ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ భాజపా కార్యదర్శిగా నియమితులైనపుడు- ఒక స్థానిక పత్రికా విలేఖరి ఆయన గదికి మాట్లాడటానికి వచ్చాడట. మాటలన్నీ అయ్యాక వారిద్దరూ ‘చాయ్’ తాగుదామనుకొన్నారట. ఆ విలేఖరి- ‘మోదీ చుట్టూ ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో..’ అని అనుకొని చాయ్ తెప్పించమన్నాడు. వెంటనే మోదీ బయటకు వెళ్లి చాయ్ తెచ్చి ఇవ్వగానే ఆయన నిరాడంబరతకు విలేఖరి విస్మయం చెందాడట! ఇలాంటి ఘటనలు మోదీ జీవితంలో చాలా ఉ న్నాయి. కానీ ఇటీవల ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వారి చెప్పుచేతల్లోని మీడియా మోదీని ‘నిరంకుశుడి’గా ప్రచారం చేస్తున్నాయి. వీరికి తోడుగా తెలుగు రాష్ట్రాల ప్రసార మాధ్యమాలు మోదీని టార్గెట్‌గా చేసుకుని గత రెండు వారాలుగా ఊదర గొడుతున్నాయి. మోదీని నిజాయితీపరుడిగా ఆకాశానికి ఎత్తినవారే ఇప్పుడు తమ వెనుకున్నవారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను ‘విలన్’గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘నేను దేశాన్ని నాశనం కానివ్వను. దేశాన్ని తలవంచనీయను. వాళ్లు ఎంత అంధకారం వ్యాపింపజేస్తే- నేను అంతలా కాంతులు వెదజల్లుతాను’- అని తాను రాసుకొన్న కవితా పంక్తులను మోదీ ఆచరణలో చూపిస్తున్నాడు. అదే విపక్షాల కోపానికి హేతువు!
‘మృగ-మీన-సజ్జన శత్రుత్వం’ గురిచి నీతిశాస్త్రం చెబుతుంది. మృగం- జింకకు పుట్టిన వెంటనే దానిని చంపే పులి శత్రువుగా ఉంటుంది. మీనం (చేప) జన్మించగానే జాలరి దానికి శత్రువు అవుతాడు. సజ్జనుడు జన్మించగానే- అతనికి శత్రువులు కూడా పుడతారని నీతిశాస్తక్రారులు చెప్తారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే అతనికి దేశం నిండా విరోధులు తయారయ్యారు. రామభక్తులైన కరసేవకులను గుజరాత్‌లోని గోద్రాలో కొందరు దుర్మార్గులు రైల్లో సజీవ దహనం చేశారు. దాంతో గుజరాత్‌లోని హిందూ సమాజం భుగ్గమంది. గోద్రా అనంతరం గుజరాత్‌లో మత ఘర్షణలు జరిగి ఎందరో మరణించారు. అప్పుడు కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం పాలిస్తున్నా మోదీ వెంటనే అల్లర్లు ఆపడానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను సహాయం అడిగాడు. లిఖిత పూర్వకంగా సహాయం అడిగినా, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సహాయాన్ని నిరాకరించాయి. ఈరోజు సెక్యులరిజం కోసం జబ్బలు చరిచే దిగ్విజయ్ సింగ్ నాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. సూడో సెక్యులరిస్టులు ప్రతిదాంట్లోనూ ఓటునే వెతుక్కుంటారు.
గోద్రా సంఘటన, తదనంతరం జరిగిన అల్లర్లు మోదీని ఎంతగా అపఖ్యాతిపాలు చేశాయో, ఆయనకు అంతే పాపులారిటీని కూడా తెచ్చిపెట్టాయి. విచిత్రమేమిటంటే ఆయనకు ఉన్న పేరు ప్రతిష్ఠల కన్నా ‘సూడో సెక్యులర్ గ్యాంగ్’ మోదీకి ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. గుజరాత్ అల్లర్ల తర్వాత జరిగిన రాజకీయ పెనుమార్పులు మోదీని రాజకీయంగా ముందుకు నడిపాయి. యుద్ధం తర్వాత శాంతిలా గుజరాత్ ప్రజలు కలిసిమెలిసి ఆనందంగా ఉన్నా దేశం నిండా ఉన్న సెక్యులర్ శక్తులు చేసిన అతి ప్రచారం మోదీకి కలిసి వచ్చింది. ఆ తర్వాత నుండి ఈ రోజు వరకు గుజరాత్‌లో ఒక్క మత ఘర్షణ జరగలేదు. సరిగ్గా ఈ రోజు కూడా దేశంలోని చిన్నా పెద్దా పార్టీల నేతలు, కుహనా లౌకికవాద మేధావులు, ‘ఎర్ర’ జర్నలిస్టులు మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీపై నిరంకుశ ముద్ర వేసినట్లే, ఇప్పుడూ మోదీపై అలాంటి ఎత్తుగడనే వేస్తున్నారు.
వాధ్‌నగర్ రైల్వే స్టేషన్లో ‘టీ’ అమ్మిన ఓ చాయ్‌వాలా ఈ దేశానికి ప్రధానిగా ఐదు ఏళ్ళు కూడా పనిచేయకూడదా? నిరంతరం కమ్యూనిస్టులు మాట్లాడే బడుగు వర్గాల నుండి వచ్చిన వ్యక్తి అత్యున్నత పీఠంపై కూర్చోవడం నేరమా? సామాన్యుడిగా సగటు భారతీయుల జీవితాన్ని అనుభవించి నీతి నిజాయితీతో పాలించే వ్యక్తిపై ఎందుకు వీళ్లంతా బురద చల్లుతున్నారు? అమిత్ షాలోని అపర చాణక్య రాజనీతిని మోదీకి అంటగట్టి అతణ్ణి నిరంకుశుడిగా, దయాదాక్షిణ్యం లేని వ్యక్తిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? లౌకికవాదం నుండి నియంతగా చిత్రించే దుష్ప్రచారం వెనుక కథ ఏంటి?
నిజానికి మోదీ ప్రధాని గద్దెపై కూర్చోకముందే భయంకరమైన దుష్ప్రచా రం జరిగింది. ముస్లిం వర్గాల్లో భయాన్ని రేకెత్తించే పని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దేశంలో జరిగే ప్రతి సంఘటనపై మోదీ మాట్లాడాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో ఏ మారుమూల చిన్న సంఘటన జరిగినా దానికి మోదీనే బాధ్యుణ్ణి చేస్తున్నారు. ఇటీవల మో దీని ఎదుర్కోవడానికి వివిధ రాష్ట్రాల్లో బద్ధవిరోధులైన నాయకులు, పార్టీలు కలిసిపోవడం విడ్డూరం. మోదీ ఎమర్జెన్సీ విధించి పాలన చేస్తున్నాడా?
ఫోర్బ్స్ పత్రిక నివేదిక ప్రకారం మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. స్వయంగా కవి, రచయిత అయిన మోదీ అంతర్ముఖుడు. దాదాపు 14 ఏళ్ళకుపైగా గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెట్టాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి జాతీయవాద సంస్థలో నిబద్ధతగా పనిచేశాడు. ఇనే్నళ్లుగా అధికారంలో ఉన్నా తన కుటుంబాన్ని దగ్గరకు రానీయలేదు. దేశం కోసం చిన్ననాడే వివాహబంధాన్ని కూడా వదులుకున్నాడు. తనతోపాటు మంత్రులను కూడా నీతిపరులుగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజాక్షేత్రానికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యాడు. సర్జికల్ స్ట్రైక్‌తో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నోట్ల రద్దు ద్వారా తీవ్రవాదులకు డబ్బు అందకుండా చేశాడు. ఒక జవాను మరణిస్తే అందుకు బదులుగా నలుగురు తీవ్రవాదులను మట్టుబెట్టిస్తున్నాడు. దేశంలోకి విచ్చలవిడిగా ఎన్జీవోలకు వస్తున్న నిధులకు లెక్కలు అడుగుతున్నాడు. విదేశాల డబ్బుతో మత మార్పిళ్లు, అంతఃకలహాలు సృష్టిస్తున్న వ్యక్తుల, సంస్థల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసాడు. దేశదేశాల్లో భారతదేశం కీర్తిని ఇనుమడింపజేస్తున్నాడు. ఇప్పటివరకు భారత్ కనె్నత్తి చూడని దేశాలతో సైతం దౌత్య సంబంధాలు నెరపుతున్నాడు. తాను స్వచ్ఛంగా ఉంటూ దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలని ‘స్వచ్ఛ భారత్’కు సంకల్పించాడు. దేశాన్ని యోగమయం చేయడానికి ముస్లిం దేశాలను సైతం ఒప్పించాడు. 2016 అక్టోబర్‌లో సమాచార హక్కు చట్టప్రకారం తీసిన వివరాల్లో మోదీ ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా సెలవు తీసుకోలేదు. 1984 తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వానికి జీవం పోశాడు. ఇవన్నీ ఈ దేశంలోని సెక్యులర్ ముఠాకు నిరంకుశంగా కన్పిస్తున్నాయి.
డెబ్బై ఏళ్ళు అధికారం ఒకే కుటుంబం చేతిలో పెట్టి వాళ్ల మోచేతి నీళ్లు తాగే నాయకులు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మోదీని గద్దెనుండి దింపేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. మ తం పేరుతో డెబ్బై ఏళ్లు అనుసరించిన సంతుష్టీకరణకు కాలం చెల్లిందని ఇప్పటికైనా గ్రహించకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. మత రాజకీయం చేస్తే ప్రజలు విడిపోయి అంతిమంగా మోదీకే లాభం కలుగుతుందని భావించిన ఈ శక్తులు కుల రాజకీయాలను ముందుకు తెస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య మొదలుకొని గౌరీ లంకేశ్ హత్య వరకు అన్నీ మోదీపై రుద్దేసి దుష్ప్రచారానికి పూనుకొంటున్నారు. ఇనే్నళ్లు కాంగ్రెస్ కుటుంబ పాలనను కళ్లకద్దుకొని స్వీకరించిన పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇపుడు ‘ఉత్తర భారత్, దక్షిణ భారత్’ పేరుతో అడ్డుగోడలు కడుతున్నారు. ద్రవిడ-ఆర్య పేరుతో కొత్త సిద్ధాంతాలను వల్లిస్తున్నారు. దక్షిణ భారతం నుండి ఉప రాష్టప్రతి పదవి పొందిన వెంకయ్య నాయుడును ఎవరు ఆ గద్దెపై కూర్చోబెట్టారు? భాజపాను పాతాళం నుండి భూమిపైకి తెచ్చిన అగ్రనేత అద్వానీని కాదని, దళిత మేధావి రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పీఠంపై కూర్చోబెట్టింది ఎవరు? యూపీఏ ప్రభుత్వాన్ని ‘ఇల్లిజిటేట్’ అని విమర్శించిన అద్వానీపైకి ఎంపిలను ఉసిగొల్పిన సోనియా ఆయనపై గౌరవం ఒలకబోస్తోంది. భావ దారిద్య్రం ఏమిటంటే- ఒకనాడు అద్వానీని బూతులు తిట్టినవారే ఆయనపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నారు.!
ఇటీవల త్రిపురలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఒకే విమానంలో అద్వానీతో పాటు కలిసి వెళ్లిన మోదీ, వేదికపై అద్వానీని పట్టించుకోలేదని గోల చేస్తున్నారు. అక్కడే ఉన్న మాజీ సీఎం, సిపీఎం నేత మాణిక్ సర్కార్‌ను ఆప్యాయంగా మోదీ పలకరించినా- అద్వానీ విషయంలో వివాదం సృష్టించేందుకు యత్నించారు. ఒకవేళ మాణిక్ సర్కార్‌ను మోదీ పట్టించుకోకపోతే దానిపై ఎలా విషం చిమ్మేవాళ్లో ఊహించవచ్చు. మహారాష్ట్ర సీఎం పీఠంపై బ్రాహ్మణుడైన దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూర్చోబెట్టినా, రాష్టప్రతి పదవిలో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను అలంకరింపజేసినా- మోదీ దృష్టిలో సమర్థతకే ప్రాధాన్యత. కులగజ్జిలో పొర్లాడుతున్న వ్యక్తులకు- మోదీ వ్యక్తిగత జీవితంలోని త్యాగబుద్ధి ఎలా అర్థమవుతుంది? చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ జీవితకాలం కొనసాగేలా ప్రకటించుకుంటే లోలోపల సంతోషపడేవారికి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను చూసి మురిసిపోయేవాళ్లకు మోదీని చూస్తే సంతోషం కలుగుతుందా?
సంక్షేమ పథకాలను ప్రజలకు ఎరగా వేసి, ప్రతి రాష్ట్రంలో ఓ కుటుంబం అధికారం చెలాయిస్తోంది. వ్యక్తి ప్రాధాన్యత కన్నా వ్యవస్థలకు ప్రాధాన్యత ఇస్తూ, వాటిని సంరక్షించడానికి ప్రాధాన్యం ఇస్తున్న మోదీ నియంతలా కాక ఇంకెలా కన్పిస్తాడు?! భాజాపా వాళ్లు పట్టించుకోకపోవడం వల్ల టీవీ చానళ్ల యాంకర్లు కూడా మోదీని ప్రధాని అని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా నిందిస్తున్నారు.
సోనియా, దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, రషీద్ అల్వీ, మమత, లాలూ, కేజ్రీవాల్, సల్మాన్ ఖుర్షీద్, అసదుద్దీన్ ఓవైసి, సీతారాం ఏచూరి, నారాయణ, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలు తనపై విమర్శలు చేస్తున్నా- ఏ రోజూ వాళ్లను పనె్నత్తి మాట అనకుండా తన మార్గంలో తాను వెళ్తున్నాడు మోదీ. తిట్లు, శాపనార్థాలను పూలబాటలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నాడు.
మోదీపై యుద్ధం ప్రకటించేందుకు వెళ్తున్న వీళ్లందరికీ భాజపా మాత్రం మంచిదట..!? వాళ్ల పోరాటం అంతా మోదీ, అమిత్ షాల అహంకారంపైనేనట! ఎంత ఆశ్చర్యం..!? అరవై ఏళ్లు అధికారం అనుభవించి వృద్ధనాయకులను సైతం తన వెంట చిన్నపిల్లల్లా తిప్పుకొంటూ, బడిపిల్లల్లా వారిని నిలబెట్టి మాట్లాడిన సోనియా గాంధీ శాంతమూర్తి? ప్రజాస్వామ్యవాది? మొదటిసారి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోకి  అడుగుపెడుతూ ఉద్విగ్నతకు లోనై- ‘ఔరా! ప్రజాస్వామ్యం ఎంత గొప్పది!’ అని పార్లమెంట్ భవనం మెట్ల వద్ద సాష్టాంగ ప్రణామం చేసిన నరేంద్ర మోదీ నిరంకుశుడా?!

****************************************************
-డా. పి భాస్కరయోగి 
Published Andhrabhoomi :
Friday, March 30, 2018




మరణించే ముందు అలెగ్జాండర్‌ చక్రవర్తి మూడు కోరికలు కోరుకున్నాడని చెప్తారు. ఒకటి.. తనకు వైద్యం చేసిన వైద్యులతో తన శవపేటిక మోయించాలి. రెండు.. తాను సంపాదించిన వెండి, బంగారాలను, వజ్ర వైఢూర్యాలను శ్మశానానికి వెళ్లే దారిలో చల్లాలి. మూడు.. తన రెండు చేతులనూ శవపేటికలోంచి పైకెత్తి ఉంచాలి. ప్రపంచంలో ఎంత గొప్ప వైద్యుడైనా మరణం నుంచి కాపాడలేడని, కాబట్టి జీవితాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని చెప్పడం మొదటి కోరిక ఉద్దేశం. ఎంత సంపాదించినా ధనాన్ని వెంట తీసుకెళ్లలేడని చెప్పడం రెండో సందేశం. పుట్టేటప్పుడు ఉత్తి చేతులతో వచ్చాం. ఉత్తి చేతులతోనే వెళ్లిపోతాం అని ప్రపంచానికి చాటి చెప్పడానికి మూడో కోరిక కోరాడు. నిజమే! మృత్యువు ఈ లోకంలో ఎవ్వరినీ శాశ్వతంగా ఉండనీయదు. ఎంత సంపాదించినా ఏ వ్యక్తినీ చిల్లిగవ్వ కూడా తనవెంట తీసుకుపోనీయదు. ‘ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యౌవనం ప్రత్యాయాన్తి గతా: పునర్నదివా: కాలో జగద్భక్షక:’’ అన్నారు పెద్దలు. అంటే.. చూస్తుండగానే నిత్యం ఆయుష్షు నశిస్తుంటుంది. యవ్వనం క్షీణిస్తుంది. గడచిన రోజులు మళ్లీ రావు. కాలము జగత్తునే భక్షిస్తుంది.- అన్నమాటలు అక్షర సత్యాలు. ఇది గమనించకుండా ప్రతివారూ తన అహంకారాలను ప్రదర్శిస్తుంటారు. కానీ మృత్యువు ముందు ఇవేవీ పనిచేయవు. యోగులైనా, సిద్ధులైనా, ధనవంతులైనా, పేదలైనా.. అందరూ మృత్యువుకు సమానమే. ఎవ్వరైనా మృత్యువుకు తలవంచాల్సిందే. మృత్యువును మించిన సామ్యవాది లేదు. అందుకే మన పెద్దలు మృత్యువును కాలంతో పోల్చారు. కాలం భగవత్స్వరూపం అన్నారు. సృష్టిలోకి ఎన్ని జీవరాశులు వచ్చి వెళ్లినా, కాలచక్రం ఆగదు. అది అందరినీ తన వెంట నడిపిస్తుంది. జనన మరణాలు లేని స్థితిని పొందడం ద్వారా ఇలాంటి కాలాన్ని, మృత్యువును జయించడమే మోక్షం.

*************************************************
డాక్టర్‌ పి. భాస్కర యోగి
         ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ




హిందూమతంలో గొప్ప సంప్రదాయిక బలం వున్న లింగాయత్‌లను
ఈ ధర్మం నుండి వేరు చేసే అధికారం రాజకీయ నాయకులకు ఉంటుందా? తమ స్వలాభం కోసం, అధికారం కోసం ధర్మాన్ని ముక్కలు చేసే దుస్సాహసం ఆ తర్వాత వారి మెడకే చుట్టుకున్న విషయం
పంజాబ్‌లో మనం చూశాం. ఇప్పుడు జరుగుతున్న ఈ కుర్చీలాట
భవిష్యత్తులో ఎన్నో విపరిణామాలకు దారితీయడం ఖాయం. ఇప్పటికే రాజస్థాన్‌లో గుజ్జర్లు, గుజరాత్‌లో పటేళ్లు, ఆంధ్రలో కాపులు,
తెలంగాణలో ముస్లింలను రెచ్చగొడుతున్న నాయకులు, పార్టీలు తర్వాత భారీ మూల్యం చెల్లించనున్నాయి.
దేశమంతా కొడిగట్టిపోతున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాల్‌గా పరిణమించాయి. రాహుల్ గాంధీ రాజకీయ యవనికపైకి వచ్చాక కాంగ్రెస్‌కు అన్నీ పరాజయాలే. యూపీలోని పుల్పూర్, గోరఖ్‌పూర్‌లలో భాజపాను ఓడించింది తాము కాకున్నా, అది తమ ఘనతేనని కాంగ్రెస్ సంబరపడిపోవడం హాస్యాస్పదం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘సెమీ ఫైనల్’ లాంటి కర్నాటక ఎన్నికల్లో గెలిస్తే ‘మేం కూడా రంగంలో ఉన్నామ’ని కాంగ్రెస్ చెప్పుకోవచ్చు. కానీ అక్కడి కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ‘ఎన్నికల ప్రచారానికి రావద్దు’ అని లోలోపల మొరపెట్టుకొన్నట్లు సమాచారం. ఈలోగా కర్నాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో క్రొత్త సమస్యను సజీవంగా ఉంచడానికి తేనె తుట్టెను కదిలించాడు. అదే లింగాయత్‌లకు మైనారిటీ హోదా!
నాథమోహన్‌దాస్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు తెప్పించుకొని కన్నడ ప్రాంతంలో 17-20 శాతం వున్న లింగాయత్‌లకు కర్నాటక మైనారిటీ చట్టం 2(డి) ద్వారా ‘మతపరమైన మైనారిటీ’గా గుర్తించాలనే సిద్ధరామయ్య కాబినెట్ సిఫార్సుపై ఇపుడు చర్చ జరుగుతోంది. ఆచార, సంప్రదాయ, తాత్విక, ధార్మిక పునాదుల ప్రకారం లింగాయత్‌లు హిందూమతంలో అంతర్భాగమే. కన్నడ ప్రాంతంలో లింగాయత మఠాలకు ప్రాధాన్యత ఉంది. ఎన్నికలొస్తే నేతలంతా ఈ పీఠాదిపతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ప్రజలపైనా వీరశైవ మతాధిపతుల పట్టు అధికం. అందుకే సిద్ధరామయ్య ప్రభుత్వం భాజపాకు వెన్నుదన్నుగా నిలిచే లింగాయత్‌లను రెచ్చగొట్టే పనికి పూనుకుంది.
కన్నడ ప్రాంతంలోని కొన్ని జిల్లాలు నిజాం పాలనలో, మరికొన్ని జిల్లాలు శ్రీరంగపట్టణం కేంద్రంగా నడిచిన ముస్లిం రాజుల పాలనలో ఉండేవి. అక్కడి హిందువులు చాలా ఏళ్ళు అణచివేయబడ్డారు. ముస్లిం పాలనను తట్టుకొని ధర్మాన్ని బ్రతికించినవారు వీరశైవ మఠాధిపతులు. హిందూ సమాజానికి బలమైన వర్గంగా ఉన్న ప్రజలను మత మార్పిడి కాకుండా నిలువరించి హిందువులకు రక్షణ కవచంగా నిలిచారు. ఇన్నాళ్లు మైనారిటీలను సంతుష్టీకరణ చేసి గెలిచిన కాంగ్రెస్ ఇపుడు వీరశైవులపై ప్రేమ ఒలకబోస్తోంది. గత డెబ్భై ఏళ్లలో ఏనాడూ శృంగేరి పీఠాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా ఆ హిందూ పీఠంపై ప్రేమ పుట్టుకొచ్చింది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ శృంగేరికి వెళ్లి శ్రీ్భరతీ తీర్థ స్వామి ఆశీస్సులు పొందారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వేస్తున్న శీర్షాసనాల్లో భాగమే లింగాయత్‌లకు మైనారిటీ హోదా! హిందూ మతాన్ని ముక్కలు చేసే ఈ కుటిల యత్నాన్ని హిందూ సంఘాలు ప్రశ్నించగా, సంతోష్ హెగ్డే లాంటి వాళ్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
1925 కన్నా ముందే ఆనాటి నిజాం రాజ్యంలోని బీద్ జిల్లా పరళీ వైద్యనాధ క్షేత్రంలో వీరశైవులకు-స్మార్తులకు మధ్య ఏర్పడ్డ వ్యాజ్యంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆనాడు కమిషన్ ముందు 4 మాసాలు దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఆ సందర్భంలో వీరశైవులు తాము వైదికులమని నిరూపించి విజయం సాధించారు. 1939కి ముందే కర్నాటక, మరాఠా ప్రాంతానికి చెం దిన కొందరు ఆనాటి ని జాం ప్రభుత్వ మంత్రి హైదరీ వద్దకు వెళ్లి- ‘మాది ద్రావిడ సంస్కృతి, మాకు ప్రత్యేక స్థలాలు కావాలి’ అని అర్జీ పెట్టుకున్నారు. వీటన్నిటిలోని కుట్రలను ఆనాడు ప్రముఖ వీరశైవులు నడిపే విభూతి పత్రిక దుయ్యబట్టింది.
ప్రాచీనకాలం నుండి శైవం వైదిక మతంలో అంతర్భాగమే. గృహ్య సూత్రాల్లో శివుణ్ణి వివిధ కాలాల్లో, అనేక విధాలుగా పూజించే సంప్రదాయమున్నా అవి శాఖలుగా లేవు. రానురాను శైవంలో అనేక శాఖలు పుట్టి శివగీత, శివసంహిత, శివరహస్యం, రుద్రయామళ తంత్రం, 28 శైవాగమాలు, నీలకంఠ విరచిత బ్రహ్మసూత్ర భాష్యం, పురాణ, వేద, ఉపనిషత్తులు ఈ శాఖాభేదాలకు తత్వభూమికగా ఉన్నాయి. ప్రాచీన శైలం, పౌరాణిక శైవాల్లో పాశుపత, లకులీశ, మాహేశ్వర, శైవభాగవత, కాపాలిక, యోగనాథ, రసేశ్వరవాద, సంకలిత అనే భేదాలున్నాయి. వీటిలో మళ్లీ శివబుద్ధ, శివశక్తి, హరిహర, శివస్కంద, శివగణపతి, శివవిశిష్టాద్వైత, శివాద్వైత, ద్రావిడ శైవ సిద్ధాంత, శైవచిత్రమతం, ప్రత్యబిజ్ఞ, మహారతి, శివసమాధి, ఐక్యవాది, సంక్రాంతవాది, ప్రవాహేశ్వరవాది, అవికారవాది, ఊర్థ్వ, అనాది, ఆది, మహా, గుణ, క్రియాశైవ, చుతుష్పాద, శుద్ధ, యోగి, అభినవగుప్త, తప్తలింగాకితశైవం, శూలాంకితశైవం, లింగ చిహ్న శైవం, శిరస్సుపై లింగం ధరించిన శైవం.. ఇలా శైలంలోనే అనేక భేదాలున్నట్లు శైవమత అధ్యయనం ద్వారా  తెలుస్తుంది. ఇవన్నీ వైదిక మతం పరిధిలోవే. ఇవన్నీ పక్రియా భేదాలే గాని మూలతత్త్వంతో విభేదించేవి కావు. తాండవమూర్తిగా, జటామకుట, భస్మలేపితమూర్తిగా శివారాధన చేసేవారు పాశుపతులు. శివుడిని కంకాళమూర్తిగా పూజించేవారు కాలాముఖులు, స్ఫటిక, రుద్రాక్ష మాలధారిగా శివపూజ చేసేవారు వామాచారులు. అగ్నిధారిగా, యజ్ఞోపవీతధారిగా పూజించేవారు బైరవారాధకులు, ఢమరు ధరింపజేసే వటధారిగా పూజించేవారు కూడా పాశుపతులే. ఇవన్నీ ఆరాధనా పద్ధతులవల్ల ఏర్పడిన భేదాలు. తదనంతకాలంలో ఇవన్నీ కలిసిపోయి ముఖ్యమైన శాఖలు మాత్రమే స్థిరపడి నిలిచాయి. ఆగమశాస్త్ర విహితమైన శైవం దక్షిణ భారతంలో ఉండగా, ప్రత్యబిజ్ఞ అనే త్రిక సిద్ధాంతంపై ఆధారపడ్డ శైవం కాశ్మీరు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండేది. లకులీశుడు మొదలైన యోగవేత్తలతో గుజరాత్‌లో పాశుపత శైవం పరివ్యాప్తమైంది. తెలుగు, కన్నడ ప్రాంతాల్లో బసవేశ్వరుడు పునరుద్ధరించిన వీరశైవం నిలబడింది. శే్వతాచార్యుల నుండి ప్రఖ్యాత శివాచార్యుల వరకు క్రీ.శ.971 నుండి 1296 వరకు పాశుపత శైవం ప్రచారం చేశారని ‘చింత్రప్రశస్తి’ శాసనం తెలిపింది. ఆ తర్వాత ఓరుగల్లు, శ్రీశైలం, బెల్గాం, శ్రీకాళహస్తి, మైసూరు మొదలైన ప్రాంతాల్లో పాశుపతం బాగా వ్యాప్తిచెందింది. శైవ విద్యకు మూలస్థానమైనన శ్రీశైల జగద్గురు పీఠానికి, గోళక మఠాధిపతి విశే్వశ్వర శివాచార్యులకు క్రీ.శ.1261లో రాణి రుద్రమ ‘మందడ అగ్రహారం’ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతకుముందే 4, 5 శతాబ్దాల్లో జైన, బౌద్ధాల విజృంభణను ఎదుర్కొని నిలబడడానికి శైవ, వైష్ణవ నేదాలతోనే వైదిక మతం నిలబడింది. 10వ శతాబ్దానికి ముందే తమిళ, కన్నడ ప్రాంతాల్లో ఆళ్వార్లు, నయనార్లు అనే భక్తులు వైష్ణవ, శైవ తత్వభూమికతో బౌద్ధ, జైనమతాల నుండి హిందువులను కాపాడారు. 12వ శతాబ్దంలో వైష్ణవంలో రామానుజులు సంస్కర్తగా రాగా, శైవ మత సంస్కర్తగా బసవేశ్వరుడు ఉద్భవించాడు. హిందూ మతంలోని కుల వ్యవస్థపై యుద్ధం ప్రకటించాడు. తన మేనమామ బలదేవుడు మరణించగానే బిజ్జలుని ఆస్థానంలో దండనాయకుడిగా, భండారి (కోశాధికారి)గా నియమించబడ్డాడు. వర్ణాశ్రమ వ్యవస్థను వదలిపెట్టి, ప్రతి వ్యక్తీ లింగధారణ చేయాలని, ఆ లింగం పరంజ్యోతికి ప్రతీకగా , ఆత్మస్థానానికి గుర్తుగా భావించాలన్నాడు. లింగధారణ చేసిన లింగాయతులు ఏ కులం వాళ్ళైనా సహపంక్తి భోజనాలు చేయవచ్చని ప్రతిపాదించాడు. శైవంలో బసవేశ్వరుడు చేసిన సంస్కరణలు సంప్రదాయ వైదిక మతానికి కూడా అందనంత ఉన్నత స్థాయిలో ఉండేవి. అవన్నీ ఒక ఆత్మజ్ఞాని చేసిన ఆలోచనలు. ‘అనుభవ మండపం’ పేరుతో బసవేశ్వరుడు ఒక లోక్‌సభను స్థాపించి స్ర్తి, దళిత, శూద్రులకు అందులో అవకాశం కల్పించాడు. ‘కాయకమే కైలాసం’ (డిగ్నిటీ ఆఫ్ లేబర్) అనే సూత్రం ద్వారా అన్ని కులాలకు సమానత్వం, శ్రమకు గౌరవం కల్పించాడు. జాడర దాసిమయ్య (నేత పని) మేదర కేతయ్య (బుట్టలు అల్లే వ్యక్తి), మడివాలు మాచయ్య (రజికుడు), హడపద అప్పన్న (క్షురకుడు), ఒక్కళు ముద్దయ్య (రైతు) మాదర చెన్నయ్య (చెప్పులు కుట్టే వ్యక్తి), కిణ్ణెర బొమ్మణ్ణు (కంసాలి), మాదిగ హరళయ్య- వీరంతా బసవేశ్వరుని అనుయాయులు. ఈ వీరశైవాన్ని చెన్న బసవేశ్వరుడు, అక్కమహాదేవి, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు ఇంకా అనేకమంది కన్నడ, తెలుగు ప్రాంతాలకు అందించారు.
ఈ వీర శైవ లింగాయత మతమంతా వైదిక మతం ఛాయ నుండి వేరు పడలేదు. బసవేశ్వరుడు హిందూ మత సంస్కరణవాదే తప్ప హిందూ ధర్మం నుండి వేరు పడలేదు. సంస్కర్తలంతా హిందూ మతంలోని ఎన్నో విషయాలను స్వీకరించలేదు. ఉదాహరణకు దయానంద సరస్వతి పురాణ సాహిత్యాన్ని ఖండించాడు. మరి ఇపుడు ఆర్య సమాజం వారు మమ్మల్ని హిందూ మతం నుండి వేరు చేసి మైనారిటీ మతంగా గుర్తించమని అడగాలా? పరమ శివుని పరమేశ్వరతత్వాన్ని బసవేశ్వరుడు లింగారాధనగా ప్రతిపాదించాడు. శివుడు హిందూ ధర్మానికి చెందిన దేవుడా? కాదా? హిందూమతంలో గొప్ప సంప్రదాయిక బలం వున్న లింగాయత్‌లను ఈ ధర్మం నుండి వేరు చేసే అధికారం రాజకీయ నాయకులకు ఉంటుందా? తమ స్వలాభం కోసం, అధికారం కోసం ధర్మాన్ని ముక్కలు చేసే దుస్సాహసం ఆ తర్వాత వారి మెడకే చుట్టుకున్న విషయం పంజాబ్‌లో మనం చూశాం. ఇప్పుడు జరుగుతున్న ఈ కుర్చీలాట భవిష్యత్తులో ఎన్నో విపరిణామాలకు దారితీయడం ఖాయం. ఇప్పటికే రాజస్థాన్‌లో గుజ్జర్లు, గుజరాత్‌లో పటేళ్లు, ఆంధ్రలో కాపులు, తెలంగాణలో ముస్లింలను రెచ్చగొడుతున్న నాయకులు, పార్టీలు తర్వాత భారీ మూల్యం చెల్లించనున్నాయి. సిక్కులు, జైనులు, బౌద్ధుల్లాగా మేం ఉంటాం అంటూ కొందరు లింగాయత్ నాయకులు చేస్తున్న వాదనకు బలం లేదు. సిక్కు, బౌద్ధ, జైనుల్లో వైదిక పద్ధతుల ద్వారా ఏదీ జరగదు. వాటికున్న తత్వభూమిక వారిని హిందుత్వంలో భాగం చేసింది. వీరశైవంలోని మూల సూత్రం అంతా హిందూ మత పునాది నుండి పుట్టిందే. ఇపుడు కర్ణాటకలోని బీదర్, కల్బుర్గి, దావణగిరి వంటి ప్రాంతాల్లో ప్రజల మధ్య వైషమ్యాలు, ఆందోళనలు పెరిగిపోగా సిద్ధరామయ్యను ప్రాంతీయ స్థాయికి దిగజార్చి, కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రాహుల్ గాంధీ ఖాతాలో  
వేయాలని అనుకొంటుంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ సీట్లలో దాదాపు 100 సీట్లను ప్రభావితం చేయగల వారిని ఆకట్టుకునేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాచపుండుగా మారనుంది. ఈ రావణకాష్టంలో కాచుకోవాలనుకుంటున్న సిద్ధరామయ్య, రాహుల్‌లకు నిరాశే మిగలనుంది. కాని ఈ సమస్య అక్కడి ప్రజల మనస్సుల్లో ముల్లులా గుచ్చుతూ వైషమ్యాలు పెంచడం నిజం. తాత్కాలికంగా చేస్తున్న ఈ స్వార్థ రాజకీయం కొందరిని చరిత్రహీనులుగా నిలబెడుతుందన్నది కూడా అంతే సత్యం.


****************************************************
-డా. పి భాస్కరయోగి 
Published Andhrabhoomi :
Friday, March 23, 2018




– జనంలో ఉన్నవారికి రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వండి. నన్ను ఇంకోసారి రాజ్యసభకు పంపండి.
–  చంద్రబాబుకు లేఖలో దేవేందర్‌గౌడ్‌
– మీరు ఆరోగ్యం బాగోలేక జనంలో లేనట్టున్నారని మీ పార్టీవారే అంటున్నారు.
– ఇంకోసారి మోదీని అధికారంలోకి రానివ్వం
– సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పూర్వాధ్యక్షురాలు
– ఇలాంటి ‘అహంకారమే’ మిమ్మల్ని అధికారం నుండి దూరం చేసిందని విశ్లేషకులు అంటున్నారు.
– నేను 29 సార్లు ఢిల్లీకి వెళ్ళా. కాంగ్రెస్‌ దారుణంగా విభజిస్తే ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు బిజెపి ఇలా చేసింది.
– ఎపి సిఎం చంద్రబాబు
– ఈ 29 సార్లు ¬దా అడగటానికే వెళ్ళారా ? ఆ మధ్య బిజెపి, మోదీ గొప్ప అని మీరే అన్నారుగా !
– ఇన్నాళ్ళు మందిరం పేరుతో బిజెపి మోసం చేసింది. రామమందిరం మేమే కడతాం.
– తేజస్వీ యాదవ్‌, ఆర్‌జెడి నేత
– నీకూ రాహుల్‌ బాబా గాలి సోకిందా నాన్నా ! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా ఎవరైనా !
– వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడిస్తాం.
– సింగపూర్‌ పర్యటనలో రాహుల్‌
– సింగపూర్‌లోనా ! ఇక్కడా ! ముందు భారత్‌కు రండి.
– కెసిఆర్‌ది తుగ్లక్‌ పాలన. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, ఋణ మాఫీ.
– టిపిసిసి చైర్మన్‌ ప్రజ్ఞాకుమార్‌రెడ్డి
– సాధ్యంకాని హామీలు ఇవ్వడం, అవి నిలబెట్టుకోలేక తుగ్లక్‌గా మారడం మీకు కూడ అలవాటేగా !
– మతోన్మాద భాజపా ప్రభుత్వాన్ని ఓడించేందుకు, ఆర్‌.ఎస్‌.ఎస్‌. శక్తులను కట్టడి చేసేందుకు ఉధృతంగా ఉద్యమాలు చేయాలి.
– సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
– ‘ఏటి మీద ఉన్నోడికి ఏం చింత అంటే కూటి మీద చింత’ అన్నట్లు మీకు జీవితమంతా భాజపాను ఓడించడమే పని.
– చంద్రబాబుతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది.
– రాజీనామా చేసిన భాజపా మంత్రులు
ఖీ పని చేశారా అసలు!?
ం నేను చచ్చేవరకు కెసిఆర్‌తో, తెరాసతోనే ఉంటా.
– మంత్రి హరీశ్‌రావు
– మిమ్మల్ని మీరు నిరూపించుకుంటున్నారన్నమాట.
– కేంద్రాన్ని మాటనిలబెట్టుకోమంటున్నాను.
– పవన్‌ కళ్యాణ్‌, జనసేన
– ‘సందట్లో సడేమియా’ అంటే ఇదే.

****************************************************
– డా|| పి.భాస్కరయోగి


మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి జవహర్‌లాల్ నెహ్రూ గొప్ప ప్రజాదరణ గల నాయకుడు. ఆయన ఎంత సీరియస్ పొలిటీషియనో అంత హాస్య చతురత గలవాడు. ఎదుటివారు శత్రుపక్షం వారైనా మెచ్చుకొనే స్వభావం ఆయనకుండేది. నెహ్రూతో ఇంకెవరో పెద్ద మనిషి మాట్లాడుతుండగా- అక్కడికి అటల్ బిహారీ వాజపేయి వచ్చారట. యువకుడైన వాజపేయిని నెహ్రూ పరిచయం చేస్తూ ‘ఇతడెప్పుడైనా ఈ దేశానికి ప్రధాని అవుతాడు’ అన్నాడట. అలాగే 1948లో ‘శంకర్ వీక్లీ’ అనే పత్రిక నిర్వహించిన సమావేశంలో ఉపన్యసిస్తూ- ‘ఈ పత్రికను మీరు ఎలా నడుపుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ కార్టూన్‌లలో నన్ను వదలిపెట్టవద్దు’ అన్నాడట నెహ్రూ.
ఇదీ ఆనాటి నాయకుల ఉదాత్త హృదయానికి, ప్రజాస్వామ్య దృష్టికి తార్కాణం. మరి ఈరోజు కార్టూన్స్ వేస్తే భరించే శక్తి ఎంతమంది నాయకులకు ఉంది? దీనికి ప్రధాన కారణం నాయకుల హృదయాల్లో ప్రజాస్వామిక లక్షణం లేకపోవడం. ఎదుటివారి భావ వ్యక్తీకరణకు గౌరవం ఇచ్చే మనస్తత్వం లేకపోవడం! ఇలాంటి దృక్పథం వల్లనే తెలంగాణ అసెంబ్లీలో గత కొద్ది రోజుల నుండి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.
ఇటీవల నల్లగొండలో మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగింది. అతను ఆ జిల్లాలోప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్య అనుచరుడు. శ్రీనివాస్ హత్యతో వెంకటరెడ్డి మనోధైర్యం దెబ్బతింది. ఈ హత్య టీఆర్‌ఎస్ నాయకుల పనే అని ఆయన ఆరోపిస్తున్నాడు. శ్రీనివాస్ సంతాప సభలో టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను తీవ్రంగా హెచ్చరించాడు. అప్పటినుండి ముఖ్యమంత్రిపై తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు. నిజానికి కోమటిరెడ్డిని ఉదార హృదయం గల నాయకుడిగా చెప్తారు. అంతేగాకుండా తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత మరింతగా ప్రజల్లో కలిసి తిరుగుతున్నాడు. ఒక్కసారిగా తన ముఖ్య అనుచరుడి హత్య అతనిలో అసహనాన్ని తెచ్చింది. ఈలోపు ఒక ప్రజాప్రతినిధిగా రైతు సమస్యలు ప్రస్తావించాడు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే కోమటిరెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. వీళ్ల మనస్తత్వాన్ని ముందే పసిగట్టిన కేసీఆర్ అంతకుముందు రోజు జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో కాంగ్రెస్ సభ్యుల వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో వివరించాడు. అంతేగాకుండా గంగుల కమలాకర్ లాంటి వారిని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ ఉచ్చులో పడి ఆవేశానికి లోనుకావద్దని చెప్పినట్లు వార్తలొచ్చాయి. అనుకున్నట్లుగానే సభా ప్రారంభం రసాభసగా మారి కాగితాలు, హెడ్‌ఫోన్ సెట్లు వెంకట్‌రెడ్డి విసిరేయడం జరిగింది. ఈ గొడవలో ఏదో వస్తువు శాసనమండలి చైర్మన్ కంటికి తగిలి గాయం అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బస్సు యాత్ర చేస్తే ప్రభుత్వం ఎంత పట్టించుకున్నదో తెలియదు కానీ మీడియా మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. బస్సు యాత్ర మామూలు వార్తగా మారిపోయింది. కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర, బిజెపి ఈశాన్య రా ష్ట్రాల అపూర్వ విజయం రెం టినీ అప్రాధాన్య అంశాలుగా మార్చడానికే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన తెచ్చారన్నది విశే్లషకుల అంచనా.
కాగా, మండలి చైర్మన్ కంటికి గాయం అయ్యేట్లుగా వస్తువులు విసిరేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. అప్పుడప్పుడు విదేశాల్లో, ముఖ్యంగా కొన్ని పోకిరీ దేశాల్లో సభ్యులు హద్దులు మీరి ప్రవర్తించడం చూశాం. గతంలో తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం జయలలితపై ఎంత దుర్మార్గంగా చట్టసభ సాక్షిగా ప్రవర్తించిందో కూడా మనకు తెలుసు. కరుణానిధిపై ఆ పగను జయలలిత మరణించేవరకూ వదలిపెట్టలేదు. మధ్యలో కరుణానిధిపై ఓ కేసు బనాయించి పంచె ఊడగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి జయలలిత తన పగ చల్లార్చుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో అయితే ఇలాంటి ఘటనలకు లెక్కేలేదు. ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీ శాసనసభల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకొన్నాయి.
నిజానికి పార్లమెంటు, శాసనసభ, శాసన పరిషత్తులు మొదలుకొని గ్రామ పంచాయతీల వరకు ఆరోగ్యకరమైన చర్చల కోసమే మనం రాజ్యాంగం ద్వారా చట్టసభలను, స్థానిక సంస్థలను ఏర్పరచుకొన్నాం. ఎవరి బలాన్ని వారు ప్రదర్శించేందుకైతే ప్రతి సభ్యుడూ ఓ తుపాకీనో, కర్రనో పట్టుకొని వెళ్లి మల్లయుద్ధంలో పాల్గొని తన బలాన్ని నిరూపించుకోవచ్చు. అలాకాకుండా నాగరిక దేశాల్లో రాజ్యాంగబద్ధంగా చర్చించడానికే ఈ ప్రజాస్వామ్య వేదికలు. అయితే కాంగ్రెస్ వారు కూడా దీనిని సమర్ధించలేదు. నిరసన తెలిపే భావస్వేచ్ఛను కేసీఆర్ ప్రభుత్వం అణచివేసిందని, హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తేసి, కోదండరాం లాంటి వాళ్లను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. పిల్లిని కూడా గదిలో వేసి బంధిస్తే ఇలాంటి చర్యలే జరుగుతాయని వారి వ్యాఖ్యా నం. మన శాసనసభ చరిత్రలో ఎన్నడూ జరుగని విధంగా ఇద్దరు సభ్యులను తొలగిస్తూ సభ నిర్ణయం తీసుకొంది. ఇది సరైందా? కాదా? అని కోర్టులు, ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తాయి.

వాస్తవానికి కేసీఆర్‌లో ఉదాత్త నాయకుడు కన్పిస్తాడు. అంతే తీవ్రమైన కరుకుదనం కూడా కన్పిస్తుంది. ఇది ఇప్పటివరకు ప్రతిపక్షాలకు అర్థం కాలేదు. తనను నమ్మిన వారి పట్ల ప్రాణం ఇచ్చే స్వభావం గల వ్యక్తిగా, ఆపదలో ఉన్న వారిని తన, మన భేదం లేకుండా ఆదుకోవడం ఆయన నైజం. అప్పుడప్పుడు తన శత్రుపక్షం పట్ల అంతే వైరభావంతో ఉంటాడు. ఈ దృక్పథం అర్థం చేసుకోడానికి ప్రతిపక్షానికి, మీడియాకు నాలుగేళ్లు పట్టింది. ఇందులో భాగంగానే ఇద్దరు సభ్యులపై వేటు. అయితే కేసీఆర్ లాంటి పరిపక్వ రాజనీతిజ్ఞుడు మరుసటిరోజు వాళ్లను సభకు పిలిపించి క్షమాపణ చెప్పించి, సభ కొనసాగిస్తే ఆయనకు మరింత మంచి పేరు వచ్చేదని మేధోవర్గాల అభిప్రాయం. ‘తానాషాహీ హఠావో’ అంటూ రిజర్వేషన్ల అంశంపై రోజూ పార్లమెంటును స్తంభింపజేస్తున్న టీఆర్‌ఎస్ సభ్యులను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గౌరవంగా చూస్తున్న విషయం కేసీఆర్ కూడా విస్మరించరాదు.
‘ఆత్మహత్య నా నిరసన’- అని ఓ స్వాతంత్య్ర విప్లవవీరుడు అంటాడు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ గంగలో కలిసిపోయి, ఇలాంటి విషయాలే ముందుకువస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ తమ శిబిరంలో ఇద్దరు సభ్యుల సభ్యత్వం పోయినా, తమకు ప్రభుత్వంపై మైలేజ్ దక్కిందని లోలోపల సంతోషంగా ఉంది. కాంగ్రెస్ వాళ్లు దాడి చేయడంతో డిఫెన్స్‌లో పడినప్పుడు టీఆర్‌ఎస్ దానిని అందిపుచ్చుకోవాల్సిందని రాజకీయ వర్గాల ఆలోచన. ఎందుకంటే ఈ రోజుల్లో దాడి చేయడం కూడా కొందరికి హీరోయిజమే.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుస్తంభాల రాజకీయ క్రీడకు తెరలేచింది. కేంద్ర క్యాబినెట్ నుంచి తన ఇద్దరు మంత్రులను బయటకు రప్పించి, రోజూ బిజెపీని తిడుతూ ప్రజల్లో మోదీని విలన్‌గా చేయడంలో చంద్రబాబు కృతకృత్యుడయ్యాడు. ఇప్పుడైనా అక్కడి భాజపా నేతలు మేల్కోకపోతే నిజంగా కేంద్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే వారికీ పడుతుంది. కాంగ్రెస్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల ముందు తెలంగాణ ఇచ్చినట్లు, 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ప్రకటించినా భాజపాకు ఫలితం ఉండదు. ప్రజలకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలి. చంద్రబాబుతో సంసారం పొసగేది కాదని ఇప్పటికైనా భాజపా గుర్తించాలి. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, యూపీ ఎన్నికల్లో వ్యూహకర్తలను దింపినట్లు ఇప్పటి నుండే వ్యూహం పన్నకపోతే భాజపాకు పెద్ద ఎదురుదెబ్బ తప్పదు. గతంలో ఓసారి దేశమంతా కొట్టుకపోయినపుడు- తెలుగు రాష్ట్రాలే ఆ పార్టీకి పునర్జీవం ఇచ్చాయి. ఇప్పుడు నిర్జీవంగా ఉన్న కాంగ్రెస్‌కు తెలుగుదేశమో, తెరాసనో, వైఎస్సార్ సీపీనో బాసటగా నిలబడే ఛాన్స్ కూడా లేకపోలేదు. పార్లమెంటులో రిజర్వేషన్ల పేరుతో తెరాస, హోదా పేరుతో తెదేపా ఆందోళన చేస్తున్నా ఏమీ పట్టనట్లు వారి మానాన వారే పోతారని వదిలేస్తే భాజపాకు మిగిలేది పరాభావమే. వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చేకన్నా రాజకీయంగా ఎదుర్కోడమే దీనికి పరిష్కారం. పరిష్కారం కాని ప్రతి అంశాన్ని ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తూ కేంద్రంపై నెడుతున్న కుయుక్తిని భాజపాలోని పెద్దలు గమనించాలి. అందుకు తగిన ప్రతి వ్యూహం రచించాలి.
మరోవైపు మొన్న పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పార్టీని పూర్తిస్థాయిలో ప్రజల ముందుకు తెచ్చాడు. ఇప్పటివరకు జగన్‌ను మాత్రమే శత్రువుగా భావించిన చంద్రాబాబుకు పవన్ మరోవైపు కన్పిస్తున్నాడు. జగన్‌కు ఎస్టాబ్లిష్‌డ్ రాజకీయ వ్యూహం ఉంది. పవన్‌కు కాపుకులం, సినీ అభిమానుల మద్దతు ఉంది. కాబట్టి చంద్రబాబు తెలివిగా ఏ వ్యూహం లేని భాజపాతో యుద్ధం చేస్తున్నట్లు కన్పిస్తూ వీళ్లను అధిగమించాలని చూస్తున్నాడు. రేపో, మాపో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంపైకి తెస్తారు! ఇంకోవైపు జగన్ ఆంధ్రాలోని మూడు ప్రధాన వర్గాలను తనవెంట ఉండేట్లు చూసుకుంటున్నాడు.
విచిత్రం ఏమిటంటే ప్రజలు ఇవన్నీ ఆలోచించకుండా కులాలకు, సెంటిమెంట్లకు లొంగిపోతున్నారు. ఇటీవలి కాలంలో వ్యవస్థల కన్నా వ్యక్తులపై జనం ఎక్కువ విశ్వాసం ఉంచుతున్నారు. చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ లాంటి నేతలు తమకు కావాలనుకొంటున్నారు. దాని పరిణామమే ప్రతి రాష్ట్రం ఓ కులం చేతిలోనో, కుటుంబం చేతిలోనో, ఓ వ్యక్తి కేంద్రంగానో నడుస్తుంది. అలాగే అభివృద్ధి ఫలాలు కూడా సమూహానికి జరగడం కన్నా వ్యక్తిగా తమకేం లాభం అని ప్రజలు ఆలోచిస్తున్నారు. నేడు రాజకీయం ‘ఈవెంట్ మేనేజ్‌మెంటు’గా మారుతోంది. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తలు రాజకీయాలను తారుమారు చేస్తున్నారు. పూర్వం రాజులకు చతురంగ బలాలుగా అశ్వ, గజ, రథ, పదాతి దళాలు ఉంటే ఈరోజు రాజకీయానికి కులం, ధనం, బలం, వ్యూహం- ఈ నాలుగూ చతురంగ బలాలుగా మారిపోయాయి. ఇంకెప్పుడు మనం ప్రజాస్వామ్యం పరిరక్షించుకొంటాం?

****************************************************
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125
Published Andhrabhoomi :
Friday, March 16, 2018


‘నాకు ఈ సమయంలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత గుర్తొస్తోంది. ‘నీ విధి నువ్వు నిర్వర్తించాలి’ అంటూ విష్ణువు యువరాజుకు (అర్జునుడికి) చెబుతూ తన విశ్వరూపాన్ని చూపుతాడు. ‘నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే శక్తిని’ అని చెబుతాడు’’
..రెండో ప్రపంచయుద్ధ సమయంలో అణ్వస్త్రాలకు సంబంధించిన మన్‌హట్టన్‌ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన రాబర్ట్‌ జూలియస్‌ ఓపెన్‌హేమర్‌ చెప్పిన మాట ఇది. అణుబాంబు తయారీలో కీలకపాత్ర పోషించిన ఆయన భగవద్గీత చదవడం వల్లనే తనకు ఆ స్థితప్రజ్ఞత కలిగిందని చెప్పాడు. అణుపరీక్ష జరిపినప్పుడు విడుదలైన వేయిసూర్యుల కాంతిని విశ్వరూపుడైన పరమాత్మ కాంతితో సరిపోల్చాడు. ప్రపంచ మత గ్రంథాల్లో యుద్ధభూమిలో చెప్పబడిన ఏకైక గ్రంథం.. గీత. లోకంలోని దుఃఖాన్ని తన దుఃఖంగా భావించుకొని అర్జునుడు పొందిన విషాదాన్ని కృష్ణుడు గీతాప్రబోధంతో పటాపంచలు చేశాడు. ధర్మక్షేత్రాల్లో కూడా యుద్ధం సంభవించడం.. శ్రీకృష్ణుడి లాంటి దక్షుడైన అవతారపురుషుల కాలంలో కూడా రాజ్యకాంక్ష ఉండటం ద్వాపరం విశేషం. అనుశాసన పర్వంలో ధర్మరాజు ఇదే విషయాన్ని చెబుతూ.. ‘‘రాజ్యకాంక్షతో ఇన్ని దుర్మార్గాలకు పాల్పడ్డ దుర్యోధనుడు సరే.. నా సంగతేమిటి? ‘ఛీ, ఈ రాజ్యం నాకెందుకు’ అని నేను అనుకుని ఉంటే యుద్ధం తప్పేదిగా? అంటే జరుగుతున్న పరిణామాలకు దుర్యోధనుడు ఒక కోణమైతే నేను ఇంకో కోణం అన్నమాట’’ అని వాపోతాడు. ఇవే ప్రశ్నలు.. ‘నేనే చేస్తున్నాను’ అనే భావన అర్జునుడిలోనూ ఉదయించినందువల్లనే గీత బోధ జరిగింది. అర్జునుడిని స్థితప్రజ్ఞుడిని చేసి ఆ స్థితి నుంచి కర్తవ్యం దిశగా తీసుకెళ్లడమే గీతా యోగం. అలా ఎవరికైనా సరే కర్తవ్యబోధ చేసి ఒడిదొడుకుల నుంచి కాపాడే పరమౌషధం భగవద్గీతే. అందుకే అందరూ భగవద్గీత చదవాలి.


****************************************************
డాక్టర్‌ పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ఆంధ్రజ్యోతి రంగారెడ్డి 09-03-2018

నమస్తే తెలంగాణ రంగారెడ్డి 09-03-2018

వార్త రంగారెడ్డి 09-03-2018

ఆంధ్రప్రభ రంగారెడ్డి 09-03-2018

సాక్షి రంగారెడ్డి 09-03-2018

నవ తెలంగాణ 09-03-2018
 డాక్టర్ పి.భాస్కరయోగి 



అప్పుడే సభలో శ్రీకృష్ణదేవరాయలు కొలువుదీరాడు. ‘ఏడ్చే చిన్నపిల్లలను సంతృప్తిపరచడం సాధ్యమా?’ అని పండితులు ఆ సభలో సమస్యను ఇవ్వగా- కొందరు సాధ్యం కాదన్నారు. మరికొందరు సాధ్యమే అన్నారు. తాతాచార్యులు ‘నేను ఎంతటి తుంటరి పిల్లవాన్నైనా సంతృప్తిపరుస్తానన్నారు. తాతాచార్యులకు, తెనాలి రామకృష్ణుడికి ఎప్పుడూ పొసగేది కాదు. రామకృష్ణుడు ‘చిన్నపిల్లల ఏడుపు మాన్పించడం సాధ్యం కాదు’ అన్నాడు. వెంటనే రాయలవారు అందుకొని ప్రస్తుతానికి రామకృష్ణుడు చిన్నపిల్లవాడైన మనుమడు. తాతాచార్యులు అతడిని తాతగా సంతృప్తిపరచాలి అన్నాడు. ఇద్దరూ తాత, మనవడుగా సంతలోకి వెళ్ళారు. రామకృష్ణుడు ఆకతాయిలా మారాం చేస్తూ అనేక వస్తువులు కొనిపించుకొంటాడు. అందులో ఒక చిన్న సంచీ, ఏనుగు కూడా వున్నాయి. ఇద్దరూ ఏనుగుపైన ఎక్కి రాయల కొలువుకూటానికి వెళ్ళారు. అక్కడే చివరి పరీక్ష. సభలో రామకృష్ణుడు మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. ‘అన్నీ ఇప్పించాక ఇంకెందుకు ఏడుస్తున్నావు..’ అన్నాడు తాతాచార్యులు. ‘ఆ ఏనుగును ఈ చిన్న సంచీలో పెట్టాలి’ అని మళ్లీ ఏడ్చాడు. ఎవడైనా ఏనుగును సంచీలో దూర్చగలరా? అని తాతాచార్యులు ఓటమి ఒప్పుకొన్నాడు. సరిగ్గా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇలాంటి ఎత్తుగడనే ప్రదర్శిస్తున్నాయి. కేంద్రం ఎన్ని నిధులిచ్చినా ఏదో ఒకటి కొత్తది అడుగుతూ కాదనపించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని వీలైనంత అపఖ్యాతిపాలు చేయడమే ఇందులోని రహస్యం.
భాజపాకు చెందిన వెంకయ్యనాయుడు కేంద్ర మం త్రిగా ఉన్నన్నిరోజులు అనేక గొంతెమ్మ కోర్కెలను తీర్చుకొన్న చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల కేంద్రంలోని భాజపాపై తిరుగుబాటు మొదలుపెట్టింది. చాలారోజులుగా చంద్రబాబు, మోదీల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. గతంలో కేంద్రంలో ఎన్నోసార్లు చక్రం తిప్పిన చంద్రబాబు గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీని తీవ్రంగా విమర్శించారు. అదే చంద్రబాబు మళ్లీ మోదీకి, భాజపాకు దగ్గరయ్యారు. గత నాలుగేళ్ళలో మోదీ, భాజపా చంద్రబాబుకు వాజపేయి కాలంలో ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎన్టీఆర్ కాలం నుండి టీడీపీ కాంగ్రెస్‌కు ఆగర్భశత్రువు. కాంగ్రెస్‌తో చేరితే అవకాశవాద పొత్తు అన్న అపప్రథ వస్తుందని బాబు దూరంగా ఉన్నాడు. మోదీ, అమిత్ షాలు అద్వానీ, వాజపేయిల్లా సత్యకాలపు సత్తయ్యలు కారు. రాజకీయం తెలిసిన అపర చాణక్యులు. ఈ విషయం పసిగట్టిన చంద్రబాబు ఇన్నాళ్లూ వౌనంగా ఉన్నాడు. కానీ ఇటీవల ఏపీలో వైఎస్ జగన్ ‘గ్రాఫ్’ పెరుగుతూ వస్తోంది. ‘ప్రత్యేక హోదా’ అంశంపై పవన్‌కల్యాణ్ మరోవైపునుండి నరుక్కుంటూ వస్తున్నాడు. సహజ సిద్ధమైన భాజపా వ్యతిరేకతను ప్రదర్శించే వామపక్షాలు చంద్రబాబుపై దుష్ప్రచారం తీవ్రం చేశాయి.
ఇవన్నీ ఇలా తన్నుకువస్తుంటే వౌనంగా ఉంటే రాజకీయంగా దెబ్బ తగులుతుందని భావించిన చంద్రబాబు- ‘పాము చావకుండా, కర్ర విరగకుండా’ ఇపుడు భాజపాను బజారుకు ఈడ్చాడు. మరోవైపు జగన్, ఇంకోవైపు పవన్‌కళ్యాణ్ ‘హోదా’ కోసం వామపక్షాలు, లోక్‌సత్తా జేపీ తదితరులతో కలిసి మేధోచర్చల్లా భ్రమింపజేస్తున్నారు. ఏపీ కోసం కేంద్రం గత నాలుగేళ్ళలో చేసిన మంచి ఎక్కడ గాలిలో కలిసిపోయిందో గాని, ‘హోదా’ అన్న ఒక్క మాట మాత్రం భాజపాను బాగా అపఖ్యాతి పాలు చేసింది. సోము వీర్రాజు లాంటి వాళ్ళు మొదటినుండి తెలుగుదేశాన్ని కరకుగా ఎదుర్కొంటున్నారు. బాబు క్యాబినెట్‌లో ‘రాజీనామాలు చేసే వరకూ’ కొనసాగిన ఇద్దరు భాజపా మంత్రులు మాత్రం నోరుమెదపలేదు. ఒకప్పుడు తెలంగాణ ఇవ్వడమే సకల సమస్యలకూ పరిష్కారం అనే నినాదంలా, ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఓ నినాదమైంది. విచిత్రమేమిటంటే ఈ యాభై ఏళ్ళలో ఏపీకి ఏ ప్రభుత్వం చేయనన్ని మేం చేశాం అని భాజపా నేతలు మొత్తుకుంటున్నా, ‘ఆగర్భ భాజపా శత్రుత్వం’ వున్న తెలుగు ప్రచార, ప్రసార మాధ్యమాలు వాళ్ళను పట్టించుకోవట్లేదు. ఈ విషయాలు తెలిసి సాక్షీభూతంగా వున్న వెంకయ్య నాయుడు ఇపుడు నోరు తెరిచే పరిస్థితి లేదు. ‘వ్రతం చెడ్డా సుఖం లేదన్నట్లు’గా భాజపా పరిస్థితి తయారైంది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు కోరిక మేరకు తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపింది. ఇలా విలీనం చేసినందుకు చంద్రబాబు మెచ్చుకోవడం లేదు. కానీ తెరాస మాత్రం భాజపాను తిట్టాలనుకున్నప్పుడల్లా ఈ విషయం తెరపైకి తెస్తున్నది. అలాగే హైకోర్టు విభజన జరగకపోవడంలో సాంకేతిక అంశాలతోపాటు బాబు వ్యూహం కూడా వుంది. ఆ నెపం కూడా భాజపా మోస్తున్నది. హైకోర్టును విభజించనందుకు ఆంధ్ర నాయకులు భాజపాకు కిరీటం పెట్టలేదు కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత కలిగించారు. ఇలాంటి ఉదాహరణలు వంద చెప్పవచ్చు.

ఇలాంటప్పుడు చంద్రబాబుకు నిజంగా హోదాపై తీవ్రత ఉంటే- ఇప్పుడు కాదు.. ఎప్పుడో కేంద్రంలో తన ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించి, రాష్ట్రంలోని ఇద్దరు భాజపా మంత్రులను సాగనంపి ఉండాలి. మరోవైపు భాజపాను తొక్కేసే పని మీడియా సహా ఆంధ్రలోని అన్ని పార్టీలు చేస్తున్నాయి! ఎన్నికలు కాస్త దూరంగా ఉన్నందున అన్ని పార్టీలు ఇప్పుడు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.
తెలంగాణలో గత వారం రోజుల నుండి మరో క్రొత్త రాజకీయం మొదలైంది. ఇప్పటివరకు కేంద్రంలో చక్రాలు తిప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబే అని పేరుండేది. ఇపుడు కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించడం సంచలనమైంది. పదిహేను రోజుల క్రితం ఓ రైతు సభలో ఆయన కాస్త ఆక్రోశంతో మోదీపై ఏకవచన ప్రయోగం చేశారు. అయితే- ఆ తర్వాత కెటీఆర్, కవిత అది ‘ఉపన్యాస ప్రవాహంలో వచ్చి తొట్రుపాటు’అని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కెసీఆర్ తనకు మోదీ పట్ల గౌరవం ఉందన్నా, తన మాటలను వెనక్కు తీసుకోలేదు. ఈలోపు ఏం జరిగిందో బయటకు తెలియదు కాని కేంద్రంపై కెసీఆర్ యుద్ధం ప్రకటించారు. కాంగ్రెస్, భాజపా రెండూ రెండూ దేశాన్ని భ్రష్టుపట్టించాయని ఆయన ధ్వజమెత్తారు. వెంటనే తెరాస నేతలు కెసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అభిషేకాలు చేశారు. సోషల్ మీడియాలో దీనిపై అనేక సరసోక్తులు, వ్యంగ్యోక్తులు, నిందలు, స్తుతులు నిండిపోయాయి. వెంటనే మమతాబెనర్జీ, అజిత్ జోగి, మహారాష్ట్ర ఎంపిలు, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కెసీఆర్‌కు స్వాగతం పలికారు. ‘అంతా కలసి మోదీని దునే్నద్దాం’ అని వీరు అన్నారని ప్రగతిభవన్ మీటింగ్‌లో కెసీఆర్ చెప్పారట!
ఈశాన్య భారతంలో చరిత్రను తిరగరాస్తూ భాజపా గెలుపొందగానే ఆ ఫలితాలు వెలువడ్డరోజే ఇదంతా జరిగింది. భాజపా గెలుపును తక్కువ చేసి చూపించడానికే థర్డ్‌ఫ్రంట్, కెసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం అనే అంశాలు మీడియా ఎక్కువ చేసి చూపిందని విశే్లషకుల అభిప్రాయం. కెసీఆర్ ప్రకటన వెనుక ఆరెస్సెస్ ఉందని రేవంత్‌రెడ్డి అంటే, మోదీ ఉన్నాడని కాంగ్రెస్ అంటోంది. చంద్రబాబు భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కలుస్తాడనే నిఘా వర్గాల కథనం వల్లనే భాజపా నాయకత్వం కేసీఆర్‌ను రంగంలోకి దింపిందని, అందుకే ఇన్నాళ్లు ఆంధ్ర నాయకులతో ఉప్పు నిప్పుగా ఉన్న కేసీఆర్ తెలుగుజాతి నినాదం అందుకున్నారని మరికొందరి విమర్శ. కానీ ఆయన అంత అస్వతంత్రమైన నిర్ణయాలు తీసుకొనే అపరిపక్వ నేత కాదు. బహుశా ఆయన వయస్సు దృష్ట్యా తెలంగాణలో తన కుమారుడు కేటీఆర్‌ను ప్రమోట్ చేయడానికే ఇది జరిగిందని ఒక అంచనా.
ఈ విషయాన్ని గోరంతలు కొండంతలు చేయడానికి మీడియాకు, కేసీఆర్ వ్యతిరేకులకు రెండు ప్రయోజనాలున్నాయి. ఒక పత్రిక అయితే ఏకంగా కేసీఆర్ రోజూ ఎలాంటి వ్యూహాలు అల్లాలో అడుగకుండానే నిర్దేశం చేస్తున్నది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటినుండి మీడియా చాలా నియంత్రణలో పనిచేస్తోంది. ఈ నాలుగేళ్లలో ఒక్క పత్రికలో కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్టూన్ కూడా వేయలేకపోయారు. అది భయమో, భక్తో తెలియదు. కాబట్టి ఆయనను కేంద్రానికి పంపిస్తే ఇక్కడ మళ్లీ తమ పూర్వవైభవం నిలబెట్టుకోవచ్చు అనేది కొన్ని మీడియా సంస్థల ఆలోచన. ఆయన రాష్ట్రం నుండి వెళ్లిపోతే ఇక్కడ తెరాస పలుచబడిపోవడమే కాక, కేంద్ర రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత సులువు కాదు అనేది వాళ్లకు తెలుసు. కాకలు తీరిన ములాయం, శరద్‌పవార్, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, లాలూ, చౌతాలా కుటుంబం, నవీన్ పట్నాయక్, శివసేన పార్టీ, అబ్దుల్లా కుటుంబం, దేవెగౌడ, సోనియా గాంధీ లాంటివాళ్ళు భాజపా నేతల ప్రవాహానికి ఎదురీదుతున్నవారే. ఎన్నో చక్రాలు తిప్పిన చంద్రబాబు, మడమ తిప్పని మమత, ఆకాశమంత ఎగిరి దూకిన అరవింద్ కేజ్రీవాల్, కాకలు తీరిన కరుణానిధి వంటి నేతలందరూ మోదీ, అమిత్ షాల రాజకీయాల ముందు ఇబ్బంది పడుతున్నవారే. కాబట్టి కేసీఆర్‌ను ఢిల్లీకి పంపి, ఆయనను ఇబ్బందుల్లో పడేయాలని తెలుగు మీడియాలోని ఓ వర్గం ఉవ్విళ్లూరుతోంది. మోదీని తిట్టే మోటార్ సైకిల్ వాడినైనా కౌగిలించుకునే కమ్యూనిస్టులు, వారి మీడియా భజంత్రీలు నిన్నమొన్నటి వరకు మోదీని, కెసిఆర్‌ను నియంత, దొర అని తిట్టిపోశారు. ఇపుడు కెసీఆర్‌ను వ్యూహకర్త అంటున్నారు. వారు కాంగ్రెస్‌ను కూడా ఇందులోకి తెద్దాం అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
మొరార్జీ దేశాయి కాలం నుండి ‘పుబ్బలో పుట్టి మఖలో మాయమవుతున్న’ ఫ్రంట్‌లు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చెప్పలేం. రాష్ట్రానికో రావణకాష్ఠం రగులుతున్న ఈ కాలంలో ఈ పంచకూట్ల కూటములు ఏ ఎజెండాతో ముందుకెళ్తాయో అన్నది గహనమైన ప్రశే్న! మోదీని బాగా తిట్టగలిగిన నితీశ్‌కుమార్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, కన్హయ్యకుమార్‌ల వరుసలో ఇపుడు తెరాస అధినేతను నిలబెట్టాలని మీడియా చూస్తోందన్నది అక్షరసత్యం. కేంద్రం ఎన్ని కోర్కెలు తీర్చినా చంద్రబాబు, కేసీఆర్‌లు సంతృప్తి చెందరు. ఎన్ని తీర్చినా క్రొత్త కోర్కెలతో కేంద్రాన్ని డిఫెన్స్‌లో పడేయగల రాజకీయ సమర్థత వాళ్ళిద్దరికీ వుంది. ఇప్పటికైనా తెలుగు  రాష్ట్రాలలో ‘కమ్యూనిస్టుల్లా తోక పార్టీ మనస్తత్వం’ వల్ల భాజపా సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం. అలాగే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో సఫలం కాకపోతే తెరాస ఉనికికి, ఆయనకున్న ప్రతిష్ఠకు భంగకరం. ఇంతకన్నా ఎక్కువగా ముందుకు పోతే చంద్రబాబుకు మరో కొత్త సమరం తప్పదు. ఇదే రంగు మారుతున్న రాజకీయం!


****************************************************
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125
Published Andhrabhoomi :
Friday, March 09, 2018


– రైతే రారాజు. రైతు సమితులు ఆటంబాంబులు. కెసిఆర్‌ రద్దయితే అవీ రద్దు అవుతాయి. 1.62 లక్షల మంది సభ్యులూ, 1.62 లక్షల మంది కెసిఆర్‌లు కావాలి
– సిఎం కెసిఆర్‌
– బాగుంది. వాళ్లను కాపాడుతూ మిమ్మల్ని కాపాడాలి అంటారు. అంతేగా !?
– బాబ్రీ మసీదును మరచిపోవాలంటూ ముస్లింలను బెదిరిస్తున్నారు. అలా బెదిరించే వారికి నేనొక్కటే చెబుతున్నా. మేము మసీదును మరిచిపోయేది లేదు.
– ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసి
– మీ పునాదే అందులో ఉంది మరి. మీరు ఇలా కాక ఇంకెలా మాట్లాడుతారు !?
– భారతీయ ముస్లింలంతా రాముని వారసులే !
– కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌
– ఈ సమాధానం ఒవైసీ కేనా మంత్రిగారూ !
– కెసిఆర్‌పై అన్ని వర్గాల్లో వ్యతిరేకత. కార్యకర్తలు కాంగ్రెస్‌కు వెలకట్టలేని ఆస్తి. కార్యకర్తల వల్లే కాంగ్రెసుకు పూర్వ వైభవం.
– పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
– అంటే మీ ఘనత ఏమీ లేదని చెప్తున్నారన్నమాట.
– 8 లక్షల ఎకరాలకు నీరందించకుంటే హరీశ్‌ రాజీనామా చేస్తారా ! 24 గంటల కరెంట్‌ ఓ పెద్ద స్కాం. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.
– కాంగ్రెసు నేత డికె అరుణ
– టిఆర్‌ఎస్‌ వాళ్లు ఎవరి నోరైనా మూయిస్తారు.
– శ్రీదేవిని చంపేసినందుకు నేను దేవుణ్ణి ద్వేషిస్తాను. మరణించినందుకు శ్రీదేవిని ద్వేషిస్తున్నాను.
– రాంగోపాల్‌ వర్మ
– నీదెప్పుడూ ద్వేషించే బుద్ధే కదా !
– చదువు ‘కొనాల్సిన’ దుస్థితి. ధనికులకే ఋణమాఫీ. అదే బిజెపి నీతి. రైతులపై పట్టింపే లేదు.
– కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌
– మరే..! గత డెబ్భై ఏళ్ళుగా వాళ్ళే కదా దేశాన్ని పాలించింది !
– నేను కాగితపు పువ్వును కాదు. విత్తనాన్ని. నాటితే ఏపుగా పెరుగుతా.
– నటుడు కమల్‌ హాసన్‌
– అది మామూలు విత్తనం కాదు. ఎర్ర విత్తనం.
– ప్రజలను నిండా ముంచిన టిఆర్‌ఎస్‌
– పొన్నాల లక్ష్మయ్య
– మీరేమన్నా తక్కువా !?
– కాంగ్రెసు పాపాలు కడుగుతున్నా.
– ప్రధాని నరేంద్రమోది
– వాళ్లకు ‘పాపు’లారిటీ ఇస్తున్నారన్నమాట.
– సిఎం నీతిశ్‌ విషం పెట్టి చంపాలని చూశారు.
– ఆర్జెడి నేత తేజస్వియాదవ్‌
– అతికేటట్లు చెప్పాలబ్బాయ్‌ ! లేకపోతే ప్రజలు నమ్మరు.
– నేటి సినిమాలో శృంగారం తక్కువ. అంగారం ఎక్కువ.
– ఉపరాష్ట్రపతి వెంకయ్య
– అది ఉంటేనే కదా వాళ్ల ఇళ్లు ‘బంగారం’ అయ్యేది.

****************************************************
– డా|| పి.భాస్కరయోగి

రచనా ''భాస్కరుడు'' 

ఈనాడు మహబూబ్ నగర్ 04-03-2018

 డాక్టర్ పి.  భాస్కరయోగి . 



ఒకడు బహిర్భూమికి వెళ్లినపుడు ఒక చెట్టు మీద ఊసరవెళ్లిని చూశాడు. అతడు తన మిత్రులతో ‘నేనొక ఎరుపు రంగు తొండను చూశాను’ అ న్నాడు. ఆ తొండ రంగు ఎరుపే అని అతని నమ్మకం. అక్కడికి వచ్చిన మరొక వ్యక్తి ‘నేను ఆకుపచ్చరంగు తొండను చూశాను’ అన్నాడు. ఆ తొండ రంగు ‘ఆకుపచ్చే’ అని అతని దృఢ విశ్వాసం. ఇంకోవ్యక్తి ‘మీరు చెబుతున్నదంతా నిజమే. ఆ ప్రాణి ఒక సమయంలో ఎరుపు రంగులో, మరో సమయంలో ఆకుపచ్చ రంగులో, మరికొన్ని వేళల్లో ఎటువంటి రంగు లేకుండా ఉంటుంది. అలాగే వేదాలు భగవంతుడిని సగుణుడని, నిర్గుణుడని వర్ణించాయి’ అంటూ సగుణ, నిర్గుణ తత్త్వాన్ని శ్రీరామకృష్ణులు ఇంత అత్యద్భుత సమన్వయంతో పేర్కొన్నట్టు వివరించాడు.
మరి నేడు హిందూమతం పేరుతో ఎన్నో ఆచరణలు, ఆలోచనలు, సంప్రదాయాలు, పర్వాలు నిర్వహిస్తున్నాం, కానీ వాటిలోని పరమార్థాన్ని విస్మరిస్తున్నాం. వివిధ శాస్త్రాల మధ్య సమన్వయం గురించి పట్టించుకోకుండా వదిలేశాం. మనల్ని కొందరు దోషుల్లా నిందిస్తున్నా గుడ్లప్పగించి చూస్తున్నాం. మత పరిజ్ఞానం అంతా అంధవిశ్వాసాలుగా కొట్టి పారేసే శక్తులకు ఊతమిస్తున్నాం. మన ప్రాచీన పరంపరతో దేశ విదేశాల్లో అవార్డులు కొట్టేసే వాళ్లకు మనమే పరోక్షంగా సహకరిస్తున్నాం. భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక సెంటిమెంట్‌కు బ్రిటిష్ కాలం నుండి పునాదులు పడ్డాయి. ఉదాహరణకు గుడిపాటి వెంకటాచలానికి తెలుగు సాహిత్యంలో కొందరు స్థిరమైన స్థానం కల్పించారు. పాశ్చాత్య భోగవాద దృక్పథాన్ని మన సమాజంలో ప్రవేశపెట్టి రెండు దశాబ్దాల పాటు తెలుగు సమాజాన్ని ధ్వంసం చేశాడు చలం. విధ్వంసం తర్వాత ఆయన ఆత్మశాంతి కోసం తిరువణ్ణామలై వెళ్లి రమణ మహర్షిని ఆశ్రయించారు. చలం రమణాశ్రమానికి వెళ్లక ముందు చెప్పిన విషయాలకే ఇప్పటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అతను మెచ్చుకొనే ఫ్రాయిడ్‌ను ఆధ్యాత్మికత ఎలా అధిగమించ గలిగిందో చెప్పడం లేదు. చలం సాహిత్యాన్ని ఎదుర్కోవడానికి విశ్వనాథ లాంటి వారు తప్ప వేరెవరూ బలంగా ప్రయత్నించలేదు. స్ర్తిల ఔన్నత్యాన్ని, ఉదాత్తతను మన సమాజం పట్టించుకోకపోతే చలం లాంటి శక్తులు ఈ గడ్డపై విజృంభించాయి. అందుకే మన గ్రంథాలను, అందులోని తత్త్వాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. పైపైన మెరుగులకు మనం ప్రాధాన్యం ఇచ్చి ధర్మంలోని వైశిష్ట్యాన్ని మనంతట మనం తగ్గించకూడదు. ‘మానవులను ఏకం చేసే మహత్తర విషయాల్లో మతం కూడా ఒకటి’ అంటారు స్వామి వివేకానంద. మతం ద్వారా మనుషులు ఏకమార్గం వైపు నడవడానికి ఆధ్యాత్మికత ఆలంబనగా ఉండాలి. ఆధ్యాత్మికత,మతం వినోదంగా, ఈవెంట్‌గా మారకూడదు.
వినాయక విగ్రహాలను వీధులవారీగా,కులాల వారీగా, ఎవరికి వారు విభజన రేఖలు గీసుకొని ప్రతిష్ఠ చేయకూడదు. వినాయక ఉత్సవాల ద్వారా స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించడానికి ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ సంకల్పించారు. 1893లో ఆయన గణపతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించాలని ప్రకటించారు. పూణె సమీపంలోని ఒక గ్రామంలో గణపతి మండలిని తొలిసారి స్థాపించి ఈ మహోత్సవం జనాన్ని సంఘటిత పరచుకోవడం కోసమే అని ప్రకటించారు. నేడు చాలాచోట్ల రాజకీయ నేతలను, సెలబ్రిటీలను తీసుకొచ్చి పోటాపోటీగా గణపతి నవరాత్రులను జరపడం సరైంది కాదు. ఆధ్యాత్మిక దృక్పథాన్ని చాటడానికి ఆలంబన కావలసిన ఈ ఉత్సవం ‘ఈవెంట్’గా మారిపోవడం చింతనీయం.
ప్రజలను ఒకచోటకు చేర్చుతూ గణపతి ఉత్సవాలు, దుర్గానవరాత్రులు, పంచాంగ శ్రవణాలు మన ఆధ్యాత్మిక తత్వాన్ని, హిందూ ధర్మ వైభవాన్ని ప్రస్ఫుటం చేయాలి. ఆడంబరాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా మన దేశంపై, హిందూ ధర్మంపై విషం చిమ్మే శక్తులకు ఊతం ఇచ్చినట్లవుతుంది. సన్మానాలు, పొగడ్తలు, ఆడంబరాలు ఎక్కువై ఆధ్యాత్మిక భావన పలుచనబడిపోతుంది. ప్రతి పండుగ, ప్రతి ఉత్సవం ఆధ్యాత్మికతను, దేశభక్తిని, దైవభక్తిని పెంచాల్సింది పోయి అందుకు వ్యతిరేక దిశలో పయనిస్తుంది. దానివల్ల చాలామంది సెలబ్రిటీల ముసుగులో కొందరు మనపై విరుచుకు పడుతున్నారు. ఇటీవల కమల్‌హాసన్, రాంగోపాల్‌వర్మ, ప్రకాష్‌రాజ్ వంటి వాళ్లు ఇదే మార్గం అవలంబిస్తున్నారు. వీళ్లకు పరోక్షంగా మనమే పేరును తెచ్చిపెడుతున్నాం. మరోవైపు చాలామంది ప్రవచన కారులు పంచకావ్యాలూ, కాళిదాసు పద్యాలు వల్లెవేస్తూ క్రొత్త గ్రంథాలు చదవలేని దుస్థితిలో ఉన్నారు. మనకు ఇదొక గ్రహపాటు! దాంతో సెలబ్రిటీలు చెలరేగిపోతున్నారు. ఈ సెలబ్రిటీలతో పాటు విదేశీ సంస్థలకు అమ్ముడుపోయి వర్గ దృక్పథంతో పనిచేస్తూ కులవాదం రెచ్చగొడుతున్న శక్తులకు విస్తృతమైన హిందూ సమాజంలోని కొన్ని అంశాలు సులభంగా దొరుకుతున్నాయి. శంకరాచార్యుని నుండి బోనాల పండుగ వరకు వీళ్లు దేన్నైనా విమర్శిస్తారు. సముద్రం లాంటి హిందూమతాన్ని పట్టుకొని ఎక్కడో ఒక విమర్శ చేస్తారు. ఏది జరిగినా హిందూ సమాజంలో జరిగే విషయంగా వాళ్లు ప్రొజెక్ట్ చేస్తారు. గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం అలాంటిదే. కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో జరిగిన సంఘటనల వలన యావత్ హిందూ సమాజంలో ఉన్న అవలక్షణంగా గురజాడ చిత్రించారు. అదే గురజాడ రాసిన ‘పెద్దమసీదు’ రచనను  రచనను విస్మరించిన మార్క్సిస్టు సాహిత్య లోకం కన్యాశుల్కానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించింది. దీనికి కారణం అందులో భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక దృక్పథం ఉండడమే!
ఇలాంటపుడు మనం మన పురాణ, ఇతిహాసాల్లోని ప్రతీకవాదం (సింబాలిజం) గమనించకుండా, వేలం వెర్రిగా ఉత్సవాలను జరిపితే ప్రతి అజ్ఞానికి సమాధానం ఇస్తూ పోవాల్సిందే. మన పర్వోత్సవాల్లోని ఆధ్యాత్మికత, తాత్విక వైజ్ఞానిక, ఖగోళ దృక్పథాన్ని మనం సమాజానికి అందించాలి. ఈ జ్ఞాన ప్రసారానికి దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు కేంద్రాలు కావాలి. అందుకు పండుగలు, ఉత్సవాలు ఉపయోగపడాలి. ‘ఎప్పుడైతే మీరు ధ్యానం- పూజ- ప్రార్థన చే స్తారో అప్పుడు మీకు లభించిన శాంతిని వెంటనే అందరికీ పంచకపోతే మిమ్మల్ని నాస్తికులు, అధర్మ పరాయణులని అంటాను’- అని బుద్ధుడు తన శిష్యులకు ఉపదేశించాడు. మన కార్యక్రమాలు కేవలం నామకార్థం జరిపే తంతులు కావు. ప్రతి మనిషిలో శాంతి తత్వాన్ని నింపే అమృత గుళికలు. దురదృష్టవశాత్తూ ఆధ్యాత్మికతను రాజకీయ నీలినీడలు కమ్ముకొన్నాయి. సూర్య నమస్కారాలు చేస్తే దాదాపు 12 ఆసనాలు అందులో మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఓంకారం దీర్ఘంగా ఉచ్చరిస్తే సృష్టి అంతా వ్యాపించి ఉండే నాదంతో ఏకమై ప్రాణాయామం జరుగుతుంది. ధ్వని తరంగ విజ్ఞానానికి, దేవాలయ నిర్మాణ శైలికి ప్రగాఢమైన సంబంధం ఉంది. దేవాలయం ఓ సామాజిక కేంద్రం. యోగవిద్య భారతీయ ప్రాచీనమైన ఆధ్యాత్మిక శాస్త్రం. ప్రస్తుతం వీటిని మతాల ముసుగులో రాజకీయం చేశారు. హర్యానా పాఠశాలలో భగవద్గీత శ్లోకాలు, గాయత్రీ మంత్రం నేర్పిస్తామంటే అది హిందూ మతోన్మాదం అని గోల చేస్తారు. మరి ప్రభుత్వాన్ని నడిపే నాయకులే రూమీ టోపీలు, షేర్వానీలు ధరించి ఇఫ్తార్ విందులు చేస్తే అది లౌకిక వాదం! ఈ మధ్య జ్యోతిషాన్ని వ్యాపారంగా ఒకవర్గం మార్చితే, దాని తలాతోక తెలియనివారు దానిలోని సైన్సును కాకుండా వ్యాపారాన్ని చూపిస్తూ విమర్శిస్తున్నారు.
ఈ మధ్య మరోగుంపు ‘సూడో సైన్సు’ను బాగా ప్రచారం చేస్తోంది. వారు మార్క్సిస్టు పార్టీ సిద్ధాంతాలను సైన్సు, విజ్ఞానం, నాస్తిక, హేతువాదాల పేరుతో బాగా వండి వార్చుతున్నారు. టీవీ చర్చల్లో, సోషల్ మీడియాలో ప్రతి దాన్నీ సైన్సు దృక్కోణంలో అంటూ బోల్తా కొట్టిస్తారు. ‘నూనెలతో, నీళ్లతో,ప్రార్థనలతో చచ్చిన వాళ్లను బ్రతికిస్తాం, అంగవైకల్యం ఉన్నవాళ్లను అద్భుతంగా నడిపిస్తాం’-అన్న వాళ్లను గురించి అస్సలు నోరు విప్పరు. కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే దోపిడీని ప్రశ్నించరు. హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఇచ్చే ‘చేప ప్రసాదం’ వల్లనే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందన్నట్లు మాట్లడుతారు. సత్యానికి, సైన్సుకు ఉన్న భేదాన్ని గుర్తించరు! సైన్సు అంటే ఓ పద్ధతి అన్న పరిజ్ఞానం కూడా వీళ్లకు లేదు. ‘సత్యం’ అంటే ఏమిటని బుద్ధుడిని అడిగితే ‘ఉపయోగించదగింది’ అన్నాడు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే నీరు ఏర్పడుతుందని సైన్సు చెప్తుంది. ఈ నిర్వచనం సత్యమా? కాదా? అని మనం ఆలోచించం. కానీ హైడ్రోజన్, ఆక్సిజన్లను కలిపి నీటిని తయారు చేసే ప్రయోగం చూస్తే మనం సత్యం అంటాం. నిర్వచనాలలో బలం లేదు- కానీ దాని తయారీలో, ఉపయోగంలో బలం ఉంది.
5 వేల యేళ్ల క్రితం మతం సత్యాన్ని గురించి చెప్పిన నిర్వచనాన్ని సైన్సు ఈరోజు ఆమోదించింది. సత్యనిరూపణను మతం ఉపయోగం ద్వారా నిరూపిస్తుంది. మంత్రాలకు అర్థాలు వెతకకూడదు. దాన్ని ఉపయోగించడం ఒక కళ. అది మనం ఎప్పుడో గ్రహించాం. దురదృష్టవశాత్తూ అన్నీ వ్యాపారమయం అయినట్లే మతం, ఆధ్యాత్మికత కూడా అలాంటి గోతిలో పడుతోంది. ఆచరించే వాళ్లకు అవగాహన లేకపోవడం, విమర్శించే వాళ్లకు లోతులు తెలియక పోవడం మన దురదృష్టం తప్ప ఇంకేం కాదు.
‘మన అనుభవంలోకి వచ్చే శక్తులు సంభవింపజేసే వా టిలో ఒకశాతం కూడా మనం అర్థం చేసుకోలేక పో తున్నాం’ అని మైఖేల్ గాక్వెలిన్ అనే గొప్ప శాస్తవ్రేత్త విశ్వంలోని శక్తులపై అధ్యయనం చేసి చెప్పాడు. అజ్ఞాన పూరితమైన ఆధ్యాత్మికతను చెప్పడం ఎంత తప్పో, అవగాహన లేకుండా మత పరిజ్ఞానాన్ని విమర్శించడం అంతే తప్పు. ఇటీవల ఈ రెండు సమాంతరంగా సాగుతున్నాయి. లోతైన ఆధ్యాత్మికత, మత పరిజ్ఞానం క న్న ఛాందసం చాలా మందిలో కన్పిస్తుంది. అక్కసుతో విమర్శలు చేసేవాళ్లలో అపరిపక్వత, ఆక్రోశం పాలే ఎక్కువ. ఈ సంఘర్షణ వల్ల- విజయనగర రాజులు మల్లెపూలలా సంతలో వజ్రాలు అమ్మారన్నా, మన నుంచి వైద్యం, జ్యోతిషం అరబ్బులు, గ్రీకులు నేర్చుకొన్నారన్నా, మన ఋషులు దర్భలతో మంత్రించారన్నా నమ్మలేని దుస్థితిలో ఉన్నాం. మన ఆధ్యాత్మికతలో మార్పు రావాల్సిన తరుణం ఇదే. *


****************************************************
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125
Published Andhrabhoomi :
Friday, March 02, 2018