************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *
*శుక్రవారం : మే 31 : 2019*




*కవిత్వంలో రససిద్ధులు కావాలి*
*******************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : కవితో కాసేపు*
*30 - 05 - 2019 : గురువారం*



డబ్బు సంపాదన, విదేశీ జీవనం, జీవిత లక్ష్యం అనే సూత్రీకరణ ముందు మన వ్యవస్థలో ఒకవైపు పతనం ప్రారంభం అయ్యింది. మనుషుల మధ్య మానవీయ విలువలను పెంచి అందరిలో ‘నేను’ అన్న ఏకత్వాన్ని ప్రాథమికంగా కల్పించేది కుటుంబవ్యవస్థ. అది సనాతన భారతీయ వ్యవస్థలో ముఖ్యఘట్టం. ఈరోజు అనేక కారణాల వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నది. వక్తుల మధ్య నిస్వార్థం, త్యాగబుద్ధి, పరస్పరమైత్రి, సేవాభావం వంటి మానవీయ లక్షణాలను కుటుంబం మనకు అందిస్తుంది.
 
కానీ ఈ రోజు మనుషుల మధ్య సఖ్యత లేదు. శివుని వాహనం వృషభం, పార్వతి వాహనం సింహం, కుమారస్వామి వాహనం నెమలి, విఘ్నేశ్వరుడి వాహనం ఎలుక, శివుడి చేతిలో అగ్ని, శివుడుండేది మంచుకొండపైన, శివుడి మెడలో పాములుంటాయి. అగ్నిని చేతిలో పెట్టుకొని తలపైన గంగను దాల్చాడు. శివుడి గళంలో విషం, కళ్లల్లో అమృతం.. తలపైన గంగాదేవి. పక్కన పార్వతి.. ఇలా శివుడి చుట్టూ భిన్నమైన వాతావరణం, వస్తువులు ఉన్నా కలిసే జీవనం సాగుతున్నది. సింహం-ఎద్దు, నెమలి-పాము, పాము-ఎలుక, గంగా, చంద్రుడు-అగ్ని, అమృతం-విషం... ఇవన్నీ ప్రకృతి పరంగా విరుద్ధ విషయాలు అయినా శివుడి సన్నిధిలో సమన్వయంతో జీవిస్తున్నాయి. శివారాధన నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. పరస్పర విరుద్ధశక్తుల మధ్య జీవిస్తున్నా మన ప్రేమతో అందరినీ జయించాలి.
 
కాగా కాకో ధనహరే కోయల్‌ కాకో దేత్‌
మీఠా శబ్ద్‌ సునయ్‌కే జగ్‌ అపనే కర్‌లేత్‌

కాకి ఎవరి ధనాన్ని దొంగిలించింది? కోకిల ఎవరికి ధనమిచ్చింది? మన తీయని మాటల ద్వారా ప్రజలను మనవాళ్లుగా చేసుకోవచ్చంటారు పెద్దలు. కుటుంబం మనకు అదే నేర్పిస్తుంది. కానీ నేటి యువతీయువకులు ఈ విలువలను పట్టించుకోవట్లేదు. మునుపటి కుటుంబ వ్యవస్థలోని ఆనందాన్ని ఆస్వాదించడం నేర్చుకోకుండా డబ్బే ప్రధానంగా జీవితాలు కొనసాగితే మనల్ని మనమే విచ్ఛినం చేసుకున్నవాళ్లమవుతాం. దీనికంతా కారణం కుటుంబవ్యవస్థ బీటలు వారడం. నిజానికి చతురాశ్రమాల్లో కుటుంబజీవన మాధుర్యాన్ని తెలిపేది గృహస్థాశ్రమం. అందరినీ కల్పతరువులా పోషించేవాడు గృహస్థుడు.
 
ఊర్జం బిభ్రద్‌ వసువనిః సుమేధా
అఘోరేణ చక్షుషా మిత్రియేణ
గృహానైమి సుమనా వన్దమానో రమధ్వం
మా బిబీత మత్‌

అంటోంది అధర్వణ వేదం. శక్తిని కలిగి, ధనార్జన చేసే ఉత్తమ మేధా సంపన్నుడు, క్రోధం లేని కళ్లతో స్నేహంగా చూసేవాడు, సుప్రసన్నమైన మనసుతో అందరూ పొగిడేట్లు జీవించేవాడు. గృహంలోని వారికి లభ్యమగుగాక అని దీని అర్థం. స్వర్గనరకాలు ఎక్కడో ఊర్థ్వంలో లేవు. గృహస్థ జీవనం స్వర్గం అని వేదవేత్తల అభిప్రాయం. అలాంటి సుఖజీవనాన్ని మనకు కుటుంబమే ఇస్తుంది. దానిని విస్మరించి వ్యక్తిగత సుఖం కోసం అందరినీ దూరంగా పెట్టి ఏకాంతంగా జీవించడం ఆత్మహత్యా సదృశం. సనాతన భారతీయ కుటుంబవ్యవస్థకు పునరుత్తేజం కలిగితేనే మనలో శాంతి నెలకొంటుంది.

******************************
   డాక్టర్. పి. భాస్కర యోగి 
నవ్య : నివేదన: 
ఆంధ్రజ్యోతి :
పరంజ్యోతి  
20-05-2019 : సోమవారం



దేశవ్యాప్తంగా రెండు నెలల నుండి ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల అంతిమ ఫలి తం నిర్ణయమైంది. 2014లో ఒక ‘వేవ్’గా వచ్చిన నరేంద్ర మోదీ 2019లో మరోసారి సింహాసనం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో 282 స్థానాలు గెలిచిన భారతీయ జనతాపార్టీ ఇపుడు మరింతగా మెరుగైన ఫలితాలను సాధించడం ఓ కీలక ఘట్టం. 2014లో మోదీ ఎన్నికయ్యాక పార్లమెంట్ మెట్లకు ప్రణామం చేసి లోక్‌సభలో కాలుపెట్టారు. ‘ఈ దేశానికి నేను అధినేతను కాదు.. సేవకుడిని. 24 గంటలూ ప్రజల కోసం పనిచేసే వ్యక్తిన’ని ప్రకటించాడు. అదేమాట ప్రకారం నేటి వరకు ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా పనిచేసిన మోదీ తన పని తాను చేసుకుపోయాడు. తనపై వేసిన ముద్రను లెక్కపెట్టకుండా, ‘నేను 135 కోట్ల భారతీయుల ప్రతినిధిని’ అని చాటుకొన్నాడు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడూ ‘తినని తిట్లు’ మోదీ తిన్నాడు.

మతపరంగా, కులపరంగా, ప్రాంత పరంగా రాజకీయాలు నడిపే అన్ని పార్టీలూ మోదీకి వ్యతిరేకంగా భుజం భుజం కలిపాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకొని ఎన్నికల తర్వాత కాంగ్రెస్- జెడిఎస్‌తో పొత్తు పెట్టుకుంది. భాజపాను అధికారంలోకి రానివ్వకూడదన్న దుగ్ధతో కలిసిపోయిన ఈ ‘సంకర కూటమి’ బొటాబొటీగా గెలిచింది. అయినా చంద్రబాబు లాంటి వారి కుటిల పన్నాగాలతో కర్ణాటక ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించి, అర్ధరాత్రి కోర్టులు తెరిపించి, జడ్జీలను బ్లాక్‌మెయిల్ చేసి తమకు అనుకూలంగా తీర్పుతెచ్చుకున్నారు. దాంతో కుమారస్వామి ప్రమాణ స్వీకార వేదిక విపక్షాలను కలిపింది. ఆ సందర్భంగా పాల్గొన్న నాయకులకు జెండా, ఎజెండా మోదీని గద్దె దింపడమే.


2018 ఫిబ్రవరిలో భాజపాతో విడిపోయిన చంద్రబాబు మోదీపై విషం కక్కడం మొదలుపెట్టాడు. రాజకీయాల్లో శత్రుత్వం హద్దుమీరడం మంచిది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించారు. చంద్రబాబు ఏపీలో ఉనికిలో లేని భాజపాపై చేసిన టార్గెట్ హద్దులు మీరింది. అది వికటించి ఆంధ్రలో వైకాపాకు మేలు చేసింది. చంద్రబాబు ప్రత్యేక హోదా సమస్యను ఏదో కశ్మీర్ సమస్యలా భావిస్తూ దేశమంతా వికృత రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. మాట్లాడితే ‘నేను నలభైఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నానని, మోదీ నాకంటే తక్కువని’ ప్రచారం మొదలుపెట్టాడు. ముఖ్యంగా తెలుగు మీడియాను అడ్డుగా పెట్టుకొని రోజూ విషప్రచారం చంద్రబాబు తీవ్రం చేయడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అమిత్ షా తిరుమల దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తల చేత ఆయన కాన్వాయ్‌పై దాడి చేయించారు. 


మోదీపై నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత దూషణకు దిగాడు. అసభ్యకర భాషను వాడాడు. దేశ ప్రధానిగా వున్న మోదీని ఆంధ్రలో కా లుపెట్టవద్దని చంద్రబాబు ఫ్లెక్సీలు పెట్టించాడు. శివాజీ అనే సైడ్ ఆర్టిస్టును ముందుపెట్టి ‘రహస్యాలు- ఆపరేషన్ గరుడ’ పేరుతో లేనిపోనివి తెరమీదకు తెచ్చి మోదీపై బురదజల్లాలని ‘చంద్రబాబు అండ్ కో’ ప్రయత్నం చేసింది. చంద్రబాబు తెలుగుదేశం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోదీని గద్దెదింపాలని కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. ఆయా రాష్ట్రాల్లోని పరస్పర విరుద్ధ పార్టీల నేతను ‘మిక్స్‌డ్ ఫ్రూట్’గా మార్చాలని బాబు ప్రయత్నించాడు. జాతీయ స్థాయిలో నాయకులు ఆయనను పూర్తిగా నమ్మలేదు. కాని బాబు పట్టువదలని విక్రమార్కుడిలా నిన్నటివరకూ తన కుటిల ప్రయత్నాలు కొనసాగించడం ప్రజలు హర్షించలేదు.

మొదటి నుండి మోదీని వ్యతిరేకించే వామపక్షాల్లా రాహుల్ గాంధీ రోజుకోసారి రాఫెల్ గురించి పదే పదే చెప్పిన విషయాలను ప్రజలు పట్టించుకోలేదు. అపరిపక్వంగా రాహుల్ పార్లమెంట్‌లో మోదీని కౌగిలించుకోవడం, కన్నుకొట్టడం ప్రజలు అతణ్ణి ‘సీరియస్ నాయకుల జాబితా’ నుండి తప్పించాయి. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఎలాంటి కుంభకోణాలు చేయలేదు. అక్రమాలకు పాల్పడే స్వచ్ఛంద సంస్థలను కట్టడి చేసి దేశ వ్యతిరేక శక్తుల నోళ్లు కట్టేశాడు. లక్షలాది ‘షెల్ కంపెనీలు’ మూసివేసి నల్లధనానికి నెలవైన స్థానాలను దెబ్బకొట్టాడు. ఐటీ, ఈడిల ద్వారా పన్ను ఎగవేతదారుల భరతం పట్టించాడు. నోట్ల రద్దు, జియస్టీ ద్వారా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. దానివల్ల తాత్కాలికంగా కలిగిన పరిణామాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రచారం చేయడం వారికే తిప్పికొట్టింది. ఉజ్జ్వల, ఆత్మగౌరవ గృహాల నిర్మాణంతో పేద ప్రజల మనసు గెలుచుకున్నాడు.


 స్వచ్ఛ్భారత్ లాంటి సామాజిక కార్యక్రమాలను ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. మోదీ ఏనాడూ మతపరమైన విభజనతో మాట్లాడకున్నా ప్రతిపక్షాలు ప్రతిరోజూ మోదీని టార్గెట్ చేసాయి. దేశంలో ఎక్కడో జరిగిన ప్రతి సమస్యను మోదీ మెడకు చుట్టే ప్రయ్నం చేశారు. అఖ్లాక్ హత్య, గౌరీలంకేశ్ హత్య, కథువా ఘటన, రోహిత్ వేముల ఆత్మహత్య మోదీ మెడకు చుట్టే ప్రయత్నం వికటించింది. పాకిస్తాన్ చేసే సీమాంతర ఉగ్రవాదం దేశంలోని ఏ ప్రాంతానికి విస్తరించకుండా, కశ్మీరు దాటకుండా కాపాడే వ్యక్తిగా మోదీని ప్రజలు భావించారు. యువశక్తి ఎక్కువగా వున్న మన దేశంలో రెండుసార్లు మోదీ పాక్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ గొప్ప భరోసా కల్పించాయి. మోదీ అంతర్జాతీయంగా తన వ్యూహాలతో విశ్వనేతగా ఎదిగారు. తన కుటుంబం కోసం వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. కాని మోదీని వ్యితిరేకించే శక్తులన్నీ రోజూ ‘నకారాత్మక ప్రచారం’ మొదలుపెట్టాయి. ఇదంతా మోదీకి బాగా కలిసివచ్చింది. మైనారిటీ ఓట్లకోసం ఆరాటపడే అన్ని పార్టీలు ఏదిపడితే అది మాట్లాడటం దేశ ప్రజల్లో ‘నిశ్శబ్ద విప్లవం’ తెచ్చింది.

‘సర్జికల్ స్ట్రైక్’ను అనుమానిస్తూ, అవమానిస్తూ మాట్లాడిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో అరాచకం సృష్టిస్తూ భాజపాను, జాతీయవాద శక్తులను ముప్పతిప్పలు పెట్టారు. అమిత్ షా సభలకు, ఆఖరుకు ఆర్‌ఎస్‌ఎస్ సభలకు ఆటంకం కల్పించారు. ఆఖరుకు అమిత్‌షా ర్యాలీపై దాడి చేయించారు. శారద, నారద కుంభకోణం, రోజ్‌వ్యాలీ కుంభకోణంలో సిట్ అధికారిగా కొన్ని దస్త్రాలను మాయం చేసిన రాజీవ్ కుమార్‌ను సుప్రీం కోర్టు అనుమతితో అరెస్టు చేసేందుకు సిబిఐ బెంగాల్‌కు వెళ్లింది. కానీ అప్రజాస్వామికంగా మమత తన పోలీసులతో సీబిఐ అధికారులను అరెస్టు చేయించింది. ఇదంతా అరాచకం అయినా ‘మేమే ప్రజాస్వామ్యవాదులం’ అంటూ మరోవైపు దేశాన్ని నమ్మించాలని చూసారు. ఇదంతా ప్రజలను ప్రతిపక్షాల నుండి దూరం చేశాయి. ఆఖరుకు సంతుష్టీకరణకు అనుగుణంగా జాతీయ పౌర రిజిస్టర్‌ను వ్యతిరేకించడం, దేశంలో ఎక్కడో గోసంరక్షకులు స్థానికంగా చేసే గొడవను మోదీకి అంటగట్టడం, కశ్మీర్‌లో రాళ్లు రువ్వే గ్యాంగులను మరింత రెచ్చిపోయేట్లుగా విపక్ష నేతలు వ్యాఖ్యానించారు.


కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కటై కన్పించిన ప్రతిపక్షాలు మోదీకి వ్యతిరేకంగా తమ తమ సిద్ధాంతాలను విస్మరించాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని రాహుల్ గాంధీ ముందు- ‘్ఫర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ గల చంద్రబాబు పాదాక్రాంతం చేశాడు. కేజ్రీవాల్‌కు కాంగ్రెస్‌తో సరిపడకున్నా మోదీని గద్దెదించాలని రాహుల్‌తో కలిసాడు. కుటుంబ పార్టీలైన బిఎస్పీ, ఎస్పీ కూడా మోదీకి వ్యతిరేకంగా జతకట్టాయి. దేవెగౌడ తన కుటుంబాన్ని అధికారంలో ఉంచేందుకు అవకాశవాదంతో కాంగ్రెస్‌తో జతగట్టారు. ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటివాళ్లు ఏకమై, తమతో వేర్పాటువాదులను కలుపుకొని కాంగ్రెస్ కూటమి పక్కన నిలిచారు. ఇదంతా తప్పుడు ‘తడకల కూటమి’గా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. వీరందరికీ భిన్నంగా మోదీని ఈ దేశ ప్రజలు భావించారు. మహాకూటమి పేరుతో చంద్రబాబు, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ చేసిన ప్రయత్నాలను ప్రజలు విఫలం చేశారు.


ఇక తెలుగు రాష్ట్రాల్లో మీడియా గురించి విశేషంగా చెప్పాలి. తెలుగు మీడియాలో ముఖ్యంగా కొన్ని టీవీ చానళ్ళు 2018 ఫిబ్రవరి నుండి మోదీని తిట్టడమే పనిగా పెట్టుకొన్నాయి. సాక్షాత్తూ ప్రధానిని బూతులు తిట్టేందుకే రోజూ ‘ప్రైమ్‌టైమ్ షో’లు ఏర్పాటు చేయడం చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణం. ఇన్ని విష ప్రచారాల మధ్య మోదీ విజయం సాధించడం పెద్ద సాహసమే. ఇప్పటికైనా ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు, ఏకపక్షపాత మీడియా ప్రజల తీర్పు గౌరవించకపోతే- అది ప్రజాస్వామ్య హననమే అవుతుంది.


తప్పుడు మాటలు మాట్లాడకుండా, ‘నేను 135 కోట్ల భారతీయుల ప్రతినిధిని’ అంటూ పార్లమెంటు మెట్లకు మొక్కి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన మోదీపై చేసిన కుట్రలను ప్రజలు ఛేదించారు. చుక్కలన్నీ ఒకవైపు వుంటే నిండు చంద్రుడు మరోవైపు అన్నట్లు ‘మోదీ ఎగరేసిన విజయకేతనం’ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మైలురాయి. *

************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *


‘గరీబ్‌కా బీబీ సబ్‌కా బీబీ’ అని ఉర్దూలో ఓ సామెత. పేదవాడి భార్య అందరికీ వరసకు వదినే అని దాని అర్థం. ఇపుడు భారతదేశంలో పేరుకు మెజారిటీగా వున్నది హిందువులు. కానీ ఎవరైనా మెజారిటీలను తిట్టవచ్చు. చాలామంది నాయకులు ‘హిందువులను తిట్టే నేతలుగా ఎదిగారు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు నోరులేని మూగజీవాలు. లౌకికవాదం అనే రక్తాన్ని నరనరాన ఎక్కించుకున్నారు. ఓట్లకోసం హిందువులను తిట్టని మేధావులు, నాయకులు లేరు! మరీ ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, చాలావరకు ప్రాంతీయ పార్టీల నేతలు.. మేధావులు, సూడో సెక్యులర్ పాత్రికేయులు, రచయితలు, కవులు, హర్యాలీ గుంపు!.. 

ఇలా చెప్తూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఇటీవల ఆ లిస్టులోకి చేరిన వాళ్ళలో సినీనటులు ప్రకాశ్‌రాజ్, కమల్‌హాసన్ అగ్రస్థానంలో ఉన్నారు. వీళ్లను కళాకారులను చేసి, గౌరవించి సినిమాలను ఆడిస్తున్న మెజార్టీ ప్రజలకు ఆమాత్రం ‘సిన్మా’ చూపించకపోతే ఎలా? ఇప్పటికే తమిళనాడులో బోలెడు పార్టీలుండగా కమల్‌హాసన్ ఓ పార్టీ పెట్టి మెజార్టీ ప్రజల మనోభావాలపై దాడి చేయడమే ఎజెండాగా నడిపిస్తున్నాడు. తాను స్థాపించిన ‘మక్కల్ నీదిమయ్యం’ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 13న కమల్‌హాసన్ తమిళనాడులో ముస్లిం సంఖ్యా ప్రాబల్యం గల ‘అరవకురిచి’ అనే చోట నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఒక హిందువే. అది ఎవరో కాదు, మహాత్మా గాంధీని చంపిన గాడ్సే. అప్పటినుండే భారత్‌లో తీవ్రవాదం ప్రారంభమైంది. ఈ ప్రాంతం ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ మాట చెప్పడం లేదు. గాంధీ విగ్రహం ముందు నిలబడి చెబుతున్నాను’’ అన్నాడు ఆయన. అంటే అది ముస్లిం జనాభా ఎక్కువున్న ప్రాంతం అని ఈ మహానటుడికి ముందే తెలుసన్నది సుస్పష్టం.

గతంలో ఇలాంటి వ్యాఖ్యలే మణిశంకర్ అయ్యర్, సీతారాం ఏచూరి, కొడియేరి బాలకృష్ణన్, కరుణానిధి వంటివాళ్ళు సంతుష్టీకరణకు అనుగుణంగా హిందువులనే లక్ష్యంగా చేస్తూవచ్చారు. హిందువులను అదేపనిగా తిడుతూ నాయకులుగా ఎదగవచ్చనదే వాళ్ల రహస్య ఎజెండా. వాళ్లు అనునిత్యం వార్తల్లో ఉండాలంటే ఇంతకన్నా ఉత్తమ మార్గం ఇంకోటి లేదు. ఈ ‘మెజారిటీ ద్వేషులు’ తమిళనాడుకు అతి సమీపంలోని శ్రీలంకలో ఇటీవల బాంబు పేలుళ్ళు జరిగి సుమారు 300 మంది మరణించిన ఘటనకు సంబంధించి ‘ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల’ (ఐసిస్) గురించి పనె్నత్తి మాట్లాడారా? ఫ్రాన్స్‌లో ఓ పత్రిక గీసిన వివాదాస్పద కార్టూన్ ఫలితంగా ఎంతమంది బలయిపోయారో వాళ్లకు తెలియదా? ఇపుడు మన దేశంలో ఈ రాజకీయ క్రీడ దేశ రక్షణను ప్రమాదంలోకి నెడుతుందని వీళ్లకు తెలుసా?


ఓట్ల వేట కోసం ఈ దేశంలో ఎవరు ఎలాగైనా మాట్లాడవచ్చు. అదీ ముఖ్యంగా హిందువులను ఎంత తీవ్రంగానైనా నిందించవచ్చు. ‘హిందూ తీవ్రవాదం’ అనే పదబంధాన్ని సృష్టించి నిరూపించేందుకు ‘మాలేగావ్ పేలుళ్ల’ను ఆధారం చేసుకున్నారని సాధ్వీ ప్రజ్ఞ ఇటీవల నెత్తీ నోరూ కొట్టుకొని చెప్తున్నది కదా? సుశీల్ కుమార్ షిండే, పి.చిదంబరం, దిగ్విజయ్‌సింగ్ వంటి నాయకులు ముస్లిం సంతుష్టీకరణ కోసమే ఇలాంటి చర్యకు పాల్పడ్డారని సాధ్వి బహిరంగంగా చెప్పింది. ఇపుడు దేశంలో ఓట్లకోసం ఎలాంటి దుశ్చర్యకైనా దిగేందుకు తీవ్రవాదుల కన్నా ఘోరమైన పనులు చేస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. వీళ్లందరి లక్ష్యం హిందూ సంస్థలే. అంతెందుకు..? ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతమార్పిడి కూటములను హేతుబద్ధంగా, తార్కికంగా ఎదుర్కోవడానికి శివశక్తి అనే ఆధ్యాత్మిక చైతన్య వేదిక పనిచేస్తున్నది. ఎన్జీవో నిధుల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆశల ప్రలోభాలతో మత మార్పిడి విస్తృతంగా ఒకపుడు జరిగేది. ఈ సంస్థ ద్వారా కొందరు యువకులతో కరుణా సుగ్గున, చట్లపల్లి కల్యాణ్‌కుమార్ వంటివారు ఓ నిశ్శబ్ద విప్లవం తెచ్చారు. 


ఇటీవల ‘నేనే దేవుణ్ణి’ అనే షార్ట్ ఫిలిం రూపొందించి, యూట్యూబ్ చానళ్లలో విడుదల చేశారు. లక్షలాదిమంది ఆ చిత్రాన్ని వీక్షించారు. అందులో క్రైస్తవ మతాన్నిగాని, యేసుక్రీస్తును గాని లేశమాత్రమైనా అవమానించలేదు. మత మార్పిడి చేస్తున్న వ్యక్తుల తప్పులను బయటపెట్టారు. దానిపై కొందరు కల్యాణ్‌పై కేసుపెట్టి అరెస్టు చేయించారు. ఈ దేశ మెజార్టీ ప్రజల మతభావాలను ఎంతమంది నటులు, దర్శకులు నిందించారో కనీసం లెక్కపెట్టగలమా? యముడు- కఠోపనిషత్తును నచితకేతుడికి ప్రబోధించిన ధర్మవేత్త. అలాంటి యముడి పాత్రతో ‘యముడికి మొగుడు’ అనే పేరు పెట్టి ఓ మహానటుడు సినిమా తీసి ఆడించాడు. నారదుడు మహర్షుల్లో చాలా గొప్ప వ్యక్తి. అతని పాత్రను ‘చిచ్చులు పెట్టే కొండెగాడి’గా మార్చినవాళ్లను ఏం చేయాలి? సీతను, ద్రౌపదిని అవమానిస్తూ, నమక చమకాలను పాటల్లో అవమానిస్తూ ఎందరో చలన చిత్రాలు తీస్తే మెజార్టీ ప్రజలు ఎన్నికేసులు పెట్టాలి? ఇదొక ఉదాహరణ మాత్రమే!

ఇలా హిందువులను అవమానించి సొమ్ము చేసుకోవడం కొంతమంది ఓ అలవాటుగా మార్చుకున్నారు. నిజానికి కమల్‌హాసన్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? గాడ్సే గాంధీని చంపడం ఈ దేశంలో ఎవరూ ‘జస్టిఫై’ చేయరు. కానీ చారిత్రక తప్పిదాల్లో మహాత్మా గాంధీ భాగస్వామ్యాన్ని చరిత్రకారులు ప్రశ్నించకుండా ఉండలేరు. ఇప్పటికీ 1917 తర్వాత- గాంధీ రాజకీయ అరంగేట్రం జరిగాక ఈ సంతుష్టీకరణకు బలం ఏర్పడిందని భావించేవారు ఎందరో ఉన్నారు. దేశ విభజన పేరుతో మహమ్మదాలీ జిన్నా ఎన్ని హత్యలు చేయించి ‘ఖాయిదే ఆజం’ అయ్యాడో కమల్ హాసన్ చెప్పగలడా? 16 ఆగస్టు 1946 నుండి 1947 చివరి వరకు జస్టిస్ ఖోస్లా చెప్పినట్లు పది లక్షలమంది మరణించారు. వీళ్లను చంపింది ఉగ్రవాద మనస్తత్వం గలవాళ్లా? దేవదూతలా? 1921 నుండి 1947 వరకు ఈ దేశ రాజకీయం ఎంత సంక్షోభం అనుభవించిందో మెహర్ చంద్ ఖన్నా రచించిన ‘లుకింగ్ బాక్’ పుస్తకం కమల్‌హాసన్ చదివితే అవగతమవుతుంది.
బెంగాల్ విభజన జరిగినప్పటి నుండి- లార్డ్ కర్జన్ మొదలుకొని లార్డ్ వౌంట్ బాటన్ వరకు హిందువులపై జరిగిన కుట్రలకు మహాత్మాగాంధీయే కారణమని ఈ రోజుకూ ఈ దేశంలో చాలామంది భావిస్తున్నారు. నాథూరాం గాడ్సే అంతకుముందు ఏనాడూ తీవ్రవాది కాదు. ఆనాటి రాజకీయ పరిస్థితులు వారిలో అభద్రతను పెంచాయి. అంతేకాక జవహర్‌లాల్ నెహ్రూ ఏనాడూ హిందువులపై కనికరం చూపించలేదు.


దానికి ఆనాటి ప్రముఖ రాజనీతివేత్త గాడ్గిల్ మాటలే సాక్ష్యం. "Nehru was the sevearest critic of the Hindus and constantly accused the Hindu Mahasabha and the RSS having the disign to him firm India into a Hindu Theocracy''. ఇలాంటి ఘటనలు, ఆలోచనలు ఈ తరంలో మనకు తెలియకపోవచ్చుగానీ బహుశా! గాడ్సేని ఉద్రేకపరిచి ఉండవచ్చు. అంతేగాక ఈరోజు లౌకికవాదం పేరుతో గొంతుచించుకుంటున్న మమతా బెనర్జీ పాలిస్తున్న బెంగాల్‌లోని ఓ ముక్కను ఎవరికి ఎవరు ధారాదత్తం చేయించారు? 16 జూన్ 1946లో ప్రత్యక్ష చర్య నిర్మాణకర్త సుహ్రవర్దీ వౌంట్ బాటన్ సలహా మేరకు కుటిలబుద్ధితో గాంధీ దగ్గరకు వచ్చాడు. ఇందులో సుహ్రవర్దీ ‘బెంగాల్ మొత్తాన్ని ప్రత్యేక దేశం’గా మార్చుదామని ప్రతిపాదించాడు. ఈ ఉచ్చులో గాంధీజీతో పాటు బెంగాల్ నాయకుడైన శరత్‌చంద్రబోస్ లాంటివారూ చిక్కుకొన్నారు. బెంగాల్‌ను రహస్యంగా పాకిస్తాన్‌లో కలిపేందుకు ఇదో రహస్య తంత్రమని హిందూమహాసభ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బయటపెట్టాడు. గాడ్సే ఎదిగిన ‘హిందూ మహాసభ’ లేకపోతే ఈ రోజు మమత ఎక్కడ పాలించేది? ఆమె తోక పట్టుకు తిరుగుతున్న చంద్రబాబు ఎవరికి భజన చేసి మద్దతుగా నిలిచేవాడు.

అలాగే గాంధీ ప్రదర్శించిన అలసత్వం వల్ల తమిళ ప్రాంతం గురించి వాస్తవం తెలిస్తే- కమల్ హాసన్ వ్యా ఖ్యలు ఎంత అజ్ఞాన పూరితమో అర్థం అవుతుంది. పాకిస్తాన్‌లాగే ద్రవిడస్తాన్ ఏర్పడాలని ఇ.వి.రామస్వామి నాయకర్ కుతంత్రం పన్నాడు. 1944లోనే ద్రవిడస్తాన్ డిమాండ్ కోసం బ్రిటీష్ వాళ్లను ఒప్పించాలనే కుట్రతో నాటి జస్టిస్ పార్టీ వృద్ధ నాయకుడు ‘పన్నీర్ సెల్వం’ను రహస్యంగా బ్రిటన్‌కు పంపించాడు. బ్రిటీష్‌వారికి బంటులా పనిచేసిన పన్నీరు సెల్వం విమాన ప్రమాదంలో మరణించడం వల్ల ఆ కుట్ర మధ్యలో ఆగిపోయింది. ఇవన్నీ ఏ హిందూ మహాసభ నాయకుడో చెప్పలేదు. కమల్‌హాసన్ పార్టీ పెట్టి- ‘నేను అపర కమ్యూనిస్టును’ అన్నాడు కదా! ఆ కమ్యూనిస్టు పార్టీ నేత మోహనకుమార మంగళం రాసిన ‘ది ట్రూత్ అబౌట్ డీఎంకే’ అనే వ్యాసం (1962)లోని అమృత వచనాలు ఇవి! 1948 జనవరి 30న గాంధీ హత్యగావించబడ్డాక ఇదే పెరియార్ భారతదేశాన్ని ‘గాంధీనాడు’గా మార్చాలన్నాడు, ‘గాంధీమతం’ పెట్టాలన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే గాంధీ బొమ్మలు తగులబెట్టించి, రిపబ్లిక్ డేను సంతాపదినంగా ప్రకటించాడు. ఇదంతా హిందూ శిథిలాల క్రింద జరిగిన చరిత్ర. అంతెందుకు? 1971లో బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండ చేసింది ఎవరు? 1990ల్లో కాశ్మీరీ పండిట్ల వలసకు కారణం ఎవరు? 1947 నుండే సుమారు లక్షమంది హిందువులు ఎందుకు చనిపోయారు? ఇదంతా వర్తమాన చరిత్ర. ఏదీ లేకుండా అజ్ఞానంతో కమల్‌హాసన్ లాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలకు 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారెన్ హేస్టింగ్స్ మాటలే సమాధానం. "Extreem frankness of Common Hindus it comes when there is nothing to hide to manpulate, to fear utmost reverense for truth and truth alone''. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలను తిట్టడం వల్ల తాము పెద్దవాళ్లం అవుతామనే సంస్కృతి నానాటికీ పెరుగుతున్నది. *


************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *
* శుక్రవారం : మే 17 : 2019 *

ఓ ఊళ్లో రచ్చబండ మీద జనం పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు. అందులో ముల్లా నసీరుద్దీన్ కూడా ఉన్నాడు. అందులోంచి ఓ పెద్ద మనిషి ‘‘నసీరుద్దీన్ గారూ! మీవయస్సెంత?’’ అన్నాడు. దానికి ముల్లా తడుముకోకుండా ‘‘నలభై ఏళ్ళు!’’ అన్నాడు. దానికి పెద్దాయన ‘‘పదేళ్ల క్రితం అంతే చెప్పారు.. మళ్లీ ఇప్పుడూ నలభై ఏళ్లు అంటూ బుకాస్తారా? మీ వయస్సు పెరగదా?’’ అన్నాడట. దానికి ముల్లా నసీరుద్దీన్ ఏ మాత్రం తడుముకోకుండా ‘‘మాది మాట తప్పే వంశం కాదు. మేం ఎప్పుడూ ఒకేమాటపై ఉంటాం’’ అన్నాడట! మన దేశంలో కమ్యూనిస్టులు కూడా అంతే! భారతదేశంలో ఎర్రదండుకు పాదు పుట్టి 90 ఏళ్లు దాటినా ఒకే పంథా. మతిలేని గతి తార్కిక భౌతికవాదాన్ని వల్లెవేయడం తప్ప మార్పు చెందని ‘ఎర్రన్నల’ను చూస్తే జాలేస్తుంది. ఇటీవల వామపక్ష అవవేషం సీతారాం ఏచూరి మరోసారి ఎర్ర పైత్యం వెళ్లగక్కాడు. ‘రామాయణ, మహాభారతాల్లో హింసాప్రవృత్తి నిండి ఉందని’ దాని సారాంశం.


అన్యమతస్థులు లేదా తమకు నచ్చని స్వమతస్థులు, వాళ్ల దృష్టిలోని కాఫిర్లను కళ్లకు గంతలు గట్టి తుపాకీతో పేల్చేస్తున్న ‘ఐసిస్ ఉగ్రవాదం’ గురించి, ఇస్లామిక్ స్టేట్ దారుణాలను గురించి గాని ఈ మేధావి ఏనాడూ నోరు విప్పలేదు. మన కళ్లముందు, వర్తమానంలో జరుగుతున్న మతహింసకు మద్దతు పలుకుతూ ఈ దేశ సంప్రదాయానికి, సంస్కృతికి రెండు కళ్లలాంటి భారత, రామాయణాలపై విషం చిమ్మడం వామ‘పక్షపా(వా)తం’ తప్ప ఇంకొకటి కాదు. డాంగే, నంబూద్రిపాద్ నుండి సీతారాం ఏచూరి వరకు కరడుగట్టిన ‘పిడివాదం’ మరోసారి బట్టబయలైంది. రొమిల్లా థాపర్, ఆర్.ఎస్.శర్మ, రామచంద్ర గుహ వంటి ‘ఎర్ర కామెర్ల’ చరిత్రకారులతో కమ్యూనిష్టులు భారతీయ చరిత్రను ధ్వంసం చేయగలిగారు. కానీ ఈ దేశ సామాన్య ప్రజల గుండెల్లో గుడికట్టుకొన్న భారత, రామాయణ ఇతిహాసాలను ధ్వంసం చేయలేకపోయారు. ఇటీవల ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చల్లో ఉండాలని కొందరు అనుకుంటున్నారు. కానీ సీతారాం ఏచూరి లాంటి వ్యక్తి ఇలాంటి కుత్సిత వ్యాఖ్యలు చేసి ఎవరి మెప్పు పొందాలనుకుంటున్నాడో అర్థం కాదు. ప్రకాశ్ కారత్ లాంటి నేత కమ్యూనిస్టులను ఓటమిపాలు మాత్రమే చేశాడు. కానీ సీతారాం ఏచూరి వాళ్లకు వున్న గ్రాఫ్‌ను మరింత తగ్గిస్తున్నాడు. 1980 ఎన్నికల్లో వామపక్షాలు పశ్చిమ బెంగాల్‌లోనే ఏకంగా 38 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. అదే 2014కు వచ్చేసరికి బెంగాల్‌లో రెండే సీట్లు గెలుచుకునే పరిస్థితికి దిగజారిపోయారు. అలాగే 2016 నాటి పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో 295 స్థానాల్లో వామపక్షాలు కేవలం 28 సీట్లకు పరిమితం కావడం వెనుక వున్న కారణాలు ఏమిటని ఏచూరి ఎన్నడూ విశే్లషించుకోడు? 2004లో నాలుగు వామపక్షాలకు కలిపి 59 మంది ఎంపీలు వుంటే 2014లో ఆ సంఖ్య 11కు పడిపోయింది. ‘వామపక్ష విదురుడు’ మాణిక్ సర్కర్ ఇంటిముఖం పట్టాడు. బెంగాల్‌లో కమ్యూనిస్టుల స్థానాన్ని మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ భర్తీ చేస్తున్నది. కేరళలో ఇపుడు కమ్యూనిస్టులు భాజపాతో తలపడుతున్నారు. వామపక్షాలకు నెలవుగా వున్న త్రిపుర, కేరళ, బెంగాల్‌లలో వారి పరిస్థితి అగమ్యగోచరం అయింది.



కారల్ మార్క్స్ సిద్ధాంతం అంతా ఆర్థిక వ్యవస్థపై నిర్మాణమై ఉన్నా ఈ దేశంలో వామపక్షాలు పాలించిన ఏ రాష్ట్రం ఆర్థిక ప్రగతి అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా లేదు. అలా ఆలోచిస్తే సంప్రదాయ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాలే ఎక్కువ ప్రగతి సాధించాయి. భావస్వేచ్ఛకు, అణచివేతకు ‘టేకేదార్లుగా’ మాట్లాడే వామపక్షాలు వారి రాష్ట్రాల్లో శాంతిదూతల్లా పాలించింది ఏమీ లేదు. వామపక్ష పాలనలోనే వున్న పశ్చిమ బెంగాల్‌లోనే వందలాదిమంది ఆనంద్ మార్గ్ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. నందిగ్రాం, సింగూరులలో వామపక్ష ప్రభుత్వం చేసిన హింస మమతా బెనర్జీకి అధికారం తెచ్చిపెట్టింది. ఇక దేశ వ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదుల హింసకు లెక్కనేలేదు. పాకిస్తాన్, చైనాతో చేసిన యుద్ధాల్లో మరణించిన సైన్యం కన్నా నక్సలైట్లు, మావోయిస్టులు జరిపిన హింసలో ఎక్కువమంది చనిపోయారు. ‘కంటికి కన్ను- పంటికి పన్ను’ సూత్రంతో నేపాల్ నుండి దండకారణ్యం వరకు మావోయిస్టుల రెడ్ కారిడార్‌లో హింసకు హద్దే లేదు. ఎందరు గిరిజన బిడ్డలను, ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల నెపంతో నక్సలైట్లు కాల్చి చంపారో ఏచూరి లెక్కచెప్పగలడా? నేపాల్‌లో ఎంత హింస చేస్తే ఏచూరి మిత్రుడైన పుష్పక కమల్ దహల్ ప్రచండ సింహాసానికి దగ్గరయ్యాడో ఈ ఎర్రన్న లెక్క తేల్చగలడా? రామాయణంలో లేని (ఉత్తరకాండలోని) శంభూక వధ కథను చూపించి ఈ దేశ బహుజన వర్గాలను రెచ్చగొడుతున్న వామపక్షాలకు ‘మావోయిస్టు హింస’ కళ్లకు కన్పించడంలేదా? రాముడు తన భార్యను కిడ్నాప్ చేసిన రావణాసురుడిని మాత్రమే టార్గెట్ చేశాడు. మరి వామపక్ష పార్టీలు ఈ రోజు కేరళలో తమకు నచ్చని ఆరెస్సెస్, బిజేపీ కార్యకర్తలను బహిరంగంగా నరికి చంపుతుంటే ఏచూరి కళ్లు మూసుకుపోయాయా?



స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం సీతారాం ఏచూరి వంటి అహింసామూర్తికి తెలియకపోవడం విడ్డూరం. కేరళలోని మల్లపురాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలని ముస్లిం లీగ్, కమ్యూనిష్టులు కలిసి ఆనాడు హిందువులపై అత్యాచారాలు సీతారాం ఏచూరి దృష్టిలో అశ్వమేధయాగాలా?



అహింస, ఐక్యతలను గురించి మాట్లాడే హక్కు ఈ దేశ వామపక్షాలకు ఉందా? ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని మేడే నాడు జెండాలు ఎగిరేసే వామపక్షాల నాయకులు ఈ దేశంలోని 8 కమ్యూనిస్టు పార్టీలను ఎప్పుడైనా ఏకం చేయగలిగారా? చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఓవైపు ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తుంటే, ఇక్కడి కమ్యూనిస్టులు రోహింగ్యాలకు వేలు విడిచిన చుట్టాల్లా వ్యవహరిస్తారా? కమ్యూనిజం పుట్టిన చైనా, రష్యాలే స్వేచ్ఛాయుత ఆర్థిక రంగం వైపు అడుగులేస్తుంటే ఇక్కడి వామపక్షాలు తమ గుడ్డి వ్యతిరేకతతో మన దేశ వినాశనం కోరుకుంటారు. 1848 నాటి కమ్యూనిస్టు పార్టీ చెప్పిన ‘ఇప్పటివరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే’’ అన్న వాక్యం ఇప్పటికీ ఇక్కడి కమ్యూనిస్టులు పరమ పవిత్ర వేదవాక్కులా భావిస్తారా? భారతీయతలోని సనాతన ధార్మిక, సాంస్కృతిక వాదాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తారా?



‘మతం మత్తుమందు’ అని మార్క్స్ తాతల కాలం నాడు.. అదీ ఐరోపా సమాజంలోని క్రైస్తవ మత వికృతులను చూసి చెప్పాడు. అది యథాతథంగా భారతీయ సమాజానికి కమ్యూనిస్టులు ఆపాదించుకొన్నారు. హిందూత్వాన్ని తిట్టడమే కమ్యూనిజం అన్న స్థాయికి దిగజారిన ఈ ‘ఎర్రబాబులు’ వీర సావర్కర్‌ను శివాజీని, గాంధీని, వివేకానందుడిని, నేతాజీని ఆఖరుకు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కూడా తిట్టిపోశారు. తర్వాత వాళ్లందరికీ ఒక్కొక్కరుగా ఇపుడు క్షమాపణలు చెప్పి ‘చారిత్రక తప్పిదాల’ లిస్ట్‌లో వేసేస్తున్నారు. అదే కోవలో సీతారాం ఏచూరి ఇపుడు రామాయణ, భారతాలను నిందిస్తున్నాడు. ఇన్నాళ్లు క్షమాపణ చెప్పి లెంపలేసుకోవడానికి పార్టీ ఉండేది. ఇపుడు కమ్యూనిజం భారతదేశంలో అవసాన దశలో శవమై ఉందని ఆ పార్టీల నుండి బయటకు వచ్చిన మేధావులే చెబుతున్నారు. ఇపుడు ఏచూరి మాటలను ఆ కుళ్లిన శవాల నుండి వచ్చే కంపుగానే భావించాల్సి వస్తుంది. కేరళలో ఇటీవల ‘ఎచ్చుతచ్చాన్’ రామాయణ పఠనం పునఃప్రారంభమయ్యిందని తెలుస్తున్నది. 17వ శతాబ్దంలో మలయాళంలో తుంచతత్తు రామానుజన్ రచించిన ఈ రామాయణంలో వర్షఋతువులో ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు చెప్పడం అక్కడి సంప్రదాయం.. అది తిరిగి ఇటీవల మొదలైంది. ఇదే కేరళలో కమ్యూనిస్టులు వినాయకచవితి నిర్వహించే పరిస్థితి కింది స్థాయిలో నెలకొంది. బెంగాల్‌లో రామనవమి, హనుమజ్జయంతి ఉత్సవాలకు ఇటీవల మమతా బెనర్జీ అడ్డుకొంటుంటే కింది స్థాయి వామపక్ష కార్యకర్తలే ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్న సంగతి సీతారాం ఏచూరి లాంటి హేతువాది ఎప్పుడు గ్రహిస్తాడు? మతానికీ, మతతత్వానికి మధ్య భేదం గ్రహించలేని కమ్యూనిస్టులకు హిందువులపై గుడ్డి వ్యతిరేకత తప్ప ఇంకేమీ లేదు.



ఈ దేశంలో శ్రీరాముడిని అధికంగా ప్రేమిస్తారు, పూజిస్తారు. కానీ అదే రాముడిని తన భక్తుడే వ్యతిరేకిస్తే ఎలా వుంటుందో శ్రీరామాంజనేయ యుద్ధం పేరుతో ఓ కల్పిత గాథ సృష్టిస్తారు. ఇంతకన్నా తిరుగుబాటు మనస్తత్వం ఏ మతంలో ఉంది? ఆ కథనూ భక్తిపూర్వకంగా స్వీకరిస్తారు. ఎక్కడో పుట్టిన మార్క్స్, లెనిన్, ఏంజిల్స్, చెగువేరా, స్టాలిన్‌లను దేవుళ్లుగా భావించే కమ్యూనిస్టులు ఈ దేశం కోసం మట్టిపాలైన నేతాజీ, శివాజీ, ఆజాద్, సావర్కర్‌లను విమర్శిస్తారు. మార్క్స్‌ను మహాభక్తితో ఆరాధించే ఈ ఎర్ర మేధావులు శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని తిట్టిపోస్తారు. వాళ్ల దృష్టిలో రామాయణ, భారత గాథలు కల్పితాలని ఎన్నో పుస్తకాలు రాస్తారు. వాళ్లు చెప్పినట్లు కల్పిత గాథల్లో జరిగిన హింస కన్నా మావో సేటుంగ్, జోసెఫ్ స్టాలిన్ చేసిన క్రూరమైన హింస ఎక్కువే కదా? లక్షలాదిమందిని గ్యాస్ చాంబర్లలో చంపిన ఈ నియంతల కన్నా రాముడు, కృష్ణుడు చేసిన హింస ఎక్కువా? మావో, స్టాలిన్, నక్సలైట్లు, మావోయిస్టులు చేసిన హింస మన కళ్ల ముందు మనం జీవిస్తున్న కాలంలో జరిగింది కదా!



లెనిన్ ప్రతి సోషలిస్టూ నాస్తికుడై ఉండాలని చెప్పినప్పటికీ- మన దేశంలో కమ్యూన్టిలెందరో ఆస్తికులుగా జీవించారు కదా? హరికిషన్ సింగ్ సూర్జిత్ ఏనాడూ సిక్కు మతస్థుడిగా తన తలపాగా తొలగించలేదు కదా? తెలంగాణ సాయుధ పోరాటంలో బలవలంతంగా హిందువులను రజాకార్లు మతం మార్చితే కమ్యూనిస్టులు తిరిగి హిందూమతంలోకి తెచ్చిన విషయం తెలుసా? హింస గురించి నీతి సూత్రాలు వల్లిస్తున్న ఏచూరి పశ్చిమ బెంగాల్‌లో ఆనాటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఐఎస్‌ఐ కార్యకలాపాలపై మదర్సాలలో మతోన్మాదం బోధిస్తున్నారని, దానిపై చర్యలకు దిగేందుకు సిద్ధపడితే ఇదే సంతుష్టీకరణ బుద్ధితో మార్క్సిస్టు పార్టీ ఆయనను అడ్డుకొన్నది! అంతెందుకు? తమ సంతానాన్ని తామే చంపుకునే కొన్ని క్రూరజంతువుల్లా ఆ పార్టీని ప్రశ్నించిన ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. హంగరీ కమ్యూనిస్టు నేత ఇమ్రెనాగే ‘కమ్యూనిస్టులను విధ్వంసవాదులు’ అన్నందుకు 1956లో సాయుధ రష్యన్లు ఆయనను ఉరితీశారు. 1991లో సోవియట్ అధ్యక్షుడు గోర్బచేవ్‌ను కమ్యూనిస్టు గెనె్నడీ యెనయేవ్ నాయకత్వంలో ఎంత చిత్రహింసలకు గురిచేశారో ప్రపంచం చూడలేదా?



1934లో సోవియట్ కమ్యూనిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులైన 139 మందిలో ఆ తర్వాత కమ్యూనిస్టు అరాచకాల్లో అందులోని 70 శాతం సభ్యులు దేశద్రోహ నేరం కింద కాల్చి చంపిన హింసాకాండను ఏచూరి ఏమారితే ఎలా? ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులు జరిపిన హింసనూ, బ్రెజ్నేవ్, డెంగ్, మావోసేటుంగ్, స్టాలిన్, హోనేకర్, న్యూసెస్క్యూ, కాశ్మీరీ వేర్పాటువాదుల్లో హింసను వెదకడం విడ్డూరం కాక ఇంకేమిటి? అంతేగాకుండా రామాయణం కానె్సప్ట్‌తో వాళ్ల తల్లిదండ్రులు పెట్టిన పేర్లు సీతారాం ఏచూరి, కె.నారాయణ, బి.వి.రాఘవులు హింసావాదులా? అహింసావాదులా? ప్రపంచం మొత్తం మారినా మీరు మారరా?


************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *





మానవులు నానాటికీ సాంకేతికంగా, ఆర్థికంగా ఎదిగిపోతున్నారు. ఖండాంతరాలకు వెళ్లి ధన సంపాదన చేస్తున్నారు. అన్ని రకాల హద్దులూ దాటి హాయిగా జీవించగలుగుతున్నారు. కానీ.. మానవత్వంతో మనుషులుగా మాత్రం జీవించలేకపోతున్నారు. అనేక మానసిక సంఘర్షణలతో, భౌతికమైన వ్యాకులత్వంతో బతికేస్తున్నారు. అంతులేని ఆశల వెంబడి పరుగెత్తుతున్నారు. ఈ సంఘర్షణల చట్రం నుండి బయటపడి.. కేవలం బతకడం కాకుండా జీవించాలంటే.. మానవత్వ పరిమళాలను సమాజానికి అందించాలంటే.. మూడు సంస్కార కేంద్రాలు మళ్లీ పురుడుపోసుకోవాలి. అవే.. అమ్మఒడి-గుడి-బడి. ఈ మూడూ మనుషుల్ని సంస్కరించే మహత్తర కేంద్రాలు.

అమ్మ ఒడి ఎంత గొప్పదో చెప్పడానికి ప్రహ్లాదుడి కథే నిదర్శనం. తన బిడ్డను హరిభక్తుడిగా మార్చి దుష్ట హిరణ్య కశ్యప సంహారానికి కారణభూతురాలైన లీలావతి తల్లిగా తన పాత్ర గొప్పగా నిర్వహించింది. ఛత్రపతి శివాజీని అకుంఠిత దీక్షాదక్షునిగా మలచిన ఆయన మాతృమూర్తి జీజాబాయి. ఇక ఆధునిక కాలంలో ఎందరో తల్లులు గొప్ప బిడ్డలను ఈ సమాజానికి అందించారు. అందుకే.. ‘మాతృదేవో భవ’ అంటూ తల్లికే పెద్ద పీట వేసింది మనధర్మం. మానవులకే కాకుండా పశుపక్ష్యాదులకు సైతం తల్లి ప్రేమ అమృతం. బిడ్డలను తీర్చిదిద్దడంలో అమ్మ పాత్ర గొప్పది. మొదటి గురువుగా తల్లి ఈ ప్రపంచాన్ని శిశువుకు పరిచయం చేసి.. తనలోని గొప్ప సంస్కారాలను బిడ్డలకు అందించాలి. తన బిడ్డలను మోసగాళ్లుగా, నేరగాళ్లుగా, అసత్యవాదులుగా కాకుండా అమృత పుత్రులుగా తీర్చిదిద్దాలి. సమాజం-దేశం-ధర్మం ఈ మూడింటి పట్ల బాధ్యతగల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.

ఇక, మానవులకు రెండవ స్ఫూర్తి కేంద్రం గుడి. దేవాలయాలు కేవలం దేవుళ్లను అర్చించే కేంద్రాలు కావు. మన ఆగమశాస్త్రకారుల ఆలోచన అదికానేకాదు. ఆలయాలు మానవ సంస్కార కేంద్రాలు. సమాజ పునర్నిర్మాణ కేంద్రాలు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటే ఇదే. ఏమీ పాలుపోని మనిషి నిస్సహాయతతో దరిచేరినప్పుడు ఆదరించే పుణ్యమూర్తే భగవంతుడు. మనిషి తన సంపాదన తన కోసమే ఖర్చుచేసుకోకుండా.. పరులకూ ప్రసాదరూపంలో పది ముద్దలు పెట్టేందుకు అవకాశం కల్పించే ప్రాసాదమే దేవాలయం.

అదేవిధంగా బడి.. వ్యక్తిని తీర్చిదిద్ది సమాజానికి అందించే మూడో సమున్నత సంస్కార కేంద్రం. అయితే నేడు ప్రభుత్వ విద్య, ప్రైవేటు విద్య.. ఈ రెండూ వ్యక్తిని యాంత్రికంగా సిద్ధం చేస్తున్నాయి. మనుషుల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నారు కానీ మనుషులుగా మార్చడం లేదు. మానవవనరులు, ప్రాచీన విలువలు అత్యధికంగా ఉన్న మనలాంటి దేశంలో వెంటనే ఈ సంస్కారం విద్యావ్యవస్థకు కలిగించకపోతే కొందరు ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పినట్లు మానవ జాతి మనుగడకే ముప్పురానుంది దీనికి విజ్ఞులైన వారు నడుంకట్టాలి.

******************************
   డాక్టర్. పి. భాస్కర యోగి 
నవ్య : నివేదన: పరంజ్యోతి  
ఆంధ్రజ్యోతి : సోమవారం 
06-05-2019


పండిత మదనమోహన మాలవ్యా స్వాతంత్య్ర సమరంలో గొప్ప దేశభక్తుడు. వందేళ్ల క్రిత మే విద్య ఆవశ్యకతను గుర్తించాడు. అందుకోసం దేశమంతా తిరిగి చందాలు పోగుచేసి కాశీలో బనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. మాలవ్యాకు తెలియకుండా ఆయన సమీప బంధువు ఒకరిని ఆ విశ్వవిద్యాలయ అధికారులు ఓ పెద్ద ఉద్యోగంలో నియమించారు. ఈ విషయం తెలిశాక మాలవ్యా డా.రాధాకృష్ణన్‌కు లేఖ రాసి ‘వెంటనే నా బంధువును విధుల్లోంచి తొలగించాలని’ కోరారు. ఆనాటి నాయకుల, విద్యావేత్తల నిజాయితీకి ఇది తార్కాణం. ఇపుడంతా ‘క్విడ్‌ప్రోకో’ పద్ధతిలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి.


బహుళజాతి మందుల కంపెనీలు ఎనాడో మన వైద్య విధానాన్ని కబ్జా చేశాయి. మందులు వాళ్లే ఇస్తారు, రోగం వచ్చేట్టు వాళ్లే చేస్తారు. ఆ రోగం తగ్గేలా మందునూ వాళ్లే కనుగొంటారు. ఇదంతా కార్పొరేట్ ఆస్పత్రుల ముసుగులో జరుగుతున్న దోపిడీ. ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీ చేసి- అటు ఆస్పత్రులకు, మందుల కంపెనీలకు, ఇటు నిరుపేద రోగికి మేలు చేకూర్చేలా యత్నించడం విశేషం! ప్రాణాలను పణంగా పెట్టే వైద్యానే్న మనం ఈ పద్ధతిలోకి దిగజార్చాక, ఇక ఎపుడో చచ్చిపోయే విద్యావిధానం ఎవరికి పట్టింది?
తెలంగాణలో ఇపుడు ప్రతిపక్షాలకు దొరికిన ఏకైక అస్త్రం ‘ఇంటర్ విద్య’. ఇక్కడ ఇంటర్ విద్య ప్రక్షాళన కన్నా కేటిఆర్‌ను దోషిగా నిలబెట్టాలనే రాజకీయం ఉన్నది వాస్తవం. గ్లోబరీనా అనే సంస్థ దాని జాయింట్ పార్ట్‌నర్ మాగ్నిటిక్ సంస్థలతో కేటిఆర్‌కు సాన్నిహిత్యం ఉండడం వల్లే టెండర్లు వారికి దక్కాయని కాంగ్రెస్, భాజపాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమని ప్రజలని నమ్మిస్తే తెరాస ప్రభుత్వ ‘విశ్వసనీయత’ దెబ్బతింటుందన్నది వాస్తవం. మదన్ మోహన్ మాలవ్యాలా ఇపుడు విరాళాలు పోగుచేసి విద్యాలయాలు స్థాపించాల్సిన అవసరం లేదు. ఉన్నవాటిని పరిరక్షిస్తే చాలు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అనేక ప్రయోగాలు జరిపి ‘తెలుగు రాష్ట్రాల ప్రాథమిక విద్యను’ ప్రయోగశాలగా మార్చారు.

తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ చెప్పిన విషయం ఇప్పటికీ తలచుకుంటే అద్భుతం అనిపిస్తుంది. ‘మండలంలోనే అన్ని స్కూళ్లు సమీకృతంగా ఒకచోట నడిపిస్తాం’’ అన్నమాట ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది. కానీ తెలంగాణ వచ్చాక కులాల పేరిట ఏర్పడ్డ గురుకులాలు భవిష్యత్తులో కులవాదంతో సమాజాన్ని ప్రమాదంలో పడవేసే ప్రమాదం ఉంది. అలాగే మైనారిటీ గురుకులాలు- ఆ వర్గాలకు ఇప్పటికే వున్న ప్రత్యేకతను మరింత పెంచే ప్రమాదం ఉంది. వాటిలో చ దివే విద్యార్థులు ఓ పదేళ్లలో కులవాదులుగా, మతవాదులుగా మారితే.. సమాజ స్థితి అగమ్యగోచరం అవుతుంది. గురుకులాల్లో నాణ్యమైన వి ద్య అందించినట్లే అన్ని కులాలను కలగలిపి అందిస్తే కేసిఆర్ ఈ జాతికి గొప్ప మేలుచేసినవారు అవుతారు. వాటిని నడిపించే వ్యక్తులపై కులవాదం పెంచుతున్నారని ఆరోపణ వినిపిస్తున్నది. అయితే, అందులో చదువు చ క్కగా సాగుతుందనడం అందరూ ఒప్పుకోవలసిన సత్యం.

ఇక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా వుంది. ఎక్కడా అమ్ముడుపోని ఎద్దు జట్‌ప్రోల్ అంగట్లో అమ్ముడుపోతుందన్న సామెతలాగా ఎక్కడా సీట్లు దొరక్క, దిక్కులేని స్థితిలో ప్రభుత్వ బడులకు విద్యార్థులు వస్తున్నారు. దానికితోడు ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న అనేక సమస్యలు ఈ వ్యవస్థపై పడి నానాటికీ దిగజారుతోంది. ఉపాధ్యాయ సంఘాల నేతలు శాసన మండలి సభ్యులైనప్పటి నుండి ఫక్తు రాజకీయ నాయకుల్లా మారిపోయి ఏ ప్రభుత్వం వస్తే అక్కడ తాబేదార్లుగా పనిచేస్తున్నారని ఇపుడు ప్రతి ఉపాధ్యాయుని మనస్సు లో వుంది. అందుకే ఇటీవల అధికార పక్షం బలపరచినవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్నది నిష్ఠుర సత్యం. కేసీఆర్ మొదలుకొని ఎందరో ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లే. వాళ్ల ఉపాధ్యాయుల్లో ‘కమిట్‌మెంట్’ ఉన్నది కాబట్టే సీఎం కేసీఆర్ ‘్భష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు’ లాంటి దుష్కర ప్రాస ఉన్న పద్యాన్ని అవలీలగా చదివేస్తున్నారు. అలాంటి అద్భుతమైన ఉపాధ్యాయులెందరో ఇప్పటికీ విద్యారంగంలో ఉన్నారు. కానీ అలాంటివారు మంత్రులకూ, ఎమ్మెల్యేలకూ కన్పించరు. సచివాలయం చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసే వారిని రోజూ చూసిచూసి అందరూ ఇలాంటివారే ఉంటారని అనుకొంటారు. అందుకే మంత్రులూ, నాయకులూ ‘విద్యా వ్యవస్థ నాశనం అవుతుందనే’ వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఇక మరో దురదృష్టకర విషయమేమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో మేధావులు అనగానే ఓ పదిమంది వామపక్ష నాయక మేధావులు కన్పిస్తారు. వాళ్లే విద్యావేత్తలు, సామాజిక సంస్కర్తలు, వాళ్లే సీనియర్ జర్నలిస్టులు, వాళ్లే మానవ హక్కుల సంఘాల నేతలు, వాళ్లే కుల సంస్కరణవాదులు, వాళ్లే టీవీల్లో కూ ర్చొని రాజకీయాలను నిర్దేశించే మేధావులు, వాళ్లే సాహిత్యవేత్తలు..! అన్ని రంగాలను దురాక్రమణ చేసిన ఈ మహనీయులు గత ముప్ఫై ఏళ్ల నుండి ఈ వ్యవస్థలను కబ్జా చేసినవారే. వీరి పోరాటం నిరంతర ప్రవాహం. అది ఓ పట్టాన కొలిక్కివచ్చిన పాపా న పోలేదు. వీళ్ల పోరాటంలో వందమంది ఉంటే ‘మహాధర్నా’ అంటారు. నలుగురు కలసి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం పెడితే ‘రౌండ్ టేబుల్’ సమావేశం అంటారు. వీళ్లు ఈ దేశ ప్రాచీనతను అంగీకరించరు; పాశ్చాత్య విధానాలను ఒప్పుకోరు!

19వ శతాబ్ది మొదటి భాగంలో మన దేశంలో వార్షికంగా రెండు లక్షల టన్నుల నాణ్యమైన ఉక్కు తయారయ్యేది. అది ఇంగ్లాండ్‌లో తయారయ్యేదానికన్నా నాణ్యమైంది, చౌక అయ్యిందని మనం అన్నాం అనుకోండి. వెంటనే వ్యతిరేకిస్తారు. పూర్వం మన దే శంలో ఉన్నత విద్యలో భాగంగా కావ్య సాహిత్యాలు, యుద్ధ శాస్త్రం, వైద్యశాస్త్రం, నౌకాశాస్త్రం నేర్పించేవారు అని ఎవరైనా చెప్తే వామపక్ష మేధావులు ఒంటికాలిపై లే స్తారు. పోనీ విద్యలో నైతిక సూత్రాలను చెప్పే రామాయణ, భారతాలను బోధించాలంటే వాటిని మత గ్రంథాలంటారు. అవన్నీ కల్పితాలు, వాటిలో ఏమీ లేదని వాదిస్తారు. ఈ రెండూ పరస్పర విరుద్ధమైన మాటలు. అయినా మనం ఒప్పుకొని తీరాల్సిందే; ఎందుకంటే వాళ్లు ‘మేధావులు’ కాబట్టి!?

పంజాబ్‌లో 1849లోనే మారుమూల ప్రాంతాల్లోనూ 2 వేలమందికి ఒక పాఠశాల ఉండగా, 1882 నాటికి ప్రతి 10 వేలమందికి ఓ పాఠశాల స్థాయికి మారింది. ఎందుకంటే రాజా రంజిత్‌సింగ్ దేశీయ విద్యాలయాలకు ఎన్నో మాన్యాలిచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి వాటిని దిగమింగిందని లీట్నర్- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్‌ట్రక్షన్- పంజాబ్ నివేదిక బయటపెట్టింది. ఇపుడు పన్నుల రూపంలో వసూలైన సొమ్మును పాఠశాలల కోసం ఖర్చుపెట్టకపోవడం అలాంటిదే.

ఇపుడు విద్యలో నైతికత లోపించింది. దాని దుష్పరిణామాల్లో భాగమే తాజాగా కిల్లర్ శ్రీనివాసరెడ్డి చేసిన హాజీపూర్ హత్యలు. నైతికత ఎందుకన్నట్లు కొందరు స్ర్తివాద సంఘాల ముసుగులో యువతను రెచ్చగొడుతున్నారు. స్వేచ్ఛావిహారం చేయాలని యువతీ యువకులకు పిలుపు ఇస్తున్నారు. కట్టుబాట్లు, సంఘనీతికి మతం ముద్ర వేస్తున్నారు. వర్సిటీల్లో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను పెడద్రోవ పట్టిస్తున్నారు. పడకగది శృంగారాన్ని వెండితెరపైకి ఎక్కించే సినిమా నటులు ఈ రోజు యువతకు సెలబ్రిటీలు! అరవై ఏళ్లు దాటుతున్న వయసులో కొందరు సినిమా నటులు 18 ఏళ్ల నటీమణులతో నటించే వికృత మనస్తత్వం యువకులను ఎటువైపు తీసుకెళ్తున్నది? హైదరాబాద్ లాంటి నగరంలో కాఫీ షాప్‌ల పేరిట నడుస్తున్న హుక్కా సెంటర్లవారు, మత్తుమందులు అందిస్తున్నవారు- విద్యార్థుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. జీడిబంకలా సాగుతున్న టీవీ సీరియళ్లు మహిళా శక్తిని చంపేస్తున్నాయి. ఇన్నిరకాల సంఘర్షణలు, పతనాలను తట్టుకొని నిలబడగలిగే విద్యా విధానం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? కోళ్లఫారాల్లా నడుస్తున్న కార్పొరేట్ కాలేజీలను, స్కూళ్లను కట్టడి చేయలేని దుస్థితి నెలకొంది. ఎందుకంటే అలాంటి సంస్థలను నడిపే వ్యక్తులే మంత్రులుగా కొనసాగుతున్నారు. రోజురోజుకూ కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అందులో మన పిల్లలు చదవడం లేదు!

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఎన్నో కమిషన్లను వేసుకొన్న మనం వాటిని అమలుపరచిన పాపాన పోలేదు. 7 వర్కింగ్ గ్రూపులతో, 12 టాస్క్ఫోర్స్‌లతో గుంపుగా ఏర్పడి సమర్పించిన గొప్ప రిపోర్ట్‌ను తక్షణం అమలుచేయాలని, ‘క్లాస్ రూముల్లో దేశ భవిష్యత్తు మలచబడుతుందని’ అనే వాక్యంతో ప్రారంభించిన డా డి.ఎస్.కొఠారి తన బరువైన, పెద్దదైన నివేదికను చూసి చెప్పిన వాక్యం దాని అమలు ఆవశ్యకతను తెలియజేస్తున్నది."I applagize for the size of the report. It could have been shorter but that would have cost more money and time''. రిపోర్ట్ ఇంత పెద్ద సైజులో ఉన్నందుకు నేను క్షమాపణ చెబుతున్నాను. కావాలనుకుంటే దాన్ని తగ్గించవచ్చు. కానీ దానికి ఇంకా ఎక్కువ డబ్బు, సమయం కావాల్సివస్తుందని అన్నాడు. దురదృష్టం ఏమిటంటే స్వతంత్ర భారతంలో ఏర్పడ్డ మొదటి సమగ్ర విద్యా కమిషన్‌ను తనే నియమించి, ఆ నివేదికను వ్యతిరేకిస్తూ నాటి కేంద్ర విద్యా మంత్రి ఎం.సి.చాగ్లా తన మాట నెగ్గలేదని నిరసనగా మంత్రివర్గం నుండి తప్పుకొన్నారు. ఇదీ ఈ దేశంలో మొదటి నుండి విద్యా విధానంపై జరుగుతున్న దొంగాట. తక్షణం మన విద్యా వ్యవస్థకు మరమ్మతు చేయకపోతే సమాజమే కుళ్లిపోవడం ఖాయం. *


************************************

 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *
* శుక్రవారం : మే 03 : 2019 *