గజాననం భూతగణాది సేవితం
కపిత్థ జంబూఫల సారభక్షకం
ఉమాసుతం శోక వినాశకారణం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం॥
వినాయకుడు తంత్రశాస్త్రపరంగా ‘ఉచ్ఛిష్టగణపతి’ రూపంలో పూజింపబడుతున్నాడు. అలాగే తంత్ర శాస్త్రాల్లో ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే త్రిశక్తుల అధిపతిగా త్రికోణ మధ్యగతుడిగా వర్ణించబడ్డాడు. అందుకే ‘ముత్తుస్వామిదీక్షితులు’ ‘వాతాపిగణపతింభజే’ అన్న కీర్తనలో వినాయకుణ్ణి త్రికోణమధ్యగతుడిగా వర్ణించాడు. పల్లవుల రాజధాని అయిన కాంచీపురంలో పల్లవచక్రవర్తుల్లో ప్రసిద్ధుడైన నరసింహవర్మ కర్ణాటకలోని ‘బాదామి’గా పిలువబడే ‘వాతాపి’ని ముట్టడించి అక్కడి పాలకుడైన పులకేశిని జయించి నరసింహవర్మ ఈ వినాయక మందిర నిర్మాణం చేశానట్టు చెబుతారు. అలాగే హంపిలో శిథిల దేవాలయాల్లో కొన్ని పెద్ద వినాయక విగ్రహాలు కన్పిస్తాయి. 
వినాయకుడు యోగశాస్త్రంలో చెప్పబడే షట్చక్రాల అధిదేవతల్లో ఒకరిగా కన్పిస్తాడు. ‘మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి’. “త్వం మూలాధార స్థితోసి నిత్యమ్‌” అని గణపతిని యోగశాస్త్రాలు వర్ణించాయి. గణపతిని యోగపద్ధతి ద్వారా పూజిస్తే ఎలాంటి ధనలాభం పొందుతామో ఆర్.పద్మావతి ఈ విధంగా వివరించారు. “నాగగణపతి బీజాక్షరంతోనే యోగి మూలాధారంను చైతన్యవంత మొనర్చడం ద్వారా కుండలనీశక్తి ఒక్కసారి బుసలు కొట్టిన పాములాగా పైకిలేచి ఇడ, పింగళ, మధ్యనున్న సుషమ్న నాడిలో సంచారం చేస్తూ షట్చక్రాలను ఛేదిస్తూ ‘సహస్రారం’ చేరుతుంది. ఈ కుండలినీ శక్తిని మేల్కొల్పుట వలన యోగికి సిద్ధి కలుగుతుంది.
మనస్సుకు పైనున్న బుద్ధి కూడా మేల్కొంటుంది. ఈ సిద్ధి, బుద్ధి  ఇడ, పింగళ అనేవి జంటనాడులుగా సుషమ్న నాడీద్వారంలో నివసించే గణపతిని చేరుతాయి. సిద్ధి, బుద్ధులను గణపతిపత్నులని అందుకే అంటారు. గణపతి బ్రహ్మచారిగానే నిలిచి ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మంలో చరించే యోగసిద్ధికీ, సుషమ్న నాడిలో సంచారం చేసే గణపతి చైతన్యమే యోగసిద్ధులకూ మూలాధారం. దీనిని ‘లం’ పృథివీ తత్వాత్మికాయై దగ్గర, ‘ఓం లం గణపతియేనమః’ అని గణపతి ఉపనిషత్తు ప్రారంభించడంలోనూ గమనించవచ్చునని పెద్దలు అంటారు. గజాననుడు మంగళ దైవతం కాబట్టి ప్రతి కార్యానికి ముందు గజానన పూజ ఆచారమైంది.
తన్ను కొలిచేవారి శత్రువుల్ని సంహరిస్తాడు, విఘ్నాలు తొలగిస్తాడు. యుద్ధాలు, కరువులు మొదలగు బాధలు లేకుండా చేస్తాడు. సంతానాన్ని ప్రసాదిస్తాడు. సకల సంపదలు సమకూరుస్తాడు. భార్యాభర్తల నడుమ అనుకూలతను ప్రదర్శిస్తాడు. వర్తకులకు వ్యవసాయదారులకు సహాయం చేస్తాడు” అని విశ్లేషించాడు.
వినాయకుడిని విద్యాదేవతగా కూడా పూజిస్తారు. చవితినాడు విగ్రహాలు నెలకొల్పి విద్యార్థులు తమ పుస్తకాలు స్వామి ముందుంచి ‘గుంజీలు’ తీస్తారు. దీనివెనుక కారణం ఆలోచిస్తే, సామవేదజ్ఞులు ఈ చవితినాడే ఉపాకర్మ ఆచరిస్తారు. మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో యుధిష్ఠిరుడు గణపతిని పూజించాడు. వినాయకోత్పత్తి, వినాయక వ్రతాన్ని వివిధ పురాణాల్లో చూస్తాం.
వినాయకోత్పత్తి
గజాసురుడి సంహారానంతరం శివుడు కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతిదేవి అభ్యంగన స్నానమాచరిస్తూ నలుగు పిండితో ఓ బాలుని బొమ్మను చేసి, ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసి బయట కాపలాగా ఉంచి ‘తాను స్నానం చేసి తిరిగి వచ్చేవరకు ఎవరినీ లోనికి రానివ్వద్దు’ అని ఆదేశించింది. ఈ లోపల శివుడు లోనికి వెళ్లబోగా, బాలుడు ఆయన్ని అడ్డుకొన్నాడు. తన ఇంట్లోకి తననే రానివ్వలేదనే ఆగ్రహంతో శివుడు బాలుని శిరస్సును ఖండించాడు. స్నానం చేసి బయటకి వచ్చిన పార్వతి ఈ దృశ్యం చూసి హతాశురాలయ్యింది.
భార్య దుఃఖాన్ని చూసి చలించిన శివుడు, బాలుణ్ణి బతికించుటకు ఉత్తరదిశగా తల ఉంచి నిద్రించే ఏ ప్రాణి శిరస్సునైనా తీసుకురండని పరిచారకులను ఆదేశించాడు. వారు వెతుకుతూ వెళ్లగా, ఏనుగు మాత్రమే అలా కనిపించింది. దీని శిరస్సును తీసుకురాగా శివుడు ఆ బాలుని మొండానికి అతికించాడు. (పురాణాల్లో సర్జరీ (శస్త్రచికిత్స) చేసిన మొదటి వ్యక్తిగా శివుడు కనిపిస్తాడు). గజముఖంతో జీవించిన ఆ బాలుడు ‘గజాననుడు’ అయ్యాడు. ఇతడు ‘అనింద్యుడు’ అను ఎలుకను వాహనంగా చేసుకొన్నాడు. కొంతకాలానికి సోదరుడు కుమారస్వామి జన్మించాడు. ఇతడు మహా బలశాలి. అతని వాహనం నెమలి. 
విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు.. పరమేశ్వరుని సేవించి విఘ్నాలకొక అధిపతి ఎవరని అడుగగా..  గజాననుడు, కుమారస్వామి ఇరువురూ అధిపత్యాన్ని కోరగా.. అంత “మీలో ఎవ్వరు ముల్లోకాలలోని పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు వస్తారో, వారికి మాధిపత్యంబొసగుదు”అని మహేశ్వరుడు అనగా గజాననుడు తండ్రిని సమీపించి ప్రణమిల్లి తన అసమర్థతను తెల్పి తగునుపాయం తెలుపమని కోరగా “సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషుస్నాతో భవతి పుత్రక!” నారాయణ మంత్రంను జపించిన మాత్రంన మూడువందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమొనర్చు వాడగుననగా! గజాననుడు నత్యంతభక్తితో ఆ మంత్రాన్ని తల్లిదండ్రులకు మూడు ప్రదక్షిణలు చేసేను.
కుమారస్వామి ఎంత వేగంతో ఎక్కడికి వెళ్లిన గజాననుడు తన కంటే ముందుగా స్నానం చేసి కుమారస్వామికి ఎదురువస్తూ కనిపించాడు. దానికి ఆశ్చర్యపోయిన కుమారస్వామి గర్వం పోయి గణాధిపత్యాన్ని అన్న అయిన గజాననుడికే ఇమ్మని ప్రార్ధించాడు. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుకి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆరోజు విఘ్నేశ్వరుడికి తనకిష్టమైన పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు..
సమర్పించి పూజించగా విఘ్నేశ్వరడు వాటిని భుజించి కొన్ని తన వాహనానికి ఇచ్చి మందగమనాన్న సూర్యాస్తమయానికి కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయలేక అవస్థ పడుతున్న గణపతిని చూసిన చంద్రుడు నవ్వగా, అంత రాజ దృష్టి సోకిన రాలుగూడ నుగ్గగునను సామెత నిజమగునట్లు పొట్ట పగిలి అందులోని కుడుములు తదితర ఆహారం బయట పడెను. అంత పార్వతి శోకించి చంద్ను జూచి, “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి కుమారుడు మరణించెను. కావున నిన్ను చూచినవారు పాపాత్ములై నీలిపనిందల పాలవుతారు అని శపించెను. 
ఋషి పత్నులకు నీలాపనిందలు
ఆ సమయాన సప్తమహర్షులు యజ్ఞం చేసి తమ భార్యాలతో హోమ గుండ ప్రదక్షిణ చేస్తూండగా అగ్ని దేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంబున అశక్తుడూ క్షణించకుండగా అది గ్రహించిన అగ్ని భార్య అయిన స్వాహాదేవి  అరుంధతీ రూపం తప్ప తక్ని ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రణయంబు చేయ ఋషులద్దానిని కనుగొని అగ్నిదేవునితో ఉన్న వారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడిచారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వీరికి ఇటువంటి నీలాపనింద కలిగినది. 
అని దేవతలు మునులు, ఋషిపత్నుల పరమేష్ఠికి తెలుపగా సర్వజ్ఞుడగుటచే అగ్ని హోత్రుని భార్యయే ఋషి పత్నుల రూపం దాల్చి వచ్చారని తెల్పి సప్తఋషులను సమాధాన పరచి వారితో కలసి బ్రహ్మ కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించెను.అంత దేవాదులు “ఓ పార్వతీ దేవీ! నీవు పెట్టిన శాపం లోకానంతటికి కీడు కలుగుతుంది. కనుక దానిని ఉపసంహరించుకోమ్మని ప్రార్ధింపగా, పార్వతి సంతుష్టురాలై కుమారుని చూసి ముద్దాడి ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూడరాదు అని శాపానికి సవరణ చేసేను.
కొంతకాలం తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భాద్రపద చతుర్థిన గోష్ఠనమున పాలు పిదుకుతూ పాలలో చంద్రుడిని చూచి తనకు ఎట్టి నీలాపనిందలు కలుగునో అని అనుకోన్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్య వరంతో రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చే శమంతకమణిని పొందగా.. శ్రీకృష్ణుడు సత్రాజిత్తునిని రాజ్య ప్రజల కోసం ఆ మణిని అడుగగా కుడదన్న ఊరకున్నాడు. సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ప్రసేనుండు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళగా ఆ మణిని చూసి ఒక సింహం మాంసం అని భ్రమించి అతనిని చంపగా, దానిని చూసి భల్లూకం దానిని చంపి ఆ మణిని తీసుకువెళ్ళి తన కూతురైన జాంబవతికి ఇవ్వగా..మరునాడు ప్రసేనుడి మృతిని తెలుసుకుని కృష్ణుడే ఆ మణికోసం తన తమ్ముడిని చంపాడని చాటాడు.
ఆ రోజు చంద్రుడిని చూడటం వల్ల నింద వచ్చిందని కృష్ణుడు ఆ మణి కోసం వెతకగా అది జాంబవతి వద్ద ఉండటం చూసి ఆ మణిని తీసుకుంటుండగా అది చూసి భల్లూకం కృష్ణునిపై దూకి ముష్టిఘాత యుద్ధం చేసి క్షీణుడై  ఆలోచన చేయగా కృష్ణుడు ఎవరో కాదు త్రేతాయుగ రాముడని తెలుసుకుని  తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి,  శమంతక మణిని ఇచ్చి పంపెను. కృష్ణుడు మణిని సత్రాజిత్తుకు ఇవ్వగా సత్రాజిత్తు తన తప్పును క్షమించమని తన కమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం చేసేను. అంత దేవాదులు, మునులు మీరు సమర్ధులు కనుక నీలాపనింద మాపుకొన్నారు. మాకేమి గతి అని ప్రార్ధింపగా ఆనాడు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరస్సున దాల్చువరికి నీలాపనింద ఉండదు.అని చెప్పగా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధిన గణేషుని పూజ జరుపుకుంటూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారు.   
కపర్ది గణేశవ్రతం
గణపతిని అనేక విధాలుగా అర్చించే విధానం ఉంది. శివపార్వతులు, చతురంగం ఆడి మనస్పర్థలు పొందారు. శివప్రసన్నం కోసం పార్వతి ‘కపర్ది గణేశవ్రతం’ ఆచరించింది. శ్రావణ శు॥ చతుర్థి నుండి భాద్రపద శు॥ చతుర్థి వరకు ఏకభుక్తంతో గణేశుణ్ణి అర్చించే వ్రతం ఇది. సాధారణంగా అందరూ ఆచరిస్తున్నది. భాద్రపద శు॥ చవితి నాటి సిద్ధి వినాయక వ్రతం.
వినాయకుడు ప్రకృతి దేవుడు
ప్రతి పండుగ నుండి ఏదో కొంత ‘ప్రాకృతిక జ్ఞానం’ సంపాదిస్తాం. వినాయకుడి పండుగలో చాలా అంశాలు మనదేశ వ్యవసాయ రంగానికి ప్రతీకలుగా కన్పిస్తాయి. అసలు వినాయకుడి రూపం గమనిస్తే  ఆయన చెవులను ‘శూర్పకర్ణాలు’ అంటారు. చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. రైతులు నూర్పిళ్లకు ఉపయోగించే చేటల్లాగా ఉంటాయన్నమాట. వినాయకుడి పొట్ట ధాన్యపు నిల్వల్ని ఈ గాదెల్లోనే నిల్వ ఉంచేవారు. గణేశుడి తొండమే దున్నుటకు ఉపయోగించే ‘నాగలి’లా ఉంటుంది. అలాగే పొట్టకు గట్టిన ‘నాగబంధం’  ధాన్యపుగాదెను ఎలుకల నుండి రక్షించే ఉపాయంగా కన్పిస్తుంది. ఎలుకలు సాధారణంగా పంటలను పాడుచేస్తాయి. అలాంటి ఎలుక (మూషిక)ను తన వాహనంగా చేసుకోవడం వల్ల వినాయకుడు పంట రక్షకుడయ్యాడని,  అలాగే ఈ గణేషుడు మెక్సికోలోని ధాన్యదేవతను, టాంగాదీవుల్లోని ఆలోఆలో దేవతను, గ్రీసుల డెమెటర్‌ను, రోమనుల కెరెస్ దేవతను పోలి ఉన్నాడని కూడా బి.ఎ. గుప్తా పేర్కొన్నారు.
ఏకవింశతి (21) పత్రాలు.. 
పర్యావరణం - ఆయుర్వేదం
శివుణ్ణి బిల్వదళాలతో, లక్ష్మీదేవిని కమలాలతో, విష్ణువును తులసితో, హనుమంతుణి తమలపాకులతో పూజించడం ప్రశస్తం, ఏదైనా పత్రం, పుష్పం  అన్నట్లుగా దేవతలను పూజించే సంప్రదాయం మనకుంది. వినాయకుణ్ణి మాత్రం 21 రకాల పత్రాలతో పూజించడం ప్రత్యేకం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు పంచభూతాలు, పంచప్రాణాలు, ప్రాణం మొత్తం కలిసి 21. వీటి గొప్పతనం ఇందులో కన్పిస్తుంది. అలాగే ఎలాంటి మసాలాలు లేని నైవేద్యం ఉండ్రాళ్లు, కుడుములు గణపతికి ఇష్టమైనవి.
అని మనం వినాయక వ్రతంలో చెప్తాం. 21 రకాల పత్రాలు ప్రకృతి సిద్ధమై, ఔషధ గుణాలు కల్గినవి. వీటన్నిటికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. అంతేగాకుండా మనం వీటి సేకరణ చేసేటప్పుడు మన పిల్లల్ని మన వెంట తీసుకెళ్తే ప్రకృతి తత్వం  ఆయుర్వేద విశిష్టత వాళ్లు తెలుసుకుంటారు. పర్యావరణ విజ్ఞానం వాళ్లకి కల్గించిన వాళ్లమవుతాం.
ఈ 21 రకాల పత్రాలతో గణపతిని పూజిస్తారు. ఈ ఆకుల వల్లే తగ్గే రోగాలను చూస్తే వాటి ప్రాముఖ్యత ఎంతో తెలుస్తుంది. కాబట్టి ‘ఆకుల ఔషధ విజ్ఞానం’ తెలుపబడింది. ఈ రోజు సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి అనేక రకాల చెట్ల ఆకులను గుంటలో వేసి మురగబెట్టి, ఆకులను ఎరువుగా మార్చడానికి వానపాములను వదలి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు.  వినాయక పూజలో వీటిని ఉపయోగించి చెరువులో వేయడం వల్ల నీరు ‘ఔషధీకృతం’ అవుతుంది.
రైతులు చెరువుల్లో నీరు తగ్గాక అందులోని మట్టిని పొలాల్లోకి ఎరువుగా తీసుకువెళ్తారు. దానివల్ల పంటలు బాగా పండుతాయి. పూర్వం రసాయన ఎరువుల వాడకం ఉండేది కాదు. అందువల్ల ఆరోగ్యం బాగా ఉండేది. ఆయా చెరువుల్లోని, నదుల్లోని నీటిని వ్యవసాయరంగానికి ఉపయోగించడం వల్ల పంటలు బాగా పండేవి. ఇలా వినాయక చవితి వల్ల పర్యావరణం కూడా కాపాడబడుతుంది. అలాగే చెరువుల్లో కొట్టుకు వచ్చిన మట్టితో పూడిక చేరుతుంది. మట్టితో వినాయకుణ్ణి చేయడానికి చెరువు మట్టిని తీసి మళ్లీ అందులోనే గణేశ నిమజ్జనం చేస్తే ఆ మట్టి గణపతి కరిగి చెఱువు మట్టిని ఎరువుగా మారుస్తుంది.
గరికీ పత్రం
దీనిని “దూర్వాయుగ్మం’ అంటారు. పశువులు బాగా మేస్తాయి. అవి అంత బలవర్ధకంగా ఉండడానికి కారణం ఈ గరికనే. ఇది వినాయకపూజలో ప్రశస్తంగా వాడుతారు. మూత్ర సంబంధ వ్యాధుల నుండి రక్షణకు పచ్చడి  చేసుకొని తినాలి.
బిల్వపత్రం
 త్రిదళం... త్రిగుణాకారం అని శివుణ్ణి పూజించే ప్రశస్తమైన పత్రం ఇది. బంక విరోచనాలకు మందుగా ఇది వాడుతారు. దీనిని ‘మారేడు’ అంటారు. చక్కెరవ్యాధి తగ్గడం కోసం రోజూ రెండు లేదా మూడు ఆకులను నమిలి ఆ రసాన్ని తాగాలి.
దత్తూర పత్రం 
ఉమ్మెత్త అని పిలుస్తారు. నల్ల ఉమ్మెత్త ఆయుర్వేదంలో ఔషదంగా వాడతారు. ఆకులను కాపడం చేసి వాపులకు పెడితే వాపు తగ్గుతుంది. లైంగిక వ్యాధుల నివారణకు, వ్రణాలు, గడ్డల నివారణకు బాగా పనిచేస్తుంది. మానసిక రోగాల నివారణకు జుట్టును తీసేసి ఆకులరసంతో 2 నెలలు రోజూ మర్ధన చేయాలి.
అర్కపత్రం
దీనిని జిల్లేడు అంటారు. ఇందులో రెండు రకాలు, శ్వేతార్క కలపతో గణపతిని చేసి పూజించే సంప్రదాయం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా వాడే ఔషధం. లేకుంటే ప్రమాదానికి అవకాశం ఉంది. ఏ జాతికి చెందిన జిల్లేడు అయినా పాలు తీసి పసుపుతో కలిపి ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖం రంగు మారుతుంది.
దేవదారు పత్రం 
ప్రసిద్ధమైన ఈ వృక్షం ఆకులు, పుష్పాలు ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. మాను నుండి తయారు చేసిన నూనెను వేడినీళ్లలో వేసుకొని స్నానం చేయాలి. ఇది శ్వాసకోస వ్యాధులను దూరం చేస్తుంది.
చూత పత్రం 
దీనిని ‘మామిడి’ (మ్యాంగిఫెరా ఇండియా) అంటాం. బ్యాక్టీరియాలను, దోమలు మొదలైన క్రిమికీటకాలను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటాయనే ఉద్దేశంతో ద్వారాలకు అలంకరణ పేరుతో కడతారు. మామిడి చిగురులో ఉప్పు కలిపి వేడిచేసి పూతగా, కాళ్లపగుళ్లపై రాయాలని గృహవైద్యం.
కరవీర పత్రం
దీనిని ‘గన్నేరు ఆకు’ అంటారు. గడ్డలకు మందుగా దీని పాలను వాడుతారు. జ్వరం తగ్గడానికి ఏ జాతి గన్నేరు ఆకులనైనా కొమ్మ తుంచి పాలు లేకుండా ఒక తడి గుడ్డతో శరీరానికి కట్టుకోవాలి.
విష్ణుక్రాంత పత్రం
దీనిని ‘అవిసె’ అంటారు. చిన్న మొక్కగా ఉంటుంది. రొమ్మువ్యాధులు, ఉబ్బసం తగ్గించే స్వభావం దీనికి ఉంది. తామర, రక్తదోషం ఉన్నవాళ్లు ఆకుల్ని నిమ్మరసంతో నూరి తామర (గజ్జి) ఉన్నచోట పూయాలి.
అర్జున పత్రం 
మద్దిచెట్టును ‘అర్జునవృక్షం’ అంటారు. నల్లమద్దిని కలపగా ఉపయోగిస్తారు. తెల్లమద్ది, నల్లమద్దిని మేహ రోగాలకు మందుగా వాడుతారు. తెలుపు, ఎరుపు జాతిలో ఏ ఆకునైనా వృణాలు (పుండ్లు) ఉన్న ప్రాంతంలో కట్టువేయాలి.
అశ్వత్థ పత్రం 
ఇది దేవతా వృక్షం. రావి ఆకు అని కూడా అంటారు. అధికంగా ఉదజనిని విడుదల చేసే వృక్షం. ఎండిన రావికర్రలను నేతితో కాల్చి ఆ భస్మం రోజూ తేనెతో స్వీకరిస్తే శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి.
బృహతీపత్రం
దీనిని ‘వాకుడు ఆకు’ అని పిలుస్తారు. కొందరు ‘నేలమునగ’ అని కూడా చెప్పారు. ముళ్లుగా ఉండే ఈ చెట్టు హృద్రోగాలను తగ్గించి వీర్యవృద్ధిని కలిగిస్తుంది. ఈ ఆకును నీటితో కలిపి నూరుకొని సేవిస్తే మూలశంక, దగ్గు, మలబద్దకం తగ్గిస్తుంది.
మాచీపత్రం 
సాధారణంగా ‘మాచిపత్రం’ అంటారు. దద్దుర్లు, వ్రణాలు తగ్గించడానికి తోడ్పడుతుంది. ఆకును తడిపి కళ్లమీద ఉంచుకోవాలి. పసుపు నూనెతో కలిపి ఒంటికి పూసుకుంటారు. నేత్రవ్యాధులను, చర్మవ్యాధులు తగ్గిస్తుంది.
గండకీ పత్రం
దీనిని వినాయక పత్రం అని పిలుస్తారు.
మరువక పత్రం
దీనిని ‘మరువం’ అని అంటారు. ఇది వేడి నీటిలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన పోతుంది.
సింధూర పత్రం
‘వావిలాకు’ అంటారు. ఈ ఆకును నీటిలో మరగబెట్టి స్నానం చేస్తే నొప్పులకు, రోగాలకు ఇది మంచి ఔషదం.
జాజి పత్రం
జాజికాయ బాలవైద్యానికి, పైత్య రోగాలకు ఔషధం. నోటి దుర్వాసన పోవడానికి ఆకులను వెన్నలో కలిపి నూరి పండ్లు తోముకోవాలి.
బదరీ పత్రం
ఇది రేగు పత్రం. జీర్ణకోశ వ్యాధులను, రక్తదోషాలను తగ్గించే ఫలం ఇది. బాల్యంలో వ్యాధుల నివారణ.
శమీపత్రం
జమ్మిచెట్టు ప్రాశస్త్యం తెలిసిందే. కుష్ఠు, అవాంచిత రోమాల నివారణకు ఈ ఆకుల పసరు ఆయా శీర భాగాల్లో పై పూతగా పూయాలి.
దాడిమి పత్రం 
నోటి పూతలకు, ఏలికపాముల, దగ్గు, ఉబ్బసం నివారి స్తుంది. ఆకులకు నూనెరుద్ది వేడిచేసి వాపు ఉన్న చోట కట్టాలి.
అపామార్గ పత్రం 
దీనిని ఉత్తరేణి అని పిలుస్తారు. దీని వేరుతో దంతధావనం చేస్తే పంటి రోగాలు దరికిరావు. బ్రష్ + పేస్ట్ అవసరం ఉండదు.

********************************************
  డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధ్యాత్మికం : విజయక్రాంతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి