* భారతజాతికి గొప్ప నీతిసూత్రాలు - విదురనీతి
అభిమానపుత్రుడైన దుర్యోధనుని దుశ్చర్యలను నిలువరించలేని అంధరాజు ధృతరాష్ర్టుడు. దురభిమానధనుడైన దుర్యోధనుణ్ణి నిలువరించలేక, పాండవులకు న్యాయం చేయలేక ధృతరాష్ర్టుడు శాంతిలేక దుఃఖంలో మునిగి ఉన్నాడు. అర్ధరాత్రి ముగిసింది. నిద్రపట్టక బాధపడుతున్నాడు ధృతరాష్ర్టుడు. ద్వారపాలకుణ్ణి పిలిచి విదురుణ్ణి చూడగోరుతున్నాను. శీఘ్రమే పిలుచుకురండి! అన్నాడు. వెంటనే ద్వారపాలకుడు వెళ్లి ‘ఓ మహాప్రాజ్ఞ! విదురదేవా! ప్రభువైన ధృతరాష్ర్టుడు మిమ్మల్ని చూడగోరుతున్నారు’ అనగానే ప్రభువు ఆజ్ఞనందుకుని విదురుడు రాజు దగ్గరకు వస్తాడు. “తనకు శాంతిలేదని నిద్రపట్టడం లేదని’ ధృతరాష్ర్టుడు చెప్తాడు. అప్పుడు విదురుడు
“అభియుక్తం బలవతా దుర్బలం హీన సాధునమ్ 
హృతస్వం కామినం చోరమావిశన్తి ప్రజాగరాః ॥
సాధనాలు లేనివాడై బలవంతునితో విరోధం పెట్టుకున్న దుర్బలునికి, తన సర్వస్వం పోగొట్టుకున్నవానికి, కాముకునికి, దొంగకు ఈ నలుగురికి నిద్రపట్టదు అని ‘ధర్మ నిర్ణయం’ చేశాడు విదురుడు. ఇంతగొప్పగా తన ప్రభువని కూడా భయపడకుండా మొహం మీద చెప్పడం ధర్మవేత్త అయిన విదురునికే చెల్లింది. భీష్మ, ద్రోణ, శ్రీకృష్ణుల వంటి ప్రముఖులతో ‘ధర్మవేత్త’గా పిలిపించుకొన్న విదురుడు దాసీపుత్రుడు. సత్యవతి కోరిక మేరకు వ్యాసుడు కురువంశ వృద్ధికి సంతానం ప్రసాదించడానికి వస్తాడు. యోగీశ్వరుడైన వ్యాసుడు వరుసకు తన మరదలైన అంబ, అంబాలికలను సంతానవంతులను చేయడానికి రాజప్రసాదానికి విచ్చేశాడు. తమ వీర్యశక్తి అధోముఖంగా పంపించి సంతానం కనడం సాధారణ పద్థతి. యోగులు తమ యోగశక్తి ద్వారా వీర్యశక్తిని ఊర్ధముఖంగా పంపినప్పుడు అది తేజస్సు రూపంలో కళ్లలోకి చేరుతుందట.
ఆ యోగ దృష్టితో చూసి సంతానం కల్గించే విద్య వ్యాసునికి తెలుసు. మొదట అంబ వ్యాసుడి గదికివెళ్లి, ఆయన్ని చూడగానే భయంతో కళ్లు మూసుకుంది. గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు. వణుకుతూ అంబాలిక వెళ్లింది. పాండు రోగంతో పాండు రాజు జన్మించాడు. అయ్యో! గుడ్డివాడు పుట్టాడు కదా! అని సత్యవతి మళ్లీ అంబను వెళ్లమని చెప్తే, ఆమె తన బదులు ‘దాసిని’ వ్యాసుడి వద్దకు పంపింది. ఆమె నిర్భయంగా వ్యాస మహర్షిని సేవించింది. ఆమెకు కల్గిన సంతానమే విదురుడు. మహాభారతంలో విదురనిది ఉదాత్తమైన పాత్ర. ముఖ్యంగా ధృతరాష్ర్టుడు ఎప్పడూ ప్రభువు, అన్న అనే గౌరవంతో వెన్నంటి ఉంటాడు. ఎన్నోసార్లు ఉచితమైన సలహాలు ఇస్తాడు. కానీ పుత్రవాత్సల్యంతో వాటన్నిటిని ధృతరాష్ర్టుడు పెడచెవిని పెట్టాడు. కానీ విదురుడు చెప్పిన గొప్ప నీతులు ధృతరాష్ర్టుడు పాటించకపోయినా, భారతజాతికి అవి గొప్ప నీతిసూత్రాలుగా నిలబడ్డాయి.
మహాభారత ఉద్యోగపర్వంలో పైన చెప్పిన ఘట్టంలో ‘విదురనీతి’ కన్పిస్తుంది. మహాభారతం ‘ధర్మశాస్త్రం’ అని చెప్పటానికి కావలసిన ఎన్నో ఉపమానాలు ఇందులో కన్పిస్తాయి. ‘మహాప్రాజ్ఞ’ అని పిలిపించుకొన్న విదురుడు పూర్వజన్మలో ధర్మదేవత. ఓ అరణ్యంలో మాండవ్యుడనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. అక్కడికి ఓ దొంగను వెదుకుతూ రాజభటులు వచ్చారు. తపస్విగా ఉన్న మాండవ్యుడే దొంగ అని, అక్కడే ‘శూలం’ ఉంటే అతణ్ణి దానికి ‘గొఱుత’ (గుచ్చి) వేశారు. మాండవ్యుడు మరణించి యముడి వద్దకు వెళ్లి నాకింత శిక్ష ఎందుకు వేశారని ప్రశ్నించాడు. ‘నీవు చిన్ననాడు తూనీగలను పట్టి వాటికి ముళ్లను గ్రుచ్చి బాధించావు’ అందుకే నీకీ శిక్ష అన్నాడు యముడు. దాంతో ఆగ్రహించిన మాండవ్యుడు ‘నీవు దాసీ పుత్రడవు అవుతావు’ అని శపిస్తాడు. అతడే ఈ జన్మలో విదురుడు. 
ధర్మస్వరూపుడైన విదురుడు ఎల్లప్పుడు పాండవపక్షం వహించేవాడు. లాక్షాగృహంలో పాండవులను చంపించాలన్న కుట్రను పసిగట్టి వారిని తప్పించుకొనేట్లు చేశాడు. ‘పాండవులు బలవంతులు, నా కుమారుణ్ణి ఏమైనా చేస్తారేమో’ అని ధృతరాష్ర్టుడు అడిగితే ‘వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వమని’ సలహా ఇచ్చిన పాండవులను ద్రుపదనగరం నుండి తీసుకువచ్చి అర్ధరాజ్యం ఇప్పిస్తాడు విదురుడు. కౌరవ ద్యూతక్రీడ (ద్యూతం) నివారించమని ధృతరాష్ర్టునికి చెప్పినా అతడు వినకపోగా, ద్రౌపదీ వస్త్రాపహరణానికి తీసుకరమ్మని దుర్యోధనుడు విదురుణ్ణి ఆదేశించాడు. కానీ విదురుడు కటువైన సమాధానం చెప్పి వెళ్లలేదు. అంత సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే భీష్ముని వంటి వారు మౌనంగా ఉన్నా విదురుడు ‘ఇది తప్పు’ అని ధైర్యంగా చెప్పాడు. పాండవులు అరణ్యవాసానికి పోయే సమయంలో ధృతరాష్ర్టునికి ఎన్ని మంచి మాటలు చెప్పినా వినలేదు.
కోపంతో నీవు పాండవపక్ష పాతివని తన వద్దనుండి వెళ్లగొట్టాడు ధృతరాష్ర్టుడు. కానీ విదురుడు లేకుండా ధృతరాష్ర్టుడు జీవించలేక తిరిగి సంజయుడి ద్వారా పిలిపించుకున్నాడు. శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చి విదురుని ఇంటనే బసచేసి, ఆతిథ్యం స్వీకరించాడు. ఈ సంధి కుదరదని యుద్ధం నిశ్చయమని కృష్ణునికి చెప్పాడు విదురుడు. యుద్ధ సమయంలో ఎవరిపక్షం వహించక తీర్థయాత్రలకు వెళ్తాడు. ఆ కాలంలో మైత్రేయ మహర్షి వల్ల ‘ఆత్మజ్ఞానం’ పొందుతాడు. తర్వాత పుత్రశోకంతో అల్లాడుతున్న ధృతరాష్ర్టునికి ‘సంసారం నిస్సారమని’ విదురుడు ప్రబోధిస్తాడు. తీవ్ర వైరాగ్యంతో అరణ్యంలో జీవిస్తాడు. ధర్మరాజును చూసి ‘తన స్వస్వరూపాన్ని’ తలచుకొని అతనిలోకి జ్యోతిరూపంలో చేరుతాడు. అయితే విదురుడు చేసిన ధర్మోపదేశం ‘విదురనీతి’ మహాభారతంలో 8 అధ్యాయాలతో ప్రత్యేకంగా నిలిచింది.

**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధ్యాత్మికం :  విజయక్రాంతి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి