ఇద్దరు భార్యాభర్తలు గుడికి వెళ్లారట. భర్త దేవునికి మొరపెట్టుకుంటూ స్వామీ! నిన్న మా ఇంట్లో సూది పోగొట్టుకపోయింది. అది దొరికితే రేపు గుడిలో 5 కేజీల చక్కెర పంచి పెడతాను’ అన్నాట్ట. వెంటనే భార్య అందుకొని ఏమయ్యా! నీకు బుద్ధుందా! సూది ధర ఒక్క రూపాయి, చక్కెర ధర 5 కేజీలకు రెండు వందల రూపాయలకు పైగా అవుతుంది. అదేం మొక్కు? అన్నదట. దానికి భర్త అది దొరికేదీ లేదు, నేను పంచేది లేదు అన్నాడట. ఇపుడు దేశమంతా క్రొత్త పార్టీలు, ఫ్రంట్‌లు పెట్టేవారు ఇలాగే ఆలోచిస్తున్నారు.
నరేంద్రమోదీ అనే పర్వతాన్ని ఢీకొట్టి పిండి చేయడం దేశంలో రాజకీయం అయితే, కెసీఆర్ అనే బాహుబలిని గద్దె నుండి దించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ప్రధాన అంశం. ఇక చంద్రబాబును వ్యవస్థాపరంగా చీకాకు పరచడానికి ముప్పిరిగొన్న అంశాలే ఎక్కువ. ఆంధ్రా పొలిటికల్ వార్‌లో క్లారిటీ తక్కువ. కన్ఫ్యూషన్ ఎక్కువ. అక్కడ రాజకీయం కన్నా ప్రత్యేక హోదానే ప్రధాన దిక్సూచి అయ్యింది.
2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రధాన స్రవంతి పార్టీలు మోదీని ఎన్నికల్లో ఎదుర్కొనే కార్యాచరణ కన్నా అపఖ్యాతిపాలు చేయడానికే ఎక్కువ ప్రయత్నించాయ. ఈ వ్యతిరేక ప్రచారం అంతా మోదీకి కలిసొచ్చింది. హిందూ మతతత్వ భావజాలం ఉన్న వ్యక్తిగా మోదీపై బురదజల్లారు. దాంతో ఈ దేశంలో హిందూ మతతత్వంలో జీవించడం ఓ నేరమా! అని ప్రజలు ఆలోచించారు. ముఖ్యంగా చదువుకొన్న యువకులు సామాజిక మాధ్యమాల్లో మోదీకి మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికలు మోదీ వర్సెస్ సూడో సెక్యులర్ గ్యాంగు మధ్య పోటీగా జరిగినట్టు తలపించాయి. 2019 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మళ్లీ అదే ప్రహసనం ప్రారంభమయింది. మోదీ వ్యక్తిగతంగా ఏ తప్పూ చేయలేదని ఈ రోజుకూ ప్రజల్లో నమ్మకం బలంగా ఉంది. కానీ నోట్ల రద్దు, జిఎస్‌టి లాంటి అపవిత్ర పనులు మోదీలాంటి ఛాయ్‌వాలా ఎలా చేస్తాడు! అన్నట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు విషప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అద్భుత ఘనకార్యం ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీనో, మన్మోహన్ సింగ్‌లాంటి ఆర్థికవేత్తనో చేయాలిగానీ మోదీలాంటి అర్భకుడు చేయడం దుర్మార్గం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దీనికితోడు కమ్యూనిస్టుల కనుసన్నల్లో నడిచే మాధ్యమాలు మోదీని వీలైనంత అపఖ్యాతి పాలు చేస్తున్నాయి.
విచిత్రం ఏమిటంటే బాబ్రీ మసీదు కూలగొట్టకముందు వాజ్‌పేయిని ‘రైట్‌మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ’ అన్నారు. అప్పుడు అద్వాణీ కరడుగట్టిన మతతత్వవాది. ఇటీవల కాలంలో అద్వాణీ పట్ల ప్రతిపక్షాలు,మీడియా వల్ల మాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. యశ్వంత్‌సిన్హా, మురళీమనోహర్ జోషీ, లాల్‌కృష్ణ అద్వాణీ, సుష్మాస్వరాజ్ వంటి నేతలను ఉదారవాదులని బిరుదులు ఇవ్వడం వెనుక మోదీని విలన్‌గా చేయడమే!
ఇలాంటి మోదీ కుర్చీ లాగేయడానికి రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకొని వచ్చాడు కానీ కమ్యూనిస్టులు మాత్రం గద్దెను ఎక్కిన మొదటిరోజు నుండి అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆ క్రమంలో అనేక రాజకీయ పణామాలు జరుగుతున్నాయి. దానికోసం వివిధ రాష్ట్రాల్లో అనేక ఫ్రంట్‌లకు జీవం పోస్తున్నారు. ఒకవేళ ఫ్రంట్ నిర్మించలేని చోట మోదీని తిట్టేవాళ్లకు క్రొత్త రక్తం ఎక్కిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో భాజపాను ఓడించి గద్దెనెక్కాక తనకు తానే అతి పెద్ద నాయకుడుగా, మోదీకి సమఉజ్జీగా ఊహించుకొన్నాడు. రోహిత్ వేముల హత్య మొదలుకొని అనేక విషయాల్లో మోదీని అడ్డగోలుగా తిట్టిపోశాడు. ఆప్ పార్టీ నుండి కపిల్ మిశ్రా లాంటి వాళ్లు బయటకు రావడం పంజాబ్ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం అతని నిజస్వరూపం తెలియజేశాయి. దాంతో మమతా బెనర్జీ మోదీని బాగా తిట్టగల సమర్థురాలయింది. ఆమెను ఆకాశానికెత్తేశారు. చివరకు కన్హయ్యకుమార్ మోదీని బాగా తిడుతున్నాడని అతనికీ విపరీత ప్రచారం కల్పించారు. ఢిల్లీ, బీహార్ తప్ప మోదీ, షా ద్వయం అన్ని రాష్ట్రాల్లో గణనీయంగా తమ ఖాతాలో వేసుకొంది. ఇపుడు దక్షిణాదిపై దృష్టి పెట్టి కర్ణాటకను ముఖద్వారంగా చేసుకొని ప్రవేశించాలని మోదీ, షాల ప్రయత్నం. దానిని నిలువరించాలనే అన్ని పార్టీల ప్రయాస.

ప్రస్త్తుతం సీపీఎం పార్టీ రెండు గ్రూపులుగా మారి, ఎలాగైనా ఎన్టీయేను గద్దె దించాలనే వర్గం ఒకటి. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాలని మరో వర్గం ఉవ్విళ్లూరుతున్నారు. సీపీఐ కూడా అదే మార్గంలో ఉంది. రేపు త్రిపుర, కర్ణాటకలో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తేగానీ ఈ ఫ్రంట్‌లకు ఉత్ప్రేరకం అందదు. ఉన్న పార్టీలకే ‘సెక్యులర్’ అనే ముద్రవేసి క్రొత్త రుచులు తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ యుద్ధంలో నేరుగా పోరాడలేక ఉత్తర-దక్షిణల మధ్య గోడలు కట్టే ప్రయత్నం జరుగుతుంది. కర్ణాటకలోని సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు ద్రావిడ పార్టీలు, కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం, ప్రత్యేక హోదాకోసం పడిగాపులు గాస్తున్న తెదేపా ప్రభుత్వం, తెరాస ప్రభుత్వం అన్నింటినీ కలిపి ఒకవర్గం మీడియా ఉత్తరాది వారిపై పోరాడే వీరభటులుగా చిత్రీకరిస్తున్నది. కేసీఆర్‌కు ఈ విషయంపై పెద్ద ఆసక్తి లేకున్నా మీడియామాత్రం మోదీపై ఉన్న అక్కసుతో ముగ్గులోకి దించాలని చూస్తున్నది. నిజానికి మోదీ, షాలు కూడా పశ్చిమ భారత్ వారే. తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీ ఎంత దూరమో గుజరాత్ నుంచి కూడా ఢిల్లీ అంతే దూరం. నిజానికి ఢిల్లీ అనుపానులు తెలుసుకోవడానికి మోదీ, షాలు కూడా అరుణ్‌జైట్లీ లాంటి స్థానికులైన సీనియర్లపై ఈ రోజుకూ ఆధారపడే ఉన్నారు. మరి గతంలో లాలూప్రసాద్, మమతాబెనర్జీ లాంటి రైల్వే మంత్రులు ఇక్కడి రాష్ట్రాలకు సున్నాజూపి తమ స్వరాష్ట్రాలకు అన్ని ప్రాజెక్ట్‌లను తరలించుకొని పోయినపుడు ఈ ఆత్మాభిమానం ఎక్కడికి పోయింది? 1200 మందికి పైగా తెలంగాణలో యువకులు అమరులవుతుంటే కనీసం నోరు తెరచి మాట్లాడని సోనియాపై ఎవరైనా పనె్నత్తి మాట్లాడారా? ఇటలీ నుండి వచ్చి ఈ దేశంలో ఓ పార్టీకి వారసురాలు అయితే అంగీకరించిన మనం దక్షిణాది ఉత్తరాది అంటూ ప్రగల్భాలు పలుకుతుంటే సిగ్గే మనల్ని చూసి సిగ్గు పడదా? ఆఖరుకు రేణుకాచౌదరి ప్రధానిని అవహేళన చేస్తూ వికటాట్టహాసం చేస్తే ఆయన ఇచ్చిన కౌంటర్‌ను కూడా ఉత్తరాది-దక్షిణాది అంటూ కలర్ ఇవ్వడం ఎంతవరకు సబబు? దక్షిణాది వాళ్లం అయితే అలా ప్రవర్తించవచ్చా?
అలాగే తమిళనాడులో జయలలిత మరణం తర్వాత చిత్ర విచిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి. శశికళ జైలుకు వెళ్లడానికి, పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య పంచాయతీకి, దినకరన్ ఎన్నికల్లో గెలవడానికి.. అన్నింటికి భాజపానే కారణం అట!? అక్కడ భాజపాకు, సీట్లూ లేవు. ఓట్లూ లేవు. కానీ ఇటీవల ఆ పార్టీకి కావలసినంత అపఖ్యాతి మూటను అంటగట్టారు. ఒకవైపు కమల్‌హాసన్ భాజపాపై ఒంటికాలితో లేస్తున్నాడు. తనకు తానే వీర సెక్యులర్‌గా ఎగిరిగంతేస్తున్నాడు. మరి సెక్యులర్ మంగళసూత్రం ధరించిన డిఎంకె పరిస్థితి ఏంటి? రజనీకాంత్ సినిమా రిలీజ్ అయ్యింది. మహావతార్ బాబా సింబల్‌ను కూడా మతతత్వం అంటూ ముద్ర వేస్తున్నారు. హిందూ రాజకీయాలకు ద్రావిడ ప్రాంతంలో స్థానం లేదు అంటూ పల్లవి అందుకున్నారు. ఇదంతా రజనీకాంత్‌ను భాజపాతో కలవకుండా నిలువరించడమే!
ఇక తెలంగాణలో పార్టీలు, ఫ్రంట్‌ల ఏర్పాటు చూస్తే నవ్వొస్తుంది. కేసీఆర్ లాంటి రాజకీయ వ్యూహకర్తను ఎదుర్కోవడానికి అనేక తోక పార్టీలకు జీవం పోస్తున్నారు. మజ్లిస్ అధికారంలో ఉన్న తెరాసతో కలవగా, భాజపా ఇంకా ఏలిననాటి శని గ్రహం పరిధిలోనే ఉంది. కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం తెరాసకు ప్రత్యామ్నాయ వేదికగా భ్రమింపజేయడంలో విజయవంతం అయ్యింది. ఇటీవల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో కలిసినా ఇంకా అంత పెద్ద మార్పు లేదు. పాత కాపులు మాత్రం తెరాసపై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.
కమ్యూనిస్టులు ఎన్నో రకాల ఫ్రంట్‌లకు తమ సంజీవిని విద్య ద్వారా ప్రాణం పోస్తున్నారు. గద్దర్, వేదకుమార్ ఓ పార్టీలాంటిది పెట్టారు. అది ఏమయిందో తెలియదు. తమ్మినేని వీరభద్రం ప్రధాన పాత్రగా ఈ ప్రహసనం నడుస్తుంది. టీ-మాస్ పేరుతో ఆవిర్భవించిన వేదికను ఆర్యవైశ్యులపై పోరాడి గెలిచిన కంచ ఐలయ్యకు అప్పగించారు. జస్టిస్ బి.చంద్రకుమార్ పాదయాత్రలు, పరిశీలనలు చేసి మరో క్రొత్త వేదికను సృష్టించబోతున్నట్టు వార్త. కేసీఆర్‌కు కామన్ శత్రువులైన గద్దర్, మందకృష్ణ, ఆర్.కృష్ణయ్యలతో మరో పార్టీ అని లోకం కోడై కూస్తోంది. ఈ మధ్యలో కోదండరాం సార్ చేస్తున్న పార్టీ ప్రయత్నం కొంత ఆశాజనకంగా ఉందని అంటున్నారు. మొదట కేసీఆర్‌తో కలిసి తెరాసకు పురుడు పోసిన గాదె ఇన్నయ్య లాంటి వారు ప్రొఫెసర్ వెనుక ఉండి కేసీఆర్ కామన్ శత్రువులను ఏకం చేస్తున్నారని తెలుస్తుంది. ఏం జరుగబోతోందో చూడాలి. చెరకు సుధాకర్ స్థాపించిన ఇంటి పార్టీ ఇంకా ఇల్లు దాటలేదు. సీపిఎం నేతృత్వంలో వీళ్లందరినీ కలిపే ‘బహుజన ఫ్రంట్’ ఎవరి తోకగా మారుతుందో చెప్పలేం. అయితే వీళ్లందరికీ కేసీఆర్‌ను దింపడమే ప్రధాన ఎజెండా. కానీ కేసీఆర్‌ను ఏమీ అనలేక, ఇటీవల కాలంలో రేవంత్‌రెడ్డితో సహా అందరూ ఇక్కడ ఎలాంటి ప్రభావం లేని మోదీని తిట్టిపోసి, తమ అక్కసు వెళ్లబోసుకొంటున్నారు. కొన్ని పత్రికలు, ప్రసారమాధ్యమాలది కూడా అదే దిక్కుతోచని పరిస్థితి!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదాను సాధించడమే రాజకీయం. హోదావల్ల లాభం ఏంటో నష్టం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు కానీ భాజపాను దుమ్మెత్తి పోయించడంలో తెదేపా విజయవంతం అయింది. చెలరేగిపోతున్న రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న వంటి వాళ్లపై వికర్ణుడిలా సోము వీర్రాజు తిరగబడేసరికి పరిస్థితి మారింది. తనకు తానే చేగువేరాగా భావించే పవన్‌కల్యాణ్ తన రాజకీయ ప్రస్థానం కన్నా కేసీఆర్ మెప్పు పొందడానికే ఎక్కువ ప్రయత్నం చేశాడు. ఆంధ్రా మెస్సయ్యలా చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తున్న జగన్ భాజపాతో కలవడానికే ఈ సంఘర్షణ మొదలుపెట్టాడని తెదేపా నేతల ఆరోపణ. వీళ్లందరినీ కాదని తెలంగాణలో జరిగినట్టే ఉండవల్లి, జెపి, కమ్యూనిస్టు రామకృష్ణ ఏదో ‘క్రొత్త కషాయం’ తయారు చేస్తున్నారు. ఈ పార్టీలు, ఫ్రంట్‌లు ప్రజల అభివృద్ధి అంశాలపై చర్చకన్నా అధికారంలోని పార్టీలను గద్దె దింపడానికే క్రొత్త పొత్తులను మొలిపిస్తున్నారు. ఇది ఎలాంటి ప్రత్యామ్నాయ రాజకీయమో వారే చెప్పాలి. ఇప్పటికే అనధికార గణాంకాల ప్రకారం 7 జాతీయ పార్టీలు, 50 రాష్ట్ర పార్టీలు, 48 గుర్తింపులేని పార్టీలు, 730 రిజిస్టర్ అయి గుర్తింపు పొందని పార్టీలు దిక్కుదివాణం లేక అల్లల్లాడుతుంటే క్రొత్త పార్టీలు, ఫ్రంట్‌లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి!
****************************************************
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125
Published Andhrabhoomi :
 Friday,  23 February 2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి