మహాభారత యుద్ధం తీవ్రంగా సాగుతుండగా- అభిమన్యుడి మరణంతో హతాశుడైన అర్జును డు సైంధవుడిని వధిస్తానని శపథం చేస్తాడు. ఆ శపథం ప్రకారం శ్రీకృష్ణుని సహాయంతో ‘సైంధవ వధ’ జరిగింది. దీంతో దుర్యోధనుని దురభిమానం దెబ్బతిని కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుని నిందించడం మొదలుపెట్టాడు. 

‘పాండవ పక్షపాతి, తేనె పూసిన కత్తి’ అంటూ గురునిందకు పాల్పడ్డాడు. దాంతో మరుసటి రోజు యుద్ధంలో ద్రోణుడు శర పరంపరతో రెచ్చిపోయాడు. ఈలోపు పాండవ పక్షం నుండి ఘటోత్కచుడిని రంగప్రవేశం చేయించాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆ రోజు పగలు యుద్ధం రాత్రి వేళా కొనసాగింది. ఘటోత్కచుడు రాత్రి పూట యుద్ధం బాగా చేస్తాడు. ఘటోత్కచుడు కౌరవ పక్షంలో భీకర యుద్ధం చేస్తున్న అలంబుషుడిని, ఆలాయుధులను చంపేశాడు. ఈ తీవ్రత భరించలేక దుర్యోధనుని ఆజ్ఞతో కర్ణుడు శక్త్యాయుధంతో ఘటోత్కచుడిని వధించాడు.

ఘటోత్కచుడు మరణించగానే పాండవులంతా శోక సముద్రంలో మునిగిపోగా, శ్రీకృష్ణుడు పరమానందంతో పగ్గాలను నొగ్గలో ముడిచి నృత్యం చేశాడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే పటాకులు పేల్చి, కేకులు కోసినంత పనిచేశాడు శ్రీకృష్ణుడు. దాంతో అర్జునుడు ఇలా ఎందుకు చేస్తున్నావని శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు రాజనీతి రహస్యం బోధించాడు. 

‘ఘటోత్కచుడి మరణంతో రెండు ప్రయోజనాలు ఒకేసారి కలిగాయి. ‘కర్ణుడి దగ్గర ఉన్న శక్త్యాయుధం ఎలా వృథా చేయాలా?’ అని నేను ఆలోచిస్తుంటే ఘట్కోచుడిని చంపేందుకు అది ఉపయోగించి నాకు ఓ పని తగ్గించాడు కర్ణుడు. ఇక రెండవ ప్రయోజనం ఘటోత్కచుడు మన పార్టీ వాడే అయినా అతడూ రావణ, హిరణ్యాక్ష కోవలోనివాడే. వానిని చంపేందుకు నేను మళ్లీ రావాల్సి వచ్చేది. ఇలా రెండు పనులు ఏకకాలంలో జరిగినందుకు ఆనందంగా ఉందన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. అతనిలోని చిన్న లోపాలను కూడా పెద్దవి చేస్తారు. అదీ అందులోని ధర్మం తెలుసుకోలేక! కానీ శ్రీకృష్ణుడి రాజకీయ మాయోపాయాలు, వాటిలోని వ్యూహాలు తెలియాలంటే ధర్మాధర్మ విచక్షణ ఉండాలి. ఘటోత్కచుడిని చంపించడం చూశాక ‘ఇదీ రాజనీతి’ అనిపిస్తుంది. తన పార్టీలోనే ఉంటూ, రోజూ తనపై దుమెత్తిపోసే యశ్వంత్ సిన్హా లాంటి వాళ్లకు ఈ రోజు నరేంద్ర మోదీ ఇదే గతి పట్టించాడు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రశాంతంగా పనిచేయాలంటే స్వంత పార్టీలో శత్రువులు ఉండకూడదు. అధికార వికేంద్రీకరణ రెండు చోట్లా ఉన్న ప్రతీ నాయకుడు వారితో ప్రమాదం ఎదుర్కొన్నాడు. ఇది అర్థం చేసుకోలేని వాళ్లు పార్టీలోని పెద్దలను గౌరవించడం లేదని నిందిస్తున్నారు. కానీ రెండు అధికార కేంద్రాలు- అవి గౌరవార్థమైనా కంట్లో నలుసులా గద్దెపై ఉన్నవారికి మనఃస్థిమితం ఉండదు. 

అద్వానీ అయినా ఆయన వ్యక్తిగత గౌరవానికి ఎక్కడా భంగం కలగదు. కొన్నిసార్లు అనుభవం, వృద్ధాప్యం కూడా గౌరవింపబడే పరిధిలో ఉంచుకోవడమే అన్ని విధాలా మేలు చేస్తుంది. రెండు అధికార కేంద్రాలు ఆనాడు ఇందిరను కూడా ఇబ్బంది పెట్టాయి. సంజ య్ గాంధీ చిలిపి కోరికతోనే కదా భారతదేశానికి చీకటి రోజులుగా చెప్పే ‘ఎమర్జెన్సీ’ని విధించడం. ప్రజా నాయకుడైన ఎన్టీఆర్‌ను గద్దెనుంచి కదా చంద్రబాబు సింహాసనం అధిష్ఠించాడు. ఎన్టీఆర్‌తోపాటు అతని భార్య లక్ష్మీపార్వతి కూడా అధికార కేంద్రాన్ని సృష్టించడం చంద్రబాబుకు నచ్చలేదు. ఆమె ఉంటే తన దగ్గరున్న రెండవ అధికారం ఎక్కడ మాయమవుతుందో అని కదా ఆయన వైస్రాయి హోటల్ కేంద్రంగా బాబు అధికారం పొందింది! తెదేపాలో పెద్ద నాయకులమని అనుకొనేవారు చాలామంది లక్ష్మీపార్వతికి పాద నమస్కారం చేయడం చారిత్రక సత్యం! ఆమెకు ఉంగరాలు, చీరలు సమర్పించి ఎన్టీఆర్‌ను సంతోషపెట్టగలిగారు. ఈ ద్వితీయ అధికార కేంద్రాన్ని దెబ్బతీయాలని ఆనాడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉపయోగపడ్డారు.

ఇదంతా మహాభారత రాజకీయమే. ములాయం ఇంట్లో ముస లం పుట్టడానికి, కరుణానిధి ఇం ట్లో కల్లోలం రేగడానికి, జనతా పార్టీ జనం లెక్కపెట్టలేనన్ని ము క్కలు కావడానికి ఇదే కారణం కదా! అందుకే మోదీ శ్రీకృష్ణుని బాటలో ద్వితీయ అధికార కేం ద్రాన్ని తుడిచేసాడు. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అయినా కౌరవపక్షంలోని ధృతరాష్ట్రుడు, భీష్మ, ద్రోణ, కృపులచే గౌరవింపబడినాడు. రాయబారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు దుర్యోధనుని ఇంట్లో కా కుండా విదురుని ఇంట్లో భోజనం చేసాడు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ నుండి ఉత్తరప్రదేశ్‌కు వచ్చి తిష్ఠవేశాడు. పదవిలో వున్న వ్యక్తులను కాకుండా యూపిలో ఓడిపోయిన గ్రామ స్థాయి నాయకులను ఒక్కచోటకు చేర్చాడు. దాంతో పార్లమెంట్ సీట్లు మొత్తం యూపిలో 70 ఉంటే 57 సీట్లు భాజపా ఖాతాలో వేశాడు. అదే దారిలో యోగి ఆదిత్యనాధ్ పయనించి ఇటీవల జరిగిన యూపి ఎన్నికల్లో 403 అసెంబ్లీ సీట్లకు 312 సాధించాడు. 

కొన్నిసార్లు అధికారంలో ఉన్న వ్యక్తులకన్నా ఉత్తములైన ఏమీ లేని సజ్జనులే మనకు మేలు చేస్తారని శ్రీకృష్ణుడు చెప్తే అదే బాటలో అమిత్ షా వెళ్తుంటే అది అహంకారంగా గిట్టనివాళ్లు చెప్తున్నారు. ఈనాటి రాజకీయాల్లోని అనేక అంశాలు భారతంలో శ్రీకృష్ణుడి కేంద్రంగా నడిచాయి. అందుకే వ్యాసుడు భారతంలో ఉన్నవి ప్రపంచంలో ఉన్నాయని, ప్రపంచంలో ఉన్నవి భారతంలో ఉన్నాయని ఘంటాపథంగా చెప్పాడు.
కంసుడు, జరాసంధుడు, నరకాసురుడు, కాలయవనుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన రాజుల చేతిలో ముక్కలు ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని- అలాంటివారి కబంధ హస్తాల నుండి విడిపించి ‘అఖండ భారతంగా’ శ్రీకృష్ణుడు నిర్మించాడు. 

కేంద్ర పాలనా వ్యవస్థను ధర్మరాజు ద్వారా స్థాపించిన శ్రీకృష్ణుడు రాజ్యవ్యవస్థకు ఓ రూపం ఇచ్చాడు. ప్రపంచంలోనే రాజ్యవ్యవస్థకు సంబంధించి ఎన్నో యుక్తులను ప్రదర్శించిన శ్రీకృష్ణుడు ‘అఖండ భారతావని’ కలను ఆనాడే సాకారం చేశాడు. దీని ఆధారంగానే కదా ‘ఉక్కుమనిషి’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించే ఆనాటి సం స్థానాధీశుల మెడలు వంచి 560 సంస్థానాలను భారతదేశంలో విలీ నం చేశాడు! మరి ఈనాటి ఆధునిక భారతంలోని ఎందరో జరాసంధులు, శిశుపాలురు, పూతనలు ఒక్కొక్కరుగా అధికారానికి దూరమవుతూ పెడబొబ్బలు పెడుతున్నారు. పరశురాముని ప్రసాదమైన కేరళ రాజ్యంలో మారణహోమం జరుగుతున్నా మారు మాట్లాడని ‘మాపిల్లా వారసులను’ శ్రీకృష్ణుని రాజనీతితో ఎదుర్కోవాలి.

కశ్యపుడి పేరుతో ఏర్పడ్డ కాశ్మీరంలోని కుంకుమపూలలో కలిసిపోయిన హిందువుల రక్తం బాధను తొలగించాలంటే భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ అనే విశ్వరూపం చూపించాల్సిందే! క్రీస్తు పూర్వం నుండి వేల ఏళ్ళుగా గోనందుడు, అశోకుడు, లలితాదిత్యుడు, అవంతీవర్మ, రాజా హరిసింగ్ వంటి యోధానుయోధులు పాలించిన కాశ్మీరంలో కల్లోలం తగ్గాలంటే శ్రీకృష్ణ రాయబారం ఐక్యరాజ్యసమితిలో, బ్రిక్స్‌లో వినిపిస్తూనే అపుడపుడు శాంతి కపోతాలను పంజరంలో దాచి శస్త్రాస్త్రాలకు పదునుపెట్టాల్సిందే. సౌదీ అరేబియా, ఇరాన్‌ల నుండి మొదలుపెట్టి వియత్నాం, కంబోడియా, థాయ్‌ల్యాండ్, మలేషియా, సింగపూర్, మాల్దీవుల వరకు విస్తరించిన శ్రీకృష్ణ ప్రబోధిత హైందవ సంస్కృతికి జవజీవం పోయాలంటే దేశ దేశాలను తనవైపు త్రిప్పేందుకు శ్రీకృష్ణుడు ధర్మయుద్ధం చేయించినట్లే ఈ రోజు ధార్మిక రాయబారం చేయడానికి మోదీ లాంటి నాయకుడి అవసరం ఉంది. 

శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా యోగ సందేశం ఇచ్చాడు. ఆ యోగవిద్యను ఈ రోజు ప్రపంచం అంగీకరించింది. 50కిపైగా ముస్లిం దేశాలను, ఇతర మతాల ప్రాబల్యం ఉన్న దేశాలను ఒప్పించి శ్రీకృష్ణ యోగాన్ని అందిస్తే ఈ నేలపై దేహం, దేశం, దేవుడు మూడూ బాగుంటాయి.

చిన్ననాడే పూతనను చంపి, యుక్తవయస్సులో కంసవధ చేసి, జరాసంధుణ్ణి, శిశుపాలుడిని సంహరించిన శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకొని కదా ఒక రాంప్రసాద్ బిస్మిల్, వాసుదేవ బలవంత్ ఫడ్కే, అనంత లక్ష్మణ కన్హారే, మదన్‌లాల్ థ్రింగా, బాజీప్రభు, గురుతజ్ బహదూర్, ఉద్యమ్‌సింగ్, భగత్‌సింగ్‌లు నేలతల్లి కోసం ప్రాణాలు బలి చేశారు. వారి స్ఫూర్తితో దేశం కోసం సైనికులు రాత్రింబవళ్లు పనిచేస్తూ ప్రాణాలు అర్పిస్తున్నారు. ఇక, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)లో నమోదు కాని 40 లక్షల మంది అక్రమ చొరబాటుదారులను ఈ దేశం నుండి పంపాలంటే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించే ఆధునిక ‘రాజకీయ పూతనల’ కుటిల రాజకీయాలను శ్రీకృష్ణునిలా మోదీ ఎదుర్కోవాల్సిందే!

దురాక్రమణకు, అణచివేతకు వ్యతిరేకంగా కారల్ మార్క్స్ కన్నా, జోసెఫ్ స్టాలిన్ కన్నా, మావో కన్నా ముందే 5 వేల ఏళ్లనాడు శ్రీకృష్ణుడు దారిచూపాడు. మానవజాతి చరిత్ర మొత్తంలో శ్రీకృష్ణుడు మాత్రమే అణచివేతపై మొదటిగా ఉద్యమించాడు. ఆయన తన జీవితాన్ని అన్ని పార్శ్వాల్లో అన్ని వేదికల్లో ఏ నియమాలు పాటించకుండా నియమబద్ధంగా పోరాటం చేసాడు. 

అందుకే శ్రీకృష్ణుడి గురించి ఆధునిక తత్వవేత్త ఓషో అన్నమాటలు.. ‘అతడు ప్రేమను తిరస్కరించాడు. మగవాడై ఉండి స్ర్తిలకు దూరంగా పరుగెత్తాడు! దేవుడిని తెలుసుకున్నవాడిగా ఉండి యుద్ధానికి వెనుదీయడు. అతడు ప్రేమతో, కరుణతో నిండి ఉన్నా యుద్ధాన్ని అంగీకరించే, యుద్ధం చేసే ధైర్యం గలవాడు. శ్రీకృష్ణుడి హృదయం పూర్తిగా అహింసతో నిండి ఉన్నా అతడు హింసాగ్నిలో దూకడానికి భయపడడు. అతడు అమృతాన్ని అంగీకరిస్తూనే విషాన్ని చూసి భయపడడు’- అనేవి అక్షర సత్యాలు. ఈ రోజు భారత రాజకీయాలు మొదటిసారి శ్రీకృష్ణ రాజనీతి పంథాలో సాగుతున్నాయి. అవి అర్థం కాని సంధి దశలో ఉన్న నాయకులు సంఘర్షణతో కొట్టుమిట్టాడుతున్నారు.

మితిమీరుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రజల్లో అశాంతి పెరుగుతోంది. ఈ అశాంతిని సెలబ్రిటీల పేరుతో, పార్టీల పేరుతో, కులాల పేరుతో కొందరు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు పనికొస్తాడు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మఫల త్యాగ సిద్ధాంతం అశాంతిని దూరం చేస్తుంది. నేనే చేసేవాడిని అన్న అహంకారం ఉన్నంతకాలం మనుషులు అధికారం కోసం వెర్రివాళ్లవుతారు. సన్యాసం తీసుకోవడం కూడా ఒక కర్మగా భావిస్తే అందులోనూ అహం చేరుతుంది. 

శ్రీకృష్ణుడు చెప్పిన ‘నేను అనే అహాన్ని’ మాయం చేసే కర్మనే నిజమైన సేవాదృక్పథం. ఎక్కడైతే చేసేవాడూ, చేయబడడం ఉండదో అక్కడ సరైన రాజకీయం నడుస్తుంది. ఈ వౌలిక సూత్రాలను గమనించకుండా అంధుల్లా డబ్బు, అధికార మదంతో, అనువంశిక వారసత్వంతో పదవి పొందాలనుకొనే ఆధునిక దుర్యోధనులకు సింహస్వప్నంలా ఉండేది ఈ శ్రీకృష్ణ రాజనీతే. ఇది ఇపుడిపుడే ఆరంభమైంది. ఎన్నికల రూపంలో కురుక్షేత్రం మొదలైంది. దాని లక్ష్యం ధర్మరాజ్య స్థాపనే!

**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి