తెలుగునాట ‘నరం లేని నాలుక ఉన్న’ ఓ వీర కమ్యూనిస్టు యోధుడు కె.నారాయణ. జిహ్వచాపల్యంపై అదుపులేని ఈయన గతంలో గాంధీ జయంతి నాడు చికెన్ తిని, ఆ తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకొన్నాడు. ఎంతటి వారిపైన అయినా సరే ఈయన నోరుపారేసుకుంటాడు. ‘గవర్నర్ నరసింహన్ ఓ బఫూన్.. కేంద్రానికి బ్రోకర్.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు భజన చేస్తున్నాడు.. దావూద్ ఇబ్రహీంకు, మోదీకి తేడా లేదు.. రాష్టప్రతిది కొంగజపం.. సీఈఓ జోతి ప్రధాని పాలేరు..’ ఇవీ నారాయణ నోటి నుంచి జాలువారిన అమృత వచనాలు!
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికై అధికార పీఠాలపై కూర్చున్న ఉన్నత వ్యక్తులను ఇంత అద్భుతంగా విమర్శించగల సత్తా కమ్యూనిస్టు నారాయణకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పెద్దనోట్లను రద్దు చేసినందుకు మోదీని ఉరి తీయాలన్నాడు. విచిత్రం ఏమిటంటే మీడియాకు ఇది వినోదమా? మోదీపై అక్కసా? నారాయణ బోళాతనమా? అనేది అర్థం కాదు. రాష్టప్రతి పీఠంపై దళిత మేధావి రామ్‌నాథ్ కోవింద్ కూర్చోవడం ఇష్టం లేని సీపీఎం నేత సీతారాం ఏచూరి లాంటి వారు వెతికి వెతికి మీరాకుమార్ లాంటి వ్యక్తిని రాష్టప్రతి ఎన్నికల్లో నిలబెట్టి ఓడించారు. రాష్టప్రతిపై ఏదైనా మాట్లాడవచ్చా? కమ్యూనిస్టులు ఏదైనా, ఎప్పుడైనా అనగలరు. అన్నీ తిట్టిపోసి, ఆ తిట్లకు క్షమాపణలను ‘చారిత్రక తప్పిదాల ఖాతా’లో వేస్తారు.
హైందవ దేశంగా ఉన్న నేపాల్‌ను ధ్వంసం చేసిన ఈ శక్తులే దేశంలో ఏ సమస్యనూ సామరస్యంగా తెగనివ్వవు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఏ కులాన్ని, ఏ మతాన్ని విస్మరించలేమన్న సత్యాన్ని వదలిపెట్టి ఒకరిపై ఒకరికి విద్వేషం పెంచుతారు. మనుషుల మధ్య సమన్వయానికి బదులు వర్గదృష్టిని నూరిపోస్తారు. గతంలోని తప్పులను సరిదిద్దడానికి బదులు గతి తార్కిక భౌతిక వాదాన్ని మన నెత్తిన రుద్దుతారు.
రవీంద్రనాథ్ ఠాగూర్‌ను, సుభాష్‌చంద్ర బోస్‌ను, సావర్కర్‌ను, గాంధీని ఆఖరుకు స్వామి వివేకానందణ్ణి కూడా కమ్యూనిస్టులు వదలిపెట్టలేదు. కారణం ఏమిటి? వారి దేశభక్తా? విదేశభక్తా? ముస్లిం లీగ్‌కు, జిన్నాకు మద్దతిచ్చి మరీ దేశ విభజన చేయించారు. ఈరోజుకూ ముందునుండి ఓ మతం వారి సంతుష్టీకరణను నిరంతరాయంగా సాగిస్తున్నారు. భారత్ ఇష్టపడే, భారత్‌ను అభిమానించే ఇజ్రాయిల్ వీళ్ల దృష్టిలో భయంకర శత్రుదేశం. హేతువాదం పేరుతో హిందూధర్మంపై దాడి చేయడానికి సైన్స్‌ను ముందుపెట్టి విమర్శిస్తారు. యూరప్ నుంచి వచ్చిన సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం మనకు అవసరమంటారు. సీపీఎం భావజాలం ఉన్నవారే హేతువాద, జనవిజ్ఞాన వేదికల్లో పనిచేస్తుంటారు. వీళ్లంతా ఐజాక్ న్యూటన్, ఆల్బ్రర్ట్ ఐన్‌స్టీన్ ఇంట్లోనే తాము పుట్టినట్టు వాదిస్తారు. సూర్య, చంద్ర గ్రహణాలు మొదలుకొని చేపమందు వరకూ వీరు మాట్లాడని అంశం లేదు. అదే పాశ్చాత్య విజ్ఞానంతో దేశంలోకి వచ్చే పరిశ్రమలను, పెట్టుబడులను మొండిగా వ్యతిరేకిస్తారు. అసలు ఈ భూమిమీదే పరిశ్రమలనే పెట్టవద్దంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతీయత గురించి మాట్లాడినప్పటి నుంచి అతడిని తీవ్రంగా తిట్టడం ప్రారంభించారు. ట్రంప్ ఎన్నికైన మరుసటి రోజే కొందరు అతనికి వ్యతిరేకంగా అమెరికాలో ర్యాలీలు తీశారు. దానిని ఈ దేశ వామపక్ష మీడియా గోరంతలు కొండంతలు చేసింది. వారి భావజాలం ఉన్న పత్రికలన్నీ ట్రంప్‌ను దిగజార్చి మరీ వార్తలూ, వ్యాఖ్యానాలు అందించాయి. ట్రంప్‌ను వ్యతిరేకించేవారంతా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తారనుకొంటే మనం తప్పులో కాలేసినట్టే. ఇక కుటుంబ నియంతృత్వం ఉన్న ప్రాంతీయ పార్టీలతో అంటకాగేందుకు వామపక్షాలు సదా సిద్ధం. అంతెందుకు? ఒకే కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ముందుపెట్టి లౌకికవాద సంరక్షణ ఉద్యమం నడిపిస్తారు. ఇదంతా ప్రజాస్వామ్య రక్షణేనంటూ కలర్ ఇస్తారు. ట్రంప్‌ను ఎండగట్టడంలో మరో దురుద్దేశం కూడా ఉంది. ట్రంప్, మోదీ కొద్ది కాలం తేడాతో దేశాధినేతలయ్యారు. ట్రంప్‌కున్న బలహీనతల్లో మోదీని చూపించి ఈ ఇద్దరూ మిత్రులేనన్న భ్రమను కలిగిస్తారు. ఇద్దరూ నియంతలేనని ప్రచారం చేస్తారు. అనవసరంగా రాసుకుని, పూసుకుని తిరిగితే పైరవీలు, అభాండాలు తప్పవని, అవినీతి పంకిలం అంటుకొంటుందని ఏకాంతంగా, డైనమిక్‌గా మోదీ నిర్ణయాలు తీసుకుంటే అది నియంతృత్వం అని ప్రచారం చేస్తారు. భగత్‌సింగ్‌ను బుట్టలో పెట్టి, చేగువేరాను ఈ దేశ యువతపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నం ఇంతా అంతా కాదు.
పోనీ వామపక్షాలన్నీ నియంతృత్వాలను అలాగే ఖండిస్తాయా? అంటే అదీ లేదు. జెఎన్‌యూ, డీయూ, హెచ్‌సియూల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు చేస్తున్న దేశవ్యతిరేక కార్యకలాపాలకు అంతే లేదు. దానికి కులం రంగు పులిమి శవరాజకీయాలు చేస్తున్నారు. ర్యాలీలు, నిరసనలు, బీఫ్ ఫెస్టివల్స్.. వీటి వెనుక ఉన్న శక్తులెవరు? ఈ శక్తులే నియంతృత్వానికి నిదర్శనమైన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్‌ను గొప్పగా ఆరాధిస్తాయి. కిమ్‌ను ప్రశంసిస్తూ ఇటీవల సీపీఎం పాలిత కేరళలో పోస్టర్లు వెలిశాయి. కేరళ సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాలిట్‌బ్యూరో సభ్యుడు కొడియేరి బాలకృష్ణన్ ఉత్తర కొరియా నియంత పాలనను పొగిడి తరించాడు. అదే నోటితో చైనాపై ప్రశంసలూ కురిపించాడు. కేంద్రంలో పాలకులు ఎంతబాగా పనిచేసినా ప్రజాస్వామ్య హననం అంటూ వారిని బతకనివ్వరు. అమెరికా సామ్రాజ్యవాద శక్తిని అడ్డుకోవడానికి ఉత్తర కొరియా ప్రభుత్వం నిధులను వెచ్చిస్తున్న తీరు, విదేశాంగ విధానం ప్రసంశనీయం అంటారు. ఇక్కడ పూటకోసారి మాట్లాడే మానవహక్కులు, ప్రజాస్వామ్యం, భావస్వేచ్ఛ వంటివి అక్కడ ఏ మేరకు ఉన్నాయో తెలిసినా తెలియనట్టు నటిస్తారు. ఈ దేశ ప్రభుత్వాలను అవసరం ఉన్నా లేకున్నా విమర్శిస్తూ ఇబ్బంది పెట్టడమే వారి లక్ష్యం. కొరియా దశాబ్దాలుగా ఓ కుటుంబ ఆధిపత్యంలో ఉన్నా వీరి దృష్టిలో అదో మాహిష్మతీ సామ్రాజ్యమే. ఉత్తర కొరియాలో తనకు నచ్చని వారిని అక్కడి ప్రభుత్వం తనకు నచ్చిన రీతిలో మట్టుపెడుతుంది. మన దేశంలో అణుపరీక్షలు జరిపితే ముక్కు విరిచిన వామపక్షాలు ఉత్తర కొరియా అణుపరీక్షలు చేస్తే మురిసిపోతాయి. అమెరికాపై బాంబులు వేస్తామని కిమ్ జోంగ్ అంటే అక్కడి ప్రతిపక్ష పార్టీల కన్నా మన వామపక్ష నేతలే ఎక్కువ సంబరాలు చేసుకొంటారు. 2014లో ఐక్యరాజ్యసమితి నిజనిర్థారణ కమిటీ ఉత్తర కొరియాలో తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పినా అక్కడ పాలన చల్లగా ఉందని ప్రచారం చేస్తారు. నారాయణ లాంటి నేతలు బరితెగించి దేశ ప్రధానిని కాల్చిపారేయాలని సెలవిచ్చినా ఇక్కడ ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టడం లేదని తెగ బాధపడతారు. ఈ పార్టీకి మద్దతుగా ఏసీ హోటళ్లలో సమావేశాలు పెట్టి సాహిత్యం సృష్టించే మరో గ్యాంగ్ ‘అసహనం’ అంటూ గోల చేస్తుంది. తుప్పుపట్టిన అవార్డులను కొందరు మేధావులు వాపస్ ఇచ్చి మళ్లీ వార్తల్లోకి ఎక్కుతారు. ఇటీవల ప్రతిదాన్నీ మోదీ నియంతృత్వంగా చూపిస్తూ రచ్చ చేస్తున్న వామపక్ష శక్తులకు ‘విలన్’ ప్రకాశ్‌రాజ్ ఇపుడు తోడయ్యాడు. ఈయన జర్నలిస్టు గౌరీలంకేశ్ మరణం తర్వాత దేశంలో జరిగే ప్రతి ఘటననూ మోదీపైకి నెట్టేస్తాడు. అలాగే, ‘నాది ఎర్రరక్తం’ అంటూ కేరళ సీఎం పినరయ్ విజయన్ వద్ద మోకరిల్లిన నటుడు కమల్‌హసన్ అసందర్భంగా ‘అసహనం’ అంటూ రాగం అందుకొన్నాడు.
రాష్టప్రతిని, ప్రధానిని బూతులు తిట్టినా, వాళ్లు వౌనంగా భరిస్తున్నా ఇక్కడ ప్రజాస్వామ్యం ధ్వంసమైందనే వాళ్లు తాము ఆరాధించే చైనాను నెత్తిన ఎత్తుకుంటారు. ఇక్కడ హక్కులే లేవని గొంతు చించుకొనేవారు చైనాలో మారణ హోమం గురించి పెదవి విప్పరు. ‘రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టే’ కమ్యూనిస్టులు ఇటీవల ఉత్తర కొరియా విషయంలోనూ అలాగే చేస్తున్నారన్నది కొత్త జోక్. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్నది చైనాలోనే అని ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ప్రకటించింది. ఆ దేశంలో మరణశిక్షలను రహస్యంగా అమలు చేస్తూ గణాంకాలను ఇవ్వడం లేదని మానవహక్కుల సంఘం వాపోతోంది. మరి భారత్‌లో ఒక్క యాకూబ్ మెమెన్‌ను ఉరితీస్తే ఇంటికో మెమెన్‌ను పుట్టిస్తామని వామపక్ష విద్యార్థి సంఘాలు బహిరంగ ప్రకటన చేస్తున్నాయి. అదీ- ముంబయి పేలుళ్ల కేసులో 250 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకున్నాడని ఏళ్లతరబడి విచారించి కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేస్తే..!
పొద్దున లేచింది మొదలు ముస్లింల హక్కుల గురించి గోలచేసే వామపక్షాలు చైనాలో ముస్లింల దమనకాండపై ఎప్పుడైనా నోరు విప్పాయా? పశ్చిమ చైనాలో నివసించే ముస్లిం బాలలు శీతాకాల సెలవుల్లో ఎలాంటి మత కార్యక్రమాల్లో పాల్గొనరాదని అక్కడి కమ్యూనిస్టు పాలకులు విధించిన ఆంక్షలను ఎప్పుడైనా వేలెత్తిచూపారా? ఇక్కడ ముస్లిం మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలను నియంత్రించేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు తెస్తే అది లౌకికవాదంపై కుట్ర అని వామపక్షాలు దుష్ప్రచారం చేస్తాయి. స్ర్తివాదాన్ని అన్ని రంగాల్లో వ్యాప్తి చేసి భారతీయ కుటుంబ వ్యవస్థపై దాడి చేయించే కమ్యూనిస్టులు ముస్లిం మహిళల పట్ల సానుభూతి ఎందుకు చూపరు? ఇది- భారతదేశం కనుక. ఇదేనా వారి దేశభక్తి? దేశాన్ని ప్రేమించడం వారి దృష్టిలో నేరమే.
అత్యధిక ఆర్థిక అసమానతలు ఉన్న దేశాల్లో చైనా ఒకటి. అత్యధిక దురాక్రమణ బుద్ధి కలిగిన దేశం కూడా ఇదే. తన వీటోను ఉపయోగించి పాకిస్తాన్ తీవ్రవాది హఫీజ్ సరుూద్‌కు రక్షణ కవచంలా నిలబడుతున్న చైనా మన సరిహద్దుల్లోకి మరీ చొచ్చుకువస్తోంది. నోట్లరద్దు నుంచి మానవ హక్కుల వరకూ అన్ని విషయాలపై మాట్లాడే కమ్యూనిస్టులు ‘డ్రాగన్’ దురాక్రమణ గురించి ఎందుకు మాట్లాడరు? ఇదీ ‘అంతర్జాతీయ కమ్యూనిస్ట్ బ్రదర్‌హుడ్’!
1930 నుంచీ భారత్‌లో కమ్యూనిస్టులు ప్రారంభించిన ‘భారత వ్యతిరేక సెంటిమెంట్’ ఇపుడు ఇంకా ముదిరిపోయింది. వాళ్ల సాధన అంతా భారత వ్యతిరేక దృష్టిని పెంపొందించడమే! కులం, మతం, ప్రాంతం,్భష, లింగ భేదాలను పెద్దవిగా చేసి తాము పెద్దపార్టీగా అవతరించాలనుకొని ప్రాంతీయ పార్టీలకన్నా దిగజారిపోయారు. ఇకనైనా ‘చారిత్రక తప్పిదాల’ను సమీక్షించుకోకుండా ముందుకు పోతుంటే- ‘వీరేం దేశభక్తులు?’ అన్న ప్రశ్న ఉదయించక తప్పదు. *


-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125



1 కామెంట్‌: