మరణించే ముందు అలెగ్జాండర్‌ చక్రవర్తి మూడు కోరికలు కోరుకున్నాడని చెప్తారు. ఒకటి.. తనకు వైద్యం చేసిన వైద్యులతో తన శవపేటిక మోయించాలి. రెండు.. తాను సంపాదించిన వెండి, బంగారాలను, వజ్ర వైఢూర్యాలను శ్మశానానికి వెళ్లే దారిలో చల్లాలి. మూడు.. తన రెండు చేతులనూ శవపేటికలోంచి పైకెత్తి ఉంచాలి. ప్రపంచంలో ఎంత గొప్ప వైద్యుడైనా మరణం నుంచి కాపాడలేడని, కాబట్టి జీవితాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని చెప్పడం మొదటి కోరిక ఉద్దేశం. ఎంత సంపాదించినా ధనాన్ని వెంట తీసుకెళ్లలేడని చెప్పడం రెండో సందేశం. పుట్టేటప్పుడు ఉత్తి చేతులతో వచ్చాం. ఉత్తి చేతులతోనే వెళ్లిపోతాం అని ప్రపంచానికి చాటి చెప్పడానికి మూడో కోరిక కోరాడు. నిజమే! మృత్యువు ఈ లోకంలో ఎవ్వరినీ శాశ్వతంగా ఉండనీయదు. ఎంత సంపాదించినా ఏ వ్యక్తినీ చిల్లిగవ్వ కూడా తనవెంట తీసుకుపోనీయదు. ‘ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యౌవనం ప్రత్యాయాన్తి గతా: పునర్నదివా: కాలో జగద్భక్షక:’’ అన్నారు పెద్దలు. అంటే.. చూస్తుండగానే నిత్యం ఆయుష్షు నశిస్తుంటుంది. యవ్వనం క్షీణిస్తుంది. గడచిన రోజులు మళ్లీ రావు. కాలము జగత్తునే భక్షిస్తుంది.- అన్నమాటలు అక్షర సత్యాలు. ఇది గమనించకుండా ప్రతివారూ తన అహంకారాలను ప్రదర్శిస్తుంటారు. కానీ మృత్యువు ముందు ఇవేవీ పనిచేయవు. యోగులైనా, సిద్ధులైనా, ధనవంతులైనా, పేదలైనా.. అందరూ మృత్యువుకు సమానమే. ఎవ్వరైనా మృత్యువుకు తలవంచాల్సిందే. మృత్యువును మించిన సామ్యవాది లేదు. అందుకే మన పెద్దలు మృత్యువును కాలంతో పోల్చారు. కాలం భగవత్స్వరూపం అన్నారు. సృష్టిలోకి ఎన్ని జీవరాశులు వచ్చి వెళ్లినా, కాలచక్రం ఆగదు. అది అందరినీ తన వెంట నడిపిస్తుంది. జనన మరణాలు లేని స్థితిని పొందడం ద్వారా ఇలాంటి కాలాన్ని, మృత్యువును జయించడమే మోక్షం.

*************************************************
డాక్టర్‌ పి. భాస్కర యోగి
         ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి