మనిషి హృదయంతో చేసే ఆరాధన ప్రేమ. బాహ్యచేష్టలన్నీ కర్మారాధనగా చేస్తాం. హృదయంతో ప్రేమించడమే ధ్యానం, ప్రార్థన, యోగం. సగుణారాధనలో మన భక్తి అంతా కర్మకాండలా కనిపిస్తుంది. కానీ నిర్గుణారాధన తత్వం అందులో ఇమిడి ఉంది. షోడశోపచార పూజలో కూడా ధ్యానం ఉంటుంది. ఇదంతా భక్తితత్వం అర్థమయినప్పుడు మాత్రమే సాధ్యం. దురదృష్టం ఏమిటంటే.. వస్తు ప్రేమకు అలవాటు పడిన మనుషులు అంతఃకరణాన్ని గుర్తించలేకపోతున్నారు. అందువల్ల వస్తువులతో చేసే అన్ని బాహ్యాడంబరాలకూ ప్రాధాన్యం ఇస్తుంటారు.
అదే మేలిరకం అనుకొని అందులోనే మునిగి అంతర్తత్వాన్ని విస్మరిస్తారు. నిజానికి భగవంతుడు ఆనంద స్వరూపుడు. ప్రేమస్వరూపుడు. కానీ చలనచిత్రాలు చూసీచూసీ స్త్రీ, పురుషుల మధ్య ఉండేదే ప్రేమ అనే భావన చాలామందిలో స్థిరపడిపోతుంది. కానీ ప్రేమకు ఎన్నో రూపాలుంటాయి. పేర్లు ఉంటాయి. స్త్రీ, పురుషుల పరస్పర ప్రేమ మోహం. ధనం, ఆస్తులపై ఉండే ప్రేమ లోభం. పుత్రపౌత్రాదులపై ఉండే ప్రేమ వాత్సల్యం. దేహంపై ఉండే ప్రేమ అభిమానం. దీనప్రాణులపై ఉండే ప్రేమ దయ. వస్తువులపై ప్రేమ మమకారం. మన సమానులపై ఉండే ప్రేమ మైత్రి, స్నేహం. సత్పురుషులపై ఉండే ప్రేమ సత్సంగం. పెద్దలపై ఉండే ప్రేమ గౌరవం. భగవంతునిపైనా గురువుపైనా ఉండే ప్రేమ భక్తి. ఇలా మన మహర్షులు ప్రేమను రకరకాలుగా వర్గీకరించారు. అందుకే నారదుడు ‘స్వాతస్మిన్‌ పరమ ప్రేమ రూపా’ అన్నాడు.
ఆ పరమేశ్వరునిపై సంపూర్ణ ప్రేమ భక్తి అని స్పష్టం చేశాడు. ఆ ప్రేమనే సగుణతత్వంలో ఆరాధనగా, నిర్గుణభావంలో ధ్యానంగా మారుతుంది. ఈ రెండింటి మధ్య సూక్ష్మత తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవనంలోని ప్రథమపాఠం. దీన్ని గ్రహించలేని వ్యక్తులు శిక్షణార్థుల్లా మెల్లమెల్లగా సాకారతత్వం నుంచి నిరాకార తత్వం వైపు వెళ్లాలని పెద్దలు ప్రబోధించారు. హృదయం నిండా ప్రేమతత్వం ఉన్నప్పుడు సృష్టిలోని విషయమంతా ప్రేమమయంగా గోచరిస్తుంది. దృష్టిలో భేదం ఉంటుందిగానీ సృష్టిలో భేదం లేదని స్పష్టమవుతుంది. దానిని సాధించే సాధన హృదయాంతర్గమైన పరమాత్మ స్వరూపమే. ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి మనమూ ఆనందమయులమై హృదయం నిండా ప్రేమను నింపుకొని ఆ పరమాత్మతో ఏకత్వం పొందాలి. నువ్వుల్లో నూనెలాగా, పాలల్లో నెయ్యిలాగా, పుష్పాల్లో సుగంధం లాగా, ఫలంలో రసంలాగా, కట్టెలో అగ్నిలాగా.. మనలో దాగి ఉన్న ఆత్మరూపంలోని ప్రేమే పరమాత్మతో ఏకత్వం సాధిస్తుంది. అలాంటి ప్రేమతత్వ సాధనే ఆధ్యాత్మికతకు, భక్తికి పరిపూర్ణత.

********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి