భాజపాను అడ్డుకొంటున్నదెవరు?



సెక్యులర్ రాజనీతి వ్యవస్థలో కులం, మతం, ప్రాంతం, భాష, ఉత్తర- దక్షిణ, ఆర్య-ద్రవిడ.. ఇలా ఎన్నో విధ్వంసకర ఆయుధాలుంటాయి. వీటిని ఆ ‘సెక్యులర్ గుంపు’ ప్రత్యర్థులపై ప్రయోగిస్తుంది. నేడు ‘సెక్యులర్’ ముసుగులో బతికే అన్ని రాజకీయ వ్యవస్థలకు వేర్లు బలంగానే వున్నాయి. కళలు, సాహిత్యం, పాత్రికేయ, మేధారంగంలో వాళ్లకు ‘రెడీమేడ్ సిలబస్’ ఉంది. కానీ, జాతీయవాద దృక్పథం వున్న పార్టీలకు వాటి లోతుపాతులు తెలియవు. ఒక అస్త్రాన్ని ఎదుర్కొనే లోపుగా వీరిపై మరో అస్త్రం వచ్చిపడుతుంది. ఈ గందరగోళంలో- లేకలేక కేంద్రంలో ‘సంపూర్ణ మెజారిటీ’తో ఏర్పడ్డ జాతీయవాద భాజపా ప్రభుత్వం ఇపుడు అసత్య దుష్ప్రచారాల దుమ్ములో కూరుకుపోతుంటే.. ఈ విపరిణామాలకు జాతీయవాదులకు భయం కూడా కలుగుతోంది. భాజపాను అజేయశక్తిగా నిలబెట్టిన మోదీ, అమిత్ షాలను టార్గెట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కదలికలు ఈ ఆందోళనను మరింత తీవ్రం చేస్తున్నాయి.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పెద్దగా లాభపడకపోయినా, ఆ పార్టీకి కేసిఆర్ గెలవడం సంతోషకరమే అయ్యింది. భాజపా కాలుపెట్టలేని త్రిపుర, బెంగాల్, కేరళ వంటి ప్రాంతాల్లో కూడా ‘కాషాయ జెండా’ ఇతరులను కలవరపెడుతోంది. కానీ తెలుగు ప్రాంతాల్లో ఉన్న ప్రాభవాన్ని తాము కోల్పోవడం ఇక్కడి భాజపా నేతల దుస్థితిని తెలియజేస్తున్నది. దీని వెనుక కొంత చరిత్రను అవలోకనం చేయాలి. 


స్వాతంత్య్రానంతరం తెలుగు రాష్ట్రాల్లో ఎందరో జాతీయవాద అభిమానులు నాయకులుగా ఉండేవారు. వారంతా కాంగ్రెస్‌లో వుండేవారు. నిజాంపై జరిగిన విమోచన పోరాటంలో మరాఠా, కన్నడ ప్రాంతాల అగ్రకుల నాయకులు హిందూ మహాసభ, ఆర్య సమాజంలో ఉన్నత స్థానంలో వుంటే, కింది కులాల వారంతా వారి వెంబడి నడిచారు. ఇక్కడి అగ్రకులాల నేతలు ఎక్కువగా కాంగ్రెస్, కమ్యూనిస్టులుగా, సోషలిస్టులుగా పేరొందారు. ఆ తర్వాత తెలంగాణ రెడ్లు ఎక్కువగా కాంగ్రెస్‌లో వుంటే, వారి పిల్లలు విశ్వవిద్యాలయాల్లో అఖిలభారత విద్యార్థి పరిషత్‌లో వుండేవారు.

ఇక ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ చైతన్యం వున్న కమ్మ కులస్థులు ఎక్కువగా జస్టిస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలను అభిమానించేవారు. ఆ తర్వాత సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాల్లో బ్రాహ్మణ మేధావులు చాలామంది కమ్యూనిస్టు కవులుగా, రచయితలుగా ముద్ర వేసుకున్నారు. కొందరు నిజానికి కమ్యూనిస్టులు కాకున్నా, వారిని అభ్యుదయ గ్రూపులే తలపై పెట్టుకొని పెద్దవాళ్లను చేశాయి. ఇందుకు గురజాడ, కందుకూరి, చలం, శ్రీశ్రీ, కారా, రావిశాస్ర్తీ వంటివాళ్లని ఉదాహరణగా చెప్పవచ్చు. జస్టిస్ పార్టీ అవశేషాలు ఇపుడు కమ్యూనిస్టులుగా, తెలుగుదేశం కార్యకర్తలుగా వున్నా అదే రంగులో ఉండడం ఈ రోజు తెదేపా మనుగడకు మూలకారణం. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రాంతంలో జాతీయవాదం వున్న భాజపా వెనుకబడింది. ఈ రోజుకూ తెలుగు మేధోరంగంలో ఈ భావజాలానిదే పైచేయిగా వుంది. ఇక్కడ ఒకప్పటి జాతీయవాద జనసంఘ్ నేతలు గాని, ఇప్పటి భాజపా నాయకులుగానీ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలు తెలుగు రాష్ట్రాల్లో భాజపాను తోకపార్టీగా మార్చేశాయి. తెలంగాణలో ఆసిఫ్ జాహిల అణివేతను ఇక్కడి ప్రజలు మరచిపోలేదు. ఇక్కడి జనంలో మతపరమైన సెంటిమెంటు నివురుగప్పిన నిప్పులా వుంది. ఆంధ్రలో భాషకు సంబంధించిన సెంటిమెంటు ఇటీవల కులవాద సెంటిమెంటుగా మారిపోయింది. 


అందుకే చంద్రబాబు తన పార్టీ రాజకీయమంతా ‘తెలుగువాళ్ల సెంటిమెంట్’గా ఎక్స్‌పోజ్ చేస్తాడు. ‘కుటుంబ, కుల సెంటిమెంట్లు’ ప్రాంత అస్తిత్వంగా మారడాన్ని జాతీయవాదులు అర్థం చేసుకోలేకపోవడమే ఈ అనర్థాలకు మూలం. ఇది మొదటి నుండి వున్నా దీని రహస్యం తెలియని జనసంఘ్, భాజపా నాయకత్వం తమ గుంత తామే తవ్వుకున్నారు.

1969లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగింది. అపుడు కమ్యూనిస్టు పార్టీతో పోటీపడాలనుకొన్న జనసంఘ్‌లో ఆంధ్రా పెద్దలు రెండు ప్రాంతాలకూ చేతబడి చేశా రు. తెలంగాణ జనసంఘ్ నేతలు గవర్నర్ బంగ్లా ముందు ‘జై తెలంగాణ’ అంటూ ధర్నాకు దిగారు. అపుడు అరెస్టు అయినవాళ్లలో జంగారెడ్డి, మందాడి సత్యనారాయణ రెడ్డి వంటివారు ఇప్పటికీ బతికే వున్నారు. ఉద్యమం సందర్భంగా అదే జైల్లో ఉన్న టి.అంజయ్య, జి.వెంకటస్వామి వంటి కాంగ్రెస్ తొలితరం నాయకులు బూతులు తిట్టినా వీరు భరించారు. ఉద్యమంలో పాల్గొన్న నాటి హైదరాబాద్ నగర జనసంఘ్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని రాష్ట్ర శాఖ సస్పెండ్ చేసింది. దీనికి ఆనాటి జనసంఘ్ నాయకులైన జూపూడి యజ్ఞనారాయణ, చలపతిరావు, కొమరగిరి కృష్ణమోహనరావు, లోలభట్టు సోమశేఖర్‌రాజు వంటి మొదలైన ఆంధ్రా ప్రాంత నాయకులు కారణం. 1969 తర్వాత జాతీయ భావాలున్న యువకులంతా జనసంఘ్ నుండి వెళ్లిపోయారు. తెలంగాణలో ఆ పార్టీ ఎదుగుదలకు బ్రేక్‌పడింది.


1973లో ‘జై ఆంధ్ర’ ఉద్యమం వస్తే ఆంధ్ర ప్రాంత నాయకులంతా జనసంఘ్ పార్టీ అనుమతి లేకుండానే అందులోకి దూకారు. అపుడే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నేతగా ఎం.వెంకయ్య నాయుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత ‘జై ఆంధ్ర’ ఉద్యమం చల్లబడింది. అపుడే వరంగల్‌లో జనసంఘ్ స్టేట్ కౌన్సిల్ జరిగింది. దాంట్లో అధ్యక్షుడిగా ఆర్మీ కెప్టెన్, రంగరాయ మెడికల్ కళాశాల వ్యవస్థాపకుడు పి.వి. ఎన్.రాజు కూర్చున్నారు. స్టేట్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి ఉద్యమాల సంగతి చర్చకు రాగా మందాడి సత్యనారాయణరెడ్డి- ‘కేం ద్ర పార్టీ అనుమతి లేకుండా జై ఆంధ్ర ఉద్యమంలో రాష్ట్ర నాయకులు ఎలా పాల్గొన్నారు? మాకో న్యాయం, మీకో న్యాయమా?’ అంటూ తీర్మానం పెట్టారు. దానిపై చర్చ జరిగాక- తప్పు జరిగిందని ఆ సమావేశంలో జూపూడి యజ్ఞనారాయణ కన్నీటి పర్యంతం అవడం నాటి నాయకత్వ నిజాయితీని వెల్లడిస్తుంది. జనసంఘ్ పార్టీ 1973లోనే ‘ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా చేస్తేనే సత్వర అభివృద్ధి సాధ్యమ’ని తీర్మానం చేసింది. ఇది చాలామందికి తెలియని విషయం. 1994లో అద్వానీ, వాజపేయిల కాలంలో ఈ విషయం అనేక కారణాల వల్ల వెనక్కి వెళ్లింది. 1997లో రాష్ట్ర విభజనకు కాకినాడ సదస్సులో తీర్మానం జరిగింది. కానీ ఆ రోజునుండే దానికి ‘చంద్ర’ గ్రహణం పట్టింది. ఆ తర్వాత అనేక ఉత్థాన పతనాల మధ్య ఆంధ్రలో భాజపా కుంటుతూ సాగుతోంది.


కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అవినీతి వ్యవహారాలకు విసిగిన ప్రజలు మార్పు కోరడంతో 2014లో మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ తర్వాత 21 రాష్ట్రాల్లో ఎన్డీయే మిత్రులు అధికారంలోకి తేవడంతో మోదీ, అమిత్ షాలు సఫలం అయ్యారు. కానీ- తెలుగు రాష్ట్రాల్లో భాజపా నేతల స్వయంకృతాపరాధం, ఇపుడు చంద్రబాబు ప్రదర్శిస్తున్న మోదీ ద్వేషం- భాజపాకు పెను సమస్యల్లా మారాయి. తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ వారికన్నా అత్యుత్సాహంతో వెంకయ్య నాయుడు అలవికాని ప్రత్యేక హోదాను మెడలో కట్టుకుని ఈ రోజు పార్టీ విధ్వంసానికి పరోక్ష కారకుడయ్యాడు. ఏడు మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రాకు ఇప్పించి, మొన్నటి వరకూ హైకోర్టు విభజన జరుగకుండా చేసి చంద్రబాబును ఆనందంగా ఉంచాలని వెంకయ్య ప్రయత్నించారు. విభజన తర్వాత ఆంధ్రలో ఏర్పడ్డ తెదేపా ప్రభుత్వం హోదా పేరుతో భాజపాను విలన్‌గా చూపిస్తూనే వెంకయ్య ద్వారా తన పనులు చేసుకొన్నది. వెంకయ్య ఉప రాష్ట్రపతి అయ్యేవరకు ఈ గాయం వల్ల భాజపా నేతలకు నొప్పి కలుగలేదు. 


పార్టీలో ప్రాబల్యం ఉన్న కంభంపాటి హరిబాబు వంటి నేతలు తెలుగుదేశాన్ని కరకుగా ఎదుర్కొనలేదు. శివాజీ అనే చిన్న నటుడు తనకు భాజపాలో వున్న పూర్వ పరిచయాల ద్వారా ‘ఆపరేషన్ గరుడ’ అనే స్కీంతో మోదీని నడిబజార్లో నిలబెట్టాడు. భాజపా నేత కామినేని శ్రీనివాస్ ఉప రాష్టప్రతి పర్యటనల్లో తప్ప ఎక్కడా కన్పించడు. మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు ఆలయాలను కూల్చినా, పుష్కరాల్లో ప్రాణనష్టం జరిగినా తెదేపాను ఎదిరించలేదు. తెదేపా భూ కుంభకోణాలను బయటపెట్టిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవల వైరాగ్యంలో పడ్డాడు. పార్టీని నమ్మి వచ్చిన పురంధ్రీశ్వరి, కావూరి కాలం కలిసిరాలేదని కామ్‌గా ఉంటున్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ఆంధ్రా పలవరింతలతో బతికే తెలుగు చానళ్లలో గట్టిగా నిలబడే ఏకైక వ్యక్తి విష్ణువర్థన్‌రెడ్డి. ఆ తర్వాత రఘురాం, జీవియల్ చక్కగా వాదిస్తున్నారు. ఇక మిగతావారు చర్చలకు వస్తే టీవీ యాంకర్లకు పండగే.

ఏపీ భాజపాలో ఇపుడు గట్టిగా నిలబడుతున్న కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు సరైన సైన్యం లేదు. పార్టీ చేయి అందిస్తే ‘కన్నా’ సామాన్యుడేం కాదు. కానీ భాజపాలో వున్న చంద్రబాబు కోవర్టులు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ జనవరి 6న మోదీ ఆంధ్రాలో పర్యటిస్తారన్న దానిపై జరిగిన రాద్ధాంతమే. ప్రధాని పర్యటన విషయం పిఎంఓ కన్నా, రాష్ట్ర భాజపా నేతల కన్నా ముందే తెదేపాకి, వాళ్లను మోసే మీడియాకు తెలిసిపోయిందంటే ఇంకేమనాలి?
తెదేపాకు చెందిన ఓ పెద్ద గుంపు వెంకయ్య ద్వారా తమ పనుల్ని చక్కబెట్టుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు, కాంట్రాక్టులు, అనుమతులు వంటివి భాజపా నేతలకన్నా ఈ గుంపులోని వారే పొందుతున్నారు. జ్యుడీషియరీలో తనకున్న పలుకుబడితో చంద్రబాబు భాజపాను, మోదీని అపఖ్యాతిపాలు చేస్తున్నా ఆంధ్ర ప్రాంత ‘కమలనాథుల’కు అవగాహన లేదు. బాబుకు సన్నిహితుడైన తెలుగు ప్రాంత న్యాయమూర్తి మొత్తం కథ నడిపిస్తున్నా భాజపా నేతల్లో చలనం లేదు. ఆంధ్రా ప్రాంత సంఘ్ పెద్ద ఢిల్లీలో పైరవీలు చేసి ఓ వామపక్ష రచయిత్రికి అవార్డు ఇప్పించినా, ఆ సంగతి ఇక్కడి భాజపా నేతలకు తెలియలేదు. జాతీయవాదులకు అస్త్రం లేకుండా చేస్తున్న ఆధునిక జయచంద్రులు ఏపీ భాజపా నిండా ఉన్నారు. 


భాజపాను ఎదగనీయకుండా చేసేందుకు చంద్రబాబుకున్న పరిజ్ఞానంతో పోటీపడి సొంత పార్టీని పైకి తెచ్చే చాకచక్యం ‘కమలనాథుల’లో లోపించింది. దీంతో భాజపా ఆత్మరక్షణలో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణలో కేసీఆర్ విజయానికి బాబు ఎంట్రీ ఎలా కారణమైందో, భాజపా ఘోర పరాజయానికీ ఆయన చేసిన దుష్ప్రచారం అంతే కారణమన్న కోణాన్ని ‘కాషాయ దళం’ విస్మరిస్తోంది. ఇప్పటికైనా స్వయం ప్రకాశంతో నాయకత్వ సృష్టి జరపకపోతే, సొంత మీడియాను ఏర్పాటు చేసుకోకపోతే, ఎల్లో మీడియాను నియంత్రించకపోతే- బాబును కేసీఆర్ తిడుతుంటే ఆనంద పడడం తప్ప భాజపా నేతలు ఏమీ చేయలేరు. ఈ నిష్క్రియాపరత్వం భాజపాకు గట్టి శాపమే.

************************************
* డాక్టర్. పి. భాస్కర యోగి *
* ఆంధ్రభూమి : భాస్కర వాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి