నిజం నిద్రలేచేవరకు అబద్ధం అరవైసార్లు ఆకాశాన్ని చుట్టి వస్తుందని సామెత. ఇటీవల కాలంలో భారతీయ జనతాపార్టీ అలాంటి ఆత్మరక్షణలో పడుతుంటే ఈ సామెత ప్రయోగం ఇక్కడ సరిగ్గా సరిపోతున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనేక ఆరోపణలు చేస్తున్నా వాటికి శాస్త్రీయంగా మెరుపులాగా జవాబు ఇవ్వలేకపోతున్నది బీజేపీ. 2014 తర్వాత మోడీ అధికారంలోకి వచ్చాక వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదు.
నోట్లరద్దు, జీయస్టీ లాంటి సంస్కరణలు చేసినా ఆ దేశంలోని పౌరులు అతను ఏది చేసినా ఈ దేశానికి మంచే చేస్తాడని ఈ రోజుకూ విశ్వసిస్తున్నారు.1977  మార్చిలో ఎమెర్జెన్సీ తర్వాత  ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అవశేషంగా మిగిలింది. దాదాపు అన్ని లోక్‌సభ స్థానాల్లో నాలుగుపార్టీల జనతాకూటమి గెలిచింది. ఆ తర్వాత 2014లో ఒకే పార్టీ అక్కడ  అన్ని సీట్లు గెలిచిదంటే  అది మోడీ, షాల ప్రతిభనే.
మోడీ అధికారంలోకి రావద్దని రాజకీయంగా కాంగ్రెస్ ఎంతగా కోరుకున్నదో, అదే స్థాయిలో సూడో సెక్యులర్ పార్టీలన్నీ బహిరంగంగా వ్యతిరేకించాయి. ఇక్కడ మోడీ వ్యతిరేకత అన్నది రాజకీయంగా అనుకుంటే పొరపాటే. మోడీ వ్యతిరేక గళంలో జాతీయవాద వ్యతిరేకధోరణి ఉంది. అందుకే దేశంలోని ప్రభుత్వం యొక్క నీతివంతమైన పాలన కన్నా కులం, మతం అన్న అంశాలకే చర్చలు పరిమితమయ్యాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక ఎన్జీవోల ఇబ్బడి ముబ్బడి నిధులపై ఆంక్షలు, జవాబుదారీతనం వంటి అంశాలపై దృష్టి సారించింది. దాంతో మత మార్పిడిలు చేసే సంస్థలకు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దాంతో ఆ సంస్థలన్నీ మోడీపై అప్రతిహతంగా దుష్ప్రచారం మొదలు పెట్టాయి. 
అఖ్లాఖ్ హత్య, రోహిత్ వేముల ఆత్మహత్య, అవార్డు వాపసీ, కులవర్గాలపై దాడులు, వివిధ రాష్ట్రాల్లో కొత్త రిజర్వేషన్ల ప్రతిపాదనలు, ఉద్యమాలు, కథువా అత్యాచార ఘటన... వంటివి చర్చలోకి వచ్చాయి. ఇవన్నీ సెంటిమెంట్లు, కులమత ఉద్రేకాలను పెంచడం కోసం అనుకొందాం. కానీ పాలనాపరంగా జీయస్టీ, నోట్లరద్దు లాంటి సంస్కరణలు మనకు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు కలిగించేవే. కానీ మోడీటీమ్ ఇటీవల వీటన్నిటిపై జరుగుతున్న దుష్పరిణామాలు, దుష్ప్రచారాలను అరికట్టలేకపోతున్నది. 
దళితులపై దాడుల విషయం వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్నాయి. అదంతా బీజేపీ లేదా వారి సిద్ధాంత సారూప్యమున్న సంస్థలు చేస్తున్నాయన్న ప్రతిపక్షాల వాదనను బలంగా ఎదుర్కోలేకపోతే 2019లో జరిగే ఎన్నికల ఫలితాలు ఎలా ఎదుర్కొంటారు? ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జనాభా 4 కోట్ల 14 లక్షలు. అలాగే జనాభా ప్రకారం పంజాబ్‌లో 32 శాతం దళితులున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో 66 లోక్‌సభ సీట్లలో దళిత ఓటర్ల ప్రభావం ఉండబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా దళితులపై జరిగే వ్యక్తిగత స్థాయి సంఘటనలు కూడా నరేంద్రమోడీ ప్రక్కన ఉండే చేయించాడన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే ఇంత పేలవంగా సమాధానం ఇస్తే ఎలా? అతి ఎక్కువ దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలో ఈ విషయంపై మాట్లాడేందుకు వారిని ఎవరు నిలువరిస్తున్నారు? హద్దులు మీరిన క్రమశిక్షణ కూడా అప్పుడపుడు హానికారకమవుతుంది అనడానికి ఇది ఉదాహరణ. 
 నోట్లరద్దు తర్వాత బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టకుండా కేంద్రప్రభుత్వం చేస్తున్న తాత్సారం మధ్యతరగతి వర్గాల్లో ప్రభావం చూపనుంది.  ఏటియం మిషన్ల పనితీరు అందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చే ప్రమాదం ఉంది. అలాగే పెట్రోధరలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వంపై కోపం తెప్పించే పరిస్థితులు కన్పిస్తున్నాయి. కనీసం రాష్ట్రాలు ఈ విషయంపై అనుసరిస్తున్న దుర్మార్గాన్ని బట్టబయలు చేయలేకపోవడం ఒకరకంగా ఆత్మరక్షణలో పడడమే. యూపిఏ హయాంలో 150 రూపాయల దాకా ఉన్న కందిపప్పు ధర ఈ రోజు 70 ఉన్నా అది జనాలకు పట్టడం లేదు.
దేశీయ భావజాలం ఉన్న బీజేపీ ప్రభుత్వం స్వదేశీ చమురు నిక్షేపాల అన్వేషణ విషయంలో శ్రద్ధ చూపాలి. దేశంలోని కొత్త చమురు, సహజ వాయునిక్షేపాలను అన్వేషించే ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వేగవంతం చేయాలి. పారదీప్, మంగళూరు, కొచ్చి రిఫైనరీల శుద్ధి సామర్థ్యం ఇప్పటికే విస్తరణ జరిగి ఉంది. అలాగే రాజస్థాన్‌లో బార్మేర్‌లో ఏర్పాటు చేయాలనుకున్న రిఫైనరీని తక్షణ ప్రాజెక్ట్‌గా చేపట్టాలి. సామాన్యులపై భారంవేసి దాచిపెట్టి, దాచిపెట్టి రాష్ట్రాల ఖజానాలు నింపితే వాళ్ళు తమ పార్టీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో వాజ్‌పేయి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొని కూడా స్వర్ణచతుర్భుజి, ఆర్థిక ప్రగతి, సర్వశిక్షా అభియాన్ వంటి విస్త్రృత ప్రాజెక్ట్‌లు చేపట్టారు. ఇదంతా వాజ్‌పేయి సంకీర్ణ ప్రభుత్వంలో చేసారు కాబట్టి మోడీకున్న పూర్తి మెజారిటీని ఉపయోగించి తక్షణ చర్యలు చేపట్టి కొన్ని దీర్ఘకాలిక పనులు చేపట్టాలి. 
మేకిన్ ఇండియా, స్మార్ట్ సిటీలు, ఉజ్జల పథకం వంటి పథకాలకన్నా ఈ దేశ మీడియాకు భావోద్వేగాల పంట పండాలి. కావున బీజేపీ ఎప్పటి నుండో అమలు చేయాలనుకున్న 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో శ్రీరామ మందిరం విషయంలో వెంటనే ముందుకు పోవాలి. 1980 దశకంలో లాల్‌కృష్ణా అద్వాణీ చేసిన రథయాత్ర తీవ్ర సంచలనం రేపి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హిందువులను ఐక్యం చేసింది. ఆ తర్వాత బీజేపీ ఎదుగుతూ వచ్చింది. రామమందిరం ముందుకు జరుగలేదు. చర్చల ద్వారా ఇప్పటివరకు అయోధ్యను ఎవరూ పరిష్కరించలేకపోయారు. కావున పార్లమెంట్ ద్వారా చట్టం చేస్తే రాహుల్ కర్ణాటకలో, గుజరాత్‌లో తిరిగిన గుళ్ళు, మొక్కులు, మానస సరోవరయాత్ర విశేషాలు, జంధ్యం ధరించిన శివభక్తి అన్నీ బయటపడతాయి. అలాగే ఇటీవల పరిణామాల్లో యూపీలో యోగి, రాజ్యసభలో వెంకయ్య, రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాధ్ కోవింద్ లాంటి దేశభక్తుల ఆధ్వర్యంలో ఈ పని జరిగితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మెజార్టీ  మైనార్టీ విభజన రాజకీయాలు వద్దనే అన్నిశక్తుల భండారం బయట పడటమేగాక మోడీ ఈ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలబడతారు. మోడీ అధికారానికి మూలమైన జాతీయవాద స్పృహను డా॥ సుబ్రహ్మణ్య స్వామిలాంటి వారు ఎప్పుడూ సజీవంగా ఉంచుతున్నా సంస్థాగతంగా తప్ప పెద్దగా మద్దతు దొరకడం లేదు. 
2014లో మోడీ అధికారం చేపట్టాక విదేశాల్లో మనదేశ కీర్తి ఘనంగా పెరిగిందన్నది నిజం. కానీ కాశ్మీర్‌లో జరుగుతున్న కల్లోలాలను కూకటి వ్రేళ్ళతో పీకేస్తే  చరిత్రలో అదొక  మైలురాయిగా మిగిలిపోతుంది. ఇటీవల పాకిస్తాన్ కాశ్మీర్ ఉగ్రవాది బుర్హాన్‌వనీ పేరుతో స్టాంప్ విడుదల చేసి మన దేశాన్ని రెచ్చగొట్టింది. మనం కూడా పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కావాలని పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ప్రజలకు మద్దతుగా నిలబడాలి. ఈ విషయాలను అంతర్జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తున్న తారఖ్‌ఫతే లాంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. కాశ్మీర్‌లో పండిట్ల పునరాగమనానికి చర్యలు చేపట్టాలి. సింధునదీ జలాల ఒప్పందాన్ని పునఃపరిశీలించి పాకిస్తాన్ ఆగడాలకు ముకుత్రాడు వేయాలి. 
అలాగే జీయస్టీ ద్వారా ఎక్కువమందిని టాక్స్ పేయర్స్‌గా మార్చడం గొప్పవిజయమే. కానీ ఆ పన్నులను పేదప్రజలకు ఎలా పంచుతున్నారో వివరించాలి. అలా చేయకుండి ఆర్థిక క్రమశిక్షణను హద్దులు మీరి చేసి మితిమీరిన నిరాడంబరత్వంతో ప్రచారం చేయకపోతే మోడీకి ఇబ్బందులే. జీయస్టీవల్ల చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయని ప్రతిపక్షాలు, వ్యతిరేకమీడియా గొంతెత్తి గోబెల్స్‌లా అరుస్తుంటే సరైన వ్యూహంతో ఎదుర్కోకపోతే ఎలా? అలాగే జాతీయవాద భావజాలానికి మీడియా సపోర్ట్ తక్కువగా ఉంది. జీన్యూస్, రిపబ్లిక్‌లు జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తున్న రాష్ట్రాల స్థాయిలో బీజేపీ మీడియాను ఉపయోగించుకోవడం లేదు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రస్థాయిలో మీడియా సంస్థల అధినేతలు పార్టీ పెద్దలను ఉపయోగించుకుంటూ తమ పరిశ్రమలు నడుపుకుంటూ బీజేపీపై విషం కక్కుతున్నారు. 
ఇక పొత్తులు, రాజకీయ అవసరాలు జరుపుకుంటూ పోతూ దానికి సరైన వ్యూహాత్మక వివరణ ఇవ్వకపోతే అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై విధ్వంసం జరిగాక దానిని పునరుద్ధరించుకోవాలా! పార్టీ నిర్మాణం చేయాలా? అన్న వ్యూహం లేకపోతే చేతిలోని గాజుబొమ్మ జారి పగిలిపోతే చేసేది ఏమీ ఉండదు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా, ఇతర పార్టీల్లోని బలమైన రెబల్ అభ్యర్థులను లాగేందుకు ఎలాంటి ప్రయత్నం జరగడం లేదన్నది సర్వేసర్వత్ర వినిపిస్తున్న విమర్శ.
లేకలేక కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వస్తే దానిని నిలబెట్టే ప్రయత్నం వ్యూహాత్మకంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాకాకుండా మొదటమొదటనే నోట్లరద్దు, జీయస్టీ లాంటి పెద్ద సంస్కరణలు నెత్తికి ఎత్తుకున్నారు. అలాగే జమిలి ఎన్నికలనే ఇంకో సంస్కరణకు తెరతీయడం సాహసమే అవుతుంది. “మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు మౌనంగా వినండి.. నిజం! కాలమే వారికి సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు. అవి అంతర్గతంగా ఉండే శక్తులు” అని ఓ విజ్ఞుడు చెప్పింది నిజం. కానీ రాజకీయం రంగులరాట్నంలా గిర్రున తిరిగి పోతుంటే మౌనం అన్నిటికీ సమాధానం కాదు. మాయకులయందు మాయకుడై ప్రవర్తించాలన్న  నీతి చంద్రిక వాక్యం బీజేపీ నేతలు గమనిస్తే మంచిది. 
*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి
మంగళవారం : సెప్టెంబర్ : 25 : 2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి