‘గురువుగారూ మీ శిష్యుడైన రామానుజులు ఆలయంపైకి ఎక్కి అందరికీ అష్టాక్షరిని బోధిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలుసా?’ అని ఎవరో వచ్చి చెప్పారు. వెంటనే ఆయన రామానుజులవారిని పిలిపించి.. ‘రహస్యంగా బోధించిన నారాయణ మంత్రం అందరికీ చెప్తే నీవు నరకానికి వెళ్తావు తెలుసా?’ అన్నారు. ‘నేను నరకానికి వెళ్లినా సరే! విన్నవాళ్లు వైకుంఠప్రాప్తి పొందుతారని మీరే చెప్పారు కదా గురువుగారూ..’ అన్నారు రామానుజులవారు. శతాబ్దాల క్రితమే అలా ఆయన కులభేదాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. రామానుజాచార్యుల సర్వజన ఆలయ ప్రవేశం ఆనాడు పెను సంచలనమే. అలాగే.. పన్నిద్దరు ఆళ్వారుల్లో తిరుప్పాణి ఆళ్వారు దళితుడు. కావేరీ తీరంలోని శ్రీరంగం క్షేత్రంలో లోకసారంగముని అనే అర్చకుని కళ్లు తెరిపించారు. ఆదిశంకరులు కాశీ స్నానఘట్టం వద్ద ఎదురైన చండాల వేషధారిలో శివదర్శనం చేసి ‘చండాలోపి మమ గురు’ అంటూ ఐదు శ్లోకాల మనీషాపంచకం చెప్పారు. కర్మకాండల మర్మం తెలియనివారిని ధర్మపథం వైపు నడిపిన గౌతమబుద్ధుడు కులతత్వంపై యుద్ధం ప్రకటించాడు. ఆత్మజ్ఞానమే అన్నింటిలోకీ గొప్ప అంటూ వజ్రసూచికోపనిషత్‌లాంటివి మన సమాజానికి సామరస్యాన్ని ప్రబోధించాయి. సనాతన ధర్మం సామాజిక సమానత్వ భావాన్ని అందిపుచ్చుకున్న యోగులు, అవధూతలు, సంకీర్తనాచార్యులు, తత్వవేత్తలు.. ‘ఆత్మవత్‌ సర్వభూతాని’ అంటూ సమ భావాన్ని మనకు అందించారు.
 
గురునానక్‌, జ్ఞానదేవ్‌, తుకారాం, మీరాబాయి, స్వామినారాయణ్‌, వేమన, అన్నమయ్య, పోతులూరి వీరబ్రహ్మేంద్రులు, నామ్‌దేవ్‌ వంటి పరమ భక్తులు జాతిలో కులజాడ్యం తొలగించి బలమైన జ్ఞానప్రసారానికి తోడ్పడ్డారు. 12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు గొప్ప సంస్కర్తగా అవతరించి ఈనాటి పార్లమెంటులాంటి అనుభవ మంటప సభలో స్త్రీలకు, అన్నికులాలకూ సమప్రాధాన్యం ఇచ్చి సమానత్వ దృష్టిని ఆయన కాలంలోనే చవిచూపారు. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి.. వేదవిద్యలోని రహస్యాలను అన్ని కులాలవారికీ పంచిపెట్టగా, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద జ్ఞానతత్వంలోని సమసమాజ భావనను తమ జీవితకాలంలోనే ఆచరించి చూపారు. అలాగే నారాయణ గురు ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం’ పేరుతో ధార్మిక సమానత్వాన్ని లోకానికి అందించారు. శ్రీ రమణమహర్షి ప్రశంసలందుకున్న కావ్యకంఠ గణపతి ముని పంచజన చర్చ చేసిన మహాపండితుడు.
 
గిరిజనకులాలల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటి స్థిరీకృతం చేసిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌, హథీరాం బాబా జ్ఞానమార్గంలో అగ్రగణ్యులు. ఇలా ఎందరో సామాజిక సమానత్వ దృష్టిని మనకు ఆధ్యాత్మిక దర్శనంతో అందించినందువల్లనే ఈరోజు నైతిక జీవనం దృష్ట్యా మనం కొత్తపుంతలు తొక్కుతున్నాం. సాంఘికంగా చేసే మంచిపనులకు మాత్రమే కులాన్ని ఉపయోగించాలని.. మనిషిని వేరుచేసే దృష్టికి కులాన్ని వాడుకోవద్దని వారందరూ చెప్పారు. అందరి అంతరాత్మా ఆ శ్రీహరే అని బోధించారు. ధర్మదృష్టిలో అందరూ సమానమే అని శాస్త్రాలు, మహాత్ములే చెప్పాక మనకెందుకు ఈ భేదం?

******************************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి