భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్షగోయెంకా సోషల్ మీడియాలో ఓ ఫొటోను ట్వీట్‌చేసాడు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. గుజరాత్‌లోని మీరట్ పట్టణంలో ఓ ధనవంతుల పెళ్లి ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా సాగుతున్నది. పెళ్లికొడుకు గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వస్తున్నాడు. అయితే విచిత్రంగా ఆ పెళ్లి కుమారుడికి ఓ శవయాత్ర ఎదురయ్యింది. శవం అడ్డురావడం శకునాల్లో మంచిదంటారు. ఒకవైపు భాజభజంత్రీల ఊరేగింపు, మరోవైపు శవయాత్ర. ఆశ్చర్యం ఏమిటంటే ఆ శవయాత్రలో ‘భారత్ మాతాకీ జై’ అన్న నినాదాలు మార్మోగుతున్నాయి. ఏమిటా అని పెళ్లికొడుకు చూసాడు. ఆ శవయాత్ర ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మన భారత జవాను అజయ్ కుమార్‌ది. వెంటనే పెళ్లికొడకు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన పెళ్లి శోభాయాత్ర ఆపేసి తాను ‘భారత్‌మాతకీ జై’ అంటూ సెల్యూట్ చేశాడు. ఈ దేశం కోసం, ఈ మట్టికోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అజయ్‌కుమార్ పార్థివదేహం ముందుకు కదిలింది.

ఈ ఉద్విగ్నత ఫిబ్రవరి 26 తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ దేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలో కొనసాగింది. పుల్వామా అమరుల పార్థివదేహాల చుట్టూ వారి కర్మకాండలు నిర్వహించే వారసుడిలా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తిరుగుతుంటే ఆయన హృదయం ఎంత బరువెక్కిందో చెప్పలేం. కానీ ఆ తర్వాత 12 రోజులు భారతీయుల మనస్సులు దుఃఖంతో రగిలిపోయాయి. సరిగ్గా 13వ నాడు 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ 21 నిమిషాల్లో చేసిన ‘సర్జికల్ స్ట్రైక్’ భారతీయులను భావోద్వేగాలకు గురిచేసింది. అదేరోజు ఈ దేశ ప్రధాని రాజస్థాన్‌లోని ‘చురు’ సభలో మాట్లాడుతూ ‘‘ఈ మట్టిపై ప్రమాణం చేసి చెబుతున్నా! నేను భారతమాతకు మాట ఇస్తున్నా! దేశాన్ని నాశనం కానివ్వను. ప్రయాణం ఆగనివ్వను.. తలవంపులు తీసుకురాను! ఈ దేశాన్ని తలవంచుకొనేలా చేయను.. నా దేశం మేలుకొని ఉంది’’ అన్న కవిత సర్జికల్ స్ట్రైక్ ఘటనకు అనుబంధంగా ఉంది.

గతంలో లుంబినీ, గోకుల్ చాట్, ఢిల్లీ, ముంబయి వంటి చోట్లలో దాడి చేస్తే ప్రపంచ దేశాల వద్దకు పరుగెత్తుకొనిపోయి వివరణ ఇచ్చుకొనేవాళ్లం. ఇపుడలా కాదు. భారత్‌కు వెన్నుదన్నుగా అనేక దేశాలు నిలబడ్డాయి. ఒక్క చైనా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తే మిగతా అన్ని దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, డొమినిక్ రిపబ్లిక్, భూటాన్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాల దౌత్యవేత్తలకు సర్జికల్ స్ట్రైక్ చేసి మన విదేశాంగ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. విచిత్రంగా ఇపుడు దేశంలోని రాజకీయ ప్రత్యర్థులుగా మోదీపట్ల విపరీతమైన ద్వేషం కక్కుతున్నవాళ్లు కూడా ‘జై జవాన్’ అన్నారు. దీనికి మద్దతుగా నిలిచిన అసదుద్దీన్ ఓవైసీకి సోషల్ మీడియా ప్రశంసలు గుప్పించింది. రేపు ఏం మాట్లాడుతాడో తెలియదు కానీ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ జవాన్లకు సెల్యూట్ చేసింది. ఇక మమతా బెనర్జీ, ఐఎఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అన్న అర్థమే కాదు ఇండియన్ అమేజింగ్ ఫైటర్స్ అంటూ మన జవాన్లను ప్రశంసలతో ముంచెత్తింది. ఇపుడు మోదీ చేసిన ప్రతీ పనీ వ్యతిరేకించాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు సాయంత్రానికి బాగా ఆలోచించి ‘మన సైన్యం శహబాష్’ అన్నాడు. ఇక పుట్టుకతోనే దేశభక్తిని, జాతీయవాదాన్ని ద్వేషించే కమ్యూనిస్టు పార్టీ విమర్శలకు బాటలు వేసింది. సీపిఐ నేత కొడియేరి బలాకృష్ణన్ యథాలాపంగా ఇదంతా ఎన్నికల కోసమే అంటూ స్పందించారు. అయినా దరిద్రం కాకపోతే ఈ దేశంలో ఎన్నికలు లేనిదెపుడు? ప్రతి మూడు నెలలకు ఓసారి ఎన్నికలు ఎక్కడో ఓచోట జరుగుతుంటాయి. ఎప్పుడూ ఎన్నికల కొరకే పనిచేస్తే మరి దేశం కోసం ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చస్తారు!?

నిజానికి పాకిస్తాన్ మనల్ని వ్యతిరేకించడం రాజకీయ, భౌగోళిక కారణం అనుకుంటే పొరపాటు. కృత్రిమంగా వండివార్చిన ‘ద్విజాతి సిద్ధాంతం’ ఈ దుష్పరిణామాలకు దారితీసింది. ఇపుడున్న పాకిస్తాన్‌లోని లాహోర్ శ్రీరామపుత్రుడైన ‘లవుడి’ పేరుమీద ఏర్పడింది. సింధు నదీ ప్రాంతం గొప్ప నాగరికతలకు ప్రసిద్ధి చెందింది. శ్రీ శంకరాచార్య పర్వతం, క్షీరభవానీ మందిరం, మోక్ష సరస్వతీ మందిరం, అమర్‌నాథ్, ఢాకేశ్వరీ భవానీ.. ఇవన్నీ సింధూనదీ తీరానికి ఆవల ఈవలున్న హైందవ సాంస్కృతిక కేంద్రాలు. కాశ్మీర్ కశ్యపుడి పేరుతో పుట్టింది. వరాహస్వామి పేరుతో వున్న ‘వారాహమాల’ దేశమే ఈనాడు బారాముల్లాగా పిలుస్తున్నారు. ఇంత సాంస్కృతిక సంపదతోపాటు ఎందరో సామాజిక, చారిత్రక పురుషుల జన్మస్థలాలు భారత విభజనతో హిందువులు వదులుకున్నారు. ఇపుడు సింధీ, బెలూచీ, పంజాబ్ భాషలను పాకిస్తాన్ మత తత్వశక్తులు అణచేసి ఉర్దూను వారిపై బలవంతంగా రుద్దుతున్నారు. అలా అణచివేయబడిన బంగ్లాదేశీయులు భాష పరంగా గల ఉద్విగ్నత కోసమే 1971లో బంగ్లాదేశ్‌గా తమ దేశాన్ని పాక్ నుండి వేరుచేసుకున్నారు. అనేక తెగలు ఈ మత తత్వశక్తుల ధాటికి తమ సాంస్కృతిక వైభవాన్ని కోల్పోయారు. వహాబిజం ద్వారా అరబ్ సంస్కృతిని ప్రపంచంపై రుద్దే దౌష్ట్యం దాదాపు 1400 ఏళ్ళనుండి కొనసాగుతున్నది. దాని లక్ష్యమే ద్విజాతి సిద్ధాంతం పేరుతో మహమ్మదాలీ జిన్నా పాకిస్తాన్ పేరుతో సాధించాడు. అలా మొదలైన మహమ్మద్ బిన్ కాసిం వారసత్వం జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కొనసాగిస్తున్నాడు. అతని దృష్టిలో కాశ్మీర్‌ను సాధించడం ‘్భగోళిక విజయం’ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే! భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలన్న సుదీర్ఘ లక్ష్యం వాళ్లకుంది. ఎందుకంటే భౌగోళిక విజయమే అయితే మనకన్నా ఎక్కువ రెట్ల భూభాగం ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన దేశంలోని ప్రాచీన సంస్కృతిని విధ్వంసం చేయడం వారి అంతిమ లక్ష్యం. ఇది గుర్తించకుండా ఈ డెబ్భై ఏళ్లు మనం చేసిన పోరాటం ఇసుకనుండి తైలం తీయడమే. దీనిని భౌగోళిక, రాజకీయ సమస్యగా భావించే కమ్యూనిస్టులు, బుద్ధిజీవులు ఎప్పుడూ చర్చలు జరగాలని సుద్దులు చెప్తారు. వేర్పాటువాద నేతల ఇళ్లముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడతారు. కాశ్మీరీల హక్కులు అంటూ మీడియాలో గోల చేస్తారు. నిజానికి కాశ్మీర్ లోయలోని ఐదు జిల్లాల్లో మాత్రమే ఇలాంటి విపత్కర పరిస్థితి ఉంది. మిగతా జమ్మూ, లడఖ్‌లో దీనికి భిన్నమైన స్థితి. ఈ సోకాల్డ్ నేతలు, బుద్ధిజీవులు మాట్లాడేది ఈ ఐదు జిల్లాల్లోని దేశ వ్యతిరేక శక్తుల హక్కుల గురించే? మిగతా 11 జిల్లాల ప్రజలు కూడా కాశ్మీర్ రాష్ట్రంలో భాగమే అని ఈ హక్కుల నేతలు ఎందుకు గుర్తించరు? అలాగే కాశ్మీర్ నుండి తరిమివేయబడిన పండిట్ల గురించి ఎర్రకళ్ళు ఎందుకు మాట్లాడవు? ‘చురు’లో మోదీ ‘దేశం మేల్కొంటుంది’ అన్న మాటల్లోని మార్మికత ఇదే. ఇప్పటివరకు చేయని పని పుల్వామా దుర్ఘటన తర్వాత జరుగుతున్నది.

పుల్వామా ఘటన జరిగిన 24 గంటల్లోపే మోస్ట్ ఫెవర్డ్ నేషన్ ఎంఎఫ్‌ఎన్ హోదాను భారత్ ఉపసంహరించింది. విదేశాలతో మాట్లాడి దౌత్య విజయం సాధించింది. సింధులోని జలాలు పాకిస్తాన్‌కు ఆపేసింది. పుల్వామాలో సైనికుల మరణానికి మూల సూత్రధారి ఘాజిని వంద గంటల్లోనే మట్టుబెట్టింది. హురియత్ నేతలకు రక్షణ ఉపసంహరించింది. ఎన్‌ఐతో వాళ్ల ఇళ్ళల్లో సోదాలు చేయించింది. కుల్గాం జిల్లాలో ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను మన సైన్యం అరెస్టు చేసింది. చివరి వ్యూహంగా మన వీరజవాన్ల స్థూపాలముందు ఉంచిన క్రొవ్వొత్తుల వెలుగులు ఆరకముందే మిరాజ్ 2000 విమానాలతో జైషే ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడి చేసి వౌలానా తెహ్లా సైఫ్, యూసుఫ్ అజర్, వౌలానా అమర్, ఇబ్రహీం అజర్ వంటివాళ్లను తుదముట్టించినట్లు తెలుస్తోంది. ఇది ఈ వారంలో ఒక ఘనత.

ఇక రెండవ విషయానికి వస్తే ఈ రోజు దేశంలో కులవ్యవస్థ ఓ కుటిలమైన దారిదీపంగా మారింది. దళితుల బహుజనుల ఉద్ధరణకు ఈ దేశంలో ఎందరో సంస్కర్తలు ప్రయత్నించారు. వజ్రసూచికోపనిషత్ మొదలుకొని డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ వరకు అందరూ కులతత్వాన్ని నిరసించారు. భారతదేశంలో నడిచే శవాలుగా, ఇతర దేశాల్లో బరువు మోసే జంతువులను చూసినట్లు కొన్ని కులాలపై వివక్ష జరిగిందని స్వామి వివేకానందనే చెప్పారంటే ఇది ఒక మానసిక రుగ్మతగా కొందరిలో కరడుగట్టుకొని ఉందన్నమాట. దానిని మనలో తగ్గించి సామాజిక సమరసత సాధించేందుకు నర్సీ మెహతా హరిజన వాడల్లో అమృత గానంచేశాడు. దయానందుడు అందరికీ వేదంపై హక్కు ఉందన్నాడు. ఆదిశంకరులు ‘చండాలపిమమగురు’ అన్నాడు. రామానుజుడు దళిత ఆళ్వార్లకు గొప్ప స్థానం ఇచ్చాడు. బసవేశ్వరుడు మాదిగ హరళయ్యను తన హృదయానికి హత్తుకొన్నాడు. శ్రీరమణుడు హరిజనుడికి శివమంత్రదీక్ష ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు దళిత బస్తీల్లో ఊడ్చారు. గాంధీజీ తాను దళితుడిగా మరో జన్మ ఎత్తుతానన్నాడు. స్వామి శ్రద్ధానంద దళితులకు ఆలయ ప్రవేశం చేయించేందుకు ప్రయత్నించాడు. పూలే బడుగులకు పూలదారి చూపించాడు. 

అంబేద్కర్ విషాన్ని మ్రింగి అమృతాన్ని పంచిపెట్టాడు. పండరి భక్తులు కులతత్వాన్ని భక్తి అమృతత్వంతో మటుమాయం చేశారు. బ్రహ్మనాయుడు చాప కూడుపెట్టి మాలకన్న మదాసును కౌగిలించుకున్నాడు. వీరబ్రహ్మేంద్రులు కక్కయ్యకు ఆత్మజ్ఞానం చెప్పాడు. స్వామి నారాయణ, కబీరు, గురునానక్, బుద్ధుడు, మహావీరుడు, అన్నమయ్య సామాజిక సమరసతను సమన్వయంతో సాధించారు. నారాయణగురు శూద్ర కులాల ఆత్మగౌరవం కాపాడినాడు. వీళ్లందరూ గడిచినకాలంలో సంస్కరణ దృష్టితో కుల తత్వంపై యుద్ధం చేశారు కానీ మన కళ్లతో చూడలేదు. కానీ ఫిబ్రవరి 24 నాడు భారత ప్రధాని కుంభమేళాకు వెళ్లి పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడగడం ఓ చారిత్రక ఘట్టంగా చెప్పవచ్చు. పైన చెప్పిన సంస్కర్తలంతా వారి వారి కాలాల్లో ఇలాంటి చిన్నచిన్న పనులతోనే మహోజ్జ్వల ఘట్టాలకు శ్రీకారం చుట్టారు. దురదృష్టం ఏమిటంటే మనం మన కళ్లముందు కదలాడే చరిత్రకన్నా గతంలో జరిగినదానికి, చచ్చినవారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే అలవాటుచేసుకున్నాం. 

పైపైన తళుకులగురించే ఆలోచించే మనం దేశాన్ని శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల గురించి ఆలోచన చేయం. కానీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మునుపెన్నడూ లేనివిధంగా ప్రయాగరాజ్ కుంభమేళాలో నిరంతరం మాలిన్యాలను శుభ్రం చేసేవారికి కృతజ్ఞతగా వారి పాద ప్రక్షాళన చేసి ఋణం తీర్చుకొన్నారు. ‘‘కుంభమేళా విజయవంతానికి నిరంతరాయంగా కృషిచేస్తున్న నా సోదరులైన అత్యంత కష్టపడుతున్న కర్మయోగులు’’ అని పారిశుద్ధ్య కార్మికులనుద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలు సువర్ణాక్షరాలు. ఇదొక చారిత్రక ఘట్టం. నది ప్రవహిస్తుంటే ఆ ప్రవాహం ఎంత పెద్దదిగా ఉన్నా ప్రతిచోటుకూ విలువైన పేరు దొరకదు. ఎక్కడ గొప్ప క్షేత్రం ఉంటే నదీ - క్షేత్రం రెండూ పుణ్యతీర్థాలవుతాయి. అలాగే చరిత్ర ఎంత పెద్దగానైనా ఉండవచ్చు. దానికున్న పవిత్ర ఆచరణే మైలురాయిగా నిలబడుతుంది. సరిగ్గా మోదీ చేసింది ఇదే. అందుకే ఇది ఈ వారంలో రెండవ ఘనకార్యం.


************************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి *
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి