ఈనెల 9వ తేదీన అయోధ్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెం టనే కొంత సంతోషం, అసహనం, ఆనందం, వ్యతిరేకత.. అన్నీ ఒక్కసారి వ్యక్తం అయ్యాయి. శ్రీరామ సంస్కృతిని ఆరాధించేవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ సహా ఒకరిద్దరు తప్ప- ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. 

కొన్ని ముస్లిం సంస్థలు సుప్రీం తీర్పు పట్ల బాహాటంగా మద్దతు ప్రకటించగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం అగ్నికి ఆజ్యం పోయాలని చూసింది. కాంగ్రెస్ అధికార పత్రికలో వ్యితిరేకంగా తెల్లారేసరికి వ్యాసం రానే వచ్చింది. ఇక సూడో సెక్యులర్, లిబరల్ మేధావులు, కమ్యూనిస్టులు యథాలాపంగా ‘దేశంలో మతతత్వం పెరిగేందుకు అవకాశం ఉందని’ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇంకొందరు విశే్లషకుల పేరుతో ‘దేశంలో ఆర్థిక మాంద్యం పెరుగుతుంటే ఈ తీర్పు సరైన దిశలో లేదు’ అన్నారు. అంటే తీర్పు బాబ్రీ పక్షం గెలిచి ఉంటే ‘సెక్యులరిజం’ బ్రతికేదని ఉపన్యాసాలు, విశే్లషణలు, వ్యాసాలు రాసేవారా? కాదా?


రామమందిరం తీర్పు బయటి స్తరంలో ఓ ఉద్యమంలా, హిందూ మనోభావాలను గౌరవించినట్లుగా కన్పించడం ఒకవైపు, నిజానికి అంతర్గతంగా ఆలోచిస్తే ఈ దేశంలో ‘సంతుష్టీకరణ’ రాజకీయాలు పరాకాష్ఠకు చేరిన తర్వాత పుట్టుకువచ్చిన ఉద్యమం ఇది. ఇక తెలుగు టీవీల్లో చర్చలు చేసే మేధావులకు ఇంకా సంతుష్టీకరణ జాఢ్యం వదలడం లేదనిపించింది. ఓ వైపు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటూనే తమ అక్కసునంతా హిందువులపై వెళ్లగక్కారు. మేధావులు, విశే్లషకులమని ముద్రలు వేసుకొని చర్చలకు వెళ్లి ‘ఎర్ర రాగం’ ఆలపించడం పరిపాటిగా మారిపోయింది. 

ఒకాయన అయితే ఇది ‘హిందుత్వ శక్తులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం’ అన్నాడు. అంటే ఆయన దృష్టిలో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ అని అర్థం. నిజానికి 1528లో మీర్ బాకీ ఆలయం కూల్చి, దానిపై మసీదు నిర్మాణం చేశాక ఎందరో ప్రతిఘటించారు. వాళ్లంతా ఆరెస్సెస్ వాళ్ళేనా? ఆరెస్సెస్ పుట్టింది 1925లో అయితే 1885లో మొదట కేసులు ఎలా ఫైల్ అయ్యాయి? ఈ దేశంలో హిందుత్వ గురించి తలాతోకా తెలియని వాళ్లంతా దూరం నుండే ఏ పరిజ్ఞానం లేకుండా విమర్శిస్తారు. రావణుడు మరణించాక శ్రీరాముడు లంకను తన హస్తగతం చేసుకొన్నాడా? విభీషణుడిని పట్ట్భాషేకం చేసాడా? 

వాలిని చంపాక కిష్కింధను సుగ్రీవుడికి, అంగదుడికి ఇచ్చాడు కదా? వాలిని శత్రువుగా భావించిన శ్రీరాముడు అదే వాలి కుమారుడైన అంగదుడికి తన దగ్గర స్థానం ఇచ్చాడు కదా? ఇది రామాయణ సంస్కృతి! రామరాజ్య సంస్కృతి!

ఈ దేశ హిందుత్వంలో ఇది నరనరాన జీర్ణించుకుని ఉంది. అందుకే శ్రీకృష్ణుడు హీరో అయినా రాజ్యం పాండవులకిచ్చాడు. గాంధీ రామరాజ్య భావన కలిగి ఉన్నాడు కాబట్టే తాను ముందుండి పోరాడి సంపాదించిన సింహాసనాన్ని నెహ్రూకు ఒక్క నిమిషంలో ధారపోశాడు. మరి అదే గజినీ, ఘోరీ, నాదిర్షా, తైమూర్, బాబర్, ఔరంగజేబుల సంస్కృతి ఏమిటి? జిన్నా ఏం చేశాడు? నిజాం ఏం చేశాడు? కాశీం రజ్వీ ఏం చేశాడు? ఇపుడు పాకిస్తాన్ చరిత్రను అధ్యయనం చేస్తే అది ఏర్పడిన నాటినుండి ఒక్క అధ్యక్షుడైనా గౌరవింపబడ్డాడా? క్రూరమైన దండన, దేశ బహిష్కరణ, కుక్కచావు.. ఇదే కదా!

 అక్కడి మతరాజ్య భావన వాళ్లకు ఇచ్చింది! అదే ఈ దేశంలో ఏపీజే అబ్దుల్ కలాంను ముస్లింల కన్నా హిందువులు ఎక్కువ ప్రేమిస్తారు. హిందుత్వ వాదులు ఈ దేశంలో కలాంకు సమున్నత స్థానం ఇస్తారు. కానీ ఈ దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల సంతుష్టీకరణకు వ్యతిరేకంగా భాజపా ఇపుడు వటవృక్షం అయ్యింది.
ఇదే రామమందిరం విషయంలో నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హిందువులకు అనుకూలంగా ఉన్నాడని తెలిసి నెహ్రూ అతణ్ణి మందలిస్తూ లేఖ రాస్తాడు. ‘ఈదేశంలో మొదటి ముద్ద ముస్లిం మైనారిటీలదే’ అని మన్మోహన్ సింగ్ బరితెగిస్తాడు. ఇక కమ్యూనిస్టులైతే ‘దాస్ కాపిటల్’ వచనంలాగా హిందూ మతోన్మాదం అంటూ రోజూ పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ఉండే విధంగా వ్యాఖ్యలు చేస్తారు. 

700 ఏళ్ల బానిసత్వంతో హిందువులు విసిగిపోయారు. అలాగే 1906 తర్వాత భారత రాజకీయాల్లో పుట్టుకొచ్చిన సంతుష్టీకరణ, 1947 దేశ విభజన పరిణామాలు అంతర్గత జాతీయ వాదానికి పునాది వేసాయి. రొమిల్లా థాపర్ మొదలుకొని రామచంద్ర గుహ వరకు ఈ దేశ అసలు చరిత్రకు ఎర్రరంగు, ఆకుపచ్చ రంగు రుద్దే ప్రయత్నం చేయడమే. ఆ రెంటినీ తలదనే్న ‘కాషాయరంగు’ ఇపుడు కదంద్రొక్కుతున్నది.

నిజానికి ఇవాళ అల్పసంఖ్యాకులు అని పిలుస్తున్నవారు ఎప్పుడూ పైచేయిగానే ఉన్నా, వారిని ‘ప్రత్యేకమైన వ్యక్తులు’గా చూడడం మొదలుపెట్టాం. నిజానికి ఏ సమాజంలోనైనా ఒక హత్య జరిగితే అది హత్యగా చూడకుండా, నేరంగా పరిగణించకుండా మైనారిటీ అనే సంతుష్టీకరణ 1947 విభజన నుండే ప్రారంభించి ఈ దేశంలో సమానత్వానికి పాతరేసారు. యూరప్‌లో యూదులు, జిప్సీలు, అమెరికాలో నీగ్రోలు, లెబనాన్‌లో ద్రూజ్, మోరోనాయిట్ క్రైస్తవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులు నిజంగా మైనారిటీలు. అక్కడ ఈ అల్ప సముదాయాలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి. 

కానీ ఈ దేశంలో హాయిగా హిందువుల మధ్య సహజీవనం చేస్తున్న ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చి సంతుష్టీకరణ మొదలుపెట్టారు. అదే ముస్లింలు మెజారిటీగా వున్న జమ్మూ కశ్మీర్‌లో ఒక్క హిందువు ముఖ్యమంత్రిగా పదవి తీసుకోలేకపోయాడు. అక్కడి నుండి హిందూ పండిట్లు నిర్దాక్షిణ్యంగా అత్యాచారాలకు గురయ్యారు. అందుకే 370 ఆర్టికల్, 35ఎ ఆర్టికల్‌ను మోదీ ప్రభుత్వం తొలగించగానే దేశం మొత్తం మద్దతుగా నిలబడింది. అలాగే ‘రామమందిరం’ తీర్పు ఏనాడో వ చ్చేది. 

మరి అంతర్గతంగా అడ్డుకొన్నది ఎవరు? అసలు రామమందిరం వివాదాన్ని క దిలించిందే కాంగ్రెస్ అని ఓవైసీ నెగెటివ్‌గా అంటే, మేమే చేసాం అని కాంగ్రెస్ పాజిటివ్‌గా చెప్తుంది! అలాంటపుడు అద్వానీ ఎందుకు దీన్ని దేశ వ్యాప్త ఉద్యమంగా మలిచాడు? ఇదే పునాదులపై భాజనా సౌధం ఎలా నిర్మింపబడిందో ఒక్క కాంగ్రెస్‌వాది కూడా చెప్పలేడు! కారణం- ‘గాలికి కొట్టుకుపోయే పేలపు పిండి కృష్ణార్పణం’ అంటున్నామని వాళ్ళందరికీ తెలుసు.

నిజానికి 1951 జనగణన ప్రకారం 85 శాతం వున్న హిందువులు, 10 శాతం వున్న ముస్లింల జనాభా 1961లో 84 శాతం హిందువులు, 11 శాతం ముస్లింలుగా మారింది. ఇది క్రమంగా 1981-1991 మధ్యకాలంలో ఇంకా అంతరం పెరిగింది. ఇపుడు హిందువుల సంఖ్య బాగా తగ్గింది. అలాగే ముస్లిం ప్రజా ప్రతినిధులకు మద్దతుగా మతపరమైన సంఘాలను సయ్యద్ షాబుద్దీన్ మొదలుకొని, తస్లీమ్ రహమానీ వరకు అందరూ నడుపుతున్నారు. 

బద్రుద్దీన్ అజ్మల్, ఓవైసీ, ఆజంఖాన్ వంటివారు బహిరంగంగా తమ సముదాయమే ముఖ్యం అంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయడం తప్పని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు వాళ్లకు ఏనాడూ హితబోధ చేయదు. ఇదంతా ఇపుడు జాతీయవాదం బలపడేందుకు కారణం అయ్యింది. ఒక దేశంలో నివసించే ప్రజలకు ‘సమానమైన న్యాయం’ లేకుండా కొందరిపై ప్రేమ, మరికొందరిపై ద్వేషం ఎందుకు? అందుకే రామమందిరం తీర్పును భక్తికన్నా భావోద్వేగంగానే ఈ దేశ ప్రజలు చూస్తున్నారన్నది సత్యం.


 ********************************

* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*15-11-2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి