కొక్కొరో ... క్కో ...
శనీశ్వరుడు చంద్రబాబు నడినెత్తిన కరాళనృత్యం చేస్తున్నాడు. కాబట్టి శుభప్రదమైన పచ్చ చొక్కాలు విడిచిపెట్టి నల్ల చొక్కాలను ధరించారు. తాను ధరించడమే గాక పార్టీ వాళ్లందరికీ నల్ల చొక్కాలు తొడిగి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అంటూ ఢిల్లీకి వెళ్లి ధర్నా మొదలుపెట్టారు. ఏపీ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయమో లేక ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లానో భావించి అక్కడ దీక్ష పేరుతో ప్రజలకు శిక్ష వేసినంత పని చేసారు. ఖరీదైన ¬టళ్లు, సుఖసంతోషాల మధ్య ‘నిరసన దీక్ష’ చేపట్టారు. ఇది తెలుగు ప్రజలకు శిక్ష అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సాయంకాలం ప్రైమ్‌టైమ్ అంతా తెలుగు టీవీ ఛానళ్లు ఒకే ప్రోగ్రాంను ప్రసారం చేసాయి. వాళ్ల హెడ్డింగులు చూస్తే మనకు కళ్లు బైర్లు గమ్మి స్పృహ కోల్పోవాల్సిందే. బాబుగారి రాజగురువు నడిపే టీవీ ‘ఢిల్లీలో ధర్మపోరాటం’ అనీ, ‘మండే చంద్రుడు’ అని మరో దగ్గున్న ఛానల్, ‘దద్దరిల్లిన ఢిల్లీ’ అనీ పచ్చకలర్ టీవీ, ఢిల్లీతో ఢీ అని మరో కులపక్ష పాత టీవీ, ‘ఆఖరి పోరాటం’ అని మరో మాయదారి టీవీ, ‘ఆత్మ గౌరవ పోరాటం’ అని ఇంకో కామెర్ల కెమెరా.. ఇలా చెప్పుకుంటూ పోతే కళింగ రాజ్యంపైకి అశోకుడు దండయాత్ర చేసినప్పుడు పెట్టాల్సిన హెడ్డింగులన్నీ మన టీవీ ఛానళ్లు పెట్టాయి. వికృతానందంతో అన్ని టీవీల్లో ఇదే ఏడుపు అయ్యేసరికి తెలుగు ప్రేక్షకులు కళ్లలో వత్తులేసుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు.
ఇందులో బాబుగారి మహాగొప్ప ఉపన్యాసం ప్రజలు విని తరించాల్సిందే. ఎందుకంటే అబ్రహంలింకన్, సుభాష్‌చంద్రబోస్, అటల్ బిహారీ వాజ్‌పేయ్, జయప్రకాశ్ నారాయణ్, చంద్రశేఖర్.. వంటి ‘మహా వ్తలను తలదన్నే ఉపన్యాసం అది!?’ ముందున్న వారు మురిపెంగా కరతాళ ధ్వనులు చేస్తుంటే డిక్షనరీలోని తిట్టు పదాలను ముత్యాల సరాల్లా ఏర్చికూర్చి చదివిన ‘మోదీపై తిట్లదండకం’ విని తరించాల్సిందే. మీరు ‘సూపర్ బాబు!? రసహీనమైన ఆ ఏడుపుగొట్టు ఉపన్యాసం వినలేక చచ్చినా, పచ్చ మీడియా మాత్రం నిద్ర లేకుండా పలవరించడం మరో విడ్డూరం.
నక్సలైట్లు, తీవ్రవాదులు ప్రధానిని గోబ్యాక్ అనలేదు కాని ఒకదేశ ప్రధానిని ‘గోబ్యాక్’ అంటూ ఆంధ్ర నడిబొడ్డున ప్లెక్సీలు పెట్టడం ప్రజాస్వామ్య అపహాస్యం కాదా? ప్రత్యేక ¬దా అనేదే ఈ దేశానికి ఇప్పుడు ఆక్సిజన్ అన్నట్లు బాబు ఆండ్ కో ప్రవర్తించడం దానిని ప్రత్యక్షంగా, పరోక్షంగా మోదీని తిట్టేందుకు ఉపయోగించడం ఈ దేశ ప్రజాస్వామ్య రక్షణా?’ రాజుగారి రాచపుండు రాజ్యానికే కష్టం వచ్చిందన్నట్లు ప్రచారం చేసే వంధిమాగధ మీడియాను చూస్తే పాత్రికేయులకు ఇంకా బ్రతికున్నామా అనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విభజన తప్పదని తెలిసినా బాబుకు ఇలాగే వత్తాసు పలికిన తెలుగు మీడియా 2014లో భంగపడింది. అంతెందుకు.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే హైద్రాబాద్‌లో చేవలేని బాబు ప్రసంగాలను ఆహా.. ఓహో.. అంటూ ఊదరగొట్టి తెలుగు మీడియా కాంగ్రెస్ నడ్డి విరిస్తే ఆ పార్టీ ఇప్పటికే స్పృహ నుండి బయటకు రాలేదు. ఇప్పుడు కూడా ఢిల్లీ ధర్నాకు ఫ్రేమ్‌కట్టి తెలుగు ప్రజలను వంచించే పనికి బాబుతో సహా మీడియా పూనుకొన్నది. ఇక ఆ ధర్నాలో పాల్గొన్న పాతకాపులంతా ఆత్మరక్షణలో పడి తమ స్వీయ రక్షణను వెతుక్కున్న వారే. ఇందులో నరాలు తెగిన ఓ సీనీ నటుడు బాబుగారిని, ఆయన పుత్రరత్నం లోకేష్‌ను పొగుడుతుంటే ముత్యాల ముగ్గు సినిమా రావుగోపాల రావు మేళం ఒక్కటే తక్కువ అనిపించింది. మరో స్వయంప్రకటిత మేధావి టీవీల్లో ‘నేను ఏ పార్టీ కాదు’ అంటూనే బాబుగారి చంకలో ఎక్కి పుచ్చలపల్లి సుందరయ్యలా భుజంపై కండువాతో ఫోజులిస్తుంటే రాజకీయం ఇంత ఊసరవెల్లిలా మారిందా? అని బాధ కలుగుతోంది. హతవిధీ..!!
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక
18 -24 ఫిబ్రవరి - 2019
సంపుటి : 71, సంచిక : 16
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి