‘దేశం బతికున్నపుడు నీవు మరణిస్తే కలిగే నష్టం ఏమిటి? నీ దేశం సర్వనాశనమైపోతుంటే నీవు జీవించి ఉండి ప్రయోజనం ఏంటి?’- ఇలాం టి నినాదాలు స్వాతంత్య్ర సమరంలో ఉండేవి. నిజమే! డెబ్భై ఏళ్ళ నుండి దేశాన్ని నాశనం చేస్తున్న రాచపుండుకు మందు వేస్తుంటే- కొందరికి కడుపులో రగులుతున్న ‘రాజకీయ మంట’ను చూసి ఈ తరం నవ్వుకుంటున్నది. 370, 35ఏ ఆర్టికళ్ల రద్దు, కశ్మీర్‌ను విభజించడం- ఈ రెండూ సాహసోపేత నిర్ణయాలే. ఇన్నాళ్లకు ఇంతటి సాహసం చేసినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను పార్టీలకతీతంగా ఈ దేశం మొత్తం అభినందించింది. కానీ యథాలాపంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సూడో సెక్యులర్ పార్టీలు, మతతత్వ పార్టీలు ఆ ఆర్టికళ్లకు మద్దతుగా నిలబడడం ఆశ్చర్యకరం.

మొదటిరోజు రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పిన మాటలు ఆకస్మికం అనుకోవచ్చు. రెండవ రోజు రాహుల్ గాంధీ ట్వీట్స్ ఈ దేశ యువతను ఆలోచింపజేస్తున్నాయి. స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఈ దారుణ పరిస్థితి ఎందుకొచ్చిందనే ఆ ఆలోచన! రాహుల్ కుడి భుజమైన జ్యోతిరాద్యి సింధియా ప్రభుత్వానికి మద్దతిచ్చి ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ చీఫ్ విఫ్ భువనేశ్వర్ కలితా తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ వైఖరికి నిరసన తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జనార్దన్ ద్వివేదీ, దీపిందర్ సింగ్ హుడా, మిలింద్ దేవరా వంటి కాంగ్రెస్ అగ్ర నాయకులు తమ పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తృణమూల్ పార్టీలో కూడా లుకలుకలు పుట్టాయి. మోదీని తీవ్రంగా వ్యతిరేకించే బీయస్పీ వంటి పార్టీలు, ఎన్డీయేలో లేని టిఆర్‌ఎస్, బిజెడి, వైకాపా, అడగకున్నా మద్దతిచ్చిన టిడిపి వంటి పార్టీలకు ఎక్కడో దీని చురుకు తగిలి ఉండవచ్చు.

కానీ ఆజాంఖాన్ పెత్తనం ఉండే సమాజ్ వాద్ పార్టీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సల్మాన్ ఖుర్షీద్ నడిపే కాంగ్రెస్ పార్టీ, మైనారిటీల కోసమే బతికే కమ్యూనిస్టు పార్టీలు, రజాకార్ వారసత్వం పుణికిపుచ్చుకున్న మజ్లిస్ పార్టీ, జిన్నా పుట్టించిన ముస్లిం లీగ్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అన్నదే ప్రశ్న!

‘మెజారిటీతో కలిసిపోకుండా ఏ మైనారిటీకీ భవిష్యత్తు ఉండదు’ అని ప్రముఖ దళితకవి భోయి భీమన్న ఓ చోట చెప్తాడు. తమకు తాము మైనారిటీగా అభివర్ణించుకున్న ‘సంకుచిత భావం’ ఏదీ ప్రపంచంలో నిలబడలేదన్నది సత్యం. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ ప్రజలకు రాజకీయంగా అండ ఇస్తూ ‘తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా’ భావించుకునే స్థితి కల్పించింది. ఈ వ్యాధిని దేశమంతా వ్యాప్తి చేసింది. దానికి బౌద్ధికమైన మద్దతును వామపక్ష మేధోవర్గం కల్పించింది. ఈ ఏడుపుగొట్టు రాగాలు ఆలపించేవారే ఇపుడు టీవీ చానళ్లలో కూర్చొని అపశకునాల బ ల్లుల్లా అరుస్తున్నారు. వామపక్ష పార్టీల పత్రికల సంపాదకులు, అర్బన్ నక్సల్స్ విశే్లషకులుగా మారిపోయి కూనిరాగాలు తీస్తూ కీడు శంకిస్తున్నారు. 

దేశ బడ్జెట్‌లో అధికభాగం డెబ్భై ఏళ్ళనుండి కాశ్మీర్ కొరకు ఖర్చుపెడుతున్నా అక్కడ అభివృద్ధి లేదు. నిజానికి జమ్ము, లడఖ్, కాశ్మీర్‌లు కలిసి జమ్ము కాశ్మీర్ రాష్ట్రం. 42.241 చ.కిలోమీటర్లు, 1,22,67,013 జనాభా వున్న జమ్ముకాశ్మీర్, 59.196 కిలోమీటర్లు, 2,76,289 జనాభా వున్న లడఖ్-లే కలిపితే జమ్మూ కాశ్మీర్ అవుతుంది. మూడు ప్రాంతాల్లో హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధులున్నా ఈ నాయకులు, పార్టీలు, మేధావులు కేవలం కాశ్మీర్ లోయలోని ముస్లింల గురించే మాట్లాడుతారు!? ఏం మిగతావాళ్లు మనుషులు కారా? దేశమంతా ముస్లింలను మైనారిటీలుగా చెప్పేవాళ్ళు, జమ్మూ కాశ్మీర్‌లోని మైనారిటీలైన హిందూ , బౌద్ధులను గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మైనారిటీ కమిషన్ జమ్మూ కాశ్మీర్‌లో ఎందుకు ఏర్పడలేదు. దేశంలో జరిగే ప్రతి చిన్న ఘటనను అంతర్జాతీయ వేదికలపై మాబ్ లింబింగ్ చిత్రీకరించే మానవ హక్కుల సంఘాలు అక్కడి మైనారిటీ ప్రజలకు ఏనాడైనా మానవ హక్కులుంటాయని ఆలోచించిందా? కాశ్మీర్ అనగానే ఫరూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలను చూసి మురిసిపోయే సూడో సెక్యులర్ పార్టీలు మొన్న పార్లమెంటు సాక్షిగా తన వాణిని అద్భుతంగా వినిపించిన లడఖ్ ఎంపీ నమ్‌గ్యాల్ ప్రసంగం ఆవేదనను ఏనాడైనా తెలుసుకున్నారా?

జనరల్ జియా ఉల్ హక్ కాలం నుండి భారత్‌ను నేరుగా దెబ్బతీయలేమని మతతత్వాన్ని నూరిపోస్తూ జిహాదీలను భారత్‌కు పాక్ దిగుమతి చేసింది. 1948 అక్టోబర్ 26 తర్వాత పాకిస్తాన్ సాగించిన విధ్వంసం కాశ్మీర్‌లోని ‘కాశ్మీరియత్’ను ఆనాడే ధ్వంసం చేసింది. కశ్యపుడు, ఆదిశంకరుడు, కల్హణుడు, అమర్‌నాథ్, వైష్ణోదేవిలు బంధింపబడ్డారు. పాక్ సైన్యంతో కలిసిన తండాలు ప్రజలను ఊచకోత కోసారు. స్ర్తిలను మానభంగాలు చేసారు. ఈ భయంతో రాజా హరిసింగ్ భారత్‌ను ఆశ్రయించి, మన దేశంలో కశ్మీర్‌ను విలీనం చేశాడు. మన సైన్యాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేలోపు ఈ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చి, సైన్యం ముందరి కాళ్లకు బంధం వేసింది లార్డ్‌వౌంట్ బాటన్, జవహర్‌లాల్ నెహ్రూ!

పాకిస్తాన్‌ను మతతత్వ రాజ్యంగా మార్చిన జిన్నా మనస్తత్వమే ఇప్పటికీ భారత్‌లో చాలామంది మైనారిటీ నాయకుల్లో వుంది. వాళ్ల దృష్టిలో రజియా సుల్తానా, సర్ సయ్యద్, ఖ్వాజా మహమ్మద్ బిస్తీ, ఖ్వాజా మైనోద్దీన్ బిస్తీ, నిజాముద్దీన్ ఆలియా, వౌలానా అబుల్ కలాం ఆ జాద్, జలాలుద్దీన్ రుమీ, ఏ.పి.జె.అబ్దుల్ కలాం గొప్పవాళ్లుకారు. వాళ్లకు జిన్నానే ఆదర్శం. అందుకే ఎప్పుడూ ప్రత్యేకత కోరుకుంటారు. ఈ దేశ కమ్యూనిస్టులు ఇందుకు మద్దతుగా నిలిచారు. దేశ విభజన మొదలుకొని మొన్న జరిగిన కాశ్మీర్ విభజన వరకూ అదే తంతు! 370 ఆర్టికల్ రద్దుకోసం, రెండు రాజ్యాంగాల నిషేధం కోసం కశ్మీర్‌లోకి ప్రవేశించి, అబ్దుల్లా ప్రభుత్వ కుట్రకు బలైన జనసంఘ్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ చావుకు వాళ్లు ఏనాడూ కన్నీరు కార్చరు! శాంతి భద్రతల దృష్ట్యా బలగాలను కాశ్మీర్‌కు పంపిస్తే అది నిర్బంధం అనీ, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీలను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని గగ్గోలు పెడతారు! జమ్మూలోని రఘునాథ ఆలయంపైన, శివాలయంపై దాడి జరిగినపుడు, అక్షరధామ్, పార్లమెంట్, ముంబై హోటళ్లపై, దిల్లీలోని ఎర్రకోటపై దాడి జరిగితే ఒక్కరు బాధపడలేదు? సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఏనాడైనా కాశ్మీరీ పండిట్ల ఆర్తనాదాలు విన్నాడా?

ఇంకొందరు మేధావులు మోదీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏదో జరుగుతుందని బెదిరిస్తున్నారు. ఏం! ఇపుడు ఏమీ జరగట్లేదా? తీవ్రవాదులు దాడులు చేయడం లేదా? కాశ్మీర్‌లో ఐసిస్ జెండాలు ఎందుకు ఎగురుతున్నాయి? దీనికంతా గత కేంద్ర ప్రభుత్వాల దమననీతి కారణమని అంటాడో వామపక్ష మేధావి. మరి ఆ ప్రభుత్వాల పల్లకీని మోసింది వామపక్షాలు కాదా? ఇపుడు కాశ్మీర్‌ల మనస్సు గెలుచుకోవాలి అంటాడు ఏకపక్ష శుక్రాచార్యుడు. దేశంలో అంతకన్నా ప్రాచీన సంస్కృతి ఉన్న తమిళుల మనసు గెలుచుకోమని ఎవరైనా చెప్తారా? ఒకవేళ ప్రాచీనంగా కశ్మీరీలకు సంస్కృతి ఉన్నట్లయితే దాని మూలాలు ఎక్కడున్నాయి? పాకిస్తాన్‌ను ఏర్పాటుచేసి ఖాయిదే-ఆజాం అయిన మహమ్మదాలీ జిన్నా ముత్తాత పూంజ హిందూమతం వాడే. అల్లామా ఇక్బాల్ ముత్తాత ‘సప్రు’ హిందువే. 

పాక్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ భార్య ఇర్నేపంత్ ఉత్తరప్రదేశ్ హిందూ సంతతి కాదా? జుల్ఫీకర్ అలీ భుట్టో పూర్వీకులు రాజపుత్రులు, షేక్ అబ్దుల్లా పూర్వీకులు ఎవరు? అలాంటపుడు కాశ్మీర్‌లో ఇంకెక్కడి పూర్వ సంస్కృతి ఉంది? కాశ్మీరియత్ అంటే సరస్సులు, కొండలు, నదులు, ముగ్ధ మనోహర దృశ్యాలు మాత్రమే కాదు కదా? అవి ఇపుడు ఎవరు లాక్కుంటున్నారు? కాశ్మీరీయత్‌లో వైష్ణోదేవికి, ఆదిశంకరాచార్య కొండకు, హజ్రత్ బాల్‌కు ఎందుకు ప్రాధాన్యత లేదు? పాకిస్తాన్‌లో అహ్మదీయులను ముస్లింలుగా భావించకుండా జియాహుల్ హక్ ఊచకోత కోయించాడు. అహ్మదీయుల ఖలీఫా మిర్జాతాహిర్‌ను 1984లో పాక్‌నుండి వెళ్లగొట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్షలాదిమంది ఊచకోత కోశారు అని బంగ్లా మానవ హక్కుల కార్యకర్త జహనారా ఇమామ్ అంచనా వేశారు. తొంభయ్యవ దశకంలో జరిగిన కాశ్మీర్ పండిట్ల దారుణ హత్యలు ‘కాశ్మీరియత్’ను ఏనాడో ధ్వంసం చేశాయి. ఇక్కడ మతాధిపత్య పోరాటమే తప్ప కాశ్మీరియత్ ఒక తొడుగు మాత్రమే. చరిత్రలో జరిగిన తప్పులు సరిచేయకపోతే భవిష్యత్తులో వైగో చెప్పినట్లు సూడాన్, కోసావాలా అవుతాయో లేదో తెలియదు కానీ సిరియా, ఇరాన్‌లా కావడం ఖాయం.

1947లో గవర్నర్ జనరల్ అయిన మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజన జరిగిన పదమూడు నెలలకే ప్రాణాంతక వ్యాధితో మరణించాడు. ఆ తర్వాత వచ్చిన లియాఖత్ అలీఖాన్ మొదలుకొని నవాజ్ షరీఫ్ వరకు పాక్ అధినేతలంతా గొప్పగా పదవులనుండి దిగిన పాపాన పోలేదు. అవమానం.. రాజ్య బహిష్కరణ, జైళ్లలో బంధింపబడడం.. దిక్కులేని కుక్కచావు- ఇవే వాళ్లకు దక్కిన పాప ఫలితాలు. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు అక్కడి పాలకులంతా తమ వైఫల్యాలను కాశ్మీర్ చుట్టూ తిప్పారు. దీని ట్రాప్‌లో మనదగ్గరి కాశ్మీరీ నేతలు పడి, మిగతా దేశాన్ని పడేశారు.

ఇప్పటికైనా భారత హిందూ, ముస్లింలు సమస్యను అర్థం చేసుకొని ఈ దేశ కుహనా సెక్యులరిస్టుల ఉచ్చులో పడకుండా మాజీ ఎంపీ, ప్రముఖ ఇస్లామిక్ మేధావి ఆరీఫ్ మహమ్మద్‌ఖాన్ వంటివారిలాగా జాతీయ దృక్కోణంతో ఆలోచించాలి. సాంకేతిక కారణాలను చూపి ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను విస్మరించాయి. గతంలో షేక్ అబ్దుల్లాను నిర్బంధించినపుడు ఎవరిని అడిగి నిర్బంధించారు? అపుడు ఇంటింటా అభిప్రాయ సేకరణ చేసారా? ఒక మేధావి మనకు అంతర్జాతీయ పరిస్థితులు బాగాలేవంటాడు. ఇరాన్ అప్ఘన్‌లను అమెరికా పాక్ సహాయంతో మద్దతిస్తుంది కాబట్టి మనకు ఇబ్బందవుందంటాడు. గత యుద్ధాల్లో అమెరికా మనకు ఎప్పుడైనా మద్దతు ఇచ్చిందా? ఆప్ఘన్, సిరియా, ఇరాన్, ఇరాక్‌లలో సంక్షోభాలు ఉన్నపుడు మన దేశంలోకి తీవ్రవాదులు చొరబడలేదా? ఇవన్నీ తర్కంలేని వాదనలని వారికి కూడా తెలుసు. మోదీ చేసే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యితిరేకించే మనస్తత్వాన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి దేశం నాశనం అయిపోతుంటే మనం బతికుండి ప్రయోజనం ఏమిటి? అన్నదే ఇవాళ్టి ప్రశ్న. అందుకే ఈ ఉద్విగ్నత అన్ని వర్గాల మనసుల్ని కాశ్మీర్‌లోని హిమవన్నగమంత ఎత్తులో నిలిపింది.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి