ఓ ప్రసిద్ధ దేవాలయంలో అద్దాల మండపం ఉంది. మధ్యలో ఉన్న ఊయలలో దేవుని విగ్రహం ఉంది. దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ అద్దాల మండప దర్శనం ఓ విశేషం. ఓ రోజు ఎలాగో కుక్క ఒకటి ఆ మండపంలోకి ప్రవేశించింది. చుట్టూ గోడలకున్న అద్దాల్లో అనేక కుక్కలు దానికి కన్పించాయి. వాటిని చూసి మొరగడం ప్రారంభించింది. అవన్నీ నిజమైన కుక్కలనీ, తనపై పడతాయని భ్రమించి అద్దాలపైకి దూకింది. అద్దాలు పగిలిపోయి దాని మూతి చిట్లి గాయాలయ్యాయి. జ్ఞానం ఉన్న మనుషులు అందులో ప్రవేశించి తమ రూపాలు ఎన్ని కన్పించినా భ్రాంతి చెందలేదు. కుక్కకు తన స్వరూపంలోని మర్మం తెలియనందు వల్ల అద్దాల్లోని కుక్కలపైకి దూకింది. అలాగే మనుషుల్లో జ్ఞానికున్న విశేష పరిజ్ఞానం అతనిలో ప్రబోధం కలిగిస్తుంది. దీనినే ఎరుక అని శాస్త్రకారులు చెప్తూ వచ్చారు.

ఎవరికైతే ఈ ప్రబోధం కలగదో వారు లోకంలోని విషయవాసనలు శాశ్వతమని, గొప్పవని అనుకుంటుంటారు. ప్రతి వ్యక్తీ తన బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం చూస్తారు. గడచిపోయిన బాల్యం, యవ్వనం ఎక్కడికి పోయిందని ఎవరూ ప్రశ్నించుకోరు. బాల్యంలోనే ఆ వ్యక్తి తనకు తెలియకుండానే మాయమవుతారు. యవ్వనం లభిస్తుంది. బాల్యం, యవ్వనం గుర్తులుగానే ఉంటాయి. వృద్ధాప్యం వస్తుంది. అలాగే ఆత్మీయులు చనిపోయినప్పుడు వారి పాంచభౌతిక శరీరాన్ని ముందు పెట్టుకుని రోదిస్తారు. నిజంగా ఈ శరీరం శాశ్వతమే అయితే అది అక్కడే ఉన్నా ఎందుకు రోదిస్తున్నారు? ఇక్కడే వేదాంత విజ్ఞానం మొదలవుతుంది.

"నాహం ప్రకాశస్సర్వస్య యోగ మాయా సమావృతః
మూఢోయం నాభి జానాతిలోకో మామజమవ్యయమ్‌"

‘‘నేను యోగమాయతో కప్పబడి ఉంటాను. సమస్త ప్రజలకు ప్రకాశించేవాడిని కాను. ఆత్మజ్ఞానం లేనివారు జన్మరహితమైన, నాశరహితమైన నన్ను తెలుసుకోలేరు’’ అన్న శ్రీకృష్ణుని ఆత్మజ్ఞానాన్ని ప్రబోధం ఉన్నవారు మాత్రమే గ్రహిస్తారు. అదిలేని వారు అన్ని దిక్కులకూ పరుగెడుతూ అహంకార ప్రదర్శన చేస్తారు. ఆ ఎరుక ఉన్నవారు స్వస్వరూపాన్ని గ్రహించి దుఃఖం లేని వారుగా ఉంటారు. శుకమహర్షిలా నిర్వికార, నిర్విమోహంగా జీవిస్తారు. అంతెందుకు! ఆధునిక కాలంలో.. రమణమహర్షి భయంకరమైన కేన్సర్‌ బారిన పడ్డారు. ఆ వ్యాధి తన శరీరాన్ని చిత్రవధ చేసినా ఆయన కంగారుపడలేదు. మృత్యుద్వారం వద్ద నిలబడ్డా ఆయనలో ఏ మార్పూ కలగలేదు. మృత్యువు శరీరానికి వచ్చిన నాశనంగా భావించే స్థితిలో ఆయన ఉన్నారు. మృత్యువును, శరీరాన్ని కూడా బయట నిలబడి చూసే సాక్షీభూతుడుగా రమణులు ఉన్నాడు. ఆ స్వస్వరూపానుసంధానం కనీసం భౌతిక జీవనంలో కలిగినా మనుషుల్లో వెంపర్లాట తగ్గి దుఃఖనాశనం అవుతుంది.


********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి