‘‘విత్తనాన్ని భూమిలో నాటి దానికి మట్టి, గాలి, నీరు సరిగ్గా అందిస్తే ఆ విత్తనం మట్టిగా మారుతుందా? గాలిగా మారుతుందా!? నీరుగా మారుతుందా? కానే కాదు. అది మొక్క అవుతుంది. తన సొంత పెరుగుదల నియమం ఆధారంగా అది పెరుగుతుంది. గాలినీ, మట్టినీ, నీళ్లను తనలో కలిపేసుకొని, పదార్థంగా మార్చుకొని మొక్కగా ఎదుగుతుంది’’ అంటూ ఎదుగుదల ఎలా ఉండాలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు.
రెండు రోజుల్లో స్వామీజీ జయంతిని ‘జాతీయ యువదినోత్సవం’గా జరుపుకోబోతున్న సందర్భంలో యువకులంతా మననం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలు, అందులో పనిచేసే కొందరు ఆచార్యులు విత్తనాన్ని మట్టిగా మార్చాలనుకొంటున్నారు.
ఇంకొందరు మేధావులు ఈ విత్తనాన్ని నీరుగా మార్చాలని తీవ్ర యత్నం చేస్తున్నారు. కొన్ని ఎర్ర మెదళ్లు ఇదే విత్తనాన్ని గాలిగా మార్చాలని కుట్ర పన్నుతున్నారు. వాళ్లెవరూ ఈ మూడింటిని జీర్ణం చేసుకొని చెట్టుగా ఎదగమని చెప్పడంలేదు. కొందరికి కులాన్ని, ఇంకొందరికి వర్గ దృక్పథాన్ని, మరికొందరికి మతవాదాన్ని అంటగట్టి భారతీయుడిగా బతకనివ్వడం లేదు. యువకుల మనసుల్లో ఎర్ర విషాన్ని ఎక్కించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారు. దీనికంతా కారణం కాంగ్రెస్ - కమ్యూనిస్టుల చీకటి ఒప్పందాల చరిత్ర. అది ఈ రోజు కొత్తది కాదు. నెహ్రూ కాలం నుండి కొనసాగుతున్నది.
ఆగస్టు 1969లో జరిగిన రాష్టప్రతి ఎన్నికలో ఇందిరాగాంధీ ‘ఆత్మప్రబోధం’ ఓటు పేరుతో నీలం సంజీవరెడ్డిని ఓడించి నిమ్మతోటకు పరిమితం చేసి, వి.వి.గిరిగారిని గెలిపించింది. ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ ముక్కలైంది. దాంతో కమ్యూనిష్టులు ఇందిరకు మద్దతుగా నిలిచారు. ఆనాటి ప్రసిద్ధ కమ్యూనిస్టు కుమార మంగళం ఏకంగా కాబినెట్‌లోనే చేరాడు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వామక్షాలకు పట్టపగ్గాలేకుండా పోయాయి. ప్రభుత్వంలో తెరవెనుక ఉంటూ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లాంటి వాటిల్లో చొరబడ్డారు. భారత కార్య నిర్వహణ వ్యవహారాలను తమ చేతిలోకి తీసుకొన్నారు. అలా విద్యావిధానం అందించే ఎన్‌సిఈఆర్‌టిలో స్థానం ఆక్రమించారు.
సాహిత్యాన్ని నడిపించే కేంద్ర సాహిత్య అకాడమీని ఆక్రమించారు. అలాగే ఈ దేశ చరిత్రను నిర్మించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసిహెచ్‌ఆర్) దీనికంతా ముడిసరుకును అందించే ఓ విద్యా సంస్థ వాళ్లకు కావాల్సి వచ్చింది. దానికోసం మార్క్స్‌ను, మావోను, స్టాలిన్‌ను ఈ దేశ యువకుల బుర్రల్లోకి ఎక్కించేందుకు దేశ రాజధాని నడిబొడ్డున జవహర్‌లాల్ నెహ్రూ (జెఎన్‌యు) ‘మార్కిస్ట్ మదర్సా’గా ఆవిర్భవించింది. ఈ రోజుకూ ఈ సంస్థలన్నీ, ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ కమ్యూనిస్టుల ఆధిపత్యంలోనే ఉన్నాయి. ఇపుడు ఈ కమ్యూనిష్టులు మార్క్స్ సిద్ధాంతంకన్నా ‘షరియాబోల్ష్‌విక్’కు ఎలా ప్రాధాన్యం ఇస్తున్నారో గమనించవచ్చు.
కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలన్నీ ఎప్పుడూ అలజడిని, సంఘర్షణనూ కోరుకొంటాయి. వాళ్లకు ఈ దేశం ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు. ఇపుడు పౌరసత్వ సవరణ బిల్లు (సిఏఏ) చట్టంగా రాగానే ఈ దేశంలో అంతర్యుద్ధం సృష్టించి, దేశాన్ని ‘సివిల్ వార్’ వైపు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు ‘అఫ్జల్‌గురు’ను హీరోగా చిత్రీకరించింది వీళ్లే! కాశ్మీర్‌ను భారత్ నుండి విముక్తి చేయాలని కోరేదీ వీళ్లే! ఇపుడు పౌరసత్వ సవరణ చట్టంపై విశ్వవిద్యాలయాలను, ఇండియా గేట్‌ను, జంతర్‌మంతర్‌ను గందరగోళ పరుస్తున్నదీ వాళ్లే. జెఎన్‌యు, జామియా మిలియా, ఢిల్లీ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి వాటిని అశాంతితో రగిలిస్తున్నది ఈ ‘తుక్డే తుక్డే గ్యాంగే’! కన్హయ్య, షెల్హారశీద్, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్లు గతంలో చేసిన దేశద్రోహ నినాదాలు ప్రజలు గమనించారు కాబట్టే ఇపుడు ఇంకో క్రొత్త ముఖాన్ని వెలుగులోకి తెచ్చారు. జెఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా అవతారం ఎత్తిన ‘ఆయుషీఘోష్’ సరికొత్త వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది.
వాళ్లకు అండదండగా ఉండే ఎర్రదండు నాయకుడు సీతారాం ఏచూరి లాంటివారు, అమర్త్యసేన్ లాంటి అపర మేధావి, బర్ఖాదత్తా, రాజ్‌దీప్ సర్దేశాయ్ వంటి మీడియా వ్యక్తులు విపరీతమైన ప్రచారం కల్పిస్తారు. ఒక అర్బన్ నక్సల్స్ అంతా వాళ్లకు బాకాలు ఊదుతూ వ్యాసాలు గుప్పిస్తారు. వాళ్ల లక్ష్యం ఈ దేశంలో ‘జాతీయవాదం’ లేకుండా చేయడమే. తల్లిదండ్రులు అనేక కష్టాలకోర్చి తమ పిల్లలను చదువుకోవాలని విశ్వవిద్యాలయాలకు పంపిస్తే ఈ గ్యాంగంతా ఆ పిల్లల మెదళ్లలో విషం ఎక్కిస్తుంది.
దేశంలోని ఏ ఐఐటి సంస్థల్లో జరగని నిరసనలు అలజడి ఈ విశ్వవిద్యాలయాల్లో ఎప్పుడూ జరుగుతుంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్లకు ఫండింగ్ చేస్తాయి. అలాగే అంతర్జాతీయ నిధలను విరాళాలుగా ఈ గ్యాంగ్ కొట్టేసి, దేశంలో అగ్గిరాజేస్తూ ఉంటుంది. 2014 నుండి ఈ గ్యాంగ్‌ను వెనుకనుండి నడిపిస్తున్నది అర్బన్ నక్సల్సే. ఇటీవల జాదవ్‌పూర్ యూనివర్సిటీ కూడా ఎర్రదండు కార్యకలాపాలకు వేదికగా మారింది. సరికొత్త పౌర యుద్ధాన్ని సృష్టించి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయడమే వీరి పని. చైనా జిన్‌పింగ్‌ను, కొరియా ‘కిమ్’ను హీరోలుగా పూజించేవాళ్లు ఈ దేశంలో స్వేచ్ఛ ఎక్కువై ‘ఆజాదీ’ అంటూ గగ్గోలు పెడతారు.
దేశాన్ని ముక్కలు చేసేంత ‘స్వేచ్ఛ’ వీళ్లకు కావాలి. అవార్డు వాపసీ, మాబ్‌లిచింగ్, ఘర్‌వాపసీపై దుష్ప్రచారం, రాఫెల్, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి, రామమందిరం- ఇలా అన్ని విషయాల్లో వాళ్లు ఫెయిల్ అయ్యారు. ఇపుడు పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోవాలంటూ ముస్లింలలో కొన్ని వర్గాలను ముందు పెట్టి, వెనుకనుండి నిప్పు పెడుతున్నారు. వాళ్లు ఏ సభ పెట్టినా ‘వేదికమీద ఉన్న వాళ్లు ఎక్కువ; క్రింద వున్నవాళ్లు తక్కువ’ అన్నట్లు సాగుతుంటాయి.
కాబట్టి ముస్లిం రాజకీయ గుంపు వెనకేసుకుంటే సభలు నిండుతాయి. ర్యాలీలు సాగుతాయి అనుకుంటున్నారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో ఉడుకు రక్తం ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టి గొప్ప ర్యాలీలు తీస్తున్నామని మురిసిపోతున్నారు. గతంలో కన్నా విజ్ఞతతో వున్న ‘హిందూ సమాజం’ నిశ్శబ్దంగా ఏకమవుతున్న సంగతి వాళ్లు మరిచిపోతున్నారు. ఈ కుట్ర వెనుక ఇపుడు అర్బన్ నక్సల్స్ చైతన్యవంతంగా ఉన్నారు.
విద్యార్థులకు చదువునందించాల్సిన విశ్వవిద్యాలయాలు దేశ వ్యతిరేక శక్తులను సృష్టించే కర్మాగారాలుగా మారడం ఆందోళనకరం. 11 ఏప్రిల్ 2010 ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం జెఎన్‌యులోని వామపక్ష విద్యార్థి సంఘాలు ఛత్తీస్‌ఘ్ఢ్‌లో నక్సలైట్ల చేతిలో మరణించిన 76 మంది వీరజవానుల మరణాన్ని ఉత్సవంగా జరుపుకొని ‘్భరత్ ముర్దాబాద్ మావోవాద్ జిందాబాద్’ అనడం మనం చూసాం. ఇంతకన్నా సాక్ష్యం అక్కర్లేదు. కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు ఈ అర్బన్ నక్సల్స్ వెంట నడిస్తే ముస్లిం సమాజం క్రెడిబులిటీ తగ్గిపోవడం తథ్యం.
************************** *******
*✍✍ శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*✍✍ శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి