మన దేశంలో వేదాంతాన్ని బ్రహ్మపదార్థంగా చెప్తారు. బ్రహ్మను గురించి చేసే చర్చను ‘బ్రహ్మజ్ఞానం’గా చెప్తారు. ఉపనిషత్తుల్లో, బ్రహ్మ సూత్రాల్లో జరిగిన ‘జ్ఞానచర్చ’ను సామాన్య జనంలోకి తీసుకెళ్లేందుకు ఎందరో తత్వ కవులుద్భవించారు. కుల భేదం లేకుండా అందరి కోసం తత్వాలను అందించారు. సంప్రదాయంలోని గహనమైన వేదాంతాన్ని అలతిఅలతి పదాలతో అరటిపండు వలిచి అందించినట్లు మరోపాయగా తత్వకవులు నిలబెట్టారు.
 
నేత్రద్వారమునందు వెలిగెడి
సూత్రధారునిగానలేకను
క్షేత్రములకు పోదురేమన్నా...

తనలోన యున్నా తత్వమెవరు తరచిగనరన్నా
పాపిష్టి జన్మము ఎత్తినందుకు ఫలము లేదన్న
తారకము సూటెరుగవలెనన్నా సద్గురుని కృపచే
తారతమ్యము తరచిగనరన్నా...

అంటాడు తత్వకవి. అంటే క్షేత్రాలకు వెళ్లొద్దని కాదు. జ్ఞానస్థాయులను గుర్తెరగాలని అర్థం. అంతర్దర్శనం చేయాలని సూచన. పంచభూతాల ద్వారా ఏర్పడిన ఈ సృష్టిని సాంఖ్యంగా తత్వకవులు చెప్పుకొన్నారు. ప్రకృతి నుండే ఉద్భవించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు త్రిగుణాలు జోడించి, పంచేంద్రియాలతో సమన్వయపరిచి సాంఖ్యతత్వం వ్యాప్తి చేశారు. శరీరం అశాశ్వతమని, ఆత్మ శాశ్వతమని నిరూపించి మోహనిర్మూలన చేసారు. శివరామ దీక్షితులవంటి తాత్వికులు మరో అడుగు ముందుకు వేసి ఆత్మ భావనకన్నా అతీతంగా వెళ్లారు.
 
దేహం శాశ్వతం అనుకునే అజ్ఞాని జీవితాంతం లేదా ఓ పది జన్మలకు సరిపడే సంపదను మూటగట్టుకొంటున్నాడు. ఇదే అజ్ఞానంతో పదవులు, మోహం, ధనం, కుటుంబం, కులం, ప్రాంతం, వంటి భేదాలతో దేవుడిని కూడా సంకుచితం చేస్తున్నాడు. వేదాంత చింతన లేకపోవడం వల్ల శాశ్వతమైన, ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాడు. ఆనంద స్వరూపుడైన పరమాత్మను వదలిపెట్టి అశాంతికి మారుపేరైన జీవనం గడుపుతున్నాడు.
 
శరీరాన్ని రోగాల పుట్టగా మార్చుకొని దేహాన్ని వైద్యులకు అప్పజెప్పి దేహాన్ని మందులతో నింపుతున్నాడు. ఇహపర సుఖాల ఇంగితజ్ఞానం లేకుండా అటు దేహాన్ని, ఇటు ఆత్మనూ రెంటినీ విస్మరిస్తున్నాడు. ఈ లోటును గమనించిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శివరామ దీక్షితులు, వేమన వంటి తత్వజ్ఞానులు తత్వాలను అందించారు. వేమన వంటి కవులు తత్వాన్ని పద్యాల్లో ఒడిసిపట్టారు. భక్తి వాదాన్ని, ముక్తివాదాన్ని ప్రజలకు చేరువ చేసి నిరక్షరాస్యులను, విద్యా గంధంలేని వాళ్లను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. జీవితాన్ని ఒక లక్ష్యంతో నడుపుతూ నిత్య జీవితంలోని అన్ని పనులను సజావుగా చేసుకుంటూ ఆశను వదలిపెట్టారు. నిరాడంబరంగా, నిర్వికారంగా జీవించారు. ఇది వారు దర్శించిన తత్వం. అందరూ అనుసరించాల్సిన తత్వం.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
*29- 07 - 2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి