డబ్బు సంపాదన, విదేశీ జీవనం, జీవిత లక్ష్యం అనే సూత్రీకరణ ముందు మన వ్యవస్థలో ఒకవైపు పతనం ప్రారంభం అయ్యింది. మనుషుల మధ్య మానవీయ విలువలను పెంచి అందరిలో ‘నేను’ అన్న ఏకత్వాన్ని ప్రాథమికంగా కల్పించేది కుటుంబవ్యవస్థ. అది సనాతన భారతీయ వ్యవస్థలో ముఖ్యఘట్టం. ఈరోజు అనేక కారణాల వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నది. వక్తుల మధ్య నిస్వార్థం, త్యాగబుద్ధి, పరస్పరమైత్రి, సేవాభావం వంటి మానవీయ లక్షణాలను కుటుంబం మనకు అందిస్తుంది.
 
కానీ ఈ రోజు మనుషుల మధ్య సఖ్యత లేదు. శివుని వాహనం వృషభం, పార్వతి వాహనం సింహం, కుమారస్వామి వాహనం నెమలి, విఘ్నేశ్వరుడి వాహనం ఎలుక, శివుడి చేతిలో అగ్ని, శివుడుండేది మంచుకొండపైన, శివుడి మెడలో పాములుంటాయి. అగ్నిని చేతిలో పెట్టుకొని తలపైన గంగను దాల్చాడు. శివుడి గళంలో విషం, కళ్లల్లో అమృతం.. తలపైన గంగాదేవి. పక్కన పార్వతి.. ఇలా శివుడి చుట్టూ భిన్నమైన వాతావరణం, వస్తువులు ఉన్నా కలిసే జీవనం సాగుతున్నది. సింహం-ఎద్దు, నెమలి-పాము, పాము-ఎలుక, గంగా, చంద్రుడు-అగ్ని, అమృతం-విషం... ఇవన్నీ ప్రకృతి పరంగా విరుద్ధ విషయాలు అయినా శివుడి సన్నిధిలో సమన్వయంతో జీవిస్తున్నాయి. శివారాధన నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. పరస్పర విరుద్ధశక్తుల మధ్య జీవిస్తున్నా మన ప్రేమతో అందరినీ జయించాలి.
 
కాగా కాకో ధనహరే కోయల్‌ కాకో దేత్‌
మీఠా శబ్ద్‌ సునయ్‌కే జగ్‌ అపనే కర్‌లేత్‌

కాకి ఎవరి ధనాన్ని దొంగిలించింది? కోకిల ఎవరికి ధనమిచ్చింది? మన తీయని మాటల ద్వారా ప్రజలను మనవాళ్లుగా చేసుకోవచ్చంటారు పెద్దలు. కుటుంబం మనకు అదే నేర్పిస్తుంది. కానీ నేటి యువతీయువకులు ఈ విలువలను పట్టించుకోవట్లేదు. మునుపటి కుటుంబ వ్యవస్థలోని ఆనందాన్ని ఆస్వాదించడం నేర్చుకోకుండా డబ్బే ప్రధానంగా జీవితాలు కొనసాగితే మనల్ని మనమే విచ్ఛినం చేసుకున్నవాళ్లమవుతాం. దీనికంతా కారణం కుటుంబవ్యవస్థ బీటలు వారడం. నిజానికి చతురాశ్రమాల్లో కుటుంబజీవన మాధుర్యాన్ని తెలిపేది గృహస్థాశ్రమం. అందరినీ కల్పతరువులా పోషించేవాడు గృహస్థుడు.
 
ఊర్జం బిభ్రద్‌ వసువనిః సుమేధా
అఘోరేణ చక్షుషా మిత్రియేణ
గృహానైమి సుమనా వన్దమానో రమధ్వం
మా బిబీత మత్‌

అంటోంది అధర్వణ వేదం. శక్తిని కలిగి, ధనార్జన చేసే ఉత్తమ మేధా సంపన్నుడు, క్రోధం లేని కళ్లతో స్నేహంగా చూసేవాడు, సుప్రసన్నమైన మనసుతో అందరూ పొగిడేట్లు జీవించేవాడు. గృహంలోని వారికి లభ్యమగుగాక అని దీని అర్థం. స్వర్గనరకాలు ఎక్కడో ఊర్థ్వంలో లేవు. గృహస్థ జీవనం స్వర్గం అని వేదవేత్తల అభిప్రాయం. అలాంటి సుఖజీవనాన్ని మనకు కుటుంబమే ఇస్తుంది. దానిని విస్మరించి వ్యక్తిగత సుఖం కోసం అందరినీ దూరంగా పెట్టి ఏకాంతంగా జీవించడం ఆత్మహత్యా సదృశం. సనాతన భారతీయ కుటుంబవ్యవస్థకు పునరుత్తేజం కలిగితేనే మనలో శాంతి నెలకొంటుంది.

******************************
   డాక్టర్. పి. భాస్కర యోగి 
నవ్య : నివేదన: 
ఆంధ్రజ్యోతి :
పరంజ్యోతి  
20-05-2019 : సోమవారం

1 కామెంట్‌: