కుఛ్ ఆర్జూ నహీహై, హై ఆర్జూతో యహ్ హై
రఖ్‌దే కోరుూ జరాసీ ఖాక్ వతన్‌కీ కఫ్‌న్‌మే

నాకు ఇతరమైన ఏ కోరికా లేదు; ఉన్నదల్లా ఒక్కటే. నా శవాన్ని కప్పే వస్త్రం (కఫన్)లో ఎవరైనా కొద్దిగా నా దేశపు మట్టిని పెడితే చాలు.

ఇంత గొప్ప త్యాగబుద్ధితో ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన అష్ఫాఖుల్లాఖాన్ తనను ఉరితీసే చివరి రోజుల్లో అన్నమాటలు ఇవి. ఒక దేశభక్తుడు ఈ దేశం కోసం అంతగా తపించి స్వాతంత్య్రం సంపాదించేందుకు తనను తాను అర్పించుకొన్నాడు. 

ఈ రోజు మనం దేశం కోసం ప్రాణాలు వదలాల్సిన అవసరం లేదు. కనీసం ఎవరి ఓటు హక్కును వాళ్లు వినియోగించుకొని దేశానికి సుస్థిర, అవినీతి లేని, స్వార్థబుద్ధి లేని వ్యక్తులను ఎన్నుకొంటే అదే పదివేలు.

‘‘నా ప్రజలకు ఓటుహక్కు వజ్రాయుధం నేను ఇచ్చాను. దానితో వారి భవిష్యత్తు వారే నిర్ణయించుకోగలరు’’ అని డా బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటల్లో అంతరార్థం ఇదే. ఈ దేశంలో ‘‘స్వాతంత్య్రం వచ్చాక కొన్నాళ్లు నియంతృత్వ పాలన ఉండాలి’’ అని నేతాజీ సుభాస్ చంద్రబోస్ లాంటి వీరయోధులు ప్రతిపాదించారు. 

వెయ్యేళ్ల బానిసత్వం కారణంగా ఈ దేశం కూసాలు కదిలిపోయాయి. ఈ దేశ వౌలిక భావనలు పలుచన అయ్యాయి. ఈ దేశానికి కావలసిన ఆలోచనలు కొరవడ్డాయి. ఆకలిగొన్న మనిషి ముందు అమృతం పెడితే అది తినాలో, త్రాగాలో తెలియని దుస్థితి. సరిగ్గా మనకు ‘ప్రజాస్వామ్యం’ అనే అమృతం ఎలా ఉపయోగించుకోవాలో తెలియని దుస్థితి.

 ఉదాహరణకు గతంలో హైదరాబాద్ నగరంలో జిహెచ్‌యంసి ఎన్నికలు జరిగితే అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. నగరం నిండా చదువుకున్న వాళ్లే. అయినా వాళ్ల పరిజ్ఞానం అంతా పత్రికలు చదివి, టీవీలు చూడడం వరకే. ఈ మహానగర జీవులకు ఓటేయడానికి బద్ధకం. 

ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా కదా మన సుపరిపాలనను కోరుకొనేది. మరి నగరం నిండా వున్న బుద్ధి జీవులు ఓటు వేయడానికి ఎందుకు జంకుతున్నారు? నిజంగా ఈ దేశంలో ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రతి పౌరునికీ ఓటు హక్కు తప్పనిసరి చేయాలి. 

అస్తవ్యస్తంగా వున్న భారత ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణ కవచంలాంటి ఓటు హక్కును అన్ని వర్గాలతో వినియోగింపజేసినపుడే రాజ్యాంగ రక్షణ జరిగి తీరుతుంది.
కొందరు ఓ విచిత్రమైన వాదన చేస్తారు. 

ఎన్నికల్లో నిలబడినవాళ్లలో అందరూ అలాగే ఉన్నారు! ఎవరికి మేం ఓటు వేయాలి? అంటుంటారు. పోనీ మీరు ఓటు వేయనంత మాత్రాన ఎన్నికలు ఆగిపోయాయా? గ్రామాల్లో నుండి వచ్చి నగరంలో కూలీలుగా స్థిరపడినవాళ్లు, చిన్న చిన్న గల్లీ లీడర్లతో ప్రభావితం అయ్యే బస్తీ ఓటర్లు, కులాలుగా కలిసున్న గుంపున్న, మతపరమైన చైతన్యంతో ఓటువేసే వాళ్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. ఇపుడు అక్షరాస్యులైన ఓటర్లు సాధించింది ఏమిటి? ఈ వర్గాలు ఎక్కువగా వివిధ ప్రలోభాలకు ప్రభావితం అవుతున్నవారే. వాళ్లు ఎన్నుకున్న వాళ్ల మనసుకు నచ్చిన ‘ఆ మూర్ఖ నాయకుడే’ కదా వాళ్లను, వీళ్లను పాలించేది. 

మనం ఔనన్నా, కాదన్నా ఎన్నికవుతున్న నాయకులే మన నెత్తిన ఎక్కి పాలిస్తున్న మాట వాస్తవం. ఇది గమనించకుండా ఓటు హక్కు వినియోగించుకోకపోవడం ఓ సుపీరియారిటీ అనుకోవడం తెలివితక్కువతనం.

‘‘నోరు లేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాల్ని బలి ఇవ్వరు- గుర్తుంచుకోండి’’ అని రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు. రాజ్యాంగం సాధించిన ఓటు హక్కును నిరాకరించడం నోరులేని మేకల్లా జీవించడమే. 

సూపర్ మార్కెట్‌కు వెళ్లి వారంలో పాడైపోయే వస్తువును కొనేందుకు దాని నాణ్యత, మన్నికను గురించి వందసార్లు విచారించి ఖరీదు చేసేవాళ్లు ఐదేళ్లు మనల్ని పాలించే వ్యక్తుల మంచి చెడ్డల గురించి ఆలోచించలేరా? పూర్వం స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో విలువలు గల వ్యక్తులు రాజకీయాల్లో పోటీ చేసారు. వాళ్ల వెంబడి గౌరవంతో తిరిగే ధనికులు కొన్నాళ్లకు ‘వీళ్ల వెంబడి నేను ఎందుకు తిరగాలి; నేను పోటీ చేస్తాను’ అంటూ ఎన్నికల్లోకి దిగారు. ఈ ధనికులు తమ అధికార సుస్థిరతకు వాళ్ల వెంబడి కొందరు నేర చరిత్ర వున్న గుండాలు, రౌడీలను త్రిప్పుకున్నారు. 

ఇంకొన్ని సంవత్సరాలకు ఈ రౌడీలకు, గుండాలకు వీళ్ల వెంబడి మేము ఎందుకు ఉండాలి; మేం కూడా ఎన్నికల్లో నిలబడతాం’ అన్న ఆలోచన కలిగింది. ఇపుడు సింహభాగం రాజకీయ వ్యవస్థ ఇదే స్థితిలో వుంది. ఆఖరుకు అన్ని విషయాల్లో జోక్యం చేసుకొనే సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో నిస్సహాయత ప్రకటించింది. 

మరి రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటుచేసుకొన్న రాజకీయ పార్టీలకు ఈ విషయంపై స్వీయ నియంత్రణ ఎందుకు లేదు?! ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వాళ్లకు బాధ్యత లేదా? అవినీతి, వంశపాలన, దౌర్జన్యం, ఆశ్రీత పక్షపాతం వంటి దుర్లక్షణాలకు నాయకులు ఎంత కారకులో ఓటువేయని వారు కూడా అంతే బాధ్యులు. 

ఈ రోజు రాజకీయాల్లో కులం, ధనం, బలగం, పార్టీ అనేవి చతురంగ బలాలు. అందుకోసం అందరూ అనేక వ్యూహాలు చేస్తున్నారు. వీటిని అధిగమించేందుకు ఏదో పెద్ద ఉద్యమం వస్తే తప్ప ఇవి అనకొండల్లా కదలట్లేదు. ఈ డెబ్భై ఏళ్లనుండి ఇలాంటి జాడ్యాలు ముదిరి పాకానపడి ఎవరూ కదల్చలేనంత హీన స్థితికి దిగజారాయి. 

ముఖ్యంగా ఈ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. దానివల్ల దేశం మొత్తం ఓ నిశ్శబ్ద విప్లవం మొదలై 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. 

రాజకీయ దురంధరులైన వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు లాంటి కొండల్ని త్రవ్వేసి తెలంగాణ సెంటిమెంటు రగిలిపోయింది. వీళ్ల కుల, పార్టీ, మందబలం, ధనబలాలను తుత్తునియలు చేస్తూ తెలంగాణ అస్తిత్వం ప్రొద్దుపొడిచింది. ఇదంతా ఒక రాజకీయాల సయ్యాట మాత్రమే కాదు. 

వాళ్లకున్న ఈ చతురంగ బలాలను ఎదుర్కోవాలంటే గంగా ప్రవాహంలా సెంటిమెంట్ వచ్చింది. అన్నిచోట్ల ఇలాంటివి పేరుకుపోయినప్పుడల్లా సెంటిమెంట్లు లేస్తున్నాయి. అవే ఈ అధికారాలను కూలదోస్తున్నాయి. 

ఇది మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ క్రీడలు. అక్రమంగా ధనార్జన చేసిన వ్యక్తులు, కుటుంబాలు, కొన్ని కులాలు తమ బలగర్వంతో స్వారీ చేస్తున్నపుడు ప్రజా చైతన్యం వెల్లివిరుస్తుంది. దాని ఫలితాలే బ్రహ్మచారి నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, సర్వసంగ పరిత్యాగి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినా అందులోని రహస్యం ఇదే. 

దేశానికి బ్రహ్మచారులను, సర్వసంగ పరిత్యాగులను ఇంకెంతమందిని సృష్టిస్తాం? ఇందులో నాగరికులైన ప్రజలకు ఎలాంటి బాధ్యత లేదా? సింహం జూలు పట్టి దానినోట్లో చెయ్యి పెట్టే శక్తి మనం ఓటు హక్కు ద్వారా మనం సాధించవచ్చు. 

రాజకీయం ఓ బురద అని ప్రతివాడూ అనుకుంటే ఆ బురదలో పొర్లాడగలిగినవారే దాని మకిలిని అంటించుకుంటున్నారు. వాళ్లే బురదనుండి వచ్చిన కమలాల్లాగా ఫోజులిస్తున్నారు!? ఎంత ఆశ్చర్యం!

గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి నాయకుడూ మా పార్టీ ఇలా చేసింది, అలా చేసింది అంటున్నారు. కానీ వారు వ్యక్తిగతంగా ఏం చేసారో ఎవరూ చెప్పరు. 

రాజకీయాల్లో సర్వస్వం పోగొట్టుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు లాంటివాళ్లు ఈనాటి నాయకుల లక్షల కోట్ల అవినీతి చూస్తే గుండె ఆగి చచ్చిపోయేవారు. 

బారిష్టర్ చదువును బట్టలో గట్టి బంగాళాఖాతంలో విసిరేసి ఈ దేశ సామాన్యుడిలా జీవిస్తాను. బాపూజీ నేషనల్ హెరాల్డ్‌ను అప్పనంగా అమ్ముకోవడానికి కృత్రిమ భాగస్వాములను సృష్టించిన వాళ్లను చూస్తే ఉరి వేసుకొని చావాల్సిందే! 

‘‘కులం పునాదులమీద మీరు ఏదైనా నిర్మించాలనుకొంటే అది పగిలి ముక్కలు గావడం ఖాయం. అట్టిదేదీ ఒక సంపూర్ణ నిర్మాణంగా ఉండజాలదు’’- అన్న డా బాబా సాహెబ్ ఈ రోజు జరుగుతున్న కులం కుళ్లు రాజకీయాలను చూసివుంటే అసహ్యించుకొనేవాడు! 

శవాలపై చల్లిన చిల్లర ఏరి విశ్వవిద్యాలయం స్థాపించిన మాలవ్యా ఈ దేశాన్ని నిండా ముంచి పోయిన మాల్యా, నీరవ్ మోడీలను చూస్తే అగ్నిలో దూకేస్తాడు. 

ఇన్ని మన కళ్లముందు జరుగుతున్నా ఓట్లు వేయకుండా ఇళ్లలో క్రికెట్ మ్యాచ్‌లు చూసే దుస్థితిని చూసి రాజ్యాంగమే తనంతకు తాను ఆత్మహత్య చేసుకుంటుందేమో!

విజ్ఞులైనవాళ్లు అనుకునే వ్యక్తులు ఈ జాడ్యాన్ని వదలి ఓటు అనే వజ్రాయుధం ధరించాలి. లేదంటే కుల, మతాల గుంపులు, నిరక్షరకుక్షులు, స్వార్థవక్తులు, అధికార మదాంధులు తమ స్వప్రయోజనాలకోసం ఓట్ల దాడి చేస్తారు. 

ఓటు వేసేవాళ్లు నిర్భీతిగా శేషేంద్ర చెప్పినట్లు ‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు; తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగుదు, పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు, నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు, కాని కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’’ అన్నట్లు ప్రతి పౌరుడూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్య సౌధం బలోపేతం అవుతుంది’’. 

పని చేయనివాడికీ తిండి తినే హక్కు లేదన్నట్లు ఓటు హక్కును వినియోగించుకోలేని వ్యక్తులకు ఈ దేశ మంచి చెడ్డల గురించి మాట్లాడే హక్కు లేదన్నది అక్షరసత్యం.


*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి