ఓ కపట భక్తుడు తిరుమలలో స్వామిని ప్రార్ధిస్తూ.. ‘‘వచ్చే ఏడాదిలోగా ఉచితంగా ఇల్లు లభిస్తే.. ఆ ఇంటిని అమ్మగా వచ్చిన ధనమంతా హుండీలో వేస్తా’’ అని వేడుకున్నాడట. వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో అతడి కోరిక సిద్ధించింది. అయితే.. ఆ కపట భక్తుడు ఇంటి ధరను రూపాయిగా.. తాను పెంచుకున్న పిల్లి ధరను ముప్ఫైలక్షలుగా నిర్ణయించి, రెంటినీ కలిపి అమ్మేస్తానని బేరం పెట్టాడు. ఇల్లు అమ్ముడుపోయాక.. ఒక రూపాయిని హుండీలో వేశాడు. ఆపద సమయాల్లో భక్తుల మనస్తత్వానికి ఈ చిన్న కథ అద్దం పట్టినా.. దాని వెనక ఎన్నో ఆలోచనలున్నాయి.


‘‘బూటకుండు శివపూజ చేసిన బుద్ధిమంతుడగునా
కాడిగట్టి ఘనకళ్లెము చేసినా గాడ్దె గుర్రమగునా
మనసు నిల్వకను భజన చేసినా మనిషి భక్తుడగునా
కనక పర్వతమునెక్కి కూసినా కాకి కోకిలగునా’’
అంటాడు సంకీర్తన కవి వేపూరు హనుమద్దాసు. అపరితమైన ఆశతో.. మనసునిండా విషం నింపుకొని చేసే సాధన, పూజ, భక్తి, ఆరాధన అన్నీ వృథాప్రయాసే. పాము సగం మింగిన కప్ప కూడా.. తన ముందు నుంచి వెళ్లే పురుగును మింగేందుకు ప్రయత్నించినట్లుంటుంది మన ప్రయత్నం. అందుకే.. సంపదలు, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, శత్రువుల మీద పైచేయి.. ఇలా అన్ని విజయాలు మనకే దక్కాలని దేవుళ్లను ప్రార్థిస్తుంటాం. మన కోరికలు నెరవేరగానే.. దేవుడిని విస్మరిస్తాం. విజయాలను మన ఖాతాలో వేసుకుని, ఆపదలను దేవుడిపైకి నెట్టేస్తాం. బాల్యావస్థలో మహాత్ములు జీవిస్తారంటారు. చిన్నపిల్లలను జననమరణాలు.. సుఖదుఃఖాలు కదిలించవు. అలా జీవించడం సాధ్యం కానివారంతా.. రోజూ ఆపద మొక్కులతో దేవుళ్లను బిజీ చేసేస్తారు. జలుబు తగ్గాలని.. ఆలస్యంగా వెళ్లినా బస్సు మిస్సవ్వకూడదనే చిన్నచిన్న కోర్కెలకు దేవుడు లేడని గుర్తించాలి. అర్థంపర్థం లేని కోరికల చిట్టాలను దేవుడి ముందు పెట్టడానికి గుడికి వెళ్లడం.. ఏదో కార్యాలయానికి వెళ్లినట్లుంటుందే తప్ప.. దేవాలయానికి కాదు.
‘‘అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనమ్‌
దేహాంతేన తవసాయుజ్యం దేహిమే పార్వతీపతే’’

‘‘ఓ పార్వతీ వల్లభా! దైన్యంలేని జీవితాన్ని, అనాయాస మరణాన్ని, ఆ తర్వాత నీలో సాయుజ్యాన్ని నాకు అనుగ్రహింపు’’ అని వేడుకోవాలే తప్ప.. రోజూ అనేక మొక్కులు మొక్కి.. అవి సిద్ధించగానే దేవుడిని మరవడం అజ్ఞానం. ‘ఆపద మొక్కులు సంపద మరుపులు’ అన్న అజ్ఞానంలో ఉండడం తగదు.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
*01- 07 - 2019 : సోమవారం*కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి