కొక్కొరో ... క్కో ...
కాకిపిల్ల కాకికి ముద్దు….!

రాజకీయ నాయకులు తమ వారసులను కాస్త కలర్‌ ఇచ్చి జనాలపై రుద్దేస్తున్నారు. ఈ వారసత్వ రాజకీయాలకు మూలమైన గాంధీ నెహ్రూ కుటుంబాల సంగతి వేరే చెప్పనక్కరలేదు. ఇప్పటికీ దేశంలో కాకలు తీరిన రాజకీయ నాయకులు ఎందరో కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ రాహుల్‌ గాంధీని చూస్తే వారికి ఎనలేని భక్తి ప్రపత్తులు గుర్తుకొస్తాయి. నిజానికి ప్రణబ్‌ ముఖర్జీ లాంటి రాజకీయవేత్త దగ్గర లేని లక్షణం ఏమిటి? రాహుల్‌ గాంధీ దగ్గరున్న ఐస్కాంత క్షేత్రం ఏమిటి? నిజానికి మనం ఇలాంటి రాజకీయ క్రీడలకు అలవాటుపడ్డాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొన్ని కుటుంబాలు లేకుంటే మనం బ్రతకలేము అన్న దుస్థితికి దిగజారిపోయాం. దీనికే ప్రజాస్వామ్యం అనే ముసుగు తొడిగి అందంగా అట్ట వేసి లోకానికి చూపిస్తున్నాము. ఇదే వరస ఇటీవల కాలంలో సినిమా లోకంలో కూడా పరివ్యాప్తం అయింది. దర్శకులు నిర్మాతలు ఎంతో డబ్బు పెట్టి నిర్మించే సినిమాలు మా సంతానం తోటి నిర్మించుకుంటే బాగుంటుందని తలంచి వాళ్ల కొడుకులు ఎంత బాగా లేకున్నా హీరోలను చేసేస్తు న్నారు. విచిత్రమేమిటంటే కూతుర్లని హీరోయిన్లు చేయడం లేదు. ఇక్కడ స్త్రీవాదం తలకిందులైంది.!? వీలైతే వాళ్లను రాజకీయ నాయకురాళ్లుగా మారుస్తున్నారు. ఈ జాడ్యం వ్యాపార రంగంలోకి చేరింది. అసలు వ్యాపారం మొత్తం చూసే వ్యక్తులు వేరే ఉంటారు కానీ వ్యాపారానికి అధినేత్రిగానో అధినేతగానో వారి సంతానం ఉంటుంది. ఇదంతా వారసత్వ జబ్బు.
తండ్రులు రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యే లోపల తమ కొడుకులను పీఠాలపై కెక్కించి హాయిగా కన్నుమూస్తున్నారు. లేకపోతే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. జవహర్లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఇలా తెరపైకి వచ్చిన వారే. వారి మార్గాన్ని అనుసరించి దేశం నిండా కుటుంబ రాబందులు వాలిపోయాయి. ఇప్పుడు వారి కుటుంబాల వేర్లు బ్రిటీష్‌ వాళ్లపై చేసిన పోరాటం కన్నా ఎక్కువయి, పీకి పారేయలేనంత లోతులో ఉన్నాయి. రాష్ట్రానికి ఓ కుటుంబం లేదా రెండు కుటుంబాలు ఆధునిక రాజకుటుంబాలుగా మారిపోయి వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ఏమైనా అంటే మా కుటుంబాలు త్యాగం చేశారు అంటారు. రాజ్యాంగమా నీకు ఇంత దుస్థితి వాటిల్లింది కద!?
తెలుగునాట చంద్రబాబు కెసిఆర్‌ ఇద్దరూ ఇప్పుడు వారసత్వ రాజకీయాలకు ప్రతినిధులుగా ఉన్నారు. నిజానికి ఎన్టీఆర్‌ పార్టీ వారసత్వాన్ని అమాంతం మింగేసి చంద్రబాబు గద్దెనెక్కాడు. కేసీఆర్‌ సొంత ప్రతిభ మీదే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు వారసత్వాన్ని తెలంగాణ ప్రజలకు అందిస్తున్నాడు. అయితే రాజకీయం కూడా వ్యాపారం లాగా నిలదొక్కుకున్న వాళ్లకు మాత్రమే సహాయ పడుతుంది. కేటీఆర్‌, కవిత, హరీష్‌, సంతోష్‌ అలా
నిలదొక్కు కుంటారేమో వేచిచూడాలి. మరోవైపు ఆంధ్రాలో జగన్‌ ఈ వారసత్వ
రాజకీయ వక్షానికి పుట్టిన ఫలమే. ఇక చంద్రబాబు తన 40 ఏళ్ల ఇండస్ట్రీ పరిజ్ఞానం ఉపయోగించి సొంత దర్శ కత్వంలో లోకేష్‌ అనే మహారాజకీయ నాయకుని ఆంధ్రప్రదేశ్‌ మీద వదిలాడు. ఈయన తెలుగు కన్నా ఇంగ్లీష్‌ బాగా మాట్లాడుతాడు. !? ఎందు కంటే తెలుగువారి ఆత్మగౌరవానికి లోకేష్‌ ప్రతీక. కోట్లాదిమంది తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా తనను తాను చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి ఇంగ్లీష్‌ తెలుగు బ్రాండును మనకందించి నందుకు ఎంతో ధన్యులం. ఇదే కోవలో హరికష్ణ కూతురుగా ఇటీవల కొత్త వారసత్వ నాయకురాలు రాజకీయ రంగప్రవేశం చేసి ఏకంగా కూకట్‌పల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడింది. ఈమె గెలవవచ్చు, మంత్రి కూడా కావచ్చు. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం, ప్రాంతం అన్నీ చూసి చంద్రబాబు ఆమెను రాజకీయాల్లోకి దింపాడు. ఇందులో విచిత్రమేమి టంటే ఆమె నందమూరి ఇంటి నుంచి చుండ్రు వారి ఇంటికి కోడలిగా వెళ్ళింది. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా ఆమెను నందమూరి సుహాసినిగా పేర్కొనడంలో ఆంతర్యమేమిటో తెలుసుకోవాలంటే కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత అంతరార్థం తెలియాల్సిందే !
వింత కాక మరేమిటి ?
మొన్నీ మధ్య కాంగ్రెస్‌వాళ్లు కంగారు పడకుండా చేసిన మొదటి సభ మేడ్చల్‌లో జరిగింది. దాంట్లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌’గా 14 ఎన్నికలలో తన సొంత పార్టీని ఓడించుకున్న రాహుల్‌గాంధీ నిలవడం విచిత్రం. ఇక హనుమంతరావు లాంటి పరమ భక్తులంతా కలిసి సోనియమ్మను ‘తెలంగాణ తల్లి’గా మైమరపింప చేశారు. ఇప్పటికే కాకలుదీరిన కాంగ్రెస్‌ నాయకుడు పి.శంకర్‌రావు సోనియాకు ఏకంగా గుడే కట్టిస్తానని మొదలుపెట్టాడు. మరి ఇప్పటికే కేసీఆర్‌ ‘తెలంగాణ తల్లి’ ని సృష్టించాడు. ఇక ఎప్పుడు అవసరమైతే అప్పుడు పలికేందుకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చంద్రబాబు లాంటివాళ్లకు ‘తెలుగు తల్లి’ ఉండనే ఉంది. ఈ కొత్త తల్లుల సృష్టికర్తలంతా కలిసి భారతీయులందరికీ తల్లైన ‘భారతమాత’ను విస్మరించడం విడ్డూరం.
మేడ్చల్‌ సభలో పెద్ద పెద్ద వీర తిలకాలతో సోనియా, రాహుల్‌ కన్పించారు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ‘ఎప్పుడూ బొట్టు పెట్టని సోనియాగాంధీ మోదీ దెబ్బకు బొట్టుపెట్టక తప్పని పరిస్థితి వచ్చిందని కొందరు కామెంట్‌ చేశారు.
గుజరాత్‌, కర్నాటక ఎన్నికల్లో రాహుల్‌ జంధ్యం ధరించి తాను శివభక్తుడని ప్రకటించు కున్నాడు. సుబ్రహ్మణ్యస్వామి లాంటివారు ముద్దుగా పిలుచుకునే రాహుల్‌ ప్రిన్సీ ఇలా హఠాత్తుగా హిందువు అవ్వడం ఒక విధంగా సంచలనమే. ఇదంతా ఎలా జరిగింది అన్నదే ఇప్పటి ప్రశ్న.
ఇక తెలంగాణ గడ్డ మీద కాలుపెట్టిన సోనియా ఆంధ్రాకు ప్యాకేజి కేటాయిస్తుందా ? అసలు ఏం మునిగిపోయిందని సోనియా కడుపు తరుక్కుపోయింది ? సమైక్యాంధ్రలో నెలనెలకు మూటలు ముట్టేవని, ఇప్పుడు అవి అందట్లేదనా ? అని టిఆర్‌ఎస్‌ ప్రశ్నించింది. ఇదే ప్రశ్నను ‘దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది, వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి, వాటిని సరిచేస్తానని బయల్దేరిన చంద్రబాబుని భాజపా అడిగితే బాగుంటుందని జనం అనుకుంటున్నారు. అయినా 12 వందల మంది ప్రాణాలు తీసుకున్న తర్వాత ఇచ్చిన తెలంగాణకు సోనియా తల్లి అవడం, ఏనాడూ తెలుగు గురించి పట్టించుకోని చంద్రబాబు ‘తెలుగు తల్లి’, ‘ఆత్మగౌరవం’ అనడం వింతగాక మరేమిటి ?
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
02 : 03 డిశంబర్  - 2018
సంపుటి : 71, సంచిక : 05


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి