సాంఘిక ఆచారంగా నలుగురినీ కలిపేందుకు ఆవిర్భవించిన కులం ఇప్పుడు కులతత్వంగా మారి సమస్తాన్నీ ఆవరించింది. ఆదిశంకరుడిని చండాలుడు ఆత్మజ్ఞానంపై ప్రశ్నలు వేసిన తర్వాత.. శంకరులు అతడి ముందు సాగిలపడి ‘చండాలోపి మమగురు’ అన్నారు. వెయ్యేళ్ల క్రితమే శ్రీమద్రామానుజులు తిరుకోష్ఠియారు దేవాలయంపైకెక్కి అందరికీ అష్టాక్షరిని ప్రబోధించారు. ఎనిమిదివందల ఏళ్ల క్రితమే తన అనుభవ మంటపం అనే చట్ట సభల్లో అన్ని కులాల వారికి లింగభేదం లేకుండా అవకాశం కల్పించి బసవేశ్వరుడు సంస్కరణకు స్వీకారంచుట్టారు. ఈ రోజు తిరుపతి సహా ఏ వైష్ణవ దేవాలయానికి వెళ్లినా పన్నిద్దరు ఆళ్వార్ల విగ్రహాలుంటాయి. వారిలో అన్ని కులాల వారూ ఉన్న విషయం ఎందరికి తెలుసు.
 
భక్తి మాత్రమే ప్రధానమని మధ్యయుగం తర్వాత ఎందరో దాస భక్తులు గొప్ప మహాత్ములుగా అవతరించారు.అన్నాజయ్య, కక్కయ్య, గోవిందమాంబ, సిద్ధప్పలకు పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆత్మజ్ఞాన ప్రబోధం చేశారు. ఇందులో అన్ని వర్గాల సమత పాటించారాయన. ‘బ్రహ్మమొక్కటే’ అని అన్నమయ్య చేసిన సంకీర్తన ఆయన 32 వేల కీర్తనల అగ్ర భాగంలో నిలబడింది. కనకదాసు, చొఖ్ఖమేళా, గోరకుంభార్‌, మీరాబాయి, వేమన, నర్సీమెహతా, నామ్‌దేవ్‌, సంత్‌రవిదాస్‌, నందనార్‌, అల్లమ ప్రభు, నారాయణ గురు వంటి మహానుభావులు కులతత్వం వద్దని ఆచరించి చూపారు. దయానంద, వివేకానంద వంటి ఆధునిక తత్వవేత్తలు కులతత్వాన్ని తీవ్రంగా నిరసించారు. మన పెద్దలు రాసిన ఎన్నో గ్రంథాలు కులం కుళ్లును వదలమన్నాయి. మహాభారతంలో యక్షప్రశ్నల సందర్భంగా కూడా కులప్రస్తావన వస్తుంది.
 
శృణు యక్ష! కులం తాత! న స్వాధ్యాయో న చ శ్రుతం
కారణం హి ద్విజత్వేచ వృత్తమేవ నసంశయః

ఓ యక్షుడా! ఓ తండ్రీ! కులం వేదాధ్యయనం వల్ల గానీ, శాస్ర్తాలు శ్రవణం చేయడం వల్లగానీ కలుగదు. గుణం వల్లనే సంప్రాప్తిస్తుంది అని ధర్మరాజు యక్షుడికి తెలిపాడు. ఈ విషయాన్ని తెలుసుకోలేనివారు భగవంతుని సృష్టిలో లేని భేదభావాన్ని పెంచిపోషిస్తున్నారు. అందుకే ‘ఎక్కువని విర్రవీగే వ్యక్తులు ఒక మెట్టు క్రిందకు దిగాలి; తక్కువని ఆత్మన్యూనతతో బాధపడేవారు ఓ మెట్టుపైకి ఎక్కాలి’ అని స్వామి వివేకానంద చెప్పారు. ఏ సమాజమైనా ఉత్తమ గుణాలనే స్వీకరించి, వాటినే స్థిరీకరించుకుంటుంది. ఎక్కడ ఎన్ని ధర్మాలు చెప్పినా, అవి ఇతరుల మనసుకు బాధ కలిగిస్తే లేదా ఇతరుల జ్ఞానాన్ని హరిస్తే ఆ ధర్మాలు ఎక్కువ కాలం నిలువవు. అందరినీ సమభావంతో అవలోకించే మహాత్ములు ఏ కులంలో పుట్టినా అందరినీ ప్రేమించారు. తోటలో రంగురంగుల పూలున్నా తోటమాలికి వాటిపైన ఉండే ప్రేమలో భేదం ఉండదు. అలాగే మహానుభావులు అన్ని కులాల వారినీ శిష్యులుగా స్వీకరించి ధర్మోపదేశం చేసిన విషయాన్ని గ్రహించిన రోజునే మనం ఈ భేద భావం వదిలేస్తాం.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
*17- 06 - 2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి