ఓ పాశ్చాత్య స్త్రీ తన భర్తతో “నీ కొడుకు, నా కొడుకు కలిసి మన కొడుకును కొడుతున్నారు” (“Your Children, my children are Quarreling with our children”)   అని ఫిర్యాదు చేసిందట. పాశ్చాత్య దేశాల్లో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వివాహాలు, ఉద్యోగాలు, ఇళ్ళు మార్చడం సర్వసాధారణం. దానివల్ల ఆమెకు వేరే పురుషుని వల్ల పుట్టిన కొడుకు, ఇతనికి వేరే స్త్రీ వల్ల పుట్టిన కొడుకు, మళ్ళీ వీళ్ళకు పెళ్ళాయాక పుట్టిన కొడుకు మధ్య జరిగిన కొట్లాటను గురించిన సంఘటన పైన చెప్పబడింది.

పాశ్చాత్య దేశాల్లో కుటుంబాలు, వాటి అనుబంధాలు చాలా విచిత్రమైనవి. పశుపక్ష్యాదుల్లా ‘స్వేచ్ఛా లైంగిక వాంఛలు’ వారి సొంతం. మెల్లమెల్లగా విస్త్రృత మత మార్పిడులు, పాశ్చాత్య భావజాలం నూరిపోసే సంస్థల మూలంగా మనకూ ఆదుస్థితి దాపురిస్తుందనడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఓ నిదర్శనం. 

ఈ విషయంలో మనం కోర్టులను నిందించాల్సిన అవసరం కూడా లేదు. కానీ 135 కోట్ల భారతదేశంలో కొద్దిమంది మాత్రమే ఇలాంటి బాధితులుంటారన్నది సుస్పష్టం. కానీ అలాంటి కొద్దిపాటి సంఘటనలను సరిచేయడానికి కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడుప్పుడు లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తాయనడానికి ఇదొక నిదర్శనం.

“వివాహేతర బంధం విషయంలో మహిళ, పురుషుడూ ఇద్దరూ పాల్గొన్నపుడు పురుషుడు మాత్రమే నేరం చేసినట్లు పరిగణించడం సరికాదు” అనే పట్‌వర్ వాదనకు సుప్రీంకోర్టు ధర్మాసనం” అసలు.. 497 ఐపీసీ చెల్లదు. ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడం నేరమే కాదు. అంటే... ఇందులో మహిళదీ, పురుషుడిదీ తప్పుకాదు. పరస్పరం ఇష్టపడినపుడు శృంగారంలో పాల్గొనడం నేరం కాదు” అని తీర్పును ఇచ్చింది. 158 సంవత్సరాల ఐపీసీ సెక్షన్ 497 భార్యల లైంగిక ప్రాధాన్యతను తగ్గిస్తుందని కూడా న్యాయమూర్తులు పేర్కొన్నారు.

దేశం మొత్తం మీద దీనికి హర్షం ప్రకటించిన వాళ్ళలో కమ్యూనిష్టు పార్టీ నాయకురాలు బృందాకారత్, సామాజిక ఉద్యమకారిణి రంజన కుమారి, అర్ధరాత్రి కోర్టులు తెరిపించి సరిక్రొత్త దేశభక్తులకు సహాయపడే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో చిటుక్కుమన్నా స్పందించే ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఇది ‘అభ్యుదయమైన తీర్పు’ అని పేర్కొన్నది. 

వెంటనే అసదోద్దీన్ ఓవైసీ “గేసెక్స్ నేరం కాదు... వివాహేతర సంబంధం నేరం కానపుడు త్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది అన్నారు” విచిత్రంగా ఈ కేసులో ప్రధాన పిటిషనర్ జోషెఫ్ షైన్ అనే వ్యక్తి అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఈ దేశంలో ఫ్రాయిడ్ వారసులకేం కొదవలేదు. “లార్డ్ బైరన్ అనే ప్రసిద్ధ పాశ్చాత్యుడు పెళ్ళయ్యేనాటికే 60 మంది స్త్రీలతో సంబంధాలు నెరపి పెళ్ళిరోజు చర్చి మెట్లు దిగుతున్నపుడు తారసపడ్డ అమ్మాయి గురించి కారు ఎక్కక ముందే” ఆ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పాడట. కామించి, ప్రేమించు అనే పాశ్చాత్య భోగవాదం ఈ దేశంలోకి తీసుకురావడానికి వ్యాపార దృష్టి ఓ కారణం. 

అందుకే ప్రేమికుల రోజు పబ్బులు, క్లబ్బులు, గబ్బులు, నిండిపోవడం వెనుక ఉన్న అసలు మతలబు అదే. దాని దుష్పరిణామాలే ఇటీవల మన దేశంలో పంజాబ్ ‘ ఉడ్తా పంజాబ్’ గా మారడం, హైదరాబాద్‌లో కాఫీ షాప్‌ల పేరిట హుక్కా సెంటర్లు, స్కూళ్ళు, కళాశాలల్లో డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా సాగడం వెనకున్న రహస్యం ఇదే.

మన దేశంలో వివాహవ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఈ రోజుకూ చాలా పటిష్టంగా ఉంది. నవీన నాగరికత ఎంత ముదిరినా దాని మూలం చెదిరిపోకుండా అది రూపాంతరం చెందుతున్నది కానీ ధ్వంసం కావడం లేదు. కామం తీవ్రత తెలిసిన మన పెద్దలు విధి  నిషేధాలను చాలా జాగ్రత్తగా చేసారు. ఎక్కడ  నిషేధం ఉంటుందో అక్కడ అది స్వాగతమే. ఆడమ్  ఈవ్ విషయంలో అదే జరిగింది కదా!

అందుకే మన వాళ్ళు కథల రూపంలో శృంగారాన్ని అందించారు. వాత్సాయన ఋషి కామ సూత్రాలను ప్రపంచం కళ్ళు తెరవని నాడే అందించాడు. కామాన్ని అర్థం చేసుకోవడానికే బ్రహ్మచర్యం, గార్హస్థ్య జీవనాలను పొందుపరిచారు. దాని తీవ్రతను నిషేధం చేయకుండా వివాహ వ్యవస్థ ద్వారా స్థిరత్వం కల్పించారు. ఒక్క క్షణం కలిగే సంభోగ పరాకాష్టను విస్మరించడం, అణగదొక్కడం కాకుండా ఉదాత్తస్థితిలో దానిని అనుభవించే అవకాశం వివాహం ద్వారా కల్పించారు. కామభావాన్ని రామభావంగా తీర్చిదిద్దారు. 

మన నాగరికతా బీజాలను వేలయేళ్ళ నుండి సంరక్షిస్తూ చిన్న మొక్క నుండి ఫలపుష్పాదులతో నిండియున్న వటవృక్షంగా మార్చారు. దీని వేర్లను పీకే ప్రయత్నం బ్రిటీషు కాలం నుండే జరుగుతోంది. మొఘల్‌పాలనలో దీన్ని కదిలించడం వాళ్ళచేతగాక విత్తనాలనే తమ ఇళ్ళల్లో నాటుకున్నారు. 

కామప్రవృత్తి నుండి మనిషిని జంతువుగా మార్చకుండా ఉంచే కుటుంబ వ్యవస్థ కాపాడింది. అయితే వ్యక్తుల దుష్పరివర్తన, వ్యక్తిత్వహననం, వికృతమనస్తత్వం, పరిస్థితుల వల్ల అది కొంత అక్కడక్కడ అనారోగ్యకరంగా తయారయ్యింది.
శరీరం జడం అయినా అది మనస్సు చెప్పినట్లు వింటుంది. ఫ్రాయిడ్ నుండి యంగ్ వరకు అందరూ శరీరంలో జరిగే మార్పులను మనస్సుకు ఆపాదించారు. 

పాశ్చాత్యుల కామస్థితి చంచలంగా ఉన్నందువల్ల అక్కడ వివాహాలు భగ్నమై, సంసారాలు కుప్పకూలి విడాకులవైపు పరుగెడుతున్నాయి. దాంతో అక్కడి సాంఘీక వ్యవస్థ అతుకుల బొంతగా మారింది. మనస్సుల కలయికతో మాత్రమే జరిగే సంసారాలు మనసులు మారినపుడు క్రిందా మీదా అయిపోతాయి. ఈ అంటురోగం మన సమాజంలోకి వ్యాప్తి చెంది ఫ్యామిలీకోర్టుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే మన సమాజంలో మనస్సు స్థాయిలో ఉండే కామవాంఛకోసమే విడాకులు జరగడం లేదు. ఆర్థిక విషయాలు, స్థాయీభేదాలు, అపరిపక్వ మనస్తత్వాలు, అవగాహనరాహిత్యం, మాట పట్టింపులు... ఇలా ఎన్నో విషయాలు ఈ కుటుంబ వ్యవస్థ విధ్వంసానికి దోహదం చేస్తున్నాయి. 

“ఉన్న నాలుకకు మందువేస్తే కొండనాలుక ఊడిపోయిందన్నట్లు” కోర్టులు దూరదృష్టితో, విస్త్రృత సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పకుండా చేసే వ్యాఖ్యలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంది. స్త్రీ స్వేచ్ఛ, లైంగిక సమానత్వం పేరిట స్త్రీ హక్కులను రక్షించడానికి చేసే చర్య పురుషులకు విశృంఖలత్వాన్ని ప్రదర్శించేందుకు దోహదం చేయకూడదు. వ్యభిచారాన్ని పరోక్షంగా చట్టబద్దం చేసే విధంగా వ్యాఖ్యానం జరుగుతున్నది.

 ఇటీవల ‘స్వలింగ సంపర్కం’ తప్పుకాదు అని కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పాశ్చాత్యుల నుండి దిగుమతి అయిన అపరక్యాన్సర్ ఎయిడ్స్‌తో మన దేశం కూడా బాధపడుతోంది. కొత్త కొత్త లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా ప్రకృతి విరుద్ధమైన చర్యలకు ఆమోదముద్ర వేసినట్లు అవుతుంది. ఇది పత్రికలకు, టీవీలకు మంచిమసాలా కావచ్చుగాక. సమాజ ప్రవర్తనా నియమాల దృష్ట్యా అనారోగ్యకర చర్యలకు మాత్రం ఆస్కారం కల్పిస్తుంది. పాశ్చాత్యుల జైళ్ళలో ఏళ్ళ తరబడి నిర్దాక్షిణ్యంగా బంధించడం వల్ల ఏర్పడ్డ ‘అసహజ చర్యలు’ మెల్లమెల్లగా ప్రపంచాన్ని తాకుతున్నాయి. దాని పర్యవసానమే స్వలింగ సంపర్కుల వివాదం.

 వయోభేదంతో సంబంధం లేకుండా శబరికొండ మీద ఉన్న అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది. తెలుగు దినపత్రికలన్నీ ఈ కేసులు వేసిన పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి. ఇందులో కూడా ఏం మతలబు ఉందో తెలియదు. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ కేసులో పోరాటం చేసింది నౌషాద్ అహ్మద్‌ఖాన్ అని తెలుస్తుంది.

 అంటే హైందవ దేవాలయాల ఆగమ శాస్త్రాలను సవాల్ చేస్తున్నది ఎవరు?! అయితే ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూమల్హోత్రా దీనిని వ్యతిరేకించింది. మతపరమైన విశ్వాసాలు కోర్టులు తేల్చలేవని ఆమె తేల్చి చెప్పింది.

నిజానికి ఈనాటి సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ప్యూబర్టీ స్టేజి నుంచి మెనోపాజ్ దశ వరకున్న స్త్రీలకు మాత్రమే ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. హిందూ స్త్రీలు బహిష్టు సమయంలో ఏ దేవాలయానికి వెళ్ళరు. ఇది కోర్టుల ఆదేశాలకన్నా మహిళలు నైతికంగా స్వీయ నియంత్రణగా పెట్టుకున్నారు. 

51 శక్తిపీఠాల్లో కామాఖ్య దేవాలయంలో స్త్రీలే పూజలు చేస్తారు. తంత్ర విధానంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది. అయ్యప్పదీక్షలో చన్నీటి స్నానం, భూతలశయనం, పాదరక్షలు లేకుండా పాదచారులై నడవడం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం,  మధుమాంస నిషేధం వంటి కఠిన నియమాలున్నాయి. స్త్రీ, పురుషులు కలిసి ఆలయంలోకి వెళ్ళడం వల్ల మనోచాంచల్యం కలుగరాదని మాత్రమే పెట్టిన నియమం కాదిది.

అక్కడి స్థలపురాణంలో కొన్ని కథలు ఈ నిషేధం విధించాయి. మహిళలపైనే వ్యతిరేకతతో నిషేధం ఉంటే కొన్ని వయసులవారికి ఎందుకు ప్రవేశం ఉంటుంది? కావున ఇది మహిళా వ్యతిరేక దృష్టి కానేకాదు. దీనిని హిందూ వ్యతిరేక దృష్టికలవాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మన శాస్త్రాల్లో చెప్పిన విషయాలు మనం విశ్వసించంగాని పాశ్చాత్యులు చెప్తే తలకెత్తుకుంటాం. టమాటో అనే జపాన్ శాస్త్రవేత్త 20 ఏళ్ళు స్త్రీ, పురుషుల రక్తంపై పరిశోధన జరిపి పురుషుల రక్తంలో లేని ఒక ప్రత్యేక గుణం స్త్రీ రక్తంలో ఉంటుంది, ఋతుస్రావ సమయంలో స్త్రీ రక్తం పలుచన అవుతుంది.

స్త్రీలలో జరిగే మార్పుల వల్ల వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతారని వారికి విశ్రాంతి అవసరం అన్నారు. అందుకే స్త్రీలు బహిష్టు ఉన్న సమయంలో వారి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు వారికి ఇంటి పనులు కూడా నిషేధంగా పెట్టారు. ఇదంతా ఒక పెద్ద చర్చ. అయితే కోర్టులు ఇలాంటి తీర్పులు ఇచ్చినపుడు కొందరు కోర్టులకు వెళ్ళిన వ్యక్తులకు న్యాయం చేయాలనే స్ఫూర్తితో చేస్తారు. కానీ దాని ప్రభావం సమాజంపై ఎలా అన్నది కూడా ఆలోచించకపోతే ‘కోర్టు తీర్పులు కోటి ప్రశ్నలు’ తలెత్తి అనంతకోటి సమస్యలుగా మారే అవకాశం ఉంది.

********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*వర్తమాన భారతం : విజయక్రాంతి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి