• ‘‘సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః
  • నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే’’ (భ.గీ. 9/14)
‘నా భక్తులు నన్ను ఎల్లప్పుడూ దృఢవ్రతులై ప్రయత్నిస్తూ, భక్తితో నమస్కరిస్తూ, నాయందు చిత్తాన్ని నిలిపి, నన్నే సేవిస్తారు’ అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. కీర్తన వాఙ్మయరూపం. వాక్కు మన దేహంలో అగ్నితత్వం. మనస్సు వాయుతత్వం. అగ్నిదేవుడికి వాయుసఖుడని పేరు. కాబట్టి ఎక్కడ అగ్ని ఉంటే వాయువు కూడా అతనికి తోడుగా ఉంటాడు. నామకీర్తనకు, మనస్సుకు అలాంటి దగ్గరి సంబంధం ఉంది. 

మనం ఏ మాట మాట్లాడుతున్నా అది వాయువు సహాయంగానే జరుగుతుంది. మన మనస్సు వాయుతత్వమే కాబట్టి మనం మాట్లాడేటపుడు మనస్సు కూడా వెంట నిలుస్తుంది. అలాగే ఇష్టమైనవి వింటున్నపుడు గానీ, చదువుతున్నపుడు గానీ అక్కడ మనస్సు కూడా నిలుస్తుంది. ప్రత్యేకించి సంగీతానికి ఆకర్షణ శక్తి స్వతసిద్ధంగానే ఉంది. కాబట్టి ఎంత కఠినతపం చేసినా స్థిరంగా ఉండని మనస్సు సంగీతం దగ్గర నిలిచిపోతుంది. అందువల్ల భగవంతుని చేరేందుకు దారిదీపం వంటిది కీర్తన.
మనస్సు కోతి వంటిది. అది కల్లు తాగింది. దానికి తేలు కరిచింది. పైగా దయ్యం పట్టింది. ఆ తర్వాత నిప్పు తొక్కింది. అంతఃకరణంలోని మనస్సు ఇంత చంచలంగా మన శాస్త్రాలు వర్ణించాయి. అలాంటి మనస్సును అరికట్టి, ఆత్మగా మార్చి, భగవంతుని వైపు ఏకోన్ముఖంగా చేయడమే యోగం. యోగం అభ్యసిస్తే చిత్తవృత్తుల నిరోధం అవుతుందని పతంజలి చెప్పాడు. మన వాళ్లు ఇంకా అనేక ఉపాయాలు సూచించారు. 

దేవుడిని ‘శబ్దబ్రహ్మ’గా చెప్పారు. అది ఆద్యంతాలు లేని సత్యరూపం. ఆ శబ్దం నామంగా మారితే అది స్తోత్రం, కీర్తన అవుతుంది. ఆ శబ్దాన్ని కన్నులు మూసుకొని ధ్వనించగానే రూపం, గుణం, లీల.. అన్నీ దర్శనమిస్తాయి. ఆ శబ్ద బ్రహ్మోపాసన వాదరూపంగా సంగీతజ్ఞులు ఉపాసిస్తే, వేదజ్ఞులు చర్మచక్షువులకతీతంగా దర్శించారు.
 
సంకీర్తనలు యోగానికి దారి చూపిస్తాయి. జీవుడు స్వయంగా నాదబ్రహ్మకు అభివ్యక్తి కాబట్టి ధ్వనితో కూడిన ‘భగవన్నామాలు’ సాధకులపై అప్పటికపుడు ప్రభావం చూపిస్తాయి. షట్చక్రాలు, కుండలి వంటి శక్తులను చైతన్యం చేస్తాయి. ఆ స్థితి ఆనందబ్రహ్మమైనది. అది పొందిన తర్వాత కలిగే అనుభూతిని సమాధిగా యోగులు చెప్తారు. దానిని శాశ్వతంగా నిలబెడితే యోగం. 

సిద్ధత్వం కలిగినపుడు అంతటా, అందరిలోని ఆత్మభావనను నిరంతరం దర్శించాక ఇక సాధనలు ఉండవు. ఆ స్థితే సాధకులుగా మారిపోతుంది. చరాచర భూతాల్లోని తత్వానికి రామ, కృష్ణ, శివ... వంటి నామాలు తారకమంత్రాలు అవుతాయి. శ్రీరామ నామ సాధన చేత హనుమంతుడు వారధి దాటడం అంటే అదే స్థితి. 

మాలదాసరి బ్రహ్మ పిశాచానికి ముక్తి కల్పించడం ఈ నామశక్తి ధారపోయడం వల్ల అని ప్రబోధించే కథలు ఈ తత్వాన్ని మనకు అందించేందుకే. అందుకే ‘భక్తులై స్వస్వరూపం వదిలిన వారు, దైవప్రకృతి గలవారు ఎల్లప్పుడూ కీర్తిస్తూ సేవిస్తారు’ అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి భాగవతంలో ఈ భగవన్నామ మహిమను దృష్టిలో పెట్టుకొనే చెప్పారు.

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 01 - 12 - 2019 : సోమవారం*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి