మనిషికి పరమానందం ఎప్పుడు సంప్రాప్తిస్తుంది? జన్మరాహిత్యమైన మోక్షం లభించినప్పుడా? ఆత్మ ఎప్పటికైనా పరమాత్మలో లీనమైనప్పుడా? నిజానికి అన్ని ఆనందాల్లోకెల్లా అత్యంత ఉత్కృష్టమైన మహదానందం మరొకటి ఉంటుందని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. అదే లోకకళ్యాణం. అందుకే, భారతీయ ధర్మశాస్ర్తాలు సర్వేజనా స్సుఖినోభవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు అంటుంటాయి. దీని సాధనకే ప్రతి మనిషీ కట్టుబడాలి. ఇదే పరమానందంలోని ప్రధాన సూత్రం! పరమాత్మ ఎల్లవేళలా ఆనంద స్వరూపుడే. అందుకే, ఆయనను ఆనందో బ్రహ్మ అన్నాం. ఇదే స్వభావం అవిభాజ్యమైన జీవులందరికీ వర్తిస్తుంది. నిజానికి జీవులన్నింటి సహజ స్వభావం ఆనందంగా ఉండడమే. మానవుడు వ్యక్తిగతంగా తనకు మాత్రమే ఆనందం కలగాలని కోరుకోకూడదు. ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే అభిలషించాలి. మనిషి చూడడానికి వ్యష్టిలా కనిపిస్తాడు. కానీ, అతడు సమిష్టి. అదే భారతీయాత్మ. ఇదే మన జీవన విధానం. ఒక కుండ ఉందంటే, సృష్టిలో అది ఎంతో కొంత స్థలాన్ని ఆక్రమించినట్లే లెక్క. 


కానీ, దాన్ని పగులగొడితే ఏమవుతుంది? అందులోని ఖాళీ స్థలం ఈ అనంతాకాశంలో విలీనమవుతుంది. సరిగ్గా, ఇలాంటిదే దేవ-జీవ తత్వం కూడా. మనిషి దగ్గర ఎన్ని సంపదలున్నా, ఎన్నెన్ని పదవుల్ని అతను సంపాదించినా ఒంటరిగా జీవించడం చాలా కష్టం. కాబట్టే, భగవంతుడు మనిషితోపాటు పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, నదీనదాలు వంటి ప్రకృతినంతా సృష్టించాడు. వివేచనాపరుడైన మానవుడు వీటన్నింటితో సమన్వయం సాధించాలి. అప్పుడే మనిషికి మనుగడ, అతని జన్మకు సార్థకత. కాబట్టే, సృష్టిలోని సమస్త జీవులూ ఆనందంగా ఉండాలని కోరుకోవాలనడం.ప్రేమపూర్వక హృదయంతో పలికే ఆనందామృత వచనాలు ఏవైనా వినేవారిని సన్మార్గంలో నడిపిస్తూ సానుకూల జీవనాన్ని ప్రసాదించేవే. అవి మనిషికీ, మనిషికీ మధ్య అంతరాన్ని తొలగించి, సామాజిక బంధాన్ని పరిపుష్ఠం చేస్తాయి. లోకంలోని వారందరూ సుఖంగా ఉండాలని, ఆరోగ్యభోగభాగ్యాలతో తులతూగాలని, దు:ఖాలకు దూరంగా జీవించాలన్నదే ఆ పరమాత్మ అభిలాష.

**********************************
* డాక్టర్.పి. భాస్కర యోగి*
*చింతన : నమస్తే తెలంగాణ*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి