సాధారణంగా తెలుగువారి నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది కవి ‘సమ్మేళనాలు’ జరుగుతుంటాయి. అందులో భారతీయతను గౌరవిస్తూ వసంత ఋతువును వర్ణిస్తూ తెలుగుదనాన్ని వివరిస్తూ కవిత్వం చెప్తారని ఆశించి ప్రేక్షకులు పూర్వం వచ్చేవారు. గత ఇరవై ఏళ్లనుండి ఆ కవి సమ్మేళనాల్లో నకారాత్మక దృక్పథంతో కూడిన కవిత్వానికి ప్రాధాన్యత పెరిగింది. ‘‘వసంతం వాడిపోయింది. కోయిల ఎగిరిపోయింది. పచ్చడి పాడైపోయింది’’ అంటూ ఏడుపుగొట్టు రాగాలతో ఉగాదిని తిడుతున్నారు. ఇక కమ్యూనిస్టు దృక్పథం ఉన్న కవీశ్వరులంతా ఏ కవి సమ్మేళనంలోనైనా ‘మతోన్మాదం’పై అన్యాపదేశంగా కవిత్వం మొదలుపెడతారు. అదీ వాళ్ల ఎర్రకళ్లద్దాలకు తీవ్రంగా కన్పించే కాషాయ మతోన్మాదం అంటూ కవిత చదివి కాలర్ ఎగిరేస్తారు. 

మతోన్మాదం ఎవరిదైనా తప్పే అని వారి జన్మలో చెప్పరు. ఈ హర్యాలీ కవుల కవితా ఉన్మాదమంతా ఏకపక్షంగా సాగుతుంది. ఈ రకమైన భావవ్యాప్తి అస్తిత్వాల పేరుతో కమ్యూనిస్టు కవులు సాహిత్య రంగం నిండా నింపేసారు. దాంతో కవిత్వంలో ఒక రకమైన రసహీనత మొదలైంది. రసాన్ని చంపే ఈ విరసం, అరసం కవిత్వాన్ని ప్రజలనుండి దూరంచేసాయి. అందుకే సాహిత్య సభలు వెలవెలబోతున్నాయి. ఇక కవిసమ్మేళనాల్లో కవిత్వం చదివేవారు తప్ప వినేవారు లేకుండాపోయారు. కవిత్వానికి ఉన్న రసదృష్టి, భావుకత, ఆర్ద్రత, సున్నితత్వం, సందేశం నశించిపోయి పరనింద ఆత్మస్తుతికి పర్యాయ పదాలుగా మారిపోయాయి.

ఇటీవల 49 మంది ప్రముఖుల పేరుతో లేఖ రాస్తూ దేశంలో అసహనం అంటూ ఆగ్రహం వెళ్లగక్కినట్లే కవులూ, రచయితలూ రోజూ భారతీయతను, మోదీని తిట్టేందుకు తమ కలాల్లోకి క్రొత్త ఎర్ర సిరాను ఎక్కిస్తున్నారు.

‘‘అగర్ ఆప్‌కో హుకూమత్ దియాతో గుజరాత్ బనాతా హై / ముఝే హుకూమత్ దియేతో దిల్లీ బనాతా హూఁ / మై ఔరంగజేబ్ హూఁ’’ - ఇటీవల అవార్డు వాపస్ ఇచ్చిన ఓ అరాచక కవి తననుతాను ఔరంగజేబుగా అభివర్ణించుకొన్నాడు. మళ్లీ ఇటీవల 2019లో కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడగానే ‘అవార్డ్ వాపసీ గ్యాంగ్’ చైతన్యం అయిపోయింది. వాళ్ల లక్ష్యం సాహిత్యంద్వారా సమాజాన్ని చైతన్యం చేయడం కాదు. ‘సెలెక్టివ్’ ఘటనలకు కలం కదిలించి కవితా కాన్వాస్ మీద పరుస్తారు.

 వీళ్లంతా ఈ దేశ మూలాలను, జాతీయవాదాన్ని తిట్టేందుకు, దుమ్మెత్తిపోసేందుకు తమ అత్యాచార సాహిత్యాన్ని, కవిత్వాన్ని దేశంలో వ్యాప్తిచేస్తారు. నాస్తికుల్లా నటిస్తూ సంప్రదాయాలకు, ఇతిహాస పురాణాలకు, హిందూ దేవుళ్లను నిందిస్తారు. కళాకారులుగా మారిపోయి జాతీయ మహాపురుషులను నిందిస్తూ వారి వ్యక్తిగత చరిత్రను హననం చేస్తారు. చరిత్రకారులుగా అవతారమెత్తి భారతీయ చరిత్రను మార్చేస్తారు. అక్బర్, బాబర్‌ల గొప్పతనాన్ని అధ్యాయాలకు అధ్యాయాలు నింపేసి, ప్రతాపరుద్రునికి ఓ పేరా కేటాయిస్తారు. సాహిత్యవేత్తలుగా రూపాంతరం చెంది సాహితీ సరస్వతిని తమ అట్రాసిటీ లిటరేచరుతో నింపేస్తారు. అయితే ఈ దేశంలో మెజార్టీ మతానికి విమర్శను స్వీకరించే గుణం ఉందని వారు గుర్తించారు! చలం రాసిన రచనలు చదివి ఎందరో భ్రష్టులయ్యారు. నార్ల వెంకటేశ్వరరావు, రంగనాయకమ్మ రామాయణంపై విషం గక్కారు. ఇక లౌకికవాద ముసుగులోని హర్యాలీ కవులు పుట్టుమచ్చలు, కుష్ఠుమచ్చలు రాస్తూనే ఉన్నారు. ఎప్పటినుండో తెలుగునాట ఇది సాగుతూనే ఉంది.

‘‘నేను పుట్టకముందే / దేశద్రోహుల జాబితాలో / నమోదై వుంది నా పేరు’’ అంటూ ఖాదర్ లాంటివారు తెగ బాధపడతారు. కానీ దేశభక్తులుగా ఎందుకు ఉండలేక పోతున్నారో ఆలోచించరు.

‘‘వౌత్ ఔర్ జిందగీ హై దునియా కా ఏక్ తమాషా / ఫర్మాన్ కృష్ణకా థా అర్జున్ కో బీచ్ కారణ్‌మే’’ - ‘చావు, బ్రతుకూ అనేది లోకంలోని తమాషాలే. ఆజ్ఞ కృష్ణునిదైతే అర్జునుడు రణం మధ్యలో ఉంటాడు’ - ఇలాంటి కవిత్వం చెప్పింది ఎవరో కాదు. దేశంకోసం నిజాయితీగా ప్రాణాలర్పించిన అష్ఫాఖ్ ఉల్లాఖాన్ రచన. తన స్నేహితుల వెంట హిందూ దేవాలయాలను హిందూ ఆహార్యంతో వెళ్లి దర్శించే నిజమైన లౌకికవాది. కానీ హర్యాలీ కవులంతా హిందుత్వను తిట్టేందుకు నాస్తికుల్లా మారిపోతారు. వారి మతాచరణ చక్కగా చేసుకుంటారు. వీళ్లను నెత్తిన మోసే ‘ఎర్రన్న’లు ఇంట్లో పూజలు చేస్తారు. బయట హేతువాదుల్లా ఫోజులిస్తూ ఉంటారు. ఈ డెబ్బై ఏళ్లలో దేశమంతా ఇదే పరిస్థితి. 

తెలుగునాట జరుగుతున్న ఉదాహరణలు ఇవి. ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో ఓ చర్చ చూసాను. దాశరథి-సినారె జయంతి సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో ‘స్కైబాబా’ కవిత ‘హతుడి వాంగ్మూలం’ పేర తాను చదివినట్లు చెప్పుకొన్నారు. ఆ కవిత ప్రారంభం ఇలా ఉంది.

‘‘నెత్తిమీద అణకువ నేర్పే టోపీ / ముఖంపై కత్తిపెట్టని గడ్డం / నేనో తెల్లని పావురాయిలా కదులుతుంటాను / కాషాయ మూకకు కండ్లు కుడుతున్నాయి’’ అంటూ మొత్తం కాషాయానే్న బోనులో నిలబెట్టారు. ‘మేం ప్రత్యేకం’ అన్న కసాయితనం వదలకుండా కాశ్మీర్‌లో రాళ్ల దాడిచేస్తున్న వారిని ఇలాగే మత రంగు పెట్టి పిలుద్దామా? ఏకే ఆంటోని లాంటి నిఖార్సయిన సెక్యులరిస్టు ‘కాషాయం’ ఈ దేశ వారసత్వం అని చెప్పినా మార్పు రాదా? తిట్టేందుకు ఎంచుకున్న ప్రతీక తప్ప వాస్తవాలు హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో తిరిగితే తెలుస్తుంది. ఇంకో అడుగుముందుకేసి - ‘రామనామం నా చావుకు పర్యాయ పదం అయ్యింది’ అంటాడు. 

మరి ‘15 నిమిషాలు పోలీసులను ప్రక్కనపెడితే అందరినీ హలాల్ చేస్తా’ అన్న అమృత వాక్కులపై ఈ కలం కదిలిందా? ఎక్కడో జరిగే చిన్న సంఘటనలకు కాషాయం, రాముడి లాంటి పదాలు వాడాల్సివస్తే బూర్హాన్‌వనీ, జాకీర్ మూసా, జాకీర్ నాయక్ ఎవరు? వాళ్ల తీవ్రవాదాన్ని మత దృష్టితోనే చూద్దామా? ముక్తాయింపుగా - ‘నేను హత్యచేయబడ్డందుకో / నా హత్య గురించి స్పందించనందుకో / నాకు బాధనిపించలేదు / నా బాధంతా ఒక్కటే / కవి అన్నవాడైనా మనిషిగా మిగలాలి కదా’’ అన్నాడు. మరి కైరానాలో మెజార్టీ ప్రజలు ఎందుకు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లారు. వినయ్‌ప్రకాశ్, బిర్జుమాదిగ వంటి దళితుల హత్యకు కారణం? వాంగ్మూలం ఎవరిని అడగాలి? వరంగల్‌లో గుడిలో మైకు పెట్టినందుకు ఓర్చుకోకుండా పూజారి సత్యనారాయణ హత్యకు ఎవరు వాంగ్మూలం ఇస్తారు!? బ్రతికుండే చచ్చినట్లు ఊహించుకున్నవారు అందమైన పదాలతో నేరారోపణ చేయగలరు. మరి మరణించినవారు ఎవరికి చెప్పుకోవాలి? ఇదే పరిస్థితి దేశమంతా ఉంది.

అవకాశవాదులుగా మారిపోయి అవార్డులు పొందిన వాళ్లంతా ఇపుడు తిరిగి ఇస్తామంటారు. ముషాయిరాలో ముషరాఫ్‌ల్లా మాట్లాడుతున్నారు. నిజానికి అవార్డులువస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ అది వాపస్ ఇస్తే వార్తగా మారడం వాళ్ల లేకితనానికి నిదర్శనం. భావ స్వేచ్ఛ కావాలని అది ఈ దేశంలో కొరవడిందని 2015లోనే 40 మందికి పైగా రచయితలు, కవులు అవార్డులు వాపస్ ఇచ్చారు. కొందరు కేంద్ర సాహిత్య అకాడమీనుండి వైదొలగారు. కానీ తెలుగునాట ఈ గ్యాంగ్ నుండే ఎక్కువమంది అకాడమిని నడిపిస్తున్నారు. ఇప్పుడు తెలుగు కవులు, రచయితలు వివాదాస్పద పుస్తకాలు రాసే స్థితిలో లేరు. ఆ బాధ్యతను సామాజికవేత్తలకు అప్పజెప్పారు. 

వాళ్ల రచనలు ‘కులతత్వం’తో నిండిపోయి, సమాజంలో ‘అన్‌రెస్ట్’ను పుట్టిస్తున్నాయి. రాజకీయంగా కులాల మధ్యన ఉన్న సంఘర్షణను సాహిత్యంలోకి వొంపుతున్నారు. ఇపుడు కవులంతా వాట్సాప్‌ల్లో, ఫేస్బుక్కుల్లో తమ కవితలను పోస్ట్‌చేస్తూనే, సంఘటనలపై అభిప్రాయాలు చెప్తుంటారు. అందులో ఎక్కువగా ఈ దేశ మెజార్టీ ప్రజలను తిట్టేవే. ఆ తిట్లను అందమైన పదాలతో కవితలుగా అల్లుతారు. కలాలకు వచ్చిన ఈ పక్షవాత రోగం సాహిత్య రంగంలో డెబ్బై ఏళ్లనుండి ఉంది. ‘అందరూ సమానం’ అన్నది వాళ్ల డిఎన్‌ఏలో ఉండదు. ‘కొందరు మాత్రం ముఖ్యం’ అన్నది వాళ్ల కవిత్వ రస సిద్ధాంతం.

మరో గుంపు కులాల కంపును కలాలలో నింపి సమాజాన్ని కలుషితం చేస్తున్నది. ఇప్పటికీ కొన్ని కులాల్లో పేరుకుపోయిన అవకాశవాదాల్ని సమాజం మొత్తానికి రుద్దేసి ఆనందం పొందుతారు. ఈ బ్యాచే అవార్డులు ఇవ్వలేదంటారు, ఇస్తే వాపస్ చేస్తామంటారు. ఈ ద్వంద్వ వైఖరికి ఏం పేరుపెట్టాలో తెలియడం లేదు.

‘సముద్రం ఒకడి కాళ్లదగ్గర కూర్చొని మొరగదు / తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు / పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు / నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు / కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’ - అన్న మహాకవి మాటల్ని తాము ఆచరణలో చూపిస్తున్నట్లు నటించడం వాళ్ల స్వంతం అయితే అదృష్టం కొద్దీ కవిత్వం చదవడం ప్రజలు మానేసి చాలా రోజులు అయ్యింది. వాళ్ల చిత్రవిచిత్ర ప్రయోగాలు, కవితలకు, సంచికలకు పెట్టే పేర్లు ప్రజలను కవిత్వానికి దూరంచేసాయి. కానీ వాళ్ల వందిమాగధుల సైకోఫ్యాన్సీ ఎక్కువై పిచ్చి పీక్‌స్పీడ్‌కు వెళ్లింది. అందరిదీ క్రిడ్‌ప్రోకోనే. అస్తిత్వ పదాల పేరుతో అందరినీ రెచ్చగొట్టి సమాజానికే కవులను శత్రువులుగా మార్చిన దిగంబర, పైగంబర పైత్యమే. ఇటీవల కవిత్వంలో దబాయింపు, కులం కుళ్లు ఎక్కువైంది. 

ఏ కులంవాళ్లు ఆ కులంవాళ్లను హద్దులుమీరి ప్రేమించే మనస్తత్వం పెరిగింది. కేరళలో నారాయణగురు ఎజువ కులస్థుడు. ఆయన చేసిన సంస్కరణ దృష్టి ఇక్కడున్న గౌడులకు తెలియదు. సర్వయిపాపన్నకు ఇచ్చిన ప్రాధాన్యత నారాయణగురుకు ఇవ్వడం లేదు. అక్కడ ఎజువ, ఇక్కడ గౌడ ఒకే కులాలే. భారతదేశమే గర్వించదగిన గొప్ప వ్యక్తి నారాయణగురు. ఇలాగే చాకలి ఐలమ్మ, గాడ్గేబాబా ఇద్దరూ రజకులే. ఐలమ్మను తెలంగాణ ఉద్యమంలో పట్టుకున్నవారు.. గాడ్గేబాబాను గురించి ఏమీ తెలుసుకోరు. మన దేశంలోనే దళితులకోసం మొదటి సత్రం పండరీపురం కట్టించిన మహానుభావుడు సంత్ గాడ్గేబాబా. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గాడ్గేబాబాను గురు సమానులుగా చూసాడు. 

ప్రచ్ఛన్నంగా క్రైస్తవ్యం చెప్పే దళిత కవులను ఆరాధిస్తారు. కానీ మాదిగ కులంలో జన్మించి మహాయోగిగా మారిన తెలంగాణ తొలి దళిత కవి దున్న ఇద్దాసును పట్టించుకోరు. శ్రీశ్రీ, విశ్వనాథలను పరస్పర భిన్నధృవాలుగా చెప్పేవారుకూడా ఇద్దరూ ఒకే కులస్థులని అభిమానించడం మొదలుపెట్టారు. త్రిపురనేని రామస్వామిలో జస్టిస్ పార్టీ భావజాలం ఉన్నా, ఎన్టీఆర్ వివేకానందునిలా వేషంవేసినా ఇద్దరూ ఆ కులంవాళ్లకు ఆరాధ్యనీయులు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ చట్రంలో పడిపోయిన సాహిత్యలోకం ఇపుడు వాళ్ల అడుగుజాడల కోసం వెదుకుతూ కవిత్వపు ఛాయలను కాలదన్నింది. హద్దులుమీరిన మర్యాద, కేరీరిస్టు కాన్సర్ పేరుకుపోయి కవిత్వం పేరుతో ‘అకవిత్వం’ అంతా అట్రాసిటీ లిటరేచర్‌గా మారిపోయింది. కేంద్ర అకాడమి సెమినార్లను నిర్వహించే పెద్దలు, అందులో పాల్గొనే కవులూ, స్టార్ హోటళ్ల సదస్సులకు జులపాలతో, బుజురు గడ్డాలతో వెళ్లి సాహిత్య చైతన్యం కలిగిస్తుంటారు!?

బయట చాలామందిలో అకవిత్వం. సెమినార్లలో తానా, ఆటా సభల్లో భుజాలకు సంచులేసుకొని పుచ్చలపల్లి సుందరయ్యలా ఫోజులిచ్చే అవార్డు వాపసీ గ్యాంగ్‌లు కవిత్వంలోనే సున్నితత్వాన్ని చంపేసారు. కేవలం విదేశీ సిద్ధాంతాలను ఆధారం చేసుకొని అత్యాచార సాహిత్యం సృష్టిస్తూ సమాజ సమగ్రతను దెబ్బతీస్తున్నారు.
 
********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి