అధి బ్రిటీషు ప్రభుత్వం అతివాద స్వాతంత్య్రవీరులపై ఉక్కుపాదం మోపుతున్న రోజులు. ఓ కుట్ర కేసులో రాంప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరీ, అష్ఫఖుల్లా ఖాన్‌లను 1927 డిసెంబర్ 19న ఉరితీయాలన్న తీర్పు వెలువడింది. ఈ సందర్భంగా అష్ఫఖుల్లా తన స్నేహితులకు, కుటుంబానికి- ‘నేను బలిపీఠంపై నిలబడి ఇది రాస్తున్నాననడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఆ ప్రభువు అభీష్టం అదే కాబట్టి. మాతృభూమి కోసం బలివేదికపైన తనను యజ్ఞపశువుగా భావించుకునే వ్యక్తి నిజంగా ఎంతో సౌభాగ్యశాలి’ అని లేఖ రాశాడు. ఇది స్వాతంత్య్రవీరుల నిస్వార్థ త్యాగబుద్ధి. ఈ రోజుకైనా అష్ఫాఖ్ వంటి నిష్కళంక దేశభక్తులను గౌరవించాల్సిందే. ఏపిజె అబ్దుల్ కలాం వంటి మేధావిని, మాతృభూమిపై అనురక్తిగల వాళ్లను ఈ దేశం సదా ఔదలదాల్చాల్సిందే.

కానీ, దురదృష్టవశాత్తూ ఈ దేశ చరిత్రలో బెంగాల్ విభజన తర్వాత మొదలైన సంతుష్టీకరణ రాజకీయాలు రోజురోజుకు అష్టవంకర్లు తిరుగుతూ ఆఖరుకు దేశభద్రతను కూడా పెను ప్రమాదంలో పడేస్తున్నాయి! ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండర’న్న ఓ దిక్కుమాలిన సిద్ధాంతం దేశాన్ని బోనులో నిలబెడుతోంది. దానికి మతం, కులం ఆసరాగా చేసుకోవడం ఎంత ఘోరం!? ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో తాజాగా తెలుగుదేశం పార్టీ జరిపిన మైనారిటీల సభ సంతుష్టీకరణకు పరాకాష్ఠ. ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు సహా స్టేజిమీద, కింద వున్న వాళ్లు టోపీలు ధరించి ఎవరు నిజమైన ముస్లిములో, ఎంతమంది టీడిపి కార్యకర్తలో తెలియకుండా గందరగోళం చేశారు.

ఇక ‘చినబాబు’ లోకేశ్ తన ప్రసంగంలో ‘తరిమి తరిమి కొడతారు’ అంటూ మోదీని, భాజపాను, వైకాపాను, జనసేనను ఓ కొత్త పదం అందుకొన్నారు. గతంలో లోకేశ్ మేనమామ, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా వచ్చీరాని హిందీలో ‘బగారుూ లగే’ అంటూ ధర్మపోరాట సభలో వాచిపోయేట్టుగా తొడగొట్టుకుని ‘డైలాగులు’ విసిరాడు. ఇదేనా ఈ నేతల ప్రజాస్వామ్యం? ప్రతిపక్షాలను తరిమికొట్టండని పిలుపు ఇవ్వడం గొప్ప ప్రజాస్వామ్యం!? మోదీ నోరు తెరవట్లేదని నియంత అంటూ దుష్ప్రచారం చేసే వీళ్లు పార్లమెంటు ముందు ఎన్ని ఎగతాళి వేషాలు వేశారు. సాక్షాత్తూ పార్లమెంటులో ప్రధానిని పట్టుకొని కేశినేని నాని ఎల్కేజీ స్థాయి ఇంగ్లీషులో ‘డ్రామా ఆర్టిస్టు’ అన్నాడు. అది భాజపా నాయకులకు సరిగ్గా అర్థం కాలేదు. కనీసం అదే పార్లమెంటులో కూర్చొన్న విశాఖ భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు లాంటి వారు తన పార్టీ పెద్దలకు వివరించి ఆ ప్రసంగాన్ని అడ్డుకోవాల్సింది. ఇలా ‘చంద్రబాబు అండ్ కో’ మోదీని వ్యతిరేకించాలనే తీవ్రతలో ‘నారా హమారా టీడీపీ హమారా’ అనే సరికొత్త నినాదాలకు తెరతీసింది. మోదీపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు తనకు మద్దతు ఇవ్వాలని ముస్లింలకు పిలుపునివ్వడం పరోక్షంగా ఏం సూచిస్తుంది? మోదీపైకి ముస్లింలను ఉసికొల్పడం కాదా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింల సభల్లో చక్కని ఉర్దూ మాట్లాడతాడు. ఒక్క ఉర్దూ ముక్కరానివారు, ఈ నాలుగేళ్లలో భాజపాతో అంటకాగినన్ని రోజులు ఒక్కనాడు ముస్లింల ఊసు ఎత్తని తెదేపా అధినేత ఇప్పుడు ఎందుకు కొత్త పల్లవి అందుకొన్నాడు? అసలు ముస్లింల ఆధిపత్యం తెలుగుదేశంలో పెరిగితే బాబుగారి కుల మద్దతుదారులు తట్టుకొంటారా? దీని వెనుకున్న సంతుష్టీకరణ రాజకీయం ముస్లింలకు అర్థం కావాలంటే ఆ సభలోని అసలు టోపీలను, నకిలీ టోపీలను వేరు చేస్తే తెలిసేది. మమతా బెనర్జీలా, కేసీఆర్‌లా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయం చేస్తే తాను జాతీయ స్థాయి నాయకుణ్ణి అయిపోతానన్నది చంద్రబాబు ఆలోచన. ఇలాంటి ఆలోచనతోనే బెంగాల్ సీఎం మమత తన రాష్ట్రంలో హిందువుల దుర్గాపూజను, ఊరేగింపులను, శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రలను వ్యతిరేకించింది. అది భాజపాకు మంచి చేస్తుందని హిందూ ఓటు బ్యాంకు ఏకీకృతం అవుతుందని తెలియగానే మళ్లీ ఆమె యూటర్న్ తీసుకుంది. ఈ సందిగ్ధావస్థలో ‘జాతీయ పౌర రిజిస్టర్’ (ఎన్‌ఆర్‌సి)పై రాజకీయం మొదలుపెట్టింది. దేశభద్రతను ప్రమాదంలో పడేసే అక్రమ చొరబాటుదారులపై ప్రేమను కురిపిస్తోంది. ఇదంతా ఎందుకోసం? అధికారం కోసం! మోదీని దెబ్బతీయాలనే కుతంత్రం కోసం!

దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ ఏదో ఒక భావోద్వేగంతో కేంద్రాన్ని దోషిని చేయాలనే ప్రయత్నంలో ఈ దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు జాతీయ పార్టీ స్థాయి నుండి దిగజారి ప్రాంతీయ పార్టీలుగా మారిపోయి మోదీ వ్యతిరేకతనే లక్ష్యంగా మావోయిస్టు మేధావులను కూడా వెనకేసుకొస్తున్నాయి. 

మహానగరాల్లో మావోవాదాన్ని సజీవంగా ఉంచుతూ మేధావులుగా పేరొందిన వరవరరావు, వెర్నన్ గొన్సాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖ, ఫాదర్ స్టాన్ స్వామి, ఆనంద్ తేవ్ తుంబ్డే ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో స్వామి, ఆనంద్ తేవ్ తుంబ్డే తప్ప అందరినీ అరెస్టు చేశారు. వీళ్లను భాజపా కార్యకర్తలు అరెస్టు చేసినట్లు, దేశం ఏదో అగాథంలో పడ్డట్లు కొందరు నాయకులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల నేతలు, అరుంధతీ రాయ్, మేధాపాట్కర్, ప్రశాంత్ భూషణ్ వంటి ‘స్వయం ప్రకటిత మేధావులు’ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే వీళ్లను అరెస్టు చేయగా- దేశంలో నియంత పాలన వచ్చిందా? అన్న స్థాయిలో ట్వీట్లు చేశాడు. ఇక సీతారాం ఏచూరి నుండి సురవరం సుధాకర్ రెడ్డి వరకు దేశంలో ఎమర్జెన్సీ వచ్చేసిందని చెప్పుకొచ్చారు. వాళ్లు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కోబాడ్ గాంధీని, జిఎన్ సాయిబాబాను జైలుకు పంపినపుడు దేశంలో స్వర్గ్ధామం ఉండేదా?

ప్రభుత్వ ఏజెన్సీలు తమ పరిశోధన చేయకుండా దేశంలో వామపక్ష మీడియా సంస్థలు, మోదీ వ్యతిరేకులు కలిసి తెల్లారేసరికి ఈ అంశాన్ని సుప్రీం కోర్టుకు చేర్చాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలను కదలించగలిగాయి అంటే వాళ్ల ప్రభావం ప్రభుత్వ నేర పరిశోధక సంస్థలను ముందుకు పోనిస్తాయా?

సుప్రీం కోర్టు ఈ మావోయిస్టు మేధావులను పోలీసుల కస్టడీలో కాకుండా గృహనిర్బంధంలో ఉంచాలని చెప్పడంతో వాళ్ల మేధో ప్రభావం ఏ స్థాయిలో ఉందో, వీళ్ల నెట్‌వర్క్ ఎంత చైతన్యవంతంగా పనిచేస్తుందో విజ్ఞులు ఆలోచించాలి. మోదీ మీది వ్యతిరేకతతో ప్రశాంత్ భూషణ్ లాంటి లాయర్లు వాళ్లకు పరోక్షంగా సహాయపడి సుప్రీం కోర్టు వరకు ఈ కేసును గంటల్లో తీసుకెళ్తున్నారు. ఈ గ్యాంగే ఆరు నెలల క్రితం జస్టిస్ చలమేశ్వర్‌ను రంగంలోకి దింపి నర్మగర్భ వ్యాఖ్యలు చేయించి కేంద్రానిది నియంతృత్వం అన్నట్టుగా దేశానికి తెలిపే ప్రయత్నం చేసాయి. ఈ గుంపే ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేస్తే- దాన్నీ కేంద్రాన్ని, మోదీని అపఖ్యాతిపాలు చేయడానికి ఉపయోగించుకొన్నాయి. 

కర్ణాటక విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించాయి. అంటే తమకు అనుకూలమైతే రాజ్యాంగ పరిరక్షణ అంటూ జబ్బలు చరుస్తారు. తమకు వ్యతిరేకం అయితే కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను తమ ఆధీనంలో ఉం చుకొంది అంటారు! ఇదేం నీతి?

దీనికంతా మూలమైన 1818 జనవరి 1న జరిగిన భీమా కోరేగావ్ యుద్ధంలో మహర్లు పీష్వాలను ఓడించారు. అంటే 200 ఏళ్ల క్రితమే దళితులు గొప్ప యోధులన్నమాట. ఇది అందరు ఒప్పుకోవాల్సిన సత్యం. కానీ ఈ స్వయం ప్రకటిత మిషనరీ మేధావులు, ఎర్రరంగుతో నీలాన్ని కలుషితం చేయాలనుకొన్నవారు ఏళ్లనుండి దళితులను ఈ దేశంలో అణచివేసారంటారు. వందల ఏళ్ల క్రితం నాటి ఘటనలకు కూడా మోదీనే బాధ్యుడు అంటారేమో! ఓట్లకోసం దంచుతున్న ఈ ‘కులం మసాలా’ సంతుష్టీకరణను ఏ స్థాయికి దిగజార్చిందో చూడవచ్చు. కొన్నిచోట్ల మతం, మరికొన్నిచోట్ల కులం, ఇంకోచోట ప్రాంతం.. ఇలా ఎన్ని వంటకాలైనా వీళ్ల అక్షయపాత్ర నుం డి పుట్టుకొస్తునే వుంటాయి!

అసలు భాజపా పాలిత రాష్ట్రాల్లోనే ఈ అలజడి ఎవరు రేపుతున్నారు. నిజానికి మోదీని రాజీవ్ తరహాలో మట్టుబెట్టాలనే ఆలోచన నిజంగా జరిగిందా? అన్న అంశంపై లోతైన పరిశోధన ప్రభుత్వ ఏజెన్సీలను చేయకుండా నిరోధించడమే ఈ మేధో ఉగ్రవాదం అసలు లక్ష్యం అని విశే్లషకుల అభిప్రాయం. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపిఏ)ను ఎత్తేసి, సీబిఐని, ఎన్‌ఐఏని రద్దుచేస్తే పోలా? నేర పరిశోధక సంస్థల కన్నా ముందే కులం, మతం రంగు పులుముతూ దేశద్రోహాన్ని చట్టబద్ధం చేసే ఈ అల్లరి రేపు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సహిస్తుందా? ఇవేవీ ఆలోచించకుండా ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన ఎజెండాగా దేశం నడిస్తే మనం అతి త్వరలోనే చర్చిల్ చెప్పినట్టు అంతర్యుద్ధాలతో జాతిగా నశించడం ఖాయం. మోదీని, భారతీయ జనతా పార్టీని విధానాల పరంగా వ్యతిరేకించకుండా వ్యక్తిగత వ్యతిరేకత ప్రదర్శిస్తున్న సంకుచిత మనస్తత్వాలు ఈ దేశ రాజకీయాలకు ఏ లక్ష్యం నిర్దేశించనున్నాయి!?

 ఈ దేశం కోసం తమ రక్తాన్ని మట్టిలో రంగరించి తిలకం ధరించిన వీరుల బలిదానాలు, వారి ఆత్మల ఆర్తనాదాలూ శూన్యంలో కలిసిపోవలసిందేనా? మన దృక్కోణంలో ఓటు మాత్రమే విలువైనదా? ఈ తెంపరితనం, అబద్ధాల అల్లికలు ఇంకెన్నాళ్లు? వెయ్యేళ్ల బానిసత్వపు ఛాయల నుండి పుట్టిన ఈ సంతుష్టీకరణ మనల్ని ఎలాంటి అధోగతికి తీసుకుపోతుందో?

******************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰


ఇన్నాళ్లూ ఛానళ్లు మాత్రమే టీఆర్పీ రేట్ల కోసం పరుగెత్తేవి. ఇపుడు తెలుగు నాట కొన్ని పత్రికలు కూడా ఛానళ్ల అంత వేగంగా పరుగెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, అధిష్ఠానాలు ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా చేస్తే బాగుంటుందో కూడా పత్రికలే నిర్దేశిస్తున్నాయి. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు అంటూ కేసీఆర్ చేస్తున్న హడావుడిని విశ్లేషించలేక, ఊహించలేక  (మింగలేక కక్కలేక అన్న) దుస్థితిలో ఉన్నాయి మాధ్యమాలు!? దీనికొక ప్రధాన కారణం ఉంది. తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడు  ఎన్నికలు వచ్చినా నాదే విజయం అని తొడగొడుతున్నాడు. అందుకు అనుగుణంగా ఇక్కడ కాంగ్రెస్ స్పందిస్తున్నది.
కానీ ‘ఎల్లో మీడియా’కు ప్రీతిపాత్రమైన చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది. అందువల్ల బాబు ఇప్పటికిప్పుడు యుద్ధరంగంలోకి దిగే చాన్సులేదు. ఫిబ్రవరిలో ఎన్టీయే నుండి విడిపోయాక నరేంద్రమోడీపై, బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్న బాబు అండ్ కో ఇంకా జగన్‌ను, పవన్ బోనులోకి లాగలేక పోయింది. బంగాళాఖాతంలో ఉన్న బురదనంతాబీజేపీపై చల్లి మోడీని అపఖ్యాతిపాలు చేయడంలో చంద్రబాబు సఫలుడయ్యాడు. దాన్ని తిప్పికొట్టడంలో ఏపీ బీజేపీ విఫల మైన మాట నిజం. గతంలో అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగాక వెంకయ్యనాయుడును అడ్డుపెట్టుకొని వాజ్‌పేయిని ముందస్తు ఎన్నికలకు కాలు దువ్విన చంద్రబాబు ఈ రోజు వెనకడుగు వేయడానికి కారణం ఈ ఆరు నెలలు జగన్ టార్గెట్‌గా దుష్ప్రచారం చేయాలని అనుకోవడం.
రోజూ సభలు, దీక్షలు చేస్తూ మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు. ‘25 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మేమే చక్రం తిప్పుతాం’ అంటూ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నాడు. ఇక్కడ చంద్రబాబు చేసిన దుష్ప్రచారం బాగానే పనిచేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమే తక్షణ కర్తవ్యం. అది లేకుంటే ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్న స్థాయిలో చంద్రబాబు బాకాలు హోరెత్తిస్తున్నాయి. మోడీ ఉంటే హోదా రాదు. అది రావాలంటే మోడీని లేకుండా చేయాలని తెలుగుదేశం పిలుపునిస్తోంది. కానీ ఇవాళ ఆంధ్రా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ హోదా ఎవరికోసం? ప్రజల కోసమా? రియల్ ఎస్టేట్ బ్రోకర్లను బ్రతికించడానికా? అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి.
అంతర్జాతీయ విమానాశ్రయం కట్టుకోవడం ఏపీకి అవసరం. కానీ ఆ కట్టేపనిని ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కాకుండా ప్రయివేట్ సంస్థలకు కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వానికి అంత ఉత్సాహమెందుకు? ఎయిర్‌పోర్ట్ వరకూ ఓకే. కానీ దానిచుట్టూ వ్యాపార కేంద్రాల అభివృద్ధి పేరుతో పరోక్షంగా పార్టీ రియల్ ఎస్టేట్‌ను ప్రమోట్ చేయాలనుకోవడమే పలు అనుమానాలకు తావిస్తోంది. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి సుమారు 15 ఏళ్లు పట్టింది. అలాంటిది ఇప్పటికిపుడు కేంద్రం మాకు మయసభలా క్షణాల్లో నిర్మించి ఇవ్వాలని అంటున్నారు. అలాగే నయా రాయ్‌పూర్ ఎలాంటి హోదా లేకుండానే అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పూటగడవదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించింది తెలుగుదేశం పార్టీనే. గతంలో చక్రాలు తిప్పింది నేనే అని చెప్పే బాబు, లాలూ, నితీశ్, మమతలు రైల్వే మంత్రులుగా ఉన్నపుడు ఎన్ని రైల్వే ప్రాజెక్టులు తెచ్చారు. అంతెందుకు! మొన్నటి వరకు విమానయానశాఖ మంత్రిగా ఉన్నపుడు పి.అశోక్‌గజపతిరాజు ఎన్ని కొత్త ఎయిర్‌పోర్ట్‌లు సృష్టించారు? ఈ రోజు ఏపీలో తెలుగుదేశంతో కలవడానికి కాంగ్రెస్ తప్ప ఏపక్షం సిద్ధంగా లేదు. కాంగ్రెస్‌తో పొత్తును కె.ఇ.కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నలాంటి వారు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ పచ్చ బ్యాచ్‌ను మోసే ఓ పత్రిక ‘పొత్తు వద్దు’ అని నర్మగర్భంగా చెప్పిన మాటలను తెలుగుదేశంలో స్వేచ్ఛ ఎక్కువైందని, ఇది హద్దులు మీరిన ప్రజాస్వామ్యం అంటూ వాళ్లను నియంత్రించాలని వ్యాఖ్యానిస్తున్నది.
ఇవాళ జగన్ ఓటు బ్యాంక్ అలాగే ఉండడం చంద్రబాబు జీర్ణించు కోవడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టుల తోక పట్టకున్నాడా! ఆయన తోక కమ్యూనిస్టులు వదలడం లేదా అన్నది గతితర్కం కన్నా గహనమైన విషయం. పి.డి.అకౌంట్లు, బాండ్ల విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న బీజేపీ తెలుగుదేశాన్ని ఢీకొనే అస్త్రాలను ఈ రోజుకూ తయారు చేయలేకపోయింది. దుష్ప్రచారంతో తెలుగుదేశం ముందుంటే ఎల్కేజీ విద్యార్థుల్లా రోజూ టీవీల ముందు వివరణ ఇచ్చుకోవడానికే సమయం సరిపోతుంది.
ఇక తెలంగాణలో కేసీఆర్ దూకుడు, ప్రతిపక్షాల గోకుడు అన్నట్లుగా ఇక్కడి రాజకీయం నడుస్తోంది. నిజానికి టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలామంది వ్యక్తిగతంగా తాము ఈ ఘన కార్యం సాధించామని చెప్పడానికి ఏం లేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజంగా నూటికి నూరుశాతం అమలయితే అద్భుతమే. వీటిని చెప్పుకునే అందరూ ఎన్నికలకు పోవాలి. కానీ ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు తమ ప్రాపకంతో సంపాదించిన ఘనత పెద్దగా ఏమీ లేదు! అయితే కేసీఆర్ రాజకీయ చతురుడు కాబట్టి రాబోయే కాలంలో ప్రతిపక్షాలు కోలుకొని దూకుడు పెంచకముందే ఎన్నికలకు వెళ్లాలని ఆయన ఆలోచన. ముందస్తు ఎన్నికల చర్చకు తెలుగునాట తెర తీసింది కూడా కేసీఆరే.
నిజానికి కేసీఆర్ మదిలో తన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న నమ్మకం బలంగా ఉంది. అలాగే వందకుపైగా సీట్లు వస్తాయని చెప్పడం రాజకీయంగా నాయకులకు ఆత్మవిశ్వాసం కలిగించడానికి చెప్పే మాటలే. ఇంత అఖండ విజయం సాధిస్తా అనుకోవడం ఎంత అత్యుత్సాహమో కేసీఆర్ చిత్తుగా ఓడిపోతాడని చెప్పడం అంతే అజ్ఞానం. ఒకవైపు మోడీతో సఖ్యతగా ఉంటూనే తన పనులు సాధించుకొంటున్నాడు. మరోవైపు బీజేపీ సమానదూరం అంటూనే చైనాలో సింగపూర్‌లో జరిగే అభివృద్ధి వేగంగా జరుగతుంటే ఈ రెండుపార్టీలు శుద్ధ వేస్టు  అంటాడు. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానం ప్రసంగంలో కూడా తెలంగాణ సర్కారు అభివృద్ధి చేసుకోవడానికి పరిణతి ప్రదర్శిస్తోంది అని స్వయంగా ప్రధానే చెప్పడం  కేసీఆర్‌కు మరింత ఊపునిస్తోంది.
కానీ కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నాడనే ప్రచారం ప్రజల్లో బాగా వ్యాప్తి చెందింది. ఇటీవల కేసీఆర్ నడుస్తుంటే మంత్రులంతా వంగి వంగి దండాలు పెట్టడం తమిళనాడు రాజకీయాలను గుర్తు తెస్తోందని అంటున్నారు. బహుశా ఉద్యమాలతో కూసాలు కదిలిన పరిపాలనను కాస్త కటువుగా దారిలో పెట్టాలని కేసీఆర్ ఆలోచన కావచ్చు. సచివాలయానికి వెళ్లకపోవ డం, తన మనసులో ఉన్నదే చేయడం ఇలాంటి అపోహలకు తావు ఇచ్చి ఉండవచ్చు. అలాగే జోనల్ విధానంలో భాగంగా వికారాబాద్‌ను జోగులాంబతో కలపడం ఆ ప్రాంత ప్రజల తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నది. ఇసుక, భూదందా, మైనింగ్‌లలో కొందరు, పరుషమైన పనుల్లో, మాటల్లో మరికొందరు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చిక్కుకోవడం కేసీఆర్‌కు కొంత ఇబ్బంది కలిగించేవే. అలాగే ఉద్యోగుల విషయంలో కేసీఆర్ వైఖరి చంద్రబాబు కన్నా తీవ్రంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.
ఇవన్నీ కేసీఆర్ అత్యుత్సాహాన్ని నీరుగార్చేందకు కొంత ఉపయోగపడి ప్రతిపక్షాలకు ఆసరా కలిగిస్తాయి. కానీ రైతుబంధు, రైతు బీమాలు నిజంగా ప్రభుత్వానికి రాజకీయంగా ఊరటనిచ్చేవే. రైతుబంధును సంస్కరిస్తే ఇంకా గొప్ప ఫలితం ఉంటుందని అన్ని చోట్లా వినిపిస్తున్నది. చంద్రబాబు రోజూ మైకు ముందు గంటల తరబడి చర్విత చర్వణంగా చెప్తుంటే జనాలకు బోరుకొడుతుంది. కానీ కేసీఆర్ మంచి ప్రెపరేషన్‌తో అప్పుడ ప్పుడు మీడియా ముందుకు వస్తాడు. పిట్టకథలతో, సామెతలతో, పంచ్‌లతో, సమాచారంతో ఎదుటివారిని డైలమాలో పడేసి వెళ్లిపోతాడు. ఇక చర్చ మళ్లీ కేసీఆర్ బయటకు వచ్చేసరికి కొనసాగుతుంది. ఇవన్నీ కేసీఆర్ బలాబలాలు. ఏమవుతుందో వేచి చూడాలి.
తెలంగాణలో కేసీఆర్ దూకుడుకు సరిసమానంగా నిలబడగల నాయకుడు ఎవరు? నిస్వార్ధ బుద్ధిగల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాధుజీవి. ఆయన కన్నా మెత్తవాడు పెద్దలు జానారెడ్డి. పొన్నం, పొన్నాల, పొంగులేటి, దుద్దిళ్ల, జీవన్, మధుయాష్కీ సాఫ్ట్‌వేర్‌లేగానీ హార్డ్‌వేర్‌లు కాదు. షబ్బీర్ అలీ ఇప్పటికే కేవలం మైనార్టీశాఖ మంత్రిలాగానే మాట్లాడుతాడు. వీహెచ్ కడుపులో ఏం లేకపోయినా ఉన్నదున్నట్లు మాట్లాడినా జనం సీరీయస్‌గా తీసుకోవట్లేదు. కోమటిరెడ్డి మాటల్లో నిజాయితీ ఉంది కానీ పార్టీలో ఆయన ముందటపడటం కష్టం. సంపత్ ఇటీవల ఎందుకో దూకుడు తగ్గించాడు. ఇటీవల పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి చాలా బ్యాలెన్స్‌గా, అర్ధవంతంగా మాట్లాడుతున్నాడు. దాసోజ్ శ్రవణ్, అద్దంకి దయాకర్ అద్భుత వాదనా పటిమ ఉన్న నాయకులు. కానీ వాళ్ల గ్రాఫ్ పార్టీలో ఇంకా పెరగలేదు.
పార్టీ వాళ్లను ఇంకా ఉపయోగించుకోవాలి. నిజానికి దిగ్విజయ్, కుంతియాలు చేసేదేం లేదు, అధిష్ఠానం పర్యవేక్షణ కోసం తప్ప.ఎందుకంటే ఇపుడు కేసీఆర్‌లాంటి ఉక్కుపిండాన్ని ఢీకొట్టాలంటే చతురంగబలాలు సమకూర్చు కోవాలి. ధనం, కులం, మీడియా, నాయకులు  ప్రజలు ఇవే ఈనాటి చతురంగ బలాలు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్‌రెడ్డిని ముందు పెట్టకపోతే అనుకున్న ఫలితాలు సాధిస్తామనుకోవడం దుక్కిలో నాగలి దున్నడమే. ఇటీవల జరిగిన రాహుల్ పర్యటనలో రేవంత్ ఇంకొంచెం సేపు మాట్లాడితే వాతావరణం మారేది. పార్టీగా కాంగ్రెస్ మనగలగాలంటే ఎవరు నాయకులుగా ఉన్నా పర్వాలేదు. కానీ అధికారంలోకి రావాలంటే ఓ బాహుబలి ఉండాల్సిందే.
తెలంగాణలో కోదండరాం పెట్టిన పార్టీ పరోక్షంగా కమ్యూనిస్టు విధానాలను లైవ్‌గా ఉంచడమే  తప్ప జనం ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. బీజేపీకు తెలంగాణలో ఎదిగే అవకాశం అందరికన్నా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌కన్నా ఎక్కువ దూసుకుపోవచ్చు. కానీ ఇప్పటకిపుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప స్థానిక నాయకత్వం కదిలే పరిస్థితి లేదు. ఎందుకిలా ఉంది అన్నది ప్రత్యేకంగా చర్చించాల్సిన అవస రం ఉంది. ఇక కమ్యూనిస్టులు, తెలుగుదేశం మమ్మల్ని ఎవరు కలుపుకుంటారా అని నోరు తెరచి కూర్చున్నాయి. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ది యధాతథ స్థితి.
ముందస్తు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ముదురుతున్న ఈ రాజకీయం కేంద్రంలో మార్పులు తెస్తుందా! కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చి భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకుంటుందా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ఫలితాలు కాం గ్రెస్‌కు ఆయువు అయి తే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తుల ఓటమి భాజపాకు బలం అన్నది నిజం.

**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి



సముద్రం ఒడ్డున ఆగి ఉన్న ఓడపైన ఓ కాకి వచ్చి వాలింది. అంతలో ఓడ ప్రయాణం ప్రారంభమై సముద్రం మధ్యలోకి చేరింది. కాకి ఓడపై భాగంలో ఎగిరింది. ఎటూచూసినా నీళ్లే ఉన్నాయి. వాలడానికి స్థలం లేదు. తిరిగి తిరిగి మళ్లీ ఓడపైనే వాలింది. చంచలమైన మనస్సు కూడా ఆ కాకిలాంటిదే. 
చాలాదూరం పరుగెత్తుతుంది. కానీ ఎక్కడా దానికి తృప్తి 
దొరకదు. గాలిలో దీపం లాగా ఎప్పుడూ కదులుతుంది. 

అందుకే మనసును కోతితో పోల్చారు. మనసు కోతిగా ఉంటేనే గెంతులేస్తుంది. అలాంటిది ఆ కోతి కల్లు తాగిలే.. దాన్నితేలు కుడితే.. దానికి దెయ్యం పడితే.. ఆపై అది నిప్పులు తొక్కితే? ఇక ఆ కోతి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే మనిషి మనసు కూడా!

ఈ రోజుల్లో ఏ మనిషిని కదిలించినా చాలా ‘బిజీ’గా ఉండడానికి కారణం మనసుకుండే ఈ కోతి స్వభావమే. ఇవాళ మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ అందరిదీ ‘సమయ పేదరికం’. హద్దులు మీరిన ధనవ్యామోహం, తీవ్రమైన పదవీకాంక్ష, హద్దూ అదుపులేని కీర్తి కండూతి వల్ల మనిషి అశాంతిలో మునిగి తేలుతున్నాడు. ప్రతివారిలో ఆధ్యాత్మికత పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ ఎక్కువమంది అశాంతితో జీవిస్తున్నారు. గుళ్లకు, గురువుల దగ్గరకు వెళ్లి నాకు ఇళ్లూ, ధనం, పదవి కావాలని భౌతిక సుఖాన్ని యాచిస్తున్నారు. అంతేతప్ప.. ‘నా మనసుకు శాంతి కావాలి’ అని ఎవరూ అడగట్లేదు.

వెండి, రాగి మొదలైన లోహాలతో కలిసినప్పుడు బంగారం విలువ ఎలా తగ్గిపోతుందో.. అలాగే శుద్ధజ్ఞానం గల జీవుడు శివస్వరూపి అయినాగాని అహంకార, మమకార గుణాలతో మాయ ఆవరించి జీవత్వం పొందుతున్నాడు. స్ఫుటం అనే శుద్ధి ప్రక్రియ ద్వారా స్వర్ణకారులు బంగారాన్ని ఇతర లోహాల నుండి ఎలా వేరు చేస్తారో గురువు కూడా అలా తన యోగ విద్యా ప్రబోధం వల్ల మనోనాశనం చేస్తాడు. సాధన వల్ల కలిగే సంస్కారాలతో జీవుని మనో మాలిన్యం తొలగిస్తే ‘శుద్ధ జ్ఞానైక శివస్వరూపుడు’ అవుతాడు. అలాంటి సాధానానుష్ఠానం మనోనిశ్చలతను కలిగిస్తుంది.

ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్‌

‘ప్రశాంతత పొందిన మనస్సు గలవాడై, త్రిగుణాలు శమించినవాడై పాపం లేనటువంటి బ్రహ్మ స్వరూపుడైన, జీవన్ముక్తుడైన యోగిని ఉత్కృష్టమైన బ్రహ్మానంద సుఖం ఆవరిస్తుంది’ అని గీతాచార్యుడు చెప్పినట్లు మనసుకు శాంతిని కలిగించాలి.


********************************
     ✍ ✍  డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ


శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా॥
సిద్ధలక్ష్మీ.. మోక్షలక్ష్మీ.. జయలక్ష్మీ.. సరస్వతీ.. శ్రీలక్ష్మీ.. వరలక్ష్మీ.. ఆరుగురే లక్ష్మీదేవతలు. కాలక్రమంలో సంతానలక్ష్మీ, గజలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, విజయలక్ష్మీ అనే పేర్లు పెట్టి మొత్తం ఎనిమిది మంది తల్లులను సృష్టించారు. పై శ్లోకం నిరంతరం మనం చదివే మంత్రపుష్పం చివర్లో ఉంటుంది. అది ప్రామాణికం అయితే భక్తి తీవ్రత  ఆ వరలకే్ష్మ ఇన్ని రూపాలను ధరించింది.! సర్వ శుభలక్షణం స్వరూపిణి మంగళదేవత అయిన శ్రీలక్ష్మీదేవి సంపదలకు అధినేత్రియై ప్రజలకు సకల శుభాలనిచ్చే మంగళమూర్తి. ఆమెను ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా ఆరాధిస్తాం.
స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై అధివసించి తన విభూతులను ప్రపంచానికి అందిస్తుంది. నారాయణుడి అనపాయిని (వీడనిది)గా, అనుపగామినిగా (వదలకుండా అనుసరించేది) ఉండి, ఆయన విజయాలలో భాగస్వామిగా నిలిచింది. సకల లోకాలకు  ‘శాంతిని కలిగించే’ ‘శ్రీమన్నారాయణ క్రీడకు’ లక్ష్మీదేవి అండగా నిలుస్తూ  ఆ ‘శ్రీ’ మూర్తిలా, ‘స్త్రీ మూర్తు’లంతా పురుషార్ధం సాధించే తమ భర్తలకు అండగా నిలవాలని సూచిస్తుంది.
దేవి శక్తులన్నింటికీ మూలమైంది శ్రీలక్ష్మీదేవి. అన్ని శక్తులను మించిన శక్తి ఈమే! లక్ష్మీదేవి శ్రీరూపంగానూ, లక్ష్మీరూపంగానూ చూస్తాం. ఈ శక్తులు రెండు విడిగా ఉన్నా, ఒకటిగా ఉన్నా రెండూ ఉన్నట్లే! ఈ రెండు రూపాల్లోనూ వీరు విష్ణు భగవానుని భార్యలే! ఈమె దయను కొద్దిగా సంపాదించిన వ్యక్తి కూడా ధనవంతుడు అవతాడు. లక్ష్మీదేవి పద్మవనంలో నివసిస్తుంది. పద్మంలో కూర్చుంటుంది. పద్మాన్ని ధరిస్తుంది.సమస్త సంపదలకూ అధిష్ఠాన దేవత అయిన శ్రీదేవి శుద్ధమైన సత్తతత్తం కలది. వికారాలకు, దోషాలకు అక్కడ ప్రవేశం లేదు. భగవంతుడు అవతారమెత్తినప్పుడల్లా లక్ష్మీదేవి కూడా అవతరించి ఆయన చూపే లీలల్లో సహాయపడుతూంటుంది. 
అలాంటి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధించే మాసం శ్రావణమాసం. విత్తనాలను భూమి తల్లి గర్భంలో బీజావాపనం చేసి, భవిష్యత్తులో తమకు చక్కని‘ధాన్యం’ ఫలంగా ఇవ్వాలని, వ్యవసాయిక దేశంలో లక్ష్మిని ఆరాధించడం సంప్రదాయం. ‘ధనం మూలమిదంజగత్’  అన్నట్లు ఈ లోకంలో మానవుల సుఖభోగాలకు ఆధారభూతంగా ‘లక్ష్మీకటాక్షం’ కోరడం ఈ మాస ఆరాధనలో ప్రత్యేకత. అదీ లక్ష్మీదేవిని వరాలిచ్చే తల్లిగా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆరాధించే పర్వదినమే శ్రీ వరలక్ష్మీ వ్రతం.
వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు?
ఈ వ్రతానికి తిథి, వార, నక్షత్రాల పట్టింపులు లేవు. భక్తితో ఎవరు ఆచరించినా మేలే జరుగుతుంది.
వ్రతం ఏర్పాట్లు
శ్రీలక్ష్మిని పూజించే ప్రదేశంలో చక్కని అలంకరణ చేయాలి. పూజ కోసం వరలక్ష్మిని స్థాపించే పీఠంపై దేవతాహ్వాన లాంఛనంగా ‘పద్మం ముగ్గు’ వేయాలి. ఈ రోజుల్లో తయారుచేసిన అమ్మవారి  విగ్రహాలు దొరుకుతున్నాయి. తమ శక్తికొలది బంగరం, వెండి, రాగి మొదలైన వాటిలో ఏదో ఒక విగ్రహాన్ని చక్కగా అలంకరించుకొని స్థాపించడం ఒక పద్ధతి లేదా కొబ్బరికాయకు కళ్లు, ముక్కు, చెవులు దిద్దుకొని వస్త్రాలు ధరింపచేసి విగ్రహం తయారుచేసుకోవచ్చు. మరికొందరు ఈ కొబ్బరికాయకే అమ్మవారి ముఖ భాగాన్ని అతికించి అలంకరణ చేస్తారు. 
ఈ కథలోని అంతరార్థం
ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని ప్రేమించాలి, వారి అభిమానం చూరగొనాలి. అలాగే తన తోటి స్త్రీలను ఇంటికి ‘పసుపుబొట్టు’కు పిలవడం వల్ల సామాజిక సంబంధాలను పటిష్టం చేసుకోసుకోవాలి. డబ్బును ఎల్లప్పుడూ పూజించాలి  గౌరవించాలి. అప్పుడే దాని విలువ మనుషులకు తెలుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందగల్గుతారు.
మంగళ స్వరూపిణీ..
ఎక్కడ విజయం ఉంటుందో అక్కడ విజయలక్ష్మి! విద్యాలక్ష్మి.. ఆమెయే సరస్వతి..! ఎక్కడ ధనధాన్యరాసులుంటాయో అక్కడ ధనలక్ష్మి.. ధాన్యలక్ష్మి..! ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యలక్ష్మి..! ఎక్కడ ఆనందం.. శాంతి.. సుఖం.. తాండవిస్తాయో అక్కడ.. ఆనందలక్ష్మి!
ఆమె నారాయణీ.. సౌభాగ్యదాయినీ.. మంగళ స్వరూపిణీ: అలాంటి లక్ష్మీ అనుగ్రహసిద్ధి కోసం స్త్రీలు వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. తన తోడు  నీడ అయిన పురుషుని ఆయుష్షును కాపాడాలనీ.. తన కుటుంబం ఆరోగ్యం.. ఆనందం .. ఉన్నత స్థితి..అదృష్టం, దాతృత్వం పొందాలని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతం ఆచరిస్తుంది. ఈ వ్రతం ఆచరించడానికి కులభేదం లేదు, ఎవరైనా ఆచరించవచ్చు. తమ శక్త్యానుసారంగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఆచరించాలి, పూజలోని తత్వాన్ని గ్రహించడం ప్రధానం. స్త్రీలలోని మాతృశక్తిని చైతన్యం చేసే వ్రతం ఇది. 
లక్ష్మీదేవి సహజాలంకార భూషితురాలు. కృతకంగా చేసే పూజకన్నా, నిర్మల మనస్సుతో ప్రకృతిసిద్ధమైన పదార్థాలతో, వస్తువులతో చేస్తే ఆమెకు మరింత ప్రీతికరం. స్త్రీల మధ్య బంధం పెనవేసే వ్రతం ఇది. పసుపు పరస్పరం పంచుకోవడం వల్ల మనుషుల్లోని మనసుల్లోని కల్మషాలు నశించి ‘లక్ష్మీప్రదం’ అవుతుంది.
వరలక్ష్మీ  మూలం...!
నైమిషారణ్యంలో శౌనకుడు మొదలైన మునులను ఉద్దేశించి సూతమహర్షి చెప్పిన వ్రతకథ ఇది. స్కాంద పురాణంలో ్ర‘స్తీలకు సౌభాగ్యం, ధనం, భూమి, విద్య, ప్రీతి, కీర్తి, తుష్టి, పుష్టి, శాంతి కలిగించే ఓ గొప్ప వ్రతం ఏదైనా చెప్పాలని పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థిస్తే, శివుడు ఈ లోకానికి అందించిన సౌభాగ్య ఆరాధన వరలక్ష్మీ వ్రతం. అష్టుశ్వైర్యాలకు ప్రతీక అష్టలక్ష్మీ సమష్టిరూపమైన తల్లి వరలక్ష్మి. పరమేశ్వరుడు విష్ణుపత్ని అయిన ‘లక్ష్మీ ఆరాధన’ ఈ లోకానికి అందించి హరిహరాద్వైతం ప్రకటించాడు. లక్ష్మీణివూర్వతుల సమన్వయం కూడా ఇందులో కన్పిస్తుంది. స్త్రీలు తమ తోటివారితో సఖ్యత ఎలా పాటించాలో చెప్పే సందేశం ఇందులో ఉంది.
శ్రీ మహాలక్ష్మ్యష్టక  స్తోత్రం
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే || 1 ||

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 2 ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 3 ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 4 ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తు తే || 5 ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 6 ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 7 ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 8 ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || 9 ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్‌ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||10 ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్  ప్రసన్నా  వరదా శుభా ||11||


***************************************
  డాక్టర్. పి. భాస్కర యోగి 


అమెరికాలో ఉన్న తమ కొడుకును చూద్దామని ఓ వృద్ధ దంపతులు అక్కడికి టూరిస్ట్ వీసాపై వెళ్లారట. అక్కడే ఉద్యోగం చేస్తున్న ఆ కొడుకు స్నేహితుడు తల్లిదండ్రులతోపాటు భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. వాళ్లింట్లో భోజనం ముగించి, చేయి కడుక్కునేటపుడు తండ్రి చెవిలో కొడుకు మెల్లగా- ‘నాన్నా! మనం వీళ్లింట్లో భోజనం చేసినందుకు మా స్నేహితుడికి థాంక్స్ చెప్పు’ అన్నాట్ట. వెంటనే ఆ పెద్దాయన ‘బాబూ! మాకు మంచి భోజనం పెట్టినందుకు థాంక్స్’ అన్నాట్ట. ఆ తర్వాత టూరిస్ట్ వీసా గడువు ముగియగానే వృద్ధులు భారత్‌కు వచ్చేశారు. 

కొన్నాళ్లకు కొడుకు తండ్రికి ఫోన్ చేసి ‘‘నాన్నా! మనకు భోజనం పెట్టిన నా స్నేహితుడు ఇండియాకు పనిమీద వస్తున్నాడు. ఓ పది రోజులు మనింట్లోనే ఉంటాడు. మీరు అతడిని బాగా చూసుకోవాలి’’ అని చెప్పాడు. ఆ అబ్బాయి వచ్చి పది రోజులు ఈ వృద్ధ దంపతుల దగ్గరే ఉండి తన పనులు చేసుకొన్నాడు. వాళ్లు అతనికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. తిరిగి అతను వెళ్లిపోయేముందు కార్లో కూర్చోవడానికి వెళ్తుంటే ఈ వృద్ధుడు ‘‘బాబూ! మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించినందుకు థాంక్స్’’ అన్నాడట. వెంటనే అతను-‘ఇదేమిటి..? ఆ రోజు అమెరికాలో మా ఇంట్లో భోజనం చేసినపుడు మీరే థాంక్స్ చెప్పారు. ఈ రోజు నాకు భోజనం పెట్టి మీరే థాంక్స్ చెబుతున్నారు’ అన్నాడట. 

ఈ దేశంలో అన్నం తిన్నవాళ్లకే పెట్టినవారు థాంక్స్ చెబుతారు. ‘అతిథి దేవోభవ’ అన్న ప్రాథమిక సూత్రం నుండి ఇది పుట్టింది. ఇదే భారతీయ సంస్కృతి అన్నాడట. ఈ భారతీయ సంస్కృతి ప్రాచీనమైనదేగాక, మహోన్నతమైనదని ప్రాచ్యులే గాక, ఎందరో పాశ్చాత్యులు కూడా తమ అభిప్రాయం వెలిబుచ్చారు.

కేవలం 15 ఏళ్లు ఇరాన్‌ను ముస్లింలు పాలిస్తే అక్కడంతా ఇస్లాం వ్యాప్తి చెందింది. 17 ఏళ్లు ఇరాక్‌ను ముస్లింలు తమ ఆధీనంలోకి తీసుకుంటే అక్కడ ఇస్లామిక్ కల్చర్ అభివృద్ధి చెందింది. అలాగే 21 ఏళ్ళు ఈజిప్టును ఇస్లాం స్వాధీనం చేసుకుంటే అక్కడ అంతా ఇస్లామిక్ రాజ్యం ఏర్పడింది. యూరప్‌ను 50 ఏళ్ళు క్రైస్తవులు పాలిస్తే అదంతా క్రైస్తవమయమైంది. దాదాపు 800 ఏళ్లు ముస్లింలు, 200 ఏళ్లు ఆంగ్లేయుల రూపంలో క్రైస్తవులు పాలించినా భారత్‌లో హిందూ జాతీయత తట్టుకొని ఎలా నిలబడగలిగింది అన్నది ఇవాళ్టి భేతాళ ప్రశ్న!?

భారతీయత ఇక్కడే కాదు.. ప్రపంచానికే వెలుగు చూపింది. క్రొత్తగా పుట్టిన అన్ని మతాలకూ ఆధారమైంది. ఇందులోంచి స్వీకరించినవి కొన్ని, స్వీకరించకూడదనుకొన్నవి మరికొన్ని- ఇవే ఆయా మతాల ప్రాథమిక సూత్రాలయ్యాయి. అందుకే భారతీయ నాగరికత, సంస్కృతుల వైశిష్ట్యాన్ని ఇష్టం ఉన్నా, లేకున్నా మాక్స్ ముల్లర్ లాంటివాడు ‘‘జ్ద్ఘీఆ నిశజూజ్ఘ ష్ఘశ ఆళ్ఘష్ద ఖఒ?’’ అనే పేరుతో ఉపన్యాసాల పరంపరను పాశ్చాత్య దేశాలకు అందించాడు. హిందూ ప్రాచీన సంస్కృతి ముందు గ్రీకుల, రోమనుల, అరబ్బుల, పారసీకుల సంస్కృతుల ‘బోన్సాయ్’ మొక్కలే! ప్ర పంచంలోని ఎన్నో మ తాలకు, సంస్కృతులకు, నాగరికతలకు ఇక్కడి నుం చే జీవం అందింది. ఇప్పటికీ ఎన్నో దేశాలు మతం ఆధారంగా మనకు సరిపోలకున్నా సంస్కృతిని అలాగే ఉంచుకొన్నాయి. 

ఇండోనేషియా ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం. అక్కడ రామాయణ ఘట్టాలను తెలిపే ‘రామ్‌లీల’ ఏటా జరుగుతుంది. ఎన్నో భారతీయ గ్రంథాలు ఇతర దేశాలకు దిక్సూచి అయ్యాయి. జర్మన్‌లో వాళ్ల వైద్య విభాగంలో ఒకదానికి చరకుడి పేర ‘చర్కాలజీ’ అని పేరు పెట్టుకున్నారు. 
ఇండోనేషియా వాళ్ల ఏయిర్‌వేస్‌కి ‘గరుడ’ అనీ, వాళ్ల కరెన్సీ నోట్లపై ‘గణేశుడి’ బొమ్మను చిత్రించుకొన్నారు. బుద్ధుడు పుట్టిన ఈ నేల నుండి ధ్యాన విద్య ప్రపంచంలోకి వెళ్లింది. దీని ప్రభావంతోనే పాశ్చత్య దేశాల్లో ‘జెన్‌సాధువులు’ పుట్టుకొచ్చారు. వాళ్లలో అన్నీ మన అవధూతల లక్షణాలే.

ఆధునిక కాలంలో స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనం కోసం 31 మే 1893లో చికాగో వెళ్లారు. ఆధునిక, ప్రాచీన మహర్షుల సందేశాన్ని, ఇక్కడి మహాభక్తుల సందేశాన్ని, వేదాంత సారాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన ఘనత స్వామి వివేకానందదే. స్వామి హైందవాలయాలకు, బౌద్ధ ఆరామాలకు వున్న సారూప్యాన్ని గమనించాడు. 

జపాన్‌లోని టోకియో, యోకోహామాలను చూసి హైందవ బౌద్ధ సంస్కృతుల విశాలత్వాన్ని పరిశీలించాడు.
వివేకానందుడు చూపిన బాట వల్ల ఆయన తర్వాత ఎందరో పాశ్చాత్య దేశాల బాట పట్టారు. స్వామి రామతీర్థ అద్వైతామృత రసాన్ని పాశ్చాత్యులకు పంచిపెట్టి మత్తులో ముంచాడు. 

వివేకానందుడు పాశ్చాత్య దేశాలకు వెళ్లి వచ్చాక 25 ఏళ్ల తర్వాత మరొక గొప్ప యోగి పరమహంస యోగానంద అమెరికాలో అడుగుపెట్టాడు. ఆయన యోగుల జీవితాలను, శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి రచించిన ‘ఎ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ (ఒక యోగి ఆత్మ కథ) ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువదించబడి లక్షలాది కాపీలు అమ్ముడుపోయింది. పాశ్చాత్య సమాజంపై ఈ గ్రంథం ప్రభావం అనన్య సామాన్యం.

పాశ్చాత్య పాత్రికేయుడు, ఆధ్యాత్మిక పరిశోధకుడు పాల్ బ్రంటన్ రాసిన ‘ఏ సీక్రెట్ సెర్చ్ ఇన్ ఇండియా’- ‘రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అనే్వషణ’ అన్న పుస్తకం పాశ్చాత్యులను భారత్ వైపు నడిపించింది. మేడం బ్లావెట్ స్కీ, సిస్టర్ నివేదిత వంటి ఎందరో ఈ సంస్కృతిపై మక్కువ పెంచుకొని ఈ మట్టితో మమేకమయ్యారు. కానీ పాల్ బ్రంటన్ తన రచన కోసం భారతదేశం అంతా ఓ హేతువాదిలా, అనే్వషణ చేస్తాడు. ఎందరో సిద్ధ పురుషులను కలుస్తాడు. చివరకు రమణ మహర్షి దగ్గర అతడు శాంతి పొందుతాడు. ఆ తర్వాత రమణ మహర్షి పాశ్చాత్య ప్రపంచంలోకి విస్తరింపబడినాడు. 

జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, స్వామి రామల తమ గ్రంథాలు, సాధనల ద్వారా పాశ్చాత్య లోకాన్ని ఆకర్షించారు. ఈ రోజుకూ అరుణాచలంలో ఎప్పుడూ విదేశీయులు కన్పిస్తారు. పాశ్చాత్యులను విశేషంగా ఆకర్షించిన వారిలో నిసర్గదత్త మహారాజ్ ఒకరు. గొప్ప ఆత్మజ్ఞానిగా పేరొందిన ఆయన ఇల్లు చిన్న సందులో ఉన్నా, విమానాలు దిగి నేరుగా ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చేవారు.

ఓషోగా పేరొందిన ఆచార్య రజనీశ్ చెప్పినంతగా ప్రాచ్య- పాశ్చాత్యుల వేదాంతం మరెవరూ చెప్పలేదు. వందలాది మంది తత్త్వవేత్తలను ఆయన ఆధ్యాత్మిక లోకానికి రుచి చూపించాడు. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో చర్చిలను కొనుగోలు చేసి కృష్ణ మందిరాలుగా మార్చుతున్న ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎ.సి.్భక్తివేదాంతస్వామి పాశ్చాత్య ప్రపంచాన్ని కృష్ణమయం చేస్తున్నారు. 

తన ప్రౌట్ ఫిలాసఫీ ద్వారా ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ సృష్టించిన ప్రభాత్ రంజన్ సర్కార్ సిద్ధాంతం పాశ్చాత్యులను శివయోగం తెలుసుకొనేలా చేసింది. అతి పెద్ద సంస్థగా బ్రహ్మ బాబా స్థాపించిన బ్రహ్మకుమారీస్ ఎలా సముద్రాలను దాటి దూసుకుపోతుందో మనం కళ్లారా చూ స్తున్నాం. భగవాన్ సత్యసాయి పాశ్చాత్యులకు భక్తి పరిమళాలను పంచిపెట్టారు. మహర్షి మహేశ్ యోగి పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలను స్థాపించారు.

రాం దేవ్, శ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి ఇవాళ ఆధ్యాత్మిక క్షేత్రంలో అందుకోలేనంత దూరం నడిచారు. ఇదంతా భారతీయం. ఈ రోజుకూ మన కళ్లముందు సంచరించే యోగులు ఎందరో ఉన్నారు. వారు వేస్తున్న నైతిక బీజాలు సమాజాన్ని నైతిక చట్రంలో బంధిస్తున్నాయి. నిరాహార యోగినిగా మాతా మాణికేశ్వరి సాత్విక ఆహార ప్రాధాన్యం లోకానికి అందిస్తున్నారు. 

ఆత్మజ్ఞానిగా శ్రీ గురు గెంటేల వెంకటరమణ ప్రేమను పంచుతున్నారు. మనం జీవించి ఉన్న గురువులను పట్టించుకోం. వెంకటరమణులు మరో రమణ మహర్షిలా తత్త్వ ప్రబోధం చేస్తున్నారు. వారి ‘ఆత్మబోధ’ మనం అనుకునే - చెప్పుకొనే గొప్ప గురువులకేం తీసిపోదు.

ఇలా ఎందరో పాశ్చాత్యులు మనవైపు చూస్తుంటే, ఇక్కడివారు మాత్రం అస్తమిస్తున్న సూర్యుని కోసం అటువైపు ముఖం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)ల పేరుతో కొందరు విపరీతమైన మత మార్పిడి జరుపుతూ దేశంలో అంతర్గత శాంతి లేకుండా చేస్తున్నారు. అక్కడ అమ్ముకొన్న చర్చిల ధనాన్ని ఇక్కడ విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు. మోదీ అధికారంలోకి వచ్చి ఎన్జీవోలను కట్టడి చేయగానే ఆయా సంస్థల కార్యకలాపాలు తగ్గిపోయాయి. దాంతో మోదీపై కత్తిగట్టిన ఈ గ్యాంగంతా ఇప్పుడు కులం ఉచ్చును కార్యాచరణగా ఎంచుకొన్నాయి.

 ఎక్కడైనా పార్టీలపై కక్ష ఉంటుంది గాని వ్యక్తులపై యుద్ధం చేస్తారా? రకరకాల క్రొత్త అస్తిత్వాలను సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టించేటట్లు చేసి, ఇక్కడి హిందువులను అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలు చేయడమే కొందరు పనిగా పెట్టుకొన్నారు. ‘ఒలింపిక్స్‌లో మొదటి బహుమతి పొందిన ఛాంపియన్ ఇంటివెనుక గుంతలో పడి చచ్చినట్టు’ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంటే- మన మేధావులు మాత్రం ఉదయం లేచింది మొదలు హిందూత్వను ఎలా బోనులో నిలబెట్టాలని చూస్తున్నారు. 

గజనీ, ఘోరీ, నాదిర్షా, ఔరంగజేబులే హిందూ మతాన్ని ఏమీ చేయలేకపోయారు. మార్క్స్, మావో చతికిలబడ్డారు. ఇపుడు కొన్ని ‘మిణుగురు పురుగులు’ దాడి చేస్తే- సహించే శక్తి ఈ దేశానికి ఉందనేది చారిత్రక సత్యం.


************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰
భయమా ? బ్లాక్ మెయిలా ?
*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి
20 - 26 : August : 2018



భారతదేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది. అంతకుమించి ఓ గొప్ప రాజనీతిజ్ఞుని కూడా కోల్పోయింది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించాక దేశమంతా మార్మోగిన నినాదం ఇది. కొందరు జన్మించడం అజ్ఞాతంగా జరిగిపోతుంది. 

మరణించడం మాత్రం గొప్పగా మరణిస్తారు. ఎందుకంటే జన్మించడం మన చేతుల్లో ఉండదు. కానీ మరణానికి ముందు వేసుకొన్న పూలబాటలు అతడిని సామాజికవేత్తగా మారుస్తాయి. సరిగ్గా మరణానికి ముందు జీవితంలో వాజ్‌పేయి చూపిన ఆదర్శాలు అంతే ప్రభావవంతంగా ఆలోచించే విధంగా తోస్తున్నాయి.

ఒక వ్యక్తి శరీరం వదలిపెట్టడానికి ముందు దాదాపు 12 ఏళ్ళు బయటి ప్రపంచానికి తన ముఖాన్ని కూడా చూపించలేదు. ఒక్క మాట ఎవరితోనూ మాట్లాడలేదు. అయినా అతని మరణం కోట్లాదిమంది కంట కన్నీరు పెట్టించడం వెనుక అతని చింతన ఎంత గొప్పదో మనం ఈ రోజు ఆలోచించాలి. 

బహుశా! వాజ్‌పేయిలో రాజనీతిజ్ఞత కవిత్వంగా దాగి ఉంది. అతను గొప్ప భావకుడు. హిందీలో అతని కలం నుండి జాలావారి, అతని నోటి నుండి ప్రవహించే కవితాఝరి శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేసింది. కవిత్వం, భాష, ప్రసంగం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి వాజ్‌పేయి కవిత్వాలు, ప్రసంగాలు ఒక ఉదాహరణ. సాధారణ విషయాన్ని సైతం కళాత్మకంగా తీర్చిదిద్ది శ్రోతల హృదయంలోకి పంపగల  ఒంపగల నేర్పు వాజ్‌పేయి సొంతం. 

సంఘం తొలినాళ్లలో తీర్చిదిద్దిన నాయకుల్లో వాజ్‌పేయి ఒకరు. శ్యామాప్రసాద్ జమ్ముకాశ్మీర్‌లో ‘ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా’ ఇచ్చిన నినాదం కొసను అందుకొని అటల్ నాయకుడిగా ఎదిగారు. అలాగే ఏకాత్మతా మానవతావాదం ప్రవచించిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ వంటి నిరాడంబర రాజకీయ నాయకుని పంచన పెరిగిన వటవృక్షం వాజ్‌పేయి. అయితే శ్యాంప్రసాద్ ముఖర్జీలా, దీన్ దయాల్ ఉపాధ్యాయలా అనుమానాస్పద చావుకు గురికాకుండా బతికిన వాజ్‌పేయికి దేవుని అనుగ్రహం ఉన్నట్లే అనిపిస్తుంది. 

వాజ్‌పేయి ఈ ఇద్దరి తర్వాత జనసంఘ్‌ను, భారతీయ జనతా పార్టీని తన భుజాలపై మోసిన వ్యక్తి. అంతేకాదు ఆనాటి నెహ్రూ వాద  గాంధేయ వాద సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయంగా నిలబడి ఎదిగిన మహానాయకుడు. స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ ఎదురులేని నాయకుడు.

ఆ తర్వాత ఇందిర అంతే వేగంతో ప్రజల్లో మమేకం అయ్యారు. అలాంటి ప్రవాహాలను తట్టుకొని నిలబడ్డ ధీశాలి వాజ్‌పేయి. తన పార్టీవారితో కాకుండా జయప్రకాశ్ నారాయణ, మొరార్జీదేశాయ్ వంటి భిన్న భావజాల సిద్ధాంతాల వ్యక్తులతో రాజకీయ ప్రస్థానం నడిపించినా ఎవరికీ లొంగకుండా తన భావజాలంలో ఉండడం సామాన్య విషయం కాదు. అక్రమంగా వచ్చిన అధికారం వాసన కూడా చూడనని చెప్పగల త్యాగమూర్తి వాజ్‌పేయి. 

పాకిస్తాన్‌తో యుద్ధం గెలిస్తే ఇందిరను అభిమానించగల సహృదయుడు. అదే ఇందిర తప్పుచేస్తే జెపి వంటి నాయకులతో కలిసి ఎదురించగల ధీరుడు. సంకీర్ణాలు విఫలమయినపుడు అలాంటి పీకలేని తోకలేని పార్టీలను కూడా అధికారానికి దగ్గర చేయగల సంయోజకుడు వాజ్‌పేయి. 

ఆయన సంకీర్ణంలో పని చేసిన ఎందరో నాయకులు ఈ రోజు ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు.
నితీష్‌కుమార్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి వారు ఈ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అలాగే పాకిస్తాన్‌తో ఆయన నెరపిన రాజకీయ దౌత్యం శాంతికాములకు ఊరట కాగా, కార్గిల్ యుద్ధవిజయం ఆయన రాజకీయ టెంపరితనానికి ఉదాహరణ. 

ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉంటే   ఆ పార్టీలోకి జంప్‌చేసే జంప్ జిలానీలు వాజ్‌పేయిని చూసి చాలా నేర్చుకోవాలి. దాదాపు 60 ఏళ్ళు అధికారం రాదని తెలిసినా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉండడం అంత సులభమైన విషయం కాదు. ప్రతి పక్షంలో ఉంటూ భారతదేశం తరపున ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించడం ఆయన రాజనీతిజ్ఞతకు అద్దం పడుతుంది.

అన్నింటికన్నా అద్వాణీతో ఆయనకున్న స్నేహం భారత రాజకీయ స్నేహబంధాల్లో చాలా విలువైంది. బహుశా! ఏ జంటా ఇంత సుదీర్ఘ స్నేహ బంధాన్ని రాజకీయాల్లో కొనసాగించలేదు. ఏనాడూ పొరపొచ్చాలతో బజారుకెక్కలేదు. అద్వాణీదీ గట్టి మనస్తత్వం. వాజ్‌పేయిది సున్నిత మనస్తత్వం. ఈ మనస్తత్వాలను గులాబీ చెట్టుకున్న పూలు, ముళ్ళతో పోల్చవచ్చు. పూలు చెట్టుకు అందం. ముళ్ళు ఆ పూలకు రక్షణ. ఈ రెండింటి వేరు ఒక్కటే, అదే ఇక్కడి విశేషం. ఈ వేరు నుండి పూవుకు, ముళ్ళకు సంబంధించిన ప్రత్యేక వేరును పక్కన బెట్టడం ఆ చెట్టునాటిన వాళ్ళకే సాధ్యం కాదు. అలాంటి సంబంధ బాంధ్యవాలు అద్వాణీ, వాజ్‌పేయిలు నెరపారు. వారి సుదీర్ఘ ప్రయాణం అజరామరం.

ఇదంతా ఈ రోజు ఉన్న కలుషిత రాజకీయాల్లో చర్చించదగిన అంశాలు. అయితే దురదృష్టకర విషయమేమిటంటే భారతీయ మీడియా వాజ్‌పేయి మరణం తర్వాత గొప్పతనాన్ని చూపిస్తూ మోడీని వేలెత్తి చూపడానికి ప్రయత్నం చేసిందన్నది పచ్చి నిజం. 

వాజ్‌పేయి రాజకీయమంతా, ఆయన  రాజనీతి కౌశలం అంతా ఆనాడున్న నెహ్రూ నుంచి సోనియాగాంధీవరకున్న దుర్లక్షణాలపై పోరాడడం కాదా? వాజ్‌పేయి ఏదో మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు అన్నట్లు ధ్వని సంకేతాలను ముఖ్యంగా తెలుగుమీడియా ఇవ్వడం ఎల్లోమీడియా వికృత విన్యాసం కాదా?   ఇపుడు తలపండిన రాజకీయ దురంధరులంతా తాము బీజేపీలో మరణిస్తే ఎంత బాగుండేది అనుకుంటారని అంచనా.

ఎందుకంటే వాజ్‌పేయి అంతిమయాత్రలో ప్రధానితో సహా మంత్రులందరూ ఆరు కిలోమీటర్లు నడచి ప్రజలతో పాటు వెళ్ళడం ఒక అద్భుత సంఘటనే. జీవితకాలం మొత్తం కమ్యూనిష్టు పార్టీలో సేవలందించిన సోమనాథ్ ఛటర్టీ వ్యక్తిగతంగా ఓ అభిప్రాయం వెలిబుచ్చినంత మాత్రాన కమ్యూనిష్టులు నిర్దాక్షిణ్యంగా అతనిపై వేటు వేశారు. వాళ్ళ కుటుంబం ఆయన పార్థివదేహంపై కమ్యూనిష్టు జెండాను కప్పడానికి నిరాకరించారు. 

ఒక చిన్న విషయానికి అంతదారుణమైన శిక్ష సోమనాథ్ చటర్జీకి ఆ వయసులో పడింది. అలాగే భారతదేశ ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, మహామేధావి. బహు భాషా పండితుడైన రాజనీతిజ్ఞుడు పి.వి. నరసింహారావు, నెహ్రూ కుటుంబేతర తొలి కాంగ్రెస్ ప్రధాని.
అలాంటి వ్యక్తి మరణిస్తే ఆయన పార్థివశరీరాన్ని ఏఐసిసి కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వంది ఎవరు? కనీసం ఎందుకలా జరిగిందని అడిగే ధైర్యం నాయకులకు గానీ, ఈ దేశ మీడియాకు గానీ ఎందుకు లేకపోయింది? అలాగే కాంగ్రెసు రాజకీయాలకు ప్రత్యమ్నాయంగా సరికొత్త ప్రయత్నం చేసి సఫలమైన ఎన్టీఆర్‌ను కుటుంబసభ్యుడు, అల్లుడైన చంద్రబాబు అధికారం కోసం ఎంత ఘోరంగా వంచించారు. 

 ఇవీ ఈ దేశంలో జరిగిన అధికార రాజకీయాలు. కానీ వీటి గురించి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. కానీ వాజ్‌పేయి  గుజరాత్ అల్లర్ల గురించి అన్న ఒక్క మాటను సూడో సెక్యులర్ లిబరల్ ఎల్లో మీడియా పరోక్షంగా మోడీని తక్కువ చేసి చూపెట్టడానికి ప్రయత్నించింది.

గుజరాత్ అల్లర్లకు మూలమైన గోధ్రా రైలు దుర్ఘటనలో మరణించిన 79 మంది కరసేవకుల ప్రాణాల గురించి  ఎప్పుడైనా ఈ హర్యాలీ మేధావులు, నాయకులు మాట్లాడారా? వాజ్‌పేయి ఆ రోజు చెప్పిన ఒక్క సూత్రం గురించే ఈ రోజు చర్చిస్తున్నవారు ఆయన జీవితాంతం ఎవరికోసం, ఏ పాలనకు వ్యతిరేకంగా సుద్దులు చెప్పాడో విస్మరిస్తున్నారా? వాజ్‌పేయి రాజకీయాల నాటికే ఎన్నో కుటిల రాజకీయాలు ఈ దేశంలో ఉన్నది నిజం. 

వాజ్‌పేయి  మోడీల సమకాలీన రాజకీయం చాలా తక్కువ. అయితే వాజ్‌పేయి పాటించిన కొన్ని విలువలను కాదనలేం. కానీ ఈ రోజు జరుగుతున్న రాజకీయ వంచనను హద్దులు మీరిన విలువలతో ఎదుర్కోవడం సాధ్యం కాదు.

వాజ్‌పేయి గొప్పవాడు. సంకీర్ణ ధర్మాన్ని, మమ్మల్ని చాలా గౌరవించాడు అని ఊదరగొట్టిన చంద్రబాబు కనీసం మరణించిన రోజు ఏపీలో ఎందుకు సెలవు ఇవ్వలేదు? ‘మరణం తర్వాత వైరం ఉండదు’ అని శాస్త్రాలు చెప్తాయి. 

 సోనియాగాంధీ నామ మాత్రంగా నివాళులు అర్పించారు కానీ వాజ్‌పేయిపై మనసులో ఏం ఊహించుకున్నారో ఎవరైనా చెప్పగలరా? వాజ్‌పేయి రాజకీయాలు ఆదర్శం అని చెప్పిన మమత ఎన్‌ఆర్‌సీలో 40లక్షల అక్రమ చొరబాటుదారుల పేర్లు లేవని గుండెపగిలేంత ఏడ్చిందట. ఎన్‌ఆర్‌సి లో అక్రమ చొరబాటుదారులను చొప్పించడం వాజ్‌పేయిలాంటి అఖండ దేశభక్తుడు ఇష్టపడతారా?

ప్రతీ విషయాన్ని హిందూ కులాల పేరుతో చూస్తున్న  చేస్తున్న రాజకీయం వాజ్‌పేయి ఇష్ట పడతాడా? కాబట్టి సమకాలీన రాజకీయాల్లో వాజ్‌పేయి ఒక గీటురాయి. కానీ ఆదర్శాల ఆధారంగా రాజకీయాలు ఉండాలి. కానీ అలాగే ఉండాలి అనుకోవడం కూడా తెలివి తక్కువతనమే అవుతుంది. అది అత్యాశ కూడా!

**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి



భాగవతంలో ప్రసిద్ధమైన గజేంద్రమోక్షం కథ తెలియని వారుండరు. గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి మొసలితో పోరాడినా దాని నుండి విముక్తి పొందలేక అనేక విధాలుగా పరమాత్మను ప్రార్థిస్తాడు. 

గజేంద్రుడి ఈ స్తుతులు దాదాపుగా.. మహాభారతంలో ద్రౌపదీ వస్ర్తాపహరణం సమయంలో ద్రౌపది చేసినంత ఆర్తితో కన్పిస్తాయి. పరమాత్మ లీలలను విభూతులను గజరాజు స్తుతిస్తూ

కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణములపాలన్‌
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడోలేడో

దేవుడు దీనులలో, పరమయోగుల హృదయాల్లో, అన్నిదిశల్లో (అంతటా వ్యాపించి విష్ణువుగా) ఉన్నాడు అంటారు. కానీ, ఈ కలడని (ఉన్నాడని) అనే పరమాత్మ ఉన్నాడా! లేడా! అని ప్రశ్నించినట్లు ఈ కథను చూస్తాం. 

నిజానికి.. సంసార విషవృక్షంపై ఎక్కి కూర్చున్న మనుషులు అందులోని సత్సంగం, శాస్త్ర పరిజ్ఞానం అనే మధుర ఫలాలను అనుభవించకుండా నిత్యదుఃఖంలో పడి పరమాత్మను విస్మరిస్తున్నారు. భౌతికమైన విషయాలపట్ల చూపే ప్రేమలో వందో వంతు అయినా దేవుని పై ఉంచుతున్నారా? వ్యక్తి తన జీవితంలో అందుకోలేని ఊహల్లో, చిన్నచిన్న వస్తువులచుట్టూ తిరుగుతుంటాడు.

తన జీవన చక్రానికి వెనకా ముందూ ఉన్న తత్వ సారాన్ని మాత్రం విస్మరిస్తాడు. అందుకే ఆ తత్వానికి మూల స్వరూపమైన చక్రాధారి ఉనికిని గురించి ఆలోచించకుండా జీవితం కొనసాగిస్తాడు. ప్రకృతి పురుషుల ఏకత్వానికి ప్రతీకనే ఈ సృష్టి. దాని నిర్మాతే పరమాత్మ. అలాంటి సృష్టికర్తకు కృతజ్ఞతగా మనం ఏం సమర్పించాలి? ఆయన అస్తిత్వాన్ని ఆరాధించడమే యోగం.

ఆయన గుణ, లీల, నామ విభూతులను బాహ్యమైన పూజ, స్తోత్ర, నామ సంకీర్తనల ద్వారా ఆరాధిస్తూనే అంతర్ముఖులమై తత్వోపాసన చేయాలి. అది పరమాత్మ ఉనికిని హృదయంలో నింపుకోవడమే. అంతా తానే అయినప్పుడు జీవాత్మ అస్తిత్వం కూడా అందులోనే సమ్మిళితమై ఉంటుంది. 

కుండ, చిప్ప, పిడత, బాన.. ఇలా మట్టి పాత్రల రూపాలను బట్టి పేర్లు వేర్వేరుగా ఉంటాయి. కానీ వాటి తయారీకి మూలమైన మట్టి మాత్రం ఒక్కటే, అలాగే జీవులకు ఆధారభూతమైన పరమాత్మ ఉన్నాడనే తత్వం తెలుసుకోవడమే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకు మూలమైన ‘కలడు’.. ఉన్నాడు అనుకోవడమే అసలైన యోగం.

********************************
     ✍ ✍  డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన

 


కాంగ్రెస్ ఫార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన తెలంగాణ కాంగ్రెస్ నేత ల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. 2014 నుండి కేసీఆర్ వరుస వ్యూహాలతో కుదేలవుతున్న కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన కొత్త జవజీవాలను అందించిందని చెప్పలేం గాని సామాన్య కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు కావలసినంత సంతోషం ఇచ్చింది. రాహుల్ తన పర్యటనలో వ్యాపారుల, సంపాదకుల సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు కొంత చర్చకు దారితీసినా, సాయంత్రం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి దానిని తన వ్యూహంతో బరువులేకుండా చేసాడు. 

రాహుల్ పర్యటనలో ఎక్కువ సమయం ప్రధాని మోదీని తిట్టడానికే వృథా అవడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఎదురు కాలేదు. ప్రకాశం పంతులు మొదలుకొని నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు రాజకీయాలను అద్భుతంగా పండించినవారే. ఒక్కో ముఖ్యమంత్రిది ఒక్కో స్టైల్. 1983లో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించాక కాంగ్రెస్ కోటకు బీటలు వారాయి. 

దేశమంతా ఇందిరకు వ్యతిరేక పవనాలు వీచినా తెలుగు రాష్ట్రం మాత్రం ఆమెను గౌరవించింది. అయితే, ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఇక్కడి ముఖ్యమంత్రులను లక్ష్యపెట్టేది కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి కూడా రెండు కారణాలు చెప్తారు. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ అతి కొద్ది నెలల్లోనే కాంగ్రెస్‌కు గట్టిగా ఎదురునిల్చింది. ఎన్టీఆర్‌కు అప్పటికే ఉన్న చరిష్మా, కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు, కొత్త నాయకత్వాల కోసం జనం తహతహ.. ఇవన్నీ కలగలిసి ఎన్టీఆర్‌ను అజేయుడిని చేశాయి.

అప్రతిహతంగా సాగుతున్న కాంగ్రెస్‌కు ఎన్టీఆర్ రూపంలో పెద్ద జట్కానే తగిలింది. అదే కాంగ్రెస్ పాఠశాలలో చదువుతున్న చంద్రబాబు అదనుచూసి ఎన్టీఆర్ పంచన చేరాడు. అప్పటినుండి చాలా రోజుల వరకు ఎన్టీఆర్-కాంగ్రెస్ దోబూచులాట కొనసాగింది. అయినా ఎన్టీఆర్ తన వ్యూహాలతో కాంగ్రెస్‌కు కొత్త తలనెప్పులెన్నో తెచ్చిపెట్టాడు. లక్ష్మీపార్వతి రూపంలో ఎన్టీఆర్ ప్రభావాన్ని తగ్గించే శక్తిని ఎవరు ప్రయోగించారో తెలియదు కానీ తెలుగునాట ఎన్టీఆర్‌ను కూల్చే పనిని చంద్రబాబు పూర్తిచేసి విజయం సాధించాడు. ఎన్టీఆర్ బతికుంటే ఏం జరిగేదో తెలియదు కానీ ఆయన మరణం చంద్రబాబు కలిసొచ్చింది. 

చంద్రబాబు ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు’గా వ్యవహరిస్తున్నాడని, ఆర్థిక సరళీకరణకు మద్దతుగా నిలుస్తున్నాడని వామపక్షాలు నిందించాయి. ‘మోనార్క్’లా ఉద్యోగులను శాసిస్తాడని, తెలంగాణ అన్న పదం లేకుండా చేస్తున్నాడని ఆందోళన మొదలైంది. బాబు పట్ల తెలంగాణ వైఖరి పెద్ద రహస్య విప్లవానికి దారితీసింది. అది కేసీఆర్ రూపంలో పుట్టుకొచ్చి ఉధృతమైంది. 

ఈలోపు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్‌లో సరికొత్త రాజకీయాలకు తెరతీసింది. దానికి సమాంతరంగా తెలంగాణ మలి దశ ఉద్యమం నడుస్తూ వచ్చింది. దానిని కేసీఆర్ తన నెత్తిన పెట్టుకొని నడిపించాడు. చంద్రబాబు ఊడలు పెరికి వై.ఎస్.అధికారంలోకి రాగానే కాంగ్రెస్ కొత్త జవజీవాలను పొందడమే కాక అదో ని యంతృత్వంలా మారింది. 

కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూ డా లెక్కపెట్టనంత తీవ్రతకు వైఎస్ ఆధిపత్యం ఎదిగిం ది. ఇక్కడున్న ప్రాంతీ య పార్టీలను ఎదుర్కోవడంలో వైఎస్ కూడా ప్రాం తీయ పార్టీ నేతలా ప్రవర్తించాడు. అధిష్ఠానం కూడా అంతకుముందు వ్యవహరించినట్లు వైఎస్‌ను తక్కువ చూపుతో చూడలేదు. టిక్కెట్ల కేటాయింపులో తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే అక్కడున్న కాంగ్రెస్ పెద్దలు అడ్డుకున్నట్లు మాట్లాడారని, దాంతో వైఎస్ విసురుగా లేచి ఏపి భవన్‌కు వెళ్లిపోతే ఏఐసిసి పెద్దలంతా అతడి వెంట పరుగెత్తారని గుసగుసలు వినిపించాయి. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాక తెలంగాణ ఉద్యమం తిరిగి పుంజుకుంది. ఈ మధ్యలో రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆపద్ధర్మ సీఎంగానే వ్యవహరించాడు గాని కాంగ్రెస్ ఆపదలను తీర్చలేకపోయాడు.

 ఆ తర్వాత ఏరి కోరి తెచ్చుకొన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు ఏం చేసినా చేయకపోయినా- రెండు ఘనకార్యాలు చేసి వెళ్లిపోయాడు. తెలంగాణ ఇచ్చే సమయంలో అతడు సీ ఎంగా ఉండడం, దీర్ఘకాలంగా కొనసాగుతున్న మ జ్లిస్-కాంగ్రెస్ స్నేహబంధానికి గండికొట్టడం. అంతేకాదు- ఏ ముఖ్యమంత్రి చేయలేని పని మజ్లిస్‌కు చెమటలు పట్టించడం! 

హైదరాబాద్‌లోని మహావీర్ భూముల విషయంలో మజ్లిస్‌తో తలపడడమేగాక అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టించడం కిరణ్‌కుమార్‌రెడ్డి రికార్డుగానే చెప్తారు.

స్నేహబంధానికి గండికొట్టడం. అంతేకాదు- ఏ ముఖ్యమంత్రి చేయలేని పని మజ్లిస్‌కు చెమటలు పట్టించడం! హైదరాబాద్‌లోని మహావీర్ భూముల విషయంలో మజ్లిస్‌తో తలపడడమేగాక అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టించడం కిరణ్‌కుమార్‌రెడ్డి రికార్డుగానే చెప్తారు.

తెలంగాణ ఏర్పాటు కోసం 1300 మంది ఆత్మహత్యలు చేసుకొన్నా స్పందించని కాంగ్రెస్ అధిష్ఠానం 2014లో తెలంగాణ ఇచ్చి అద్భుతం చేద్దామనుకొన్నది. ఇంతగా బాధపెట్టి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు సంతోషపడలేదు. తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ మొదట చెప్పినపుడు- నిమ్మకు నీరెత్తినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరించింది. అనంతరం కేసీఆర్ స్వంత వ్యూహంతో సరికొత్త రాజకీయం ప్రారంభించాడు. 

తెలంగాణను ఇచ్చి, ఆంధ్రా ప్రజలకు ‘ప్రత్యేక హోదా’ తాయిలంతో మభ్యపెట్టాలనుకున్న సోనియా వ్యూహం బెడిసికొట్టింది. కాంగ్రెస్ కోలుకొనే లోపు ఎన్నికలు రానే వచ్చాయి. ఈలోపు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో ఇక్కడ కనీసం కొత్త ఎత్తులు వేయడానికి కూడా వీలు లేక ఆ పార్టీ వెనక్కి తగ్గింది. ఈలోపు కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరిట అన్ని పార్టీల్లోని ముఖ్య వ్యూహకర్తలను తనవైపు తిప్పుకొన్నాడు.

కాంగ్రెస్ కన్నా భిన్నమైన పాలనకు కేసీఆర్ శ్రీకారం చుట్టాడు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు ఎక్కువ కాబట్టి ఏ నిర్ణయమైనా ఓ పట్టాన తేలదు. కానీ కేసీఆర్ ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తాడు కాబట్టి తెరాసలో అతడిదే అంతిమ నిర్ణయం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు దేశంలో సంచలనమే.

 ఎన్నో చక్రాలు తిప్పిన చంద్రబాబే కేసీఆర్‌తో పోటీపడలేకపోతున్నాడని విశే్లషకులు అంటున్నారు. అయితే, కేసీఆర్ పథకాల్లో అవినీతి జరిగిందనేది కాం గ్రెస్ ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ అవినీతి చేయకుండా ఒక్క పథకమైనా చేపట్టిందా? ఇక్కడ అజేయుడైన కేసీఆర్ కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్య! సుదీర్ఘ ఉద్యమ అనుభవం గల కేసీఆర్ భిన్నమైన ఆకాంక్షలు తెలిసినవాడనడంలో సందేహం లేదు. కొన్నిసార్లు ఆయన కటువుగా కన్పించినా అతని దయార్ద్ర హృదయం కూడా గొప్పదే అని అంటుంటారు. తన వెంట ఉద్యమం చేసినవారు, కొత్తగా తెరాసలోకి వచ్చినవారూ అందరూ ఆయన పట్ల భయం, భక్తీ రెండూ ప్రదర్శిస్తున్నారు. ఇదే కేసీఆర్ రాజకీయ వ్యూహం!

టీపీసీసీ అధ్యక్షుడిగా కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక బాధ్యతలు చేపట్టిననాడు ఆపద్బాంధవుడే. కానీ ఈ రోజు కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ‘మాస్’గా జనాన్ని ఆకర్షించే శక్తి అతనికి లేదని సొంత పార్టీలోనే గుసగుసలు! కాంగ్రెస్‌లో పూర్వం జి.వెంకటస్వామి, ఉప్పునూతల పురుషో త్తం రెడ్డి, ఎం. సత్యనారాయణ రావు, కేశవరావు, పాల్వాయి గోవర్థన్ రెడ్డి, వి.హనుమంతరావు బ్యాచ్ ఉండేది. వీళ్లంతా తెలంగాణ నేతలే. వాళ్ళు రోజూ పత్రికల్లో కన్పించి ఏది మాట్లాడినా ఎవరూ సీరియస్‌గా తీసుకొనేవారు కారు. 

ఇపుడు కేశవరావు కెసిఆర్ పంచన చేరగా, ఎం.ఎస్ బయటకు రావడం లేదు. హనుమంతరావు రోజూ టీవీల్లో కన్పిస్తాడు. గత ఎన్నికల్లో విహెచ్‌కు డిపాజిట్ దక్కలేదు. గ్రూపు రాజకీయాల్లో ఆరితేరిన డి.శ్రీనివాస్ తెరాసలో చేరినా ఇటీవల కేసీఆర్‌తో బంధం చెడిపోయింది. బీసీ నాయకులుగా కన్పించే మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌లకు రాష్ట్ర రాజకీయం నడిపే శక్తి ఇంకా సమకూరలేదు. 

కాంగ్రెస్‌లో ఇటీవల దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ గొంతులు బలంగా వినిపిస్తున్నాయి. అది అధిష్ఠానం వరకు చేరిందో లేదో? షబ్బీర్ అలీ మజ్లిస్ పార్టీ కార్యకర్తలా ఉంటాడని చెప్తారు. జైపాల్‌రెడ్డి అనర్ఘళమైన ఆంగ్లం తప్ప ఇంతవరకు చేసిన ఒక్క ఘనకార్యం లేదని వాళ్ల స్వగ్రామం మాడ్గులకు వెళ్లి అడిగినా చెప్తారు. లేకపోతే ఇష్టానుసారం జైపాల్ మాట్లాడుతున్నాడని, ఆయనకు ‘బాల్య ఖ్యాయల్’ (పిల్లచేష్టలు) వచ్చిందని కెసిఆర్ కడిగేసేవాడేనా? ఈ రోజుకూ కమ్యూనిస్టు పార్టీ పరిభాష మాట్లాడడమే అతని రాజకీయ వెనుకబాటుకు కారణం అంటారు. ఇక జానారెడ్డి సౌమ్యత కేసీఆర్ రాజకీయ వ్యూహాన్ని బద్దలు కొట్టేంత తీవ్రంగా ఉంటుందా? అని అసెంబ్లీ లాబీల్లోనే చెవులు కొరుక్కుంటున్నారు!

ఇక కాంగ్రెస్ కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ రేవంత్‌రెడ్డి అనేది మొన్నటి రాహుల్ సభలో సభికుల చప్పట్లే తెలియజేస్తున్నాయి. కానీ రేవంత్‌ను ఇంకొంచెం సేపు మాట్లాడించాల్సిందని అందరూ అంటున్నారు. నిజానికి రాహుల్ మాటల్లో కొత్తదనం ఏమీ లేదు. రోజూ అన్ని రాష్ట్రాల్లో చెప్తున్న విషయాలే గాక ఆయన మాట్లాడిన ప్రతి విషయం పరీక్షకు నిలిచిందే. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు తర్వాత నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాడు. 

రాఫెల్ యుద్ధ విమానాల గురించి మొన్న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడిన రాహుల్ సాయంత్రంలోపే ఫ్రాన్స్ ప్రభుత్వం చేసిన ప్రకటన ఆయన చెప్పిన విషయాన్ని తేలికపరిచింది. ‘నేను మాట్లాడితే భూమి బద్దలవుతుంది, నా ముందు నిలబడడానికి మోదీకి అర్హత లేదు..’ అన్న డైలాగులు ప్రజలకు వినడానికి బాగుంటాయి 

కానీ మోదీ వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి చేయలేదనే ఈ దేశం నమ్ముతోంది. లేకపోతే నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద ఉద్యమమే రావాల్సింది! రాహుల్ ఉపాధ్యక్షుడుగా ఉన్నా, అధ్యక్షుడుగా ఉన్నా ఒక్క రాష్ట్రంలోనైనా పార్టీని గెలిపించిన పాపాన పోలేదు. ఆయన స్వంతంగా వేసిన ఒక్క రాజకీయ వ్యూహం లేదు. గతంలో కన్నా అతని ‘పర్‌ఫార్మెన్స్’ బాగుందని మురిసిపోవడం కాంగ్రెస్ నేతల వంతు తప్ప- తెలంగాణ ప్రభుత్వాన్ని గడగడలాడించిందేమీ లేదు. 

కాంగ్రెస్ శ్రేణులకు ధైర్యం కలిగించాలంటే- కేసీఆర్ పాలనపై విధానపరమైన చర్చకు తెరలేపాల్సింది. కేసీఆర్, మోదీలను ఈ రోజుకూ ప్రజలు ఉత్తమోత్తమమైన రాజకీయ వ్యూహకర్తలుగానే చూస్తున్నారు. మోదీని ఎక్కువ సమయం తిడితే ప్రయోజనం లేదు. అందుకే రేవంత్ లాంటివాళ్లకు మాట్లాడే అవకాశం ఎక్కువ ఇవ్వాల్సిందని సోషల్ మీడియా విస్తృతంగా చర్చ జరిపింది. గతంలో కన్నా వ్యూహకర్తలు కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎక్కువమంది ఉన్నా సరైన వ్యూహం లేని రాహుల్ పర్యటన కార్యకర్తలకు కొంత ఉత్సాహం కలిగించిందే కానీ ఊహించినంత ఊపు తేలేదేని చెప్పాలి.


************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰


చాలా సినిమాల్లో ఓ హాస్య నటుడు ‘నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటుంటాడు. అది ఇటీవల తెలుగు దేశం వారికి ‘జాతీయం’గా మారి పోయింది. ముఖ్యంగా ఇపుడు చంద్ర బాబు పూటకోసారి ‘నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మనిషిని. నాకున్న రాజకీయ అనుభవం ఈ దేశంలో మోదీతో సహా ఎవరికీ లేదు’ అంటున్నాడు. ఆఖరుకు మొన్న చిన్న పిల్లలతో జ్ఞానభేరీ సభ పెట్టి అక్కడ కూడా ఢంకా బజాయించాడు.

మనల్ని గురించి ఇతరులు ఎవరైనా పొగిడితే ఆనందంగా ఉంటుంది. కానీ ఎవరికివారే నేను తిప్పిన చక్రాలు చూడండ¬ అని చెప్తే లేనిపోని అనుమానాలూ వస్తాయి. ‘ఇటువైపుకు పోవద్దు’ అని ఎక్కడైనా బోర్టు పెట్టండి. అటువైపు మళ్ళికూడా చూడని వాళ్ళంతా ఆ వైపుకే పోతారు. అలాగే నేను ‘ఇంత పోటుగాణ్ణి’ అని పదిసార్లు చెప్తే అనుమానం వెంటనే మొదలవుతుంది.

నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో చంద్రబాబు ఘనకార్యాలు నిజంగా చేసినవి కొన్ని ఉన్నా వాటిని పదేపదే చెప్పుకోవడం ఇటీవల ప్రజలకు విసుగు పుట్టిస్తోంది. ఢిల్లీలో జనతాపార్టీల చక్రాలు ఊడిపోయాక ఈ సైకిల్‌ చక్రం తిరిగింది నిజమే. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌తో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ ముందు వంగి వంగి దండాలు పెడుతోంది. దీనిని ఎన్టీఆర్‌ స్వర్గం నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ‘ఔరా! నా కరకమలములచే స్థాపించబడి కాంగ్రెస్‌ దుర్నీతిపై దునుమాడుటకు పుట్టిన నా తెలుగుదేశం నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో పడి నలిగిపోతున్నదే’ అని ఆయన ఓ డైలాగ్‌ కూడా చెప్పి ఉంటాడు. ఇంత గొప్పగా ఊదరగొడుతున్న చంద్రబాబు అనుభవం వైఎస్‌ ముందు ఎందుకు అష్టవంకర్లు పోయింది? చంద్రబాబు తిప్పిన చక్రాలు కేసీఆర్‌ కారు కింద ఎందుకు నలిగిపోయాయి? పట్టపగలే ఓటుకు నోటు కేసులో కొట్టుకొని మూటా ముల్లె పట్టుకొని అమరావతికి మొట్టమొదటే ఎందుకు పోయినట్టు? పోనీ ఈ బాబుగారి వల్ల కేంద్రంలో పొద్దు పొడిచిన దేవేగౌడ, గుజ్రాల్‌ వంటి మహామహిమాన్వితులైన ప్రధానులు ఈ దేశంలో చేసిన ఘనకార్యాలు ఎన్నో లెక్కగట్టి చెప్పగలరా? ఇవన్నీ వదిలిపెట్టి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని నాలు అరిగేలా ఎన్నిసార్లు చెప్పినా అది అపహాస్యమే అవుతుంది!
*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి