మన ఊరు మనగుడి
గొలగమూడి వెంకయ్య స్వామి వద్ద అభ్యసించిన రాజయోగాన్ని వేంకటరమణులు కొనసాగించారు. అది క్రమంగా యోగమార్గంగా, ఆత్మమార్గంగా మారింది. ఈ మార్గానికి తోడు సద్గురు శివానందమూర్తి వాత్సల్యం, రమణులను ఆధ్యాత్మిక క్షేత్రంలో మరింత రాటుదేల్చింది. ఆ వాత్సల్యం ‘నేను’ అనే ఆత్మస్వరూపాన్ని అన్వేషణ చేసేట్లు చేసింది. అందులోనే ప్రపంచస్థితి అర్థం అయ్యింది.
“ఇతర ప్రాణులన్నీ సృష్టికార్యంలో హాయిగా సాగిపోతుంటే మనిషికే ఎందుకు దుఃఖం, బాధ, మనోవ్యధలు వెంటాడుతున్నాయి? అసలు మనిషి జీవితానికి గమ్మం, లక్ష్యం ఏమిటి? ఈ సృష్టిలో ఏ ప్రాణికి కలగని ‘నేను’ అనే భావన మనిషికే ఎందుకు కల్గుతుంది? అసలు నేను అనిపించడం చేతనే కదా స్వార్ధం పేట్రేగి మనిషిని దురాశాపరుణ్ణి చేస్తుంది? ఇతర ప్రాణులకు నేను అనే స్వార్ధమే లేకపోవడం చేతనే కదా అవి సృష్టికార్యంలో హాయిగా జీవిస్తున్నాయి! ఇలాంటి దివ్యమైన ఆలోచనలెన్నో రమణుల్లో కలిగాయి. అవన్నీ వేదాంత పరిప్రశ్నలుగా మారిపోయాయి.
ఇలాంటి విషయాలను సద్గురువుతో చర్చించారు, తర్కించారు. “ఈ సృష్టిలోని ప్రాణులన్నీ ఈశ్వర స్వరూపాలే. అవన్నీ సృష్టికార్యంతో ఏకత పొంది జీవనం సాగిస్తున్నాయి. అవి ఉన్నట్లు కూడా వాటికి తెలియదు. అవన్నీ ఈశ్వర కార్యంలో అంతర్భాగమై సాగగలవేకానీ ఇది ఈశ్వర కార్యం అని ఏనాటికీ గుర్తించలేవు. జీవితంలో అన్నింటినీ అనుభవిస్తూ వెళ్లగలవేగానీ ఆ అనుభవానికి కారణమైన దాన్ని అవి గుర్తించలేవు. అక్కడే మనిషి ఔన్నత్యం ఉంది.” అంటూ చర్యల్లో లభించే పరిష్కారం. అంతరంగంలో ఇలాంటి ప్రశ్నలు వాటికి సమాధానాలు పరంపరగా కొనసాగేవి.
ఈ భావపరంపర రమణుల్లో తీవ్ర ఆధ్యాత్మిక కాంక్షను రేకెత్తించింది. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఆధ్యాత్మిక దర్శనం చేయించింది. సాధారణంగా అందరు గురువులు ఆధ్యాత్మికమార్గం అనగానే వేదాంత గ్రంథాల్లో వెతుకుతారు. అలా కాకుండా సాధారణ విషయాల్లో భగవదర్శనం చేయడం మొదలుపెట్టారు. హిమవత్పర్వత సాధువుల్లోని ఈశ్వరతత్వాన్ని దర్శించడానికి వెళ్లిన రమణులు నమకచమకంలో ‘నమోగిరిశాయచ శిపినిష్ఠాయచ” అన్న శ్లోకంలో గిరిశాయచ, కైలాసవాసియగు శివునిగా, శిపినిష్టాయ - విష్ణు స్వరూపంగా ఉన్న రుద్రునకు నమస్మాకం. కైలాసివాసి అయిన శివుడినే కాదు సర్వవ్యాపకుడైన విష్ణువుగానూ ఆయనే ఉన్నాడని చెప్పిన శ్లోకభావం మన విధానాల్లోని విశాలత్వాన్ని స్ఫురింపచేస్తుంది.
సద్గురువు మధ్య జరిగిన సంభాషణలు, ఆలోచనలు “ఒక (ఊ)రికథ”గా పుస్తకాన్ని వేయించారు. అందులో ఓ చోట ఆ గురుమూర్తి గొప్పతనం చెప్తూ “సంస్కృతీ సంప్రదాయాలకు, అద్వితీయమైన భారతీయతకు ప్రతిరూపంగా నిలిచే ఆ సద్గురుమూర్తి అనువాక్కుల ప్రతిపదంలోనూ తొణికిసలాడుతూ కనిపించారు. పూర్వీకుల జ్ఞాన వైభవాన్ని తపఃసంపదను తరతరాలుగా అందిస్తూ వస్తున్న ఆ దివ్యమూర్తి జీవనశైలిని గమనిస్తే ప్రతి కదలికలోనూ చమకమే కనిపిస్తుందికదా అనిపించింది” అంటారు. అంతటి గురుభక్తి ఆ సద్గురువుపై ఉంది కాబట్టే ఆశ్రమానికి ‘గురుధామ్’ అని పేరు పెట్టి అందులో సద్గురువు ప్రతిమని ప్రతిష్టించి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను వారు చేస్తున్నారు.
రమణుల ప్రతీ పుస్తకం ఓ ఆత్మజ్ఞానమే!
బ్రహ్మబాబా తన ఆధ్యాత్మిక అనుభూతులను ‘మురళీల’ రూపంలో చెప్పాడు. కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఉపన్యాసాలుగా, మరికొందరు ఆశీర్వాదాలతో, ఇంకొందరు ప్రేమవదనంతో తమ సందేశాలను ఇస్తుంటారు. బ్రహ్మజ్ఞానం పొందిన ఈ రమణులు మాత్రం తమ అనుభూతులను పుస్తకాల రూపంలో వెలువరించారు. తమ అనుభూతులను శాస్త్రాన్వయం చేయడానికి గొప్ప ఆత్మజ్ఞాన గ్రంథాలను ఎంచుకొన్నారు. అందులో శుద్ధమైన ఆత్మజ్ఞానం గల అష్టావక్రగీత చెప్పుకోదగింది.
“గురువు ఒంట్లో ఉన్న తీపిని తీసెయ్యడు. ప్రాపంచిక విషయాలపై మనకున్న తీపిని పోగొడుతాడు. శరీరంలో ఉన్న మధుమేహాన్ని కాదు. మనసులో ఉన్న మోహాన్ని తీసేయడమే గురువు కర్తవ్యం” అంటూ ఓ చోట అష్టావక్ర గీతలో వ్యాఖ్యానం చేస్తాడు. అలా శిష్యుని దేహాభిమానతత్వాన్ని పోగొట్టేదే అష్టావక్రగీత. అందులోని ఆత్మవిషయాన్ని ప్రస్తావిస్తూ. 
అపార మహాసముద్ర రూపుడనగు నా యందు జాగద్రూపమగు కల్లోలము ఉదయించునుగాక, లేనిచో లయంను పొందునుగాక అయిననూ నాకు వృద్ధియును లేదు. హానియును లేదు. ఆత్మ దేహాది భావాలలో లేదు. దేహాదిభావం ఆ అనంతమైన, నిరంజనమైన ఆత్మయందు లేదు. ఈ ప్రకారంగా సంగరహితుడైన, శాంతుడనైన నేను ఈ ఆత్మ స్వరూపడనయ్యే ఉంటున్నాను. జ్ఞాని సుఖవంతుడు కాదు, దుఃఖితుడును కాడు. విరక్తుడనుకాడు, సంగియుకాడు, ముముక్షువు కాడు, ముక్తుడను కాడు, అతనికి ఏమియును లేదు.
ఏమియుకాదు. ఉపశాంత చిత్తంగల జ్ఞాని జనంతో వ్యాప్తమైన ప్రదేశంనుగాని అడవిని గూర్చిగాని పరిగిడడు. మరేమనగా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా సమభావం గలవాడై ఉంటున్నాడు. అజ్ఞాని కర్మలను చేయనివాడైనప్పటికీ అంతట, సంకల్ప వికల్ప రూప సంక్షోభ కారణం వలన వ్యాకులుడుగా అగుచున్నాడు. నేర్పరియగు జ్ఞానికర్మలను చేయచున్న వాడైనను మరేమనగా కులం లేనివాడుగా అగుచున్నాడు. 

****************************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ విజయక్రాంతి  : ఆధ్యాత్మికం ॐ*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి