అనేక విధాలుగా ఉన్న మన ఆరాధనా పద్ధతులను అధ్యయనం చేసిన ఆదిశంకరులు ‘పంచ దేవతారాధన’ను పునరుద్ధరించారు.

‘‘ఆదిత్య మంచికా విష్ణుం గణనాథంచ మహేశ్వరమ్‌’’ ఆదిత్యుడు (సూర్యుడు), అంబిక (అమ్మవారు) విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు ఈ ఐదుగురిని పంచదేవతలంటారు. ఈ అయిదుగురితో కలిపి చేసే ఆరాధనను ‘పంచాయతనం’ అంటారు. నిజానికి మన దేవాలయ వ్యవస్థంతా ప్రతీకలమయం. దాని బాహ్యం మనల్ని ఆకర్షిస్తుంది అంతే. దాని అంతరంగం, అంతరార్థం వేరుగా ఉంటుంది. సృష్టి ఆధార భూతమైన పరమేశ్వరుని రంగస్థలం ఆద్యంతాలు లేనిది. అందులో ఈ పంచభూతాలు కూడా ఇమిడి ఉన్నాయని తెలిపే సంకేతం పంచభూతలింగాల్లో ఉంది. మానవ దేహం మొదలుకొని సృష్టి అంతా వ్యాప్తమైన ఈ పంచభూత స్థితికి చైతన్యం కల్పించేవాడు పరమాత్మ అనేది ఇందులో అంతరార్థం. విడిగా చూస్తే.. ఆకాశానికి శివుడు, వాయువుకు శక్తి, అగ్ని తత్వానికి సూర్యుడు, జలానికి విష్ణువు, పృథ్వీ తత్వానికి గణపతి ప్రతీకలు. మనలోని పంచభూతాలను గమనించి, వాటికి అధిష్ఠాన దేవతగా పరమాత్మను తెలుసుకోమని చెప్పడమే ఈ అయిదుగురు దేవతల ఆరాధన.

శ్రీకాళహస్తిలోని సువర్ణముఖి నదిలోని శిలను అంబికారాధనకు, మధ్యప్రదేశ్‌లో ప్రవహించే నర్మదా నది శిలలను శివలింగాలకు, కావేరి నదిలోని స్ఫటిక లింగాలను సూర్యారాధనకు, నేపాల్‌లోని గండకీ నదిలో లభించే సాలగ్రామాలను విష్ణువు ఆరాధనకు, బీహార్‌లో ప్రవహించే శోణభద్రా నదిశిలలను గణపతి ఆరాధనకు ఉపయోగించాలని ఆగమాలు చెబుతున్నాయి. 

శివే విష్ణౌ తథా శక్తా సూర్యేమయి నరాధిప
నాభే దుర్భుద్ధిర్యోగః ససమ్యగ్‌ యోగతమేమతః

శివ, విష్ణు, శక్తి, సూర్య, గణేశ.. అనే ఐదుగురు దేవతల గురించి చేసే సమష్టి ఆరాధన వల్ల కలిగే బుద్ధి యోగమని గణేశ పురాణం తెలిపింది ఈ దేవతల తత్వం అంతా యోగంలో భాగమే. తమస్సును పారదోలి మనుషుల్లో జ్ఞానాన్ని నింపే గురువులాగా ఆకాశమండలమంతా తన తేజంతో వెలుగులు నింపుతాడు సూర్యుడు. శరీరంలో కొన్ని భాగాలు ఆకాశతత్వం గలవి. మన ఎముకలు పటిష్ఠంగా ఉండాలంటే సూర్యనమస్కారాలు చేయాలి. 365 రోజులూ సూర్యుడుదయించే ఈ దేశంలో సూర్యారాధన మరచిపోయి ‘డి’ విటమిన్‌ మాత్రలు మింగుతున్నామంటే అంతకంటే దురదృష్టమేముంటుంది?

 ఇక.. శక్తి ప్రాణరూపంలో ఉంటుంది. ఆ తల్లిది వాయుతత్వం. అమ్మను ఆరాధించడమంటే ప్రాణారాధనే; జ్ఞానారాధనే. ఇక.. నీరు జగతికి ప్రాణాధారం. దాని అధిష్ఠాన దేవత నారాయణుడు. నీటిలో పోషకశక్తి, స్థితిశక్తి ఉన్నాయి. విష్ణువు అంటే వ్యాపించినవాడు. ప్రకృతికి ప్రతీక. భూమిలో మూడో వంతు జలమే, విష్ణుతత్వారాధన పోషకశక్తి ఆరాధనే. 

గణపతి పృథ్వీతత్వస్వరూపుడు. బుద్ధి, సిద్ధి రెండూ కలగాలంటే మనం ఈ భూమిపై జీవించాల్సిందే. అవి రెండూ గణపతి దగ్గరున్నాయి. విజాయమూలమైన ఈ రెండు సిద్ధులను పొందటానికే గణపతి ఆరాధన. ఇక.. మహేశ్వరుడు చిదాకాశరూపుడు. ఆయన ఆద్యంతాలను బ్రహ్మ, విష్ణువులే కనిపెట్టలేకపోయారు. నిరాకారతత్వానికి లింగం ప్రతీక. ఏమిలేనిదానికే లింగం (చిహ్నం) అని పేరు. ఆకాశతత్వమంటే అదే. ఈ పంచదేవతల ఆరాధన భౌతికంగా ఆధ్యాత్మికతను కల్గించి ప్రవర్తన మార్చుకొనేట్లు చేసి ఇహంలో సుఖం కలిగిస్తుంది. అంతర్ముఖులయి ఆరాధన చేస్తే ఆత్మజ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది.

******************************
  డాక్టర్. పి. భాస్కర యోగి
నవ్య : నివేదన: పరంజ్యోతి  
ఆంధ్రజ్యోతి : సోమవారం
22-04-2019



అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత
అవ్యక్తనిధనాన్యేవ తత్రకా పరిదేవనా

‘ఓ అర్జునా! ఈ ప్రాణులన్నీ పుట్టుకకు పూర్వం అవ్యక్తంగా ఉన్నాయి. మరణం తర్వాత కూడా ఎవరికీ కన్పించకుండానే ఉంటాయి. కానీ మధ్యలో మాత్రమే కన్పిస్తాయి. మరి అటువంటి వాటి గురించి శోకించడమెందుకు? అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. చావు పుట్టుకల మధ్య స్వల్ప కాలమే జీవితం. కానీ అలా ఎన్నడూ అనుకోం. కల్పాంతాలు మనమే జీవిస్తాం అనుకొంటాం. మనం తప్ప అందరూ మరణించేవారని అనుకుంటూ ఉంటాం. జీవితానికి సరిపడా నాలుగు రాళ్లు కూడబెట్టడానికి బదులు నాలుగు జీవితాలకు సరిపడే రాళ్లను ఇపుడే దాచేస్తాం. కానీ కుండలాంటి ఈ శరీరంలో నుండి ప్రాణం పోయాక గానీ మన శాశ్వతత్వం గుర్తుకు రాదు. ఈ మాయలో నిజమైన శాశ్వతుడు పరమాత్మను పట్టించుకోం. పరమాత్మ తన శాశ్వతత్వాన్ని గురించి ఎంత చెప్పినా మనం వినం. దానికి కారణం మాయ, సంసారం. మన శాశ్వతత్వాన్ని గురించి తెలిపేది ఒక కాలం మాత్రమే.

కాలం యొక్క శాశ్వతత్వాన్ని కూడా గమనించే శక్తి పరమాత్మదే. ‘‘ఏమీ లేనప్పుడు నేనే ఉన్నాను. ఏది ఉందో అందులో నా రూపమే ఉంది’’ అని చతుశ్లోకీ భాగవతంలో పరమాత్మ బ్రహ్మకు చెప్తాడు. కాలం అన్నింటినీ ధ్వంసం చేస్తుంది. కాలం కూడా ధ్వంసం చేయలేనిది ఏదో అదే నేను అంటాడు ఆది మధ్యాంత రహితుడైన పరమాత్మ. ఈ శరీరం లేనపుడు, ఉన్నపుడు, ఇది నశించాక కూడా ఆయన ఉంటాడు.

అందుకే అమ్మవారికి కూడా ‘వ్యక్తావ్యక్త స్వరూపిణి’ అని పేరు. శాశ్వతమైన దానిని లేదు అనుకుంటాం. . అశాశ్వతమైన దానిని శాశ్వతం అనుకుంటాం. దేవుని విగ్రహంపై మెరిసే వస్త్రం ఎలాగైతే ప్రతిమను కప్పిపెట్టి వస్త్రమే విగ్రహమన్నట్లు భ్రమింపజేస్తుందో సంపదలు, ఐశ్వర్యం, పదవులు... కూడా మనల్ని అలాగే భ్రమింపజేస్తాయి. అదే నిజమనుకుంటాం. అందుకే ఆదిశంకరులు ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య’ అన్నారు. సత్యము, శాశ్వతమైన బ్రహ్మను విస్మరించడంతో మాయాజగత్తు మహాసుందరంగా కన్పించి ఎన్నో పొరపాట్లు చేస్తున్నాము. పరమాత్మ అన్నింటిలో ఉంటాడు, అన్నీ అతనిలో ఉంటాయని శాస్త్రాలు చెప్తాయి. దీనికి ఇంకాస్త భిన్నంగా ఆలోచిస్తే అన్నింటిలో ఆయన ఉండి కూడా లేనివాడే! ఎలా? జలంలో తరంగాలున్నాయి. తరంగంలో జలం ఉంది. జలంలో తరంగాలు లేవు. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా కన్పిస్తాయి. జలం స్థిరంగా ఉన్నపుడు జలంలో తరంగం లేదు. తరంగాలు నాశనమైనా జలం స్థిరంగా ఉంది. తరంగాలు ఎన్ని గెంతులు వేసినా జలం అస్తిత్వం పోలేదు.

దీనిని మన శరీరానికి అన్వయిస్తే మన శరీరానికి ముందూ వెనుక మధ్య ఎల్లపుడూ ఆత్మ ఉంది. దాని విస్తృతి వల్లనే అన్నీ నేను అంటాం. సనాతనుడైన భగవంతుని వదలిపెట్టి నీటి బుడగలా పగిలిపోయే శరీరం గొప్పదని విర్రవీగుతాం. పరమ సత్యం విస్మరించి పరమాత్మ నుండి దూరమవుతాం. మన శాస్త్రాలు పరమాత్మను సర్వాంతర్యామిగా, సత్యస్వరూపిణిగా, చైతన్యమూర్తిగా సనాతనుడిగా వర్ణిస్తాయి. ఎప్పుడూ వ్యక్తంగా ఉంటూనే అవ్యక్తంగా భగవంతుడు ఎలా ఉన్నాడో తెలిస్తే సాకార-నిరాకార తత్వాల సమన్వయం మనకు అర్థమవుతుంది.

***************************
  డాక్టర్. పి. భాస్కర యోగి
నవ్య : నివేదన: పరంజ్యోతి
 

ఆంధ్రజ్యోతి : సోమవారం
08-04-2019

ఎన్నికలు జరిగే రోజు అన్ని మాధ్యమాల్లో తానే కన్పించడం ఎలా?- అని అనుకున్నాడు చంద్రబాబు. ప్రచారం ముగిశాక ప్రకటనలు, ప్రసంగాలు అంటే ఎన్నికల సంఘం ఒప్పుకోదు కాబట్టి ఆయన మెదళ్లో తటుక్కున ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఏదో ఒక నెపంతో ఏపీ ఎన్నికల సంఘం అధికారి ద్వివేదిని కలిసి, ధర్నా చేస్తే- పోలింగ్ రోజున అదే వార్తఅవుతుందని అనుకున్నాడు. ఇద్దరు ఎస్పీలను,కొందరు సీఐలను ఎన్నికల సంఘం బదిలీ చేసిందని అడగడానికి బాబు వెళ్లాడు. కానీ మళ్లీ అక్కడ మోదీ, జగన్, కేసీఆర్, లోటస్‌పాండ్ కుట్ర, వీవీ ప్యాట్ల లెక్కింపు, ఐటీ దాడులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, మోదీ నియంతృత్వం, సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం, కేకే శర్మ ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, వ్యవస్థల విధ్వంసం, సేవ్ ఇండియా- సేవ్ డెమోక్రసీ, మోదీ పెత్తనం.. ఇలా రోజూ వల్లిస్తున్న మాటలనే మళ్లీ ప్రస్తావించాడు.

 19 రాష్ట్రాల్లో నెలకొన్న ఎన్నికల హడావుడిని విడిచిపెట్టి ఏపీలో సిఐలను మోదీ బదిలీ చేయిస్తాడా? ఈమాత్రం విచక్షణను సైతం పాటించకుండా ఎన్నికలకు ముందురోజు ప్రసార మాధ్యమాలన్నీ ‘ఈసీకి వార్నింగ్ ఇచ్చిన బాబు’ అంటూ శీర్షికలు పెట్టి తెలుగు ప్రజలకు చూపించి తరించిపోయాయి! ఈ ప్రచారం కూడా సరిపోదనుకుకొన్న మీడియా ‘దేవాన్ష్ ఆటలో మునిగిపోయిన బాబు’ అంటూ మరో క్యాప్షన్‌తో ఇంకోరకమైన ప్రచారం చేసింది! 2018 ఫిబ్రవరిలో భాజపాతో పొత్తు వికటించిన నాటినుండి మొదలైన ఈ ‘నిర్బంధ దృశ్యాలు’ మనస్సు నిండా కాస్తంతైనా ఖాళీ లేకుండా నిండిఉన్నాయి. మనసా! రిలాక్స్ ప్లీజ్!

తాడూ బొంగరం లేకుండా తీవ్రవాద సంస్థల, మిలట్రీ సహకారంతో పాక్ ప్రధానిగా గద్దెనెక్కి కూర్చొన్న స్వలింగ సంపర్కుడు ఇమ్రాన్‌ఖాన్ ‘మోదీ మళ్లీ గెలవాలి’ అని ఓ స్టేట్‌మెంట్ ఇస్తే, దానిపై కేజ్రీవాల్ నుండి రాహుల్ వరకు ఒంటికాలిపై లేచారు. ‘ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలను విదేశాలు ప్రభావితం చేయడం అంటే ఇదే’ అంటూ కశ్మీర్ వేర్పాటువాద నాయకుల ఇళ్లముందు శీర్షాసనాలు వేసి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించడం విడ్డూరం. 

రోజూ చైనా భక్తితో పులకించిపోయే కమ్యూనిస్టులు విదేశాలు భారత్‌ను ప్రభావితం చేస్తున్నాయని ‘మోదీ ప్రభుత్వాన్ని’ గురించి చెప్పడం ఎనిమిదో వింత కాదా? మోదీ తరఫున ఇమ్రాన్ బ్యాటింగ్ చేస్తున్నాడని మరో కమ్యూనిస్టు గెరిల్లా వీరుడు చెప్తుంటే జాతీయ టీవీ ఛానళ్ళు నోరెళ్ళబెట్టడం తప్ప ఇంకేం చేస్తాయి? ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏది మాట్లాడినా అది పరమ పవిత్రం!? ఇక 150 ఏళ్ళ వృద్ధ కాంగ్రెస్ యథాలాపంగా ‘మోదీకి నవాజ్ షరీఫ్, ఇమ్రాన్‌ఖాన్‌లతో సత్సంబంధాలు ఉన్నాయని’ రణదీప్ సూర్జేవాలా ద్వారా వ్యాఖ్యానించింది. కశ్మీర్‌కు మరో ప్రధాని కావాలని అంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాకు కాంగ్రెస్‌తో తమకు వున్న సంబంధాలను గు రించి వివరణ ఇస్తే బాగుండేది. ‘మీకూ మాకూ ఉమ్మడి శత్రువు మోదీ’ అని పాక్ టెలివిజన్‌లో బహిరంగంగా ప్రకటించిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై ఇలాగే, ఇంతే స్పీడుగా స్పందిస్తే బాగుండేది.

ఇక రాఫెల్ వివాదంపై ‘హిందూ’ పత్రిక ఇస్తున్న ఆధారాలపై రోజూ టీవీల్లో మాట్లాడే రాహుల్ ఎన్నికల ముందురోజు సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ గురించి తన పాత రికార్డింగ్ మళ్లీ తిరగేస్తారు. హిందూ పత్రిక వార్తలే కాంగ్రెస్ పార్టీకి రాఫెల్‌పై ఆధారాలు! రామజన్మభూమి వివాదంపై సమయం లేదంటూ వాదనలు వాయిదా వేసిన సుప్రీం కోర్టు ఎన్నికల ముం దురోజు నర్మగర్భ వ్యాఖ్య లు చేయడం మోదీ ప్రభుత్వానికి ఇరకాటమే! తలాతోకా లేకుండా కోర్టు వ్యాఖ్యలను రంగులద్దే మన పత్రికలకు, ప్రసార మాధ్యమాలకు పండగే పండుగ. తమకు కావలసిన భాగాలను క్వశ్చన్ మార్కులతో, ఆశ్చర్యార్థాకాలతో నింపే ప్రచార, ప్రసార మాధ్యమాలు నచ్చనివారిపై వెనుకనుండి చాకులా గుచ్చేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక తెలుగు లోగిళ్లలో ముగిసిన ఎన్నికలతోనైనా ఈ కువ్యాఖ్యలకు తెరపడితే బాగుంటుంది. అప్పుడైనా కాస్త ‘మనసా! రిలాక్స్ ప్లీజ్!’ అనుకొంటాం.

ఇక ‘పదహారు-సారు-కారు’ నినాదంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విజయగర్వం, ఇతర పార్టీల నేతలపై చేస్తున్న అశ్వమేధయాగ సఫల ప్రయోగంతో మంచి జోరుమీదున్న కేసీఆర్ గుంపునకు ఈ ఎన్నికల తర్వాతనైనా విశ్రాంతి దొరుకుతుందా? దాదాపు వంద అసెంబ్లీ సీట్లు గెలిచిన వ్యక్తి, 16 ఎంపీ సీట్లు గెలుస్తానని ప్రకటిస్తున్న తెలంగాణ శక్తి ‘వెంటనే ప్రధాని అయిపోతాను’ అంటే 200 సీట్లు గెలిచే పార్టీలు ఇంకేం పదవి కోరాలి? అని కేసిఆర్ వ్యతిరేక శక్తులు ప్రశ్నిస్తున్నాయి. ఇపుడు రాష్ట్రానికో ప్రధాని అభ్యర్థి ఉండడం మన హద్దులు మీరిన ప్రజాస్వామ్య వ్యవస్థకు తగిన శాస్తే! ‘అందరిలో నేను ఉండాలి అనుకోవడం ప్రకృతి; అందరూ నాలోన మాత్రమేండాలనుకోవడం వికృతి’- ఈ లక్ష్యం కేసిఆర్ పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితం ఇపుడు తెలియదు. తీవ్రమైన అణచివేతకున్న పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి.
 రాజకీయాల్లో అణచివేతకు తావులేదు. ఎ న్నికలు - ఫలితాలు, జయాపజయాలు ఎవరి స్వంతం కాదు. కేసీఆర్ పార్టీ 2004లో తెలంగాణ ప్రాంతంలోని 107 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలకు పోటీ చేసి 26 మాత్రమే గెలిచింది. పాలమూరులో అంత ఉద్యమ సమయంలో భాజపా తరఫున యెన్నం శ్రీనివాసరెడ్డి గెలిచాడు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిచాడు. టిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మట్టిగరిచారు. ఇదంతా ఓ క్రీడ! కేసిఆర్‌ను ఇప్పటికీ తెలంగాణ ప్రజలు గొప్ప ఉద్యమ నాయకుడిగానే చూస్తున్నారు. మిగతా అంతా దానిచుట్టూ అల్లుకున్న గూడు. ఉద్యమం తన ప్రత్యర్థులపై చేస్తే ప్రజలకు గొప్ప చర్యగా కన్పిస్తుంది. కానీ స్వీయ సమాజంపై దాడి జరుగుతుందని భావిస్తే అది నిశ్శబ్ద విప్లవం అవుతుంది. అది కనిపెట్టకుండా చేసే చర్యలన్నీ గొప్ప వ్యూ హాలుగా కన్పిస్తాయి. కానీ అది తలకిందులైతే ఇపుడు మూటగట్టుకొన్న గొప్పతనమంతా కొట్టుకుపోతుంది. ఎన్నికల తర్వాతనైనా కేసిఆర్‌కున్న ‘స్టేట్స్‌మెన్’ హోదా నిలబెట్టుకోవాలంటే- మనసా! రిలాక్స్ ప్లీజ్! అనాల్సిందే.

ఇటీవల భారతీయ మీడియాకు, ప్రతిపక్షాలకు భాజపా పెద్దలైన ఎల్.కె.అద్వానీ, యం.యం.జోషీలపై ప్రేమ ఎక్కువైంది. ఒకప్పుడు మోదీ కన్నా ఎక్కువగా ద్వేషించి ‘ఉక్కుమనిషి’లాంటి అద్వానీని ప్రధానిగా కాకుండా చేసిన ఈ వర్గమే ఇటీవల ఆయనపై ప్రేమ ఒలకబోస్తోంది! జనసంఘ్ రూపంలో వచ్చిన పార్టీ 1951లో పూర్తి రూపం ధరించి 1952 ఎన్నికల్లో 94 మంది అభ్యర్థులను దించారు. 4 స్థానాలను 3.1 శాతం ఓట్ల బలంతో గెలిచింది. రెండవ లోక్‌సభ ఎన్నికల్లో 130 స్థానాలకు ప్రయత్నించినా 4 స్థానాలను గెలిచింది. 1962లో 196 స్థానాలకు పోటీ చేసి 14 స్థానాలు, 1967లో 35 స్థానాలు, 1971లో 22 స్థానాలు సాధించింది. ఇక భారతీయ జనతా పార్టీ రూపంలో 1980 దశకంలో ఇద్దరు గొప్ప నేతలు వాజపేయి, అద్వానీలు ముందుండి పార్టీని నడిపించారు. ఒకపుడు రెండు స్థానాల్లో గెలిచిన పార్టీని అద్వానీ తన రథయాత్రతో దేశ నలుచెరగులకు విస్తరించాడు. ఆనాడు రథయాత్రను బిహార్‌లోకి రాకుండా అడ్డుకున్న లాలూకు ఆనాడు అద్వానీ ప్రమాదకారి; ఇపుడు మోదీ!? అద్వానీపై మతోన్మాద ముద్రవేసి, అపఖ్యాతిపాలుచేసి కీలకపదవులు రాకుండా చేసిన కాంగ్రెస్‌కు ఇపుడు అద్వానీ గొప్ప నాయకుడు. లోక్‌సభలో ‘అక్రమ ప్రభుత్వం’ అని యూపిఏ ప్రభుత్వాన్ని అద్వానీ విమర్శిస్తే సోనియా స్వయంగా లేచి నిలబడి తమ ఎంపీలను ఆయనపైకి ఉసిగొల్పింది. అలాంటి నాయకురాలి పుత్రరత్నం రాహుల్ ఆయనపై సానుభూతి ప్రకటించడం విచిత్రం!? ఇటీవల యథాలాపంగా ఓ పెద్దమనిషిగా అద్వానీ ‘నాయకులు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా చూడాలి తప్ప శత్రువులుగా చూడవద్దని’ చెప్తే, ఇది అన్ని పార్టీలకు వర్తించదా?

 ఒకపుడు మాజీ ప్రధాని చంద్రశేఖరో, వాజపాయో లోక్‌సభలో ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే అన్ని పార్టీలు వాటిని గౌరవంగా స్వీకరించేవి. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు టిక్కెట్ నిరాకరిస్తే అది పెద్దలను అవమానించడమా? ఇపుడు అద్వానీ గొప్పతనం ప్రతిపక్షాలకు, మీడియాకు గుర్తొచ్చిందా? చక్రాల కుర్చీలో కరుణానిధి, వయోభారంతో దేవెగౌడ, నడవలేని ఘనీఖాన్ చౌదరి, జైల్లో ఉన్నా రాజకీయాలు చేసే లాలూ, మూతివంకరపోయి మాట్లాడలేకపోతున్న శరద్ పవార్, రాష్ట్రాలను కుటుంబాలకు రాసి ఇచ్చిన నాయకులను చూశాక ఇలాంటి పదవీ విరమణ కొందరికి విడ్డూరంగానే కన్పిస్తుంది. 1997 జూన్‌లో కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి (1977 తర్వాత మొదటిసారి) ఎన్నిక జరిగింది. సుమారు 7500 మంది ప్రతినిధులు ఎన్నుకున్న అధ్యక్ష పదవికి సీతారాం కేసరి, శరద్ పవార్, రాజేశ్ పైలెట్ పోటీ పడ్డారు. అందులో సీతారాం కేసరికి 6224 (82.5 శాతం), శరద్ పవార్‌కు 882 (11.7 శాతం), రాజేశ్ పైలెట్‌కు 97 (1.2 శాతం) ఓట్లు లభించాయి. భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరికి సోనియా బాధ్యతలు చేపట్టాక ఎలాంటి అవమానం జరిగిందో ఇప్పటివారికి తెలుసా? ఇలాంటి చరిత్రలు తవ్వి తీస్తే చాలా ఉంటాయి! మనసా! రిలాక్స్ ప్లీజ్!!

చిన్న దెబ్బవల్ల ఒక వ్యక్తి పిచ్చివాడయ్యాడు. ఈ డెబ్భై ఏళ్ళ ప్రజాస్వామ్యంలో దాదాపు అందరూ పిచ్చివాళ్లుగా మారారనుకొందాం. ఇక పిచ్చివాళ్లకు చికిత్స చేసే అవసరం ఉండదు. అదే మనకు కలిగే లాభం. పిచ్చివాడు తనకు పిచ్చిలేదని చెప్పడమే వాడి లక్షణం. ఇక రోగగ్రస్తునికి మనం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేం. ఇపుడు మన పరిస్థితి ఇలాగే ఉంది. అన్నిరకాల అవలక్షణాలను అందంగా ముస్తాబు చేయడం నేర్చుకొన్న మనకు ఎవరైనా పిచ్చిలేని వ్యక్తి కన్పిస్తే తట్టుకోలేని స్వభావంలోకి దిగజారిపోతాం. అందుకే ఈ ఏడ్పులు.. పెడబొబ్బలు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మనసా! రిలాక్స్ ప్లీజ్!! *

************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *
* శుక్రవారం : ఏప్రిల్ 12 : 2019 *



‘రెవిన్యూ అవినీతి’ ఇంకెన్నాళ్లు..?

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకొంది. స్థానిక కోర్టు భవనంలో కొంత భాగం ‘మా పూర్వీకులదని’ ఓ తెలుగుదేశం నాయకుడు ఆ ప్రాంగణంలో హద్దురాళ్లు పాతాడు. దీన్ని విచారించేందుకు జిల్లా న్యాయాధిపతి ఆ పట్టణానికి వచ్చాడు. విచారణ లోతుగా జరగ్గానే దీనికంతటికి రెవిన్యూ అధికారుల అవినీతి కారణమని జడ్జి గ్రహించారు. వెంటనే మండల రెవిన్యూ అధికారిని కోర్టుకు పిలిపించారు. అతను చేసిన తప్పులను గుర్తుచేస్తూ జడ్జి గట్టిగా మందలించాడు. ‘కోర్టు భవనాన్ని ఇలా వివాదాస్పదం చేయడానికి నీకు సిగ్గులేదా?’ అన్నాడు. రెవిన్యూ అధికారి మిన్నకుండిపోయాడు. ఈలోపు అక్కడన్న ఓ సీనియర్ న్యాయవాది ఇంకో రహస్యం బయటపెట్టాడు. ‘ఇదే రెవిన్యూ అధికారి తమ కార్యాలయం స్థలాన్ని కూడా విరాసత్ చేశాడని’’. భూస్వామి అయిన ఓ దాత సీలింగ్ చట్టం వచ్చాక తన స్థలాలను ప్రజల అవసరాల కోసం రెవిన్యూ కార్యాలయానికి, ఓ పాఠశాలకు, ఇతర కార్యాలయాలకు దానపూర్వకంగా ఇచ్చాడు. ఆయన మరణానంతరం వారి కుమారుల వద్ద లంచం పుచ్చుకొన్న అక్కడి రెవిన్యూ ఆఫీసు సిబ్బంది దాత ఇచ్చిన భూముల్లో ఉన్న తమ కార్యాలయాన్ని కూడా ‘విరాసత్’ చేశారని సదరు న్యాయవాది జడ్జికి చెప్తే ఆయన అవాక్కయ్యాడు.

ఇదంతా ఎందుకు ప్రస్తావన చెయ్యాల్సి వచ్చిందంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రెవిన్యూ శాఖ’పై చేయదలచిన ‘ప్రక్షాళన’ గురించి చర్చ జరుగుతున్నందుకు! నిజంగా రెవిన్యూ శాఖలో ప్రక్షాళన జరిగితే ప్రజా సమస్యలకు మనం సగం పరిష్కారం కనుగొన్నట్లే. కేసీఆర్ ఇందులో విజయవంతమైతే నిజంగా ‘తెలంగాణ జాతిపిత’గా మారిపోవడం తథ్యం. ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు పాలాభిషేకాలు చేసి కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడిని లోబరచుకున్నాం అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఇవన్నీ పసిగట్టలేని అమాయకుడు కాడు కేసీఆర్. కేసీఆర్‌ను నియంత అని అంటున్నవాళ్ళుకూడా ఇది సత్ఫలితాలిస్తే నోటికి తాళం వేసుకోవాల్సిందే. ఉన్నత స్థానాల్లో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు కఠినంగా అనిపించినా అవి తర్వాత సాంత్వన కలిగిస్తాయి.

తాజా ఉదాహరణ చూస్తే- మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్ విధుల పట్ల బాధ్యత లేని కొందరు టీచర్లను సస్పెండ్ చేశారు. దాంతో బాధ్యత లేకుండా తిరిగే వ్యక్తులకు బాధ్యతలు గుర్తొచ్చాయి. కొందరు ఉపాధ్యాయులు కలెక్టర్ చర్యకు లోలోపల తిట్టుకున్నారు. కానీ, ఇటీవల ఎన్నికల నిర్వహణకు వెళ్లిన అధికారులకు, క్లర్కులకు అద్భుతమైన భోజన వసతులను కల్పించి, అర్ధరాత్రి బస్సులను ఏర్పాటుచేసి వారి స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చారు. సరే! ఇంకా కొన్ని జిల్లాల్లో బాగా జరిగి ఉండవచ్చు కానీ కఠినమైన వ్యక్తిలా కన్పించే రొనాల్డ్‌రాస్ ఇన్ని ఏర్పాట్లు ఇంత చక్కగా చేశారని అదే టీచర్లు సామాజిక మాధ్యమాల్లో పొగడ్తలు గు ప్పించారు. దీనికి కారణం ఏమిటి? అన్ని చోట్లా అధికారులు ఉన్నారు కదా! అధికారి అవినీతిపరుడైతే ఎక్కడ ఎం త డబ్బు మిగిలించుకోవాలో చూస్తాడు. ఆయన అలా అనుకోలేదు కాబట్టి ప్రతి పోలింగ్ బూత్‌లో ఫ్యాన్లతో పాటు ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయించాడు. అక్కడ మాత్రమే చురుగ్గా వా రంతా ఎందుకు పనిచేశారు? చేయించే నాయకుడు అదే ఉత్సాహంతో, నిబద్ధతతో ఉన్నాడు కాబట్టి!

ఇపుడు కేసీఆర్ తీసుకోబోయే రెవిన్యూ శాఖ ప్రక్షాళన నిర్ణయం కేవలం ఆ శాఖకే పరిమితం కాదు. రెవిన్యూ శాఖ చుట్టే మున్సిపల్, పంచాయితీ, న్యాయవ్యవస్థ, రోడ్లు, భవనాలు, రిజిస్ట్రేషన్.. ఇలా అనేక శాఖలు తిరుగుతున్నాయి. ఉదాహరణ ఒక భూమి మధ్య నుండి ప్రభుత్వం రోడ్డువేస్తుంది. కొంత భూమి కోల్పోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. నష్టపరిహారం ఇప్పించేవరకే ఈ శాఖలు పనిచేస్తున్నాయి. రెవిన్యూ రికార్డుల్లో సరిగ్గా కొలిచి దానిని తొలగించడం లేదు. వాళ్ల ఖాతాల్లో మొత్తం భూమి అలాగే నమోదు అవుతున్నది. కొనే్నళ్ల తర్వాత భౌతికంగా తమకు భూమి లేకున్నా రికార్డుపరంగా వున్న హక్కును అతను ఉపయోగించుకొని కోర్టులు- చట్టాలను తమకు అనుకూలంగా ఉయోగించుకొని ఆర్డర్లు తెచ్చుకొని వివాదాలకు కారణమవుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడి నుంచి ఎంపీ వరకూ నాయకులు అధికారులకు ఫోన్లుచేసి వత్తిళ్లు తేవడం సర్వసాధారణం. అధికారంలో ఏ పార్టీ వున్నా వ్యక్తిగత వివాదాల విషయంలో పోలీసులను, రెవిన్యూ వ్యవస్థను స్వతంత్రంగా పనిచేసుకోనివ్వాలి. అలసత్వంతో, లంచగొండితనంతో, జవాబుదారీతనం లోపించిన అధికారులపై తీవ్ర చర్యలుండాలి. నిజానికి పటేల్-పట్వారీ వ్యవస్థ ఉన్నపుడు రికార్డులు వాళ్ల చేతిలో సురక్షితంగా ఉండేవి. ఇపుడు మన రికార్డులు రోగగ్రస్తం అయ్యాయి. వాటి నుండి ఎలా న్యాయ వివాదాలు పుట్టించవచ్చో రెవిన్యూ అధికారులకే బాగా తెలుసు.

1984కు ముందు గ్రామాన్ని ఒక్క పట్వారీ వ్యవస్థ పీల్చుకుతింటే ఇపుడు- న్యాయవ్యవస్థలో కూడా సత్వర న్యాయం లేకపోవడం, ధర్మంలేని న్యాయం నడవడం, అన్నీ కాగితాలకే పరిమితం కావడంవల్ల చట్టాలు దుర్వినియోగమవుతున్నా ఏమీ చేయలేని స్థితి. ఇపుడంతా కాగితాల కొట్లాట. గ్రా మాల్లోనే లోక్ అదాలత్‌ల్లా ‘గ్రామ న్యాయాలయాలు’ ప్రోత్సహించాలి. స్థానికులకు ఒక సమస్యపై కింది స్థాయి పరిజ్ఞానం ఉంటుంది. అందువల్ల అక్కడ న్యాయం కన్నా ధర్మానికి ప్రాధాన్యత ఉంటుం ది. కోర్టులే లోక్ అదాలత్‌లతో సమస్యలను రాజీ పద్ధతిలో పరిష్కరిస్తుండగా- గ్రామ న్యాయాలయాలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించకూడదు.

సంక్షేమ పథకాలతోపాటు ప్రజలకు నైతికత నేర్పించాలి. దానివల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. 90వ దశకంలో రామాయణం సీరియల్ ప్రసారం అవుతున్నపుడు గుజరాత్ పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదు తగ్గింది. వ్యక్తిగత నైతికతకు పెద్దపీఠం వేయాలి. గ్రామ న్యాయాలయాలకు చేరువలో దోషి, ఆరోపించిన వ్యక్తి, సాక్షి, సభ్యులు ఉంటారు. అందువల్ల సత్వర పరిష్కారం ఉంటుంది. అది వెర్రితలలు వేయకుండా చూడాలి! అలాగే కొన్ని బూజుపట్టిన భూ చట్టాలను భూస్థాపితం చేయాలి. ఉదాహరణకు తెలంగాణలో రక్షిత కౌలుదారు చట్టం (పి.టి.యాక్ట్) ఉంది. దానికి ఒక నియంత్రణ తేదీ లేకపోవడంతో భూ వివాదాలపై కుప్పలుగా కేసులు పేరుకుపోతున్నాయి. కోర్టుల సమయం, ప్రజల మధ్య స్పర్థలు పెరుగుతున్నాయి. డెబ్భై ఏళ్ళ క్రితం వచ్చిన చట్టం వల్ల- రావణకాష్టంలా కేసులు రాజుకుంటున్నాయే తప్ప పరిష్కారం శూన్యం. రెండు తరాల వాళ్లు వెళ్లిపోయాక కూడా ఇంకా వారసులుంటారా? చాలా జిల్లాల్లోని రెవిన్యూ కార్యాలయాల్లో పి.టి రిజిస్టర్లు ఎపుడో మాయం చేశారు. మాన్యువల్ అయినా, కంప్యూటర్లు చేసినా బాధ్యతగల వ్యక్తుల చేతుల్లో ఈ వ్యవస్థను ఉంచడం సాధ్యం కాదా? బ్యాంకుల్లో క్యాషియర్ జాగ్రత్తగా లేకపోతే పరిస్థితి ఏమిటి? ఆసుపత్రుల్లో సర్జన్ జవాబుదారీతనంతో లేకపోతే ఎలా? అక్కడ నూటికి తొంభై శాతం పొరపాట్లు లేకుండా వ్యవస్థ నడుస్తుంటే ఇక్కడ అంతమాత్రం కూడా ఏర్పాటు చేసుకోలేమా? మనల్ని మనం ఎప్పుడూ మోసం చేసుకుంటూనే ఉంటాం.

అధికారులు అనగానే టి.ఎన్.శేషన్‌లా చీల్చి చెండాడే చండప్రచండుడైనా ఉండాలి లేదా ఏమీ పట్టించుకోని నిర్వికార నిరంజనుడైనా అయి ఉండాలి. ఈ దరిద్రం ప్రజల మెదళ్ల నుండి పోవాలి. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు, రోజువారీ బాధ్యతలను విభజించాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ఇవి లేనందువల్ల జవాబుదారీతనం ఉండడంలేదు. ఇపుడు తెలంగాణలో ఎవరిని అడిగినా కొన్నాళ్లుగా ఎన్నికల బాధ్యతల వల్ల ఏ పనులూ కావడం లేదనే చెప్తారు. రెవిన్యూ శాఖ మండల స్థాయిలో హృదయ పూర్వకంగా పనిచేయడంలేదు. తమకు ఏమీ లాభం లేనందువల్లనే ‘ధరణి’ వెబ్‌సైట్ ఇన్ని అపశ్రుతులకు గురైందంటున్నారు. పదే పదే తప్పులు చేయడం, అవి దిద్దేందుకు మళ్లీ లంచాలడగడం షరా మామూలు అయిందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ పరిధిలో ఇలాంటి ధోరణే. వ్యవస్థలోని లోపాలను అధికారులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు బాగా ఉపయోగించుకొంటున్నారు. ఇదంతా నైతికత, జవాబుదారీతనం లోపించడమే.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కేవలం పాలితులే కారు. వారు భాగస్వాములన్నది మరచిపోయాం. బఱ్ఱె ఏం తిన్నా సరే మనకు పాలిస్తే చాలు అన్న భావన ఎక్కువవుతున్నది. ఇటీవల సామూహిక అవసరాల కన్నా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యత పెరిగిపోతోంది. దానివల్ల అపరిమితమైన స్వార్థం పెరిగి వ్యక్తిగత లాభాపేక్ష కోసం వ్యవస్థలను మటుమాయం చేస్తున్నారు. ‘సుపరిపాలన, చట్టసభలు, న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ, ప్రయివేటు రంగం, సమాజం వంటివి అందరు భాగస్వాములకు వర్తిస్తుంది. పాపులర్ ప్రోయాక్టివ్ గుడ్ గవర్నెన్స్ (ప్రజాదరణ పొందిన క్రియాశీలక సుపరిపాలన) అవసరమ’ని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు చెప్పిన మాట అక్షరసత్యం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చక్కని ఫలితాలు రాబట్టవచ్చు.

ఇపుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అత్యద్భుత పథకాలు. వాటిలో లోపాలు మాత్రమే చూస్తే వాటి నిర్మాణ పనులు కాంట్రాక్టర్ కళ్లలో మొదలవచ్చు కానీ, అంతిమ ఫలితం గొప్పగా ఉందన్న విషయం మరువవద్దు. ఇది విజయవంతం అయితే కేసీఆర్ నిజంగా భగీరథుడే. పూర్తి సఫలం తప్పక అవుతుంది. ఎందుకంటే గుజరాత్‌లో మోదీ దీనిని సక్సెస్ చేశాడు. 21వ శతాబ్దం నుండే గుజరాత్ నీటి కొరతను ఎదుర్కొన్నది. అందుకు మోదీ ప్రజలే సారథులుగా, ప్రభుత్వమే వారధిగా ఓ ప్రయత్నం చేశాడు. 2011 నాటికి గుజరాత్‌లో 1,44,000 చిన్న, పెద్ద డ్యాములు, 1,22,000 చెరువుగట్లు, 2,49,000 చెరువులు నిర్మాణం చేశారు. 6 లక్షల జల సంరక్షణ పథకాలు, చెరువుగట్లు నిర్మించారు. వీటి సహాయంతో 22 నదుల్లోని నీటిని 206చోట్ల నిల్వ చేసేందుకు వీలుపడిందని రాజనీతివేత్త అనిల్ మాధవ్ దవే మెచ్చుకొన్నారు. విదేశీ డబ్బులతో ఉద్యమాలు చేసే మేథాపాట్కర్ లాంటి వాళ్ల ప్రయత్నాలను భగ్నం చేస్తూ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10,600 గ్రామాలకు, 103 నగరాలకు నీటిని అందిస్తున్నారు. ఇదంతా నాయకుడు, అధికారుల నిజాయితీ, ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమైంది.

తెలంగాణలో అలా జరగాలంటే పాతుకుపోయిన అవినీతి అంతం కావాలి. లేదంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పప్పుబెల్లాల్లా పంచుకున్నట్టే అవుతుంది. కేసీఆర్ ఉద్యమం కాలంలో చెప్పిన రెండు గొప్ప విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ‘పోలీసులు కేవలం డ్యూటీ చేస్తున్నారు. వారికి నైతిక శిక్షణ లేదు, ఒకవేళ వారికి నైతికతను గుర్తించే శిక్షణ ఇస్తే సమాజంలో గొప్ప మార్పులు ఆశించవచ్చు. అలాగే ‘సమష్టి కులాల పాఠశాల విధానం ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నది రెండవ మాట. ఇపుడు ఉద్యోగుల్లో, నాయకుల్లో ఇలాంటి నైతికత రావాలి. గురుకుల విద్యలో సక్సెస్ అయినప్పటికీ కులాల వారీగా కాకుండా, అన్ని కులాలవారు కలిసి చదివే విధానం తక్షణ అవసరం. అందులో పడుతున్న వేర్పాటు బీజాలు రాబోవుకాలంలో సమాజంలో ఒక అసహన వాతావరణం కలిగిస్తాయి. ఈ రెండూ కేసీఆర్ చేయగలిగితే ఇపుడు జరుగుతున్న చర్చ సఫలమవుతుంది. ఎప్పటిలాగే గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుకొనే విధానంలో నడిస్తే రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతాయి. అన్నింటినీ మించి చట్టాలు, న్యాయాలు ఎలా వున్నా ప్రతి వ్యవస్థలోని నైతికతకు, మనస్సాక్షికి లొంగి ఉండాలి. అదే అసలు ప్రజాస్వామ్యం. *


************************************

 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *
* శుక్రవారం : ఏప్రిల్ 19 : 2019 *


కుహనా లౌకికవాదం ఇంకెన్నాళ్లు?



ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మూడు రోజులు, మాజీ సీఎం మాయావతి ప్రచారంపై రెండు రోజులు నిషేధం విధించింది. ఎన్నికల ర్యాలీలో మాయావతి మా ట్లాడుతూ-‘ముస్లింలు మహాకూటమికే వోటు వేయాలి’ అన్నది. దానికి కౌంటర్‌గా యోగి- ‘కాంగ్రెస్,ఎస్పీ, బీఎస్పీలకు అలీపై నమ్మకముంటే మాకు భజరంగబలీపై విశ్వాసముంది’ అన్నాడు. మాయావతి చర్య జరిపితే,యోగి ప్రతిచర్యగా వ్యాఖ్యానించాడు. దురదృష్టమేమిటంటే ఈ దేశంలో చర్య జరపడం గొప్ప అభ్యుదయంగా, ప్రగతిశీలవాదంగా, సమసమాజ స్థాపనగా- ఇంకా చెప్పాలంటే ‘లౌకికవాదం’గా భ్రమింపజేస్తారు. గిచ్చినా, గిల్లినా మూతికి తాళం వేసుకొని వౌనముద్రలో ఉండడం లౌకికవాదం. ఇటీవల ‘దెబ్బకు దెబ్బ’ అన్నట్లుగా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు తిరగబడేసరికి ‘లౌకికవాదం’ ప్రమాదంలో పడిందంటారు. వెయ్యేళ్ళ నుండి మనసునిండా బానిసత్వం నింపి, కాఫిర్లుగా చూసిన అణచివేత ఇపుడు తిరగబడుతున్నది. కానీ ఓట్ల కోసం కక్కుర్తిగా తమకు తామే లౌకికవాదులుగా చెప్పుకొనే వ్యక్తులు తాము మాట్లాడుతున్నది సరైందా? కాదా? అని ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు.

ఈ దేశ కుహనా లౌకికవాదానికి కేంద్ర బిందువు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. ఎన్నో ఏళ్లుగా అతను విజయానికి దూరమయ్యాడు. ఆయన కాలుపెట్టిన గోవా, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా ధ్వంసమైంది. ఆయన ఇపుడు భోపాల్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. డిగ్గీరాజా గెలిస్తే తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమలనాథ్ కూడా ఓడించేందుకు గొప్ప ప్రయత్నమే చేస్తున్నాడు.

ఇదంతా ఓ ఎత్తయితే యూపీఏ ప్రభుత్వం ఉన్నపుడు ‘హిందూ తీవ్రవాదం’ అనే కొత్త పదబంధాన్ని సృష్టించిన జనక మహారాజు దిగ్విజయ్. దానిని సమర్థించినవాళ్ళలో సుశీల్‌కుమార్ షిండే, పి.చిదంబరం లాంటివారున్నారు. అజ్మీర్ దర్గా, మాలేగావ్ పేలుళ్లలో హిందూ తీవ్రవాదుల హస్తం ఉందని, దానిని నిరూపించాలని, అందుకో ఉదాహరణ కావాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం తలచుకొన్నది. అందులో భాగంగా సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, స్వామి అసీమానంద వంటివాళ్లను తీవ్రవాద చట్టాల కింద జైలుకు పంపారు. ఇటీవలే కొన్ని కేసుల నుండి విముక్తి పొంది బయటకు వచ్చిన ప్రముఖ జాతీయవాది సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ను ‘ముల్లును ముల్లుతోనే తీయాలనే’ మోదీ, అమిత్‌షాల వ్యూహంతో భాజపా అభ్యర్థిగా దిగ్విజయ్‌పై పోటీకి నిలబెట్టారు. దీంతో దిగ్విజయ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల కొద్దిపాటి తేడాతో మధ్యప్రదేశ్‌లో గెలిచి మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది.

సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఆనాటి యూపిఏ ప్రభుత్వం కొందరి సంతుష్టీకరణ కోసం తనపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడిందో ఒక్కోటి విప్పుతుంటే ఉత్తరాదిన సరికొత్త రాజకీ యం మొదలైంది. అఫ్జల్ గు రు, అజ్మల్ కసబ్ లాంటి వాళ్లకు సకల మర్యాదలు చేసి న సోనియా గాంధీ కోటరీ, దేశం కోసం ప్రాణాలర్పిస్తానని జీవితాన్ని భారతమాతకు అంకితం చేసిన సా ధ్వి పట్ల ప్రదర్శించిన అనుచిత వైఖరిని ఉత్తర భారతం గమనిస్తున్నది. ఒక మహి ళ నేతృత్వం వహించిన యూపిఏ ప్రభుత్వంలో మరో మహిళను దారుణ చిత్రహింసలకు గురిచేయ డం అమానుషం.

మావోయిస్టులను తయారుచేసి, వారికి నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో వెన్నుదన్నుగా నిలుస్తున్న ‘అర్బన్ నక్సల్స్’ను అరెస్టు చేస్తే మానవ హక్కుల గురించి వల్లెవేసే మేధావులు, సంఘాలు సాధ్వి పట్ల ఎందుకు స్పందించలే దో అర్థం చేసుకోవడం చాలా సులభం. సన్యాసి వేషంలో తిరుగుతూ దేశ వ్తిరేక శక్తుల కొమ్ముగాసే స్వామి అగ్నివేశ్ సాధ్వి వున్న జైలుకు వెళ్లి ‘నీవు ఈ పేలుళ్లను ఫలానా సంస్థలపైకి నెట్టేస్తే బెయిలు ఇప్పిస్తా..’ అని చెప్పడం ఎంత దారుణం? ఈ విషయం ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో సాధ్వి వెల్లడించి కన్నీటి పర్యంతమైంది. అఖండ వాగ్ధాటి, నిస్వార్థ దేశభక్తి, నరనరాల్లో నింపుకొన్న జాతీయవాదం సాధ్వి ప్రజ్ఞాసింగ్ సొంతం. ఆమె ప్రభావం మధ్య భారతంలో జాతీయవాద శక్తులకు ఉత్ప్రేరకంగా మారుతోంది. ఇది జీర్ణించుకోలేని జాతి వ్యతిరేక శక్తులు ఆమెపై అనేక ఫిర్యాదులు, ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం బెయిలుపై ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. లాలూప్రసాద్ దాణా కుంభకోణంలో జైల్లో ఉండికూడా పార్టీని శాసిస్తున్నా అదంతా లౌకికవాదం! ఓటుకు నోటు కేసులో ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డ చంద్రబాబు నిఖార్సయిన లౌకికవాది! నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై వున్న సోనియా, రాహుల్ గాంధీలు గొప్ప సెక్యులరిస్టులు! ఐఎన్‌ఎక్స్ మీడియాపై కుంభకోణంలో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.కార్తీ చిదంబరం కాంగ్రెస్ తరపున శివగంగ నుండి పోటీ చేయడం లౌకికవాద పరిరక్షణ!

 2016లో జేఎన్‌యూలో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన కన్హయ్య కుమార్ సీపిఐ తరఫున బిహార్‌లోని బెగుసరాయ్ నుండి పోటీ చేయడం దేశ లౌకికవాద సంరక్షణ! 2జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కనిమొళి తమిళనాడు సెక్యులరిజం పరిరక్షణకురాలు! శారద, నారద కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటు న్న బెంగాల్ ముఖ్యమంత్రి మమ తా బెనర్జీ కాబోయే లౌకికవాద ప్రధాని అభ్య ర్థి! సునందా పుష్కర్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశి థరూర్ ఇపుడు తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి! వేల కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని బెయిల్‌పై వున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇపుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థే కాక సెక్యులరిజం కాపాడే మెస్సయ్య! ఇంతకన్నా దారుణం ఇంకేముంది? ఈ దేశంలో ఎన్ని హత్యలు చేసినా, అవినీతి పనులు చేసి నా, కుంభకోణాలకు పాల్పడినా, దేశ వ్యితిరేక వ్యాఖ్యలు చేసినా సరే! ‘సెక్యులరిస్ట్’ అ ని అజం ఖాన్, ఓవైసీలు వారికి సర్ట్ఫికెట్ ఇస్తే చాలు. వాళ్లంతా పుణ్యతీర్థంలో మునిగి పునీతులైనట్లే. ఇక ఈ దేశ సెక్యులరిజానికి టేకేదార్లయిన సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, జైపాల్‌రెడ్డి, కె.నారాయణ, సురవరం సుధాకర్‌రెడ్డి, బి.వి.రాఘవులు, డి.రాజా జీవితమంతా లౌకికవాద పరిరక్షకులే! వాళ్ల లౌకికవాదం హిందూ మతంపై దాడికి తప్ప ఇంకెందుకూ పనికిరాదు!

‘నారా హమారా- టీడీపీ హమారా’ అంటూ ఎన్నికల సభల్లో ఒక మతం వాళ్లను కూర్చోబెట్టి ‘త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన దుర్మార్గపు మోదీ నుండి మిమ్మల్ని కాపాడుతా..’ అంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలకడం గొప్ప సెక్యులరిజం! ఈ వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యా తీసుకోలేదు. రాజ్యాంగ బద్ధంగా సాధ్యం కాదని తెలిసినా ఒక మతం వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తాం అంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఈ దేశంలో పరిఢవిల్లుతున్న కుహనా లౌకికవాదం!? ‘ఒక మతం వాళ్లు వోట్లు వేస్తే మేం గెలుస్తాం’ అంటూ బహిరంగ సభల్లో నిస్సిగ్గుగా చెప్తున్న పార్టీలు, నాయకులు ఈ దేశ మెజారిటీ ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడడం లౌకికవాదమా? మెజారిటీ ప్రజలను కులాలుగా విడగొట్టి మైనారిటీలను బుజ్జగించడం కుహనా లౌకికవాదం కాదా?

సాధ్వీ ప్రజ్ఞ మాట్లాడితే దేశ విభజన మతతత్వమా? ఏటిఎస్ అధికారిగా పనిచేసిన హేమంత్ కర్కరే గొప్ప పోలీస్ అధికారే కావచ్చు. తర్వాత ఎన్‌కౌంటర్‌లో భాగంగా తీవ్రవాదులపైకి వెళ్తే అతణ్ణి చంపేశారు. దీనికి ఎవరు కారణం? అని ఆలోచించడం మానేశాం. దీని మూలాలు ఎక్కడి నుండి వచ్చాయని ఒక్క క్షణం విచారణ చేయడం లేదు. అదే కర్కరే సాధ్విని చిత్రహింసలు పెట్టడాన్ని ఎలా ‘జస్టిఫై’ చేయగలుగుతాం? ‘నా శాపం వల్లే కర్కరే మరణించాడు’ అని సాధ్వి ప్రజ్ఞ అంటే, అదేదో దేశద్రోహం అయినట్లు మన సెక్యులర్ మీడియా, కుహనా లౌకికవాదులు గొంతు చించుకున్నారు. కర్కరే దేశభక్తి, పక్షపాత వైఖరి ఏకకాలంలో మనకు కన్పించడం లేదా? తీవ్రవాదుల చేతుల్లో ఆయన మరణం యాదృచ్ఛికం; సాధ్విని హింసించడం మాటేమిటి? అదే సోనియా గాంధీ బాట్లీహౌజ్ ఎన్‌కౌంటర్‌లో ముస్లిం తీవ్రవాదులు మరణిస్తే రాత్రంతా నిద్రపోకుండా వెక్కి వెక్కి ఏడ్చిందని ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించడం ఎలాంటి ‘లౌకికవాదం’ అని ఎవరూ ప్రశ్నించరు.

క్రీ.శ.712 మహమ్మద్ బిన్ కాశిం కాలం నుండి ఇటీవలి కాలం వరకు చర్యకు బలికావడమే చరిత్రలో చూస్తాం. ఇటీవల ప్రతిచర్యకు దిగడం తట్టుకోలేక ‘అసహనం’ ప్రదర్శిస్తున్నారు. దానికి మతోన్మాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ అని కలర్ ఇస్తున్నారు. సెక్యులర్ మనస్తత్వం ఈ దేశ మెజారిటీ ప్రజల డీఎన్‌ఏలోనే ఉంది. ‘మెజార్టీ ప్రజలు నశించాలని’ కోరేవాళ్లంతా, ఆ తర్వాత నిజమైన సెక్యులరిజం ఆనవాళ్లు ఈ భూమిపై ఎంత వెతికినా దొరకవని గ్రహిస్తే మంచిది. అలాంటి ప్రయత్నం చేస్తే సాధ్వి నిరంజన్ జ్యోతి, సాధ్వి ప్రాచీ, సాధ్వి ఉమాభారతి, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌లు పుట్టుకొస్తూనే ఉంటారు.


************************************

 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *



ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తారేఖ్ ఫతే అనే ఇస్లామిక్ మేధావి, పరిశోధకుడు, రచయిత ఓ ఆసక్తిరమైన వ్యాఖ్య చేశాడు. టీవీ ప్రతినిధి ఫతేను ప్రశ్నిస్తే ‘‘మీరు నిత్యం ఇస్లామిక్ తీవ్రవాదం గురించే మాట్లాడుతుంటారు.. ఆరెస్సెస్, భాజపా మతతత్వం గురించి మాట్లాడరు?’’ అన్నాడు. దానికి ఫతే సమాధానమిస్తూ- ‘ఆరెస్సెస్, భాజపా మతతత్వవాదులైతే ఏం జరుగుతుంది? గరిష్టంగా హిందూ జాతీయవాదం బలపడుతుంది. అంతకన్నా ఇంకేం జరగదు. అదీ భారతదేశానికే పరిమితం అవుతుంది. సెక్యులరిజం నిజమైన అర్థం అమల్లోకి వస్తుంది. అదే ఇస్లాంలో పెరిగే మతతత్వం ప్రపంచానికే ప్రమాదం కదా! అందుకే నేను ఐసిస్ లాంటి కరడుగట్టిన మతోన్మాద ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నా..’ అన్నాడు. తారేఖ్ ఫతే లాంటి పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న వ్యక్తి ఇంత గొప్పగా హిందూ జాతీయవాదాన్ని అర్థం చేసుకొన్నాడు. సింధు నాగరికత లేకపోతే భారతీయతకు అర్థం లేదన్నాడు. రాముని కుమారుడైన లవుడి పేరు మీద వున్న లాహోర్ హిందువులకు చెందకపోతే హిందూ సంస్కృతికి విలువలేదన్నాడు.

విచిత్రమేమిటంటే- ఈ దేశంలోని స్వార్థ సంకుచిత రాజకీయ నాయకులు తమ కుటుంబాల పరిపోషణార్థం ఓటు బ్యాంకు రాజకీయాలు నిస్సిగ్గుగా చేస్తున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి త్రిపుల్ తలాక్‌పై చేసిన వ్యాఖ్యలు జుగుప్సను కలిగిస్తున్నాయి. ‘త్రిపుల్ తలాక్ చట్టంతో మోదీ ముస్లింలను ఇబ్బంది పెట్టాలనుకొంటున్నాడు.. నేను ఉన్నంతవరకు మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు తమ్ముళ్ళూ..’ అంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పుకొంటున్నాడు. మోదీ ప్రధాని అయ్యాక ఏనాడైనా హిందూ ముస్లిం అనే పదాలను జంటగానైనా వాడాడా? 135 కోట్ల భారతీయులు అనే పదం వేలసార్లు చెప్పాడు. అదే చంద్రబాబు గుజరాత్ వాళ్లను మూకుమ్మడిగా తిడతాడు. ఒకవేళ మోదీ తప్పు చేస్తే గుజరాత్ వాళ్లను ఎందుకు తిట్టడం? తనపై జరిగే రాజకీయ వ్యాఖ్యలకు ‘తెలుగుజాతి’ అని కలర్ ఇవ్వడం ఈ రెండూ నాణేనికి బొమ్మా బొరుసూ లాంటివే. సుజనా చౌదరి, పుట్టా సుధాకర్ యాదవ్ ఆస్తులపై జరిగే ఐటీ దాడులు తెలుగుజాతివారిపై జరిగే దాడులా? ఇన్నిసార్లు మోదీ ఆంధ్రకు వచ్చినా ఎప్పుడైనా ఆంధ్ర ప్రజలను అవమానకరంగా మాట్లాడాడా? ఒక దేశ ప్రధానిని ‘నువ్వు నా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు’ అంటూ వ్యాఖ్యలు చేస్తూ, బ్యానర్లు పెట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?

వైకాపా అధినేత జగన్ ప్రచారం చేయకుండా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఎన్నికల విషయాలు చర్చిస్తే కుట్ర చేసినట్లా? కేసీఆర్ జగన్‌కు డబ్బు ఇచ్చి పంపించినట్లు సాక్ష్యాధారాలు చూపించాలి కదా? ఇవన్నీ బాబు మాట్లాడుతున్న ఊహాజనిత ఉపన్యాసాలకు ఉదాహరణ. రోజూ చేస్తున్న తిట్ల పురాణంలో మోదీ మోసగాడు, నియంత, వ్యవస్థల్ని ధ్వంసం చేశాడు- ఈ మూడు వాక్యాలు చర్విత చర్వణంగా చెప్తుంటే వినలేక జనం విసిగిపోతున్నారు. మోదీని, కేసీఆర్‌లను బూచిగా చూపి దానికి జగన్‌ను జోడించి ఓట్లు పొందడమే అసలు లక్ష్యం. ఇదంతా మోసం కాదా? నారుూ బ్రాహ్మణులను ఉద్దేశించి చంద్రబాబు ‘మీ తోక కత్తిరిస్తాను’ అనడం నిరంకుశత్వం కాదా? తెలుగుజాతి ఆత్మగౌరవం నిలబెట్టిన ఎన్టీఆర్‌ను గద్దె దింపింది వ్యవస్థల్ని విధ్వంసం చేయడం కాదా? ఇన్ని ఘనకార్యలు మోదీ చేయలేకపోవచ్చు. జాతీయ నాయకుడిగా చెప్పుకొంటున్న చంద్రబాబును తెలంగాణ ఎందుకు తిరస్కరించింది? ఓట్లకోసం కులాలను, మతాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయవాదాన్ని ఉసిగొల్పడం కన్నా- మోదీ చెప్పే జాతీయవాదం ప్రమాదకరమా?

అన్నా హజారేను ముందు పెట్టుకొని దొడ్డిదారిన అధికారం పొంది హజారేను యమునా ప్రవాహంలో తోసేసి ఆంధ్రలో ఉపన్యాసాలు చేస్తున్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ మోదీకి కొత్తనా? అవివీతిపరుల గుండెల్లో నిద్రపోతా, వాడి తాట తీస్తా, వీడి పొలుసు తీస్తా! అంటున్న పవన్ కల్యాణ్ మాయావతిని ఆంధ్రకు పిలిచాడు. నీతికి నిలువెత్తు రూపంగా ఎందరో యువకులు భావించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను తనవెంట బెట్టుకున్న పవన్- అవినీతి కేసుల్లో ఇరుక్కున్న మాయావతిని ఆంధ్ర ప్రజలకు చూపించి ఏం సందేశం ఇస్తాడు? మాయావతి ముందు కూర్చోవడానికి వాళ్ల పార్టీ వాళ్లే సందేహిస్తారు? జయలలిత లాగే దర్పం ప్రదర్శించే మాయావతి కన్నా మోదీ నిరంకుశుడా? మాయా ప్రధాని కావాలని పవన్ ఆశిస్తున్నాడు కదా? ఇటీవల కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వచ్చి ఆంధ్రలో రోడ్ షోలు చేసి వెళ్లిపోయాడు. ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలంటున్నాడు. ఇక ముఫ్తీ మెహబూబా తన ఆటలు సాగడం లేదని 2020లో కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలని అంటోంది. వీళ్లేనా ఈ దేశ రాజకీయాన్ని నడిపేది?! వీళ్లంతా మోదీకన్నా మెరుగైనవాళ్లా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు, ఇతర పార్టీల అభ్యర్థులను, శాసనసభ్యులను లాక్కోవడం విజ్ఞులెవరూ హర్షించడం లేదు. కాంగ్రెస్-్భజపాలు పేలవమైన బ్యాటింగ్ చేస్తున్నందున కేసీఆర్ మెజారిటీ సీట్లను సాధించవచ్చు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తెస్తానంటున్న కేసీఆర్ ‘హిందుగాళ్లు బొందుగాళ్లు’ అన్నంత సులభంగా ఇతర మతాల వారిని చులకనగా అనగలడా? అదే మోదీనో, అమిత్ షానో ఇతర మతాల వాళ్లను ఇలా ‘గాళ్లు’ అని సంబోధిస్తే ఇది అంతర్జాతీయ సమస్య కాకపోయేదా? ప్రపంచ మానవ హక్కుల సంఘం కూడా ఈ విషయంపై స్పందించేది!?
రాజకీయాల గురించి ఓనమాలు తెలియని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా మతతత్వం గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్, ఉత్తమ్ భాషలో తేడా లేదు. మోదీ ఎపుడైనా ‘హిందూ అభిజాత్యం’ గురించి చెప్తూ ముస్లింలను కించపరిచాడా? ఓవైసీ పార్టీ, అతని చరిత్ర ఎంతగొప్పగా వుందో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవాళ కేసీఆర్ చరిష్మా ముందు ఇవన్నీ మరుగున పడ్డాయి. చరిష్మా మరింత పెంచుకొనేందుకు సంతుష్టీకరణ జరుగుతోందన్నది సత్యం. ఇలాంటి సంతుష్టీకరణ రాజకీయం దేశమంతా విస్తరించడమే గుణాత్మమైన మార్పా?

ముతక చీర కట్టుకొని గాంధీ మహాత్ముని వారసురాలిగా కన్పిస్తున్న మమతా బెనర్జీ కేంద్రం నుండి వచ్చిన సీబీఐ అధికారులను అరెస్టు చేయించింది. ఇపుడు బాబు ఫ్రంట్‌లో ఆమె ప్రధాని అభ్యర్థి. ఒకవేళ ఆమె ప్రధాని అయ్యాక సీబీఐ, ఈడీ అధికారులను భాజపా పాలిత రాష్ట్రాల్లో అరెస్టు చేయవచ్చా? సీఎం స్థానంలో ఉండి ఇంత అహంకారంగా, దురుసుగా ప్రవర్తిస్తున్న మమత కన్నా మోదీ నిరంకుశుడా? కేవలం ప్రాంతీయ పార్టీల సీఎంలకే అధికారాలు, హక్కులు ఉంటాయా? నూరుకోట్లమంది ఎన్నుకున్న ప్రధానికి ఏ హక్కూ ఉండదా? తెలుగు టీవీ చానళ్లు, పచ్చ మీడియా ఎలా చెప్తే ప్రధాని అలాగే చేయాలా? ఇపుడు మోదీని వ్యతిరేకించే నాయకుల్లో దేవగౌడ కూడా ఉన్నారు. తన కొడుకులతోపాటు మనవలు కూడా పార్లమెంటులో కొర్రమీనంత మైక్ పట్టుకొని ‘అధ్యక్షా!’ అంటే చూసి తరించిపోవాలనుకొంటున్న దేవెగౌడ మోదీని వ్యతిరేకించడం సహజమే. ఎందుకంటే మోదీ రాజకీయ వారసులు భారతీయులే! ఇపుడు మనవడి చేత రాజకీయ అరంగేట్రం చేయిస్తే- ఇంకో యాభై ఏళ్లు కన్నడనాడు గౌడ కుటుంబం చేతిలోనే ఉంటుంది కదా! మరి మోదీ తర్వాత మరో మోదీ వచ్చేవరకు ఈ దేశ జాతీయవాదులు ఎన్నాళ్లు ఎదురుచూడాలో చెప్పడం కష్టం!

అబ్దుల్లా కుటుంబం, లాలూ కుటుంబం, దేవెగౌడ కుటుంబం, చౌతాలా కుటుంబం, బాదల్ కుటుంబం, చంద్రబాబు కుటుంబం, గాంధీ-నెహ్రూ కుటుంబం, కేసీఆర్ కుటుంబం, కరుణానిధి కుటుంబం, జయలలిత, మాయావతి అనుచర గణం అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అధికార కేంద్రీకరణ కన్నా ఇపుడు మోదీ నిరంకుశత్వమే దేశానికి ఎక్కువ ప్రమాదకరం!?

ఇక ఈ దేశాన్ని గరీబ్ హటావో దగ్గర్నుంచి ‘న్యాయ్’ పథకం వరకు 70 ఏళ్లు 5 తరాలు పేదవాళ్ల కోసం పాటుపడుతూనే ఉన్న గాంధీ-నెహ్రూ కుటుంబం వారసత్వం కన్నా మోదీ నిరంకుశత్వమే ఇపుడు దేశానికి ప్రమాదకరం! 72 ఏళ్లు ఈ దేశానికి అన్ని అవ లక్షణాలు అందించినందుకు ప్రాయశ్చిత్తంగా 72 వేలతో పేదరిక ప్రక్షాళన చేయాలనుకొన్న రాహుల్ గాంధీ రాజకీయ అజ్ఞానం కన్నా మోదీ చేస్తున్న నిరంకుశత్వమే ప్రమాదకరం!

ఈ ఎపిసోడ్‌లో గద్దెదించే పట్టువదలని ‘ఎర్ర’ విక్రమార్కులది మరో బాగోతం. ఏచూరి నుండి నారాయణ వరకు ఒకటే పాట. 2014లో మోదీ గద్దెనెక్కినప్పటి నుండి ‘దించేస్తాం’ అంటూ భీషణ ప్రతిజ్ఞలు. వీళ్లకెపుడూ హిందుత్వ మాత్రమే తీవ్రవాదంగా కన్పిస్తుంది. ఎర్రకళ్ల కామెర్లకు కాషాయమంటేనే గిట్టదు. వీళ్లకు రాజకీయం తక్కువ, రాద్ధాంతం ఎక్కువ. వీళ్ల వంధిమాగధ హర్యాలీ మేధావులంతా పత్రికల, టీవీల పీఠాల్లో ఈరోజుకూ కూర్చొని ఉన్నారు. ‘వాళ్లు జీవితమంతా ప్రత్నామ్నాయం’ కావాలంటారు. ఆ ప్రత్యామ్నాయం ఎప్పుడూ కశ్మీర్‌లో రాళ్లు విసిరేవాళ్లకు, పాలస్తీనా గురించి పలవరించేవాళ్లకు, పాకిస్తాన్ మిలిట్రీకి, చైనా వ్యాపారానికి, ఈ దేశ మతతత్వ గుంపులకు అడుగులకు మడుగులొత్తే విధంగా ఉంటుంది. ఉక్కుపాదంతో ప్రజలను అణచివేసే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లో సత్యహరిశ్చంద్రుడు, ప్రపంచంలోనే మూర్ఖుడైన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లో రంతిదేవుడిని దర్శిస్తారు. చచ్చి స్వర్గాన వున్న అనంతమూర్తి దగ్గర నుండి బతికున్న సురవరం సుధాకర్‌రెడ్డి వరకు మోదీలో తీవ్రమైన నిరంకుశత్వం కన్పిస్తుంది. అందుకే ఇపుడు ఈ మహాప్రజాస్వామ్య పరిరక్షకులంతా తక్షణం మోదీని గద్దెదించాలంటున్నారు. నిజంగా ఈ దేశ ప్రజలు విజ్ఞులైతే తారేఖ్ ఫతే మాటల్లో అంతరార్థం గ్రహిస్తే చాలు.


************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *