అనాగరిక, అరాఛక పీడిత ప్రాంతంగా భారత్‌ను అభివర్ణించే ఉదారవాద, మత నిరపేక్షవాదులు, వామపక్షాలు, మత మార్పిడి కుట్రదారులు ఈ దేశంపై తెలివిగా యుద్ధం చేస్తున్నారు. వారు ఓ పథకం ప్రకారం భారతీయతను, దాని మూల సంస్కృతిని వ్యతిరేకిస్తున్నారు’- అంటూ ప్రముఖ పాశ్చాత్య భారతీయ రచయిత రాజీవ్ మల్హోత్రా చెప్పింది అక్షర సత్యం. ఇపుడు దేశ రాజకీయాలను చూస్తుంటే ఇదంతా చాపకింద నీరులా కన్పించకుండా భారత విధ్వంసానికి ఎలా కుట్ర జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

మనదేశంలో క్రీ.శ.712 తర్వాత హిందూరాజుల పాలనకు ముగింపు జరిగిందనే చెప్పవచ్చు. మధ్య మధ్యలో కొన్ని సామ్రాజ్యాలు, కొందరు హిందూ రాజులను మినహాయిస్తే మిగిలిన పాలనంతా విదేశీ భావజాలంతో జరిగిందే. దానికి అలవాటుపడిన మన మేధోవర్గాలు ఆధునిక కాలంలో ‘సెక్యులరిజం’ అనే అందమైన ముసుగు తొడిగి ‘‘గంగా జమునా తహజీబ్’’ అంటున్నాయి. నిజానికి ‘సెక్యులరిజం’ అనే పదం పాశ్చాత్య అర్థంలో మన దేశానికి వచ్చినా ఇక్కడ దానికి సరికొత్త పరిభాష సృష్టించారు. ఇపుడు దేశంలో ‘సెక్యులరిజం’ అంటే మత నిరపేక్షగల రాజ్యం అని గానీ, అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తామని గానీ ఎవరూ చెప్పరు. మెజారిటీలను తిడుతూ మైనారిటీలను సంతుష్టిచేయడమే సెక్యులరిజం అని ఈ దేశ మేధోవర్గాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయ పార్టీలు పుట్టించిన కొత్త అర్థం.

ప్రధాని నరేంద్ర మోదీని తక్షణం గద్దె దింపాలని కలలు గంటున్న వారందరిదీ రాజకీయ వైరం అనుకుంటే శుద్ధ తప్పు. రాజకీయంగా ఎవరు గద్దెమీదున్నా ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ మోదీ గద్దెమీదుంటే ఈ దేశ ‘మెజారిటీ ప్రజల జాతీయత’ అందరిపైనా పెత్తనం చేస్తున్నట్లు భావించాలి. లేదంటే ఈ దేశ సూడో సెక్యులర్ గ్యాంగ్ అరచి గోల చేసి ఈ విషయాన్ని ఢంకా భాజాయించి, మత తత్త్వ పార్టీ గద్దెనేలుతోందని ప్రపంచానికి చాటుతుంది. మోదీని, భాజపాను, దాని వెనుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను సిద్ధాంతపరంగా వ్యతిరేకించే కమ్యూనిస్టు వర్గాలు ఈ విషయంపై ‘ఎంతైనా చూసుకుందాం’ అంటూ సవాల్ విసురుతాయి. 

ఇపుడు రాజకీయపరంగా కమ్యూనిస్టుల ‘గ్రాఫ్’ పాతాళంలో ఉన్నందున ఆ పార్టీని ఆశ్రయించిన మేధో వర్గం కాంగ్రెస్ పంచన చేరి మోదీపై విషం చిమ్మే ప్రయత్నంలో వుంది. ఇటీవల ‘రిపబ్లిక్ టీవీ’ రహస్య విశే్లషణ ప్రకారం 68 మంది ప్రసిద్ధ పాత్రికేయులకు, బ్యూరోక్రాట్లకు భారీగా డబ్బులు చెల్లించి మోదీపై దుష్ప్రచారం చెయ్యాలని సూచించినట్లు తెలుస్తోంది. కేంబ్రిడ్జి అనలటికా అనే సంస్థ ద్వారా ఆ పథకం అమలు జరిగేట్లు ఒప్పందం జరిగిందని సదరు టీవీ బయటపెట్టింది. వీరిలో నిత్యం మోదీపై దుమ్మెత్తిపోసే శేఖర్ గుప్తా, మైథిలీ శరణ్, ప్రణయ్ జేమ్స్ రాయ్, ఆకార్ పటేల్, పరాంజయ్ గుహ, హర్షమందర్, రాజ్‌దీప్ సర్దేశాయ్, విక్రం చంద్ర, ప్రొ. సజ్జాద్, బర్ఖాదత్, యోగేంద్ర యాదవ్, టి.ఎన్.శ్రీనిరాఘవన్, కరణ్ థాపర్ వంటి ప్రముఖ పాత్రికేయులు ఉన్నారు.

వీళ్లందరూ దేశంలో మతతత్వం పెచ్చరిల్లిందని, భావ స్వేచ్ఛ లేదని, వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయని నిత్య స్తోత్రం చదువుతారు. ముస్లిం మైనారిటీలకు రక్షణ లేదని వారిలో అభద్రతా భావం కల్పిస్తారు. నిజానికి రోజూ టీవీలముందు కూర్చొని, పత్రికలలో వ్యాసాలు రాసేవారు మోదీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ‘రైట్‌వింగ్’ వారితో నింపేసారని అసత్యాలు చెప్తుంటారు. కానీ అది పచ్చి అబద్ధం. నెహ్రూ కాలం నుండి దేశంలో కళా, సాహిత్య పాత్రికేయ, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష వర్గాలదే పైచేయి. ఈరోజుకూ అది కొనసాగుతూనే వుంది.

2019లో మళ్లీ మోదీ గెలిచినా ఈ వ్యవస్థలను ప్రక్షాళన చేయకపోతే భారతీయ జనతా పార్టీ మేధోవర్గం దెబ్బలు కాయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయని కొన్ని సాంస్కృతిక తప్పిదాలు ఎన్టీయే జాతీయవాద ప్రభుత్వం చేసింది. జాతీయ భావజాల వ్యతిరేకులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నట్లు నిజంగా వ్యవస్థలను మత తత్వ వాదులతో నింపేశారా?

అలా అయితే అద్వానీని బాబ్రీ మసీదు కట్టడం కూల్చాక ‘రక్తపిపాసి’ అని సంపాదకీయం రాసిన ఓ పత్రికా ప్రముఖుడికి ‘పద్మ విభూషణ్’ బిరుదు ఎలా వచ్చింది? చంద్రబాబుకు, వెంకయ్యనాయుడుకు సన్నిహితంగా వుండే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మరోసారి ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ చేసినా- ‘పద్మభూషణ్’ ఇచ్చింది ఏ ప్రభుత్వం? ఇపుడు కేంద్ర సాహిత్య అకాడమీ ఎవరి చేతుల్లో వుంది? సైన్స్ కాంగ్రెస్, హిస్టరీ కాంగ్రెస్ ఎవరి అదుపులో ఉన్నాయి? తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓల్గా, పసునూరి రవీందర్, పింగళి చైతన్య, డా శివారెడ్డి.. వంటివారు ఏ భావజాలానికి చెందారని అవార్డులు ఇచ్చారు? వీళ్లందరి వెనుక ఏ శక్తులున్నాయని ప్రశ్నిస్తే ఎవరైనా చెప్పగలరా? ఇది రాష్టభ్రక్తి ప్రబోధించే జాతీయవాదులు చేసారా?

మోదీని తిట్టేందుకు ఇదంతా పథకం ప్రకారం జరిగే డ్రామా మాత్రమే కాదు. జాతీయ భావజాలాన్ని మోదీ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే విస్తృత ప్రణాళిక ఇది! నిజానికి మోదీ ప్రభుత్వం వచ్చాక అక్రమ స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) కట్టడి జరిగింది. దాంతో మత మార్పిడి సంఘాలకు, వారికి పరోక్షంగా సహాయం చేసే శక్తుల ఆర్థిక వనరులపై దెబ్బపడింది. పాశ్చాత్య ప్రభుత్వాల వ్యాపార సామ్రాజ్య విస్తరణకు తోడ్పడే ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులకు, దానిని లోకానికి అందించే ప్రసార మాధ్యమాలకు కంటగింపు అయ్యింది. భారతీయతను రెచ్చగొట్టి భారత్‌ను విభజించి అస్థిరపరచి, బలహీనపరిచే శక్తులకు మోదీ ఒక అనకొండలా కన్పిస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడ మత సంతుష్టీకరణ రాజకీయాలు తలక్రిందులవుతాయి కాబట్టి మోదీని ఎలాగైనా నిలువరించాలనే ప్రయత్నం జరుగుతుంది.

భారతీయులు బానిసత్వం ద్వారా పోగొట్టుకున్న మూలతత్త్వాన్ని తిరిగి పొందకుండా జరుగుతున్న అంతర్జాతీయ కుట్రకు ఈ దేశ మేధోవర్గం సహకరిస్తున్నది. బ్రాహ్మణీయ శక్తులపై పోరాటం పేరుతో ఇటీవల కులవాదం పెచ్చుమీరుతున్నది. నిజానికి మోదీ కుల పరంగా బ్రాహ్మణుడు కాకపోయినా బహుజనవాద రాజకీయాలు చేసే పార్టీలు, మేధావులు బహుజనుడైన ఆయనను వ్యతిరేకిస్తారు. ధనవంతులపై, భూస్వామ్య, ఫ్యూడలిస్టులపై యుద్ధం చేస్తాం అని చెప్పే కమ్యూనిస్టులు, మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్ మోదీపై రణం చేస్తాం అంటారు. నిజానికి మోదీ నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు!? పాకిస్తాన్ తీవ్రవాద నాయకుడు హఫీజ్ సరుూద్‌ను, హైదరాబాద్‌లోని మజ్లిస్ పార్టీని, కేరళలోని ముస్లింలీగ్ మోదీని వ్యతిరేకిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మొదలుకొని డీఎంకే నాయకుడు స్టాలిన్ వరకు అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు మోదీని వ్యతిరేకిస్తారు. జాన్ దయాల్ మొదలుకొని రాబర్ట్ వాద్రా వరకు అందరూ మోదీని గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇదంతా కేవలం ‘రాజకీయ ఉష్ణోగ్రత’ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. వీళ్లందరికీ కావాల్సింది ఇంకేదో ఉంది!? అదే ఇపుడు గుర్తించాలి. హిందూ నేపథ్యం వున్న రాజకీయం నడవకూడదన్నది ఈ చర్చలో తేలిన విషయం.

నిజానికి ఈ దేశంలో హిందుత్వం కనుమరుగైన మరుసటి రోజు సెక్యులరిజం పాతాళానికి తొక్కేయబడుతుంది. ఈ విషయం గ్రహించిన ముస్లిం మేధావులు ఎం దరో ఉన్నారు. మహమ్మద్ కరీం చాంగ్లా, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ అలాంటి కోవలోని వారే. మహ్మద్ హమీద్ అన్సారీ పూర్తి మత స్వేచ్ఛతో ఈ దేశ ఉపరాష్టప్రతిగా ఉండొచ్చు. పదవి నుండి దిగిపోయాక ఈ దేశంలో మైనారిటీలకు భద్రత లేదని వ్యాఖ్యానం చేయవచ్చు. ఇది కూడా సెక్యులరిజంలోని భాగమే. కానీ ఈ దేశంలో హిందూ నేపథ్యం ఉన్న వ్యక్తి ప్రధానిగా ఉండడం సెక్యులరిజానికి ప్రమాదం. ప్రతి రాష్ట్రంలో రెండు కుటుంబాలు ప్రాంతీయ పార్టీలు పెట్టి రాష్ట్రాలను ఆక్రమించుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణ! బ్రహ్మచారిగా దేశానికి తన జీవితాన్ని మోదీ అంకితం చేయడం నియంతృత్వం!?

నాలుగు తరాలు ఈ దేశాన్ని పాలించడం త్యాగం! నాలుగున్నరేళ్లు అవిశ్రాంతంగా పనిచేస్తూ పరిపాలించడం ఏకచక్రాధిపత్యం!! పది తరాలకు సరిపోయే ఆస్తులను సంపాదించడం పారదర్శకమైన, నీతివంతమైన పాలన! తన కుటుంబాన్ని దగ్గరగా కూడా తీయకపోవడం రాజ్యాంగ విధ్వంసం!? పరాయి దేశాధినేతల ముందు చేతులు కట్టుకుని నిల్చోవడం, వౌనంగా ఉండడం మహా మేధావితనం! చైనా అధ్యక్షుణ్ణి సబర్మతీ ఆశ్రమం ఆరుగుమీద కూర్చోబెట్టడం బానిసత్వం! పనె్నండు వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఇవ్వడం తల్లితనం! అన్ని రాష్ట్రాలకూ ఒకేలా న్యాయం చేస్తాననడం నిరంకురశత్వం! తలలు పరాయి దేశం వాళ్లు నరికి బహుమతిగా పంపిస్తే దాని గురించి నోరు తెరువకుండా ఉండడం సౌభ్రాతృత్వం! తీవ్రవాదం ఇంట్లోకి చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేస్తే అది చేతగానితనం!? ఇఫ్తార్ విందుల్లో టోపీలు ధరించడం సెక్యులరిజం! ఎవరి సంప్రదాయాలు వారు పాటిస్తూ మన మతాన్ని అభిమానిస్తూ పరాయి మతాన్ని గౌరవించాలని చెప్పడం మతతత్వం!? ఒక మతం వాళ్లకు ఈ దేశంలోని సంపదలో మొదటి ముద్ద అని చెప్పడం సెక్యులరిజం! అందరూ ఒకే జాతి అని చెప్పడం మతతత్వం!?

ఇలాంటి దౌర్భాగ్యపు విభజనల వల్ల, సంకుచిత మనస్తత్వాల వల్ల జాతీయ భావజాలాన్ని కాళ్లకింద వేసి తొక్కాలని చూసే శక్తులు మోదీని గద్దెనుండి దింపాలని చూస్తున్నాయి. వాళ్ల ప్రయోజనం రాజకీయ అధికార మార్పిడి కానే కాదు. మతోన్మాదంతో భయపెట్టాలనుకునేవాళ్లు, మత మార్పిడిని నిరాటంకంగా కొనసాగించేవాళ్లు, కులం కుళ్లును ఇతరులపై చల్లేవాళ్లు, చైనా, రష్యా, సిద్ధాంతాలను తలపై మోసేవాళ్లు ఓ పథకం ప్రకారం మోదీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇప్పటికైనా సత్యాసత్యాలు గ్రహించకపోతే మరో చారిత్రక తప్పిదం మన ఖాతాలో పడుతుంది. జాతీయవాదులు రాజసూయయాగంలా రాష్ట్రాలను గెలుచుకుంటూపోవడం ఎంత ముఖ్యమో సాంస్కృతిక విధ్వంసాన్ని అంతే వేగంగా ఎదుర్కోవాలి. లేదంటే మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదు.

*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ 
పెన్ గన్ గ  : ఆంధ్రభూమి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి