పృథ్వీరాజ్ చౌహాన్ మన దేశంపైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ ఘోరీని పదహారుసార్లు క్షమించడం నిర్హేతుకం. పదిహేడవసారి అతనికి అవకాశం దొరికింది. దాంతో ఈ దేశంలో విదేశీ శక్తులకు సంపూర్ణంగా బీజం పడింది. ఆనాటి నుండి భారత్ అనేక యుద్ధాలను ఎదుర్కొన్నది. ఇక్కడున్న హిందూ సమాజం మతపరమైన దమనకాండను తట్టుకొని అస్తిత్వాన్ని నిలబెట్టుకొంది. మహమ్మద్ బిన్ కాసిం దండయాత్రతో మొదలైన దాడి ఈరోజుకూ ఏదో రూపంలో ఈ దేశం ఎదుర్కొంటూనే వుంది. ఇక్కడ మతాన్ని రాజకీయాన్ని విడదీసి చూడలేం. మహమ్మద్ బిన్ కాసింకు ఏ లక్ష్యం ఉన్నదో ఒసామా బిన్ లాడెన్‌కు అదే లక్ష్యం ఉంది. అలాంటి గాయాలతో హిందూ సమాజం నెత్తురోడుతూ పయనిస్తూనే వుంది. ఇపుడు శిథిలమైన, జీవమున్న అస్తిపంజరం మాత్రమే భౌతికంగా కన్పిస్తున్నది. కానీ దీనికి ముందున్న రూపం, నశించిన జైవిక లక్షణం గురించి అంతర్గతంగా పరిశీలించడం కాదు కదా దాని గురించి ఆలోచించే తీరిక లేనంతగా మనం విభజనకు గురయ్యాం. కులాలుగా ముక్కలు ముక్కలైపోయిన హిందూ సమాజం ఎప్పుడో ఒకపుడు కార్గిల్ లాంటి యుద్ధం లాంటి సంఘటన జరిగితే తప్ప ఏకోన్ముఖంగా ప్రయాణం చేయట్లేదు. వందల ఏళ్లనుండి అది ఆక్రమిత శక్తులకు రాచబాటగా మారిపోయింది.

మొఘలాయిలు భయపెట్టి ఈ దేశాన్ని పాలిస్తే, బ్రిటీష్ వారు కుయుక్తితో ఇక్కడ ప్రజలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొన్నారు. అందువల్ల ఇక్కడి హిందువులు జన్మతో మాత్రమే భారతీయత కలిగివున్నారు. అదే ఇతర మతాలవారికి అంతర్జాతీయ నిర్దేశాలు, ఆదేశాలు, సారూప్యత, రాజకీయ అవగాహన స్పష్టంగా ఉంది. హిందువుల బానిసత్వం కారణంగా భాష, తిండి, ఆచార వ్యవహారాలు అన్నీ విదేశీయమైనాయి. ఇపుడు మరో సంధి అవస్థలో, సంఘర్షణలో జీవిస్తున్నాం. పూర్తిగా స్వదేశీ, విదేశీ ఏదీ కాని దుస్థితి. మన సభ్యత సంస్కారాల్లో, మన నమ్మకాల్లో మనం సగం విదేశీయులుగా, సగం స్వదేశీయులుగా జీవిస్తున్నాం. ఈ విషయాన్ని 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా చర్చిల్- ‘ భారత్ మూడు సంవత్సరాల్లోనే విభజనలతో తనను తాను నాశనం చేసుకుంటుంది’’ అన్నాడు. దీనికి కారణం ఇక్కడి మూల జాతీయులు, మెజారిటీల వైపునుండి ఎలాంటి గుర్తింపు లేకపోవడం! శ్యామ్యూల్ హంటింగ్‌టన్ అనే మేధావి "Who we are" అనే పుస్తకం రాసి శే్వతజాతీయుల గుర్తింపునకు నిర్వచనం ఇచ్చాడు."White Anglo axent protestent christian speaking English'' ... ఇధీ అమెరికా ప్రజల జాతిపరమైన నిర్వచనం. అదే భారత్‌లో హిం దువులు మెజారిటీగా ఉన్నా ఎలాంటి ప్రత్యేక హక్కులు లేవు. ఇతరులు దాడిచేసినా వౌనంగా ఉండడం సామరస్యంగా, గొప్ప ఆదర్శంగా హిందూజాతికి అలవాటు చేశారు.

స్వాతంత్య్రం రాకముం దు హిందువులు ఒకరకమైన సమస్యను ఎదుర్కొంటే, స్వాతంత్య్రం వచ్చాక ‘పెనం మీది నుండి పొయ్యిలో పడినట్లు’ అయింది. హిందువులకు ప్రజాస్వామ్యం అనే ముసుగు తగిలించి మరింతగా కాలరాస్తున్నారని ఇటీవల అంతర్గత ఆందోళన ఎక్కువైంది. అసలు ప్రపంచంలో ఎక్కడా లేని మైనారిటీ సంతుష్టీకరణ, మతమార్పిడి అనే జాడ్యాలు దేశంలో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తున్నాయి. ఇపుడు దేశంలో అభివృద్ధి, ప్రగతి కన్నా సెంటిమెంట్లే రాజ్యమేలుతున్నాయి. మనోభావాల పేరుతో మెజారిటీ ప్రజలను ద్వితీయ శ్రేణిపౌరులుగా మార్చే చర్యలు హిందువుల్లో ఆందోళన రేపుతున్నాయి.
ఇపుడు దేశంలో విభజన రాజకీయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాంటివాళ్లకే మీడియా, సమాజం ఎక్కువగా గౌరవం ఇవ్వడం ఆందోళనకరం. ఔరంగజేబు తమ్ముడు, యువరాజు దారాషికో ఉపనిషత్తులను పర్షియాలోకి తర్జుమా చేశాడు. ఆధునిక కాలంలో మన కళ్లముందు ఈ దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించి ‘అణుభారతం’గా మార్చిన ఘనుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వాళ్లకు మన సమాజంలో సరైన గుర్తింపు ఉండదు. బద్రుద్దీన్ అజ్మల్, అసదొద్దన్ ఓవైసీ, ఆజంఖాన్... ఇలాంటి వాళ్లముందు కలాం ఆదర్శాలు దిగదుడుపే! అలాగే జార్జి ఫెర్నాండెజ్ కర్ణాటకలో పుట్టి మరాఠీ ప్రాంతంలో రాజకీయం చేసి, ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాడు. మంచం పట్టేవరకు తన బట్టలు తానే ఉతుక్కున్నాడు. కానీ క్రైస్తవులకెవరికీ ఇలాంటి గొప్ప వ్యక్తి కంటబడడు. సేవ పేరుతో మత మార్పిడిలను ఒక సిలబస్‌గా నడిపిన వ్యక్తి ఆరాధ్యనీయురాలు అవుతుంది. ఈ సందిగ్థ, సంఘర్షణ వాతవారణం ప్రభావం ఇక్కడి మూలవాసులైన హిందువులపై సామాజికంగా, రాజకీయంగా చూపుతోంది. దానికి కారణం హిందువులకు మతం, రాజకీయం వేర్వేరు అంశాలు. నాయకులంతా హిందువులే, కానీ హిందుత్వకు స్థానం ఇవ్వరు.


ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మతం మారిన క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తానని తీర్మానం చేశాడు. బాబా సాహెబ్ అంబేడ్కర్ లాంటి మేధావికి కూడా కలగని ఈ ఆలోచన చంద్రబాబుకు కలగడం ఆశ్చర్యం! అంబేడ్కర్‌కు కానీ, రాజ్యాంగ రచన కమిటీ సభ్యులకు గానీ ఆ రోజు ఈ అద్భుతమైన ఆలోచన వారి మెదళ్లలో మెరవలేదు. ఓట్ల కోసం ఈనాటి కుత్సిత రాజకీయ నేతలకు కలగడంలో వింతేమీ లే దు. ఇప్పటికే చంద్రబాబు పెట్టిన మాల -మాదిగ వర్గీకరణ చిచ్చు రావణకాష్ఠంలా రగులుతూనే వుం ది. ఇపుడు మత మార్పిడి సంస్థలకు, హిందూ సంస్థలకు మధ్య జరగబోయే సంఘర్షణకు తెరలేపింది ఎవరు? ఇక్కడే హిందూ సమాజం భ్రమలో పడిపోయింది. మరోవైపు సూడో సెక్యులర్ లిబర్ శక్తులు ఈ దేశ మూల సంస్కృతిని విమర్శిస్తూ నిరంతరం మేధో ఉగ్రవాదం ప్రదర్శిస్తున్నాయి. సాహిత్య సాంస్కృతిక చారిత్రక రంగాల్లో తిష్ఠవేసుక్కూచున్న ఈ శక్తులు హిందుత్వను రోజూ అపహాస్యం చేయడమే కాదు, దాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నాయి.

హిందువులు మెజారిటీగా వున్న ఈ దేశంలో 40వేల పైచిలుకు దేవాలయాలను కూల్చినా హిందువులు బాధపడరు. భారత్‌తో ఏ సంబంధం లేని బాబార్ పేర వెలసిన మసీదు కింద శిథిలమైన రామాలయం తిరిగి కట్టుకొంటామని నాలుగు వందల ఏళ్ల నుండి హిందువులు పోరాడుతూనే వుంటారు. బాబ్రీ కట్టడాన్ని కూల్చినపుడు మాట్లాడేందుకు అన్ని పార్టీలు, సంస్థలు ముందున్నాయి కానీ కాశ్మీర్‌లోని వంద ప్రాచీన దేవాలయాలు కూల్చితే ఒక్క గొంతైనా పెగిలిందా? అని హిందువులు ప్రశ్నిస్తున్నారు. శంకరాచార్య పర్వతానికి పేరు మార్చినపుడు, అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేస్తామని బహిరంగంగా ప్రకటించినపుడు సెక్యులర్ గుంపు ఎక్కడ నిద్రపోయింది. ‘తీవ్రవాదులు మా రాష్ట్రంలో గౌరవ పౌరులు’ అని జమ్మూ కాశ్మీర్ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటిస్తే ఒక్క కలంలోని సిరాతో ఒక్క అక్షరం ఎందుకు రాయలేదు?

అమెరికా జనాభా ముప్ఫై కోట్లు దాటగానే అక్కడ తీవ్రమైన ఆందోళన మొదలైంది. మరి అమెరికా మనకన్నా 4 రెట్లు భూభాగం విస్తీర్ణంలో పెద్దది. మరి ఇక్కడి హిందువుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంటే భవిష్యత్తులో వారు నోరు మెదపగలరా? ప్రతి రాజకీయ నాయకుడు ఫలానా నియోజకవర్గంలో మైనారిటీలే రాజ్యాధికారం నిర్ణయం చేస్తారని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మరి హిందువులను కులాలుగా విభజిస్తున్నారు. ఇపుడు కాశ్మీర్‌లో హిందువును ముఖ్యమంత్రిగా ఎందుకు చూడలేని స్థితి? తిరుమల తిరుపతి హిందువులకు గొప్ప పుణ్యక్షేత్రం. అదే తిరుపతి సమీపంలోని తొండవాడలో హైదర్ అలీ చేతిలో ధ్వంసమైన విష్ణ్వాలయం శిథిలాలు ఓ వైపు వెక్కిరిస్తుండగానే దానికి సమీపంలో అరబిక్ విశ్వవిద్యాలయం ఎలా వచ్చింది? ఇంత జరుగుతున్నా హిందువులు తమ ఆధ్యాత్మికతను మతంలోకి అలాగే పెట్టుకున్నారు గానీ రాజకీయంలోకి చొరబడనీయలేదు. అన్ని మతాలకు గౌరవం, ప్రాధాన్యం ఇచ్చేది ఒక్క భారత్‌లోనే. హిందూ మెజారిటీగా వున్నందునే ఇది సాధ్యం. పాకిస్తాన్‌లో 2003 నుండి 2012 వరకు 42,772 మంది ముస్లింలను ముస్లింలే హత్య చేశారు. భారత్‌లో హిందువులకు వారి రక్తంలో ప్రవహిస్తున్న ఔదార్యమే అన్ని సంస్కృతులను గౌరవించే తత్వం నేర్పింది.

ఇక్కడి మేధావులు, చరిత్రకారులు, నాయకులు, మీడియా మేధావులు ఒకరకమైన సంతుష్టీకరణకు అలవాటుపడి అదొక మానసిక రుగ్మతగా మార్చుకొన్నారు. సమాచార వ్యవస్థ డబ్బు రూపంగా మారినపుడు ఆ కాసుల వేటలో అర్భకులను తెలివైనవాళ్లుగా, తెలివైన వాళ్లను సుపరిపాలకులను నిరంకుశులుగా చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ఏ జాతీ తన చరిత్రను ధ్వంసం చేసినా తిరిగి అదే శిథిలాలపై పునరుజ్జీవనం పొందలేదు. కానీ ఈ దేశ బుద్ధిజీవుల చేతిలో నలిగిపోయిన భారతీయత, జాతీయతలకు కొత్తరక్తం ఎక్కించుకుంటూ మరో రూపంతో వికసించడం చెప్పుకోదగిన అంశం. ఇజ్రాయిల్‌లో చరిత్ర మరిచిపోని నరమేధాన్ని జర్మనీ చేసింది. ఇజ్రాయిల్ ఆ నరమేధాన్ని మరువలేదు. ప్రపంచాన్ని మరిచిపోనివ్వలేదు. భారత్‌లో విదేశీ పాలకుల చేతిలో అంతకన్నా ఎక్కువ ఘోరం జరిగింది. కానీ భారతీయులు ‘రేపు బాగుంటే’ అదే పదివేలు అని జీవించారు. అదే ఇపుడు ఇక్కడి జాతీయతకు బలంగా, బలహీనతగా మారింది. దేశంలోని ప్రజలు ఇపుడున్న సంఘర్షణ మనస్తత్వాన్ని వదలి సామరస్య జీవనం చేయాలంటే భారతీయతను సాధించాలి. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఇక్కడి నాగరికతను గౌరవిస్తూ ఎవరి ఆరాధన వారు చేసుకోవచ్చు. అలా కాకుండా ‘హిందువులపై దాడులు కొనసాగిస్తాం’ అని భ్రమిస్తే మట్టికరిచిన రాజదండాన్ని ధర్మదండం తన భుజాలకెత్తుకోవడం ఖాయం.

మరోవైపు ‘ఈ దుఃఖాలనుండి నేర్వాల్సిన గుణపాఠం- నాగరికతా రక్షణకై ఎల్లవేళలా జాగరూకులై ఉండడమే’ అన్న విల్ డ్యూ రాంట్ మాటలు భవిష్యత్తును సూచిస్తున్నాయి. ఇపుడు హిందూ సమాజం సంఘర్షణలో వున్నా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఈ మథనం నుండి పుట్టిందే జాతీయవాద భావన. అది మరింతగా సుదృఢమయ్యేవరకు ఈ అంతర్గత వేదన తప్పదు. కానీ ఎన్నాళ్లీ వౌనరోదన అనేది ఇటీవల అంతర్గతంగా హిందూ సమాజాన్ని ఆవేదనకు గురిచేస్తున్నది. ఈ దమనకాండ హిందువుల స్వాతంత్య్రాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ అభద్రతను పోగొట్టే భావజాలాన్ని రక్షించుకోకపోతే మనకు మనం సమాధి కట్టుకోవడం ఖాయం.
****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి *
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి