తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ విధ్వంసాన్ని తేలిగ్గా తనకు అనుకూలంగా మలచుకోగల నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. విచిత్రమో, విధి నిర్ణయమో చెప్పలేం గాని ప్రతీ విధ్వంసం తర్వాత లాభపడేది ఆయనే. కుప్పకూలిన కోటగోడల్లో శిథిలాల మధ్య కూర్చొని ఏడ్చేవాళ్లు ఏడుస్తుంటే దానినుండి ‘పసుపుపచ్చని’ మొక్కలను పుట్టించడం ఆయన ఘనత. అప్పట్లో ఎన్టీఆర్ ఇంకో ఆరునెలలు బతికుంటే ఏం జరిగేదో ఊహంచలేం. కానీ ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన కుటుంబీకుల కన్నా ఎక్కువ లాభపడింది మాత్రం ‘నారా’ వారే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెంటనే ఆంధ్రాలో వాలిపోయి ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే వేడిని పుట్టించి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసి, ఇంకెప్పుడూ కోలుకోకుండా చేసి పీఠం ఎక్కిన సమర్ధుడు చంద్రబాబు. ఆయన 2014లో ఏపీలో కాంగ్రెస్‌ను అధఃపాతాళానికి తొక్కేసి, 2018లో తెలంగాణ కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాడు. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ‘ఉత్తర కుమారులు’ ఇకనైనా గ్రహిస్తారో లేదో తెలియదు!


ఇక, కొంగర కలాన్ సభ తర్వాత తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్ల కొంత వ్యతిరేకత ఉందన్నది అక్షరాలా సత్యం. రాహుల్ గాంధీతో సరూర్‌నగర్‌లో సభ పెట్టించి తెలంగాణలో ‘కాక’ పుట్టించిందీ నిజం. పొత్తుల పేరుతో టీడిపితో కూటమి ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌కు ‘రాజశ్యామలయాగ’ ఫలితం అందివచ్చింది. అప్పటివరకు కేసీఆర్‌కు కాంగ్రెస్‌లోని ఛోటామోటా నాయకులను ఎలా టార్గెట్ చేయాలో అర్థం కాని సంకట స్థితి. ఎప్పుడైతే బాబు వస్తున్నాడని కేసీఆర్ తెలుసుకొన్నాడో- తెలివిగా వనపర్తి సభలో ‘‘అడుక్కుంటే మేం నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లం గదా, చంద్రబాబు ద్రోహి’’లాంటి పదాలు వాడి జనాన్ని రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ‘రాజశ్యామల యాగం’చేసి బయటకి వచ్చాక తిట్లన్నీ మానేసి, తెలంగాణ ప్రజల ఉద్వేగాన్ని మెల్లమెల్లగా కదిలించాడు. యాగం తర్వాత ఖమ్మం సభలో కేసీఆర్ తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇచ్చిన 30 లేఖలను ప్రజలకు చూపించడంతో కథ తిరగబడింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తిట్లులేకుండా తననుతాను సజ్జనుడిగా, అమాయకుడిగా, తెలంగాణ లెజెండ్‌గా, తెలంగాణ రక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకొన్నాడు. ప్రజల యాసలో తన పథకాల గొప్పతనం గురించి చెప్పుకొంటూ, సరైన వ్యూహాన్ని కేసీఆర్ అవలంబించాడు.



మరోవైపు చంద్రబాబు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను కలిసాక, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ద్వారపాలకులయ్యారు. నేరుగా అశోక్ గెహ్లాట్ లాంటి సీనియర్ నేత చంద్రబాబును అమరావతిలో కలిసి తెలంగాణ ఎన్నికలపై చర్చిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కక్కలేక మింగలేక బిక్కమొఖం వేసారు.
మొదట్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ‘రాను’ అన్న చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలన్నీ చక్కబెట్టేట్లుగా పోజులిచ్చాడు. దాంతో కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఇదొక మంచి పరిణామంలా కన్పించి ఇక్కడి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడకుండా బాబుతోనే వ్యూహరచన చేయడం మొదలుపెట్టారు. ఒక సామాజికవర్గం ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లిలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని ఎన్నికల్లో దించి అక్కడి కులాల మధ్య విభజన వచ్చేట్లుగా బాబు ప్రయత్నించాడు. ఇనే్నళ్ల తెలంగాణ ఉద్యమంలో గానీ, తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక గానీ ఏరోజు ఆంధ్రా ప్రాంత ప్రజలపై దాడులు జరుగలేదు. అలాంటిది హైద్రాబాద్ నగరంలో ఆంధ్రా ప్రాంతం వారు నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించడం, విస్తృతంగా ప్రచారం చేయడంతో మిగతా తెలంగాణ ప్రాంతంలో అలజడి మొదలయ్యింది. ‘మేం తలచుకుంటే ఆంధ్ర వలసవాదుల వోట్లు మీకు పడకుండా చేస్తాం..’ అని నాలుగైదు నెలల క్రితం తెదేపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్న మాటలను చంద్రబాబు నిజం చేస్తాడా? అనే ఆందోళన తెలంగాణ జనంలో మొదలైంది. దాదాపు 17 సీట్లల్లో ఇలాంటి ‘విభజన వాదం’ పనిచేస్తే, మిగతా తెలంగాణలోని సీట్లలో తెరాసకు సీట్లు తగ్గితే ఎలా? అని తెలంగాణ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆఖరుకు తెరాస ప్రభుత్వంపై కోపంగా ఉన్న ఉద్యోగులు కూడా తెరాసను గెలిపించకపోతే తమ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉందని ఆలోచించారు. కాబట్టే పోస్టల్ బ్యాలెట్లు సింహభాగం తెరాసకే దక్కాయి.



చంద్రబాబు ప్రచారం ప్రారంభించాక- తెదేపా ముఖ్య కార్యకర్తలు డబ్బు సంచులతో పట్టుబడడం, ఆంధ్రా ఇంటెలిజెన్స్ పోలీసులు తెలంగాణలో పోలీసులకు చిక్కడం ఇక్కడి ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. చంద్రబాబు, ఆయన మంత్రులు డబ్బు, కులం, ప్రాంత విభజన వంటి అంశాలతో తెలంగాణను ముంచుతున్నారని కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది. కాంగ్రెస్ పెద్దలకు ‘ఏపీలో పొత్తు ఉండద’ని తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేసినా చెవికెక్కలేదు. కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం తెలంగాణ ప్రాంతం చంద్రబాబు గుప్పిట్లోకి పోతుందన్న సంకేతం వెళ్లింది. రాహుల్ గాంధీని సభలో కూర్చోబెట్టి ఫ్లెక్సీలో రాజీవ్, ఎన్టీఆర్ ఫొటోలుపెట్టి చంద్రబాబు హైద్రాబాద్‌ను తానే సృష్టించానని చెప్తుంటే ఆసక్తిగావిన్న రాహుల్ అమాయకపు చూపులు కాంగ్రెస్ బేలతనాన్ని బయటపెట్టాయి. తెలంగాణకు చెం దిన పి.వి.నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, టి.అంజ య్య లాంటి నాయకుల ఫొటోలు కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో మచ్చుకైనా లేవు. కమ్మ, కాపు, రాయలసీమ రెడ్డి వర్గాల అంతర్గత పోరు గ్రేటర్ హైదరాబాద్‌లో తెలుగుదేశానికి చెక్ పెట్టింది.



కేసీఆర్‌పై చంద్రబాబు చేసిన విమర్శలు ‘అరిగిపోయిన రికార్డుల’ మాదిరి ప్రజలకు వినిపించాయి. దీనికితోడు ఇక్కడి ప్రధాన స్రవంతి మీడియా అంతా ఒక్కసారిగా చంద్రబాబును ఆకాశానికెత్తడం కోసం ‘తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్’ మధ్యనుండాల్సిన ఎన్నికలను ‘కేసీఆర్ వర్సెస్ ఆంధ్రా పెత్తనం, బాబు వ్యూహం’ అన్నట్లుగా చేసిన అతి ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ స్వయంకృతాపరాధం. దీనికితోడు అకారణంగా ప్రధాని మోదీపై పదే పదే ద్వేషం ప్రదర్శిస్తున్న బాబు కాంగ్రెస్‌తో కలిసి భాజపాను నాశనం చేస్తానన్న ప్రకటనలు కూడా అతిగా మారాయి. దీంతో భాజపాలోని కింది స్థాయి కార్యకర్తలు కేసీఆర్ గెలిచినా సరే కానీ- బాబుతో జతకట్టిన కాంగ్రెస్‌ను ఓడించాలని కారుకు ఓటేసారు. అన్ని పార్టీల సభలకు జనం వచ్చినా అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, రైతులు, పింఛన్‌దారులు మూకుమ్మడిగా కేసీఆర్ వైపు మొగ్గుజూపడానికి కారణం చంద్రబాబు సారధ్యంలో నడిచే కాంగ్రెస్ వస్తే సంక్షేమ పథకాలన్నీ పోతాయేమో అని భయపడడం. ఇక్కడి ఉద్యోగవర్గాల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ వైపు మళ్లింది. లేకపోతే కాంగ్రెస్‌లోని మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్ప అందరు సిట్టింగులు, హేమాహేమీలు ఓడిపోవటం ఏమిటి? తెరాస అభ్యర్థుల్లో దాదాపు 35 మంది పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ- ప్రజలు కేసీఆర్‌నే చూసారు కానీ అభ్యర్థుల గురించి ఆలోచించలేదు. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ అభ్యర్థులంతా తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుకు మద్దతిస్తున్నట్లు భావించారు. నిశ్శబ్ద విప్లవంలా కాంగ్రెస్‌కు ఓటేద్దామనుకొన్న వారు సైతం- కాంగ్రెస్‌ను బాబు చేతుల్లోపెట్టి ఆ పార్టీ నేతలు దిక్కులు చూడడం జీర్ణించుకోలేకపోయారు.



ఇక గద్దర్ లాంటి వ్యక్తి ఇనే్నళ్లు ఎందరో అమరుల సమాధుల దగ్గర లాల్ సలాం చెప్పి చంద్రబాబును కౌగిలించుకోవడం ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేదు. సాత్వికుడిగా పేరున్న ఆచార్య కోదండరాంపై వ్యక్తిగతంగా ఈరోజుకూ గౌరవం ఉన్నా చంద్రబాబు ప్రక్కన కూర్చొని చేతులూపడం ఇక్కడి విజ్ఞులను ఆలోచనల్లో పడేసాయి. మోదీని గద్దెదించుతాం అన్న సీపీఐ నేతలు ఒక్కసారిగా చంద్రబాబును ఇంద్రుడని పొగుడుతుంటే ఇదంతా కేసీఆర్‌పై యుద్ధమే కదా..! అని ఇక్కడి ప్రజలు భావించారు. ఇలా అందివచ్చిన అవకాశాన్ని వదులుకొన్న కాంగ్రెస్‌కు చంద్రబాబు శాపంగా మారగా, కేసీఆర్‌కు వరంగా మారిపోయాడు. ‘కర్ణుడి చావుకు కారణాలెన్నో’ అని భారతం చెబితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి చంద్రబాబే కారణం అన్నది సుస్పష్టం. త్వరలోనే వీహెచ్ లాంటివారు దీన్ని కుండబద్దలు కొడతారు కూడా! అభివృద్ధి- వెనుకుబాటుతనం అనే అంశాలపై జరగాల్సిన చర్చ ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగంగా మార్చిన అదృశ్యశక్తుల పట్ల కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల తగిన ఫలితాన్ని అనుభవించింది. మూడు రాష్ట్రాల్లో గెలిచిన ఆనందం కన్నా తెలంగాణలో దారుణ పరాభవం కాంగ్రెస్‌కు చేదు జ్ఞాపకమే.


***************************************
✍✍-డాక్టర్. పి. భాస్కర యోగి 
భాస్కరవాణి : ఆంధ్రభూమి 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి