ఒకప్పుడు మనదేశంలో ‘గామా’ అనే మల్లయోధుడు ఉండేవాడు. భారతీయ శైలి మల్లయుద్ధంలో అతడు ప్రపంచ విజేత. కానీ అతడు నలభై ఏళ్ల వయసునే మరణించాడు. అవసరానికి మించి వ్యాయామం చేయడం వల్లనే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. మాంసంతో తయారైన శరీరాన్ని ఉక్కుతో తయారైందని అతడు భావించాడు. తన విజయానికి శృతిమించి శరీరాన్ని బాధపెట్టాడు.
ఈ పరిణామాల్లో తనను తానే చంపుకున్నాడు. ఇపుడు చంద్రబాబు అమరావతి గురించి చేస్తున్న గందరగోళం చూస్తుంటే ఈ ‘గామా పహిల్వాన్’ గుర్తొస్తున్నాడు. 2018 ఫిబ్రవరి నుండే చంద్రబాబు నెత్తిన ఏలిన నాటి శని కూర్చొన్నాడని అనిపిస్తుంది. ప్రతిదాన్ని అతిగా చేయడం, తర్వాత ఆయన బాధపడడం తప్ప ఇంకేం సాధించడం లేదు. చంద్రబాబును బాగా చదివినవాళ్లలో వైఎస్, కేసీఆర్ పరీక్షలు కూడా పాసయ్యారు. తాజాగా మోదీ, అమిత్‌షా, జగన్ కూడా చదివేసినట్టే కన్పిస్తూ ఉంది. అందులో జగన్ ప్రత్యేక తరగతుల కోసం ‘కేసీఆర్ స్కూల్లో’ కూడా చేరాడు. దాని పరిణామాల్లో భాగమే అమరావతిలో గందరగోళం.
ప్రాచీన కాలంలో శాతవాహనులతో సంబంధం ఉన్నదీ, బౌద్ధంతో ముడివేసుకొన్నదీ అమరావతి. అక్కడి అమరారామం పంచారామాల్లో ఒకటి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీ.శ. 1790 ప్రాంతంలో తన జమిందారీ ఎస్టేట్‌కు ముఖ్యకేంద్రంగా పెట్టుకొన్నాడు. అంతేగాకుండా 2006 జనవరిలో ఇక్కడ కాలచక్ర మహాసమ్మేళనం కూడా జరిగింది. దేశవిదేశాలనుండి బౌద్ధ ప్రముఖులు ఇక్కడకు వచ్చారు.
ఇక్కడ అమరావతి స్థూపం కూడా ప్రసిద్ధం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు బౌద్ధ దేశాలనుండి పెట్టుబడులు ఆకర్షించాలని, ఇక్కడి దళితుల్లో బౌద్ధం పట్ల వున్న ప్రేమను రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవాలని బాబు ఈ ప్రాంతం ఎన్నుకోవడం ఓ సత్యం. వైయస్సార్ సీపీ ఆరోపించినట్లుగా తన వాళ్లతో భూములు కొనిపిచ్చి దానిచుట్టూ రాజధాని అనే వల అల్లాడని, అందుకే శివరామకృష్ణ కమిటీ నివేదిక త్రొక్కిపెట్టారని, అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి ఆశ్రీత పక్షపాతం ఉందని మరో ఆరోపణ. భుజాన కండువా వేసుకొని ‘తెలుగువారు - దక్షిణాదివారు’ అనే జస్టిస్ పార్టీ మేధావి బ్యాచ్ చేసే హడావుడి ఇంకాస్త అనుమానాలకు తావు ఇచ్చింది.
జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు మానసికంగా దెబ్బకొట్టే పని నిర్విఘ్నంగా చేస్తున్నాడు. బొత్స సత్యనారాయణతో మంట పెట్టించి ‘రాజధానులు మూడు’ అనేసరికి చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నాడు. నిజానికి భౌగోళికంగా పొడవుగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం వుంది. అనంతపూర్, కర్నూల్, శ్రీకాకుళం వంటి జిల్లాలు పాత మహబూబ్‌నగర్ జిల్లాల కన్నా ఘోరంగా ఉన్నాయి. అమరావతిలోని రైతులకు నష్టం జరిగితే వాళ్లకు ఏం చేయాలో సంయమనంతో ఆలోచించాల్సిన పార్టీలు, వారిని మరింత రెచ్చగొడుతున్నాయి. 29 గ్రామాలకు ప్రజల సమస్యను జగన్ కూడా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
సరిగ్గా తెలంగాణ విషయంలో చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలే ప్రదర్శించి బోల్తాపడ్డాడు. అంతెందుకు! 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాగే హద్దులు మీరిన విమర్శలు చంద్రశేఖరరావుపై చేసి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా దోహదపడ్డాడు. ఆ తర్వాత మోదీ, షాలపై వ్యక్తిగతంగా కక్ష్యగట్టి లేని శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు. ఇపుడు రాజధాని విషయంలో చేస్తున్న ‘అతి’ చంద్రబాబుకే నష్టం కలిగిస్తుంది. ఇపుడు విశాఖపట్నం (ఉత్తరాంధ్ర) కర్నూలు (రాయలసీమ) ప్రజలు కొంత ఆనందంగా ఉన్నారు. మీరు అమరావతిలో రెచ్చిపోయినట్లు వాళ్లూ రెచ్చిపోతే తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కేసీఆర్ సిలబస్‌నే జగన్ అనుసరిస్తున్నట్లు అనిపిస్తున్నది.
ఈ ఆందోళనకు కారకుడుగా బాబును చూపించి, అమరావతిలోనే రాజధాని పెట్టి, మిగతా ప్రాంతాల ప్రజలను తెలుగుదేశానికి వ్యతిరేకంగా మలచడమే దీర్ఘకాలిక వ్యూహంగా ఉన్నట్లుంది. గతంలో తెలంగాణ ఉద్యమం విషయంలో బాబును రాజకీయంగా కేసీఆర్ ఇలాగే దెబ్బకొట్టారు. ఇవేవీ గమనించకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మరో నష్టం ఖాయం.
ఇక ఈ గేమ్‌లోకి బీజేపీ ఎందుకు ఎంటరయ్యిందో వాళ్లకే తెలీదు. ‘‘ఎల్లమ్మ గుడి కాడ మొల్లాయన శిగం ఊగినట్లు’’ అనేది తెలంగాణలో ప్రసిద్ధ సామెత. ఎల్లమ్మ గుడిముందు వౌల్వీ పూనకం అనేది దీని అర్థం. కన్నా, సుజనా వంటివారి అనవసర జోక్యం పార్టీకి నష్టమేగానీ లాభం లేదు. అసలే అంతంతమాత్రంగా వున్న పార్టీకి చంద్రబాబు అధికారంలో లేని సమయంలో జవసత్వాలు నింపుకోకుండా ఇందులో దూరడం అవివేకం తప్ప ఇంకేం కాదు.
కుల రాజకీయం కంపుగొట్టే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సునీల్ దేవధర్ తప్పటుడుగులు వేస్తున్నట్లుగా ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు వంటి కరడుగట్టిన భాజపా నాయకులను వదిలిపెట్టి కన్నాను ముందుపెట్టడం ఇపుడు ఇంకో తప్పే అవుతుంది. కన్నా తన ప్రాంతాభిమానంతో రాజధాని విషయంలో చేసే తప్పు రేపు పార్టీని దీర్ఘకాలంలో నష్టం కలిగిస్తుంది. చంద్రబాబు ప్రయోగించిన పవన్‌కళ్యాణ్‌తో కలిసి నడవడం భాజపాకు శరాఘాతం. అభివృద్ధి నిరోధకులు, ఆంధ్రా కుల పక్షపాతులైన కమ్యూనిస్టులతో అంతర్గతంగా పవన్ కల్యాణ్‌కు సంబంధాలున్నాయి.
భగత్‌సింగ్‌ను, అల్లూరి సీతారామరాజులను బొందపెట్టి చేగువేరాను తలపై మోసే పవన్‌కళ్యాణ్‌తో సిద్ధాంతపరంగా భాజపా ఎలా సాగుతుంది? తాట తీస్తా.. తోలు తీస్తా అనే మాటలు, చపలత్వంతో, చంచలత్వంతో మాట్లాడే పవన్‌కు అసలు రాజకీయం వచ్చా? ఇక కమ్యూనిస్టులు ఎక్కడుంటే అక్కడ అన్యాయమే అని గుర్తుంచుకోవాలి.
వారు ధర్నాలు చేస్తున్నారంటే అందులో తప్పక ‘అధర్మం’ వుందని గుడ్డిగా చెప్పేయవచ్చు. ఇంత అన్యాయాలకు, స్వార్థాలకు కారణమైన వ్యవస్థకు మద్దతిచ్చే ‘ఎల్లో మీడియా’ అతినీ ప్రజలు గుర్తించాలి. 1300 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణం కోల్పోయినా రాష్ట్రం ప్రకటించకుండా, కేవలం తమ రాజకీయ స్వార్థంతో హడావుడిగా, ప్రణాళిక లేకుండా విభజన చేసిన కాంగ్రెస్ పార్టీలోని తులసిరెడ్డి, రఘువీరారెడ్డి అవశేషాలుగా మిగిలారు.
ఇదంతా జగన్ ఆడుతున్న మైండ్ గేమ్. ఇందులో అన్ని పాత్రలూ ఎంటరయ్యాయి. చంద్రబాబు తనకున్న భయాన్ని కప్పిపుచ్చుకొనేందుకు భాజపాతో సహా అందరినీ ఇందులోకి లాగాడు. ప్రజాస్వామ్యంలో పాలన- ప్రతిపక్షాలు కలిసి పనిచేసే సూత్రాన్ని ఈ నాయకులు ఎప్పుడో విస్మరించారు. గతంలో ఈ పార్టీలే జీవో 133 ద్వారా కమిటీ ఏర్పాటుచేశారు. 29,754 మంది రైతుల 33,771 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ క్రింద సేకరించారు. దానికితోడు 19,876 ఎకరాల ప్రభుత్వ భూమినీ కలిపారు. అన్ని పార్టీలు ఆమోదం తెలిపారు.
సీట్లు మారగానే సీన్ మార్చేస్తున్నారు. ఇందులోకి చంద్రబాబు ఎవరు వద్దన్నా వెళ్తాడు. కానీ ఇతర పార్టీలు వెళ్లడం దురన్యాయం మాత్రమే. స్వయంకృతాపరాధం. ముఖ్యంగా భాజపా ఈ ఆటకు ఎంత దూరం వుంటే అంత మంచిది. చంద్రబాబు మూలాలపై దెబ్బకొట్టే పని జగన్ తెలివిగా చేస్తున్నాడు. ఆ ట్రాప్‌లోకి అందరూ వెళ్లారు. ఇదంతా జగన్-చంద్రబాబు రాజకీయ కైలాస పటంలోని వికృత క్రీడ. ఇది అర్థం చేసుకోకుండా పార్టీలతోపాటు ప్రజలూ దిగితే మన గోతి మనం త్రవ్వుకోవడమే.
************************** *******
*✍✍ శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*✍✍ శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి