‘రెవిన్యూ అవినీతి’ ఇంకెన్నాళ్లు..?

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకొంది. స్థానిక కోర్టు భవనంలో కొంత భాగం ‘మా పూర్వీకులదని’ ఓ తెలుగుదేశం నాయకుడు ఆ ప్రాంగణంలో హద్దురాళ్లు పాతాడు. దీన్ని విచారించేందుకు జిల్లా న్యాయాధిపతి ఆ పట్టణానికి వచ్చాడు. విచారణ లోతుగా జరగ్గానే దీనికంతటికి రెవిన్యూ అధికారుల అవినీతి కారణమని జడ్జి గ్రహించారు. వెంటనే మండల రెవిన్యూ అధికారిని కోర్టుకు పిలిపించారు. అతను చేసిన తప్పులను గుర్తుచేస్తూ జడ్జి గట్టిగా మందలించాడు. ‘కోర్టు భవనాన్ని ఇలా వివాదాస్పదం చేయడానికి నీకు సిగ్గులేదా?’ అన్నాడు. రెవిన్యూ అధికారి మిన్నకుండిపోయాడు. ఈలోపు అక్కడన్న ఓ సీనియర్ న్యాయవాది ఇంకో రహస్యం బయటపెట్టాడు. ‘ఇదే రెవిన్యూ అధికారి తమ కార్యాలయం స్థలాన్ని కూడా విరాసత్ చేశాడని’’. భూస్వామి అయిన ఓ దాత సీలింగ్ చట్టం వచ్చాక తన స్థలాలను ప్రజల అవసరాల కోసం రెవిన్యూ కార్యాలయానికి, ఓ పాఠశాలకు, ఇతర కార్యాలయాలకు దానపూర్వకంగా ఇచ్చాడు. ఆయన మరణానంతరం వారి కుమారుల వద్ద లంచం పుచ్చుకొన్న అక్కడి రెవిన్యూ ఆఫీసు సిబ్బంది దాత ఇచ్చిన భూముల్లో ఉన్న తమ కార్యాలయాన్ని కూడా ‘విరాసత్’ చేశారని సదరు న్యాయవాది జడ్జికి చెప్తే ఆయన అవాక్కయ్యాడు.

ఇదంతా ఎందుకు ప్రస్తావన చెయ్యాల్సి వచ్చిందంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రెవిన్యూ శాఖ’పై చేయదలచిన ‘ప్రక్షాళన’ గురించి చర్చ జరుగుతున్నందుకు! నిజంగా రెవిన్యూ శాఖలో ప్రక్షాళన జరిగితే ప్రజా సమస్యలకు మనం సగం పరిష్కారం కనుగొన్నట్లే. కేసీఆర్ ఇందులో విజయవంతమైతే నిజంగా ‘తెలంగాణ జాతిపిత’గా మారిపోవడం తథ్యం. ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు పాలాభిషేకాలు చేసి కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడిని లోబరచుకున్నాం అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఇవన్నీ పసిగట్టలేని అమాయకుడు కాడు కేసీఆర్. కేసీఆర్‌ను నియంత అని అంటున్నవాళ్ళుకూడా ఇది సత్ఫలితాలిస్తే నోటికి తాళం వేసుకోవాల్సిందే. ఉన్నత స్థానాల్లో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు కఠినంగా అనిపించినా అవి తర్వాత సాంత్వన కలిగిస్తాయి.

తాజా ఉదాహరణ చూస్తే- మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్ విధుల పట్ల బాధ్యత లేని కొందరు టీచర్లను సస్పెండ్ చేశారు. దాంతో బాధ్యత లేకుండా తిరిగే వ్యక్తులకు బాధ్యతలు గుర్తొచ్చాయి. కొందరు ఉపాధ్యాయులు కలెక్టర్ చర్యకు లోలోపల తిట్టుకున్నారు. కానీ, ఇటీవల ఎన్నికల నిర్వహణకు వెళ్లిన అధికారులకు, క్లర్కులకు అద్భుతమైన భోజన వసతులను కల్పించి, అర్ధరాత్రి బస్సులను ఏర్పాటుచేసి వారి స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చారు. సరే! ఇంకా కొన్ని జిల్లాల్లో బాగా జరిగి ఉండవచ్చు కానీ కఠినమైన వ్యక్తిలా కన్పించే రొనాల్డ్‌రాస్ ఇన్ని ఏర్పాట్లు ఇంత చక్కగా చేశారని అదే టీచర్లు సామాజిక మాధ్యమాల్లో పొగడ్తలు గు ప్పించారు. దీనికి కారణం ఏమిటి? అన్ని చోట్లా అధికారులు ఉన్నారు కదా! అధికారి అవినీతిపరుడైతే ఎక్కడ ఎం త డబ్బు మిగిలించుకోవాలో చూస్తాడు. ఆయన అలా అనుకోలేదు కాబట్టి ప్రతి పోలింగ్ బూత్‌లో ఫ్యాన్లతో పాటు ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయించాడు. అక్కడ మాత్రమే చురుగ్గా వా రంతా ఎందుకు పనిచేశారు? చేయించే నాయకుడు అదే ఉత్సాహంతో, నిబద్ధతతో ఉన్నాడు కాబట్టి!

ఇపుడు కేసీఆర్ తీసుకోబోయే రెవిన్యూ శాఖ ప్రక్షాళన నిర్ణయం కేవలం ఆ శాఖకే పరిమితం కాదు. రెవిన్యూ శాఖ చుట్టే మున్సిపల్, పంచాయితీ, న్యాయవ్యవస్థ, రోడ్లు, భవనాలు, రిజిస్ట్రేషన్.. ఇలా అనేక శాఖలు తిరుగుతున్నాయి. ఉదాహరణ ఒక భూమి మధ్య నుండి ప్రభుత్వం రోడ్డువేస్తుంది. కొంత భూమి కోల్పోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. నష్టపరిహారం ఇప్పించేవరకే ఈ శాఖలు పనిచేస్తున్నాయి. రెవిన్యూ రికార్డుల్లో సరిగ్గా కొలిచి దానిని తొలగించడం లేదు. వాళ్ల ఖాతాల్లో మొత్తం భూమి అలాగే నమోదు అవుతున్నది. కొనే్నళ్ల తర్వాత భౌతికంగా తమకు భూమి లేకున్నా రికార్డుపరంగా వున్న హక్కును అతను ఉపయోగించుకొని కోర్టులు- చట్టాలను తమకు అనుకూలంగా ఉయోగించుకొని ఆర్డర్లు తెచ్చుకొని వివాదాలకు కారణమవుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడి నుంచి ఎంపీ వరకూ నాయకులు అధికారులకు ఫోన్లుచేసి వత్తిళ్లు తేవడం సర్వసాధారణం. అధికారంలో ఏ పార్టీ వున్నా వ్యక్తిగత వివాదాల విషయంలో పోలీసులను, రెవిన్యూ వ్యవస్థను స్వతంత్రంగా పనిచేసుకోనివ్వాలి. అలసత్వంతో, లంచగొండితనంతో, జవాబుదారీతనం లోపించిన అధికారులపై తీవ్ర చర్యలుండాలి. నిజానికి పటేల్-పట్వారీ వ్యవస్థ ఉన్నపుడు రికార్డులు వాళ్ల చేతిలో సురక్షితంగా ఉండేవి. ఇపుడు మన రికార్డులు రోగగ్రస్తం అయ్యాయి. వాటి నుండి ఎలా న్యాయ వివాదాలు పుట్టించవచ్చో రెవిన్యూ అధికారులకే బాగా తెలుసు.

1984కు ముందు గ్రామాన్ని ఒక్క పట్వారీ వ్యవస్థ పీల్చుకుతింటే ఇపుడు- న్యాయవ్యవస్థలో కూడా సత్వర న్యాయం లేకపోవడం, ధర్మంలేని న్యాయం నడవడం, అన్నీ కాగితాలకే పరిమితం కావడంవల్ల చట్టాలు దుర్వినియోగమవుతున్నా ఏమీ చేయలేని స్థితి. ఇపుడంతా కాగితాల కొట్లాట. గ్రా మాల్లోనే లోక్ అదాలత్‌ల్లా ‘గ్రామ న్యాయాలయాలు’ ప్రోత్సహించాలి. స్థానికులకు ఒక సమస్యపై కింది స్థాయి పరిజ్ఞానం ఉంటుంది. అందువల్ల అక్కడ న్యాయం కన్నా ధర్మానికి ప్రాధాన్యత ఉంటుం ది. కోర్టులే లోక్ అదాలత్‌లతో సమస్యలను రాజీ పద్ధతిలో పరిష్కరిస్తుండగా- గ్రామ న్యాయాలయాలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించకూడదు.

సంక్షేమ పథకాలతోపాటు ప్రజలకు నైతికత నేర్పించాలి. దానివల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. 90వ దశకంలో రామాయణం సీరియల్ ప్రసారం అవుతున్నపుడు గుజరాత్ పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదు తగ్గింది. వ్యక్తిగత నైతికతకు పెద్దపీఠం వేయాలి. గ్రామ న్యాయాలయాలకు చేరువలో దోషి, ఆరోపించిన వ్యక్తి, సాక్షి, సభ్యులు ఉంటారు. అందువల్ల సత్వర పరిష్కారం ఉంటుంది. అది వెర్రితలలు వేయకుండా చూడాలి! అలాగే కొన్ని బూజుపట్టిన భూ చట్టాలను భూస్థాపితం చేయాలి. ఉదాహరణకు తెలంగాణలో రక్షిత కౌలుదారు చట్టం (పి.టి.యాక్ట్) ఉంది. దానికి ఒక నియంత్రణ తేదీ లేకపోవడంతో భూ వివాదాలపై కుప్పలుగా కేసులు పేరుకుపోతున్నాయి. కోర్టుల సమయం, ప్రజల మధ్య స్పర్థలు పెరుగుతున్నాయి. డెబ్భై ఏళ్ళ క్రితం వచ్చిన చట్టం వల్ల- రావణకాష్టంలా కేసులు రాజుకుంటున్నాయే తప్ప పరిష్కారం శూన్యం. రెండు తరాల వాళ్లు వెళ్లిపోయాక కూడా ఇంకా వారసులుంటారా? చాలా జిల్లాల్లోని రెవిన్యూ కార్యాలయాల్లో పి.టి రిజిస్టర్లు ఎపుడో మాయం చేశారు. మాన్యువల్ అయినా, కంప్యూటర్లు చేసినా బాధ్యతగల వ్యక్తుల చేతుల్లో ఈ వ్యవస్థను ఉంచడం సాధ్యం కాదా? బ్యాంకుల్లో క్యాషియర్ జాగ్రత్తగా లేకపోతే పరిస్థితి ఏమిటి? ఆసుపత్రుల్లో సర్జన్ జవాబుదారీతనంతో లేకపోతే ఎలా? అక్కడ నూటికి తొంభై శాతం పొరపాట్లు లేకుండా వ్యవస్థ నడుస్తుంటే ఇక్కడ అంతమాత్రం కూడా ఏర్పాటు చేసుకోలేమా? మనల్ని మనం ఎప్పుడూ మోసం చేసుకుంటూనే ఉంటాం.

అధికారులు అనగానే టి.ఎన్.శేషన్‌లా చీల్చి చెండాడే చండప్రచండుడైనా ఉండాలి లేదా ఏమీ పట్టించుకోని నిర్వికార నిరంజనుడైనా అయి ఉండాలి. ఈ దరిద్రం ప్రజల మెదళ్ల నుండి పోవాలి. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు, రోజువారీ బాధ్యతలను విభజించాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ఇవి లేనందువల్ల జవాబుదారీతనం ఉండడంలేదు. ఇపుడు తెలంగాణలో ఎవరిని అడిగినా కొన్నాళ్లుగా ఎన్నికల బాధ్యతల వల్ల ఏ పనులూ కావడం లేదనే చెప్తారు. రెవిన్యూ శాఖ మండల స్థాయిలో హృదయ పూర్వకంగా పనిచేయడంలేదు. తమకు ఏమీ లాభం లేనందువల్లనే ‘ధరణి’ వెబ్‌సైట్ ఇన్ని అపశ్రుతులకు గురైందంటున్నారు. పదే పదే తప్పులు చేయడం, అవి దిద్దేందుకు మళ్లీ లంచాలడగడం షరా మామూలు అయిందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ పరిధిలో ఇలాంటి ధోరణే. వ్యవస్థలోని లోపాలను అధికారులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు బాగా ఉపయోగించుకొంటున్నారు. ఇదంతా నైతికత, జవాబుదారీతనం లోపించడమే.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కేవలం పాలితులే కారు. వారు భాగస్వాములన్నది మరచిపోయాం. బఱ్ఱె ఏం తిన్నా సరే మనకు పాలిస్తే చాలు అన్న భావన ఎక్కువవుతున్నది. ఇటీవల సామూహిక అవసరాల కన్నా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యత పెరిగిపోతోంది. దానివల్ల అపరిమితమైన స్వార్థం పెరిగి వ్యక్తిగత లాభాపేక్ష కోసం వ్యవస్థలను మటుమాయం చేస్తున్నారు. ‘సుపరిపాలన, చట్టసభలు, న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ, ప్రయివేటు రంగం, సమాజం వంటివి అందరు భాగస్వాములకు వర్తిస్తుంది. పాపులర్ ప్రోయాక్టివ్ గుడ్ గవర్నెన్స్ (ప్రజాదరణ పొందిన క్రియాశీలక సుపరిపాలన) అవసరమ’ని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు చెప్పిన మాట అక్షరసత్యం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చక్కని ఫలితాలు రాబట్టవచ్చు.

ఇపుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అత్యద్భుత పథకాలు. వాటిలో లోపాలు మాత్రమే చూస్తే వాటి నిర్మాణ పనులు కాంట్రాక్టర్ కళ్లలో మొదలవచ్చు కానీ, అంతిమ ఫలితం గొప్పగా ఉందన్న విషయం మరువవద్దు. ఇది విజయవంతం అయితే కేసీఆర్ నిజంగా భగీరథుడే. పూర్తి సఫలం తప్పక అవుతుంది. ఎందుకంటే గుజరాత్‌లో మోదీ దీనిని సక్సెస్ చేశాడు. 21వ శతాబ్దం నుండే గుజరాత్ నీటి కొరతను ఎదుర్కొన్నది. అందుకు మోదీ ప్రజలే సారథులుగా, ప్రభుత్వమే వారధిగా ఓ ప్రయత్నం చేశాడు. 2011 నాటికి గుజరాత్‌లో 1,44,000 చిన్న, పెద్ద డ్యాములు, 1,22,000 చెరువుగట్లు, 2,49,000 చెరువులు నిర్మాణం చేశారు. 6 లక్షల జల సంరక్షణ పథకాలు, చెరువుగట్లు నిర్మించారు. వీటి సహాయంతో 22 నదుల్లోని నీటిని 206చోట్ల నిల్వ చేసేందుకు వీలుపడిందని రాజనీతివేత్త అనిల్ మాధవ్ దవే మెచ్చుకొన్నారు. విదేశీ డబ్బులతో ఉద్యమాలు చేసే మేథాపాట్కర్ లాంటి వాళ్ల ప్రయత్నాలను భగ్నం చేస్తూ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10,600 గ్రామాలకు, 103 నగరాలకు నీటిని అందిస్తున్నారు. ఇదంతా నాయకుడు, అధికారుల నిజాయితీ, ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమైంది.

తెలంగాణలో అలా జరగాలంటే పాతుకుపోయిన అవినీతి అంతం కావాలి. లేదంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పప్పుబెల్లాల్లా పంచుకున్నట్టే అవుతుంది. కేసీఆర్ ఉద్యమం కాలంలో చెప్పిన రెండు గొప్ప విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ‘పోలీసులు కేవలం డ్యూటీ చేస్తున్నారు. వారికి నైతిక శిక్షణ లేదు, ఒకవేళ వారికి నైతికతను గుర్తించే శిక్షణ ఇస్తే సమాజంలో గొప్ప మార్పులు ఆశించవచ్చు. అలాగే ‘సమష్టి కులాల పాఠశాల విధానం ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నది రెండవ మాట. ఇపుడు ఉద్యోగుల్లో, నాయకుల్లో ఇలాంటి నైతికత రావాలి. గురుకుల విద్యలో సక్సెస్ అయినప్పటికీ కులాల వారీగా కాకుండా, అన్ని కులాలవారు కలిసి చదివే విధానం తక్షణ అవసరం. అందులో పడుతున్న వేర్పాటు బీజాలు రాబోవుకాలంలో సమాజంలో ఒక అసహన వాతావరణం కలిగిస్తాయి. ఈ రెండూ కేసీఆర్ చేయగలిగితే ఇపుడు జరుగుతున్న చర్చ సఫలమవుతుంది. ఎప్పటిలాగే గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుకొనే విధానంలో నడిస్తే రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతాయి. అన్నింటినీ మించి చట్టాలు, న్యాయాలు ఎలా వున్నా ప్రతి వ్యవస్థలోని నైతికతకు, మనస్సాక్షికి లొంగి ఉండాలి. అదే అసలు ప్రజాస్వామ్యం. *


************************************

 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *
* శుక్రవారం : ఏప్రిల్ 19 : 2019 *


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి