ఆరోగ్యకారకుడైన సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే పుణ్యకాలం ‘ధనుర్మాసం’. రాత్రి సమయం దీర్ఘంగా ఉంటూ పగటి సమయం తక్కువగా ఉండే శీతాకాలం.. సాయం సంధ్య వేళ మొదలుకొని బ్రాహ్మీ ముహూర్తం వరకూ సాధనకు అనువైన మాసం. గోదాదేవి ఈ మాసంలోనే తన పూల అర్చనలతో, పాశురాలతో విష్ణువును అర్చించింది. ఆధునిక కాలంలో పరమపవిత్రమైన అయ్యప్పదీక్ష సింహభాగం ఈ మాసంలోనే చేస్తారు. ధనూరాశిలో రవి ఉండే ఈ కాలం సౌరమానరీత్యా ‘ధనుర్మాసం’గా పేరొందింది. ఈ రాశిలో మూల-పూర్వాషాఢ-ఉత్తరాషాఢ మొదటిపాదాల నక్షత్రాలు సంచరిస్తాయి. రవి దేహకారకుడు. మనిషి శరీరం, ఆరోగ్యంపై ఆయన ప్రభావం చూపిస్తాడు. పోషణ వస్తువులకు సూర్యుడే శక్తిగా మారతాడు. ధనస్సు రాశిలోని మూలా నక్షత్రం ప్రభావం వల్ల రవి సూక్ష్మతత్వం పొంది ప్రార్థన, పారాయణకు కారణభూతుడవుతాడు. మూల.. కేతు నక్షత్రం కావడం వల్ల మోక్షమార్గానికి దారిపడుతుంది. పూర్వాషాఢ శుక్రుని నక్షత్రం. ఉత్తమత్వాన్ని కలిగించే గ్రహం. అలాగే ఉత్తరాషాఢ సూర్య నక్షత్రం. ఈ మూడూ నిరుతి, విశ్వదేవ, బ్రహ్మ అధిదేవతలుగా కలిగిన నక్షత్రాలు. ఇవన్నీ మనిషి అంతర్ముఖుడు అయ్యేందుకు దోహదపడే కారకాలు. అయితే వీటిని నడిపించే ‘విష్ణుతత్వం’, ఈ మాసానికి మూలకేంద్రం.
 
విష్ణుతత్వ సాధనకు అనుగుణమైన వాతావరణం ఈ మాసంలో ఉండి, సాత్విక శక్తులకు దారిని ఏర్పరుస్తుంది. అందువల్ల ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధి’ అన్నట్లుగా దాని సాధనకు తగినట్లు ఆహార నియమాలను భారతీయ ధర్మ శాస్త్రాలు, ఆయుర్వేదం నిర్దేశించాయి. ఇది విష్ణుప్రీతికర మాసం అయినందున ప్రధానంగా విష్ణువు ఆరాధన ఉంటుంది. ఈ మాసంలో విష్ణు సహస్రనామ, భాగవత పారాయణం చేయడం మంచిది. ఇక.. ధనుర్మాసంలో స్త్రీలు ప్రభాతకాలంలో ముంగిళ్లలో కళ్లాపు జల్లి, ముగ్గులు తీర్చి, వాటి మధ్య ఆవుపేడతో చేసిన గొబ్బిళ్లు పెడతారు. తమిళ, కేరళ ప్రాంతాల్లో ఆచరించే కాత్యాయనీ వ్రతమే తెలుగు ప్రాంతంలో గొబ్బి పూజగా మారిందని చెప్తారు. ‘‘సుబ్బీ గొబ్బెమ్మా’.. అంటూ యువతులు గొబ్బి తట్టడం ఆచారం. ఈ గొబ్బిళ్లు భూగోళానికి ప్రతీకగా చెప్తారు. పసుపు రంగుల బీరపూల అలంకారం ప్రకృతికి సూచిక. మానవులకు సకల సదుపాయాలు కల్పించే భూదేవిని అర్చించేదే గొబ్బిపూజ. చుట్టూ తిరగడం అంటే భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడమే. అయితే ఈ ధనుర్మాసోత్సవాలు శైవ, వైష్ణవ భేదాలు లేకుండా అనాది నుండి నడుస్తున్నట్లు ఎందరో పరిశోధకులు తేల్చారు.
 
కాబట్టే శైవ, వైష్ణవ సంప్రదాయాల్లో కన్పించే అయ్యప్ప ఆరాధన, శివుని నిర్గుణతత్వం వైపు తీసుకెళ్లే శివరాత్రి ఆరాధనకు ఈ మాసంలోనే బీజం పడుతుంది. ముఖ్యంగా మార్గళివ్రతం ద్వారా గోదాదేవి ఈ మాసంలో ‘విష్ణుతత్వం’ చేపట్టి తన పాశురాల్తో స్వామిని మెప్పించి ఆయనలో ఐక్యం అయ్యింది.
 డాశ్రీశ్రీ పి.భాస్కరయోగి
(నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం)

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 16 - 12 - 2019 : సోమవారం*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి