మోదీ ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేయగానే మన ప్రతిపక్షాలతో పాటు దాయాది దేశమైన పాకిస్తాన్ ఆందోళన ప్రకటించింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం ఏర్పరచి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని దుర్వ్యాఖ్యలు చేశాడు. పాక్ ప్రధాని నుండి అంతకన్నా ఎక్కువ ఆశించలేం. ‘్భరత్‌లో భాజపా ప్రభుత్వం నాజీ మనస్తత్వం వున్న ఆర్‌ఎస్‌ఎస్ హిందూ ఆధిపత్య భావజాలంతో పనిచేస్తోంది. అందువల్లనే వారు కశ్మీరును అణచివేస్తున్నారు. ఈ రహస్యం ముందే గుర్తెరిగిన మన ఖయిదే- ఆజం (గొప్ప నాయకుడు) జిన్నా, హిందూ ఆధిపత్యం కింద వుండవద్దనే ముస్లింల కోసం పాకిస్తాన్ సాధించాడు’- అని ఖాన్ అన్నాడు. ఈ వ్యాఖ్యలకు అక్కడి అధికారపక్ష సభ్యులకు సంతోషం కలిగి, కరతాళధ్వనులు చేశారు. అలాగే మన వారసత్వం ‘మదీనా’ నుండి ఉందని ఖాన్ అన్నాడు. మదీనాలో మన పాలకులు సర్వమత సమానత్వం పాటించారని ఇమ్రాన్ చెప్పుకొన్నాడు.

ఇందులోని ‘నాజీ’ నియంతృత్వం అనే పదం మాత్రం పట్టుకొని మోదీ, అమిత్ షాలను హిట్లర్‌తో పోలుస్తూ దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, వామపక్ష పత్రికలు, నాయకులు ఈ పది రోజులు విషం వెళ్లగక్కారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘నాజీ’లతో పోల్చడం సబబా? 60 లక్షలపైగా యూదు ప్రజలను కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపుల్లో చిత్రహింసలకు గురిచేసి చంపిన నాజీ ప్రభుత్వం ఎక్కడ? అహరహం దేశసేవ కోసం తపించే ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడ? దేశాన్ని తల్లిగా భావించి ఆరాధించే ఏకైక సంస్థ ఆరెస్సెస్. ఆ భారతమాత పరమ వైభవ స్థితి తెలియాలంటే ఒక్క సంవత్సరమైనా ఈ మేధావులు ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్లి చూడాలి. ఆ తర్వాత మాట్లాడాలి.

ఈ దేశంలో విచిత్రం ఏమిటంటే నూటికి నూరుమంది విమర్శించే వారిలో ఆర్‌ఎస్‌ఎస్ గురించి తలాతోకా తెలియకుండా మాట్లాడుతుంటారు. కమ్యూనిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి భయంకరమైన నిజాలతో పుస్తకాలు రాసిన వాళ్లు ఎందరో కన్పిస్తారు. ఆరెస్సెస్‌లోకి న్యూట్రల్‌గా వెళ్లి అందులో జరిగే కార్యకలాపాలను చూశాక మా ట్లాడితే అర్థముంది. సోకాల్డ్ మేధావులంతా యం. ఎస్.గోల్వాల్కర్ రచించిన ‘జాతీయ భావన’తో కూడిన విషయాలను కట్.. పేస్ట్ చేసి మతోన్మాదం ప్రచారం చేస్తారు. ఇమ్రాన్ ఖాన్ మొన్న మాట్లాడిన ఉపన్యాసం సహా చాలామందికి ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎవరు స్థాపించారో తెలియదు. ఈ దేశంలో పుబ్బలోపుట్టి మఖలో మునిగిపోయిన సంస్థలను ఎన్నింటినో చూస్తాం. 1925లో పుట్టిన ఆరెస్సెస్ మొదట్లో పదుల సంఖ్యలో సభ్యులున్న సంస్థ. కానీ ఈనాడు అది వటవృక్షం. 

అంతెందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్ని ముక్కలైంది? ప్రపంచ కార్మికులారా! ఏకం కండి! అంటూ అందరికీ పి లుపునిచ్చే కమ్యూనిస్టు పార్టీ ఎన్ని ముక్కలయ్యిందో ఇపు డు లెక్క కూడా పెట్టలేం. కాంగ్రెస్ పార్టీ ఆల్ఫాబెట్స్‌లోని అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రూపులైంది. మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌గా డాక్టర్ కేశవరాం బలిరాం హెడ్గేవార్ చేత స్థాపించబడి ఈనాడు దేశాన్ని ఏలే స్థాయికి ఎలా చేరింది? ఈ క్రమంలో ఎందరు తమ జీవితాలను దేశమాత కోసం అంకితం చేశారు? తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా నిరాడంబరంగా, త్యాగబుద్ధితో తమ పని తాము చేసుకుపోయే క్రమశిక్షణగల ప్రచారక్‌లు, కార్యకర్తలు లక్షలాదిగా కనిపిస్తారు. ఇలాంటి త్యాగబుద్ధిని ఎక్కడైనా చూపించగలరా? విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో మేధావులంటే ‘ప్రగతిశీల ఎర్రమెదళ్ళు’. వీళ్లెప్పుడూ ఆరెస్సెస్‌ను సమర్థించరు.

మరి ఈ ప్రగతిశీల మేధావులతో పొడగబడిన మార్టిన్ హెయిడెగ్గర్ నియంత హిట్లర్‌ను గొప్పగా పొగిడాడు కదా? భారతదేశంలో ఆరెస్సెస్ జాతిపరమైన వివక్షను ఎప్పుడు చూపింది? భారతీయత అనేది అన్ని మతాలకు వర్తించదా? ఆరాధనపరంగా మతం ఏదైనా అవలంబించవచ్చు. దేశాన్ని ప్రేమించమనడం, ఇక్కడి సంస్కృతిని గౌరవించాలనడం నాజీతత్వమా? ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలతో విదేశీ బుర్రలను ఉపయోగించి ఈ దేశం మెదడు నాశనం చేస్తే అది గొప్ప సిద్ధాంతం! అస్తిత్వాల పేరుతో దేశాన్ని ముక్కలు చేస్తే అది గొప్ప ప్రగతిశీలభావం! ఆరాధన ఏదైనా అందరూ భారతీయులనడం నేరమా? విదేశాలకు వెళ్లిన క్రైస్తవ ముస్లింలు ‘ఐ యామ్ ఏన్ ఇండియన్’ అంటూ చెప్పడం లేదా? దేశం మొదట అని చెప్పడం ‘నాజీ స్వభావం’ అనుకుంటే వాళ్లను ఎవరు బాగు చేస్తారు? చాలామంది నిరాధారంగా ‘సంఘ్’పై- ‘స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేద’ని నిందలు వేస్తుంటారు. 

1921లో రాజద్రోహం నేరం కింద డా.హడ్గేవార్ జైలుకు వెళ్ళాడు. అలాగే లోహరా అడవిలో యెట్మాల్ అడవిలో అడవి గడ్డి కోసి బ్రిటీషువారి ఆజ్ఞను ధిక్కరించి 1930లో డాక్టర్జీ జైలుకువెళ్ళాడు. ఈ చరిత్ర తెలియకుంటే తమకిష్టమైన ‘ఖిలాఫత్ ఉద్యమం’ గురించైనా చదివితే ఈ మేధావులకు అర్థం అవుతుంది. ‘సంఘ్’పై కులతత్వ ఆరోపణలు చేస్తూ తమ వికృతనాందాన్ని సంతృప్తి పరుస్తుంటారు. సంఘ్‌లో ‘జాత్ పాత్ నై పూచ్‌నా’ అనేది సిద్ధాంతం. చాలా ఏళ్ళు పనిచేసిన ఇద్దరు స్వయం సేవకుల కులాలు మచ్చుకైనా తెలియనివారు ఎందరో ఉన్నారు. 1934 మధ్యలో వార్థా నుండి శేగావ్ వెళ్ళే మార్గంలో ఆర్‌ఎస్‌ఎస్ శిబిరం నడుస్తుంటే పక్కనే బసచేసిన మహాత్మా గాంధీ మహదేవ్ భాయ్, మీరాబెన్‌లతో కలిసి వచ్చి శిబిరం చూసి, వారి క్రమశిక్షణ, కులం అడగకుండా కలిసి ఉండే విధానం చూసి ఆశ్చర్యపోయారు. 1939లో డా.బి.ఆర్.అంబేద్కర్ పూణే శిక్షావర్గకు అతిథిగా వెళ్ళాడు.

1939 ఏప్రిల్ 21న బాబాసాహెబ్ వెళ్లి కులంతో పనిలేకుండా వారు చేసే కార్యక్రమాలను చూసి అభినందించాడు. ఆయన రచనల్లో సంఘ్‌ను దూషించలేదు. కులతత్వం నిండా నింపుకొన్న సంస్థలు, పార్టీలు కుల నిర్మూలన గురించి కృషి చేస్తున్నామంటాయి.

1952లో గోసంరక్షణకు దాదాపుకోటి 75 లక్షల సంతకాల సేకరణ చేసినా, 1962లో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా సైన్యంతో కలిసి పనిచేసినా 1963 జనవరి 26న రిపబ్లిక్ పెరేడ్‌లో కవాతు చేసినా అవన్నీ దేశం కోసమే. 1965లో పాకిస్తాన్ దండయాత్ర సందర్భంగా నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ గురూజీతో స్వయంగా మాట్లాడి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించాడు. 22 రోజుల యుద్ధంలో దేశం కోసం సంఘ్ తన సేవల్ని అందించింది. 1977 నవంబర్‌లో తుఫాన్ భీభత్సంలో ఆర్‌ఎస్‌ఎస్ చేసిన సేవలు అందరూ ప్రశంసించారు. 1984లో ఇందిర హత్యానంతరం జరిగిన అల్లర్ల సందర్భంగా ఎందరో సిక్కులకు స్వయం సేవకులు ఆశ్రయం కల్పించారు. లక్షలాది సేవప్రకల్పాలతో నిరాడంబరంగా సేవ చేసే సంఘ్‌ను నాజీలతో పోల్చడం ఇమ్రాన్ ఖాన్‌కే చెల్లింది. ఈ దేశ నాయకులకు, మేధావులకు తగదు.

ఇమ్రాన్ చెప్పిన ఆయన వారసత్వ పూర్వీకుల చరిత్ర అంతా రక్తపు మరలే. గజనీ, ఘోరీ, తైమూర్లంగ్, నాదిర్షా, బాబర్, ఔరంగజేబు, ఖాసీం రజ్వీ, జిన్నా వీళ్లందరి లెక్క తేల్చాలంటే వారి వారి వంధిమాగధులు రచించిన ‘షానా మా’లను తరచి చూడాల్సిందే. అలాగే గొప్ప ఎర్రమేధావుల పూర్వీకులైన జోసెఫ్ స్టాలిన్, మావో సేటుంగ్, హోనెకర్, న్యూనెస్క్యూ, బ్రెజ్నెవ్, డెంగ్.. 

అంతెందుకు..? మావోయిస్టులు, కమ్యూనిస్టులు చంపిన వారి గణాంకాలు మన కళ్లముందున్నవే. ప్రజాస్వామ్యాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నామని చెప్పే కమ్యూనిస్టుల ఏలుబడిలో మరణించిన ఆనంద్ మార్గ్ కార్యకర్తల శవాల పుర్రెలు ఈరోజుకూ నాట్యం చేస్తున్నాయి. ఇప్పటికీ కేరళ నరమేధంలో నిత్యం ప్రాణాలు కోల్పోతున్న ఆరెస్సెస్ కార్యకర్తల చేతులు కాషాయం వైపు చూస్తున్నాయి. ‘తియానె్మన్ స్క్వేర్’లో నిరాయుధ విద్యార్థులను ట్యాంక్‌లతో తొక్కించి చంపిన చరిత్ర ఆరెస్సెస్‌కు లేదు. ఒకవేళ ఆరెస్సెస్ లేకుంటే ఈ దేశం ఏనాడో పది పాకిస్తాన్‌లయ్యేది. హెగెల్, ఫ్యూర్చాక్, మార్క్స్,ఫ్రాయిడ్, ఐన్‌స్టీన్, సార్త్రే, మార్సెల్, జాస్ఫర్స్ లాంటి ఆధునిక మేధావులు ఈ దేశంలో పుట్టకున్నా- శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దయానంద, అరవింద, బాబాసాహెబ్‌లను ఆదర్శంగా తీసుకుని ‘వృత్తపత్రమే నామ్ చపేగా ఛోడ్ ఛలో ఈ క్షుద్ర భావనా’- పేరు పత్రికల్లో పడుతుందని, ఈ క్షుద్ర భావన వదలిపెట్టాలని సాగుతున్న సంఘ్‌కు నాజీలతో పోలికా!?


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి