ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ- ‘‘మనం ఎన్నో క్రిమికీటకాలను చంపుతున్నాం కదా! దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అన్నాడట. ‘‘యుద్ధాల పేరుతో సాటి మనిషిని చంపేవారు ఇంత సున్నితంగా ఎలా ఆలోచించగలుగుతారు? స్వయంగా మీరే ఆ పని చేయకున్నా, అలాంటి చర్యలకు అనేక విధాలా సహకరించే మీరు క్రిమికీటకాల గురించి ఎంత బాధపడిపోతున్నారండీ? ఏం ప్రశ్నలు వేస్తారండీ బాబూ?’’ అంటూ ముఖం మీద కొట్టినట్లు చెప్పారట.

అలాంటి అమాం బాపతు గ్యాంగ్ మళ్లీ కూనిరాగాలు తీయడం మొదలుపెట్టింది. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం తర్వాత రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం, మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ శరణుజొచ్చడం, చక్రం తిప్పే చంద్రబాబు చతికిలపడడం, వామపక్షాల ఎడతెగని పోరాటం, సమాజ్‌వాదీ పార్టీకి ఆయువు పట్టయిన ఆజం ఖాన్‌పై 27 కేసులు నమోదు కావడం, మాయావతి బంధువుల ఆర్థిక మూలాలపై దెబ్బపడడం.. ఇలా ప్రతిపక్షాలు తలోదారిలో- దిక్కుతోచకుండా ఉన్న తరుణంలో మేధావులు, కళాకారుల పేరుతో ‘అసహనం-2’ నాటకానికి మళ్లీ తెరలేచింది. 

ఎన్టీయే-1 అధికారంలో ఉన్నపుడు అవార్డులు వాపసు ఇచ్చినట్లే ఇపుడు కళాకారులు, మేధావులు, సామాజిక కార్యకర్తల పేరుతో 49 మంది ప్రముఖుల పేరుతో ప్రధానికి ఓ లేఖ రాశారు. ఆ లేఖరాసిన వాళ్ళల్లో అనురాగ్ కశ్యప్, శుభా ముద్గల్, కేతన్ మెహతా, అపర్ణా సేన్, మణిరత్నం, వినాయక్ సేన్, రామచంద్ర గుహ, కొంకణ్ సేన్ శర్మ, ఆదూర్ గోపాలకృష్ణన్, శ్యాం బెనగల్, ఆశిష్ నంది, నటి రేవతి మొదలైనవారు ఉన్నారు.

‘ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2016లో దళితులకు వ్యతిరేకంగా 840 ఘటనలు జరిగాయని, 2009-2018 మధ్య 254 ఘటనలు జరిగితే, 2014 మే తర్వాత ఇందులో 90 శాతం జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 2009 నుండి 2018 వరకూ మతం పేరుతో 62 శాతం ముస్లింలపై దాడి జరిగిందని, ‘జై శ్రీరామ్’ ఓ అరాచక నినాదంగా మారిందని, ఇంత జరుగుతున్నా మోదీ నిష్క్రియగా ఉన్నారన్నది లేఖలోని సారాంశం. అయితే 2019 ఎన్నికలలో మోదీ ఘన విజయాన్ని జీర్ణించుకోలేని ఈ మేధావులు జూన్ నుండే ఇలాంటి కుత్సిత వ్యాఖ్యానాలకు తెరతీశారు.

బెంగాల్‌లో జాతీయ భావాలను అణచివేసినా ఏనాడూ నోరు విప్పని తిరోగమన ఆర్థికవేత్త అమర్త్య సేన్- ‘బెంగాల్‌లో జైశ్రీరాం నినాదానికి చోటులేద’న్నాడు. వీళ్ళు దేశంలో భావస్వేచ్ఛను రక్షించే ‘టేకేదార్లు’. అలాగే ఓ వారం కిందట సంగీత నాటక అకాడమీ కన్నడ నాటక ప్రయోక్త అయిన ఎస్.రఘునందన్‌కు అవార్డు ప్రకటిస్తే ‘ఈ అసహనం దేశానికి అపకారం’ అంటూ దాన్ని తిరస్కరించారు. ‘‘నా దేశంలోని ధర్మపరులకు ఇలా అన్యాయం జరుగుతున్నపుడు సంగీత నాటక అవార్డును నేను అంగీకరించలేనని అన్నాడు. ఆయన ఇంకో అడుగు ముందుకు వేసి మేధావులు, సామాజిక కార్యకర్తలు జైళ్ళల్లో మగ్గిపోతున్నారంటూ తెగ బాధపడిపోయాడు. ఆయన ఎవరి గురించి బాధపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రధానికి లేఖ రాసినవాళ్ళలో అపర్ణా సేన్ ‘శారదా చిట్‌ఫండ్’ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిధిలో విచారణ ఎదుర్కొన్న వ్యక్తి. సామాజిక కార్యకర్తలుగా, మేధావులుగా, టీవీ చర్చల్లో విశే్లషకులుగా చలామణి అయ్యేవాళ్లలో అర్బన్ నక్సల్సే ఎక్కువ. అలాంటి కేసులో అరెస్టు అయి 15 ఏప్రిల్ 2011నుండి సుప్రీం కోర్టు బెయిల్‌పై వున్న వినాయక్ సేన్ ఒకరు. ఇతను యూపీఏ అధికారంలో వున్నపుడే మావోయిస్టుల మేధావిగా అరెస్టు చేయబడ్డాడు. ఈ మహామేధావి ఇపుడు సామాజిక కార్యకర్త పేరుతో ఈ లేఖపై సంతకం చేశాడు. వీళ్లంతా కలిసి ఈ దేశంలోని హిందువులను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నిష్క్రియాపరత్వానికి జీవం పోస్తున్నారు. దళితులపై, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇపుడే కాదు ఎప్పుడైనా ఎవరూ ఎవరిమీదా దాడి చేయరాదు. అదికాకుండా మతపరంగా ఐక్యతగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్‌కు ప్రయత్నం చేస్తున్నారు.

గత కొనే్నళ్లుగా ముస్లింలకు దళితులను జతచేయడం వెనుక వున్న రహస్యాలను ఛేదించాలి. ‘జై మీమ్ జై భీమ్’ అనే నినాదాన్ని మజ్లిస్ ఎంపీ ఓవైసీ పార్లమెంటులో అనకముందునుండే దేశంలో ఓ ప్రయత్నం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఓ వర్గం వారిపై స్థానిక పరిస్థితుల ఆధారంగా జరిగే ప్రతిఘటనకు మతం రంగు పులుముతున్నారు. అఖ్లాఖ్ హత్య, పెహలూఖాన్ వంటి వారిపై జరిగే హత్యల గురించి దేశమంతా అందరికీ తెలుస్తుంది. కానీ వినాయక్ ప్రకాశ్, రవి పూజారి, వరంగల్ సత్యనారాయణ పూజారి, చందన్ గుప్తా, రూప్‌త్యాగి, బిర్జు మాదిగ వంటి హిందువుల హత్యలు మీడియాకు, పోలీసులకు, ఈ మేధావులకు ఎందుకు పట్టదన్నదే ఇపుడు ఉదయిస్తున్న ప్రశ్న!

అనుమానాస్పదంగా మరణించిన బిర్జు మాదిగ, ప్రతాప్‌గఢ్‌లో చంపబడిన వినాయక్ ప్రకాశ్ దళితులన్న విషయం ఈ గ్యాంగ్‌లో ఎవరికి తెలుసు? వీళ్లను ఎవరు చంపారో చెప్పగలరా? ఇదేనా ‘జై భీం జై మీమ్’కు అర్థం. వాళ్ల హత్యల ప్రస్తావన వచ్చినపుడు రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ ఎందుకు ప్రశ్నించాడు? పార్లమెంటులో ఓవైసీ ఎందుకు వకాల్తా పుచ్చుకోడు? రామచంద్ర గుహ ఎందుకు చరిత్రతో జోడించి చెప్పడు? భావస్వేచ్ఛ, మాబ్ అంచింగ్ అంటూ దుష్ప్రచారం చేసేవాళ్లు తమను తాము గొప్ప సెక్యులరిస్టులుగా భావిస్తారు. 

వాళ్ల రచనల్లో హిందుత్వకు, జాతీయవాదానికి ఎందుకు స్థానం ఉండదు? ఇందులో కొందరిది చీప్ పాపులారిటీ కూడా ఓ ఎత్తుగడ. వాళ్లకు అవార్డులిస్తే ఎవరు పట్టించుకుంటారు? దాన్ని వాపస్ ఇస్తూ, నరేంద్ర మోదీని తిడితే అది దేశ వ్యాప్త ప్రచారం అవుతుంది. వారి భావస్వేచ్చ ప్రకారం ఆజం ఖాన్ ఎన్ని భూ ఆక్రమణలు చేసినా ఏమీ అనరాదు. అదీ పేద ముస్లిం రైతులను మోసం చేసినా సరే. జవహర్ యూనివర్సిటీ-రాంపూర్ విషయంలోనే రైతులు ఆజంఖాన్‌పై గవర్నర్ రాంలాల్‌కు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా అతనిపై కేసులు నమోదయ్యాయి. ఇపుడు ఆజంఖాన్‌పై చట్టం చర్యలు తీసుకుంటే అది ముస్లింలపై దాడిగా, మాయావతి సమీప బంధువుల అక్రమాస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంటే దానిని దళితులపై దాడిగా చిత్రీకరిస్తారు. రాహుల్, సోనియాలు నేషనల్ హెరాల్డ్ కేసుల్లో బెయిల్‌పై ఉంటే దానిని సెక్యులరిజంపై దాడిగా అభివర్ణిస్తారు. ఆరోపణలపై జైల్లో వున్న వరవరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిబాబా నిర్బంధాన్ని భావస్వేచ్ఛకు సంకెళ్ళుగా చెప్పే ‘ఎర్ర’మెదళ్లను ఎవడు బాగుచేయాలి?

తెలుగునాట ఈ మేధావులు ఓ కొత్త స్టంట్‌కు తెరలేపారు. ఎవరు అవునన్నా కాదన్నా వారు అవార్డులు దక్కించుకుంటూనే ఉన్నారు. కేంద్రం ఆధారంగా నడిచే సంస్థల్లో పదవులు పొందుతూనే ఉన్నారు. కరడుగట్టిన కమ్యూనిస్టులు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చుట్టూ తిరుగుతూ తమ ప్రాపకం నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గోరాశాస్ర్తి శత జయంతి వేడుకే అందుకు ఉదాహరణ. జాతీయవాదాన్ని నిండుగా గర్భీకరించుకున్న ఉపరాష్ట్రపతి కి అందరూ ఒక్కటే. కానీ ఈ అవకాశవాద విజ్ఞులు ఆయనను కేంద్రంగా చేసుకొని తమ పేరు నిలబెట్టుకుంటున్నారు.

 వాళ్లే అవసరమైతే ఈ పేరును వాపస్ చేసి తమ నిరసన తెలియజేస్తారు. అందుకే ఈ దేశంలో డెబ్బై ఏళ్ళనుండి జాతీయవాదులకు జరిగిన అన్యాయం అంత ఇంతా కాదు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం, జాతీయవాద సంస్థలు- ‘సూడో సెక్యులర్, అవార్డు వాపస్ గ్యాంగ్’లకు పదవులు, పురస్కారాలు ఇవ్వడం మానుకోవాలి. ఈ దేశంలోని కొంతమంది జాతీయవాదులనైనా గుర్తించాలి. ఎందుకంటే భవిష్యత్తులో వా పసు ఇవ్వడానికైనా అవార్డు ఉండాలి కదా! లేకపోతే సూడో సెక్యులర్ మేధావులు జాతీయవాదాన్ని సహించరు. ప్రజల్లో పెరుగుతున్న జాతీయభావాన్ని జీర్ణించుకోలేక ఒక మతాన్ని టార్గెట్ చేసిన శక్తులు, విదేశీ శక్తుల ప్రోత్సాహంతో కుట్రలు చేస్తున్నాయి. ఇపుడు దేశంలో అందరికీ భావస్వేచ్ఛ ఉంది- ఒక్క హిందువులకు తప్ప.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి