయాది దేశమైన పాకిస్తాన్ ఆందోళన ప్రకటించింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం ఏర్పరచి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని దుర్వ్యాఖ్యలు చేశాడు. పాక్ ప్రధాని నుండి అంతకన్నా ఎక్కువ ఆశించలేం. ‘్భరత్‌లో భాజపా ప్రభుత్వం నాజీ మనస్తత్వం వున్న ఆర్‌ఎస్‌ఎస్ హిందూ ఆధిపత్య భావజాలంతో పనిచేస్తోంది. అందువల్లనే వారు కశ్మీరును అణచివేస్తున్నారు. ఈ రహస్యం ముందే గుర్తెరిగిన మన ఖయిదే- ఆజం (గొప్ప నాయకుడు) జిన్నా, హిందూ ఆధిపత్యం కింద వుండవద్దనే ముస్లింల కోసం పాకిస్తాన్ సాధించాడు’- అని ఖాన్ అన్నాడు. ఈ వ్యాఖ్యలకు అక్కడి అధికారపక్ష సభ్యులకు సంతోషం కలిగి, కరతాళధ్వనులు చేశారు. అలాగే మన వారసత్వం ‘మదీనా’ నుండి ఉందని ఖాన్ అన్నాడు. మదీనాలో మన పాలకులు సర్వమత సమానత్వం పాటించారని ఇమ్రాన్ చెప్పుకొన్నాడు.

ఇందులోని ‘నాజీ’ నియంతృత్వం అనే పదం మాత్రం పట్టుకొని మోదీ, అమిత్ షాలను హిట్లర్‌తో పోలుస్తూ దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, వామపక్ష పత్రికలు, నాయకులు ఈ పది రోజులు విషం వెళ్లగక్కారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘నాజీ’లతో పోల్చడం సబబా? 60 లక్షలపైగా యూదు ప్రజలను కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపుల్లో చిత్రహింసలకు గురిచేసి చంపిన నాజీ ప్రభుత్వం ఎక్కడ? అహరహం దేశసేవ కోసం తపించే ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడ? దేశాన్ని తల్లిగా భావించి ఆరాధించే ఏకైక సంస్థ ఆరెస్సెస్. ఆ భారతమాత పరమ వైభవ స్థితి తెలియాలంటే ఒక్క సంవత్సరమైనా ఈ మేధావులు ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్లి చూడాలి. ఆ తర్వాత మాట్లాడాలి.

ఈ దేశంలో విచిత్రం ఏమిటంటే నూటికి నూరుమంది విమర్శించే వారిలో ఆర్‌ఎస్‌ఎస్ గురించి తలాతోకా తెలియకుండా మాట్లాడుతుంటారు. కమ్యూనిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి భయంకరమైన నిజాలతో పుస్తకాలు రాసిన వాళ్లు ఎందరో కన్పిస్తారు. ఆరెస్సెస్‌లోకి న్యూట్రల్‌గా వెళ్లి అందులో జరిగే కార్యకలాపాలను చూశాక మా ట్లాడితే అర్థముంది. సోకాల్డ్ మేధావులంతా యం. ఎస్.గోల్వాల్కర్ రచించిన ‘జాతీయ భావన’తో కూడిన విషయాలను కట్.. పేస్ట్ చేసి మతోన్మాదం ప్రచారం చేస్తారు. ఇమ్రాన్ ఖాన్ మొన్న మాట్లాడిన ఉపన్యాసం సహా చాలామందికి ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎవరు స్థాపించారో తెలియదు. ఈ దేశంలో పుబ్బలోపుట్టి మఖలో మునిగిపోయిన సంస్థలను ఎన్నింటినో చూస్తాం. 1925లో పుట్టిన ఆరెస్సెస్ మొదట్లో పదుల సంఖ్యలో సభ్యులున్న సంస్థ. కానీ ఈనాడు అది వటవృక్షం. 

అంతెందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్ని ముక్కలైంది? ప్రపంచ కార్మికులారా! ఏకం కండి! అంటూ అందరికీ పి లుపునిచ్చే కమ్యూనిస్టు పార్టీ ఎన్ని ముక్కలయ్యిందో ఇపు డు లెక్క కూడా పెట్టలేం. కాంగ్రెస్ పార్టీ ఆల్ఫాబెట్స్‌లోని అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రూపులైంది. మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌గా డాక్టర్ కేశవరాం బలిరాం హెడ్గేవార్ చేత స్థాపించబడి ఈనాడు దేశాన్ని ఏలే స్థాయికి ఎలా చేరింది? ఈ క్రమంలో ఎందరు తమ జీవితాలను దేశమాత కోసం అంకితం చేశారు? తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా నిరాడంబరంగా, త్యాగబుద్ధితో తమ పని తాము చేసుకుపోయే క్రమశిక్షణగల ప్రచారక్‌లు, కార్యకర్తలు లక్షలాదిగా కనిపిస్తారు. ఇలాంటి త్యాగబుద్ధిని ఎక్కడైనా చూపించగలరా? విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో మేధావులంటే ‘ప్రగతిశీల ఎర్రమెదళ్ళు’. వీళ్లెప్పుడూ ఆరెస్సెస్‌ను సమర్థించరు.

మరి ఈ ప్రగతిశీల మేధావులతో పొడగబడిన మార్టిన్ హెయిడెగ్గర్ నియంత హిట్లర్‌ను గొప్పగా పొగిడాడు కదా? భారతదేశంలో ఆరెస్సెస్ జాతిపరమైన వివక్షను ఎప్పుడు చూపింది? భారతీయత అనేది అన్ని మతాలకు వర్తించదా? ఆరాధనపరంగా మతం ఏదైనా అవలంబించవచ్చు. దేశాన్ని ప్రేమించమనడం, ఇక్కడి సంస్కృతిని గౌరవించాలనడం నాజీతత్వమా? ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలతో విదేశీ బుర్రలను ఉపయోగించి ఈ దేశం మెదడు నాశనం చేస్తే అది గొప్ప సిద్ధాంతం! అస్తిత్వాల పేరుతో దేశాన్ని ముక్కలు చేస్తే అది గొప్ప ప్రగతిశీలభావం! ఆరాధన ఏదైనా అందరూ భారతీయులనడం నేరమా? విదేశాలకు వెళ్లిన క్రైస్తవ ముస్లింలు ‘ఐ యామ్ ఏన్ ఇండియన్’ అంటూ చెప్పడం లేదా? దేశం మొదట అని చెప్పడం ‘నాజీ స్వభావం’ అనుకుంటే వాళ్లను ఎవరు బాగు చేస్తారు? చాలామంది నిరాధారంగా ‘సంఘ్’పై- ‘స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేద’ని నిందలు వేస్తుంటారు. 

1921లో రాజద్రోహం నేరం కింద డా.హడ్గేవార్ జైలుకు వెళ్ళాడు. అలాగే లోహరా అడవిలో యెట్మాల్ అడవిలో అడవి గడ్డి కోసి బ్రిటీషువారి ఆజ్ఞను ధిక్కరించి 1930లో డాక్టర్జీ జైలుకువెళ్ళాడు. ఈ చరిత్ర తెలియకుంటే తమకిష్టమైన ‘ఖిలాఫత్ ఉద్యమం’ గురించైనా చదివితే ఈ మేధావులకు అర్థం అవుతుంది. ‘సంఘ్’పై కులతత్వ ఆరోపణలు చేస్తూ తమ వికృతనాందాన్ని సంతృప్తి పరుస్తుంటారు. సంఘ్‌లో ‘జాత్ పాత్ నై పూచ్‌నా’ అనేది సిద్ధాంతం. చాలా ఏళ్ళు పనిచేసిన ఇద్దరు స్వయం సేవకుల కులాలు మచ్చుకైనా తెలియనివారు ఎందరో ఉన్నారు. 1934 మధ్యలో వార్థా నుండి శేగావ్ వెళ్ళే మార్గంలో ఆర్‌ఎస్‌ఎస్ శిబిరం నడుస్తుంటే పక్కనే బసచేసిన మహాత్మా గాంధీ మహదేవ్ భాయ్, మీరాబెన్‌లతో కలిసి వచ్చి శిబిరం చూసి, వారి క్రమశిక్షణ, కులం అడగకుండా కలిసి ఉండే విధానం చూసి ఆశ్చర్యపోయారు. 1939లో డా.బి.ఆర్.అంబేద్కర్ పూణే శిక్షావర్గకు అతిథిగా వెళ్ళాడు.

1939 ఏప్రిల్ 21న బాబాసాహెబ్ వెళ్లి కులంతో పనిలేకుండా వారు చేసే కార్యక్రమాలను చూసి అభినందించాడు. ఆయన రచనల్లో సంఘ్‌ను దూషించలేదు. కులతత్వం నిండా నింపుకొన్న సంస్థలు, పార్టీలు కుల నిర్మూలన గురించి కృషి చేస్తున్నామంటాయి.

1952లో గోసంరక్షణకు దాదాపుకోటి 75 లక్షల సంతకాల సేకరణ చేసినా, 1962లో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా సైన్యంతో కలిసి పనిచేసినా 1963 జనవరి 26న రిపబ్లిక్ పెరేడ్‌లో కవాతు చేసినా అవన్నీ దేశం కోసమే. 1965లో పాకిస్తాన్ దండయాత్ర సందర్భంగా నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ గురూజీతో స్వయంగా మాట్లాడి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించాడు. 22 రోజుల యుద్ధంలో దేశం కోసం సంఘ్ తన సేవల్ని అందించింది. 1977 నవంబర్‌లో తుఫాన్ భీభత్సంలో ఆర్‌ఎస్‌ఎస్ చేసిన సేవలు అందరూ ప్రశంసించారు. 1984లో ఇందిర హత్యానంతరం జరిగిన అల్లర్ల సందర్భంగా ఎందరో సిక్కులకు స్వయం సేవకులు ఆశ్రయం కల్పించారు. లక్షలాది సేవప్రకల్పాలతో నిరాడంబరంగా సేవ చేసే సంఘ్‌ను నాజీలతో పోల్చడం ఇమ్రాన్ ఖాన్‌కే చెల్లింది. ఈ దేశ నాయకులకు, మేధావులకు తగదు.

ఇమ్రాన్ చెప్పిన ఆయన వారసత్వ పూర్వీకుల చరిత్ర అంతా రక్తపు మరలే. గజనీ, ఘోరీ, తైమూర్లంగ్, నాదిర్షా, బాబర్, ఔరంగజేబు, ఖాసీం రజ్వీ, జిన్నా వీళ్లందరి లెక్క తేల్చాలంటే వారి వారి వంధిమాగధులు రచించిన ‘షానా మా’లను తరచి చూడాల్సిందే. అలాగే గొప్ప ఎర్రమేధావుల పూర్వీకులైన జోసెఫ్ స్టాలిన్, మావో సేటుంగ్, హోనెకర్, న్యూనెస్క్యూ, బ్రెజ్నెవ్, డెంగ్.. 

అంతెందుకు..? మావోయిస్టులు, కమ్యూనిస్టులు చంపిన వారి గణాంకాలు మన కళ్లముందున్నవే. ప్రజాస్వామ్యాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నామని చెప్పే కమ్యూనిస్టుల ఏలుబడిలో మరణించిన ఆనంద్ మార్గ్ కార్యకర్తల శవాల పుర్రెలు ఈరోజుకూ నాట్యం చేస్తున్నాయి. ఇప్పటికీ కేరళ నరమేధంలో నిత్యం ప్రాణాలు కోల్పోతున్న ఆరెస్సెస్ కార్యకర్తల చేతులు కాషాయం వైపు చూస్తున్నాయి. ‘తియానె్మన్ స్క్వేర్’లో నిరాయుధ విద్యార్థులను ట్యాంక్‌లతో తొక్కించి చంపిన చరిత్ర ఆరెస్సెస్‌కు లేదు. ఒకవేళ ఆరెస్సెస్ లేకుంటే ఈ దేశం ఏనాడో పది పాకిస్తాన్‌లయ్యేది. హెగెల్, ఫ్యూర్చాక్, మార్క్స్,ఫ్రాయిడ్, ఐన్‌స్టీన్, సార్త్రే, మార్సెల్, జాస్ఫర్స్ లాంటి ఆధునిక మేధావులు ఈ దేశంలో పుట్టకున్నా- శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దయానంద, అరవింద, బాబాసాహెబ్‌లను ఆదర్శంగా తీసుకుని ‘వృత్తపత్రమే నామ్ చపేగా ఛోడ్ ఛలో ఈ క్షుద్ర భావనా’- పేరు పత్రికల్లో పడుతుందని, ఈ క్షుద్ర భావన వదలిపెట్టాలని సాగుతున్న సంఘ్‌కు నాజీలతో పోలికా!?


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *

 
సాధారణంగా తెలుగువారి నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది కవి ‘సమ్మేళనాలు’ జరుగుతుంటాయి. అందులో భారతీయతను గౌరవిస్తూ వసంత ఋతువును వర్ణిస్తూ తెలుగుదనాన్ని వివరిస్తూ కవిత్వం చెప్తారని ఆశించి ప్రేక్షకులు పూర్వం వచ్చేవారు. గత ఇరవై ఏళ్లనుండి ఆ కవి సమ్మేళనాల్లో నకారాత్మక దృక్పథంతో కూడిన కవిత్వానికి ప్రాధాన్యత పెరిగింది. ‘‘వసంతం వాడిపోయింది. కోయిల ఎగిరిపోయింది. పచ్చడి పాడైపోయింది’’ అంటూ ఏడుపుగొట్టు రాగాలతో ఉగాదిని తిడుతున్నారు. ఇక కమ్యూనిస్టు దృక్పథం ఉన్న కవీశ్వరులంతా ఏ కవి సమ్మేళనంలోనైనా ‘మతోన్మాదం’పై అన్యాపదేశంగా కవిత్వం మొదలుపెడతారు. అదీ వాళ్ల ఎర్రకళ్లద్దాలకు తీవ్రంగా కన్పించే కాషాయ మతోన్మాదం అంటూ కవిత చదివి కాలర్ ఎగిరేస్తారు. 

మతోన్మాదం ఎవరిదైనా తప్పే అని వారి జన్మలో చెప్పరు. ఈ హర్యాలీ కవుల కవితా ఉన్మాదమంతా ఏకపక్షంగా సాగుతుంది. ఈ రకమైన భావవ్యాప్తి అస్తిత్వాల పేరుతో కమ్యూనిస్టు కవులు సాహిత్య రంగం నిండా నింపేసారు. దాంతో కవిత్వంలో ఒక రకమైన రసహీనత మొదలైంది. రసాన్ని చంపే ఈ విరసం, అరసం కవిత్వాన్ని ప్రజలనుండి దూరంచేసాయి. అందుకే సాహిత్య సభలు వెలవెలబోతున్నాయి. ఇక కవిసమ్మేళనాల్లో కవిత్వం చదివేవారు తప్ప వినేవారు లేకుండాపోయారు. కవిత్వానికి ఉన్న రసదృష్టి, భావుకత, ఆర్ద్రత, సున్నితత్వం, సందేశం నశించిపోయి పరనింద ఆత్మస్తుతికి పర్యాయ పదాలుగా మారిపోయాయి.

ఇటీవల 49 మంది ప్రముఖుల పేరుతో లేఖ రాస్తూ దేశంలో అసహనం అంటూ ఆగ్రహం వెళ్లగక్కినట్లే కవులూ, రచయితలూ రోజూ భారతీయతను, మోదీని తిట్టేందుకు తమ కలాల్లోకి క్రొత్త ఎర్ర సిరాను ఎక్కిస్తున్నారు.

‘‘అగర్ ఆప్‌కో హుకూమత్ దియాతో గుజరాత్ బనాతా హై / ముఝే హుకూమత్ దియేతో దిల్లీ బనాతా హూఁ / మై ఔరంగజేబ్ హూఁ’’ - ఇటీవల అవార్డు వాపస్ ఇచ్చిన ఓ అరాచక కవి తననుతాను ఔరంగజేబుగా అభివర్ణించుకొన్నాడు. మళ్లీ ఇటీవల 2019లో కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడగానే ‘అవార్డ్ వాపసీ గ్యాంగ్’ చైతన్యం అయిపోయింది. వాళ్ల లక్ష్యం సాహిత్యంద్వారా సమాజాన్ని చైతన్యం చేయడం కాదు. ‘సెలెక్టివ్’ ఘటనలకు కలం కదిలించి కవితా కాన్వాస్ మీద పరుస్తారు.

 వీళ్లంతా ఈ దేశ మూలాలను, జాతీయవాదాన్ని తిట్టేందుకు, దుమ్మెత్తిపోసేందుకు తమ అత్యాచార సాహిత్యాన్ని, కవిత్వాన్ని దేశంలో వ్యాప్తిచేస్తారు. నాస్తికుల్లా నటిస్తూ సంప్రదాయాలకు, ఇతిహాస పురాణాలకు, హిందూ దేవుళ్లను నిందిస్తారు. కళాకారులుగా మారిపోయి జాతీయ మహాపురుషులను నిందిస్తూ వారి వ్యక్తిగత చరిత్రను హననం చేస్తారు. చరిత్రకారులుగా అవతారమెత్తి భారతీయ చరిత్రను మార్చేస్తారు. అక్బర్, బాబర్‌ల గొప్పతనాన్ని అధ్యాయాలకు అధ్యాయాలు నింపేసి, ప్రతాపరుద్రునికి ఓ పేరా కేటాయిస్తారు. సాహిత్యవేత్తలుగా రూపాంతరం చెంది సాహితీ సరస్వతిని తమ అట్రాసిటీ లిటరేచరుతో నింపేస్తారు. అయితే ఈ దేశంలో మెజార్టీ మతానికి విమర్శను స్వీకరించే గుణం ఉందని వారు గుర్తించారు! చలం రాసిన రచనలు చదివి ఎందరో భ్రష్టులయ్యారు. నార్ల వెంకటేశ్వరరావు, రంగనాయకమ్మ రామాయణంపై విషం గక్కారు. ఇక లౌకికవాద ముసుగులోని హర్యాలీ కవులు పుట్టుమచ్చలు, కుష్ఠుమచ్చలు రాస్తూనే ఉన్నారు. ఎప్పటినుండో తెలుగునాట ఇది సాగుతూనే ఉంది.

‘‘నేను పుట్టకముందే / దేశద్రోహుల జాబితాలో / నమోదై వుంది నా పేరు’’ అంటూ ఖాదర్ లాంటివారు తెగ బాధపడతారు. కానీ దేశభక్తులుగా ఎందుకు ఉండలేక పోతున్నారో ఆలోచించరు.

‘‘వౌత్ ఔర్ జిందగీ హై దునియా కా ఏక్ తమాషా / ఫర్మాన్ కృష్ణకా థా అర్జున్ కో బీచ్ కారణ్‌మే’’ - ‘చావు, బ్రతుకూ అనేది లోకంలోని తమాషాలే. ఆజ్ఞ కృష్ణునిదైతే అర్జునుడు రణం మధ్యలో ఉంటాడు’ - ఇలాంటి కవిత్వం చెప్పింది ఎవరో కాదు. దేశంకోసం నిజాయితీగా ప్రాణాలర్పించిన అష్ఫాఖ్ ఉల్లాఖాన్ రచన. తన స్నేహితుల వెంట హిందూ దేవాలయాలను హిందూ ఆహార్యంతో వెళ్లి దర్శించే నిజమైన లౌకికవాది. కానీ హర్యాలీ కవులంతా హిందుత్వను తిట్టేందుకు నాస్తికుల్లా మారిపోతారు. వారి మతాచరణ చక్కగా చేసుకుంటారు. వీళ్లను నెత్తిన మోసే ‘ఎర్రన్న’లు ఇంట్లో పూజలు చేస్తారు. బయట హేతువాదుల్లా ఫోజులిస్తూ ఉంటారు. ఈ డెబ్బై ఏళ్లలో దేశమంతా ఇదే పరిస్థితి. 

తెలుగునాట జరుగుతున్న ఉదాహరణలు ఇవి. ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో ఓ చర్చ చూసాను. దాశరథి-సినారె జయంతి సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో ‘స్కైబాబా’ కవిత ‘హతుడి వాంగ్మూలం’ పేర తాను చదివినట్లు చెప్పుకొన్నారు. ఆ కవిత ప్రారంభం ఇలా ఉంది.

‘‘నెత్తిమీద అణకువ నేర్పే టోపీ / ముఖంపై కత్తిపెట్టని గడ్డం / నేనో తెల్లని పావురాయిలా కదులుతుంటాను / కాషాయ మూకకు కండ్లు కుడుతున్నాయి’’ అంటూ మొత్తం కాషాయానే్న బోనులో నిలబెట్టారు. ‘మేం ప్రత్యేకం’ అన్న కసాయితనం వదలకుండా కాశ్మీర్‌లో రాళ్ల దాడిచేస్తున్న వారిని ఇలాగే మత రంగు పెట్టి పిలుద్దామా? ఏకే ఆంటోని లాంటి నిఖార్సయిన సెక్యులరిస్టు ‘కాషాయం’ ఈ దేశ వారసత్వం అని చెప్పినా మార్పు రాదా? తిట్టేందుకు ఎంచుకున్న ప్రతీక తప్ప వాస్తవాలు హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో తిరిగితే తెలుస్తుంది. ఇంకో అడుగుముందుకేసి - ‘రామనామం నా చావుకు పర్యాయ పదం అయ్యింది’ అంటాడు. 

మరి ‘15 నిమిషాలు పోలీసులను ప్రక్కనపెడితే అందరినీ హలాల్ చేస్తా’ అన్న అమృత వాక్కులపై ఈ కలం కదిలిందా? ఎక్కడో జరిగే చిన్న సంఘటనలకు కాషాయం, రాముడి లాంటి పదాలు వాడాల్సివస్తే బూర్హాన్‌వనీ, జాకీర్ మూసా, జాకీర్ నాయక్ ఎవరు? వాళ్ల తీవ్రవాదాన్ని మత దృష్టితోనే చూద్దామా? ముక్తాయింపుగా - ‘నేను హత్యచేయబడ్డందుకో / నా హత్య గురించి స్పందించనందుకో / నాకు బాధనిపించలేదు / నా బాధంతా ఒక్కటే / కవి అన్నవాడైనా మనిషిగా మిగలాలి కదా’’ అన్నాడు. మరి కైరానాలో మెజార్టీ ప్రజలు ఎందుకు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లారు. వినయ్‌ప్రకాశ్, బిర్జుమాదిగ వంటి దళితుల హత్యకు కారణం? వాంగ్మూలం ఎవరిని అడగాలి? వరంగల్‌లో గుడిలో మైకు పెట్టినందుకు ఓర్చుకోకుండా పూజారి సత్యనారాయణ హత్యకు ఎవరు వాంగ్మూలం ఇస్తారు!? బ్రతికుండే చచ్చినట్లు ఊహించుకున్నవారు అందమైన పదాలతో నేరారోపణ చేయగలరు. మరి మరణించినవారు ఎవరికి చెప్పుకోవాలి? ఇదే పరిస్థితి దేశమంతా ఉంది.

అవకాశవాదులుగా మారిపోయి అవార్డులు పొందిన వాళ్లంతా ఇపుడు తిరిగి ఇస్తామంటారు. ముషాయిరాలో ముషరాఫ్‌ల్లా మాట్లాడుతున్నారు. నిజానికి అవార్డులువస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ అది వాపస్ ఇస్తే వార్తగా మారడం వాళ్ల లేకితనానికి నిదర్శనం. భావ స్వేచ్ఛ కావాలని అది ఈ దేశంలో కొరవడిందని 2015లోనే 40 మందికి పైగా రచయితలు, కవులు అవార్డులు వాపస్ ఇచ్చారు. కొందరు కేంద్ర సాహిత్య అకాడమీనుండి వైదొలగారు. కానీ తెలుగునాట ఈ గ్యాంగ్ నుండే ఎక్కువమంది అకాడమిని నడిపిస్తున్నారు. ఇప్పుడు తెలుగు కవులు, రచయితలు వివాదాస్పద పుస్తకాలు రాసే స్థితిలో లేరు. ఆ బాధ్యతను సామాజికవేత్తలకు అప్పజెప్పారు. 

వాళ్ల రచనలు ‘కులతత్వం’తో నిండిపోయి, సమాజంలో ‘అన్‌రెస్ట్’ను పుట్టిస్తున్నాయి. రాజకీయంగా కులాల మధ్యన ఉన్న సంఘర్షణను సాహిత్యంలోకి వొంపుతున్నారు. ఇపుడు కవులంతా వాట్సాప్‌ల్లో, ఫేస్బుక్కుల్లో తమ కవితలను పోస్ట్‌చేస్తూనే, సంఘటనలపై అభిప్రాయాలు చెప్తుంటారు. అందులో ఎక్కువగా ఈ దేశ మెజార్టీ ప్రజలను తిట్టేవే. ఆ తిట్లను అందమైన పదాలతో కవితలుగా అల్లుతారు. కలాలకు వచ్చిన ఈ పక్షవాత రోగం సాహిత్య రంగంలో డెబ్బై ఏళ్లనుండి ఉంది. ‘అందరూ సమానం’ అన్నది వాళ్ల డిఎన్‌ఏలో ఉండదు. ‘కొందరు మాత్రం ముఖ్యం’ అన్నది వాళ్ల కవిత్వ రస సిద్ధాంతం.

మరో గుంపు కులాల కంపును కలాలలో నింపి సమాజాన్ని కలుషితం చేస్తున్నది. ఇప్పటికీ కొన్ని కులాల్లో పేరుకుపోయిన అవకాశవాదాల్ని సమాజం మొత్తానికి రుద్దేసి ఆనందం పొందుతారు. ఈ బ్యాచే అవార్డులు ఇవ్వలేదంటారు, ఇస్తే వాపస్ చేస్తామంటారు. ఈ ద్వంద్వ వైఖరికి ఏం పేరుపెట్టాలో తెలియడం లేదు.

‘సముద్రం ఒకడి కాళ్లదగ్గర కూర్చొని మొరగదు / తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు / పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు / నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు / కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’ - అన్న మహాకవి మాటల్ని తాము ఆచరణలో చూపిస్తున్నట్లు నటించడం వాళ్ల స్వంతం అయితే అదృష్టం కొద్దీ కవిత్వం చదవడం ప్రజలు మానేసి చాలా రోజులు అయ్యింది. వాళ్ల చిత్రవిచిత్ర ప్రయోగాలు, కవితలకు, సంచికలకు పెట్టే పేర్లు ప్రజలను కవిత్వానికి దూరంచేసాయి. కానీ వాళ్ల వందిమాగధుల సైకోఫ్యాన్సీ ఎక్కువై పిచ్చి పీక్‌స్పీడ్‌కు వెళ్లింది. అందరిదీ క్రిడ్‌ప్రోకోనే. అస్తిత్వ పదాల పేరుతో అందరినీ రెచ్చగొట్టి సమాజానికే కవులను శత్రువులుగా మార్చిన దిగంబర, పైగంబర పైత్యమే. ఇటీవల కవిత్వంలో దబాయింపు, కులం కుళ్లు ఎక్కువైంది. 

ఏ కులంవాళ్లు ఆ కులంవాళ్లను హద్దులుమీరి ప్రేమించే మనస్తత్వం పెరిగింది. కేరళలో నారాయణగురు ఎజువ కులస్థుడు. ఆయన చేసిన సంస్కరణ దృష్టి ఇక్కడున్న గౌడులకు తెలియదు. సర్వయిపాపన్నకు ఇచ్చిన ప్రాధాన్యత నారాయణగురుకు ఇవ్వడం లేదు. అక్కడ ఎజువ, ఇక్కడ గౌడ ఒకే కులాలే. భారతదేశమే గర్వించదగిన గొప్ప వ్యక్తి నారాయణగురు. ఇలాగే చాకలి ఐలమ్మ, గాడ్గేబాబా ఇద్దరూ రజకులే. ఐలమ్మను తెలంగాణ ఉద్యమంలో పట్టుకున్నవారు.. గాడ్గేబాబాను గురించి ఏమీ తెలుసుకోరు. మన దేశంలోనే దళితులకోసం మొదటి సత్రం పండరీపురం కట్టించిన మహానుభావుడు సంత్ గాడ్గేబాబా. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గాడ్గేబాబాను గురు సమానులుగా చూసాడు. 

ప్రచ్ఛన్నంగా క్రైస్తవ్యం చెప్పే దళిత కవులను ఆరాధిస్తారు. కానీ మాదిగ కులంలో జన్మించి మహాయోగిగా మారిన తెలంగాణ తొలి దళిత కవి దున్న ఇద్దాసును పట్టించుకోరు. శ్రీశ్రీ, విశ్వనాథలను పరస్పర భిన్నధృవాలుగా చెప్పేవారుకూడా ఇద్దరూ ఒకే కులస్థులని అభిమానించడం మొదలుపెట్టారు. త్రిపురనేని రామస్వామిలో జస్టిస్ పార్టీ భావజాలం ఉన్నా, ఎన్టీఆర్ వివేకానందునిలా వేషంవేసినా ఇద్దరూ ఆ కులంవాళ్లకు ఆరాధ్యనీయులు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ చట్రంలో పడిపోయిన సాహిత్యలోకం ఇపుడు వాళ్ల అడుగుజాడల కోసం వెదుకుతూ కవిత్వపు ఛాయలను కాలదన్నింది. హద్దులుమీరిన మర్యాద, కేరీరిస్టు కాన్సర్ పేరుకుపోయి కవిత్వం పేరుతో ‘అకవిత్వం’ అంతా అట్రాసిటీ లిటరేచర్‌గా మారిపోయింది. కేంద్ర అకాడమి సెమినార్లను నిర్వహించే పెద్దలు, అందులో పాల్గొనే కవులూ, స్టార్ హోటళ్ల సదస్సులకు జులపాలతో, బుజురు గడ్డాలతో వెళ్లి సాహిత్య చైతన్యం కలిగిస్తుంటారు!?

బయట చాలామందిలో అకవిత్వం. సెమినార్లలో తానా, ఆటా సభల్లో భుజాలకు సంచులేసుకొని పుచ్చలపల్లి సుందరయ్యలా ఫోజులిచ్చే అవార్డు వాపసీ గ్యాంగ్‌లు కవిత్వంలోనే సున్నితత్వాన్ని చంపేసారు. కేవలం విదేశీ సిద్ధాంతాలను ఆధారం చేసుకొని అత్యాచార సాహిత్యం సృష్టిస్తూ సమాజ సమగ్రతను దెబ్బతీస్తున్నారు.
 
********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
 

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 12 - 08 - 2019 : సోమవారం*

 



‘దేశం బతికున్నపుడు నీవు మరణిస్తే కలిగే నష్టం ఏమిటి? నీ దేశం సర్వనాశనమైపోతుంటే నీవు జీవించి ఉండి ప్రయోజనం ఏంటి?’- ఇలాం టి నినాదాలు స్వాతంత్య్ర సమరంలో ఉండేవి. నిజమే! డెబ్భై ఏళ్ళ నుండి దేశాన్ని నాశనం చేస్తున్న రాచపుండుకు మందు వేస్తుంటే- కొందరికి కడుపులో రగులుతున్న ‘రాజకీయ మంట’ను చూసి ఈ తరం నవ్వుకుంటున్నది. 370, 35ఏ ఆర్టికళ్ల రద్దు, కశ్మీర్‌ను విభజించడం- ఈ రెండూ సాహసోపేత నిర్ణయాలే. ఇన్నాళ్లకు ఇంతటి సాహసం చేసినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను పార్టీలకతీతంగా ఈ దేశం మొత్తం అభినందించింది. కానీ యథాలాపంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సూడో సెక్యులర్ పార్టీలు, మతతత్వ పార్టీలు ఆ ఆర్టికళ్లకు మద్దతుగా నిలబడడం ఆశ్చర్యకరం.

మొదటిరోజు రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పిన మాటలు ఆకస్మికం అనుకోవచ్చు. రెండవ రోజు రాహుల్ గాంధీ ట్వీట్స్ ఈ దేశ యువతను ఆలోచింపజేస్తున్నాయి. స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఈ దారుణ పరిస్థితి ఎందుకొచ్చిందనే ఆ ఆలోచన! రాహుల్ కుడి భుజమైన జ్యోతిరాద్యి సింధియా ప్రభుత్వానికి మద్దతిచ్చి ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ చీఫ్ విఫ్ భువనేశ్వర్ కలితా తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ వైఖరికి నిరసన తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జనార్దన్ ద్వివేదీ, దీపిందర్ సింగ్ హుడా, మిలింద్ దేవరా వంటి కాంగ్రెస్ అగ్ర నాయకులు తమ పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తృణమూల్ పార్టీలో కూడా లుకలుకలు పుట్టాయి. మోదీని తీవ్రంగా వ్యతిరేకించే బీయస్పీ వంటి పార్టీలు, ఎన్డీయేలో లేని టిఆర్‌ఎస్, బిజెడి, వైకాపా, అడగకున్నా మద్దతిచ్చిన టిడిపి వంటి పార్టీలకు ఎక్కడో దీని చురుకు తగిలి ఉండవచ్చు.

కానీ ఆజాంఖాన్ పెత్తనం ఉండే సమాజ్ వాద్ పార్టీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సల్మాన్ ఖుర్షీద్ నడిపే కాంగ్రెస్ పార్టీ, మైనారిటీల కోసమే బతికే కమ్యూనిస్టు పార్టీలు, రజాకార్ వారసత్వం పుణికిపుచ్చుకున్న మజ్లిస్ పార్టీ, జిన్నా పుట్టించిన ముస్లిం లీగ్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అన్నదే ప్రశ్న!

‘మెజారిటీతో కలిసిపోకుండా ఏ మైనారిటీకీ భవిష్యత్తు ఉండదు’ అని ప్రముఖ దళితకవి భోయి భీమన్న ఓ చోట చెప్తాడు. తమకు తాము మైనారిటీగా అభివర్ణించుకున్న ‘సంకుచిత భావం’ ఏదీ ప్రపంచంలో నిలబడలేదన్నది సత్యం. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ ప్రజలకు రాజకీయంగా అండ ఇస్తూ ‘తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా’ భావించుకునే స్థితి కల్పించింది. ఈ వ్యాధిని దేశమంతా వ్యాప్తి చేసింది. దానికి బౌద్ధికమైన మద్దతును వామపక్ష మేధోవర్గం కల్పించింది. ఈ ఏడుపుగొట్టు రాగాలు ఆలపించేవారే ఇపుడు టీవీ చానళ్లలో కూర్చొని అపశకునాల బ ల్లుల్లా అరుస్తున్నారు. వామపక్ష పార్టీల పత్రికల సంపాదకులు, అర్బన్ నక్సల్స్ విశే్లషకులుగా మారిపోయి కూనిరాగాలు తీస్తూ కీడు శంకిస్తున్నారు. 

దేశ బడ్జెట్‌లో అధికభాగం డెబ్భై ఏళ్ళనుండి కాశ్మీర్ కొరకు ఖర్చుపెడుతున్నా అక్కడ అభివృద్ధి లేదు. నిజానికి జమ్ము, లడఖ్, కాశ్మీర్‌లు కలిసి జమ్ము కాశ్మీర్ రాష్ట్రం. 42.241 చ.కిలోమీటర్లు, 1,22,67,013 జనాభా వున్న జమ్ముకాశ్మీర్, 59.196 కిలోమీటర్లు, 2,76,289 జనాభా వున్న లడఖ్-లే కలిపితే జమ్మూ కాశ్మీర్ అవుతుంది. మూడు ప్రాంతాల్లో హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధులున్నా ఈ నాయకులు, పార్టీలు, మేధావులు కేవలం కాశ్మీర్ లోయలోని ముస్లింల గురించే మాట్లాడుతారు!? ఏం మిగతావాళ్లు మనుషులు కారా? దేశమంతా ముస్లింలను మైనారిటీలుగా చెప్పేవాళ్ళు, జమ్మూ కాశ్మీర్‌లోని మైనారిటీలైన హిందూ , బౌద్ధులను గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మైనారిటీ కమిషన్ జమ్మూ కాశ్మీర్‌లో ఎందుకు ఏర్పడలేదు. దేశంలో జరిగే ప్రతి చిన్న ఘటనను అంతర్జాతీయ వేదికలపై మాబ్ లింబింగ్ చిత్రీకరించే మానవ హక్కుల సంఘాలు అక్కడి మైనారిటీ ప్రజలకు ఏనాడైనా మానవ హక్కులుంటాయని ఆలోచించిందా? కాశ్మీర్ అనగానే ఫరూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలను చూసి మురిసిపోయే సూడో సెక్యులర్ పార్టీలు మొన్న పార్లమెంటు సాక్షిగా తన వాణిని అద్భుతంగా వినిపించిన లడఖ్ ఎంపీ నమ్‌గ్యాల్ ప్రసంగం ఆవేదనను ఏనాడైనా తెలుసుకున్నారా?

జనరల్ జియా ఉల్ హక్ కాలం నుండి భారత్‌ను నేరుగా దెబ్బతీయలేమని మతతత్వాన్ని నూరిపోస్తూ జిహాదీలను భారత్‌కు పాక్ దిగుమతి చేసింది. 1948 అక్టోబర్ 26 తర్వాత పాకిస్తాన్ సాగించిన విధ్వంసం కాశ్మీర్‌లోని ‘కాశ్మీరియత్’ను ఆనాడే ధ్వంసం చేసింది. కశ్యపుడు, ఆదిశంకరుడు, కల్హణుడు, అమర్‌నాథ్, వైష్ణోదేవిలు బంధింపబడ్డారు. పాక్ సైన్యంతో కలిసిన తండాలు ప్రజలను ఊచకోత కోసారు. స్ర్తిలను మానభంగాలు చేసారు. ఈ భయంతో రాజా హరిసింగ్ భారత్‌ను ఆశ్రయించి, మన దేశంలో కశ్మీర్‌ను విలీనం చేశాడు. మన సైన్యాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేలోపు ఈ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చి, సైన్యం ముందరి కాళ్లకు బంధం వేసింది లార్డ్‌వౌంట్ బాటన్, జవహర్‌లాల్ నెహ్రూ!

పాకిస్తాన్‌ను మతతత్వ రాజ్యంగా మార్చిన జిన్నా మనస్తత్వమే ఇప్పటికీ భారత్‌లో చాలామంది మైనారిటీ నాయకుల్లో వుంది. వాళ్ల దృష్టిలో రజియా సుల్తానా, సర్ సయ్యద్, ఖ్వాజా మహమ్మద్ బిస్తీ, ఖ్వాజా మైనోద్దీన్ బిస్తీ, నిజాముద్దీన్ ఆలియా, వౌలానా అబుల్ కలాం ఆ జాద్, జలాలుద్దీన్ రుమీ, ఏ.పి.జె.అబ్దుల్ కలాం గొప్పవాళ్లుకారు. వాళ్లకు జిన్నానే ఆదర్శం. అందుకే ఎప్పుడూ ప్రత్యేకత కోరుకుంటారు. ఈ దేశ కమ్యూనిస్టులు ఇందుకు మద్దతుగా నిలిచారు. దేశ విభజన మొదలుకొని మొన్న జరిగిన కాశ్మీర్ విభజన వరకూ అదే తంతు! 370 ఆర్టికల్ రద్దుకోసం, రెండు రాజ్యాంగాల నిషేధం కోసం కశ్మీర్‌లోకి ప్రవేశించి, అబ్దుల్లా ప్రభుత్వ కుట్రకు బలైన జనసంఘ్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ చావుకు వాళ్లు ఏనాడూ కన్నీరు కార్చరు! శాంతి భద్రతల దృష్ట్యా బలగాలను కాశ్మీర్‌కు పంపిస్తే అది నిర్బంధం అనీ, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీలను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని గగ్గోలు పెడతారు! జమ్మూలోని రఘునాథ ఆలయంపైన, శివాలయంపై దాడి జరిగినపుడు, అక్షరధామ్, పార్లమెంట్, ముంబై హోటళ్లపై, దిల్లీలోని ఎర్రకోటపై దాడి జరిగితే ఒక్కరు బాధపడలేదు? సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఏనాడైనా కాశ్మీరీ పండిట్ల ఆర్తనాదాలు విన్నాడా?

ఇంకొందరు మేధావులు మోదీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏదో జరుగుతుందని బెదిరిస్తున్నారు. ఏం! ఇపుడు ఏమీ జరగట్లేదా? తీవ్రవాదులు దాడులు చేయడం లేదా? కాశ్మీర్‌లో ఐసిస్ జెండాలు ఎందుకు ఎగురుతున్నాయి? దీనికంతా గత కేంద్ర ప్రభుత్వాల దమననీతి కారణమని అంటాడో వామపక్ష మేధావి. మరి ఆ ప్రభుత్వాల పల్లకీని మోసింది వామపక్షాలు కాదా? ఇపుడు కాశ్మీర్‌ల మనస్సు గెలుచుకోవాలి అంటాడు ఏకపక్ష శుక్రాచార్యుడు. దేశంలో అంతకన్నా ప్రాచీన సంస్కృతి ఉన్న తమిళుల మనసు గెలుచుకోమని ఎవరైనా చెప్తారా? ఒకవేళ ప్రాచీనంగా కశ్మీరీలకు సంస్కృతి ఉన్నట్లయితే దాని మూలాలు ఎక్కడున్నాయి? పాకిస్తాన్‌ను ఏర్పాటుచేసి ఖాయిదే-ఆజాం అయిన మహమ్మదాలీ జిన్నా ముత్తాత పూంజ హిందూమతం వాడే. అల్లామా ఇక్బాల్ ముత్తాత ‘సప్రు’ హిందువే. 

పాక్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ భార్య ఇర్నేపంత్ ఉత్తరప్రదేశ్ హిందూ సంతతి కాదా? జుల్ఫీకర్ అలీ భుట్టో పూర్వీకులు రాజపుత్రులు, షేక్ అబ్దుల్లా పూర్వీకులు ఎవరు? అలాంటపుడు కాశ్మీర్‌లో ఇంకెక్కడి పూర్వ సంస్కృతి ఉంది? కాశ్మీరియత్ అంటే సరస్సులు, కొండలు, నదులు, ముగ్ధ మనోహర దృశ్యాలు మాత్రమే కాదు కదా? అవి ఇపుడు ఎవరు లాక్కుంటున్నారు? కాశ్మీరీయత్‌లో వైష్ణోదేవికి, ఆదిశంకరాచార్య కొండకు, హజ్రత్ బాల్‌కు ఎందుకు ప్రాధాన్యత లేదు? పాకిస్తాన్‌లో అహ్మదీయులను ముస్లింలుగా భావించకుండా జియాహుల్ హక్ ఊచకోత కోయించాడు. అహ్మదీయుల ఖలీఫా మిర్జాతాహిర్‌ను 1984లో పాక్‌నుండి వెళ్లగొట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్షలాదిమంది ఊచకోత కోశారు అని బంగ్లా మానవ హక్కుల కార్యకర్త జహనారా ఇమామ్ అంచనా వేశారు. తొంభయ్యవ దశకంలో జరిగిన కాశ్మీర్ పండిట్ల దారుణ హత్యలు ‘కాశ్మీరియత్’ను ఏనాడో ధ్వంసం చేశాయి. ఇక్కడ మతాధిపత్య పోరాటమే తప్ప కాశ్మీరియత్ ఒక తొడుగు మాత్రమే. చరిత్రలో జరిగిన తప్పులు సరిచేయకపోతే భవిష్యత్తులో వైగో చెప్పినట్లు సూడాన్, కోసావాలా అవుతాయో లేదో తెలియదు కానీ సిరియా, ఇరాన్‌లా కావడం ఖాయం.

1947లో గవర్నర్ జనరల్ అయిన మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజన జరిగిన పదమూడు నెలలకే ప్రాణాంతక వ్యాధితో మరణించాడు. ఆ తర్వాత వచ్చిన లియాఖత్ అలీఖాన్ మొదలుకొని నవాజ్ షరీఫ్ వరకు పాక్ అధినేతలంతా గొప్పగా పదవులనుండి దిగిన పాపాన పోలేదు. అవమానం.. రాజ్య బహిష్కరణ, జైళ్లలో బంధింపబడడం.. దిక్కులేని కుక్కచావు- ఇవే వాళ్లకు దక్కిన పాప ఫలితాలు. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు అక్కడి పాలకులంతా తమ వైఫల్యాలను కాశ్మీర్ చుట్టూ తిప్పారు. దీని ట్రాప్‌లో మనదగ్గరి కాశ్మీరీ నేతలు పడి, మిగతా దేశాన్ని పడేశారు.

ఇప్పటికైనా భారత హిందూ, ముస్లింలు సమస్యను అర్థం చేసుకొని ఈ దేశ కుహనా సెక్యులరిస్టుల ఉచ్చులో పడకుండా మాజీ ఎంపీ, ప్రముఖ ఇస్లామిక్ మేధావి ఆరీఫ్ మహమ్మద్‌ఖాన్ వంటివారిలాగా జాతీయ దృక్కోణంతో ఆలోచించాలి. సాంకేతిక కారణాలను చూపి ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను విస్మరించాయి. గతంలో షేక్ అబ్దుల్లాను నిర్బంధించినపుడు ఎవరిని అడిగి నిర్బంధించారు? అపుడు ఇంటింటా అభిప్రాయ సేకరణ చేసారా? ఒక మేధావి మనకు అంతర్జాతీయ పరిస్థితులు బాగాలేవంటాడు. ఇరాన్ అప్ఘన్‌లను అమెరికా పాక్ సహాయంతో మద్దతిస్తుంది కాబట్టి మనకు ఇబ్బందవుందంటాడు. గత యుద్ధాల్లో అమెరికా మనకు ఎప్పుడైనా మద్దతు ఇచ్చిందా? ఆప్ఘన్, సిరియా, ఇరాన్, ఇరాక్‌లలో సంక్షోభాలు ఉన్నపుడు మన దేశంలోకి తీవ్రవాదులు చొరబడలేదా? ఇవన్నీ తర్కంలేని వాదనలని వారికి కూడా తెలుసు. మోదీ చేసే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యితిరేకించే మనస్తత్వాన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి దేశం నాశనం అయిపోతుంటే మనం బతికుండి ప్రయోజనం ఏమిటి? అన్నదే ఇవాళ్టి ప్రశ్న. అందుకే ఈ ఉద్విగ్నత అన్ని వర్గాల మనసుల్ని కాశ్మీర్‌లోని హిమవన్నగమంత ఎత్తులో నిలిపింది.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *

*కాశ్మీర్.. నవ పథం, నవశకం!*


*********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*సంపాదకీయం : ఆంధ్రప్రభ*
*07-08-2019 : బుధవారం*



ఇటీవల ఓ వ్యక్తి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. దివంగత రాజీవ్ గాంధీ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసి, రాజీనామా చేసి బయటకొచ్చి ‘జాతీయవాద ముస్లిం’గా తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించిన నేత ఆరీఫ్ మహమ్మద్ ఖాన్. ఇందిరా గాంధీ మరణానంతరం అఖండ మెజారిటీతో అధికార పీఠం ఎక్కిన రాజీవ్ గాంధీకి- కాంగ్రెస్‌ను తన చేతులతో పెంచాలన్నా, ముంచాలన్నా.. రెండు అవకాశాలు ముందు నిలబడ్డాయి. కానీ, రాజీవ్ రెండవ మార్గం ఎంచుకొని తన కొడుకు రాహుల్ చేతిలో మరింత దీనస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ దిగజారేందుకు దారులు వేశాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 62 ఏళ్ళ షాబానో అనే ముస్లిం మహిళ 1978లో తన భర్తనుండి తలాక్ పొందింది. ఆమెకు ఐదుగురు సంతానం. 62 ఏళ్లు పైబడిన వయసున్న ఆమె తనకు జీవనాధారం లేకపోవడంతో న్యాయస్థానాల తలుపు తట్టింది. కింది కోర్టులు చెల్లించాలని ఆదేశించిన 500 రూపాయలు కూడా భృతిగా చెల్లించేందుకు భర్త నిరాకరించాడు. తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ షాబానో విజయం సాధించింది. భారత శిక్షాస్మృతిలోని 125వ సెక్షన్ కుల, మత భేదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. 

ఈ కేసులో అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ తీర్పు రాస్తూ ‘మతస్వేచ్ఛ మన సాంస్కృతిక హక్కు. కానీ మత సంప్రదాయాలు మనుషుల గౌరవ మర్యాదలు, మానవ హక్కులు హరించేట్టయితే అది స్వాతంత్య్రం కాదు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు, జాతి ఐక్యత కోసం ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఎంతైనా ఉంది..’ అన్నారు. కానీ దేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ముస్లిం మతతత్వ శక్తులు తమ పెత్తనం నిరూపించాలనుకొన్నాయి. ‘ముస్లిం పర్సనల్ లా’పై సుప్రీం కోర్టు జోక్యాన్ని ఈ శక్తులు లోలోపల వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. నిజానికి ‘ముస్లిం పర్సనల్ లా’ అనేది ఆ మతంలోని ఆధ్యాత్మికతతో సంబంధం లేని అంశం. కాబట్టి దీనిని పవిత్ర మత గ్రంథాలను అనుసరించి చూసేది కాదు.

1971లో లార్డ్ వార్న్ హేస్టింగ్ ద్వారా పుట్టింపబడిన ఈ చట్టం ద్వారా హిందూ, ముస్లింలు తమ ధార్మిక ఆచారాలను అనుసరించి వివాహం, విడాకులు, విరాసత్ మొదలైనవి పాటించాలని స్పష్టం చేయబడింది. అయితే 1832లో అదే బ్రిటీష్ ప్రభుత్వం ‘క్రిమినల్ కోడ్’ను ఇస్లామిక్ షరియత్ నుండి తీసివేసింది. నిజానికి షరియత్ చట్టం ప్రకారం ముస్లింలలో ఎవరైనా కొన్ని నేరాలకు పాల్పడితే చేతులు నరకమని, రాళ్ళతో కొట్టమని ఉంది. కానీ 1832 చట్టం ద్వారా క్రిమినల్ కోడ్‌లో హిందూ-ముస్లింలకు సమానమే. అయితే సమాజంలో కొన్ని మార్పులు స్వీకరించే గుణం ఛాందసులకు ఉండదు. నిజానికి హిందువుల్లో ‘విడాకులు’ అనే పద్ధతి లేనే లేదు. వివాహ బంధం జన్మ జన్మల బంధం అయినప్పటికీ హిందూ సమాజం వి డాకులు స్వీకరించింది. భార త రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది. బాల్య వివాహాల నిషేధం, సతీ సహగమన నిర్మూలన, కుల తత్వ నిర్మూలన వంటి అంశాలను సంస్కరణలుగా స్వీకరించింది.

విచిత్రం ఏమిటంటే షాబానో కేసు తర్వాత ముస్లిం పర్సనల్ లాబోర్డ్ లాంటి సంస్థలు ఇస్లామిక్ షరియత్ చట్టంలో సుప్రీం కోర్టు తీర్పును, జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆఖరుకు కొందరు ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతలు 1986 జనవరి 26 గణతంత్ర దినాన్ని బహిష్కరించమని పిలుపు ఇచ్చే తీవ్ర స్థాయికి వెళ్లారు. మతోన్మాదానికి మచ్చుతునకలాంటి ముస్లిం లీగ్ పార్టీ సభ్యుడైన ఎంపి జి.యం.బనట్వాలా ఒక బిల్లుపై పార్లమెంటులో చర్చ మొదలుపెట్టాడు. మొదట రాజీవ్ గాంధీ కూడా షాబానో లాంటి పేద మహిళ పక్షాన నిలబడ్డాడు. ఈ అంశంపై తన మంత్రివర్గంలోని ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్‌ను మాట్లాడాల్సిందిగా కోరాడు. ఆనాడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ షాబానోకు అనుకూలంగా చేసిన ప్రసంగం పార్లమెంట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పుట.

కానీ, రెండు నెలలు తిరుగకముందే రాజీవ్ గాంధీ ముస్లిం సంస్థల ఛాందసత్వానికి లొంగిపోయారు. ఓటు బ్యాంకు రాజకీయం, సంతుష్టీకరణకు ఆనాడు వేసిన అడుగు ఈ రోజు కాంగ్రెస్ పతనానికి, భాజపా ఎదుగుదలకు కారణభూతమైంది. 1986లో ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం పార్లమెంటులో పాసైంది. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చేసిన కాంగ్రెస్ ప్రసంగానికి విరుద్ధంగా మరో ముస్లిం మంత్రి జెడ్.ఆర్.అన్సారీని రాజీవ్ ఉసిగొల్పారు. ఆ తర్వాత ఆరిఫ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుప్రీం కోర్టు తీర్పును ముస్లింల అభిమతానికి అనుగుణంగా మార్చడం ‘లౌకికవాదం’ అని కాంగ్రెస్ పార్టీ చక్కగా దబాయించడం మొదలుపెట్టింది. వెంటనే హిందూ సంతుష్టీకరణ చేస్తానని రామజన్మభూమి తాళాలను రాజీవ్ తెరిపించారు. 

ఆ తర్వాత అద్వానీ రథయాత్రతో అయోధ్య ఉద్యమం భాజపాకు ఈ విరాట్రూపం సాధించిపెట్టింది. అయితే ఈ ముప్ఫై ఏళ్ళనుండి జరిగిన రాజకీయ పరిణామాలను ఇసుమంతైనా నెమరువేసుకోకుండా కుహనా లౌకికవాద పార్టీలు, సంస్థలు ఇంకా మొఘల్ రాజ్యంలో ఉన్నామనే భ్రమలో బతుకుతున్నాయి. అందువల్లనే కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అనే దుర్మార్గపు రక్షణ కవచం తీవ్రవాదులకు ఉపయోగపడుతున్నా అక్కడా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ‘సెంటిమెంటు’ను పదే పదే రెచ్చగొడుతున్నాయి. అలాగే జాతీయ పౌరసత్వ రిజిస్టర్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దానిని ‘ముస్లింలపై టార్గెట్’ అంటూ కూనిరాగాలు తీస్తున్నాయి. ఆఖరుకు ముస్లిం మహిళలకు మూర్ఖులైన భర్తల నుండి జరిగే అన్యాయాన్ని నివారించే ‘త్రిపుల్ తలాక్’పై పిల్లిమొగ్గలు వేస్తున్నాయి.

కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల వైఖరి ముస్లింలకు మేలు చేయకపోగా కీడుచేయడం ఖాయం. నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఈ పార్టీలు తక్కువగా అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాక భాజపాను ఢీకొనే ప్రధాన ప్రతిపక్షం ఎక్కడా నిర్మాణాత్మకంగా వ్యవహరించట్లేదు. భాజపా కూడా ఇటీవల అన్ని చర్చల్లోకి మజ్లిస్ ఎంపీ అసదొద్దీన్ ఓవైసీని లాగింది. అంటే ప్రతి ఇష్యూను ఓవైసీ మాట్లాడితే అది భాజపాకే ఎక్కువ లాభం. ఎందుకంటే ఓవైసీకి వున్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. కానీ కుహనా లౌకిక పార్టీలు ఓవైసీని మోదీని ఢీకొట్టే వీరునిగా చూపిస్తున్నాయి. దాని దుష్పరిణామాలు దేశాన్ని మత పరమైన విభజన వైపు తీసుకెళ్తాయని గ్రహించడం లేదు. రెండు రోజుల క్రితం ఉన్నావ్ అత్యాచారం కేసులో బాధితురాలి కారుకు యాక్సిడెంట్ అయితే, ఆ కేసులో దోషులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు యూపీ భాజపా నాయకుడికి బంధువు. వెంటనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వార్తల్లోకి వచ్చి దీన్ని మోదీకి అంటగట్టాలని చూసింది. ఇలాంటి అత్యుత్సాహం, రాజకీయ అజ్ఞానం కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీకి మాత్రమే స్వంతం.

అలాగే లౌకికవాద పార్టీల డొల్లతనం రాజ్యసభలో త్రిపుల్ తలాక్‌పై ఓటింగ్ జరిగినపుడు బయటపడింది. ‘తల చుట్టం తోక పగ’లా వ్యవహరించిన తీరు వీళ్ల నిబద్ధతను ప్రశ్నిస్తున్నది. ‘కమ్యూనిస్టు స్కూల్ ఆఫ్ థాట్’ నుండి పుట్టిన ఈ భ్రమలు ఇటీవల మిగతా పార్టీలకు అంటుకున్నాయి. అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తామని అనకుండా ముస్లింలను సంతుష్టీకరణ చేసే ధోరణి ఓ రాజకీయ విధానంగా ఈ దేశంలో కమ్యూనిస్టు సిద్ధాంతం మార్చింది. దానివల్ల ఈ దేశంలోని కొన్ని ముస్లిం సంస్థలు, పార్టీలు తమను తాము ప్రత్యేకంగా భావించడం మొదలుపెట్టాయి. ఈ ప్రత్యేక భావన వున్నవారే జాతీయ పౌరసత్వ బిల్లును, త్రిపుల్ తలాక్ నిషేధాన్ని, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దును వ్యతిరేకిస్తారు. మతం మనుషుల్లో ఉండాలి కానీ మనిషే మతంలో ఉండకూడదు. మతాన్ని ఆధ్యాత్మిక సాధనంగా గాకుండా రాజకీయ గుంపును సృష్టించే ఆధారంగా ఉండడం భారత్‌లో సాధ్యం కాదు. దానికి వెయ్యేళ్ళ ముస్లిం, క్రైస్తవ పాలనను తట్టుకొని నిలబడిన హిందూ చరిత్రనే ఉదాహరణ.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *