ఈ దేశంలో గత డెబ్బయి ఏళ్ళ నుండి ‘లెఫ్ట్ లిబరల్ మీడియా’ ప్రజల మేధస్సును పాలిస్తోంది. వాళ్ళు చెప్పిందే వార్త. కానీ నేడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, సోషల్ మీడియా అవతారం విస్తృతంగా, విశృంఖలంగా కొనసాగుతున్నది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్.. వంటివి ఇపుడు జనం చేతిలోకి వెళ్లాయి. గతంలో గొప్ప జర్నలిస్టులుగా ‘తాతాచార్ల ముద్ర’ వేసుకొన్న కొందరు మేధావుల అభిప్రాయమే సమాజ అభిప్రాయంగా చలామణి అయ్యేది. 

కానీ ఇపుడు ‘సోషల్ మీడియా’ వల్ల ప్రతివారూ రచయితలు, వ్యాఖ్యాతలు, విమర్శకులు అయ్యారు. అయితే దీని హద్దులు దీనికున్నా, విస్తృత ప్రచారం, ఉద్వేగాలు, ఉద్దేశాలతో సోషల్ మీడియా ప్రజలను ప్రభావితం చేస్తున్నమాట వాస్తవం. గత వారం ఓ ఆసక్తికర సంఘటన అనేక కొత్త వివాదాలకు కారణమైంది. ఇటీవల సామాజిక మాధ్యమాలు అభిప్రాయాలకు, దూషణ పర్వాలకు వేదికలుగా మారుతున్నాయి. తమకిష్టమైన నాయకులను ఎవరైనా అకారణ ద్వేషంతో దూషిస్తే తట్టుకోలేకపోవడం అందరికీ తెలిసిందే. 

ఆ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్ట్‌ను 19 ఏళ్ళ హిందూ యువతి రిచాభారతి పటేల్ ‘షేర్’ చేసింది. ఈ యువతి జార్ఖండ్‌లోని రాంచీ దగ్గరున్న పిటోరియా ప్రాంతానికి చెందింది. ఆమె ‘షేర్’ చేసిన పోస్టు పవిత్ర ఖురాన్‌ను విమర్శించే విధంగా వుందని పిటోరియా అంజుమన్ ఇస్లామియా అనే సంస్థ కోర్టుకు వెళ్లింది. రాంచీ సివిల్ కోర్టు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మనీష్ కుమార్ ఆమెకు బెయిల్ ఇచ్చే సందర్భంలో పెట్టిన ఓ షరతు ఇపుడు రాజకీయంగా దుమారం రేపుతున్నది. రిచా భారతి ఓ మతానికి వ్యతిరేకంగా పోస్ట్‌ను ‘షేర్’ చేసినందున ఆమెకు బెయిల్ ఇవ్వాలంటే జరిమానాతోపాటుగా 5 ఖురాన్ ప్రతులను పంచాలని మెజిస్ట్రేట్ షరతు పెట్టాడు. 15 రోజుల్లోగా ఖురాన్ ప్రతులను కొని, అందులో ఒకటి పిటోరియా అంజుమన్ ఇస్లామియాకు, మరో 4 ప్రతులు రాంచీ పరిసర ప్రాంతాల్లోని గ్రంథాలయాలకు వితరణ చేసి రశీదులను కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశించాడు. 

ఆ అమ్మాయి మాత్రం తాను రెండు రోజుల జైలుశిక్షను అనుభవిస్తానే తప్ప ఖురాన్ ప్రతులను పంచలేనని కోర్టుకు చెప్పింది. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు వెళ్తానన్నది. ఓ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనే ఉద్దేశంతో ఆ యువతికి న్యాయాధికారి అ లాంటి షరతు పెట్టి ఉండవచ్చు. కానీ ఇపుడు దేశంలోని ‘హిందీ బెల్టు’లో ఇది పెద్ద చర్చకు దారితీసింది.

సోషల్ మీడియాలోని వ్యాఖ్యలకు శిక్షలు వేయడం మొదలుపెడితే ఈ దేశ అధికార యంత్రాంగం మొత్తం అందులోనే నిమగ్నం కావాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. భారీ జనాభా వున్న ఈ దేశంలో చర్య జరిపేవారు సంయమనం పాటించాలి. చర్య జరిపే వర్గాలు ప్రతిచర్యను ఓర్చుకోవు. అక్కడే ‘సంతుష్టీకరణ’ మొదలైంది. దానికే ‘లౌకికవాదం’ అనే ముద్దుపేరు తగిలించి ఇన్నాళ్లూ పబ్బం గడిపారు. ఇపుడు తిరుగుబాటు మొదలై ప్రతి చర్య చేసేసరికి తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ దేశ హిందువులు వౌనంగా వుండాలనే ఉదార భావనను ఆదర్శంగా స్వీకరించాలని కుహనా లౌకికవాదుల ఆశ. డెబ్బయి ఏళ్ళ నుండి అది ఓ ఆదర్శంలా, పవిత్ర కార్యంలా కొనసాగించారు. 

ఇటీవల రాజకీయ మార్పుల వల్ల జాతీయభావం ఉన్నవాళ్లు నోరుతెరిచి మాట్లాడ్డం లుటియన్ మీడియాకు, మేధో ఉగ్రవాదులకు రుచించడం లేదు. ఇలాంటి బెయిల్ షరతులు రాజ్యాంగ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా సెక్యులరిజం అమలులో వి కృత దశ. ‘రాముడికి ఎంతమంది తండ్రులని అర్థం వచ్చేటట్లుగా మాట్లాడిన ఓ రాజకీయ పార్టీ నేతకు రామాయణం చేతికిచ్చి దాన్ని క్షుణ్ణంగా చదవాలని ఆదేశిస్తే అమలు జరుగుతుందా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అతడు చదివేందుకు సిద్ధపడినా ‘్ఫత్వాలు’ జారీ చేయకుండా అడ్డుకొంటారా? హిందూ దేవుళ్లను నిందిస్తూ, ఇతిహాస, పురాణాలను దూషిస్తూ రచనలు చేసే మేధో ఉగ్రవాదులకు ఆయా హిందూ గ్రంథాలను చదవమనో, దేవాలయాలకు వెళ్లి సేవ చేయాలనో ఆదేశిస్తే వారిలోని ‘నాస్తిక, హేతువాద, కుల వాద, మార్క్స్‌వాద, మావోవాద, ద్రావిడవాద..’ పవిత్రతకు భంగం కలగదా?

హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ మత మార్పిడులు చేస్తున్న ముఠా నాయకులకు ఇది వర్తింపజేస్తే అపుడు ఇదే గ్యాంగ్ ‘్భరతదేశ సెక్యులరిజం’ నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టదా? తన తండ్రి లంకేశ్ మరణిస్తే, వారి వీరశైవ సంప్రదాయం ప్రకారం అక్కడి వాళ్లెవరో అతని మెడలో లింగం, నొసట విభూతి పూస్తే తీవ్రంగా ప్రతిఘటించి వాటిని తొలగించిన గౌరీ లంకేశ్ అనే రచయిత్రి చేష్టలను గొప్ప సెక్యులరిజంగా భావిస్తాం. 

విభూతి, లింగధారణను ద్వేషిస్తూ బసవేశ్వరుని పేరుతో హిందూ మతంపై దుమ్మెత్తిపోయడం విచిత్రమైన లౌకికవాదం! ‘మతోరుభగన్’ (వన్ పార్ట్ విమెన్) పేరుతో పుస్తకం రాసి తమిళనాడులో పెరుమాళ్ అనే రచయిత హిందూ ధర్మాన్ని తీవ్రంగా అవమానపరిస్తే అతని చేతికి కంబ రామాయణం ఇచ్చి, దాన్ని దేశమంతా తిరిగి చెప్పాలని ఎవరైనా డిమాండ్ చేస్తే మన దేశ సెక్యులర్ పాతివ్రత్యానికి ఎంత భంగం వాటిల్లేదో? శివలింగాలపై మూత్రం పోస్తానని చెప్పిన గొప్ప రచయిత యం.యం.కల్బుర్గి నెత్తిన నాలుగు రోజులు శివలింగం పెట్టి కన్నడ ప్రాంతం అంతా తిప్పివుంటే మన లౌకికవాద సిద్ధాంత నిరూపణ ఇంకా జరిగేది కదా? ఉగాది రోజున పంచాంగాన్ని అవమానిస్తూ డిబేట్స్ పెట్టడం, దసరారోజు అమ్మవారిని దూషిస్తూ ‘షో’లు చేసే తెలుగు టీవీ చానళ్ళకు పంచాంగాలను నెత్తినపెట్టి అమ్ముకొని రమ్మంటే మన సెక్యులర్ మేధావులు గుండె ఆగి చచ్చేవారు కదా? అయితే ఈ దేశంలో హిందువులను, హిందు గ్రంథాలను తిట్టే అపరిమిత అధికారం ఎవరికైనా వుంది అని చెప్పే హక్కే- వికృత సెక్యులరిజం! 

ఒకవేళ రిచా భారతి మాదిరి హిందువులను, హిందూ గ్రంథాలను తిట్టేవారికి జ్ఞానోదయం కలిగించేందుకు ఇలాంటి శిక్షలు వేయడం మొదలుపెడితే గీతాప్రెస్ వాళ్ల రామాయణ, భారత, పౌరాణిక గ్రంథాలకు కావలసినంత గిరాకీ. ఎందుకంటే అంత బురద రోజూ హిందుత్వపై చల్లుతారు. మేధావులుగా ముసుగేసుకున్న వాళ్లే కాకుండా ఎందరో నాయకులూ ఇలాంటి నోటి దురద ఉన్నవారే. విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో లౌకికవాదం అంటే ఒక మతాన్ని సంతుష్టీకరణ చేయడం!

చైనాను మనసారా పొగిడేవారే ఈ దేశంలో హిందువులపై యుద్ధం చేస్తామంటారు. 2013, 2014 సంవత్సరాల్లో ఉరుంక్వే, కుమ్మింగ్ అనే చైనాలోని ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళన చేసి, వారి బాధలను అంతర్జాతీయ సమాజానికి తెలిపారు. 2015లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ముస్లింలపై కఠిన చర్యలకు ఉపక్రమించి పుస్తక దుకాణాల నుండి ఖురాన్, ఇతర ఇస్లాం గ్రంథాలను తొలగింపజేశాడు. హన్ చైనీయులకు, వాఘర్ ముస్లింల మధ్య సంప్రదాయ ఘర్షణలు జరిగితే చైనా ప్రభుత్వం గడ్డాలు పెంచడంపై, బురఖాలు ధరించడంపై తీవ్ర ఆంక్షలు విధించింది. 

భారత్‌లో మెజారిటీ హిందువులకు రాజ్యాంగం చెప్పని శిక్షలు విధిస్తున్నా, ఇక్కడ లౌకికవాదం ప్రమాదంలో ఉందని ప్రచారం చేస్తారు. చైనా తన జాతీయతను కాపాడేందుకు అక్కడి కొందరు జాతి వ్యతిరేక శక్తులను నిరోధిస్తే గొప్ప చర్యగా, ఆదర్శంగా ఇక్కడి సూడో సెక్యులర్ శక్తులు అభివర్ణిస్తాయి. ఇక్కడ లౌకికవాదం పేరుతో దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న రోహింగ్యాలకు మద్దతుగా ఇవే శక్తులు నిలబడడం విడ్డూరం. రిచా భారతి ఫేస్‌బుక్ పోస్ట్‌మీద వివాదం ఈ రోహింగ్యా ముస్లింలదే. ఈ ‘వికృత సెక్యులరిజం’ తారుమారవకపోతే ప్రతిచోటా రిచా భారతి లాంటి యువతీ యువకులు తిరగబడతుతూనే ఉంటారు.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి