తూలుతూ వెళ్తున్న తాగుబోతును ఒ పెద్దమనిషి అడిగాడట. “ఏమయ్యా! ఎందుకు తాగుతున్నావు”? అని.తాగుబోతు సమాధానం ఇస్తూ “ చేసిన అప్పుల బాధలు మరిచిపోవడానికి”? అన్నాట్ట. వెంటనే పెద్దమనిషి ‘మరి అప్పెందుకు చేసావు’ అన్నాడట. ఇంకెం దుకు తాగడానికే! అన్నాడట తాగుబోతు!
సరిగ్గా ఇటీవల మూకదాడులనే పదాన్ని సరిక్రొత్త అకాడమిక్ పరిభాషగా మార్చడానికి ప్రయత్నిస్తున్న వారి తీరు ఇలాగే ఉంది. గుంపుగా వెళ్ళి బలహీనులపై దాడులు చేసే దాన్ని ‘మూకదాడి’ అంటాం. ఇటీవల సుప్రీంకోర్టు దానిపై కేంద్రానికి కొన్ని నిర్దేశాలు జారి చేసినందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం క్రొత్త చట్టాలను రూపొందించడమో, పాత చట్టాలకు పదును పెట్టాలనో చర్చ ప్రారంభమైంది.
ఏ నాగరిక సమాజంలోనైనా ఒకరిపై ఒకరు దాడి చేయడం ఆటవిక మనస్తత్వం. అలాగే రాజ్యాంగబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వపాలనలో ఉన్న మనలాంటి దేశాల్లో అది అత్యంత గర్హనీయమైన చర్య. అయితే అది ఎవరు చేస్తే మూకదాడి? ఎవరు చేస్తే మూగరోదన! అన్న విషయంలోనే భేదాభిప్రాయాలున్నాయి.
ప్రతి విషయాన్ని కులాల, మతాల దృష్టికోణంలో పరికిస్తున్న మనకు, ప్రతి అంశంలో రాజకీయకోణం వెతుకుతున్న మనకు ఇదొక రాజకీయ అస్త్రమేగాని చిత్తశుద్దితో ఈ విషయాన్ని నిర్మూలించే మనసు లేదు. అందుకు ఈ దేశంలో స్వాతంత్య్రం రాక ముందు నుండి ఈ రోజు వరకు వేల ఉదాహరణలు చెప్పవచ్చు.
భారతదేశపు ఒకప్పటి విస్తీర్ణం 76.58,300 చ.కి.మీ. మరి ఇప్పుడు, 31,66,414 చ.కి.మీ. ఈ దేశం ఎందుకు ఇంతగా కుంచించుకు పోయింది. జమ్మూకాశ్మీర్‌లోని 5 లక్షల హిందూ జనాభా వేలల్లోకి ఎందుకు పడిపోయిందో ఎవరైనా చెప్పగలరా? 1947లో క్రైస్తవులే లేని త్రిపురలో ఇపుడు లక్షాయాభైవేలకు పైగా ఎలా పెరిగింది?
ప్రతి సంఘటనకు చర్య, ప్రతి చర్య రెండూ ఉంటుంటాయి. ఇవి నాణానికి బొమ్మా బొరుసులాంటివి. ఏదైనా సంఘటన గురించి మాట్లాడినపుడు చర్య, ప్రతిచర్య రెండింటి గురించి మాట్లాడాలి. కానీ ఈ మేధావులు ప్రతిచర్య గురించి మాట్లాడడం వల్లనే ఈ స్వయం ప్రకటిత మేధావుల శీలాన్ని శంకించాల్సి వస్తుంది!? కేవలం ఔరంగజేబు శౌర్యాన్ని గురించి మాట్లాడి శివాజీ ధైర్యాన్ని సందిగ్ధం చేయడమే ఈ సంఘటనల్లోని మూల సమస్య!
కారల్‌మార్క్స్, జోసఫ్ స్టాలిన్, మావోసేతుంగ్‌లను మాహాత్ముల్లా కీర్తించి సావర్కర్‌ను, తిలక్‌ను, వివేకానందుడిని వెనక్కి నెట్టడమే అసలు సమస్య!?
1857 తిరుగుబాటు తర్వాత బ్రిటీషు వారు కుటిల నీతిని ఉపయోగించి సైన్య నియామకంలో హిందువుల్లో విభజన తీసుకు వచ్చారు. క్షాత్ర (martial) క్షాత్రేతర (non martial) పేరుతో రెండు వర్గాలుగా విభజించారు. అకుంఠిత దేశభక్తులైన మరాఠాలను ఏకాకులను చేసి విభజించు పాలించు సిద్ధాంతం అమలుచేసినప్పటి నుండే ఈ దేశం అలాంటి పద్ధతులకు అలవాటు పడింది. ఎక్కడో టర్కీలో ఖలీఫాను రక్షించాలని భారతదేశంలో ఆందోళనలు రేపి ఇక్కడి హిందువులను ఊచకోత కోసినరోజే ఈ జాతి మూకదాడులకు అలవాటు పడింది.
1906 డిసెంబరు 30న ఆలిండియా ముస్లిం లీగ్ ఏర్పడింది. బ్రిటీష్ వారి అడుగులకు మడుగులొత్తడానికి పుట్టిన ఆ సంస్థ ఆశయా లు, లక్ష్యాలు ఈ దేశంలోని హిందువులపై ఎంత విషం కక్కే విధంగా ఉన్నాయో పట్వర్థన్, మెహతాలు రచించిన “ ది కమ్యూనల్ ట్రయాంగిల్” అనే పుస్తకం చూస్తే అర్థమవుతాయి.
ముస్లీం లీగ్ ఆవిర్భావ సమయంలో లాల్ ఇస్తహర్ పేరిట పంచిన ఎర్రకరపత్రాల్లోని విజ్ఞప్తులు, సూచనలు చూస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ ఎర్రకర పత్రంలోని ప్రకటనల వల్ల కొన్ని రోజుల్లోనే 1907 మార్చి 4న నేటి బంగ్లాదేశ్‌లోని కొమిల్లా ప్రాంతంలో నవాబ్ సలీముల్లా అనుచర గుండాలు దాడిచేసినపుడు జరిగిన మానభంగా లు, లూటీలు, ఆస్తుల విధ్వంసం, గృహ దహనాలు ఏ వర్గం వారివో సోకాల్డ్ మేధావులు నోరు తెరచి చెప్పగలరా? అప్పుడు హిందువులు పట్టిన మూగనోము ఇంకా విడువలేదు. చరిత్రను త్రవ్వితే కుప్పలు తెప్పలు పుట్టుకొస్తాయి. చరిత్రకు వెయ్యేండ్లకు, పదిరోజులకు తేడా లేదు.
గాంధీకన్నా ముందు ఈ దేశంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు నడుం కట్టిన స్వామిశ్రద్ధా నందను 1926 డిసెంబర్ 23న అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది కాల్చిచంపినా హిందువులు మూగగా రోదించారు కానీ ఎవరిపై మూకదాడి చేయలేదే? ఇటీవల లోక్‌సభలో సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించినట్లు 1984 ఇందిర హత్య తర్వాత సిక్కుల ఊచకోత ఎంత పెద్ద మూకోన్మాదమో మర్చిపోయామా! ఇందిర మరణానంతరం గద్దెనెక్కిన రాజీవ్‌గాంధీ ఒక మహావృక్షం నేలగూలినపుడు చుట్టు ప్రక్కల భూమి కంపించటం సాధారణ విషయం అనడం ఎంత వైచిత్రి.
ఆ కేసుల్లో నిందితులుగా చెప్తున్న జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్‌లను ఇన్నేళ్ళ ప్రభుత్వాలు శిక్షించాయా? యాకుబ్‌మెమెన్ ముంబాయి పేలుళ్ళు ఎవరినుద్దేశించి చేసాడో చెప్పగలరా!
అఫ్జల్ గురు, కసబ్ భారతదేశంపై దాడికి ఏ ఉద్దేశంతో వచ్చారు? వాళ్ళ దాడులను గజనీ, ఘోరీ, బాబర్‌లు చేసిన యుద్ధాన్ని ఏ సరికొత్త పదంతో నిర్వచిస్తారు!? ఇన్ని దాడుల్లో మూగగా రోదించిందెవరు? మూగనోము పట్టి నటించినదెవరు?! లక్షలాది హిందూ కాశ్మీరీ పండిట్లు లోయనుండి ఎందుకు తరిమివేయబడ్డారు? మూకదాడులపై మాట్లాడేవారు కేరళలో జాతీయవాదులపై దాడులు, బెంగాల్‌లో నిత్యకృత్యమైన తృణమూల్ దౌర్జన్యాలపై ఎందుకు ప్రశ్నించరు? సెక్యులర్ సిద్ధరామయ్య కర్ణాటకలో జరిగిన హత్యలను ఎందుకు ప్రస్తావించరు?
దేశంలోని పత్రికా సంపాదకులు మొదలుకొని చోటామోటా నాయకుల వరకు 2002 గుజరాత్ అల్లర్లు దారుణం, అవి మూకదాడులే అని ప్రస్తావిస్తారు. నిజంగా అలా జరుగడం దారుణమే! కానీ మూలకారణమైన సబర్మతీ రైళ్లో 79 మంది రామకరసేవకుల దహనం ఎందుకు జరిగిందో, ఎవరు చేసారో ఒక్క వాక్యం వీళ్ళ పెన్నుల నుండి సిరా కదిల్చి రాయరు!? సబర్మతీ రైళ్ళో చంపబడిన కరసేవకుల శవాల దగ్గరకు వెళ్ళి ఈ సూడో మేధావులు, పార్టీలు సానుభూతి తెలిపి ఉంటే తర్వాత ఘోరం జరిగేదే కాదు.
మతాలను బట్టి మూకదాడులను నిర్వచించడం వల్లనే ఈ రోజు ఇన్ని రకాల అపార్థాలకు దారులు పడుతున్నాయి. “ఏ మతంవారైనా మూకదాడులు చేయడం తప్పు” అని చెప్పే ధైర్యం ఎవరికీ లేకపోవడం వల్లనే ప్రతివారూ ప్రతి విషయంలో కుల, మతాల బేరీజు వేసుకొంటున్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ ప్రవచించిన ‘సెక్యులరిజం’ మనం అనుసరిస్తున్నాం. మరి గాంధీజీ స్వాతంత్య్రం వచ్చాక చేయాలని చెప్పిన మూడు పనుల్లో గోవధ నిషేధం ఒకటి.
అందువల్లనే చాలా రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలున్నాయి. వెయ్యేళ్ళు బానిసత్వంలో మగ్గిన హిందువుల కోసం ఒక్క గోవధ నిషేధ చట్టం అమలు చేయలేమా? గోవును ఎవరు తింటారు అనేది ప్రక్కన పెడితే ఈ దేశ మెజారిటీ ప్రజల మనోభావలకు విలువ లేదా? గోవులను భుజించడం ఆహారస్వేచ్ఛగా చెప్తున్న కొందరు నిజమైన దళితుల మనోభావాలను గాయపరచడం నిజం.
డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి క్రొత్త వివాదాలు సృష్టిస్తున్న వారు బౌద్ధధర్మాన్ని బాబా సాహెబ్ ఫ్యాషన్‌గా స్వీకరించాడనుకొంటున్నారా? లేక రాజకీయ ఎత్తుగడకు బౌద్ధాన్ని ఆయన తలకెత్తుకున్నాడను కుంటున్నారా? ఒక మేక పిల్ల ప్రాణం కోసం తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డ సిద్ధార్థుడిని త్రికరణశుద్ధిగా డా॥ బాబా సాహెబ్ అనుసరించి, అభిమానించాడు.
అంతటి అహింసామూర్తిని ఆదర్శంగా స్వీకరించిన డా॥ అంబేద్కర్ గోవులను వధించి ‘బీఫ్ ఫెస్టివల్స్’ చేయమన్నాడా!? బౌద్ధాన్ని అంబేద్కర్ కేవలం హిందుత్వపై తిరుగుబాటుగా స్వీకరించలేదు. అందులోని తత్వదృష్టి, సామాజిక భావనను ఆధారం చేసుకొని ఆయన బౌద్ధాన్ని స్వీకరించి హిందుత్వలోని ఛాందస కులతత్వానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. మనిషి ప్రవృత్తిలో మార్పు రానంతవరకు అన్ని మతాలలో ఇలాంటి కలుపుమొక్కలు మొలుస్తాయి. వాటిని పీకేయాల్సిందే. కానీ ఇతరమతాలను రెచ్చగొట్టడానికి గోవధకు పాల్పడడమెందుకు? ఇలాంటి ఉద్రిక్తతలు సృష్టించి వివాదాలు చేయడం ఎందుకు? రాజ్యాంగబద్ధమైన గోవధ నిషేధాన్ని ఉల్లఘించడం డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ ను గౌరవించడమా?
గోవును పూజించడం హిందువుల నమ్మకం అనుకొందాం. మరి ఇవాళ గోవును చంపడం ద్వారా వారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులది పరోక్షంగా మూకదాడి గాక ఇంకేమిటి? నిజానికి హిందూ వర్గాలు తప్పు చేస్తే మన దేశంలో వాళ్ళను చంకన ఎత్తుకునే వాళ్ళు ఎవరూ లేరు. గోసంరక్షణ పేరుతో దాడి చేసే వ్యక్తులను సంయమనం పాటించాలని ప్రధాని నరేంద్రమోడీనే తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇదే విషయంపై 2017లో న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్ ధర్మాసనం వివిధ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇలాంటి దాడుల ఘటనలు చాలా స్వల్పం. కానీ వాటికి రాజకీయ ప్రయోజనాలుండడం వల్ల ప్రచారం గరిష్టస్థాయిలో జరుపుతూ స్థానికంగా జరిగే వాటిని కూడా కుల, మత కోణాల్లో చూపిస్తూ సమన్వయం కాకుండా సంఘర్షణకు ఆజ్యం పోస్తున్నారు.
ఏడాదికి ముందు గల్ఫ్‌లో అనుమతి లేకుండా సత్యనారాయణ వ్రతం చేసారని మంగళూరు, ఉడిపి ప్రాంతాలకు చెందిన 9 మందిని కువైట్ నుండి బహిష్కరించారు. మరి మన దేశంలో స్వేచ్ఛగా ఆరాధన చేసుకునే సౌకర్యం ఉంది. ఎక్కడో జరిగే స్థానిక సమస్యను జాతీయ, అంతర్జాతీయ సమస్యగా మార్చి ఈ దేశంలో స్వేచ్ఛ లేదు అంటున్నవారు నిన్నటికి నిన్న అమెరికాకు చెందిన ‘హిందూ అడ్వక్వసీ గ్రూప్’ ప్రకటించిన అభిప్రాయం వింటే నివ్వెరపోతారు.
భారత్‌లో మతపర మైన మైనార్టీలకు 600 మిలియన్ డాలర్ల బడ్జెట్ ఇచ్చి భారత ప్రజాస్వామ్యంలోని వైవిధ్యం ఈ దేశ మెజారిటీ ప్రజలు కనబరిచారని పేర్కొంది. ఈ నివేదికను హిందూ అమెరికన్ ఎండీ సమీర్ కైరా విడుదల చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలో లేని స్వేచ్ఛ ఇక్కడ ఉండడం ఎవరి ఉదారత అన్నది విస్మరిస్తే ఆత్మహత్య సదృశమే!
********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం : విజయక్రాంతి