సోప్ అనే మేధావి చెప్పిన ఓ కల్పిత కథ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ అరణ్యంలో సింహం తనకు కన్పించిన ప్రతి జంతువునూ ‘ఈ అడవికి నేను రాజునా? కాదా?’ అని అడిగేది. అన్ని జంతువులూ ‘నీవే రాజువు’ అని సమాధానమిచ్చేవి. ఓ రోజు చిరుతపులిని అడిగినా అది కూడా సంకోచిస్తూ ‘నీవే రాజువు’ అన్నది. చివరకు ఏనుగును అడిగింది. వెంటనే ఏనుగు సింహాన్ని దూరంగా విసిరేసింది. ‘ఓ గజరాజా! నీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పవచ్చు. నన్ను ఇంతలా గాలిలో ఎగరేయాల్సిన అవసరం లేదు’ అంటూ గట్టిగా అరిచింది.
ఈ కథను ఉదాహరించిన ఓ తత్త్వవేత్త ‘విగ్రహాన్ని ఆరాధించే వ్యక్తి ఆరాధన అంటే ఏంటో నీకు నిజంగా తెలుసా?’
అన్నదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు; అతడి జీవితమే దానికి సమాధానం అంటాడు.
అలాగే ఈ దేశంలో సనాతన ధర్మం అవలంబించే వ్యక్తులకు ఇక్కడి భూమిలోని ఎన్నో చోట్ల ఆరాధానా కేంద్రాలు. కాశీ ఉందనుకోండి, అది ఇక్కడి సనాతనులకు భూమి మాత్రమే కాదు, శివుడు నడయాడిన అపర కైలాసం. కాశీలోకి ప్రవేశిస్తే సంపూర్ణమైన నమ్మకంతో, అపార విశ్వాసంతో వీధుల్లో నడుస్తారు. అక్కడే శివుడు, అన్నపూర్ణ, బుద్ధుడు, ఆదిశంకరుడు, జైనతీర్థంకరులు, భక్తకబీర్, తులసీదాస్ అందరూ ఆ క్షేత్రంలో దర్శనం ఇస్తారు. ఇదంతా ఆజ్ఞలతో ఈ ధర్మావలంబులకు ఎవరూ చెప్పలేదు- చెప్పలేరు!? ఇదంతా విశ్వాసాల మేళవింపు!
ఇలాంటి విశ్వాసాలను ఈ దేశంలో ఏ మీడియా పట్టించుకోదు. మన మాధ్యమాలకు ‘నెగెటివ్ అప్రోచ్’ ఎక్కువ. జనాన్ని ఆకర్షించాలంటే వ్యతిరేక దృష్టిని అటువైపు తిప్పాలనే ప్రయత్నం గొప్పగా చేస్తున్న ‘రేటింగ్’ వెర్రెత్తిన ఛానళ్లను చూస్తే నవ్వొస్తుంది.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా అరియమంగళం నదీ తీరంలో కాళీమాత మందిరం నిర్మించిన ‘జయ్’ అనే అఘోరా తన తల్లి మరణిస్తే ఆమె శవంపై కూర్చున్న సంఘటన మీడియాను బాగా ఆకర్షించింది. అదే తమిళనాడు పక్కనున్న ట్రావెన్‌కోర్ సంస్థానంలోని ‘పందళం’లో వేలాదిమంది మహిళలతో పెద్ద ర్యాలీ జరిగింది. ‘అయ్యప్ప ధర్మ సంరక్షణ సేన’ పేరిట జరిగిన ఈ ర్యాలీలో ‘శబరిమలను రక్షించండి’ అన్న నినాదాలు మహిళలు మార్మోగించారు. ఈ వారంలో ఈ దేశ నమ్మకాలకు వ్యతిరేకంగా వచ్చిన రెండు సుప్రీం కోర్టు తీర్పుల్లో శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశం కూడా ఒకటి. ఈ తీర్పును నిరసిస్తూ, ఇందుకు వ్యతిరేకంగా పందళం పట్టణం మహిళల నిరసనలతో అట్టుడికింది.
మహిళలకు అనుకూలంగా తీర్పువస్తే- ఆ మహిళలే తీర్పును వ్యతిరేకించడం విడ్డూరం కాదా? జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో హిందూ మతాన్ని దుమ్మెత్తిపోసే మహిళా సంరక్షకులుగా వున్న పురుష రచయితలందరినీ తొలుస్తున్న ప్రశ్న! స్ర్తివాద అస్తిత్వమే ఆరోప్రాణంగా బ్రతికే చలం వారసులకు కూడా ఇది మింగుడుపడని అంశమే. ఇక హిందూమతంలోని ఏ అంశం చర్చకు వచ్చినా- ‘సీతను రాముడు ఎందుకు అడవికి పంపాడు?’ ఆవు వ్యాసం లాంటి డైలాగును పదే పదే చెప్పేవాళ్లకు ‘సేవ్ శబరిమల’ ర్యాలీ అర్థం కాక తలబొప్పి గట్టింది. శబరిమల భక్తులంతా స్ర్తి ద్వేషులన్నట్లు ప్రచారం చేసే కొన్ని ప్రచార మాధ్యమాలకు దీన్ని గురించి ఆలోచించే తీరిక లేదు.
ఈ ర్యాలీలో ‘రాజ్యాంగానికి శతాబ్దాల పూర్వమే సంప్రదాయాలున్నాయ్’ అన్న నినాదం వినిపించింది. అంటే ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించడం కాదు. సంప్రదాయాల, నమ్మకాల ప్రాచీనత చెప్పడం. అంతెందుకు? ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోని మగ జడ్జీలంతా మహిళలు శబరిమల గుడిలో ప్రవేశించవచ్చునని తీర్పునిస్తే, అదే ధర్మాసనంలోకి ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం ‘ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం అనీ, ఇలా తీర్పులు వస్తే ఇది ఇక్కడితో ఆగదు’ అని పేర్కొన్నారు. ఇక్కడ ‘సజాతి ధృవాల వికర్షణ, విజాతి ధృవాల ఆకర్షణ’ అన్న ఫ్రాయిడ్ సిద్ధాంతం పనిచేసిందా? కాదు.. కాదు! అక్కడ ఏం జరుగుతుందో, ఆ నమ్మకం ఎందుకు ఉందో జస్టిస్ ఇందూ మల్హోత్రాకు మాత్రమే తెలుసు. ఆమె ఈ దేశ నారీమణి.
‘బలమైన మత విశ్వాసాలు, ఆచారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోజాలవు. ఇందులో న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు అసంబద్ధం. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆరాధకులు, మత సంస్థలే’ అని ఇందూ మల్హోత్రా బల్లగుద్ది మరీ చెప్పారు. హిందూ ధర్మానికి సంబంధించి లక్షలాది ఆరాధనా కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడా లేని ఓ వింత నియమం ఇక్కడే ఎందుకు ఉంది? కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో చట్టాల సంరక్షణతోపాటు నైతిక జీవనం కూడా సమాజాన్ని శాంతియుతంగా ఉంచుతుంది. మతవిశ్వాసాలన్నీ అలాంటి నైతిక జీవనం అందించే క్రమంలో బలమైన ఆలోచనలుగా మారుతుంటాయి. మూలతత్వాన్ని గ్రహిస్తే సమాధానం దొరుకుతుంది. అలా కాక చేతులతో నడిచి, వింత మనుషులై త్వరగా పేరు ప్రతిష్ఠలు పొందాలనుకొనే మనకు అది సాధ్యం కాదు!?
అలాంటి స్థితిలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి కేరళ మహిళల్లాగే కొంత సమాచారం ఇవ్వాల్సి వుంది. శబరిమలై దేవాలయంలోకి 10-50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశానికి సంబంధించి కేసు వేసిన పిటిషన్‌దారు పేరును పత్రికలు పెద్దగా ప్రస్తావించలేదు. సామాజిక మాధ్యమాల సమాచారం మేరకు నౌషాద్ అహ్మద్‌ఖాన్ అనే వ్యక్తి ఇందులో పిటిషన్‌దారుగా తెలుస్తున్నది. ఫ్యూబర్టీ స్టేజ్ నుండి మెనోపాజ్ దశ వరకున్న ఆడవాళ్లకు మాత్రమే ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. మిగతా వయసులవారికి అది నిషేధం కాదు. కాబట్టి మహిళా వ్యతిరేక చర్యగా ఆ ఆచారాన్ని చెప్పలేం. వయసులో వున్న స్ర్తిలకు సంబంధించిన విధి - నిషేధంలో ఏదో ప్రత్యేకమైన ఆలోచన ఉండితీరాలి. మహిళలే దేవాలయంలోకి రావద్దు అంటే అది అన్ని వయసులకు ఉండాలి కదా?
అంటే ఇది వయసుకు సంబంధించిన విషయం అన్నమాట. హిందూ దేవాలయాలన్నింట్లోకి స్ర్తిలకు ప్రవేశం ఉంది. మీరాను మించిన కృష్ణ్భక్తురాలు ఇంకెవరు? శారదా మాతను మించిన శ్రీరామకృష్ణుల శిష్యురాలు ఎవరు? ఆఖరికి అస్ఖలిత బ్రహ్మచారి హనుమంతుడికి కూడా పరాశర సంహిత ప్రకారం సువర్చల అనే స్ర్తిమూర్తినిచ్చి కల్యాణం జరిపించే ఉదాత్తత మనది. కాబట్టి ఇది స్ర్తి దేశం ఎంత మాత్రం కాదు. స్ర్తిలపై వివక్ష అంతకన్నా కాదు! అలాగైతే ఈ మహిళా న్యాయమూర్తి ఈ తీర్పును వ్యతిరేకించరు. మలయాళ స్ర్తిలు వేలాదిమంది రోడ్లపైకి రాలేరు కదా?
కేరళలోని అయ్యప్పను గురించిన ఆధారాలు అక్కడ ‘్ధర్మశాస్తా’ అనే రూపంలో చూపిస్తారు. మలయాళంలో పూర్వం నుండి జానపదుల పాటల్లో అయ్యప్ప ఒక యుద్ధవీరుడు. పందళరాజు, పాండ్యరాజు వద్ద జరిగిన విషయాలను ‘అయ్యప్ప సేవం’ పేరుతో ‘ఏడు సేవకాలు’ ఈ పాటలున్నాయి. పాండిచ్చేవం, పులిచ్చేవం, ఇళైయరసు చేవం, వెళిచ్చేవం, ఈళచ్చేవం, పందళచ్చేవం, వేళార్‌చేవం- వీటిని ఢమరుక వాద్యంతో వినిపిస్తారు. ఉదయనన్ అనే దురాత్ముణ్ణి అయ్యప్ప వధించి, అతడు ధ్వంసం చేసిన శబరిగిరి ఆలయాన్ని అయ్యప్ప పునరుద్ధరించి ఆ ఉత్సవంలో అయ్యప్ప పాల్గొన్నట్లు చెప్తారు.
ఎరుమేలిలో జరిగే ‘పేట్టేతుళ్లాల్’ అనే అంగడి నృత్యం కూడా ఆదివాసీ, గిరిజన సంప్రదాయమే. ఇదంతా స్థానిక ఆచార కథనాలు, నమ్మకాలతో ముడిపడిన భక్తి అని తెలుస్తున్నది. బ్రహ్మచారిగా అయ్యప్ప భక్తి బాగా ప్రచారంలోకి రాగా అతని జీవిత కథలో కూడా స్ర్తిని గొప్పగా గౌరవించే కథనం కన్పిస్తుంది.
ఇలాంటి అయ్యప్పను సేవించే దీక్షాపరులు స్వయం పాకం, నిక్షేరము, శీతల స్నానం, చందన లేపనం, నల్లని వస్తధ్రారణ, పాదరక్షారహితం, భూతల శయనం వంటి కఠిన నియమాలను పాటిస్తూ పూజిస్తారు. అలాంటి సమయంలో స్ర్తి సాంగత్యం పురుషులు వర్జిస్తే, ఋతుకాలం కాని బాలికలు, ఋతుకాలం ముగిసిన స్ర్తిమూర్తులు అయ్యప్పను సేవిస్తారు. ఇదంతా నియమంగా మనకు కన్పిస్తుంది.
పూర్వం వాళ్లకున్న పరిధిలో కొన్ని విధి నిషేధాలను అక్కడి క్షేత్రపాలకులు పెట్టుకొన్నారు. ఇప్పటికీ హిందూ స్ర్తిలు ఋతుకాలంలో ఏ దేవాలయాన్ని సందర్శించరు. అలాంటి నియమం మిగతా దేవాలయాలకు ఎక్కడా చెప్పుకున్నా వారు పాటిస్తారు.
ఆరోగ్య శాస్త్ర రీత్యా స్ర్తిలకు ఋతుకాలం విశ్రాంతి సమయం. వారి మానసిక ప్రశాంతతకు కూడా అది అవసరం. ఇవన్నీ మన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినా మనం ఛాందసం అంటూ కొట్టేస్తాం. శరీరం నుండి ఆత్మకు శక్తి ఎక్కడ ప్రసారం జరుగుతుందో, ఎక్కడ వాతావరణం శక్తితో నింపబడుతుందో, ఎక్కడైతే ఆత్మస్థితి మహోన్నత సమాధివైపు కదులుతుందో అక్కడ క్షేత్రం, తీర్థం సృష్టింపబడింది. స్ర్తిల ఋతుక్రమానికి, చంద్రభ్రమణానికి దగ్గరి సంబంధం ఉంది. స్ర్తి శరీరం ఆరోగ్యంగా, సాధారణంగా ఉంటే 28 రోజుల తర్వాత ఋతుస్రావం జరుగుతుంది. ఆ సర్కిల్‌కు భంగం జరిగిందంటే ఎక్కడో ఏదో క్రమం తప్పిందని అర్థం.
1950లో విశ్వ రసాయనశాస్త్రం (కాస్మిక్ కెమిస్ట్రీ) అనే శాస్త్రం పుట్టుకొచ్చింది. విశ్వమంతా ఒకే శరీరం అన్నది దాని సారాంశం. జార్జి జియార్టీ అనే వ్యక్తి ఈ శాస్త్రాన్ని అనే్వషించిన వాళ్లలో ముఖ్యుడు. ఈ క్రమంలో టమాటో అనే జపాన్ వైద్యుడు స్ర్తి పురుషుల రక్తంపై అనేక పరిశోధనలు చేసి ఋతుస్రావ సమయంలో స్ర్తి రక్తం పలుచగా ఉంటుందని చెప్పాడు. సూర్యుడిపై అణుతుఫాను రేగినపుడు పురుషుల్లో కూడా రక్తం పలుచబడుతుంది. ఎక్కడో వున్న సూర్యుడికి భూమిమీద వున్న పురుషుడికి ఏమిటి సంబంధం? ఇదంతా ప్రకృతికి, మనిషికి మధ్యనున్న సంబంధం. అందువల్లనే విశ్వంలోని ప్రతి అణువుకూ ఒకదానితో ఒకటి సంబందం ఉంటుంది.
ఇదంతా ఆగమశాస్త్రాల కట్టుదిట్టాలు. దీన్ని నమ్మకంగా కూడా అవసరమైతే పరిగణించాలి. ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారిస్తున్న న్యాయమూర్తులది తప్పేం కాకపోవచ్చు. ఆ వ్యక్తి తనకు న్యాయం జరగడం లేదని కోర్టుకు వెళ్ళాడు కాబట్టి అలా తీర్పు ఇచ్చి ఉండవచ్చు. ఇపుడు వీధుల్లోకి వస్తున్నవాళ్ల నమ్మకాలను కూడా చట్టం పరిగణనలోకి తీసుకోవాలి.
ఇక్కడ ఎవరు గుడికి ఎలా వెళ్తారన్నది ముఖ్యం కాదు. గుడికి ఇష్టం ఉంటే పోవచ్చు, లేకపోతే బలవంతం లేదు. కానీ నమ్మకాలను గౌరవించాలన్నదే ప్రాథమిక అభ్యర్థన. ‘పురాణమిత్యేవ నసాధుసర్వమ్’- పురాణం చెప్పేదంతా అంగీకరించాలని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. సనాతన ఆచారాలన్నీ చెడ్డవి కావు. కొత్త ఆచారాలన్నీ మంచివి కావు.
ప్రతివాటిలోనూ మంచీ చెడ్డ రెండూ ఉంటాయి. కానీ ఆ మంచిని గౌరవించే అవకాశం ఇవ్వండి ప్లీజ్... ఎందుకంటే చెడ్డ ఉన్నా లేకున్నా చెడుగా చిత్రీకరించే శక్తులున్నాయి కాబట్టి..!
*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰