హిందూమతంలో గొప్ప సంప్రదాయిక బలం వున్న లింగాయత్‌లను
ఈ ధర్మం నుండి వేరు చేసే అధికారం రాజకీయ నాయకులకు ఉంటుందా? తమ స్వలాభం కోసం, అధికారం కోసం ధర్మాన్ని ముక్కలు చేసే దుస్సాహసం ఆ తర్వాత వారి మెడకే చుట్టుకున్న విషయం
పంజాబ్‌లో మనం చూశాం. ఇప్పుడు జరుగుతున్న ఈ కుర్చీలాట
భవిష్యత్తులో ఎన్నో విపరిణామాలకు దారితీయడం ఖాయం. ఇప్పటికే రాజస్థాన్‌లో గుజ్జర్లు, గుజరాత్‌లో పటేళ్లు, ఆంధ్రలో కాపులు,
తెలంగాణలో ముస్లింలను రెచ్చగొడుతున్న నాయకులు, పార్టీలు తర్వాత భారీ మూల్యం చెల్లించనున్నాయి.
దేశమంతా కొడిగట్టిపోతున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాల్‌గా పరిణమించాయి. రాహుల్ గాంధీ రాజకీయ యవనికపైకి వచ్చాక కాంగ్రెస్‌కు అన్నీ పరాజయాలే. యూపీలోని పుల్పూర్, గోరఖ్‌పూర్‌లలో భాజపాను ఓడించింది తాము కాకున్నా, అది తమ ఘనతేనని కాంగ్రెస్ సంబరపడిపోవడం హాస్యాస్పదం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘సెమీ ఫైనల్’ లాంటి కర్నాటక ఎన్నికల్లో గెలిస్తే ‘మేం కూడా రంగంలో ఉన్నామ’ని కాంగ్రెస్ చెప్పుకోవచ్చు. కానీ అక్కడి కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ‘ఎన్నికల ప్రచారానికి రావద్దు’ అని లోలోపల మొరపెట్టుకొన్నట్లు సమాచారం. ఈలోగా కర్నాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో క్రొత్త సమస్యను సజీవంగా ఉంచడానికి తేనె తుట్టెను కదిలించాడు. అదే లింగాయత్‌లకు మైనారిటీ హోదా!
నాథమోహన్‌దాస్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు తెప్పించుకొని కన్నడ ప్రాంతంలో 17-20 శాతం వున్న లింగాయత్‌లకు కర్నాటక మైనారిటీ చట్టం 2(డి) ద్వారా ‘మతపరమైన మైనారిటీ’గా గుర్తించాలనే సిద్ధరామయ్య కాబినెట్ సిఫార్సుపై ఇపుడు చర్చ జరుగుతోంది. ఆచార, సంప్రదాయ, తాత్విక, ధార్మిక పునాదుల ప్రకారం లింగాయత్‌లు హిందూమతంలో అంతర్భాగమే. కన్నడ ప్రాంతంలో లింగాయత మఠాలకు ప్రాధాన్యత ఉంది. ఎన్నికలొస్తే నేతలంతా ఈ పీఠాదిపతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ప్రజలపైనా వీరశైవ మతాధిపతుల పట్టు అధికం. అందుకే సిద్ధరామయ్య ప్రభుత్వం భాజపాకు వెన్నుదన్నుగా నిలిచే లింగాయత్‌లను రెచ్చగొట్టే పనికి పూనుకుంది.
కన్నడ ప్రాంతంలోని కొన్ని జిల్లాలు నిజాం పాలనలో, మరికొన్ని జిల్లాలు శ్రీరంగపట్టణం కేంద్రంగా నడిచిన ముస్లిం రాజుల పాలనలో ఉండేవి. అక్కడి హిందువులు చాలా ఏళ్ళు అణచివేయబడ్డారు. ముస్లిం పాలనను తట్టుకొని ధర్మాన్ని బ్రతికించినవారు వీరశైవ మఠాధిపతులు. హిందూ సమాజానికి బలమైన వర్గంగా ఉన్న ప్రజలను మత మార్పిడి కాకుండా నిలువరించి హిందువులకు రక్షణ కవచంగా నిలిచారు. ఇన్నాళ్లు మైనారిటీలను సంతుష్టీకరణ చేసి గెలిచిన కాంగ్రెస్ ఇపుడు వీరశైవులపై ప్రేమ ఒలకబోస్తోంది. గత డెబ్భై ఏళ్లలో ఏనాడూ శృంగేరి పీఠాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా ఆ హిందూ పీఠంపై ప్రేమ పుట్టుకొచ్చింది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ శృంగేరికి వెళ్లి శ్రీ్భరతీ తీర్థ స్వామి ఆశీస్సులు పొందారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వేస్తున్న శీర్షాసనాల్లో భాగమే లింగాయత్‌లకు మైనారిటీ హోదా! హిందూ మతాన్ని ముక్కలు చేసే ఈ కుటిల యత్నాన్ని హిందూ సంఘాలు ప్రశ్నించగా, సంతోష్ హెగ్డే లాంటి వాళ్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
1925 కన్నా ముందే ఆనాటి నిజాం రాజ్యంలోని బీద్ జిల్లా పరళీ వైద్యనాధ క్షేత్రంలో వీరశైవులకు-స్మార్తులకు మధ్య ఏర్పడ్డ వ్యాజ్యంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆనాడు కమిషన్ ముందు 4 మాసాలు దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఆ సందర్భంలో వీరశైవులు తాము వైదికులమని నిరూపించి విజయం సాధించారు. 1939కి ముందే కర్నాటక, మరాఠా ప్రాంతానికి చెం దిన కొందరు ఆనాటి ని జాం ప్రభుత్వ మంత్రి హైదరీ వద్దకు వెళ్లి- ‘మాది ద్రావిడ సంస్కృతి, మాకు ప్రత్యేక స్థలాలు కావాలి’ అని అర్జీ పెట్టుకున్నారు. వీటన్నిటిలోని కుట్రలను ఆనాడు ప్రముఖ వీరశైవులు నడిపే విభూతి పత్రిక దుయ్యబట్టింది.
ప్రాచీనకాలం నుండి శైవం వైదిక మతంలో అంతర్భాగమే. గృహ్య సూత్రాల్లో శివుణ్ణి వివిధ కాలాల్లో, అనేక విధాలుగా పూజించే సంప్రదాయమున్నా అవి శాఖలుగా లేవు. రానురాను శైవంలో అనేక శాఖలు పుట్టి శివగీత, శివసంహిత, శివరహస్యం, రుద్రయామళ తంత్రం, 28 శైవాగమాలు, నీలకంఠ విరచిత బ్రహ్మసూత్ర భాష్యం, పురాణ, వేద, ఉపనిషత్తులు ఈ శాఖాభేదాలకు తత్వభూమికగా ఉన్నాయి. ప్రాచీన శైలం, పౌరాణిక శైవాల్లో పాశుపత, లకులీశ, మాహేశ్వర, శైవభాగవత, కాపాలిక, యోగనాథ, రసేశ్వరవాద, సంకలిత అనే భేదాలున్నాయి. వీటిలో మళ్లీ శివబుద్ధ, శివశక్తి, హరిహర, శివస్కంద, శివగణపతి, శివవిశిష్టాద్వైత, శివాద్వైత, ద్రావిడ శైవ సిద్ధాంత, శైవచిత్రమతం, ప్రత్యబిజ్ఞ, మహారతి, శివసమాధి, ఐక్యవాది, సంక్రాంతవాది, ప్రవాహేశ్వరవాది, అవికారవాది, ఊర్థ్వ, అనాది, ఆది, మహా, గుణ, క్రియాశైవ, చుతుష్పాద, శుద్ధ, యోగి, అభినవగుప్త, తప్తలింగాకితశైవం, శూలాంకితశైవం, లింగ చిహ్న శైవం, శిరస్సుపై లింగం ధరించిన శైవం.. ఇలా శైలంలోనే అనేక భేదాలున్నట్లు శైవమత అధ్యయనం ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ వైదిక మతం పరిధిలోవే. ఇవన్నీ పక్రియా భేదాలే గాని మూలతత్త్వంతో విభేదించేవి కావు. తాండవమూర్తిగా, జటామకుట, భస్మలేపితమూర్తిగా శివారాధన చేసేవారు పాశుపతులు. శివుడిని కంకాళమూర్తిగా పూజించేవారు కాలాముఖులు, స్ఫటిక, రుద్రాక్ష మాలధారిగా శివపూజ చేసేవారు వామాచారులు. అగ్నిధారిగా, యజ్ఞోపవీతధారిగా పూజించేవారు బైరవారాధకులు, ఢమరు ధరింపజేసే వటధారిగా పూజించేవారు కూడా పాశుపతులే. ఇవన్నీ ఆరాధనా పద్ధతులవల్ల ఏర్పడిన భేదాలు. తదనంతకాలంలో ఇవన్నీ కలిసిపోయి ముఖ్యమైన శాఖలు మాత్రమే స్థిరపడి నిలిచాయి. ఆగమశాస్త్ర విహితమైన శైవం దక్షిణ భారతంలో ఉండగా, ప్రత్యబిజ్ఞ అనే త్రిక సిద్ధాంతంపై ఆధారపడ్డ శైవం కాశ్మీరు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండేది. లకులీశుడు మొదలైన యోగవేత్తలతో గుజరాత్‌లో పాశుపత శైవం పరివ్యాప్తమైంది. తెలుగు, కన్నడ ప్రాంతాల్లో బసవేశ్వరుడు పునరుద్ధరించిన వీరశైవం నిలబడింది. శే్వతాచార్యుల నుండి ప్రఖ్యాత శివాచార్యుల వరకు క్రీ.శ.971 నుండి 1296 వరకు పాశుపత శైవం ప్రచారం చేశారని ‘చింత్రప్రశస్తి’ శాసనం తెలిపింది. ఆ తర్వాత ఓరుగల్లు, శ్రీశైలం, బెల్గాం, శ్రీకాళహస్తి, మైసూరు మొదలైన ప్రాంతాల్లో పాశుపతం బాగా వ్యాప్తిచెందింది. శైవ విద్యకు మూలస్థానమైనన శ్రీశైల జగద్గురు పీఠానికి, గోళక మఠాధిపతి విశే్వశ్వర శివాచార్యులకు క్రీ.శ.1261లో రాణి రుద్రమ ‘మందడ అగ్రహారం’ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతకుముందే 4, 5 శతాబ్దాల్లో జైన, బౌద్ధాల విజృంభణను ఎదుర్కొని నిలబడడానికి శైవ, వైష్ణవ నేదాలతోనే వైదిక మతం నిలబడింది. 10వ శతాబ్దానికి ముందే తమిళ, కన్నడ ప్రాంతాల్లో ఆళ్వార్లు, నయనార్లు అనే భక్తులు వైష్ణవ, శైవ తత్వభూమికతో బౌద్ధ, జైనమతాల నుండి హిందువులను కాపాడారు. 12వ శతాబ్దంలో వైష్ణవంలో రామానుజులు సంస్కర్తగా రాగా, శైవ మత సంస్కర్తగా బసవేశ్వరుడు ఉద్భవించాడు. హిందూ మతంలోని కుల వ్యవస్థపై యుద్ధం ప్రకటించాడు. తన మేనమామ బలదేవుడు మరణించగానే బిజ్జలుని ఆస్థానంలో దండనాయకుడిగా, భండారి (కోశాధికారి)గా నియమించబడ్డాడు. వర్ణాశ్రమ వ్యవస్థను వదలిపెట్టి, ప్రతి వ్యక్తీ లింగధారణ చేయాలని, ఆ లింగం పరంజ్యోతికి ప్రతీకగా , ఆత్మస్థానానికి గుర్తుగా భావించాలన్నాడు. లింగధారణ చేసిన లింగాయతులు ఏ కులం వాళ్ళైనా సహపంక్తి భోజనాలు చేయవచ్చని ప్రతిపాదించాడు. శైవంలో బసవేశ్వరుడు చేసిన సంస్కరణలు సంప్రదాయ వైదిక మతానికి కూడా అందనంత ఉన్నత స్థాయిలో ఉండేవి. అవన్నీ ఒక ఆత్మజ్ఞాని చేసిన ఆలోచనలు. ‘అనుభవ మండపం’ పేరుతో బసవేశ్వరుడు ఒక లోక్‌సభను స్థాపించి స్ర్తి, దళిత, శూద్రులకు అందులో అవకాశం కల్పించాడు. ‘కాయకమే కైలాసం’ (డిగ్నిటీ ఆఫ్ లేబర్) అనే సూత్రం ద్వారా అన్ని కులాలకు సమానత్వం, శ్రమకు గౌరవం కల్పించాడు. జాడర దాసిమయ్య (నేత పని) మేదర కేతయ్య (బుట్టలు అల్లే వ్యక్తి), మడివాలు మాచయ్య (రజికుడు), హడపద అప్పన్న (క్షురకుడు), ఒక్కళు ముద్దయ్య (రైతు) మాదర చెన్నయ్య (చెప్పులు కుట్టే వ్యక్తి), కిణ్ణెర బొమ్మణ్ణు (కంసాలి), మాదిగ హరళయ్య- వీరంతా బసవేశ్వరుని అనుయాయులు. ఈ వీరశైవాన్ని చెన్న బసవేశ్వరుడు, అక్కమహాదేవి, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు ఇంకా అనేకమంది కన్నడ, తెలుగు ప్రాంతాలకు అందించారు.
ఈ వీర శైవ లింగాయత మతమంతా వైదిక మతం ఛాయ నుండి వేరు పడలేదు. బసవేశ్వరుడు హిందూ మత సంస్కరణవాదే తప్ప హిందూ ధర్మం నుండి వేరు పడలేదు. సంస్కర్తలంతా హిందూ మతంలోని ఎన్నో విషయాలను స్వీకరించలేదు. ఉదాహరణకు దయానంద సరస్వతి పురాణ సాహిత్యాన్ని ఖండించాడు. మరి ఇపుడు ఆర్య సమాజం వారు మమ్మల్ని హిందూ మతం నుండి వేరు చేసి మైనారిటీ మతంగా గుర్తించమని అడగాలా? పరమ శివుని పరమేశ్వరతత్వాన్ని బసవేశ్వరుడు లింగారాధనగా ప్రతిపాదించాడు. శివుడు హిందూ ధర్మానికి చెందిన దేవుడా? కాదా? హిందూమతంలో గొప్ప సంప్రదాయిక బలం వున్న లింగాయత్‌లను ఈ ధర్మం నుండి వేరు చేసే అధికారం రాజకీయ నాయకులకు ఉంటుందా? తమ స్వలాభం కోసం, అధికారం కోసం ధర్మాన్ని ముక్కలు చేసే దుస్సాహసం ఆ తర్వాత వారి మెడకే చుట్టుకున్న విషయం పంజాబ్‌లో మనం చూశాం. ఇప్పుడు జరుగుతున్న ఈ కుర్చీలాట భవిష్యత్తులో ఎన్నో విపరిణామాలకు దారితీయడం ఖాయం. ఇప్పటికే రాజస్థాన్‌లో గుజ్జర్లు, గుజరాత్‌లో పటేళ్లు, ఆంధ్రలో కాపులు, తెలంగాణలో ముస్లింలను రెచ్చగొడుతున్న నాయకులు, పార్టీలు తర్వాత భారీ మూల్యం చెల్లించనున్నాయి. సిక్కులు, జైనులు, బౌద్ధుల్లాగా మేం ఉంటాం అంటూ కొందరు లింగాయత్ నాయకులు చేస్తున్న వాదనకు బలం లేదు. సిక్కు, బౌద్ధ, జైనుల్లో వైదిక పద్ధతుల ద్వారా ఏదీ జరగదు. వాటికున్న తత్వభూమిక వారిని హిందుత్వంలో భాగం చేసింది. వీరశైవంలోని మూల సూత్రం అంతా హిందూ మత పునాది నుండి పుట్టిందే. ఇపుడు కర్ణాటకలోని బీదర్, కల్బుర్గి, దావణగిరి వంటి ప్రాంతాల్లో ప్రజల మధ్య వైషమ్యాలు, ఆందోళనలు పెరిగిపోగా సిద్ధరామయ్యను ప్రాంతీయ స్థాయికి దిగజార్చి, కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రాహుల్ గాంధీ ఖాతాలో
వేయాలని అనుకొంటుంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ సీట్లలో దాదాపు 100 సీట్లను ప్రభావితం చేయగల వారిని ఆకట్టుకునేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాచపుండుగా మారనుంది. ఈ రావణకాష్టంలో కాచుకోవాలనుకుంటున్న సిద్ధరామయ్య, రాహుల్‌లకు నిరాశే మిగలనుంది. కాని ఈ సమస్య అక్కడి ప్రజల మనస్సుల్లో ముల్లులా గుచ్చుతూ వైషమ్యాలు పెంచడం నిజం. తాత్కాలికంగా చేస్తున్న ఈ స్వార్థ రాజకీయం కొందరిని చరిత్రహీనులుగా నిలబెడుతుందన్నది కూడా అంతే సత్యం.
****************************************************
-డా. పి భాస్కరయోగి
Published Andhrabhoomi :
Friday, March 23, 2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి