మనుషుల కన్నా చరిత్ర గొప్పది. దానికి ఎన్నో మైలురాళ్లు ఉంటాయి. అవి చరిత్ర గతిని మలుపుతిప్పుతాయి. చరిత్రలో కొన్ని వేగ నిరోధకాలు కూడా ఉంటుంటాయి. వాటికీ చరిత్రలో స్థానం లభిస్తుంది. అంతమాత్రాన అదే చరిత్ర అనుకున్నా పొరపాటే. అలాంటి ఘట్టం ఒకటి పరిశీలించేందుకు మనం చరిత్రలోకి తొంగి చూస్తే వర్తమాన రాజకీయాలకు సమాధానం దొరుకుతుంది.

భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీకి గొప్ప స్థానం ఉంది. అంతకు ముందున్న భారతీయ యుద్ధ మెళకువలను ఆధునీకరించి, శత్రువు వ్యూహాన్ని పసిగట్టిన మహావీరుడు ఆయన. పరాయి మత పాలకులను నిలువరిస్తూనే మరోవైపు మొఘల్ సింహాసనంపై యుద్ధం ప్రకటించాడు. చివరకు క్రీ.శ.1674 జూన్ 6న ‘హైందవ సామ్రాజ్య నిర్మాణానికి’ అడుగువేసాడు. శివాజీ హిందుత్వను ముస్లిం రాజులు ఎంతలా ద్వేషించారో- కొందరు హిందువులూ అంతలా వ్యతిరేకించారు. అలాంటి వాళ్లలో రాజా జయసింగ్ ఒకడు. ఇతడు స్వయానా దైవభక్తుడు. గొప్ప హిందువు.కానీ శివాజీని సజీవంగాగానీ నిర్జీవంగా గానీ ఔరంగజేబుకు పట్టి ఇస్తానని భీషణప్రతిజ్ఞ చేసాడు. రెండు నెలలపాటు మహాచండీయాగం, 10వేల బ్రాహ్మణులకు, వేద పండితులకు ఘన సత్కారం చేసి లక్ష సైన్యంతో ఆగ్రానుండి బయల్దేరాడు. ఇక్కడ ధర్మం ముఖ్యమా? భక్తి, బ్రాహ్మణ సత్కారం ముఖ్యమా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది?!


తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కరీంనగర్, నిజామాబాద్ సభల్లో చేసిన ప్రసంగాలు మనల్ని ఈ చారిత్రక ఘట్టం వైపు తీసుకెళ్తాయి. కేసీఆర్ లాంటి రాజకీయ పరిపక్వత ఉన్న వ్యక్తిచేసే వ్యాఖ్యలు అలవోకగా తీసుకోలేం. తనకు ఉద్యమకాలం నుండి అత్యంత ఇష్టుడైన వినోద్‌కుమార్ కరీంనగర్‌లో తెరాస ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. అక్కడ ఇటీవల మతపరంగా ఎన్నో సున్నితమైన ఘటనలు చోటుచేసుకొన్నాయి. భాజపాకు చెందిన బండి సంజయ్‌కుమార్‌కు యువతలో మంచి ఆదరణ ఉంది. నిజానికి కరీంనగర్‌లో ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువ. అక్కడ హిందువుల పక్షాన సంజయ్ గట్టిగా నిలబడుతున్నాడు. అతనికి కరీంనగర్ భాజపా టిక్కెట్టు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ ఓడిపోయాక అతనిపై అక్కడి హిందూ యువతలో సానుభూతి పెరిగింది.


ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ కరీంనగర్, నిజామాబాద్ సభల్లో కాంగ్రెస్ కన్నా, భాజపాపై విసుర్లు ఎక్కువ విసిరారు. పనిలోపనిగా హిందుత్వపై ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. వాటిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ జరిగింది. ‘హిందూగాళ్లు-బొందూగాళ్లు’ అన్న కేసీఆర్ మాట చాలామందికి నచ్చలేదు. అందువల్ల సోషల్ మీడియా కేసీఆర్‌పై విరుచుకుపడింది. నిజామాబాద్ సభలో కేసీఆర్ అదే విషయాన్ని సున్నితంగా వదిలేస్తే అయిపోయేది. మళ్లీ భాజపాను దృష్టిలో పెట్టుకొని ‘రామజన్మభూమి’ అంశంపై వ్యాఖ్యలు చేశాడు. భాజపా వేరు, హిందుత్వ వేరు అన్న కేసీఆర్ మాటలు అక్షర సత్యాలు. 


కానీ హిందువుల పక్షాన ఏ రాజకీయ పార్టీ నిలబడడం లేదని హిందువులకు అభద్రత ఉంది. ఇటీవల వరంగల్‌లో పూజారి సత్యనారాయణ గుడిలో మైక్ పెద్దశబ్దంతో పెట్టాడన్న సాకుతో ఒక ముస్లిం అతనిపై దాడి చేసాడు. ఆ తర్వాత పూజారి చనిపోయినా కేసీఆర్ స్పందించలేదని నెటిజనులు ఆరోపిస్తున్నారు. కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో అంతమంది హిందువులు చనిపోయినా కేసీఆర్ అటువైపుచూడలేదని వారు ఆరోపిస్తున్నారు. నిర్మల్, బోధన్‌లలో మతఘర్షణలకు కారణమైన వ్యక్తులను పోలీసులు వదిలిపెట్టి, హిందూ సంస్థలను టార్గెట్ చేసినా పట్టించుకోలేదని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పెట్టారు. మతతత్వ పార్టీగా పేరొందిన మజ్లిస్‌ను తెరాస ప్రభుత్వం నెత్తినపెట్టుకొని మోస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు, భాజపా నాయకులు ఎన్నోసార్లు ఆరోపించారు.

కేసీఆర్ చేసిన ఆయత చండీయాగం, యాదాద్రి అభివృద్ధి, రాజశ్యామల యాగం విషయంలో తెలంగాణ హిందువులు ఆయనను గొప్ప హిందువుగా భావిస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాలు, సాంస్కృతిక పరిరక్షణ విషయంలో ఆయన కృషి అనన్య సామాన్యం. అలనాడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ సోమనాథ మందిరం నిర్మిస్తే, ఆ తర్వాత యాదాద్రిని చరిత్రలో నిలిచిపోయే దేవాలయంగా మలుస్తున్న చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ హిందువులకు కేసీఆర్‌పై ఎక్కువ అభిమానం పెరగడానికి ఇదొక కారణం. కేసీఆర్ చేస్తున్న యజ్ఞయాగాలు, బ్రాహ్మణభక్తి పండిత వర్గాల్లో ఆయనకు మంచిపేరు సంపాదించింది. ‘్భష్మద్రోణ కృపాది ధన్వి’ లాంటి కఠినమైన తిక్కన పద్యాలు కేసీఆర్ అలవోకగా చదవుతుంటే విద్యాధికుల్లో ఆయనపై గౌరవం ఏర్పడింది. 


తనకు చదువుచెప్పిన గురువుకు వేదికపై సాష్టాంగ దండప్రణామం చేస్తే సంప్రదాయవాదులకు ఆనందం కలిగించింది. కానీ, రామజన్మభూమి గురించి ఆయన అవహేళనగా మాట్లాడడం కొంతమందికి బాధ కలిగించింది. తెలంగాణలో నిజాం షాహీలతో అణచివేయబడిన హిందువులకు లోలోపల నివురుగప్పిన నిప్పులా ఈరోజుకూ బాధ ఉంది. కేసీఆర్ ఓవైపుచేస్తున్న సాంప్రదాయిక చర్యలు వాళ్లను అలా అణచి ఉంచాయి. ఇక్కడ వరుసగా కాంగ్రెస్ దెబ్బతినడానికి కారణం ఇదే. అన్నిరకాల రాజకీయ హంగులు కాంగ్రెస్‌కు తెలంగాణలో ఉన్నా- కేసీఆర్‌లా హిందువుల మనసు గెలుచుకోలేదు. సెక్యులరిజం పేరుతో డెబ్బై ఏళ్లనుండి ఏ పంథాను కాంగ్రెస్ అనుసరించిందో అదే మార్గంలో ఇక్కడి కాంగ్రెస్ నడుస్తున్నది. దేశవ్యాప్తంగా బిజేపి ఇంత విస్తృతం కావడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టుల సంతుష్టీకరణ విధానమే కారణం కదా. ఈ విషయం తెలంగాణ రాగానే పసిగట్టిన కేసీఆర్ సంప్రదాయ హిందుత్వ విధానాలతో భాజపాకు చెక్ పెట్టాడు. కేసీఆర్ చెప్పే ‘హిందుత్వ’లో ఆచారాలు, పూజలు, నమ్మకాలు, బ్రాహ్మణ సంతర్పణ బాగా ఉంటుంది. ఈరోజు చాలామంది హిందువులు ఇంతవరకే పరిమితం అయ్యారు. భాజపా చెప్పే హిందుత్వలో ‘జాతీయతతో కూడిన హిందూ ఆత్మగౌరవం’ ఉంటుంది.

దానిని కేసీఆర్ లాంటివారు నకిలీ హిందుత్వ అంటారు. అంతెందుకు? భాజపాపై ప్రతిదానికీ విరుచుకుపడే మమతా బెనర్జీ ‘నాలాగా మోదీ, షా మంత్రోచ్ఛారణ చేయగలరా?’ అన్నది. నిజానికి ఆచారాలు, నమ్మకాలు, ఎక్కువగా కేసీఆర్, లాలూ, దేవేగౌడ వంటి వాళ్లలోనే కన్పిస్తాయి. మోదీ ముఖంపై రెగ్యులర్‌గా బొట్టుకూడా ఉండదు. మోదీ, భాజపా చెప్పే హిందుత్వలో ‘దేశ సమగ్రత-జాతీయత’ ఉంటుంది. మెజార్టీ ప్రజల జీవన విధానంలో జాతీయభావం లేకపోతే దేశం సమగ్రంగా ఉండదని ఆరెస్సెస్ భావిస్తుంది. అందువల్ల జాతీయవాదుల హిందుత్వ ‘ఆచారాల’వరకే ఆగదు. కేసీఆర్ చెప్పే హిందుత్వ ప్రమాదం లేని స్థితిలో మాత్రమే పనికివస్తుంది. కశ్మీర్‌లో, హైద్రాబాద్ పాతబస్తీలో దీనిని అమలుచేయడం సాధ్యం కాదు. అధికారం లేనపుడు కూడా ఈ హిందుత్వ ముందుకు సాగుతుంది. అంతేగానీ కేసీఆర్‌కు ఉన్న పరిస్థితులు ఎప్పటికీ ఉంటాయనుకోరాదు. భాజపా చెప్పే హిందుత్వతో సంప్రదాయం ఒక ప్రతీక మాత్రమే. దాని వెనుక ఆత్మగౌరవంతో కూడిన రాజకీయ సంరక్షణ దాగి ఉంది. బహుశా దీన్ని కేసీఆర్ లోతుగా అధ్యయనం చేసి ఉండకపోవచ్చు. హిందుత్వపై వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ అభిమానులైన ముస్లిం ఓట్లు, తటస్థులైన వారి ఓట్లు పొందడం ఓ పెద్ద ప్రయోజనం కావచ్చు. రామజన్మభూమిపై రాజకీయ పార్టీలకు అవసరం లేదన్నాడు కేసీఆర్. శృంగేరి పీఠాధిపతి, చినజీయర్ స్వామి లాంటి వారు దీనిపై చొరవ చూపించాలన్నారు. 


మన దేశంలోని ‘ఆమ్నాయ పీఠాల’కు కొన్ని హద్దులు ఉన్నాయి. వారు దేని గురించి పడితే దానిపై స్పందించరు. కేసీఆర్ చెప్పిన శృంగేరీ పీఠం దక్షిణామ్నాయ పీఠం. ఇది కన్నడ ప్రాంతంలో ఉంది. దీని పరిధిలోకి ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ, కేరళ ప్రాంతాలు వస్తాయి. ఈ పరిధిలోని అయ్యప్ప (శబరిమల) వివాదంలో స్వామివారు స్పందించలేదు. అయోధ్యపై సాధుసంతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. మనకున్నట్లు ఉత్తర భారతంలో చినజీయర్ స్వామి, స్వరూపానందేంద్ర సరస్వతిలా ఒకరిద్దరు స్వామీజీలు మాత్రమే ఉండరు. అక్కడ అనేక మఠాలు, ఆశ్రమాల్లో సాధువులు పెద్దఎత్తున ఉన్నారు. అక్కడ సహజంగా రాజకీయాలుంటాయి. ఆయా మఠాధిపతులను ప్రజలు చాలా గౌరవిస్తారు. ప్రజలు వారిని అనుసరిస్తారు. వాళ్లను నాయకులు అనుసరిస్తారు. వారు హిందువులుకారని మనం చెప్పగలమా? వారి హిందుత్వను ఎవరైనా శంకిస్తారా? నిజానికి తెలంగాణలో హిందుత్వ, జాతీయత అనేది బహుజన కులాల్లోనే బాగుంది. నిజాం వ్యతిరేక పోరాటంలో మరాఠీ బ్రాహ్మణుల వెంట నడిచి ఆర్యసమాజ ఉద్యమాన్ని తీవ్రం చేసినవారు దళిత బహుజనులే. ఆరోజుల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి తిరిగినవారే ఇపుడు కేసీఆర్ వెంట చేరారు! ఏది ఏమైనా కేసీఆర్‌ను అభిమానించే హిందువులెందరో ఆయన వెంబడి ఉన్నారు. మతపరమైన విషయాల్లో రాజకీయ వ్యాఖ్యలు చాలామందిని నొప్పిస్తాయి గనుక సంయమనం పాటిస్తే మంచిది. గెలుపు మన ఎదుగుదలకు మలుపులా ఉండాలి కానీ మూసివేసే తలుపులా ఉండకూడదు. నకిలీ హిందుత్వకు, అసలీ హిందుత్వకు ఎన్నో కొలమానాలున్నాయి. వాటి ఉచ్చులో పడకుంటే మంచిది.

************************************
 * శ్రీకౌస్తుభ *
 * ఆంధ్రభూమి *


ఒకాయన చాలా డబ్బు ఖర్చుపెట్టి అందమైన భవనం కట్టుకొన్నాడు. అతని ఇంటిముందు ఇంటి యజమాని ఎవరితోనో ‘ఆ క్రొత్త ఇంటిపై రాయివేస్తాను’ అన్నాడు. క్రొత్త ఇంటి యజమాని రోజూ పనులన్నీ మానుకొని అతడు ఎప్పుడు రాయివేస్తాడా? అతనిపై పోలీస్ కేసు ఎప్పుడు పెట్టాలా? అని ఎదురుచూస్తున్నాడు. ఇతడు మాత్రం రోజూ రాయిని చేతిలో పట్టుకోవడం, ఇంటి అరుగుపై కూర్చొని సాయంత్రం లోపలికి వెళ్లడం చేస్తున్నాడు. కానీ కొట్టడం లేదు. ఇతడు ఎప్పుడు కొడతాడా అని ఎదురుచూస్తున్న వ్యక్తికి ఎదురుచూసి ఎదురుచూసి విసుగొచ్చింది. నెలలు గడిచినా ఎదురింటి పెద్దమనిషిది అదే తీరు. ఓరోజు ఈ క్రొత్త భవనం యజమానికి చిరాకుపుట్టి ‘నీవు త్వరగా కొడతావా? కొట్టవా? ఈ ఉత్కంఠతో చచ్చిపోతున్నా’’ అని నిలదీసాడు.

ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పరిస్థితి ఇదే. తెలంగాణ రాజకీయాల్లో మొన్న డిసెంబర్‌లో వేలుపెట్టాడన్న కోపంతో యథాలాపంగా కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అదేదో పెద్ద వరంలాగా ఇక కేసీఆర్ పేరు చెప్పుకొని గెలిచేయొచ్చు అని బాబు అండ్ కో ఎగిరి గెంతువేసింది. చంద్రబాబు-కేసీఆర్ మధ్య ఇదో గొప్ప అనుబంధం, వాళ్లిద్దరూ మాట్లాడుకొనే ఇదంతా చేస్తున్నారని పచ్చ రాజకీయ పండితులు విశే్లషణ చేసేశారు. కేసీఆర్ గెలుపులోని గొప్పదనాన్ని బాబుకు ఆపాదించే క్రమంలో చేసిన ఎల్లో మీడియా ఇదొక వ్యూహంగా పేర్కొన్నది. కానీ సీన్ రివర్స్‌అయ్యింది. ఎన్నికల కోడ్ రాగానే మోదీపై ఒంటి కాలిపై లేచి హైజంప్ చేసి ఢిల్లీని కలకత్తాను ఏకంచేద్దామనుకొన్న బాబు మెడకు ఐటీగ్రిడ్ కేసు మెడకు చుట్టుకొంది. మీడియా ద్వారా దానిని ఎంత కప్పి పాతిపెడదామనుకొన్నా ఈపాటికే ప్రజలకు ఎలా అర్థంకావాలో అలాగే అర్థంఅయ్యింది. ఇక అలీ వైసీపీలో చేరగానే ఆయన వేయించే ఓట్లు ఎన్నో తెలియదుగానీ వెంటనే టీడీపీ బుద్దావెంకన్న ఇదంతా కేసీఆర్ కుట్ర అన్నారు. జయసుధ వెళ్లగానే ఇది కేసీఆర్ బెదిరింపు అన్నారు. ఇదిలా ఉండగానే, కేసీఆర్ తన వ్యూహాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు రేగా కాంతారావు, అత్రం సక్కు, హరిప్రియలను తనవైపు తిప్పుకొన్నాడు. ఈలోపు రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు బలమైన వర్గంగా ఉన్న ఇంద్రారెడ్డి కుటుంబం టీఆర్‌ఎస్ వైపు మళ్లింది. ఉట్టికింద కూర్చొని పిల్లి శాపాలుపెట్టినట్లు కాంగ్రెస్‌వారు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి బలంగా ఉన్నపుడు కాంగ్రెస్ ఏం చేసిందో మర్చిపోతాడా కేసీఆర్. 


అంతెందుకు! 2014 తర్వాత వైయస్సార్సీపీకి చెందిన 20కి పైగా ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో కలుపుకోలేదా? అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. కేసీఆర్ యజ్ఞాలు ఎంత బాగా చేయగలడో రాజకీయం అంతే బాగా చేయగలడు. కాంగ్రెస్, తెలుగుదేశం సిలబస్ మొత్తం క్షుణ్ణంగా చదివేకదా కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించింది! చంద్రబాబు జీవిత చరిత్రను వైయస్ రాజశేఖర్‌రెడ్డి కాచి వడబోసాడు. అటు బాబును, ఇటు వైయస్‌ను చివరి పేజీవరకు కేసీఆర్ చదువుకొన్నాడు. ఇపుడు అదే పాఠాలను వైయస్ జగన్‌కు నేర్పిస్తే తప్పేంటి? కేసీఆర్‌ను నేరుగా యుద్ధరంగంలోకి రెచ్చగొట్టిలాగి ఆంధ్ర-తెలంగాణ సెంటిమెంటును రాజేయాలనుకొన్న చంద్రబాబుకు కేసీఆర్ వౌనంగా ఉంటూ మరింత అసహనం కలిగిస్తున్నాడు. 

ఇక జగన్ అటు ప్రశాంత్ కిషోర్ సలహాలతో, కేసీఆర్ ఆశీర్వాదంతో, అసదొద్దీన్ ఓవైసీ మంత్రాంగంతో త్రిముఖ వ్యూహాలను అవలంభిస్తున్నాడు. నిజానికి ఆంధ్రకు చెందిన నటులు, పారిశ్రామిక, రాజకీయవేత్తలు హైద్రాబాద్‌లో తమ కార్యకలాపాలు జరుపుతున్నా తమ ప్రాణం ఆంధ్రా చుట్టూ తిప్పుతుంటారు. ఇపుడు కలుగులోని ఎలుకలను మెల్లిగా కేసీఆర్, జగన్ కలిసి విజయవాడ దారి పట్టిస్తున్నారు. ఇక ఆంధ్రా-తెలంగాణలో (హైద్రాబాద్) ఓటు నమోదు చేయించి గంపగుత్తగా వారి ఓట్లను ఖరీదు చేద్దామనుకొన్న వారి కుట్రలను చేధిస్తూ ఎన్నికల ముందు ఐటీగ్రిడ్ తుట్టెను కదిలించారు. దీనికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఒకేరోజు పోలింగ్ పెట్టి ఎన్నికల సంఘం మరో విజయం సాధించింది. అలాగే ఢిల్లీలోవెళ్లి చక్రం తిప్పుతాం అంటున్న, తిరిగి తిరిగి అరిగిపోయిన చక్రానికి మొదటే ఎన్నికలు పెట్టి ఒక్క రౌండుకే కథ ముగించే వ్యూహం ఢిల్లీనుండి రానే వచ్చింది.

ఇక కాంగ్రెస్‌వాళ్లకు కంట్లో నలుసులా కనిపిస్తున్న కేసీఆర్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రింద పడేద్దామనుకున్నారు. కానీ ఆపరేషన్ గులాబీతో పరేషాన్‌లో ఉత్తమ్ టీం కుదేలయ్యింది. రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహిత కుటుంబమైన కార్తీక్‌రెడ్డి కుటుంబం టీఆర్‌ఎస్‌లోకి వెళ్తుంటే ఆయనే నివారించుకోలేకపోయాడు. జానారెడ్డి, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కుటుంబాలను ఏనాడూ విమర్శించని రేవంత్‌రెడ్డి ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయాడు. సముద్రం లాంటి కాంగ్రెస్‌లోకి వీళ్లందరినీ చూసుకొనే రేవంత్ వచ్చాడు. ఒకప్పటి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడేందుకు కావలసిన సమాచారం ఆనాడు కాంగ్రెస్‌లోకి ఈ వర్గాలే రేవంత్‌కు సహాయంగా ఇచ్చేవారని చెప్పుకొంటారు. 


ఇపుడు రేవంత్‌రెడ్డిని గట్టిగా ప్రోత్సహించేవారు తక్కువే. ఇటీవల జరిగిన రాహుల్ సభలో రేవంత్ లేకపోవడం స్పష్టంగా కన్పించింది. ఉత్తమ్ అధ్యక్షుడయ్యాక తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రా కాంగ్రెస్ పరిస్థితికి తమ్ముడిగా తయారైంది. కేసీఆర్ నాయకుడిగా ప్రజలను మెప్పిస్తున్నాడు. అలాగే రాజకీయ వ్యూహాలను రచిస్తున్నాడు. అతనికి సమఉజ్జీగా కాంగ్రెస్‌లోని ఏ నాయకుడూ నిలువలేకపోయారు. అంతేగాక పుల్వామా దాడి జరిగాక మోదీపై మళ్లీ యువతలో క్రేజ్ మొదలైంది. రాహుల్‌గాంధీలోని రాజకీయ అపరిపక్వత కాంగ్రెస్‌వాదులకు శూన్యంగా గోచరిస్తుంది. రాఫెల్ కుంభకోణంపై రాహుల్ చెప్పే చిలుక పలుకులను ప్రజలు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ ‘కుటుంబ భజన’ చేస్తున్నారు తప్ప రాహుల్‌గాంధీ బ్రహ్మచారిగా ఉన్నందుకు అతనిని సరైన దిశలో నడిపించలేదు. 

మోదీకి సమఉజ్జీగా తయారుచేయలేకపోతున్నారు. ఏకే ఆంటోనీలా ఉన్నదున్నట్లు చెప్పేవారు లేరు. కేవలం తమ ప్రాపకంకోసం రాహుల్ చుట్టూచేరి భజన పరులయ్యారు. ఈ రోజుకూ కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ కొరకు అమరవీరుల మరణాన్ని ‘‘నోటితో పొగుడుతూ నొసలుతో’’ వెక్కిరిస్తున్నది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రా, తెలుగుదేశం మైనార్టీ నాయకులు ఒవైసీపై విరుచుకుపడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీనేకదా మజ్లిస్‌కు రక్షణ కవచంగా నిలిచింది, అంతలా పెంచి పోషించింది?! ఆఖరుకు హిందూ జనాభా ఓట్లుఉన్న ప్రాంతాలను తొలగించి హైద్రాబాద్‌ను నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ గంపగుత్తగా అప్పజెప్పింది ఎవరు? హైద్రాబాద్ గల్లీలల్లో నిందితుల ఇళ్లకువెళ్లి సమాలోచనలు చేసిన షబ్బీర్‌అలీ గతం మరిచిపోయాడా? ఇటీవల ‘నారా హమారా’- టీడీపీ హమారా’ అంటూ మైనార్టీ జపం మొదలుపెట్టిన చంద్రబాబు అవకాశవాదం ప్రజలు గమనించరా? పుష్కరాల్లో గుడులు కూల్చి, విఐపీల రద్దీపెంచి భక్తుల చావుకు కారణమైనవాళ్లను ఆంధ్రా హిందువులు బాగానే గుర్తుపెట్టుకొంటున్నారు. 

అమరావతి బుద్ధుడిని చూపించి బౌద్ధ దేశాలనుండి పెట్టుబడులకు వెళ్లడం బాబు రాజకీయ వ్యూహమే. ఎప్పుడో 2017లో ఈడీ సిబిఐకి రాసిన ఓ లేఖను పట్టుకొని తెలుగు మీడియా రాద్ధాంతంచేసి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చే పనిలో బిజీగా ఉంది. ఇక రేపోమాపో కేసీఆర్ సామెతలు, వెటకారాలు, వ్యంగ్యోక్తులు, తిట్లు, నీతులు కలగలిసి బాబుగారికి కుంకుడుకాయ స్నానం చేయిస్తే గాని రాజకీయం రగుల్కోదు.
ఈమధ్యలో ఏదో నాజీ సైన్యంలా పేరుపెట్టుకొన్న జనసైన్యం, చేగువేరాలా గడ్డంపెంచి రాసిచ్చిన డైలాగులతో సగం కమ్యూనిస్టులా, ఇంకో సగం నేతాజీలా ఫోజులిస్తున్న పవన్‌కల్యాణ్ దారి ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు. సినిమా నటులపై సహజంగానే మనసుపారేసుకొనే ఆంధ్రా యువకులకు ఇది రాజకీయమా సినిమానా అర్ధంకాక చస్తున్నారు. దేశం ఎటు కొట్టుకుపోయినా పర్వాలేదని జనసేనను గెట్టు దాటకుండా కావలిగాస్తున్న కమ్యూనిస్టుల రాజకీయ భావదారిద్య్రం చెప్పనలవి కాదు. పవన్‌కల్యాణ్‌ను భాజపాతో కలవకుండా చేసేందుకు నారాయణ, రాఘవులు, రామకృష్ణ, మధు షిఫ్టులవారీగా కాపలా కాస్తున్నారు. 


జస్టిస్‌పార్టీ తోక సంబంధం ఉన్న కమ్యూనిస్టు, టీడిపి మైత్రికి ఇది పరాకాష్ట. ఈమధ్యలో కె.ఏ.పాల్ అనే రాజకీయ నాయకుడిని విదూషకుడిగా సోషల్ మీడియా మార్చుకుంది. క్రైస్తవుల ఓట్లను జగన్‌వైపు వెళ్లకుండా చూసేపనిలో ఇతనిద్వారా చేయిస్తున్నారని కొందరి అంచనా. నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిల్చిన జేడి లక్ష్మీనారాయణ, టీడిపిలో చేరడం అంటూ వెనుకనుండి ప్రచారంచేయడం ఎవరి పథకమో తేలాలా!? ఇక ఆంధ్రాలో కాపు కుల నాయకుల రాకపోకలు, పార్టీల చేరికలు అనే అంశం ప్రత్యేకంగా జరుగుతున్నా, ఇదంతా గుంభనంగా నడుస్తున్నది.

ఈ ఆటలో కాంగ్రెస్, బీజెపీల పాత్ర ఇంకా ఖరారు అవలేదు. దేశమంతా మోదీ, అమిత్‌షా, ఇతర జాతీయ నాయకులు కాలికి బలపం పట్టుకొని ఎన్నికల సంగ్రామంలోకి దిగితే ఇక్కడి భాజపా నాయకులు ఇంకా దాగిళ్లు మూగళ్ల ఆటలోనుండి బయటకు రావడంలేదు. బలమైన అభ్యర్థులుంటే హైద్రాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, కరీంనగర్, చేవెళ్ల సీట్లు సులభంగా గెలుచుకోవచ్చు. అలాగే ఆంధ్రాలో విశాఖ మొదలుకొని రాజమండ్రివరకు ఎన్నో సీట్లలో భాజపాకు అవకాశం ఉంది. ఇంతవరకు అభ్యర్థులు ఖరారు చేయకుండా అదే అసెంబ్లీ పంథాను అవలంభించి చర్చోపచర్చలు జరుపుతూ నామినేషన్ల వరకు అత్యంత గోపనీయత ప్రదర్శించడం హద్దులు మీరిన రాజకీయ క్రమశిక్షణ. ఇదే తేలేవరకు పుణ్యకాలం గడిచిపోయి ఉత్తరద్వార దర్శనం జరిగిపోతుంది. మోదీ బలాన్ని కూడా ఉపయోగించుకోలేని బలహీనతకు మందే లేదు. ఇక ఆంధ్ర కాంగ్రెస్ పరిస్థితి జనసేనకు తక్కువ ప్రజాశాంతి పార్టీకి ఎక్కువ. వేసవి కాలంలో వస్తున్న ఈ ఎన్నికలు తెలుగు ప్రాంతంలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఈ ఆటలో మాడేవారెవరో, ఓడేవారెవరో, గెలిచేవారెవరో నిలిచేవారెవరో చూడాలి.

************************************
 * శ్రీకౌస్తుభ *
 * ఆంధ్రభూమి *


శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక మార్గంలో అనేక సాధనలు చేశారు. పరమహంసలకే పరమహంసగా పేరొందారు. ఒకసారి శ్రీరామకృష్ణులు సతీసాధన చేయాలని మొదలుపెట్టారు. అది గోపికా మార్గం. శ్రీకృష్ణుడొక్కడే పురుషుడు, మిగిలినవారంతా స్త్రీలే అన్న భావనతో ఆ సాధన సాగుతుంది. రామకృష్ణులు గోపికగా మారిపోయారు. అంటే ఆ తత్వంలో జీవించారు. అనుక్షణం శ్రీకృష్ణారాధనలో మునిగిపోయారు. శ్రీకృష్ణుడి సంకీర్తనలు వింటే చాలు భావసమాధిలోకి వెళ్లేవారు. ఈ సాధన వల్ల రామకృష్ణునిలో అనేక మార్పులు సంభవించాయి. కొన్నాళ్లకు స్త్రీలమాదిరి గొంతు మారిపోవడం, స్తనాలు పెరగడం జరిగింది.
అయితే ఈ లక్షణాలు చాలా మంది పురుషుల్లో కూడా సంభవిస్తాయి. కానీ వైజ్ఞానిక చరిత్రలో ఎప్పుడూ జరగని మార్పు ఒకటి శ్రీరామకృష్ణుల సాధనలో జరిగింది. ఆయన సతీసాధన తీవ్రస్థాయికి వెళ్లేసరికి ‘మాసిక ధర్మం’ ప్రారంభం కావడం ‘నభూతో నభవిష్యతి’ అంటారు ఓ తత్వవేత్త. కేవలం స్త్రీలలో ఉండే ఆ ధర్మం శ్రీరామకృష్ణుల భౌతిక శరీరంలో సంభవించడం విశేషమే. అంతర్గతంగా రామకృష్ణుల సాధన శారీరక స్థితిగతులను మార్చివేసింది.
భక్తుడు తన ఇష్టదైవాన్ని బాలునిగా, సఖునిగా, తండ్రిగా లేదా తాతగా భావించి ఆయన వాత్సల్యం, ప్రేమ, వినయం, గౌరవం మొదలైన పద్ధతుల్లో కీర్తించడం ఈ సాధనలో ప్రత్యేకత. ఇదంతా భావసంకీర్తనం. అలాగే ఈ భావసంకీర్తనంలో భక్తుడు తనను నాయికగా భావించుకొని భగవంతుడిని నాథుడిగా భావించి, తలంచి కీర్తిస్తాడు. అదే విధంగా కొందరు దేవిని తన తల్లిగా, జగజ్జననిగా భావిస్తారు. ఇందులో జీవ-దేవుల మధ్య దగ్గరితనం కన్పిస్తుంది. వారిద్దరి తత్వంలో అభేదం కన్పిస్తుంది. దీనిలోని మార్మిక భావాలు ఎందరో సంకీర్తనాచార్యుల్లో కన్పిస్తుంది. దేవుడిని నాయకుడిగా తనను నాయికగా ప్రతి సంకీర్తనకారుడు చెప్పుకొన్నాడు. దీనిని మధుర భక్తి లేదా గోపికా మార్గం అంటారు. అలాగే ఈ భావ సంకీర్తన చేసే భక్తుడు దేవుడిని నాయకుడిగా, నాథుడిగా భావిస్తూ దేవేరిని దూతికగా సంబోధిస్తూ కీర్తనలు రాసుకున్నారు.
‘‘భామినీ వినవమ్మా నా స్వామినీ పిలువవమ్మా
భామినీ నీకొక్క పని విన్నవించేదా
మందయానరో హరుని మరులొందియున్నాను
కందర్ప జనకుని కన్నుల జూపవే
మనసువానిదాయె మాయదెలయదాయె
వనజాక్షి మును బ్రహ్మ రాసిన ఫలమేమో’’

అంటూ రాకమచర్ల వెంకటదాసు అయ్యవారికి చెప్పాల్సిన విన్నపాలను అమ్మవారికి చెప్పుకొంటాడు. అయితే ఈ భావసంకీర్తనం లేదా గోపికామార్గం ఈ మధ్య కొత్తగా వచ్చిందేమీ కాదు. ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుని ప్రేమించారు. ఓసారి ధనుర్యాగం కోసం కంసుడు మధురకు పిలిపించగా వెళ్లిన శ్రీకృష్ణుడు మళ్లీ ఇక గోకులానికి రాలేదు. అక్కడి గోపికలు అతని కోసం ఎదురు చూసి శ్రీకృష్ణ లీలలను తలచుకొంటూ, భావసంకీర్తనం చేస్తూ తాము పూర్తిగా కృష్ణమయమైపోయారు. అలాగే గోదాదేవి గోపికామార్గం ద్వారానే శ్రీరంగనాథుడిని చేపట్టింది. మీరాబాయి ఇదే మార్గంలో కృష్ణతత్వంలో లీనమైపోయింది. సాధకుడు భగవంతుని తత్వాన్ని ఆరాధిస్తూ, కీర్తిస్తూ ఆ తత్వంలోనే మునిగిపోవడం గోపికామార్గం. మానవులు కేవలం డబ్బులు, ఆస్తులు, పదవులు, అహంకారాలు, అధికారాలు, బంధాలు మాత్రమే శాశ్వతం అనుకొని వాటి వెంట వెర్రివాళ్లలా తిరుగుతుంటారు. అసలు జీవుడు శాశ్వతమైన పరబ్రహ్మం చుట్టూ తిరగాలనేది గోపికామార్గంలోని సందేశం. అందుకు భ్రమల్లో అస్థిరంగా జీవించే వ్యక్తులు భగవంతుడిని గట్టిగా పట్టుకోలరనే ఉద్దేశంతో భావసంకీర్తన ఒక ఉపదేశంగా, సాధనగా చెప్పబడింది.
-డా. పి. భాస్కర యోగి





***********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*
కొక్కొరో ... క్కో ... 
అవును ! అన్నీ నిజాలే !
అయ్యో! కథ అడ్డం తిరిగింది !

***********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
జాగృతి : వారపత్రిక 
 11 - 17 మార్చి - 2019
సంపుటి : 71, సంచిక : 19
 మాటకు మాటవిశ్లేషణ




‘ధ్వనికి ప్రతిధ్వని తప్పదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఈ రోజు నేను ఒక వ్యక్తిపై ఎమోషన్స్ వెళ్లగక్కితే, మళ్లీ నాకు అవి ఒక రోజు తప్పవు’ - అని ఓ ప్రసిద్ధ మానసిక తత్వవేత్త అన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అలాంటి ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సర్వే సర్వత్రా విన్పిస్తున్నమాట. నిజానికి బాబు చరిత్రను క్షుణ్ణంగా చదివినవారు వైఎస్, కేసీఆర్ మాత్రమే. ఇపుడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యయనం నడుస్తున్నది. 2014లో భాజపా, జనసేనలను మిత్రపక్షాలుగా చేసుకొని ఎన్నికల బరిలోకి దిగిన బాబుకు విజయం నల్లేరుపై నడక అయ్యింది. ఎపుడు ఏ సూత్రం ఎక్కడ వాడాలో బాగా తెలిసిన రాజకీయ గణికుడు, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన రాజకీయ ఘటికుడు చంద్రబాబు అని ఆయన మనస్తత్వం విశే్లషించిన వాళ్లకు తెలుసు. అయితే రాజకీయాల్లో ఎల్లకాలం అవకాశవాదానికి తావు ఉండదు. దాని పరిమితులు దానికి ఉంటాయి.

భాజపాతో పొత్తు బెడిసికొట్టిన తర్వాత రోజూ అదే పనిగా మోదీని తిట్టడం మొదలుపెట్టాడు బాబు. ‘అతి సర్వత్ర వర్జయేత్’- ప్రజలు కూడా ‘అతి’ని స్వీకరించరు. రోజూ తన అనుచర గణంతో అనుకూల మీడియాలో ప్రధానిని బూతులు తిట్టించడాన్ని చదువరులు చాలామంది ఏవగించుకొన్నారు. మొదట ఉత్తర -భారత, దక్షిణ-భారత అనీ, తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనీ, ఆ తర్వాత తనపై నేరుగా దాడి జరుగుతుందని చంద్రబాబు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. తనపై వచ్చే ప్రతి రాజకీయ ఆరోపణతో తెలుగు ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్న సెంటిమెంటును ప్రజల్లోకి తీసుకొని వెళ్లడాన్ని బాబు, ఆయన అనుకూల మీడియా వారు పనిగా పెట్టుకున్నారు. భాజపాను, మోదీని దోషిగా చూపించాలనే ప్రయత్నం కొంతవరకు ఫలించిందనే చెప్పవచ్చు.


మొదట చంద్రబాబు అక్కసును మోదీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఢిల్లీలో కొంతకాలంగా బాబు చేస్తున్న అనవసర యాగీ మోదీని ఆలోచించేట్లు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా- చంద్రబాబు, లోకేశ్, ఇతర మంత్రుల, టీడిపి నాయకుల అవినీతిపై మోదీ గుర్రుగా ఉన్నందునే ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని అంతర్గతంగా జరుగుతున్న చర్చ. వాజపేయిలా మోదీ చంద్రబాబుకు పెద్దరికం ఇవ్వకపోగా, తీవ్రంగా మందలించినందువల్లనే రెండు పార్టీల పొత్తు పెటాకులైందని ఢిల్లీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆంధ్రలో ప్రభావం చూపలేని భాజపాను విలన్‌ను చేసి తన ప్రాబల్యం నిరూపించుకొన్న చంద్రబాబు- ఇటీవలి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌పై ఇలాగే ఒంటికాలిపై లేచాడు. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, ఖమ్మంలలో చేసిన ప్రచారం పైకి ‘పొంగులా’ కన్పించింది. కానీ అది వికటిస్తుందని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియదు.


ఆంధ్రా, సీమ ప్రాంత్రాల నుండి వచ్చి ఎందరో హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏ ర్పరచుకొన్నారు. వారు తె లంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు. కానీ ఇటీవల తెలుగుదేశం చేస్తున్న ఒక విష విఫల ప్రయోగం జాతుల మధ్య సంఘర్షణగా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ వీటన్నిటికీ చెక్ పెట్టి బాబుతోపాటు కాంగ్రెస్‌ను కూడా రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఎన్నికలు అయ్యాక కేసీఆర్ తన సహజ ధోరణిలో ఒక రాజకీయవేత్తగా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నాడు. ఆ తర్వాత ఓసారి ఒడిశాకు వెళ్తూ మధ్యలో విశాఖ శారదాపీఠం దర్శించాడు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓసారి ఆంధ్రకు వెళ్లొచ్చాడు. ఇంతకుమించి వాళ్లు బాబును ఏమీ అనలేదు. కానీ ఆ రోజునుండి బాబు అనేకసార్లు కేసీఆర్‌ను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కేసీఆర్, మోదీ, జగన్, పవన్‌లు అమాయకుడినైన తనపై యుద్ధానికి వచ్చారని సానుభూతి కోసం రోజూ ఏదో ఒక మీటింగ్ పెట్టి చర్వితచర్వణంగా చెప్తూనే ఉన్నాడు. పురంధేశ్వరి కుమారుడు వైఎస్ జగన్‌ను కలిస్తే అది కూడా మోదీ చేయించాడని చెప్పడం బాబుకున్న అభద్రతా ధోరణికి అద్దం పడుతున్నది. ఇపుడివన్నీ దాటిపోయి ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణపై యుద్ధానికి తెలుగుదేశం తలపడుతున్నది. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థలు తమ రాష్ట్రాల గురించి మాట్లాడడం కూడా రాజకీయం చేస్తున్న దౌర్భాగ్య స్థితికి ఆయన తెర తీసారు.

ఒక సమస్య వచ్చినపుడు- కోర్టులు, పోలీసులు, సీబిఐ, సిఐడి, ఈడి, ఎన్నికల కమీషన్.. లాంటి సంస్థలు కాకుండా ఇంకెవరు దాన్ని పరిష్కరించాలి? ప్రతిదానిని పార్టీ, కులం , ప్రాంతం దృక్కోణాల్లో చూస్తే మన సమస్యలను ఏ దేశం వాళ్లు విచారించాలి? ఐటీ గ్రిడ్స్ కేసులో ఒకవేళ వైకాపా తప్పు చేస్తే తెలుగుదేశం నేతలు ఎందుకు ముందుగా ఫిర్యాదు చేయలేదు. ఒక సమస్య వచ్చినపుడు దానిని పోలీసులు లేదా దర్యాప్తు సంస్థల పరిధిలోనే ఉంచే విజ్ఞత మన రాజకీయాలకు కొరవడిందా? తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేస్తే దానిపై పరువునష్టం దావా వేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఎన్నికల ముందు కేసీఆర్‌ను రెచ్చగొట్టి, ఆయన ఏదైనా మాట్లాడితే దానిని ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్‌గా మార్చాలన్న దురూహ కాక ఇంకేమిటి? డేటా చోరీ కేసుకన్నా ముందే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా పారిశ్రామికవేత్తలపై కఠినంగా వ్యవహరిస్తోందని అని చంద్రబాబు ఆరోపణలు మొదలుపెట్టారు. నిజానికి తెలంగాణ ఆర్థిక కుబేరుల్లో నారా లోకేశ్, నారా భువనేశ్వరి కూడా ఉన్నారు కదా? మరి వారికి ఏమైనా జరిగిందా? ఎం దరో ఆంధ్ర ప్రాంత టీడిపి నాయకులు కోట్ల ఆస్తులు హైదరాబాద్‌లో సంపాదిస్తే వారిపై ఈగనైనా వాలిందా? పదేళ్లు ఉమ్మడి రాజధాని అంటూ కబుర్లు చెబుతున్నవాళ్లకు హైదరాబాద్ పోలీసుల వైఖరి దుర్మార్గంగా కనిపించిందా?


రోజూ ప్రజాస్వామ్యం అని మాట్లాడే బాబు ప్రభుత్వం టీటీడీని, దేవాదాయ శాఖను ఎందుకు సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలోకి తీసుకురాలేదు. సాలీనా 3500కోట్లకు పైగా హిందువులు వేస్తున్న హుండీ సమర్పణలు, కానుకలను వేసిన వాళ్లకే తెలుసుకొనే హక్కు లేదా? చంద్రన్న కానుకలు, అన్న క్యాంటీన్లు వంటి ఇతర పథకాలలో కేంద్రం భాగస్వామ్యాన్ని ఎప్పుడైనా ఒప్పుకొన్నారా? కొందరు టీవీ సంస్థల అధినేతలు ఈమధ్య బరితెగించి బాబు వెంట నిలుస్తున్నారు. ఇది పాత్రికేయ విలువలకు గొడ్డలిపెట్టు లాంటిది! ఇపుడు ప్రపంచ సమస్య అంతా ఏపీకి ప్రత్యేక హదాలోనే ఉంది అన్నట్లు ప్రైమ్‌టైమ్ చర్చల్లో వాదోపవాదాలు చూసి జనం నవ్వుకుంటున్నారు. దానికి మోదీని బలిచేయడం టీవీ చానళ్లు పనిగా పెట్టుకున్నాయి. 


మొన్నటివరకు మోదీ, కేసిఆర్, జగన్, పవన్ అన్న దూషణలతో సాగిన ఈ వ్యవహారంలో- ఒక్కసారిగా పవన్‌ను ఇందులోంచి ప్రక్కకు జరిపారు. ఇటీవల పవన్‌కళ్యాణ్ బాబుతో ఎన్నికలకు కలిసి వెళ్తారని జరుగుతున్న ప్రచారానికి ఇదొక సంకేతంగా కన్పిస్తున్నది. ఎందుకంటే బాబు ఏనాడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన పాపాన పోలేదు. 1983లో కాంగ్రెస్‌ను తుంగలో తొక్కి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి వెళ్లాడు. అదే ఎన్టీఆర్‌కు ఆయన ఘోర పరాభవం రుచి చూపించి 1995లో తెలుగుదేశాన్ని హస్తగతం చేసుకొన్నారు. ఆ తర్వాత 1998లో యునైటెడ్ ఫ్రంట్‌కు హ్యాండ్ ఇచ్చి 2004లో బిజెపికి, 2009లో టీఆర్‌ఎస్‌కు, 2013లో వామపక్షాలకు, 2018లో మళ్లీ బిజెపికి.. ఇలా ఒకరిని వదిలేసి ఇంకొకరిని పట్టుకోవడం రాజకీయ వ్యూహం అనుకున్న బాబు ఇక ఇపుడు కాంగ్రెస్ పంచన చేరాడు. చివరకు ఆయన పొత్తు పెట్టుకోకుండా పోయింది వైకాపాతోనే! ఇప్పటివరకూ భాజపా, వామపక్షాల భుజాలపై స్వారీ చేసిన చంద్రబాబు ఆయా పార్టీల కేంద్ర నాయకత్వాలను తన జేబులో పెట్టుకొని చక్రం తిప్పాడు. ఇపుడు భాజపా కేంద్ర నాయకత్వం కళ్లు తెరిచింది కానీ వామపక్షాల ఉలిపికట్టె దారి మాత్రం మారలేదు.

ఇలాంటి రాజకీయ అస్థిర మనస్తత్వం వున్న వ్యక్తిగా బాబు కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించడం ఉత్తరాది నాయకులకు ఇష్టమూ లేదు, నమ్మకమూ లేదు. కానీ మోదీపై అక్కడున్న కొందరు నాయకుల గుడ్డి వ్యతిరేకత బాబుకు స్థానం కల్పించింది. భాజపాకు ఏపీలో ఎన్ని స్థానాలొస్తాయో చెప్పలేం గానీ చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడంలో అమిత్ షా, రాం మాధవ్ వ్యూహం ఫలించింది. దాని పర్యవసానమే డేటాచోరీ వరకు వెళ్లింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ‘్ఫర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ వున్న చంద్రబాబు సత్యం తెలుసుకుంటే మంచిది. ‘రాజకీయాన్ని పదవుల కోసం వాడుకోవాలి కానీ పదవులను రాజకీయాల కోసం వాడకూడదు’ అని గుర్తించాలి. యూటర్న్‌లు మంచివే కానీ అవి వికటిస్తే విశ్వాసం సన్నగిల్లుతుంది. 18-09-1995న మహానటుడు ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనతో మాట్లాడుతూ- ‘రాజ్యం కోసం తండ్రిని చంపి న కొడుకులు, మామల కాళ్లు నరికిన అల్లుళ్ళు ఉన్నారని చరిత్రలో వుంది. అదే పునరావృతమవుతోంది. పదవులు శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. ఈ ద్రోహం మాత్రం చరిత్రపుటల్లో మిగిలిపోతుంది’ అన్నారు. ఈ యూటర్న్‌లు ద్రోహాలుగానే చెప్పవచ్చు. వాటి తీవ్ర పర్యవసానమే ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లో ‘చంద్రుడి’కి పడుతున్న గ్రహణం!


************************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి *
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *




భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్షగోయెంకా సోషల్ మీడియాలో ఓ ఫొటోను ట్వీట్‌చేసాడు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. గుజరాత్‌లోని మీరట్ పట్టణంలో ఓ ధనవంతుల పెళ్లి ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా సాగుతున్నది. పెళ్లికొడుకు గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వస్తున్నాడు. అయితే విచిత్రంగా ఆ పెళ్లి కుమారుడికి ఓ శవయాత్ర ఎదురయ్యింది. శవం అడ్డురావడం శకునాల్లో మంచిదంటారు. ఒకవైపు భాజభజంత్రీల ఊరేగింపు, మరోవైపు శవయాత్ర. ఆశ్చర్యం ఏమిటంటే ఆ శవయాత్రలో ‘భారత్ మాతాకీ జై’ అన్న నినాదాలు మార్మోగుతున్నాయి. ఏమిటా అని పెళ్లికొడుకు చూసాడు. ఆ శవయాత్ర ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మన భారత జవాను అజయ్ కుమార్‌ది. వెంటనే పెళ్లికొడకు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన పెళ్లి శోభాయాత్ర ఆపేసి తాను ‘భారత్‌మాతకీ జై’ అంటూ సెల్యూట్ చేశాడు. ఈ దేశం కోసం, ఈ మట్టికోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అజయ్‌కుమార్ పార్థివదేహం ముందుకు కదిలింది.

ఈ ఉద్విగ్నత ఫిబ్రవరి 26 తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ దేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలో కొనసాగింది. పుల్వామా అమరుల పార్థివదేహాల చుట్టూ వారి కర్మకాండలు నిర్వహించే వారసుడిలా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తిరుగుతుంటే ఆయన హృదయం ఎంత బరువెక్కిందో చెప్పలేం. కానీ ఆ తర్వాత 12 రోజులు భారతీయుల మనస్సులు దుఃఖంతో రగిలిపోయాయి. సరిగ్గా 13వ నాడు 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ 21 నిమిషాల్లో చేసిన ‘సర్జికల్ స్ట్రైక్’ భారతీయులను భావోద్వేగాలకు గురిచేసింది. అదేరోజు ఈ దేశ ప్రధాని రాజస్థాన్‌లోని ‘చురు’ సభలో మాట్లాడుతూ ‘‘ఈ మట్టిపై ప్రమాణం చేసి చెబుతున్నా! నేను భారతమాతకు మాట ఇస్తున్నా! దేశాన్ని నాశనం కానివ్వను. ప్రయాణం ఆగనివ్వను.. తలవంపులు తీసుకురాను! ఈ దేశాన్ని తలవంచుకొనేలా చేయను.. నా దేశం మేలుకొని ఉంది’’ అన్న కవిత సర్జికల్ స్ట్రైక్ ఘటనకు అనుబంధంగా ఉంది.

గతంలో లుంబినీ, గోకుల్ చాట్, ఢిల్లీ, ముంబయి వంటి చోట్లలో దాడి చేస్తే ప్రపంచ దేశాల వద్దకు పరుగెత్తుకొనిపోయి వివరణ ఇచ్చుకొనేవాళ్లం. ఇపుడలా కాదు. భారత్‌కు వెన్నుదన్నుగా అనేక దేశాలు నిలబడ్డాయి. ఒక్క చైనా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తే మిగతా అన్ని దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, డొమినిక్ రిపబ్లిక్, భూటాన్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాల దౌత్యవేత్తలకు సర్జికల్ స్ట్రైక్ చేసి మన విదేశాంగ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. విచిత్రంగా ఇపుడు దేశంలోని రాజకీయ ప్రత్యర్థులుగా మోదీపట్ల విపరీతమైన ద్వేషం కక్కుతున్నవాళ్లు కూడా ‘జై జవాన్’ అన్నారు. దీనికి మద్దతుగా నిలిచిన అసదుద్దీన్ ఓవైసీకి సోషల్ మీడియా ప్రశంసలు గుప్పించింది. రేపు ఏం మాట్లాడుతాడో తెలియదు కానీ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ జవాన్లకు సెల్యూట్ చేసింది. ఇక మమతా బెనర్జీ, ఐఎఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అన్న అర్థమే కాదు ఇండియన్ అమేజింగ్ ఫైటర్స్ అంటూ మన జవాన్లను ప్రశంసలతో ముంచెత్తింది. ఇపుడు మోదీ చేసిన ప్రతీ పనీ వ్యతిరేకించాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు సాయంత్రానికి బాగా ఆలోచించి ‘మన సైన్యం శహబాష్’ అన్నాడు. ఇక పుట్టుకతోనే దేశభక్తిని, జాతీయవాదాన్ని ద్వేషించే కమ్యూనిస్టు పార్టీ విమర్శలకు బాటలు వేసింది. సీపిఐ నేత కొడియేరి బలాకృష్ణన్ యథాలాపంగా ఇదంతా ఎన్నికల కోసమే అంటూ స్పందించారు. అయినా దరిద్రం కాకపోతే ఈ దేశంలో ఎన్నికలు లేనిదెపుడు? ప్రతి మూడు నెలలకు ఓసారి ఎన్నికలు ఎక్కడో ఓచోట జరుగుతుంటాయి. ఎప్పుడూ ఎన్నికల కొరకే పనిచేస్తే మరి దేశం కోసం ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చస్తారు!?

నిజానికి పాకిస్తాన్ మనల్ని వ్యతిరేకించడం రాజకీయ, భౌగోళిక కారణం అనుకుంటే పొరపాటు. కృత్రిమంగా వండివార్చిన ‘ద్విజాతి సిద్ధాంతం’ ఈ దుష్పరిణామాలకు దారితీసింది. ఇపుడున్న పాకిస్తాన్‌లోని లాహోర్ శ్రీరామపుత్రుడైన ‘లవుడి’ పేరుమీద ఏర్పడింది. సింధు నదీ ప్రాంతం గొప్ప నాగరికతలకు ప్రసిద్ధి చెందింది. శ్రీ శంకరాచార్య పర్వతం, క్షీరభవానీ మందిరం, మోక్ష సరస్వతీ మందిరం, అమర్‌నాథ్, ఢాకేశ్వరీ భవానీ.. ఇవన్నీ సింధూనదీ తీరానికి ఆవల ఈవలున్న హైందవ సాంస్కృతిక కేంద్రాలు. కాశ్మీర్ కశ్యపుడి పేరుతో పుట్టింది. వరాహస్వామి పేరుతో వున్న ‘వారాహమాల’ దేశమే ఈనాడు బారాముల్లాగా పిలుస్తున్నారు. ఇంత సాంస్కృతిక సంపదతోపాటు ఎందరో సామాజిక, చారిత్రక పురుషుల జన్మస్థలాలు భారత విభజనతో హిందువులు వదులుకున్నారు. ఇపుడు సింధీ, బెలూచీ, పంజాబ్ భాషలను పాకిస్తాన్ మత తత్వశక్తులు అణచేసి ఉర్దూను వారిపై బలవంతంగా రుద్దుతున్నారు. అలా అణచివేయబడిన బంగ్లాదేశీయులు భాష పరంగా గల ఉద్విగ్నత కోసమే 1971లో బంగ్లాదేశ్‌గా తమ దేశాన్ని పాక్ నుండి వేరుచేసుకున్నారు. అనేక తెగలు ఈ మత తత్వశక్తుల ధాటికి తమ సాంస్కృతిక వైభవాన్ని కోల్పోయారు. వహాబిజం ద్వారా అరబ్ సంస్కృతిని ప్రపంచంపై రుద్దే దౌష్ట్యం దాదాపు 1400 ఏళ్ళనుండి కొనసాగుతున్నది. దాని లక్ష్యమే ద్విజాతి సిద్ధాంతం పేరుతో మహమ్మదాలీ జిన్నా పాకిస్తాన్ పేరుతో సాధించాడు. అలా మొదలైన మహమ్మద్ బిన్ కాసిం వారసత్వం జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కొనసాగిస్తున్నాడు. అతని దృష్టిలో కాశ్మీర్‌ను సాధించడం ‘్భగోళిక విజయం’ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే! భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలన్న సుదీర్ఘ లక్ష్యం వాళ్లకుంది. ఎందుకంటే భౌగోళిక విజయమే అయితే మనకన్నా ఎక్కువ రెట్ల భూభాగం ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన దేశంలోని ప్రాచీన సంస్కృతిని విధ్వంసం చేయడం వారి అంతిమ లక్ష్యం. ఇది గుర్తించకుండా ఈ డెబ్భై ఏళ్లు మనం చేసిన పోరాటం ఇసుకనుండి తైలం తీయడమే. దీనిని భౌగోళిక, రాజకీయ సమస్యగా భావించే కమ్యూనిస్టులు, బుద్ధిజీవులు ఎప్పుడూ చర్చలు జరగాలని సుద్దులు చెప్తారు. వేర్పాటువాద నేతల ఇళ్లముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడతారు. కాశ్మీరీల హక్కులు అంటూ మీడియాలో గోల చేస్తారు. నిజానికి కాశ్మీర్ లోయలోని ఐదు జిల్లాల్లో మాత్రమే ఇలాంటి విపత్కర పరిస్థితి ఉంది. మిగతా జమ్మూ, లడఖ్‌లో దీనికి భిన్నమైన స్థితి. ఈ సోకాల్డ్ నేతలు, బుద్ధిజీవులు మాట్లాడేది ఈ ఐదు జిల్లాల్లోని దేశ వ్యతిరేక శక్తుల హక్కుల గురించే? మిగతా 11 జిల్లాల ప్రజలు కూడా కాశ్మీర్ రాష్ట్రంలో భాగమే అని ఈ హక్కుల నేతలు ఎందుకు గుర్తించరు? అలాగే కాశ్మీర్ నుండి తరిమివేయబడిన పండిట్ల గురించి ఎర్రకళ్ళు ఎందుకు మాట్లాడవు? ‘చురు’లో మోదీ ‘దేశం మేల్కొంటుంది’ అన్న మాటల్లోని మార్మికత ఇదే. ఇప్పటివరకు చేయని పని పుల్వామా దుర్ఘటన తర్వాత జరుగుతున్నది.

పుల్వామా ఘటన జరిగిన 24 గంటల్లోపే మోస్ట్ ఫెవర్డ్ నేషన్ ఎంఎఫ్‌ఎన్ హోదాను భారత్ ఉపసంహరించింది. విదేశాలతో మాట్లాడి దౌత్య విజయం సాధించింది. సింధులోని జలాలు పాకిస్తాన్‌కు ఆపేసింది. పుల్వామాలో సైనికుల మరణానికి మూల సూత్రధారి ఘాజిని వంద గంటల్లోనే మట్టుబెట్టింది. హురియత్ నేతలకు రక్షణ ఉపసంహరించింది. ఎన్‌ఐతో వాళ్ల ఇళ్ళల్లో సోదాలు చేయించింది. కుల్గాం జిల్లాలో ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను మన సైన్యం అరెస్టు చేసింది. చివరి వ్యూహంగా మన వీరజవాన్ల స్థూపాలముందు ఉంచిన క్రొవ్వొత్తుల వెలుగులు ఆరకముందే మిరాజ్ 2000 విమానాలతో జైషే ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడి చేసి వౌలానా తెహ్లా సైఫ్, యూసుఫ్ అజర్, వౌలానా అమర్, ఇబ్రహీం అజర్ వంటివాళ్లను తుదముట్టించినట్లు తెలుస్తోంది. ఇది ఈ వారంలో ఒక ఘనత.

ఇక రెండవ విషయానికి వస్తే ఈ రోజు దేశంలో కులవ్యవస్థ ఓ కుటిలమైన దారిదీపంగా మారింది. దళితుల బహుజనుల ఉద్ధరణకు ఈ దేశంలో ఎందరో సంస్కర్తలు ప్రయత్నించారు. వజ్రసూచికోపనిషత్ మొదలుకొని డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ వరకు అందరూ కులతత్వాన్ని నిరసించారు. భారతదేశంలో నడిచే శవాలుగా, ఇతర దేశాల్లో బరువు మోసే జంతువులను చూసినట్లు కొన్ని కులాలపై వివక్ష జరిగిందని స్వామి వివేకానందనే చెప్పారంటే ఇది ఒక మానసిక రుగ్మతగా కొందరిలో కరడుగట్టుకొని ఉందన్నమాట. దానిని మనలో తగ్గించి సామాజిక సమరసత సాధించేందుకు నర్సీ మెహతా హరిజన వాడల్లో అమృత గానంచేశాడు. దయానందుడు అందరికీ వేదంపై హక్కు ఉందన్నాడు. ఆదిశంకరులు ‘చండాలపిమమగురు’ అన్నాడు. రామానుజుడు దళిత ఆళ్వార్లకు గొప్ప స్థానం ఇచ్చాడు. బసవేశ్వరుడు మాదిగ హరళయ్యను తన హృదయానికి హత్తుకొన్నాడు. శ్రీరమణుడు హరిజనుడికి శివమంత్రదీక్ష ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు దళిత బస్తీల్లో ఊడ్చారు. గాంధీజీ తాను దళితుడిగా మరో జన్మ ఎత్తుతానన్నాడు. స్వామి శ్రద్ధానంద దళితులకు ఆలయ ప్రవేశం చేయించేందుకు ప్రయత్నించాడు. పూలే బడుగులకు పూలదారి చూపించాడు. 

అంబేద్కర్ విషాన్ని మ్రింగి అమృతాన్ని పంచిపెట్టాడు. పండరి భక్తులు కులతత్వాన్ని భక్తి అమృతత్వంతో మటుమాయం చేశారు. బ్రహ్మనాయుడు చాప కూడుపెట్టి మాలకన్న మదాసును కౌగిలించుకున్నాడు. వీరబ్రహ్మేంద్రులు కక్కయ్యకు ఆత్మజ్ఞానం చెప్పాడు. స్వామి నారాయణ, కబీరు, గురునానక్, బుద్ధుడు, మహావీరుడు, అన్నమయ్య సామాజిక సమరసతను సమన్వయంతో సాధించారు. నారాయణగురు శూద్ర కులాల ఆత్మగౌరవం కాపాడినాడు. వీళ్లందరూ గడిచినకాలంలో సంస్కరణ దృష్టితో కుల తత్వంపై యుద్ధం చేశారు కానీ మన కళ్లతో చూడలేదు. కానీ ఫిబ్రవరి 24 నాడు భారత ప్రధాని కుంభమేళాకు వెళ్లి పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడగడం ఓ చారిత్రక ఘట్టంగా చెప్పవచ్చు. పైన చెప్పిన సంస్కర్తలంతా వారి వారి కాలాల్లో ఇలాంటి చిన్నచిన్న పనులతోనే మహోజ్జ్వల ఘట్టాలకు శ్రీకారం చుట్టారు. దురదృష్టం ఏమిటంటే మనం మన కళ్లముందు కదలాడే చరిత్రకన్నా గతంలో జరిగినదానికి, చచ్చినవారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే అలవాటుచేసుకున్నాం. 

పైపైన తళుకులగురించే ఆలోచించే మనం దేశాన్ని శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల గురించి ఆలోచన చేయం. కానీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మునుపెన్నడూ లేనివిధంగా ప్రయాగరాజ్ కుంభమేళాలో నిరంతరం మాలిన్యాలను శుభ్రం చేసేవారికి కృతజ్ఞతగా వారి పాద ప్రక్షాళన చేసి ఋణం తీర్చుకొన్నారు. ‘‘కుంభమేళా విజయవంతానికి నిరంతరాయంగా కృషిచేస్తున్న నా సోదరులైన అత్యంత కష్టపడుతున్న కర్మయోగులు’’ అని పారిశుద్ధ్య కార్మికులనుద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలు సువర్ణాక్షరాలు. ఇదొక చారిత్రక ఘట్టం. నది ప్రవహిస్తుంటే ఆ ప్రవాహం ఎంత పెద్దదిగా ఉన్నా ప్రతిచోటుకూ విలువైన పేరు దొరకదు. ఎక్కడ గొప్ప క్షేత్రం ఉంటే నదీ - క్షేత్రం రెండూ పుణ్యతీర్థాలవుతాయి. అలాగే చరిత్ర ఎంత పెద్దగానైనా ఉండవచ్చు. దానికున్న పవిత్ర ఆచరణే మైలురాయిగా నిలబడుతుంది. సరిగ్గా మోదీ చేసింది ఇదే. అందుకే ఇది ఈ వారంలో రెండవ ఘనకార్యం.


************************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి *
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *


మన ఊరు మనగుడి
గొలగమూడి వెంకయ్య స్వామి వద్ద అభ్యసించిన రాజయోగాన్ని వేంకటరమణులు కొనసాగించారు. అది క్రమంగా యోగమార్గంగా, ఆత్మమార్గంగా మారింది. ఈ మార్గానికి తోడు సద్గురు శివానందమూర్తి వాత్సల్యం, రమణులను ఆధ్యాత్మిక క్షేత్రంలో మరింత రాటుదేల్చింది. ఆ వాత్సల్యం ‘నేను’ అనే ఆత్మస్వరూపాన్ని అన్వేషణ చేసేట్లు చేసింది. అందులోనే ప్రపంచస్థితి అర్థం అయ్యింది.
“ఇతర ప్రాణులన్నీ సృష్టికార్యంలో హాయిగా సాగిపోతుంటే మనిషికే ఎందుకు దుఃఖం, బాధ, మనోవ్యధలు వెంటాడుతున్నాయి? అసలు మనిషి జీవితానికి గమ్మం, లక్ష్యం ఏమిటి? ఈ సృష్టిలో ఏ ప్రాణికి కలగని ‘నేను’ అనే భావన మనిషికే ఎందుకు కల్గుతుంది? అసలు నేను అనిపించడం చేతనే కదా స్వార్ధం పేట్రేగి మనిషిని దురాశాపరుణ్ణి చేస్తుంది? ఇతర ప్రాణులకు నేను అనే స్వార్ధమే లేకపోవడం చేతనే కదా అవి సృష్టికార్యంలో హాయిగా జీవిస్తున్నాయి! ఇలాంటి దివ్యమైన ఆలోచనలెన్నో రమణుల్లో కలిగాయి. అవన్నీ వేదాంత పరిప్రశ్నలుగా మారిపోయాయి.
ఇలాంటి విషయాలను సద్గురువుతో చర్చించారు, తర్కించారు. “ఈ సృష్టిలోని ప్రాణులన్నీ ఈశ్వర స్వరూపాలే. అవన్నీ సృష్టికార్యంతో ఏకత పొంది జీవనం సాగిస్తున్నాయి. అవి ఉన్నట్లు కూడా వాటికి తెలియదు. అవన్నీ ఈశ్వర కార్యంలో అంతర్భాగమై సాగగలవేకానీ ఇది ఈశ్వర కార్యం అని ఏనాటికీ గుర్తించలేవు. జీవితంలో అన్నింటినీ అనుభవిస్తూ వెళ్లగలవేగానీ ఆ అనుభవానికి కారణమైన దాన్ని అవి గుర్తించలేవు. అక్కడే మనిషి ఔన్నత్యం ఉంది.” అంటూ చర్యల్లో లభించే పరిష్కారం. అంతరంగంలో ఇలాంటి ప్రశ్నలు వాటికి సమాధానాలు పరంపరగా కొనసాగేవి.
ఈ భావపరంపర రమణుల్లో తీవ్ర ఆధ్యాత్మిక కాంక్షను రేకెత్తించింది. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఆధ్యాత్మిక దర్శనం చేయించింది. సాధారణంగా అందరు గురువులు ఆధ్యాత్మికమార్గం అనగానే వేదాంత గ్రంథాల్లో వెతుకుతారు. అలా కాకుండా సాధారణ విషయాల్లో భగవదర్శనం చేయడం మొదలుపెట్టారు. హిమవత్పర్వత సాధువుల్లోని ఈశ్వరతత్వాన్ని దర్శించడానికి వెళ్లిన రమణులు నమకచమకంలో ‘నమోగిరిశాయచ శిపినిష్ఠాయచ” అన్న శ్లోకంలో గిరిశాయచ, కైలాసవాసియగు శివునిగా, శిపినిష్టాయ - విష్ణు స్వరూపంగా ఉన్న రుద్రునకు నమస్మాకం. కైలాసివాసి అయిన శివుడినే కాదు సర్వవ్యాపకుడైన విష్ణువుగానూ ఆయనే ఉన్నాడని చెప్పిన శ్లోకభావం మన విధానాల్లోని విశాలత్వాన్ని స్ఫురింపచేస్తుంది.
సద్గురువు మధ్య జరిగిన సంభాషణలు, ఆలోచనలు “ఒక (ఊ)రికథ”గా పుస్తకాన్ని వేయించారు. అందులో ఓ చోట ఆ గురుమూర్తి గొప్పతనం చెప్తూ “సంస్కృతీ సంప్రదాయాలకు, అద్వితీయమైన భారతీయతకు ప్రతిరూపంగా నిలిచే ఆ సద్గురుమూర్తి అనువాక్కుల ప్రతిపదంలోనూ తొణికిసలాడుతూ కనిపించారు. పూర్వీకుల జ్ఞాన వైభవాన్ని తపఃసంపదను తరతరాలుగా అందిస్తూ వస్తున్న ఆ దివ్యమూర్తి జీవనశైలిని గమనిస్తే ప్రతి కదలికలోనూ చమకమే కనిపిస్తుందికదా అనిపించింది” అంటారు. అంతటి గురుభక్తి ఆ సద్గురువుపై ఉంది కాబట్టే ఆశ్రమానికి ‘గురుధామ్’ అని పేరు పెట్టి అందులో సద్గురువు ప్రతిమని ప్రతిష్టించి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను వారు చేస్తున్నారు.
రమణుల ప్రతీ పుస్తకం ఓ ఆత్మజ్ఞానమే!
బ్రహ్మబాబా తన ఆధ్యాత్మిక అనుభూతులను ‘మురళీల’ రూపంలో చెప్పాడు. కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఉపన్యాసాలుగా, మరికొందరు ఆశీర్వాదాలతో, ఇంకొందరు ప్రేమవదనంతో తమ సందేశాలను ఇస్తుంటారు. బ్రహ్మజ్ఞానం పొందిన ఈ రమణులు మాత్రం తమ అనుభూతులను పుస్తకాల రూపంలో వెలువరించారు. తమ అనుభూతులను శాస్త్రాన్వయం చేయడానికి గొప్ప ఆత్మజ్ఞాన గ్రంథాలను ఎంచుకొన్నారు. అందులో శుద్ధమైన ఆత్మజ్ఞానం గల అష్టావక్రగీత చెప్పుకోదగింది.
“గురువు ఒంట్లో ఉన్న తీపిని తీసెయ్యడు. ప్రాపంచిక విషయాలపై మనకున్న తీపిని పోగొడుతాడు. శరీరంలో ఉన్న మధుమేహాన్ని కాదు. మనసులో ఉన్న మోహాన్ని తీసేయడమే గురువు కర్తవ్యం” అంటూ ఓ చోట అష్టావక్ర గీతలో వ్యాఖ్యానం చేస్తాడు. అలా శిష్యుని దేహాభిమానతత్వాన్ని పోగొట్టేదే అష్టావక్రగీత. అందులోని ఆత్మవిషయాన్ని ప్రస్తావిస్తూ. 
అపార మహాసముద్ర రూపుడనగు నా యందు జాగద్రూపమగు కల్లోలము ఉదయించునుగాక, లేనిచో లయంను పొందునుగాక అయిననూ నాకు వృద్ధియును లేదు. హానియును లేదు. ఆత్మ దేహాది భావాలలో లేదు. దేహాదిభావం ఆ అనంతమైన, నిరంజనమైన ఆత్మయందు లేదు. ఈ ప్రకారంగా సంగరహితుడైన, శాంతుడనైన నేను ఈ ఆత్మ స్వరూపడనయ్యే ఉంటున్నాను. జ్ఞాని సుఖవంతుడు కాదు, దుఃఖితుడును కాడు. విరక్తుడనుకాడు, సంగియుకాడు, ముముక్షువు కాడు, ముక్తుడను కాడు, అతనికి ఏమియును లేదు.
ఏమియుకాదు. ఉపశాంత చిత్తంగల జ్ఞాని జనంతో వ్యాప్తమైన ప్రదేశంనుగాని అడవిని గూర్చిగాని పరిగిడడు. మరేమనగా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా సమభావం గలవాడై ఉంటున్నాడు. అజ్ఞాని కర్మలను చేయనివాడైనప్పటికీ అంతట, సంకల్ప వికల్ప రూప సంక్షోభ కారణం వలన వ్యాకులుడుగా అగుచున్నాడు. నేర్పరియగు జ్ఞానికర్మలను చేయచున్న వాడైనను మరేమనగా కులం లేనివాడుగా అగుచున్నాడు. 

****************************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ విజయక్రాంతి  : ఆధ్యాత్మికం ॐ*



* దివ్యతత్వమూర్తి... గురువుల్లో దక్షిణామూర్తి
* ఎందరికో ఆధ్యాత్మిక స్ఫూర్తి..
* నడయాడే దేవుడు 
* శ్రీ గెంటేల వెంకటరమణులు!!
“సన్యాసంలో ఉండి నియమంగా ఉండడం గొప్ప కాదయ్యా. సంసారంలో ఉండి గొప్పగా ఉండాలి” అంటారు గొలగమూడి వెంకయ్యస్వామి. అలా తన చుట్టూ సంసారం ఉన్నా, దాని మకిలి అంటని మహనీయులు శ్రీ వేంకటరమణులు..!!
నిజమే! బురద అంటని కుమ్మరి పురుగులా, నీరు అంటని తామర ఆకులా.. సంసారంలో ఉంటూనే దాని వాసనలు అంటకుండా ఎలా జీవించాలో ఆయనను చూసే నేర్చుకోవాలి. తన పరమాద్భుతమైన ప్రేమతత్వంతో అందరి మనస్సులను జయించగల ఆధ్యాత్మికమూర్తి శ్రీరమణ గురూజీ... మనముందు గతించి పోయిన వారివే మాట్లాడుతుంటాం కానీ మనముందరే నడయాడే మహనీయులను మరచిపోతాం. కానీ ఈ రోజుల్లో యోగసిద్ధిని పొంది దివ్యానుభవాలను మూటగట్టుకున్న మహనీయులు శ్రీ వేంకటరమణ గురూజీ.
ఈ యోగమూర్తి 17 జూలై 1963న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలో శ్రీమతి స్వరాజ్యలక్ష్మి, గెంటేల నరసింహారావు పుణ్యదంపతులకు జన్మించారు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక జీవనం పూర్ణంగా కలిగి వేంకటరమణగారు ‘ధర్మదృష్టి’తో జీవనయానం మొదలుపెట్టారు. చిన్ననాటి నుండే చక్కగా శాస్త్రాయధ్యయనం, సమాజ అధ్యయనం అనుశీలనం కలిగిన ఈ గురువు దేశ విదేశాల్లో అనేక పర్యటనలు చేశారు.
ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని విద్యలు నేర్చినా జన్మభూమిని మించిన దేశం లేదని, ఆధ్యాత్మిక విద్యను మించిన విద్యలేదని తెలుసుకొన్నారు. భరతఖండం ఒక ఆధ్యాత్మిక సరోవరం అనీ, ఇందులో ఓలలాడింది ఏ సత్యం తెలియదని ఈ ప్రపంచానికి చెప్పాలని తలచారు. తన సంకల్పానికి తగినట్లుగా ఇక్కడ ప్రసిద్ధులైన సిద్ధ గురువు సద్గురు శివానందమూర్తి విగ్రహాన్ని ఆధారంగా పెట్టుకొని ‘గురుధామ్’ అనే పేరుతో మరో కొత్త ముక్తిధామం సృష్టించారు. కళ్లు మూస్తే దైవాన్ని స్మరించు, కళ్లు తెరిస్తే సమాజాన్ని సేవించు” అన్న సద్గురు శివానందమూర్తి దివ్యపథాన్ని ఈ లోకానికి అందించడానికి ఉద్యుక్తులయ్యారు.
శ్రీ గురుధామ్ ఆశ్రమం ఒక కేంద్రంగా ఆర్తులు, భక్తులు, జిజ్ఞాసులకు అండగా ఉంటున్న బ్రహ్మజ్ఞాని, సిద్ధ పురుషులు, పూర్ణభక్తులు శ్రీశ్రీ గెంటేల వెంకట రమణ గురూజీ.
సద్గురు శ్రీ శివానందమూర్తిగారి మానస పుత్రులు. గురువు ఆజ్ఞ మేరకు భారతీయతను ఆచరిస్తూ, ధర్మ ప్రబోధం చేస్తున్న మంచి మనిషి, చెంతకు వచ్చిన వారి బాధలను తొలగిస్తూ ఆత్మజ్ఞానం బోధిస్తున్న ఋషివర్యులు శ్రీరమణ గురూజీ. బలుసుపాడు, జగ్గయ్యపేటలలో విద్య, వైద్య, అన్నదానం చేస్తున్న గురుకుటుంబం వీరిది. అపారమైన జ్యోతిష్య పరిజ్ఞానం, ఆంజనేయస్వామి అంశ, భగవాన్ రమణ మహర్షి బోధ సారాన్ని జీర్ణించుకున్న విలక్షణ వ్యక్తిత్వంతో దర్శినమిస్తారు. మహర్షి మహేష్ యోగి ద్వారా విదేశాలకు వెళ్ళినా భారతభూమిపై గల అపార ప్రేమ వలన వెంటనే వెనుదిరిగి వచ్చిన విశేషం వీరిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు, శిష్యులు, మిత్రులు ఉన్నా నిరాడంబరత, సేవాతత్పరతలతో తరిస్తున్న ధన్యజీవి.
ఆత్మదర్శనం లేదా సాక్షాత్కార అనుభవాన్ని అలవోకగా ఈ ఆధునిక ఋషితుల్యులు వారి ఆంతరంగిక ప్రయాణం లేదా దర్శించిన అనుభవించిన సత్యాన్ని “ఒక ఊరి కథ” ద్వారా మనందరికీ కొన్ని భాగాలు గతంలో ప్రచురితం కావడం పాఠకుల అదృష్టం. చదివినంతనే అనుభవమౌతుందా అనేంత గాఢత వారి బోధలోని విశేషం. ఈ రచన మనందరి కథ.
అద్వైత ఆలంబనగా..
‘నేను’  అనే బహిర్గతమైన అహంకారం వదలిపెట్టి నేను  నేను అంతర్గతమైన ఆత్మకు తెలుసుకొనే సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన అరుణాచల శ్రీరమణుల మార్గమే శరణ్యం అనుకొని శుష్క వేదాంతం కాకుండా ఆచరణాత్మక వేదాంతం ఔదలదాల్చారు వేంకటరమణులు. శంకరుని సిద్ధాంత భాగానిన ఆచరణరూపంగా అవలంభించిన అరుణాచల రమణమహర్షి మార్గాన్ని వేంకటరమణులు ఎంచుకున్నారు. విచిత్రంగా ఈయన పేరులో కూడా రమణ ఉండడం విధి నిర్ణయమే. రమణమహర్షి ప్రబోధించిన ఆత్మబోధను  దాని ఆనుపానులను పట్టుకొన్న ఈ రమణుల జీవనం ఆలోచనతో కూడిన ఆత్మమార్గంలో కొనసాగుతుంది.
మొదట హనుమదోపాసకుడైన ‘వెంకటరమణులు’ హనుమంతుని ‘వాయువేగాన్ని’ ఆత్మస్వరూపంగా భావించారు. హనుమ వాయుపుత్రుడు. ప్రాణశక్తికి సాధనకు ప్రతీక. శ్రీరాముని కనుక్కోవడమే తారకనామ గ్రహణం. అదే పరమాత్మ దర్శనం. రామనామం తారకనామం. అది తరింపచేస్తుంది. ఆ నామంపైనే హనుమంతుని గురి. అదే తారకరాజయోగం.
****************************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ విజయక్రాంతి  : ఆధ్యాత్మికం ॐ*