ఓ కుమారుడు తండ్రిని- ‘నాన్నా! ఒట్టు అంటే ఏంటి?’ అని ప్రశ్నించాడట. ‘పచ్చి అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు తరతరాలుగా వాడుతున్న టెక్నిక్‌రా కన్నా!’ అన్నాట్ట ఆ తండ్రి. మన దేశంలో అబద్ధాన్ని అతికినట్లు చెప్పేందుకు ఓ వర్గం మీడియా, దాని వెనుకున్న రాజకీయ వర్గాలు పడరాని పాట్లు పడుతున్నాయి. దొంగే ‘దొంగా దొంగా!’ అని అరుస్తుంటే నోళ్లువెళ్లబెట్టి చూడటం తప్ప ఇంకేం చేయలేని దుస్థితి. దుష్ప్రచారం బాగా చేయగల నేర్పరులు పార్టీలు, సిద్ధాంతాల ముసుగుకప్పుకొని ఇప్పుడు దేశాన్ని లూటీ చేస్తున్నారు. దోచుకొన్న ధనాన్ని దాచుకొని కులానికో పార్టీ, ఇంటికో పార్టీ పెట్టుకొని అబద్ధాలతో ఏలేస్తున్నారు. చేసిన తప్పును ఎత్తిచూపినా, కోర్టుల్లో కేసులు నమోదైనా, ముదిమి వయస్సులో శిక్షపడినా దానినీ సానుభూతిగా మలచుకొనే దుస్థితి నుండి ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి?

మమతా బెనర్జీ తాజాగా చేసిన గోలే ఇందుకు ఉదాహరణ. ఆధ్యాత్మిక లోకానికే దిక్సూచి లాంటి శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి పేరిట బెంగాల్‌లో ఓ కంపెనీ ఏర్పాటైంది. దాన్ని 240 అనుబంధ కంపెనీల సమాహారంగా మార్చిన పెద్దలు రియల్ ఎస్టేట్, రిసార్ట్స్, హోటల్స్, చిట్స్.. వగైరా వ్యాపారాలతో జనంలోకి వెళ్ళారు. 2008 నుండి 2013 వరకు ప్రజల నుండి ఈ కంపెనీ బ్రోకర్లు కమీషన్లకు కక్కుర్తిపడి 2500 కోట్లు వసూలు చేశారు. ఇది మెల్లగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లి ‘సెబీ’కి ఫిర్యాదులందాయి. దాంతో ఆ కంపెనీ ఎలాంటి వసూళ్లు చేయరాదని ‘సెబీ’ ఆదేశించింది. ఈ సంస్థకు చెందిన సుదీపా సేన్, దేవజన ముఖర్జీ అరెస్టయ్యారు. 

రజత్ మజుందార్, శ్రుంజయ్ బోస్, మజన్ మిత్ర, కృణాళ్ ఘోష్ అనే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పెద్ద నాయకులు 2013-14లలో అరెస్టయ్యారు. కొందరు బెయిల్ మీద బయటకు వచ్చారు. అలాగే అధిక వడ్డీల ఆశ జూపి రోజ్‌వ్యాలీ సంస్థ చేసిన గొలుసుకట్టు మోసం బెంగాల్‌లో వెలుగు చూసింది. అందులో తపస్‌పార్, సుధీప్ బంధోఫాధ్యాయ అనే తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకులు. శ్రీకాంత్ మెహతా అనే సినీ నిర్మాత, టిఎంసీ సానుభూతిపరుడైన ఓ ధనవంతుడు అరెస్టుయ్యరు. ఈ రెండు కుంభకోణాలపై ఫిర్యాదులు, కేసులు, బెయిళ్ళు దాదాపుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ హయాంలో జరిగినవే. 2013లో ఈ కుంభకోణాల కథా కమామిషు తేల్చేందుకు ఇపుడు మమత వెనకేసుకొస్తున్న, మొన్నటి బెంగాల్ రగడకు కారణమైన పోలీసు ఉన్నతాధికారి రాజీవ్‌కుమార్ ‘సిట్’కు నేతృత్వం వహిస్తున్నారు. 

ప్రపంచంలోనే రాజీవ్‌కుమార్ అంత నీతిపరుడు లేడని ఈ రోజు మమత చెప్తున్నా, ఇదే రాజీవ్‌కుమార్‌ను వామపక్ష ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. వామపక్ష ప్రభుత్వం కనుసన్నల్లో రాజీవ్‌కుమార్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని మమత ఒకప్పుడు ఆరోపణలు చేయడమేగాక, తాను అధికారంలోకి వచ్చా క ఇతడిని ప్రాధాన్యత లేని పోస్టులో ఉంచాలనుకొన్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారుల కోరిక మేరకు రాజీవ్ కుమార్ మమతకు దగ్గరవడమే గాక ఈ రోజు రాజ్యాంగ సంక్షోభానికి కారణం అయ్యాడు. 

2013లో ‘సిట్’కు నేతృత్వం వహించిన ఆయన తృణమూల్ నేతలకు పరోవక్షంగా సహాయపడుతూ వారిని కేసుల నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు. కేసుకు సంబంధించిన కీలక దస్త్రాలను ఆయన మాయం చేస్తున్నాడని బాధితులు 2014కుముందే సుప్రీం తలుపు తట్టారు. 2014 నుండి అత్యున్నత న్యాయస్థానం మూడుసార్లు ఆదేశాలు జారీ చేసినా ఇతను ఢిల్లీ ముఖం చూడకుండా తప్పించుకొంటున్నాడు. చివరికి కోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు కోల్‌కతా వెళ్తే మమత రాద్ధాంతం సృష్టించింది. నిజానికి ఈ సంక్షోభానికి తెరలేపింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే. మమత దీక్ష విరమణలో కూడా ఈయనే ప్రధాన ఆకర్షణ.

ప్రపంచంలో అన్ని వస్తువులనూ తానే కనుగొన్నట్లు చెప్పే బాబు సిబిఐని ఏపీకి రానివ్వకుండా చేసే అద్భుతమైన ఆవిష్కరణను కూడా మొదట చేశాడు. ఏ కేసులోనైనా విచారణ చేపట్టే అధికారం వున్న ‘జనరల్ కనె్సం ట్’ను ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకొంది. బాబు సలహాపైనే మమత ఈ విధానాన్ని ఆచరించే క్రమంలో సిబిఐని అడ్డుకొంది. ఇక్కడ రెండు సారూప్యతలు స్పష్టంగా ఉన్నాయి. శారద, రోజ్‌వ్యాలీ కుంభకోణంలాగే ఆంధ్రలో అగ్రి
గోల్డ్ కుంభకోణం చాలా పెద్దది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మరో రోజ్‌వ్యాలీ లాంటిదే. వీటిని తప్పించుకోవాలంటే కేంద్రాన్ని, మోదీని విలన్లుగా చేస్తూ వ్యవస్థలు ధ్వంసం అంటూ ‘బాబు పాఠశాల’లో చదివిన అవినీతి గ్యాంగంతా గగ్గోలు పెడుతున్నది.

నాయకులు, పార్టీల నేతలు విచారణను ఎదుర్కోకుండా ఇదో సానుభూతిగా మలచుకోవడం రాజ్యాంగ సంక్షోభం కన్నా ప్రమాదకరం. నేతలను విచారించడం అ న్న విషయాన్ని రాజకీయ,కులం, ప్రాంతం కోణాల్లో చూస్తే నేర పరిశోధక వ్యవస్థలకు పిండం పెట్టాల్సిందే. ప్రధాని మోదీ కూడా గతంలో సీబీఐ విచారణను ఎదుర్కొన్నాడు. యూపీఏ ప్రభుత్వంలో సీబీఐ అధికారులు గుజరాత్‌కు వెళ్తే గంటలకొద్దీ వాళ్ల ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చాడు. ‘దుర్బల రాజకీయం’ పేరుతో నటిస్తే ఏ రాజకీయ నాయకుడూ దోషిగా తేలడు!?

అన్నా హజారే ఆలోచనల నుండి పుట్టిన అరవిం ద్ కేజ్రీవాల్ అవినీతి, చీఫ్ సెక్రటరీ కేసు 2016, 2017, 2018లో ఉంది. కేజ్రీవాల్ మంత్రుల అవినీతి బా గోతం వాళ్ల పార్టీవారే బ యటపెట్టారు. కేజ్రీవాల్‌ను విచారిస్తే నీతివంతుపై దాడిగా భావించాలా? బహుజన సమాజ్ పార్టీని నడిపే మాయావతి రూ. 1400 కోట్ల స్మారక స్థూపాల కేసు, 4,900 కోట్ల జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధుల మాయం కేసు ఎదుర్కొంటున్నది. మరి ఆమెను విచారించడం ఒక కులం నాయకురాలిపై దాడిగా అభివర్ణిస్తారా? 

ఎ.రాజా, కనిమొళిలపై 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసు ఉండేది. వారు నిర్దోషులుగా రావడాన్ని సవాల్ చేస్తు 2018లో మరో కేసు వేశారు. ఇపుడు వారిని కోర్టులు, దర్యాప్తు సంస్థలు విచారించాలా? వద్దా?? కరడుగట్టిన కమ్యూనిస్టు యోధుడు, కేరళ సీఎం పినరయి విజయన్‌పై 2006లో లవలీన్ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కేసు సీబిఐ దగ్గర ఉంది. ఇపుడు ఆయనను విచారించడం కేరళ ఆత్మగౌరవంపై దాడిగా చూద్దామా? యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై అక్రమ మైనింగ్ లీజులు, మనీ లాండరింగ్ వంటి కేసులు ఉన్నాయి. వీటిపై సీబిఐ విచారిస్తే యాదవుల గౌరవం పోయినట్టా? బిహార్ నుండి ఆగమేఘాలపై కోల్‌కతా వెళ్లి మమతా దీదీ పక్కన నిల్చున్న ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌పై 2017 మార్చిలో ఐఆర్‌సిటిటీ స్కాం నమోదైంది. ఆయనను విచారిస్తే అది బిహార్‌కే కళంకమా?

ఈ దేశంలో ప్రముఖులైన భూపేందర్ హుడా, వీరభద్రసింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరా, శ్యామ్ పిట్రోడా, డి.కె.శివకుమార్, చగన్ భుజ్‌భల్, సుజనా చౌదరి, సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్‌లపై వున్న కేసులు రాజకీయ ఆరోపణలకు భయపడి మూసివేయాలా? గుజరాత్ అల్లర్ల విషయంలో మోదీ కేసులను ఎదుర్కోలేదా? సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాను ఎంతలా టార్గెట్ చేసారో తెలియదా? భావి ప్రధానిగా కాంగ్రెస్ వారు అభివర్ణిస్తున్న రాహుల్ గాంధీపై 5000 కోట్ల నిధుల అవకతవకలపై నేషనల్ హెరాల్డ్ కేసు లేదా? ‘త్యాగమూర్తి’ సోనియా గాంధీపైనా ఇదే కేసులో యూపిఏ ప్రభుత్వంలోనే డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్లు వేశారు కదా! ఈ ఎపిసోడ్‌కంతా మూలపురుషుడైన చంద్రబాబుపై 2010 బాబ్లీకేసు, ఓటుకు నోటు కేసు ఉన్నాయి కదా! ఇపుడు చంద్రబాబు దగ్గరకు దర్యాప్తు సంస్థలో, కోర్టులో వస్తే అది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యా?

అలాంటపుడు అందరూ కలిసి దర్యాప్తు సంస్థలు, కోర్టులను మూసేస్తే సరిపోతుంది కదా! రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వ్యక్తులే రాజ్యాంగాన్ని గౌరవించకుండా స్వప్రయోజనాల కోసం ఇలా రచ్చ చేస్తే దీనికి ఏం పేరు పె ట్టాలి? దీక్ష సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం, భావస్వేచ్ఛ, ఫెడరల్ వ్యవస్థల గురించి మమత ఉపన్యాసాలు దంచడం విడ్డూరం. 

ఇదే మమతా బెనర్జీ 2013లో ఇమాంలకు, వౌహజ్జమ్‌లకు అడ్డగోలుగా జీతభత్యాలు పెంచితే హైకోర్టు మందలించినా ఆమె గౌరవించలేదు. 2014లో అమిత్‌షా ర్యాలీ చేస్తానంటే మమత ప్రభుత్వం అడ్డుకోగా, హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 2014 డిసెంబర్‌లో విశ్వహిందూ పరిషత్ ర్యాలీని అడ్డుకొన్న మమత ప్రభుత్వం భావస్వేచ్ఛ గురించి మాట్లాడుతోంది. జనవరి 2017లో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీని, భాజపా సభ్యుల మేళాను ఆమె ప్రభుత్వం అడ్డుకొన్నది. దుర్గా నిమజ్జనంపై నిషేధం విధిస్తే కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం సహకరించలేదు. ఇలాంటి నియంతృత్వంతో ప్రభుత్వాన్ని నడిపే మమతా బెనర్జీ వ్యవస్థల విధ్వంసం గురించి చెప్తున్న నీతులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అమిత్ షా తన కుటుంబ సభ్యులతో తిరుమలకు వస్తే రాళ్లతో దాడిచేసినవారే ఈ రోజు వ్యవస్థల విధ్వంసం అంటూ గంగవెర్రులెత్తుతున్నారు. ప్రధానిని రాష్ట్రంలోకి కాలుపెట్టనివ్వననే వ్యక్తులు రాజ్యాంగం సంక్షోభంలో పడిందంటూ వాపోడమా?

ద్వంద్వ నీతులను బట్టబయలు చేయాల్సిన వారు ఇదంతా రాజ్యాంగ సంక్షోభమని ప్రచారం చేయడం మరో విషాదం. కొన్నాళ్లు నితీశ్‌ను, తర్వాత కేజ్రీవాల్‌ను, మరికొన్నాళ్లు కన్హయ్య కుమార్‌ను, ఆ తర్వాత రాహుల్‌ను, ఇపుడు మమతను- మోదీని బాగాతిట్టగల సమర్థులని, సమఉజ్జీలని ప్రచారం చేయడం వికృతానందం కాదా? రాజకీయంగా ఎదుర్కోవలసిన వారిని దుష్ప్రచారంతో విలన్లుగా మార్చే ప్రయత్నం సాగేందుకు ఇది అద్వానీజీ, వాజ్‌పేయిల కాలం కాదని గుర్తిస్తే మంచిది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై షుజా-కపిల్ సిబాల్ నాటకం ప్రజల మెదళ్లలోకి ఎక్కలేదని ప్రియాంక వాద్రాను తెరపైకి తెచ్చారు. అదీ ఎవరూ పట్టించుకోలేదని మమత- సీబిఐపై యుద్ధం అంటూ నడివీధిలో నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. ఇక రాబోయే కొత్త చిత్రం ఏమిటో..?

****************************
 *✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
 *ఆంధ్రభూమి : భాస్కర వాణి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి