1952 అక్టోబర్ చివర్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అస్సాం పర్యటనకు వెళ్తూ, మధ్యలో కొద్దిసేపు కలకత్తాలో ఆగాడు. తూర్పు బెంగాల్‌లో అల్పసంఖ్యాకులైన హిందువులపై ఘోరమైన అకృత్యాలు జరుగుతున్న సమయం అది. ఈ విషయంలో పాకిస్తాన్‌తో దృఢ వైఖరి అవలంబించాలని జాతీయవాద నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అక్కడ నెహ్రూకు విజ్ఞాపన పత్రం సమర్పించాడు. అవసరమైతే పాక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించి, అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టాలని కోరాడు. తన వినతిని నెహ్రూ సీరియస్‌గా తీసుకోనందున ముఖర్జీ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనుకొన్నాడు. 1952 అక్టోబర్ 16న కలకత్తాలో, అదే నెల 26న ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ప్రజాసోషలిస్ట్ పార్టీ నేత ఆచార్య కృపలానీ, హిందూ మహాసభ నేత ఎన్సీ ఛటర్జీ పాల్గొన్నారు. కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడానికి బదులు ముఖర్జీపై బురద చల్లడం మొదలుపెట్టారు.
స్వాతంత్య్రం రాకముందూ, వచ్చాక ఎప్పుడూ జాతీయవాద శక్తులకు వ్యతిరేకంగా పనిచేయడమే కమ్యూనిస్టుల పని. ఈరోజు కూడా ఏ పత్రికను, ఏ టీవీ చూసినా ఏ.రాజా దగ్గర నుండి కె.నారాయణ వరకు, ప్రకాశ్ కరత్ నుండి తమ్మినేని వీరభద్రం వరకు ‘మతోన్మాద శక్తులపై పోరాటం చేస్తాం’ అని ప్రకటనలిస్తుంటారు. వారి దృష్టిలో అది ఏ మతోన్మాదం అంటే- హిందూ మతోన్మాదమే. వారు ఇంకే మతోన్మాదం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. మతోన్మాదాన్ని అడ్డుకొంటే ఫరవాలేదు గాని ఆ ముసుగులో జాతీయవాదాన్ని అడ్డుకునేందుకు శపథం చేస్తుంటారు. హిందుత్వం అంత ప్రమాదకరమైనదా?
హిందూ జాతీయవాదంపై 1925నుండి వారు పోరాటం చేస్తున్నా, అది రోజురోజుకూ రాజకీయంగా ‘్భజపా’ రూపంలో బలపడిందే కానీ నాశనం అయిపోలేదే? కమ్యూనిస్టు దేశాల్లో ఇప్పుడు వారు చెప్పే మతాలు కమ్యూనిజాన్ని కాపాడాయా? భారత్‌లో హిందువులు మెజార్టీగా ఉన్నన్ని రోజులే ‘సెక్యులర్’ పదం వినబడుతుందని విదేశీ మేధావులు చెప్తుంటే ఇక్కడి కమ్యూనిస్టుల చెవికి ఎందుకు ఎక్కదు? వర్గ దృక్పథంతో ‘ఎర్ర’బడ్డ కళ్లకు కాషాయం ఎందుకు కటువైంది?
‘హిందూ ఫోబియా’కు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి? వారికి లోలోపల ఎక్కడో తాము హిందువులకు ‘అన్యాయం చేస్తున్నాం’ అన్న తలంపు ఉంది. అందుకే ఇటీవల కేరళలో కమ్యూనిస్టులు వినాయక చవితికి గణేశుణ్ణి నిలబెట్టినట్లు సిపిఐ నేత మధు స్వయంగా ఓ టీవీ చర్చలో ఒప్పుకొన్నాడు. గత ఏడాది శరన్ననవరాత్రుల్లో దుర్గాపూజ, నిన్నగాక మొన్న శ్రీరామనవమి శోభాయాత్రను వీర సెక్యులర్ వాది మమతా బెనర్జీ నిర్వహించడం చూశాం. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఎన్నో దేవాలయాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం, ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో మఠాలు, స్వాముల చుట్టూ తిరగడం ఇందులో భాగమే. మోదీని ఒక్కణ్ణే ‘హిం దూ ఛాంపియన్’గా చేయడం రాహుల్‌కు ఇష్టం లేదని, ఇదంతా రాజకీయంగా మోదీని దెబ్బగొట్టడానికే అని విశే్లషకుల అభిప్రాయం.
‘హిందూ ఫోబియా’ను చూపించి గత డెబ్బై ఏళ్లు రాజకీయాలు నడిచాయి. కానీ నకారాత్మకంగా అది ఈరోజు విశ్వరూపం ధరించింది. 2019 ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ప్రతి విషయం రాజకీయ రంగు పులుముకుంటుంది. ఉదాహరణకు జమ్మూలోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను 3నెలల క్రితం కొందరు అత్యాచారం చేసి, హత్యచేశారు. నిందితులు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా చట్ట ప్రకారం శిక్షించాలి. కులం, మతం గురించి రంధ్రానే్వషణ తగదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు మీడియా మోదీని, భాజపా-పీడిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని దోషిని చేయడానికి ప్రయత్నిస్తోంది. దానికి కౌంటర్‌గా భాజపా వాళ్లు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ దేశంలో జరిగే ప్రతి అత్యాచారంలో, అల్లర్లలో కులం, మతం గురించి ఆరా తీసే పని మొదలయ్యింది. అలా చరిత్ర తవ్వితే ఏం తెలుస్తుందో అందరికీ తెలుసు. జమ్మూలో హిందువులు, కాశ్మీర్‌లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటారు. కథువా ఘటనను కర్నాటక ఎన్నికల కోసం వాడుకోవాలని ప్రయత్నం మొదలయ్యింది. రేపిస్టులైన నిందితులకు భాజపాకంటే కాంగ్రెస్‌వారే ఎక్కువ వెన్నుదన్నుగా నిలబడ్డారు. ప్రముఖ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన బి.యమ్.సధియా (అక్కడి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు) నిందితులకు అనుకూలంగా మాట్లాడినట్లు జాతీయ టీవీ ఛానళ్లు బట్టబయలుచేశాయి. కాంగ్రెస్ జమ్మూలో రాజకీయం మొదలుపెట్టగానే భాజపా చేతులు ముడుచుకొని కూర్చోదుకదా! కాశ్మీర్ సంకీర్ణ సర్కారులో భాజపాకు చెందిన మంత్రులు లాల్‌సింగ్, చాంద్‌ప్రకాశ్ గంగ్ మంత్రివర్గం నుండి వైదొలిగారు.
ఈ చర్చను ఇంతటితో ఆపకుండా, దేశంలో రేప్‌లు చేసినవారి కులాలు, మతాల గురించి గణించడం మొదలుపెట్టారు. బిహార్‌లోని ససారంలో 5 ఏళ్ల హిందూ బాలికను ఓ ముస్లిం అత్యాచారం చేశాడని, నగరోటాలో షానవాడ్ అనే వౌల్వీ ముస్లిం బాలికపై అత్యాచారం చేసినా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎందుకు వౌనంగా ఉన్నాడని భాజపా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఇలా ప్రతి విషయంలో మతపరమైన విభజన రాజకీయంగా ఏ పార్టీకైనా లబ్ధి చేకూరుస్తుందేమో గానీ జాతి సంక్షేమానికి గొడ్డలిపెట్టు అవుతుంది. ఇక కమ్యూనిస్టు పత్రికలు, మీడియా ఓ అడుగుముందుకేసి ఇవన్నీ హిందువుల వల్లనే జరిగాయన్నట్టు ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. నిజానికి హిందూధర్మం మూలాలు సెక్యులర్ భావనను కలిగి ఉ న్నాయి. ఇజ్రాయిల్ జ్యూస్‌లతో దేశంగా ఏర్పడ్డాక తమ మొదటి పార్లమెంట్ సమావేశంలోనే ‘్భరత్ మాత్రమే మమ్మల్ని వంచించని ఏకైక దేశం’ అని పేర్కొంది. హిందూ సమాజంపై వారు ఎంతో గౌరవభావం ప్రదర్శించారు. కానీ, గతంలో కాంగ్రెస్ ‘సెక్యులర్ ప్రభుత్వం’ ఆ దేశంతో బహిరంగంగా సంబంధాలు నెరపలేదు. పాలస్తీనా ముస్లిం నియంతృత్వ రాజ్యం కాబట్టి ఇజ్రాయిల్‌తో సంబంధాలు పెట్టుకొంటే ఇక్కడి మైనార్టీలు తమకు ఓటువేయరనే కుత్సితభావం ఇందులో దాగి ఉంది. ఇజ్రాయిల్ మనకు సాంకేతిక, రక్షణ, వ్యవసాయ రంగాల్లో ఎంతో తోడ్పడినా మనం బయటకు చెప్పుకోలేకపోయాం. మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇక్కడి సూడో సెక్యులర్‌వాదులకు ఇష్టం లేదు. దీనికి కారణం రాజకీయ పార్టీలు మత సంతుష్టీకరణ ద్వారా ఓటు బ్యాంక్‌ను సుస్థిరం చేసుకోవడం.
మన దేశంలో మెజార్టీ ప్రజలైన హిందూ జాతితో కలిసి ఎన్నో మతాలు జీవిస్తున్నాయి. గ్రీక్స్, రోమన్స్, యూదులు, పార్సీలు, జ్యూస్‌లు ఇక్కడ జాతీయతతో ఏకం అవుతున్నాయి. కేంబ్రిడ్జ్, మైసూర్ విశ్వవిద్యాలయాలు ఇక్కడున్న ప్రజలందరు జన్యుపరంగా ఒక్కటే అని తేల్చి చెప్పినా ఓట్లవేట ఈ దేశాన్ని విభజిస్తూనే ఉంది. ఈ విభజనలో లౌకికవాద శక్తుల బండారం బయటపడసాగింది. దాని ప్రభావమే ఈరోజు జాతీయవాద మూలాలున్న భాజపా విస్తరణ దేశం నిండా పరచుకొంటోంది. ఇన్నాళ్లూ మతం పేరుతో విభజన చేసి, హిందూ ఫోబియాను చూపినవాళ్లు 2014 తర్వాత పునరాలోచనలో పడ్డారు. మెజార్టీ-మైనార్టీలుగా సమాజాన్ని విభజిస్తే మెజార్టీ ప్రజలు మోదీవైపు నిలబడ్డారు. దీంతో వారు ఇపుడు కులం పేరుతో హిందువులను చీల్చేప్రయత్నంలో పడ్డారు. కర్ణాటక ఎన్నికల వేళ లింగాయత్‌లను మైనార్టీలుగా గుర్తించాలని సీఎం సిద్ధరామయ్య వేసిన ఎత్తుగడను సెక్యులర్ మీడియా గొప్ప చాణక్యంగా కీర్తిస్తోంది. అంబేడ్కర్‌ను, మహాత్మా పూలేను స్వంతం చేసుకోవాలని క్రొత్తక్రొత్త శక్తులు తెరమీదకు వస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు అంబేద్కర్ భక్తులుగా నటిస్తున్నారు. ఆఖరుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాబాసాహెబ్ జయంతి నాడు క్రైస్తవులుగా మారిన వాళ్లకు ఎస్సీ హోదా ఇస్తానని ప్రకటించాడు.
నిజంగా క్రైస్తవులపై ప్రేమ ఉంటే భాజపాతో అంటకాగినపుడు ఈ ప్రస్తావనను చంద్రబాబు ఎందుకు తేలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! జాతీయవాద శక్తులను రాజ్యపాలనలో అడ్డుకోవడమే ఈ ముప్పేట దాటి. హిందూ సమాజంలో అలజడి రేకెత్తించి ఆత్మరక్షణలో పడేయడం కూడా అత్యాచార ఘటనలను చిలువలు పలువలు చేయడంలో దురుద్దేశం. విచిత్రం ఏమిటంటే ‘హిందూ ఫైర్‌బ్రాండ్’ ప్రవీణ్ తొగాడియాను ఇన్నాళ్లు తిట్టిపోసిన మీడియా ఒక్కసారిగా ఆయనపై ప్రేమ ఒలికించడం మొదలుపెట్టింది. మోదీతో పొరపొచ్చాలు ఉన్నాయని తొగాడియాను విలన్‌ను చేయడమే మీడియా లక్ష్యం. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ గతంలో మోదీని విమర్శించగానే ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మోదీపై ఒంటి కాలిపై లేవగానే అతణ్ణి భావి ప్రధానిగా అభివర్ణించారు. కేజ్రీవాల్ చల్లబడగానే కన్హయ్య కుమార్‌తో మోదీని బండబూతులు తిట్టించారు. మొన్న కేసీఆర్ మోదీని విమర్శించడం మొదలుపెట్టగానే మూడు రోజులు కేసీఆర్‌కు నిద్రపట్టకుండా చేశారు. ఎన్టీయే నుండి చంద్రబాబు బయటకురాగానే గతంలో ఆయన మోదీ గురించి చెప్పిన విషయాలను తెలుగు మీడియా ఆపకుండా ప్లేచేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టంపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలిచ్చినా, ఎన్‌ఐఏ కోర్టు మక్కా పేలుళ్ల నిందితులను నిర్దోషులుగా తేల్చినా అన్నింటికీ భాజపా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే ప్రధాన ఎజెండాగా సాగుతోంది. దీన్ని జాతీయవాదంపై జరిగే ‘ముప్పేట దాడి’గా హిందుత్వ శక్తులు గుర్తించకపోతే మొదటికే మోసం రావడం ఖాయం.
********************************************************
Published Andhrabhoomi :
Friday, April 20, 2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి