పదసంకీర్తన సాహిత్య సదస్సు 





********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*



దేశవ్యాప్తంగా ఐక్యతతో జీవిస్తున్న ప్రజానీకం మధ్య మతం,కులం,జాతి,ప్రాంతం అంటూ విభజన రేఖలను సృష్టించి, భయోత్పాత వాతావరణానికి హిందుత్వ కారణమవుతోంది.. ఇపుడు లౌకికవాదం వర్సెస్ హిందుత్వ అనే అంశంపై చర్చ జరగాలి.. మా పార్టీ లౌకిక భావాల రక్షణ కోసం పోరాడుతుంది.. మతోన్మాదుల చేతిలో ఈ దేశం ఉండడం అత్యంత ప్రమాదకరం’- ఈ అమృతవాక్కులు వెలువడింది సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నోటి నుండి..!

‘‘ఊరంతా ఓ దారి అయితే ఉలిపికట్టెది ఇంకోదారి’’ అన్న సామెతలా ఈ దేశ కమ్యూనిజం జడపదార్థం కాగా, ఇక్కడి కమ్యూనిస్టు నాయకులు ఎదుగూ బొదుగూ లేని కుక్కమూతి పిందెల్లా కార్యకర్తలను మార్చివేశారు. పీడిత, తాడిత ప్రజల కోసం పనిచేసే మన కమ్యూనిస్టుల అగ్రపీఠాల్లో ఎప్పుడూ అగ్రకులాల వాళ్లే కూర్చోవడం మరో ప్రత్యేకత. సహజ వనరులు, అక్షరాస్యత, తీరప్రాంతం అధికంగా ఉన్న కేరళ అభివృద్ధి చెందిందంటే అది తమ చలవే అని చెప్పుకొనే కమూనిస్టులు- జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య వంటి యోధుల చేతుల్లో రెండు దశాబ్దాలకు పైగా బెంగాల్ పరిపాలింపబడినా ఇప్పటికీ ఎందుకంత దీనస్థితిలో వుందో చెప్పే గతి తర్కం వారి దగ్గర లేదు.

వాళ్లు రోజూ దళిత, బహుజనుల పేర్లు ఉచ్ఛరించనిదే ఉపన్యాసమే చేయరు. కానీ ఈ దేశానికి ఓ బహుజనుడు మొదటిసారి ప్రధాని అయితే ఓర్చుకోరు. ఓ దళితుడు రాష్టప్రతి అయితే వంకలు పెడతారు. డా బాబాసాహెబ్ అంబేడ్కర్ తనను కమ్యూనిస్టులు లక్ష్యపెట్టనందువలనే కదా- ‘‘నేను దళితులకు, కమ్యూనిస్టులకు మధ్య ఇనుపగోడను అవుతాను’’ అన్నాడు. రామ్‌నాథ్ కోవింద్‌లో రాముడుండడం వాళ్లకు నచ్చదు కానీ, సీతారాం ఏచూరిలో ‘సీతారాం’ ఉండవచ్చు, బి.వి.రాఘవులులో ‘రాఘవుడు’ ఉండొచ్చు! ఇది ఏం గతి తార్కిక భౌతికవాదం కామ్రేడ్! అమిత్ షాకు హోం మంత్రి పదవి ఇస్తే ‘దొంగకు తాళం చెవి ఇచ్చినట్టే’ అని సీపీఐ నేత కె.నారాయణ తన దూషణ పర్వం చేయొచ్చు; మరి మీ తోబుట్టువు కేరళ సీఎం పినరయ్ విజయన్ చరిత్రను ఎవరు అధ్యయనం చేయాలి? ఎన్నికల్లో గెలిచి నెల కూడా దాటకుండా మళ్లీ పాడిందే పాటగా జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అంటూ ‘ఎర్ర’కూతలు కూయడం ప్రజాస్వామ్య గౌరవం ఎలా అవుతుంది కామ్రేడ్!

మహారాష్ట్ర రైతులతో లాంగ్‌మార్చ్ నాసిక్ నుండి ముంబయి వరకు వెనుక ఉండి నడిపింది ఎర్రదండు అని అందరికీ తెలుసు! 2014కు ముందు మన రైతులు బంగారు నాగళ్లతో దున్ని వజ్రాలు పండించే వారనుకుంటా! ఎందుకంటే అప్పటివరకు ఈ దేశాన్ని పాలించిన అధికార పార్టీలను మోసిన బోరుూలు వీరే కదా! అది రామరాజ్యం కాదు.. మార్క్స్ రాజ్యం!?

ప్రపంచాన్ని ఉద్ధరించేందుకు పుట్టిన మార్క్సిజం ఇపుడు భారత్‌లో ఓ మతంలా అవతారం ఎత్తింది. భారత కమ్యూనిస్టులకు ఆర్థిక సమానత్వం కన్న ఓ మతంపై యుద్ధం చేయడమే ప్రధాన ఎజెండా. అదీ ముఖ్యంగా హిందూమతంపై దాడి చేయడమే వారి దృష్టిలో గొప్ప సెక్యులరిజం. మత రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారా? మతాలను వ్యతిరేకిస్తున్నా రా? అన్ని మత తత్వాలను వ్యతిరేకిస్తున్నారా? హిందూ మతాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారా? లేక మత ప్రమేయం లేని వ్యవస్థను కోరుకొంటున్నారా? వాళ్లకే క్లారిటీ లేదు. అదే వాళ్ల దీనస్థితికి కారణం. 170 ఏళ్ళ క్రితం యూరప్‌లో ఏ పరిస్థితులున్నాయో ఇప్పటికీ అవే ఉన్నాయని కమ్యూనిస్టులు భావిస్తారు. అందుకే అమెరికాపై గుడ్డి వ్యతిరేకత. కారల్ మార్క్స్, ఏంగిల్స్ 150 ఏళ్ళ క్రితం ఏర్పాటుచేసిన ‘‘మొదటి ఇంటర్నేషనల్’’ ఎందుకు వైఫల్యం చెందిందో చెప్పరు. పాలస్తీనాపై ప్రేమతో భారత్‌కు నమ్మదగిన మిత్రదేశమైన ఇజ్రాయిల్‌పై కత్తి కట్టారు. జిన్నాకు మద్దతుగా పాకిస్తాన్ ఏర్పాటును స్వాగతించిన వామపక్షాలు భారత్ పక్షాన ఇంకెప్పుడు నిలబడతారు?

భావస్వేచ్ఛను ఓ అంతర్జాతీయ సూత్రంగా పెట్టుకొని కొందరిని మాత్రమే టార్గెట్ చేయడం కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం. యూరప్ దేశాల్లో పారిశ్రామిక విప్లవం వచ్చాక ఆ కార్మికులే సమ సమాజ స్థాపన కోసం పనిచేస్తారనే భ్రమలో ఈ దేశ కమ్యూనిస్టులు ఉంటున్నారు. యంత్రం, విజ్ఞానం దూసుకుపోతున్న ఈ తరుణంలో కార్మికుడు క్యాపిటలిస్ట్‌గా మారుతున్న కాలంలో గతి తార్కికవాదం మతి తప్పి మతం గురించి మాట్లాడుతుందా? అందుకే రోజూ వామపక్షాల ప్రకటనల్లో, వారి మేధావుల రాతల్లో, వారు ఏర్పాటుచేసిన మీడియా తలరాతల్లో ఎక్కడా అభివృద్ధి అంశాలకు స్థానం కన్పించడం లేదు. ‘మతోన్మాదాన్ని అడ్డుకొంటాం’ అన్నది ఇప్పటి కమ్యూనిస్టు నాయకుల, మేధావుల కొత్త నినాదం. ‘మతం మత్తుమందు’ అని మార్క్స్ చెప్పినందువల్ల దానిని తూ.చ తప్పకుండా మతతత్వ వాదుల్లా కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని ‘మతం’గా మార్చారా? ఇప్పుడేదో గజనీలు, ఘోరీలు అరేబియా నుండి దండెత్తుతుంటే అడ్డుకునే వీరయోధుల్లా రోజూ ప్రకటనలు! ఇపుడేమైనా చైనాలాగా మసీదులకు తాళం వేసి మదర్సాలను మూసేస్తారా? బాబర్, ఔరంగజేబు చరిత్రలను చెరిపేసి వాళ్ల గొప్పతనాలను దాచిపెట్టి శివాజీ శౌర్యాన్ని, రాణాప్రతాప్ రౌద్రాన్ని బోధిస్తున్నారా? రోమిల్లా థాపర్, రామచంద్ర గుహలను తమ వ్యాసాలు రాయనివ్వడం లేదా? జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని మూసేశారా? కన్హయ్య కుమార్‌ను ఎన్నికలలో పోటీ చేయకుండా ఆపేయగలిగారా? మేధావుల పేర్లు తగిలించుకుని టీవీ చానళ్లలో పోజులిస్తున్న వాళ్లను మాట్లాడనివ్వడం లేదా? ఇపుడు దేశానికి హిందూమతం వల్ల ఏం ప్రమాదం వచ్చి పడింది?

నాలుకకు నరం లేకుండా ఈ దేశ ప్రధానిపై అవాకులు చవాకులు పేలిన కె.నారాయణ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కదా! పాకిస్తాన్ వెళ్లి ‘‘మోదిని దించేందుకు మాకు సహకరించండి’’ అని అంతర్జాతీయ టీవీ చానళ్లలో మాట్లాడిన మణిశంకర్ అయ్యర్ హాయిగా ఉన్నాడు కదా! ఎన్నోసార్లు పార్లమెంటులో ఒక్కడే సభ్యుడుగా వున్న అసదుద్దీన్ ఓవైసీ ఎన్నిసార్లు ప్రధానిని విమర్శించలేదు? ఆయనను ఎవరైనా అడ్డుకున్నారా? బద్రుద్దీన్ అజ్మల్, మహమ్మద్ సలీం లాంటివారు ఎన్నిసార్లు కారుకూతలు కూయలేదు. వాళ్లపేరైనా ప్రస్తావించాడా ఈ దేశ ప్రధాని! అతనిపై అగ్రకుల కమ్యూనిస్టులకంత ద్వే షం. అతను ప్రస్తావించే జా తీయవాదంపై అంత అక్క సు ఎందుకు? సమ సమాజ స్థాపన కోసం 30 ఏళ్ళు స్టాలిన్ నియంతృత్వాన్ని రష్యా భరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాలు దండెత్తివస్తే ‘రష్యన్ జాతీయత’ ఎందుకు తెరపైకి వచ్చింది? ఇవి అర్థం చేసుకోకుండా కేవలం హిందుత్వపై దాడికే కమ్యూనిజం ఉందన్నట్లు భారతీయ కమ్యూనిస్టుల వేషాలు చూసి ఈ దేశ ప్రజలకు మొహం మొత్తింది.

1920లో భారత్‌లో పురుడు పోసుకున్న కమ్యూనిస్టు పార్టీ ఏ విధంగా చూసినా ఓ సుదీర్ఘ కాలఖండం. కానీ దాని తర్వాత ఈ దేశంలో 10 మంది చిన్నపిల్లల మధ్య 1925లో డాక్టర్ హెగ్డేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఈరోజు ఓ వటవృక్షం. కాలపరీక్షకు నిలవని సిద్ధాంతంతో కమ్యూనిస్టు పార్టీ అనేక ముక్కచెక్కలయి ఇస్లామిక్ మతవాదాన్ని తలకెత్తుకొని నడువలేక, కుంటలేక కునారిల్లుతున్నది. 1920లో తాష్కెంట్‌లో యం.యన్.రాయ్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీ 1964 ఏప్రిల్ 11 తర్వాత సిపిఐ(ఎం)గా, 1967లో సిపిఐ(ఎం) నుండి చీలిపోయి 1969లో సిపిఐ (యంఎల్)గా.. ఆ తర్వాత అనేక ముక్కలుగా మారి కకావికలమైంది. నిజానికి సిపిఐ(ఎం) ఓ పెద్ద శక్తిగా మారి బెంగాల్, త్రిపురల నుండి క్రమంగా మాయమై, కేరళలో అంపశయ్యపై ఉంది. మొన్న కరడుగట్టిన సిపియం సెక్యులర్ ఓటంతా కాంగ్రెస్‌కు షిప్ట్ అయ్యింది. 2024లోనో, 2029లోనో అది భాజపాకు షిఫ్ట్ అవ్వడం ఖాయం.

ఒకప్పుడు ప్రభుత్వాలను నిలబెట్టగల, కూల్చగల సామర్థ్యం వున్న కమ్యూనిస్టులు ఇవాళ ఇంతలా కునారిల్లిపోవడానికి కారణం ఏమిటి? ఇండియాలో పుట్టిన ఏ తత్వవేత్తను కూడా కమ్యూనిస్టులు స్వంతం చేసుకోలేదు. ఈ దేశ పురాణ ఇతిహాసాల్లోని మంచిని స్వీకరించకుండా దానిపై అదేపనిగా దాడిచెయ్యడం ప్రజలకు వారిని దూరం చేసింది. అర్జెంటీనాకు చెందిన వైద్య శాస్తప్రట్ట్భద్రుడు చెగువేరాపై వున్న ప్రేమ ఈ దేశంలో పుట్టిన నేతాజీపై లేదు. బొలివీయా, క్యూబా, కెన్యాల్లో చెగువేరా సాయుధ పోరాటాన్ని ప్రేమించే ఈ దేశ కమ్యూనిస్టులు ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను స్థాపించి, స్వాతంత్య్రం కోసం ఈ నేలపై ఉద్యమించిన ఎందరో వీరులను తిరస్కరించినట్టే నేతాజీని తిరస్కరించి తులనాడారు. ఇపుడు నరేంద్ర మోదీ విధానాల మీద కాకుండా వ్యక్తిపై పోరాటం మొదలుపెట్టారు. ఇది ఎస్.ఎ.డాంగే, పి.సి.జోషి, బి.టి.రణదివె, డాఅధికారి, ముజఫర్ అహ్మద్, నంబూద్రిపాద్‌ల కాలం కాదు. పత్రికలను, మేధో సాంస్కృతిక రంగాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని ఏదైనా రాసి జనాన్ని నమ్మించడం సాధ్యం కాదు. ఇపుడు రాజ్‌దీప్ సర్దేశాయి భాషలో ‘నెట్ హిందువులు’ మేల్కొన్నారు.

ఇక్కడి దేశీయ సంస్కృతిని అర్థం చేసుకోకుండా, ఒకవేళ అందులో ఏవైనా తప్పులుంటే సరిచేయకుండా గుడ్డి వ్యతిరేకతతో ముందుకెళుతున్న వామపక్షాలకు రానున్న రోజులు మరింత గడ్డుకాలమే. ఇంకో ఇరవై ఏళ్ళకు సమీక్షించుకొని తమ చారిత్రక తప్పిదాలను లిస్ట్‌లో ఎక్కించేందుకు వెళ్తే కలియుగం సగం భాగం పూర్తవ్వడం ఖాయం. ‘ఏం చేయాలి?’ అన్న లెనిన్ పుస్తకం చదివి ఏ ఉద్యమం చేయాలో నిర్ణయించుకునే కమ్యూనిస్టులు భారతీయతను తెలుసుకోవడానికి కూడా మావో సేటుంగ్ తత్వం అధ్యయనం చేస్తారా?


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *




మనిషికి పరమానందం ఎప్పుడు సంప్రాప్తిస్తుంది? జన్మరాహిత్యమైన మోక్షం లభించినప్పుడా? ఆత్మ ఎప్పటికైనా పరమాత్మలో లీనమైనప్పుడా? నిజానికి అన్ని ఆనందాల్లోకెల్లా అత్యంత ఉత్కృష్టమైన మహదానందం మరొకటి ఉంటుందని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. అదే లోకకళ్యాణం. అందుకే, భారతీయ ధర్మశాస్ర్తాలు సర్వేజనా స్సుఖినోభవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు అంటుంటాయి. దీని సాధనకే ప్రతి మనిషీ కట్టుబడాలి. ఇదే పరమానందంలోని ప్రధాన సూత్రం! పరమాత్మ ఎల్లవేళలా ఆనంద స్వరూపుడే. అందుకే, ఆయనను ఆనందో బ్రహ్మ అన్నాం. ఇదే స్వభావం అవిభాజ్యమైన జీవులందరికీ వర్తిస్తుంది. నిజానికి జీవులన్నింటి సహజ స్వభావం ఆనందంగా ఉండడమే. మానవుడు వ్యక్తిగతంగా తనకు మాత్రమే ఆనందం కలగాలని కోరుకోకూడదు. ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే అభిలషించాలి. మనిషి చూడడానికి వ్యష్టిలా కనిపిస్తాడు. కానీ, అతడు సమిష్టి. అదే భారతీయాత్మ. ఇదే మన జీవన విధానం. ఒక కుండ ఉందంటే, సృష్టిలో అది ఎంతో కొంత స్థలాన్ని ఆక్రమించినట్లే లెక్క. 


కానీ, దాన్ని పగులగొడితే ఏమవుతుంది? అందులోని ఖాళీ స్థలం ఈ అనంతాకాశంలో విలీనమవుతుంది. సరిగ్గా, ఇలాంటిదే దేవ-జీవ తత్వం కూడా. మనిషి దగ్గర ఎన్ని సంపదలున్నా, ఎన్నెన్ని పదవుల్ని అతను సంపాదించినా ఒంటరిగా జీవించడం చాలా కష్టం. కాబట్టే, భగవంతుడు మనిషితోపాటు పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, నదీనదాలు వంటి ప్రకృతినంతా సృష్టించాడు. వివేచనాపరుడైన మానవుడు వీటన్నింటితో సమన్వయం సాధించాలి. అప్పుడే మనిషికి మనుగడ, అతని జన్మకు సార్థకత. కాబట్టే, సృష్టిలోని సమస్త జీవులూ ఆనందంగా ఉండాలని కోరుకోవాలనడం.ప్రేమపూర్వక హృదయంతో పలికే ఆనందామృత వచనాలు ఏవైనా వినేవారిని సన్మార్గంలో నడిపిస్తూ సానుకూల జీవనాన్ని ప్రసాదించేవే. అవి మనిషికీ, మనిషికీ మధ్య అంతరాన్ని తొలగించి, సామాజిక బంధాన్ని పరిపుష్ఠం చేస్తాయి. లోకంలోని వారందరూ సుఖంగా ఉండాలని, ఆరోగ్యభోగభాగ్యాలతో తులతూగాలని, దు:ఖాలకు దూరంగా జీవించాలన్నదే ఆ పరమాత్మ అభిలాష.

**********************************
* డాక్టర్.పి. భాస్కర యోగి*
*చింతన : నమస్తే తెలంగాణ*


గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ విజయం సాధించాక కేసీఆర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసారు. ‘జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారట కదా!’- అన్న పాత్రికేయులకు సమాధానం చెప్తూ ‘చంద్రబాబు నాయుడుకు రెండు హిం దీ ముక్కలు సక్కగ మాట్లాడనీకె రాదు; ఏం చెక్రం దిప్పుతడయా? ఊకెనె దిరుగుతాది చక్రం?’’ అని వ్యంగ్యంగా అన్నారు. పాత్రికేయులు, అక్కడున్న వాళ్లంతా గొల్లున నవ్వారు. 

నిజమే! జాతీయ భాష హిందీ నేర్చుకోకుండా జాతీయ రాజకీయాలు చేయడం సాధ్యమా? దిల్లీ, బిహార్, చత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝా ర్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి దాదాపు 10 రాష్ట్రాల్లో అధికార భాషగా ఉంటూ, ప్రజలను అనుసంధానం చేయడంలో అగ్రగణ్యంగా ఉన్న హిందీని వ్యతిరేకిస్తున్నామంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తోపాటు తెలుగు పత్రికలు ‘లీడ్’ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆఖరుకు ‘నేను పార్లమెంటు సభ్యుడనై అనర్గళంగా పార్లమెంట్‌లో మాట్లాడాలని ఉంద’ని గొప్పగా చెప్పిన రేవంత్‌రెడ్డి ‘హిందీని మాపైన రుద్దుతారా?’అంటే అవాక్కయ్యాం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘నూతన విద్యా విధానం’లో భాగంగా హిందీని జాతీయ భాషగా అమలు చేయాలని సంకల్పంచింది. వెంటనే ‘దక్షిణాది రాష్ట్రాలు’ అంటూ రెచ్చగొట్టే పనికి విభజనవాదులు (తుక్డేతుక్డే గ్యాంగ్) పావులు కదిపారు. హిందీయేతర రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం అమలు చేయాలని చెప్పిన కేంద్ర మానవ వనరుల శాఖ మొదట ప్రతిపాదించి తర్వాత వెనక్కి తగ్గింది. గతంలో వాజపేయి ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న డా.మురళీమనోహర్ జోషి ఇలాంటి జాతీయ సమగ్ర విద్యావిధానంపై చర్చ మొదలుపెట్టగానే- దేశంలోని కుహనా సెక్యులరిస్టులంతా ‘దేశం కాషాయ మయం’ అవుతుందని గగ్గోలు పెట్టారు. దేశంలో పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యతోపాటు విలువలు నేర్పుతున్న సరస్వతీ శిశు మందిరంలో ఆచార్యుడిగా పనిచేసిన రమేశ్ పోక్రియాల్ 2019 ఎన్నికలయ్యాక కేంద్ర మానవ వనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక వేసిన తొలి అడుగు ఇది. హిందీని గుడ్డిగా వ్యతిరేకించే తమిళ పార్టీలు, నాయకులతోపాటు ఎ.ఆర్.రహమాన్ (మతం మారిన సంగీతకారుడు) హిందీపై వెనక్కి తగ్గడం, స్వాగతించడం విచిత్రంగా ఉంది. మాజీ సీఎం సిద్ధరామయ్య కర్ణాటకకు ప్రత్యేక రాష్ట్ర పతాకం కావాలని, లింగాయత్‌లను వేరే మతంగా గుర్తించాలని రెచ్చగొట్టినపుడు వీళ్లంతా తెగ సంతోషపడి సిద్ధూను మెచ్చుకొన్నారు.


ఇక, 2018లో భాజపా కూటమి నుండి చంద్రబాబు పక్కకు జరిగాక ఉత్తర, దక్షిణాది అంటూ ఆర్థిక మంత్రుల సమావేశం పెట్టడం, పవన్‌కల్యాణ్ లాంటి అపరిపక్వ రాజకీయ నేత ఇదే రకమైన బాడీ లాంగ్వేజ్‌లో మాట్లాడడం తమిళ పార్టీల్లో ప్రాం తీయ, ప్రాదేశిక సెంటిమెంటును రెచ్చగొట్టడం చూశాం. చక్రాలు తిప్పేందుకు మా యావతి, ములాయం, ఆర్జే డీ, అఖిలేశ్ కావాలి, కానీ వాళ్లు భాషగా హిందీని ఎంత గౌరవిస్తారో ఈ చక్ర బాబులు విస్మరిస్తారు. ఆఖరుకు సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు అవినీతిపరులపై దాడి చేస్తే, అది కూడా ఉత్తరాది వారు మన ‘తెలుగుజాతి’పై దాడి చేస్తున్నారంటూ కలర్ ఇచ్చే ప్రయత్నం మొన్న మే 23వరకు జరిగింది.
ఏ ఆధారం లేకుండా భాషావేత్తలు పుట్టించిన ఆర్య- ద్రావిడ సిద్ధాంతం పెంచి పోషించిన ప్రజా తమిళ పార్టీలు పెరియార్ రామస్వామి మొదలుకొని స్టాలిన్ వరకు అదే మార్గంలో పయనిస్తూ రాజకీయం చేస్తున్నారు. 1937లో రామస్వామి నాయకర్ హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టాడు. బళ్లారి జైల్లో ఉంటూనే జస్టిస్ పార్టీ నేత అయ్యాడు. ఈ జస్టిస్ పార్టీ 1944 వరకే ‘ద్రావిడార్ కజగం’గా మారిపోయింది. 1955, 1968లో ఈ వికృత మనస్తత్వం ఉత్తర భారత వ్యతిరేక దృష్టిగా మార్పు చెంది, రామాయణ సంస్కృతిని వ్యతిరేకించే వరకు వెళ్లింది. పాకిస్తాన్ లాగా ద్రావిడిస్థాన్ ఏర్పడాలని 1947 ఆగస్టు 15వ తేదీని ‘సంతాప దినం’గా ప్రకటించాడు పెరియార్. 1944లోనే పెరియార్ ద్రవిడస్థాన్ డిమాండ్‌ను బ్రిటీష్ వారికి విన్నవించేందుకు పన్నీర్ సెల్వంను దూతగా పంపగా, ఆయన విమాన ప్రమాదంలో మరణించడంతో ఆ ప్రయత్నానికి తెరపడింది. 1955లో రామస్వామి నాయకర్ హిందీ వ్యితిరేక ఉద్యమం పేరుతో జాతీయ పతాకం దగ్ధం చేయించాడు. 1957లో 10వేల మంది అనుచరులను ఉసిగొల్పి ‘్భరత రాజ్యాంగ ప్రతుల’ను తగులబెట్టించాడు. 1960లో భారతదేశ చిత్రపటాలను తగులబెట్టాడు. ఆ తర్వాత 1958లోనే పెరియార్‌కు, నాటి గొప్ప సోషలిస్ట్ నేత రామ్‌మనోహర్ లోహియా మధ్య చర్చలు జరిగాయి. పెరియార్ 4 కోరికలను వదలిపెట్టాలని లోహియా సూచించారు. అందులో ‘హిందీ వ్యతిరేక పోరాటం’ కూడా ఒకటి..!


నిజానికి ఒకపుడు మద్రాస్ ప్రావిన్స్‌లో హిందీని ప్రవేశపెట్టాలని 1937లో రాజాజీ ప్రయత్నం చేసాడు. 1938 ఏప్రిల్ నాటికి హిందీ వ్యతిరేక ఉద్యమం తారస్థాయికి చేరి నటరాజన్, ధలముత్తులు అరెస్టయి జైల్లోనే మరణించారు. ఈ తీవ్రతను గమనించి 21 ఫిబ్రవరి 1940న మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకోగా స్వతంత్రం సిద్ధించాక మరోమారు ఈ ప్రయత్నం జరిగింది. 1950 మే 2న ఇచ్చిన ఉత్తర్వులు మరోమారు హింసకు కారణమైంది. 1959లో, 1965లో ఇలాంటి ప్రయత్నాలు జరిగి ద్రావిడ పార్టీల రాజకీయం ఫలితంగా దాదాపు 63 మంది మరణించారు.
‘‘నేను తమిళంలో మా ట్లాడే రోజు, పెరియార్ నాకు హిందీలో జవాబు చెప్పేరోజు రావచ్చని నేను నాయకర్‌కు చెప్తే, ఈ దృక్పథాన్ని కజకం నాయకుడు హర్షించి’’నట్లు లోహియా చెప్పారు. అలా సాగిన ఈ ఉద్యమాన్ని డీఎంకే అధినేత కరుణానాధి ఓట్ల కోసం అలాగే కొనసాగించాడు. భౌగోళికంగా ఢిల్లీకి దూరంగా ఉన్న తమిళనాడును ‘మనం ప్రత్యేకం’ అన్న భావన కల్పించాడు. తమిళుల్లో భాషాభిమానం ఎక్కువ అన్న భ్రమలో ప్రజల్ని కరుణానిధి, ఇతర ద్రావిడ పార్టీలు ఉంచుతూ వచ్చాయి. నిజానికి పెరియార్ రామస్వామికి కన్నడ మూలాలుండగా, వై.గోపాలస్వామి (వైగో), కరుణానిధిలకు తెలుగు మూలాలున్నాయి. ఎంజీ రామచంద్రన్‌కు మలయాళ మూలాలున్నాయి. రజనీకాంత్ కూడా కన్నడ మూలాలున్న వాడే. ఇలా తమిళ ముఖ్యులంతా పరభాషా మూలాలున్నవారే.


ఈ గజ్జి ఇటీవల కన్నడ ప్రాంతానికి సోకింది. నిజానికి మన దేశంలో తమిళ, గుజరాతీ, మరాఠీ, కన్నడ ప్రాంతాల వాళ్లకు భాషాభిమానం మెండు. అలా ఉండడం తప్పు కూడా కాదు. కానీ ఈ ప్రాంతీయ భాషాభిమానం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. హిందీని జాతీయ అనుసంధాన భాషగా చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు ప్రయత్నించింది. దేశంలో అంతర్గతంగా ఎక్కువ మందిని కలపగల సత్తా హిందీకి ఉంది. అందుకోసమే రాజ్యాంగ నిపుణులు హిందీకి జాతీయ హోదా కట్టబెట్టకుండానే పార్లమెంటరీ కార్యకలాపాలు, న్యాయం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడికి అధికార భాషగా వాడొచ్చని రాజ్యాంగంలోని 343(1) ప్రకారం దేవణాగరి లిపి ఉన్న హిందీని ప్రభుత్వం స్వీకరించింది. అలాగే చట్టం ద్వారా తమ స్వంత అధికారిక భాష నిర్ణయించుకొనే అధికారం రాష్ట్రాలకు దఖలు పరిచింది. అదే సమయంలో దేశంలో భాషా బంధాన్ని కొనసాగించే బాధ్యతను హిందీ ద్వారా వ్యాప్తి జేసే బాధ్యతను రాజ్యాంగం నిర్దేశించింది. కేంద్రం ఈ బాధ్యత మోస్తూనే రాజ్యాంగం గుర్తించిన 22 భాషలను అభివృద్ధిచేసే పనిని నిర్వర్తించాలని రాజ్యాంగం చెప్పింది.


ఎన్నో ఏళ్లనుండి కాంగ్రెస్‌తో అంటగాగిన తమిళ పార్టీలు ముఖ్యంగా డిఎంకె తన రాజకీయ అవసరాల కోసం ఆర్య-ద్రావిడ విభజన వాదంతో ముడిపెట్టి అలాగే కొనసాగించింది. విచిత్రం ఏమిటంటే 99 ఏళ్ల చరిత్ర ఉన్న ‘హిందీ ప్రచార సభ’ దక్షిణ విభాగం ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. తమిళనాడులో పుట్టిన ఏపీజే అబ్దుల్ కలాం భారత ప్రజలందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. తిరువల్లువర్ గీతాలు దేశమంతా గుర్తించింది. బెంగాల్‌లో పుట్టిన స్వామి వివేకానందుడు ‘రాక్ మెమోరియల్’పై ధ్యానం చేసాడు. ఇదంతా మరచిపోయి అధికార యావ కోసం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని రాజకీయానికి కుదువబెట్టిన మన నాయకులు ఉత్తర- దక్షిణాల అడ్డుగోడలు కట్టి విజయం సాధిద్దామని అనుకుంటున్నారు. కే వలం 3వేల పైచిలుకు ఆంగ్ల మూల పదాలున్న ఆంగ్లం అదే తమిళనాడులో నిస్సిగ్గుగా మాట్లాడటం గొప్పగా భావించే తమిళ నేతలు 7 లక్షల పదాలున్న హిందీపై చిన్నచూపును ప్రదర్శిస్తారు. ఇటలీ నుండి వచ్చిన సోనియాగాంధీ కుమారుడు రాహుల్ ప్రక్కన స్టాలిన్ నిలబడి రాజకీయం చేస్తాడు. కానీ ఉత్తరాది నుండి వచ్చే నాయకులు వాళ్లకు పరాయి వాళు..్ల ఎంత విచిత్రం!


ప్రపంచంలోని 190 దేశాల్లో 650 కోట్ల జనాభా ఉంది. 11 దేశాల్లో మాత్రమే ఆంగ్లం బాగా తెలిసిన వాళ్లున్నారు. అంటే 5% దేశాల్లోనే ఆంగ్ల ప్రభావం ఉందన్నమాట. నిజానికి ప్రపంచ భాష కావాలంటే 140 కోట్ల ప్రజలు మాట్లాడే చైనా మాతృభాష చీనీ గాని, 100 కోట్ల మందికి తెలిసిన హిందీ గాని, మూడవ స్థానంలోని ‘రూసీ’గానీ నాల్గవ స్థానంలోని స్పానిష్ గానీ, 5వ స్థానంలోని పోర్చుగీసు గాని కావాలి. కానీ 11 స్థానంలోని ఆంగ్లం ఇపుడు మనపై పెత్తనం చేస్తున్నది. బ్రిటన్‌కు బానిస దేశాలుగా ఉన్న భారత్, పాక్, న్యూజిల్యాండ్, అమెరికా, కెనడా లాంటి 11 దేశాలపై ఆంగ్లం బలవంతంగా రుద్దబడింది.


ఈ చారిత్రక పరిణామాలపై అవగాహన లేని నాయకులు, మేధావులు, కొన్ని మీడియా సంస్థలు కొందరిని అధికార పీఠంపై ఉంచేందుకు ఇలాంటి చౌకబారు కృత్రిమ ఉద్యమాలకు తెలుగునాట కూడా ఊపిరిపోయాలని చూస్తున్నారు. 1946 జూన్‌లో దేశానికి ‘హిందీ అధికార భాష’ అవుతుందని ప్రకటించారు. ‘‘స్వాతం త్య్రం వచ్చాక చట్టసభల్లో హిందీ మాట్లాడని వారిని జైలుకు పంపేందుకు నేను సత్యాగ్రహం చేస్తాను’ అన్న గాంధీ మాటలపై వాళ్లకు విశ్వాసముందా? యధాలాపంగా సాధ్వీప్రజ్ఞాసింగ్ ఏదో మాట్లాడితే దానిని తీవ్రంగా ఖండించిన వీర గాంధేయవారసులు ఇపుడు ఎందుకు నోరు మెదపరు? ఇదంతా రాజకీయం అని వారికి తెలుసు. ఏది తమకు అనుకూలమో దానిని ప్రజల మెదల్లోకి ఎక్కిస్తారు. కొన్ని కుటుంబాలను, కులాలను జాతికి ప్రతీకలుగా మార్చే ప్రయత్నం తెలుగునాట జరుగుతున్న ద్రావిడ ప్రాణాయామం! తస్మాత్ జాగ్రత్త..!


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*07-06-2019 : శుక్రవారం *




మ్రింగెడు వాడు విభుడని
మ్రింగెడిది గరళమనియును మేలని ప్రజకున్‌
మ్రింగమనె సర్వమంగళ
మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో
దేవతలూ, రాక్షసులు సముద్రమథనం చేస్తున్నారు. అందులోంచి హాలాహలం ఉద్భవించింది. అందరూ భయపడి దూరం వెళ్లిపోయారు. శివుడు మాత్రం ఆ హాలాహలాన్ని తాగేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ఆ విషయాన్ని పార్వతీదేవికి చెప్పగా.. అందుకు అంగీకరించింది ఆ జగజ్జనని. లోకుల మేలు కాంక్షించిన ఆ త్యాగభావం వల్లనే ఆమెకు ‘జగన్మాతృత్వం’ లభించింది. ఇలాంటి త్యాగతత్వం మన సమాజానికి అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు రావడం, మనుషుల మధ్య సఖ్యత, ప్రేమ లోపించడానికి ప్రధాన కారణం.. త్యాగ బుద్ధి లేకపోవడమే. ఇద్దరు మనుషుల మధ్య సర్దుబాటు జరగాలంటే త్యాగం, నిస్వార్ధమే ప్రధాన భూమికలు. వాటి వల్లనే వారిమధ్య ప్రేమబంధం దృఢమవుతుంది. ఒకరికోసం ఒకరు చేసే త్యాగంలోని ఆనందం అపరిమితం. ఆ ఆనంద స్వరూపుడే భగవంతుడు ఇదే ఒకసాధన. కానీ.. త్యాగబుద్ధి జనంలో లోపించడం వల్లనే లోకానికి ఈ దుస్థితి కలిగి మానవీయ విలువలు మంటగలుస్తున్నాయి. అరణ్యంలోని రుషులు, సాధుసత్పురుషుల క్షేమం కోసం, మునీశ్వరుల ఆశ్రమ రక్షణకు, యజ్ఞయాగాదులకు రాక్షసుల బారి నుంచి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించేందుకు రామలక్ష్మణులు చిన్నవయసులోనే అడవిబాట పట్టారు. లోకకంటకులను సంహరించేందుకు తన వెన్నెముక ఇచ్చేందుకు ప్రాణత్యాగం చేశాడు దధీచి మహర్షి.

పావురాన్ని రక్షించేందుకు తన శరీరాన్ని కోసి ఇచ్చాడు శిబిచక్రవర్తి. ఇవన్నీ మనకు కథల్లా కన్పించినా.. అంతర్గతంగా మనల్ని సంస్కరించేందుకు ఉపయోగపడే అమూల్యరత్నాలు. జీవితంలో సర్దుబాటు, సహనం, దాతృత్వం, ప్రేమ, సద్బుద్ధి కలగాలంటే దాని వెనుక ‘త్యాగసాధన’ ఉండాలి. ఇతరుల సొమ్ము కావాలనుకోవడం, మోసం చేయడం, తాను మాత్రమే సుఖంగా ఉండాలనుకోవడం ఇవన్నీ త్యాగబుద్ధి లేనిచోట పుట్టే అవలక్షణాలు. సూర్యుడు ఎలాంటి పక్షపాతం లేకుండా తన దగ్గరున్నది దాచుకోకుండా వెలుగులను ప్రసరింపజేస్తాడు. పంచభూతాలు కూడా అంతే. అందువల్లనే అవన్నీ పూజనీయమయ్యాయి. ఇలా భగవంతుని తత్వం అంతా స్వార్ధం వదిలిపెట్టి త్యాగాన్ని అవలంబించాలని చెబుతుంది. మనుషులే ఎవరికి వారు గీతలు గీసుకొని త్యాగాన్ని గాలికి వదులుతున్నారు. అలాకాకుండా త్యాగజీవనమే సుఖజీవనం అని తెలుసుకున్ననాడు అంతా ఆనందమే.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
*03-06-2019 : సోమవారం*