– నేనూ చదువుకుంటే ఏ యూనివర్సిటీలోనైనా ప్రొఫెసర్‌ అయ్యేవాడిని.
– సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌
– అంటే చదువురాని వాళ్ళు, సినిమా నటులు రాజకీయ నాయకులు కావచ్చంటున్నారా !
– మోది నిజాయితీని ఎదుర్కోవడం కాంగ్రెస్‌ వల్ల కాదు. భాజపా విజయాలను ఆపడం కష్టం.
– ప్రకాశ్‌ అంబేడ్కర్‌
– అందుకే సూడో సెక్యులరిస్టుల నిచ్చెన ఎక్కుతున్నారుగా !
– జాతీయ సెలవులుగా వివేకానంద, నేతాజీ జయంతులు ప్రకటించాలి.
– పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి
– ఇన్నాళ్ళకు ఓ మంచిమాట మాట్లాడారు దీదీ !
– రేవంత్‌ రెడ్డి టిడిపి కోవర్ట్‌.
– తెరాస ఎమ్‌ఎల్‌సి కర్నె ప్రభాకర్‌
– అప్పుడు కాంగ్రెస్‌ ఏజంట్‌ అన్నారు మరి…!?
– ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కెసిఆర్‌, మోది ప్రభుత్వాలు విఫలం. మా పోరుబాట ఆగదు.
– చాడ వెంకటరెడ్డి, సిపిఐ నేత
– మీ పోరు పొయ్యిలో బెట్ట. అది తెగేదీ లేదు, చచ్చేది లేదు.
– తెలంగాణలో తెదేపాను తెరాసలో కలపడం మంచిది. ఎన్‌టిఆర్‌కు నివాళి కోసం హైదరాబాద్‌కు చంద్రబాబు రావల్సింది.
– తెదేపా నేత మోత్కుపల్లి నర్సిములు
– బాబు బాగా బిజీ. అయినా విలీనం గురించి మాట్లాడుతున్నవంటే చర్చలు జరిగినట్లే అనిపిస్తుంది నర్సిములన్నా !
– జిఎస్‌టితో నష్టమే. కొన్ని రాష్ట్రాలు జీతాలివ్వలేకపోతున్నాయ్‌. ఏకబిగిన సంస్కరణలు శ్రేయస్కరం కాదు.
– తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌
– అత్త పగులగొడితే పాత కుండ – కోడలు పగలగొడితే కొత్త కుండ. మీరు చేస్తే అభివృద్ధి – మంది చేస్తే మాయా? మీరు పంచాయతీ ఎన్నికల చట్టం మార్చి పరోక్షంగా ఎన్నుకోవచ్చు. కోట్ల రూపాయలు పెట్టి కొత్త కొత్త స్కీములు పెట్టొచ్చు, మీరు ఏది చేసినా బంగారం – పక్కవాడు చేస్తే పాపం!?
– ఇక కెసిఆర్‌ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు, హరిశ్‌రావు అంటే కాళేశ్వర్‌ రావు.
– గవర్నర్‌ నర్సింహన్‌
– మీరేం గవర్నర్‌ అండీ..!!
– నేను హిందుత్వకు వ్యతిరేకం కాదు. మోది, అమిత్‌షాలకు వ్యతిరేకం.
– నటుడు ప్రకాశ్‌రాజ్‌
– ఎంత ‘లంక’ ఇంట్లో పెరిగితే మాత్రం మరీ ఇంత రావణాసుర బుద్ధి ఉండొద్దు.
– కెసిఆర్‌ సర్కార్‌తో మానవ హక్కులకు విఘాతం, న్యాయవాదులు పోరాడండి.
– పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
– మీరు అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థ రద్దు చేస్తారా ఏంటి ?
– మీరు ఎంత అణచివేస్తే జెఎసి అంత పెరుగుతుంది.
– జెఎసి నేత కోదండరాం
– అవేనా! ఇంకేమైనా డైలాగులు ఉన్నాయా ?

– డా|| పి.భాస్కరయోగి
మాటకు మాట, విశ్లేషణ జాగృతిఇద్దరు అవధూతలు సాయంసంధ్య వేళ పరాయి రాజ్యంలోకి ప్రవేశించారు. అంతలో వర్షం మొదలైంది. తలదాచుకుందామని చూస్తే ఒక పురాతన దేవాలయం కనిపించింది. అందులో కాలు పెట్టకముందే అది కుప్పకూలింది. రాజభటులు వీరిని ఆలయాన్ని కూల్చిన నేరం కింద నిర్బంధించారు. మర్నాడు రాజు ముందు నిలబెట్టి దేవాలయం కూలడానికి కారణం వారేనని ఆరోపణ చేశారు. రాజు గుడ్డిగా వారి మాటలు నమ్మి అవధూతలకు మరణశిక్ష విధించాడు.

చివరిగా ఏదైనా చెప్పుకోవచ్చని వారితో అన్నాడు. వారిలో ఒక అవధూత.. ‘నా హృదయం ఒక మందిరం. దీనిని పరమాత్మ తన ధ్యానం కోసం నిర్మించుకున్నాడు. మనిషి దేవుని కోసం అక్కడ మందిరం నిర్మించాడు. దానితో దేవునికి నేరుగా సంబంధం లేదు. మనిషి నిర్మించుకున్న ఆలయం కోసం దేవుడు నిర్మించుకున్న హృదయ మందిరం కూల్చేస్తారా?’ అని ప్రశ్నించాడు. దీంతో రాజు పునరాలోచనలో పడ్డాడు. మందిరం మనిషికి అవసరమే. ఆ భౌతికమైన కట్టడంలోని భగవంతుని ముందు మనం నిలబడి.. మన హృదయస్థానంలోకి రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానిస్తాం.

ఇదే ధర్మ సూక్ష్మం. మన పూజలో, తపస్సులో, ఆరాధనలో.. ప్రతి దాంట్లో ఈ ధర్మసూక్ష్మం ఉంటుంది. దానిని పట్టుకోకుండా పైపై మెరుగుల వెంట పడతాం. ప్రతి ఆధ్యాత్మిక సంప్రదాయంలో మనకు కనిపించని ప్రతీకలు, పరమార్థాలు ఉంటాయి. ఉదాహరణకు.. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు, ఎన్ని చోట్ల వెలిగించామనే లెక్కల్లో మునిగిపోతాం తప్ప, మన అంతరంగంలోని ఆత్మ జ్యోతిని వెలిగించడాన్ని విస్మరిస్తాం. ఈ క్రమంలోనే చాలామంది తత్వజ్ఞానం, భక్తి లేకుండా యాంత్రికమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలే ఆచరిస్తారు. లోతైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలగాలంటే ధర్మసూక్ష్మం తెలియాలి. అది బీజం వంటిది. అది మన హృదయంలో ఉంటే చాలు. ఎక్కడో ఒక చోట.. ఎప్పుడో ఒకసారి పరిపూర్ణత పొందుతాం.

డాక్టర్‌ పి.భాస్కరయోగి       


"We the people of India having solemnly resolved to constitute India into a Sovereign Socialist Secular Democratic Republic and secure to all its citizens"
మేము భారతదేశ ప్రజలము. ఇండియాని సర్వసత్తాక ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకికవాద గణతంత్ర రాజ్యంగా ఏర్పరచుటకు తీర్మానించాం’’- ఈ మాటలు వినగానే మనం రాజ్యాంగానికి ఎంతలా కట్టుబడి ఉన్నామో అని ఏ నాగరిక దేశంవాడైనా అనుకొంటాడు. లోతుగా ఆలోచించడం మొదలుపెడితే - ఎందరో వీరుల త్యాగఫలం వల్ల స్వాతంత్య్రం సిద్ధించింది. ముఖ్యంగా ఇక్కడి హిందువులు దాదాపు వెయ్యేళ్ల బానిసత్వం అనుభవించి చివరకు లక్షల ప్రాణాల బలిదానంవల్ల స్వేచ్ఛను పొందారు. ముస్లింల మనోభావాల కనుగుణంగా దేశ విభజన జరిగింది. కానీ హిందువులు మాత్రం డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి మేధావులను ముందుబెట్టి రాజ్యాంగ రచన చేయమన్నారు. రాజ్యాంగ సభ ఏర్పడి మొదటి సభ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో 9 డిసెంబర్ 1946న జరిగింది. రాజ్యాంగ రాతప్రతిని తయారుచేయడానికి 29 ఆగస్టు 1947 నాడు డ్రాఫ్ట్ కమిటీ ఏర్పడగా డా.బి.ఆర్.అంబేడ్కర్ దానికి అధ్యక్షుడయ్యాడు. రాజ్యాంగ సభ 11సార్లు 165 రోజులపాటు సమావేశం అయ్యింది. ఇందులో సుమారు 114 రోజులు రాతప్రతి తయారీకి సమయం వెచ్చించింది. ఈ రాతప్రతిని తయారుచేస్తున్న సమయంలో 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో సుమారు 2,473 ప్రతిపాదనలను రాజ్యాంగ సభ పరిశీలించి పరిష్కారం చేసింది. మొత్తానికి భారత రాజ్యాంగం అద్భుతంగా రూపుదిద్దుకొని 26 నవంబర్ 1949న సభలో ఆమోదించి 24 జనవరి 1950నాడు సభ్యులు రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేశారు. సంతకాలు చేసిన రోజున బయట చిరుజల్లుగా వర్షం కురిసింది. అందరూ ఆనాడు ఇదో శుభశకునంగా భావించారు. మొత్తానికి 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈరోజు రాజ్యాంగమే మనకు స్మృతి. కొందరు దీనిని ఈ రోజుల్లో ‘అంబేడ్కర్ స్మృతి’గా అభివర్ణిస్తున్నారు. అయితే మొన్నీమధ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ముఖ్యంగా ‘లౌకికవాదం’ అనే పదం తలా తోకా లేకుండా ఉందని, అది ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగపడుతుందని, అవసరమైతే దానిని సవరించి అసలు అర్థం బయటకు తీస్తాం అన్నది ఆయన మాటల సారాంశం. కానీ కొందరు స్వయం ప్రకటిత మేధావులు, తమకు తామే రాజ్యాంగ పరిరక్షకులుగా అభివర్ణించుకొనేవాళ్లు, సూడో సెక్యులర్ నాయకుల గుంపు కేంద్ర మంత్రిపై ఒంటికాలిపై లేచారు. దాంతో అనంతకుమార్ హెగ్డే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇక వివాదం అంతటితో ఆపకుండా రాజ్యాంగం సవరించడం నేరం, ఇది డా. బాబా సాహెబ్‌ను అవమానించడం, హిందూ ఫాసిజం, మతతత్వం.. అంటూ క్రొత్త క్రొత్త పదాలకు ఎర్రబురద రుద్ది జాతీయవాద భావజాలాన్ని ఆయా సంస్థలను దుమ్మెత్తిపోశారు. రాజ్యాంగాన్ని రచించే సమయంలోనే వేల సవరణలను డా.బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి సహృదయుడు స్వయంగా పరిష్కరించాడు. రాజ్యాంగ ఆమోదం పొందాక 68 సంవత్సరాల్లో 110కి పైగా రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం కదా! ఇది డా.బాబాసాహెబ్‌ను అవమానపరిచినట్లా?
ప్రతి విషయానికి డా.అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ ఆయన గురించి, ఆయన రచనల గురించి కొందరు మేమే టేకేదార్లమన్నట్లు మాట్లాడుతున్నారు. డా.అంబేడ్కర్ ఈ రోజు భారతీయ మహాపురుషుడు. నిష్కళంక దేశభక్తుడైన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ అందరివాడు. ఆయనను ఇటీవల కాలంలో కొందరు వర్గానికి పరిమితం చేస్తున్నారు. ఆయనకున్న పాండిత్యం అపారం. ‘‘అసలు పండిట్ అనే బిరుదు మొదట డా. బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు ఇవ్వాల్సింది’’ అన్న డా.సుబ్రహ్మణ్యస్వామి మాటలు అక్షరసత్యాలు. అన్ని పరీక్షలు ఫెయిల్ అయినవాళ్లు ఈ దేశంలో గొప్ప గొప్ప బిరుదులు పొందారు. ఏ సేవ చేయకుండా భారతరత్న పొందారు. కానీ మొన్నీమధ్య ఎప్పుడో ఓ దేశభక్త ప్రభుత్వం వచ్చాకగానీ ఆయనకు భారతరత్న ఇచ్చుకోలేని దౌర్భాగ్యులం మనం. డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ సంకుచిత స్వభావం కలవాడు కాదు. తన కులంవాడైనా తప్పు చేస్తే మందలించగల ధీశాలి. ఓసారి డా.అంబేడ్కర్ ముంబాయి విశ్వవిద్యాలయంలో పరీక్ష పేపర్లు దిద్దుతుంటే అందులో ఓ దళిత విద్యార్థికి సహాయం చేయాలనే సిఫారసు వచ్చింది. దానికి ఆయన మండిపడుతూ ‘‘తెలివితేటల్లోనూ, యోగ్యతలోనూ ఇలాగ ఎవరికోసమైనా సిఫారసు చెయ్యడం నాకు అసహ్యం. ఇతర విద్యార్థులకన్నా తాను ఏ రకంగా కూడా తక్కువవాణ్ణని ఏ దళిత విద్యార్థి ప్రవర్తించకూడదు. ఇది నా అభిప్రాయం. ఇతర విద్యార్థులతో పోల్చుకుంటే ఓ ఆదర్శ విద్యార్థిగా అతడు తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి అని నేను భావిస్తాను’’ అన్న బాబాసాహెబ్ మాటల్ని ఆయన జీవితచరిత్రలో వసంతమూన్ చెప్పాడు. ఇంత నిష్పాక్షిక, ఉదాత్త హృదయంగల డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరుతో ఈ దేశ సూడో మేధావులు ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు? అంతెందుకు! రాజ్యాంగంలో పది శాతం ఈ డెబ్భై ఏళ్లలో అమలుచేసినా మన దేశం దుర్గతి ఇలా ఉంటుందా? అని ప్రశ్నించేవారు ఉన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓ మతం వారిని సంతృప్తిపరుస్తూ గంపగుత్తగా ఓట్లు పొందే రాజకీయ పార్టీ, దాని పల్లకీ మోసే ‘ఎర్రబోరుూలూ’ డెబ్భై ఏళ్లు నిర్విఘ్నంగా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో రాజ్య సింహాసనంపై కూర్చునే ఉన్నారు. ఆ శక్తులే ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని గగ్గోలు పెడుతున్నారు?!
రాజ్యాంగం అంటే అదేం వేదఋక్కులు కావు. మేధావుల ఆలోచనల కలబోత. ఆనాడు వాళ్లకు అందిన స్ఫురణతో అత్యద్భుతంగా సంకలనం చేశారు. దానిని కూడా విమర్శించే వాళ్లు ఉన్నారు. అది కూడా భావస్వేచ్ఛగా, భావ సంఘర్షణగా ఎందుకు చూడకూడదు? 1935లో ఆంగ్లేయులు గవర్నమెంట్ రూల్ ఆఫ్ ఇండియాను ప్రవేశపెట్టారు. అందులోని 95 ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలోకి ఇంచుమించు యథాతథంగా వచ్చాయని చెప్తారు. ఉదాహరణకు 1860లో ఇంగ్లీషువాళ్లు తయారుచేసిన పోలీస్ యాక్ట్‌ను ఈ రోజు మనం అలాగే అమలు చేస్తున్నాం. 1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటం సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి ఈ చట్టం ప్రవేశపెట్టారు. ఈ చట్టం యొక్క దుర్వినియోగంవల్లనే కదా 13 ఏప్రిల్ 1919 నాటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. ఈ చట్టానికన్నా ముందు భారతదేశంలో సైనిక వ్యవస్థ ఉండేది కానీ పోలీస్ వ్యవస్థ లేదు. మైకేల్ ఓ డయ్యర్ అనే దుర్మార్గమైన అధికారి ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని లాలాలజపతిరాయ్‌ని గాయపరిచి మరణానికి కారణమయ్యాడు. ఈ దుర్ఘటన పర్యవసానం రాజగురు, సుఖదేవ్, భగత్‌సింగ్ వంటి వీరయోధుల మరణానికి కారణం అయ్యింది. ఈ సంఘటన 13 మార్చి 1940 నాడు 21 ఏళ్ళ తర్వాత వరకు సర్దార్ ఉద్యంసింగ్‌లో ప్రతీకార జ్వాలగా రగిలి కాక్స్‌టన్ హాల్లో జనరల్ డయ్యర్, లార్డ్ జెట్లండేత్‌ల ప్రాణాలు తీసింది. మరి ఈ రోజు అవసరాలకు తగినట్లుగా మనం ఈ చట్టాన్ని భారతీయులకు అనుకూలంగా మార్చుకొన్నాం. అంత మాత్రాన ఇది రాజ్యాంగానికి అవమానం అయ్యిందా?
అదేవిధంగా సెక్యులరిజం పేరుతో జరుగుతున్న ఓట్ల రాజకీయం పరోక్షంగా రాజ్యాంగ హననం కాదా? దీనిని ప్రశ్నించిన హెగ్డే ఎందుకు బోనులో నిలబడ్డాడు. ఇక్కడే మనం తప్పులో కాలేస్తున్నాం. దళితుడైన జడ్జి కర్ణన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తప్పుబడితే అతణ్ణి వెంటాడి జైలుకు పంపారు. అదే బెంచ్‌లోని ఓ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల్లా నలుగురు జడ్జిలు చీఫ్ జస్టిస్‌పై తిరగబడితే రాజ్యాంగ పరిరక్షణా!? దానికి ఎర్ర కామెర్ల రోగులంతా తగిన ప్రచారం కల్పించి, ప్రభుత్వంపై నిందలు వేస్తారా? ఇదేనా రాజ్యాంగ రక్షణ! అనంతకుమార్ హెగ్డే లేవనెత్తిన అంశంపై దురుద్దేశంతో దుమ్మెత్తిపోయకుండా దేశంలో సావధానంగా, ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. నిజంగా సెక్యులరిజం అమలు అయితే అది రాజ్యాంగ స్ఫూర్తే. కానీ ఒక మతంవారిని, అందులోని సంప్రదాయాలను తిడుతూ మరో మతంవారిని తలకెత్తుకోవడం ఎలాంటి సెక్యులరిజం? ఎప్పుడైతే సెక్యులరిజం ఓ తిట్టుపదంగా దుర్వినియోగం అయ్యిందో మరోవైపు సూడో సెక్యులరిజం అనే మాట పుట్టుకొచ్చింది. దాని పర్యవసానమే మోదీ, షాల రాజసూయ యాగం. ప్రస్తుతం అది ఉత్తరభారతం నిండుకొని దక్షిణం వైపు అడుగులు వేస్తోంది. యూరప్ దేశాల్లో 19వ శతాబ్దానికి ముందు రాజు, రాజ్యం క్రైస్తవ మతాధిపత్యంలో నడిచేవి. మత శాఖల ఆజ్ఞానుసారం అవిశ్వాసులను, అసమ్మతివాదులను ఓ పథకం ప్రకారం సామూహికంగా హత్య చేసేవారు. ఇది ప్రజల్లో ఆందోళనకు దారితీసింది. రాజ్యాంగ వ్యవస్థలో చర్చి జోక్యం తగ్గించడంకోసం ఏర్పడ్డ రాజకీయ భావనే సెక్యులరిజం. ఆ చరిత్రనంతా బాగా అధ్యయనం చేసిన కారల్ మార్క్స్ ‘మతం మత్తుమందు’ అన్నాడు. కానీ మన దేశంలో మత సహనం మన రక్తంలోనే ఉంది. మార్క్స్ అక్కడి చారిత్రక పరిస్థితులను గమనించి చెప్పిన విషయాన్ని ఇక్కడి కమ్యూనిస్టులు గమనించకుండా ఈ దేశ మెజారిటీ ప్రజలపై యుద్ధం ప్రకటించారు. అదీ బహుశా! ఓ చారిత్రక తప్పిదమే కాబోతుంది. సెక్యులరిజం అనే పదాన్ని ఉమర్ ఖాలీద్ లాంటి దేశద్రోహులకు, కన్హయ్య కుమార్ లాంటి జాతి విద్రోహులకు రక్షణ కవచంగా ఉపయోగిస్తున్నారు. ఇదేనా భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ మనకిచ్చిన స్ఫూర్తి!
ఈ డెభ్భై ఏళ్ల భారత గణతంత్ర నిర్మాణంలో రాజ్యాంగం యొక్క వౌలిక భావనలు అర్థం చేసుకోకుండా భావోద్వేగాలకు ఉపయోగించి రాజ్యాధికారం చెలాయించిన గుంపు ఇతరులు తమ చేతిలోని అధికారాన్ని హస్తగతం చేసుకొంటే భరించలేకుండా ఉండడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? ప్రపంచంలోనే అత్యంత విలువైన రాజ్యాంగం మనకుంది. కానీ ఈ డెబ్భై ఏళ్లలో సామాజిక జీవనంలోని అన్ని కేంద్రాలను మనకు మనం ధ్వంసం చేసుకున్నాం. అధికారం పొందాలనే యావతో దేశాన్ని మరణశయ్యపై ఉంచి లోపలున్న పనికివచ్చే పదార్థాన్ని తిని పైన కుళ్లిపోయిన డొల్లను చూసి మురిసిపోతున్నాం. ఈ రహస్యాన్ని కనిపెట్టి అధికార దాహానికి చరమగీతం పాడి ప్రజాశ్రేయస్సు కొరకు పనిచేయడమే రాజ్యాంగ స్ఫూర్తి!

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125
Published Andhrabhoom Friday, 26 January 2018

‘That these Bactrian kings we Hindus, is now universally admitted. Thus according to Dabistan, India enjoyed splendid civilisation 6000 BC (i.e) mearly 8000 years before the victorian age. భాక్ట్రియాను పరిపాలించిన రాజులు హిందువులన్న విషయం అందరికీ తెలిసిందే. దబిస్తాన్ పట్టికను చూస్తే భారతదేశం 6000 బి.సి నాటికే గొప్ప సంస్కృతిని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. అంటే విక్టోరియా పాలనకు పూర్వం 8000 సం.ల నాడు అన్నమాట!’ అంటూ భారతదేశంలో హిందువుల ప్రాచీన వైభవ స్థితిని గురించి ‘హరవిలాసశారద’ అనే చరిత్రకారుడు"The Hindu Superiority" అన్న గ్రంథంలో చెప్పుకొన్న ఆణిముత్యాలు ఇవి. కానీ ఆ వైభవం క్రీ.శ 712లో మహమ్మద్ బిన్ కాశిం సింధు రాజ్యాన్ని కబళించడంతో మంటగలవడం మొదలైంది. విగ్రహారాధకులను విధ్వంసం చేయాలన్న ఘోరీ, గజనీ, బాబర్ నుండి రజాకార్ కాశిం రజ్వీ వరకు ఈ దండయాత్ర అలాగే సాగింది. ఇక కర్జన్‌వైలీ నుండి లార్డ్ వౌంట్‌బాటన్ వరకు ఇక్కడి మెజారిటీ ప్రజలపై యుద్ధం బాగానే చేసారు. లక్షలాదిమంది అమరులై ఈ దేశానికి స్వాతంత్య్రం సాధించుకొన్నాం. ఖాయిది ఆజం మహ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతంతో ఈ దేశం రెండు ముక్కలైంది. ఇక్కడి హిందువులను బలిపీఠం ఎక్కించి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసినా అదొక రాచపుండులా వేధిస్తూనే వుంది. పోనీ స్వాతంత్య్రం వచ్చాక హిందూ సమాజం తమ చరిత్రను, సంస్కృతిని అధికారాన్ని ఎంతమాత్రం కాపాడుకొన్నది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?
సర్ జాన్ వుడ్రాఫ్ ఇండియా నాగరిక దేశమా? (Is India Civilized?) అనే పుస్తకంలో మన దేశానికి ఆంగ్లేయులు స్వార్ధంతో ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేస్తున్నారని, ఇది అన్యాయం, పాపం అని నెత్తీనోరు మొత్తుకున్నాడు. కానీ స్వాతంత్య్రం వచ్చాక మన బానిసత్వానికి కారణమైన అనేక విషయాలను చర్చించి పకడ్బందీగా వ్యవస్థ నిర్మించాల్సిందిపోయి అనేక లోపాలను కొత్తగా కొనితెచ్చుకొన్నాం.
197 దేశాలున్న భూఖండంపై హిందువు హిందువుగా జీవించాలంటే ఒక్క భరత ఖండంపైనే అవకాశం వుంది. నిన్నమొన్నటి వరకు హిందూ దేశంగా వున్న నేపాల్, చైనా కమ్యూనిస్టుల కారణంగా విధ్వంసంవైపు పయనిస్తోంది. ఇవాళ సౌదీ అరేబియాలో రాముని చిత్రాన్ని జేబులో పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. సత్యనారాయణ వ్రతం నిర్వహించుకోవడం అక్కడ సాధ్యం కాదు. మరి రేపు భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తే హిందువులకు దిక్కెవరు?
జమ్మూకశ్మీర్‌లో లక్షలాదిమంది హిందూ పండిట్లు నిరాశ్రయులయ్యారు. వారు ఈ రోజుకూ తమ స్వస్థలాలకు వెళ్లే పరిస్థితి లేదు. వారి గురించి మాట్లాడిన నాధుడు లేడు. ఉన్న ఊరిని విడిచి, కన్నవాళ్లను వెంటబెట్టుకుని ఉత్తర భారతం మొత్తం వారు ప్రవాస జీవితం ఎందుకు గడుపుతున్నారు? ప్రాచీనమైన చరిత్ర కాదుకదా ఆధునిక భారతంలో పండిట్ల వలసను ఆపలేని దుస్థితికి కారణం ఎవరు? ఇంకా విచిత్రం ఏమిటంటే ‘‘్భరతదేశం ఆక్రమణల్లో అందెవేసిన చేయి’’ అని జమ్మూకశ్మీర్‌ను, ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకొన్నదని స్వయం ప్రకటిత మేధావి అరుంధతీరాయ్ నిర్భీతిగా ఈ దేశంలో అనగలదు!? హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ సంస్థల అధీనంలో కొన్ని, కబ్జాకోరుల కబంధ హస్తాల్లో మరికొన్ని వున్నాయి. దేవాలయాలు ప్రతి రాష్ట్రంలో ఎంతో ఆదాయాన్ని సమకూర్చుతున్నా వాటిని హిందూ సమాజ ఐక్యతకు వినియోగించే వ్యవస్థ లేదు. దేవాలయాల భూములు పేదలకు పంచాలి అని నినదించే కామ్రేడ్ నారాయణ వక్ఫ్, ఆస్తులో, చర్చి ఆస్తులో అలా పంచమని ఎందుకు చెప్పరు?
వేల యేళ్ల నాగరికత వున్న మన సంప్రదాయాలను తులనాడుతూ సినిమా తీస్తారు, పుస్తకాలు రాస్తారు, చిత్రాలు గీస్తారు. ఎంఎఫ్ హుస్సేన్ సరస్వతీదేవి నగ్న చిత్రాన్ని గీసి కళాఖండం అంటే మనం నోరు తెరిచి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోయాం. రామసేతువుపై నాస్తిక కరుణానిధి కుట్రపూరితంగా మాట్లాడితే, డా. సుబ్రహ్మణ్య స్వామిలాంటివాళ్లు తప్ప బలంగా ఎవరూ ఖండించలేకపోయారు. దేశంలో దేవాలయాల వివాదాలు అలా ఉండగానే రామసేతువు అబద్ధం అన్నా ఎవరూ నోరు మెదపరు. ‘నాసా’ వాళ్లు పరిశోధన చేసి అక్కడ రామసేతువు ఉంది అన్నాక అందరి నోళ్లు మూతబడ్డాయి.
ఈ దేశంలోని మెజార్టీ ప్రజలకు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామ జన్మభూమి వందల ఏళ్లుగా వివాదంలో వుంది. దేశంలోని ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నిర్మించడానికి దాని పరిష్కారం కొనుగొనేవారిని సూడో సెక్యులర్ శక్తులు నిలువరిస్తున్నాయి. కంబోడియా, థాయ్‌లాండ్ తమ సరిహద్దుల్లో వున్న ఒక దేవాలయ సముదాయంపై శతాబ్దాల నుంచి వున్న వివాదానికి పరిష్కారం కొనుగొన్నాయి. అంతేకాకుండా ఆ స్థలానికి ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రత్యేక గుర్తింపు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రతాప్‌ఘర్‌లోని మొగల్ సేనాని అఫ్జల్‌ఖాన్ సమాధి మెల్లమెల్లగా విస్తరించి, అనేక మార్పులు చెందిన 23 అద్భుతమైన గదులతో కొత్త అందాలను సంతరించుకున్నది. న్యాయస్థానం అక్కడి అక్రమ కట్టడాలను కూల్చాలని ఆదేశించినా ఓటు బ్యాంక్ రాజకీయాలవల్ల అది సాధ్యం కాలేదు. మరి రామజన్మభూమిలో రామలల్లాపై ఓ కొత్త గది నిర్మించగలరా? మొన్న దీపావళికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన సందర్భంగా సరయూ నది పరిసర ప్రాంతంలో విద్యుద్దీపాలు వెలిగిస్తేనే అనేక విమర్శలు చేసిన సూడో సెక్యులర్ గ్యాంగ్ రేపు ఎన్‌డిఏ ఆధ్వర్యంలో పార్లమెంటు ద్వారా చట్టం చేసి రామమందిరం నిర్మిస్తే ఊరుకుంటారా?
హిందూ మతం అంటేనే ఒంటి కాలిపై లేచే నాస్తిక సంఘాలు, జన విజ్ఞాన సంఘాలు ఈ దేశ మూల సంస్కృతిని ఎందుకు విధ్వంసం చేయాలను కొంటున్నాయి. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాలను పంపే క్రమంలో హసన్‌లో వున్న ఆ సంస్థ ప్రధాన నియంత్రణ విభాగానికి చెందిన శాస్తవ్రేత్తలు ఉపగ్రహ నమూనాను ధర్మస్థలలోని మంజునాథ స్వామి ముందు ఎందుకు పెడతారో గమనించారా? అలాగే శ్రీహరికోట సమీపంలో అంకాలమ్మ దేవాలయంలో డైరెక్టర్ దంపతులు పూజ చేసి మరీ ఈ ప్రయోగానికి ఉద్యుక్తులవుతారన్న ఈ విదేశీ మానసపుత్రులు ఎందుకు విస్మరిస్తారు.
సరస్వతిని నాలుకపై, లక్ష్మీదేవిని వక్షస్థలంపై, శరీరంలో సగభాగం ఇచ్చి స్ర్తిమూర్తులను త్రిమూర్తులు నిలుపుకొన్నారని పురాణాలు ప్రతీకగా చెప్పాయి. కానీ హిందూ ధర్మంలో స్ర్తి పురుష సమానత్వం లేదు అని వాదించేవారు ఇతర మతాల్లో స్ర్తి పురుష సమానత్వం గురించి ఎందుకు మాట్లాడరు. కనీసం త్రిపుల్ తలాక్ చట్టంపై పార్లమెంటులో చర్చ జరుగుతుంటే తెలుగు మాధ్యమాలు కనీసం చిన్నపాటి చర్చనైనా జరపడానికి ఎందుకు సాహసించరు?
రాజకీయంగా ‘హిందూ’ అని చెప్పడం సిగ్గుగా భయపడేవాళ్లు ఇతర మతాల కార్యక్రమాలను ఆనందంగా తలపైకి ఎత్తుకుంటారు. హిందువుల గురించి మాట్లాడడం మతతత్వంగా ముద్ర వేసేవాళ్లు ఏమతం గురించి అయినా ఎందుకు మాట్లాడాలి? ఇదేం సెక్యులరిజం? మరోవైపు మతమార్పిడి ముఠాలు సేవ పేరుతో ప్రవేశించి మతం మార్పిడి ఉధృతంగా చేస్తున్నాయి. క్రీ.శ. 1498 వాస్కోడిగామా నుంచి ఈరోజు వరకూ వేలకోట్లు భారతదేశంలో గుమ్మరించినా అధికారికంగా క్రైస్తవుల జనాభా పది శాతం లోపే. వెయ్యేళ్ల పరాయిపాలనలో కూడా హిందూ జనాభా 85% మించి వుండడం హిందూ సాంస్కృతిక నిష్ఠకు తార్కాణం కాదా?
కులాల కుంపట్లను రంగులతో అలంకరించి మండిస్తున్న వ్యక్తులు హిందూమతాన్ని కులాల సముదాయం అని నినదిస్తున్నారు. ఇటీవల గతితార్కిక తర్కవాదులు ‘హిందుత్వాన్ని కేవలం బ్రాహ్మణత్వం’ అంటూ నినదిస్తున్నారు. మరి వ్యాసుడు, వాల్మీకి, విదురుడు, రాముడు, కృష్ణుడు, వివేకానందుడు, నారాయణగురు, మాదిగ కక్కయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, మలయాళస్వామి వంటి మహనీయులను హిందూ మతం నుండి విడదీయగలుగుతారా? వీళ్లంతా పుట్టుకతో బ్రాహ్మణులు కారే! వేరే సూక్తాలను సృష్టించిన శూద్రులను, మంత్రద్రష్టలైన స్ర్తిలను హిందుత్వ నుండి వేరుచేసి చూడగలమా!
ఎంతో ప్రాచీనమైన గ్రంథాలు, శిల్పం, వాస్తు, ఖగోళం వంటి విద్యలకు నెలవైన హిందుత్వం ఈ భూగోళం నుంచి తుడిచి వేయాలనుకోవడం సాధ్యమా? తమిళనాడులోని చిదంబరం క్షేత్రాన్ని ప్రపంచ భూ అయస్కాంత కేంద్ర స్థానంగా చెప్తారు. పంచభూతాత్మకమైన ఆలయాల్లోని చిదంబరం (ఆకాశలింగం), శ్రీకాళహస్తి (వాయులింగం), కాంచీపురం (పృథ్వీలింగం) ఈ మూడూ ఒకే రేఖాంశంపై నిర్మించడం హిందూ శిల్పుల ప్రజ్ఞకాదా?
హిందుత్వను ధ్వంసం చేస్తామని అంటున్నవాళ్లు ఒక ఆర్యభట్టను, భాస్కరాచార్యుణ్ణి, కపిలుణ్ణి, కణాదుణ్ణి, పతంజలిని, కాళిదాసును ఎలా నశింపచేస్తారు? ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు బట్టకట్టనినాడే యవ్వనంలో వున్న హిందూ సంస్కృతిని ధ్వంసం చేయడం సాధ్యమా?
ఆత్మరక్షణకో, దుర్మార్గాన్ని నిర్మూలించడానికో తప్ప మన దేశం ఎప్పుడూ దురాక్రమణ చేయలేదు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ సగర్వంగా ప్రకటించింది. అలాంటి ప్రాచీన వారసత్వానికి వారసులైన, శాంతి కాముకులైన హిందూ జీవన విధానం ప్రపంచానికే దిక్సూచి అవడం అతిశయోక్తికాదు. హిందుత్వం సత్యం. సత్యాన్ని ఎవరూ నిర్మూలించలేరు. హిందుత్వం ఎప్పుడూ తనలోని లోపాలను గుర్తిస్తూ ముందుకు సాగడంవల్లనే ప్రాచీన ప్రపంచ మతంగా సజీవంగా ఉండగలుగుతుందనేది నిజం.


డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125
Published Andhrabhoomi Published Friday, 19 January 2018

హిందూ మతంపై అపోహలు 
పురుషసూక్తంలో చేసిన అలంకారిక వర్ణనను బూచిగా చూపిస్తూ కులతత్త్వం రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు? మధ్యయుగాల్లో ముస్లిం రాజుల పాలన వల్ల పేరుకుపోయిన కులతత్త్వాన్ని రూపుమాపాల్సిన మనం కులం ఆధారంగా మనుషుల్ని విభజించి, పాలిస్తున్న శక్తులకు ఊతమిస్తున్నాం. కుటుంబాల మధ్య సౌహార్దానికి కులం గానీ వైషమ్యాలకు ఎంత మాత్రం కాదు. 

మతం అంటే మార్గం. ఆలోచనాపథం. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్లు నడిచే త్రోవ. అందుకే 'వాడి మతం వాడిదే' అన్నమాట లోకోక్తిగా మారిపోయింది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మన భారతదేశంలో ప్రాచీనమైన మతాలుగా చెప్పబడే శైవ, శాక్తేయ, గణాపత్య, సౌర, వైష్ణవాలు కాగా, మధ్యలో వచ్చిన జైన, బౌద్ధాలు, సిక్కు.. ఆ తర్వాత దురాక్రమణతో, రాజకీయ అధికారంతో ప్రవేశించిన ఇస్లాం, క్రైస్తవాలు ప్రధానమైనవి. ముందు చెప్పిన షణ్మతాలే ఇవాళ హిందూ ధర్మానికి పునాదులుగా నిలబడగా జైన, బౌద్ధ, సిక్కు మతాలు హిందూ ధర్మ అనుయాయ మతాలుగా, అంతర్భాగాలుగా స్థిరీకృతమయ్యాయి.

హిందుత్వను మతం అనవద్దని, ధర్మం అని పిలవాలని పండితులు చెప్తారు. ఎందుకంటే ఎన్నో మతాలను ఇముడ్చుకొనే శక్తి దీనికున్నది; నదులన్నీ సాగరాన్ని చేరినట్టుగా పరమాత్మను చేరే వివిధ మార్గాలను ఈ మతం ప్రబోధించింది. అలాగే హిందూ ధర్మం ఒక వ్యక్తి చేత స్థాపించబడలేదు. ప్రత్యేకమైన ప్రవక్త దీనికి లేడు.

అట్లాగే హిందుత్వను సనాతన మతం అనీ, ఆర్యమతమనీ, వైదిక మతమనే పేర్లతో పిలుస్తారు. ఇదొక జీవన విధానం. ఈ విషయం సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. అవిచ్ఛన్నంగా అమృతధారగా కొనసాగుతూ తత్త్వ జ్ఞానానికి భాండాగారంగా నిలిచింది. 'మతాలన్నీ మానవత్వాన్ని ప్రబోధించడానికే ఏర్పడ్డాయి' అని భావించే సంస్కృతి హిందువులది. మానవత్వం ఉండాల్సిన స్థాయికన్నా, ఎక్కువై అది స్వేచ్ఛగా రూపాంతరం చెందింది. ఆ స్వేచ్ఛ ఈ రోజు పరమత సహనం రూపంలో, దేశానికి, ధర్మానికి ఏం జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే దుస్థితికి దిగజారింది.

ఇటీవలి కాలంలో కుహనా మేధావులు విదేశీ శక్తులతో కలిసి, కుట్రపూరిత సిద్ధాంతాలను వల్లెవేస్తూ హిందుత్వంపై విషం చిమ్ము తున్నారు. అందులో ప్రధానంగా ఆర్య-ద్రావిడ సిద్ధాంతం ఒకటి. ఆర్య శబ్దం గొప్పవారు అనే అర్థం సూచించేదేకానీ మరోటికాదు. శ్రీమద్రామాయణంలో కోసల దేశంలో పుట్టిన రాముణ్ణి సీత ఆర్య పుత్రా! అని సంబోధిస్తుంది.

లంకను పాలించే రావణుణ్ణి మండోదరి కూడా ఆర్య పుత్రా! అని సంబోధిస్తుంది. మరి ఆర్య-ద్రావిడ వర్గాలేమిటో వీళ్ళ ఎర్ర మస్తిష్కాలకే తెలుసు. అలాగే దళితులు-వారి సమస్యలు భారతదేశం అంతటా ఒకే పరిస్థితుల్లో ఉన్నాయా? లేవా? ఆర్య దళితులు, ద్రావిడ దళితులు వేర్వేరుగా ఉన్నారా? విదేశీ చరిత్రకారులు వండి వార్చిన సిద్ధాంతాలను వడ్డించే బాధ్యతను తీసుకొని ఇక్కడి వైదేశిక మానసిక శక్తులు ఈ యాభై ఏళ్ళలో ఆర్య-ద్రావిడ సిద్ధాంతానికి కావలిసినంత రంగు అద్దాయి. ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించే పనిలో ఉన్న ఈ సంస్థలకు ఇదొక ఆయుధం. వీటికి విదేశీ నిధులు మానవహక్కుల సంస్థల పేరిట, ప్రజాస్వామ్యసంఘాల పేరిట కావలసినన్ని అందుతున్నాయి.

దళిత వాదం పేరిట ఇటీవల కొందరు భ్రష్ట మేధావులు పదవుల కోసం, పదిమందిలో పేరు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. బలి చక్రవర్తి, రావణుడు, నరకుడు 'మా వాళ్లు' అనీ, హిందూ దేవీ దేవతలు వాళ్ళను చంపి పండుగలు చేస్తున్నారని అజ్ఞానపు రాతలు రాస్తున్నారు. పురాణం ముఖం చూడని ఇలాంటి రాతల వల్ల జాతిని చీల్చాలన్నదే వారి కుట్ర.

శంభూకుడి కథను రామాయణంలో ఉదాహరణగా చూపిస్తూ రాముణ్ణి అధార్మికుడిగా ప్రచారం చేయాలని సంకల్పించడం సూర్యుని ముఖం మీద దుమ్ము పోయడమే.

'కులమొక కుట్ర-దాని పడగొట్ర' అన్న సిద్ధాంతం చేయాల్సిన విద్యావంతులు కులంపేరుతో సమాజాన్ని చీల్చివేస్తున్నారు. ఆత్మాభిమానం కలిగిస్తున్నామనుకొనే ఈ మేధావులు జాతిని ముక్కలు ముక్కలుగా చేయాలనే విదేశీ శక్తుల సంకల్పానికి ఊపిరి అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యక్తుల, పార్టీల, వర్గాల, గ్రూపుల మధ్య ఉండే అనేక రాజకీయ వర్గాల వైరాల కారణాల వల్ల జరిగిన హత్యలకు హిందుత్వంపై నెపం వేసి సంబరపడిపోతున్నారు. వేలయేళ్లనాడు మనువు రాసిన స్మృతిపై వాళ్ల అక్కసును అప్పుడప్పుడూ వెళ్ల గక్కుతారు.

యాభై ఏళ్ల క్రితం ఉన్న సమాజ స్వరూపమే ఈ రోజు పూర్తిగా మారిపోయింది. ఆహార్యం, ఆహారం, ఆచారం, ఆచరణ వేటిలోనైనా హిందువుల్లో వచ్చిన సంస్కరణ ప్రపంచంలో ఏ జాతిలో రాలేదు. అలా రావడానికి ప్రధానంగా హిందువులకు సనాతనంగా వస్తున్న తత్త్వ చింతన. బాహ్య విషయాలకే ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఆంతరికమైన విజ్ఞానమే మనకు అలంకరణం అనే గొప్ప భావం ఈ జాతిలో జీర్ణించుకుపోయింది.

అరవై ఏళ్ళ క్రితం రాసుకొన్న రాజ్యాంగానికి ఇంతవరకూ 112 సవరణలు చేసుకొన్నాం. వేల యేళ్ళ నాడు రాసిన మనుస్మృతిని ఎన్ని మార్లు సంస్కరించాలో ఆలోచించవలసిన అవసరం లేదా? పోనీ... అసలు మనుస్మృతి చదివిన హిందువులు ఎంత మంది? భక్తి, జ్ఞాన, యోగాలకు తత్త్వభూమిక అయిన భగవద్గీతనే చదివే తీరికలేని హిందువులు మనుస్మృతి చదివి ఇతర జాతులపై యుద్ధాలు చేస్తున్నారా? ఎంత మూర్ఖపు వాదన! విదేశీ పండితులు ఎందరో ఈ సాహిత్యంలో వేలుపెట్టి, ప్రక్షిప్త -ప్రక్షేపాలను చొప్పించారు.

ఉదాహరణకు వరరుచి నిఘంటువు ఉన్నంత వరకూ అంటే ఎనిమిదవ శతాబ్దం వరకూ హిందూ సంస్కృతి, సాహిత్యానికి దెబ్బతగలలేదు. జైనుడైన అమరసింహుడు వచ్చిన తర్వాత (చాలామంది సంప్రదాయ పండితులకు కూడా నా మీద కోపం రావచ్చు) మన సాంస్కృతికపదాలకు భ్రష్టత్వం వచ్చింది. మందిర శబ్దానికి ఇల్లు -గృహం అనేవి అర్థాలుగా వచ్చాయి. అంతకు ముందు 'మందిరం' కేవలం దేవతలకు సంబంధించినదనే అర్థంలో వాడేవారు.

ఇవాళ చీరల దుకాణానికి, చెప్పుల దుకాణానికి కూడా మందిర్ పేరు తగిలించి పెట్టుకొంటున్నారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాల పేర్లతో ఇలాంటివి సాధ్యమా? పురుషసూక్తంలో చేసిన అలంకారిక వర్ణనను బూచిగా చూపిస్తూ కులతత్త్వం రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు? మధ్యయుగాల్లో ముస్లిం రాజుల పాలన వల్ల పేరుకుపోయిన కులతత్త్వాన్ని రూపుమాపాల్సిన మనం కులం ఆధారంగా మనుషుల్ని విభజించి, పాలిస్తున్న శక్తులకు ఊతమిస్తున్నాం. కుటుంబాల మధ్య సౌహార్దానికి కులం గానీ వైషమ్యాలకు ఎంత మాత్రం కాదు.

కులం అనే వల వేసి బ్రతికే రాజకీయ నాయకులు, హిందుత్వకు వ్యతిరేక పుస్తకాలు రచించి అంతర్జాతీయ అవార్డులు కొట్టేసే అధమస్థాయి రచయితలు కులాన్ని 'సజీవం' చేస్తున్నారు. దళిత క్రైస్తవులపేరుతో కొందరు ఇటీవల మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ప్రపంచంలో ఎవ్వరికైనా పుట్టుకతో కొన్ని సంక్రమిస్తుంటాయి. అవి కులం, మతం, ప్రాంతం, తల్లిదండ్రులు... వీటిని ఎవ్వరూ మార్చలేరు.

కానీ ఇందులో ఉండే ఆర్థిక వ్యత్యాసాలను మన ప్రయత్నం ద్వారా మార్చవచ్చు. రాజ్యాంగవేత్తలు హిందూ మతంలో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించారు. దళితుల రాజ్యాంగబద్ధ హక్కును హరించాలనే దురూహతో ఇటీవల కొందరు మేధావుల పేరుతో చెలామణీ అవుతూ, నాయకులను ఓట్ల కొరకు లొంగదీసుకొని, మతం మారిన క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని తెలిసినా పదే పదే లేవనెత్తి రాజకీయ అంశంగా తయారు చేస్తున్నారు.

మతం మారినప్పుడు కులం ఎందుకు మారదు? అలాగే మతం పేరిట రిజర్వేషన్ వద్దనే రాజ్యాంగ మూల భావనను విస్మరించి ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని భ్రమలు కల్పించి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు. దేశవిభజన జరిగినప్పుడు 18 శాతం జనాభా, 32 శాతం భూమి కోల్పోవడం జరిగింది. ఇంకా తాయిలాలతో దేశాన్ని ఇంకెన్ని ముక్కలు చేస్తారు? కులాన్ని, మతాన్ని ఓట్లకోసం ఉపయోగించే కుయుక్తులు నశించే పోరాటాలు రావాల్సిన అవసరముంది.

హిందుత్వ అనగానే బ్రాహ్మణిజం అంటూ మండిపడే మరో వర్గం, దేశంలో చైతన్యంగానే పనిచేస్తున్నది. హిందువులు కేవలం బ్రాహ్మణులా? హిందూమతం అంటే బ్రాహ్మణుల సంప్రదాయా లా? వీళ్లలో స్పష్టత లేదు. అసలు బ్రహ్మ శబ్దానికి అర్థం తెలియని లౌకికవాదులు బ్రాహ్మణ కులతత్త్వాన్ని హిందుత్వగా ప్రచారం చేస్తూ, వీళ్లు అనుకొనే-సంబోధించే నిమ్న కులాలను హిందుత్వం నుంచి దూరంచేయాలని చూస్తున్నారు. 

విశ్వకుటుంబ భావన (వసుధైవ కుటుంబం), మానవత్వ భావన (ఆత్మైక దృష్టి), అందరిలో భగవంతుణ్ణి చూసే (ఈశావాస్య మిదం సర్వం) 'భావన' హిందుత్వ ప్రత్యేక లక్షణాలు. భారతదేశంలో అహింస వంటి గొప్ప సిద్ధాంతాలను వ్యాప్తిలోకి తెచ్చింది జైనం. జైన తీర్థంకరులు క్షత్రియులు. శ్రీరాముడు క్షత్రియుడు. 

వ్యాసుడు, వాల్మీకి నిమ్నకులాలకు ప్రతీకగా వచ్చి గ్రంథరచన చేశారు. స్వామి వివేకానందుడు కుల బ్రాహ్మణుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉపనిషత్ వాఙ్మయాన్ని వైదిక ధర్మ ప్రతీకగా ప్రబోధించి హిందుత్వను విశ్వజనీనం చేశాడు. ఉపనిషత్ వాఙ్మయం అంతా ఆత్మతత్వాన్ని ప్రవచించిందే. అం దులో స్త్రీలకు ప్రధాన పాత్ర ఉంది. ఈ దేశంపై భౌతికంగా ఇస్లామిక్ తీవ్రవాదం, మావోవాదం ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నాయి.

ఈ రెండింటికీ పాకిస్థాన్, చైనా ప్రోద్భలం ఉంది. క్రైస్తవుల దృష్టి భారత్‌పై పడింది. అందుకే కుప్పలుతెప్పలుగా నిధులు వెదజల్లుతూ, భారత్‌లోని కుల, రాజకీయ, సామాజిక పరిస్థితులను ఆధారం చేసుకొని మతమార్పిడికి పాల్పడుతూ దైవనిర్ణయాన్ని హననం చేస్తున్నారు. అమెరికా, రష్యాల్లో చర్చిలు అమ్మకానికొస్తే వాటిని కొని ఇస్కాన్ సంస్థ కృష్ణ మందిరాలు ఏర్పాటు చేస్తున్నది. (ఇది భరించలేకే రష్యాలోని ఓ చర్చి భగవద్గీతకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది).

కేరళను 'దేవభూమి'గా చెబుతూ క్రైసవాన్ని విశృంఖలంగా ప్రచారం చేస్తున్నారు. దేశ రాజకీయ పరిస్థితులు, నాయకుల ప్రవర్తన వాళ్లకు బలాన్ని సమకూరుస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఈ దేశంలోని 85శాతం హిందువులు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు (మరే దేశంలో అయినా విప్లవం వచ్చేది). ఈ దేశాన్ని ముక్కలుచేసే కుటిలయత్నం రకరకాలుగా జరుగుతూనే ఉంది.

- డాక్టర్ పి.భాస్కరయోగి
ఆంధ్రజ్యోతి  04-09-2012


ఒకసారి అల్వార్‌ సంస్థానపు రాజు మంగళ్‌సింగ్‌.. స్వామి వివేకానందను కలుసుకొన్నారు. ఆయనకు పాశ్చాత్యవ్యామోహం ఎక్కువ. భారతీయుల విగ్రహారాధనకు కారణం అజ్ఞానమేనని భావించేవాడు. అందుకే వివేకానందుని కలిసినప్పుడు.. ‘స్వామీ నాకు విగ్రహారాధన పట్ల నమ్మకం లేదు. నా గతి ఏమవుతుంది?’ అని ప్రశ్నించాడు. వెంటనే వివేకానందుడు.. ఆ సంస్థానపు దివాన్‌ మేజర్‌ రామచంద్రను పిలిచి గోడపైనున్న రాజుగారి చిత్తరువుపై ఉమ్మి వేయాల్సిందిగా ఆదేశించారు. దానికాయన.. రాజుగారి చిత్తరువుపై తాను ఉమ్మి వేయలేనన్నాడు. చిత్తరువుపై ఉమ్మి వేస్తే రాజుగారిపై ఉమ్మి వేసినట్లు కాదు కదా అన్నారు స్వామి. అయినా ఎవరూ సాహసించలేదు.

              అప్పుడు వివేకానందుడు రాజును ఉద్దేశించి.. ‘రాజా ఈ చిత్రం మీ ప్రతిబింబం మాత్రమే. కానీ దీన్ని చూసినప్పుడు వారి మదిలో మీరే మెదిలారు. అందువల్ల మీ పట్ల చూపే మర్యాద ఆ చిత్తరువు పట్ల కూడా చూపిస్తున్నారు. అలాగే రాయి, మట్టి, చెక్కలతో చేసిన దైవ విగ్రహాల పట్ల కూడా భక్తుల ఆరాధన అలాగే ఉంటుంది’ అని చెప్పారు. నిరాకార తత్వాన్ని చేరాలంటే విగ్రహం ఒక కిటికీ లాంటిది. నిగ్రహం కోసం విగ్రహం కావాలి. అది కలిగాక విగ్రహం అవసరం ఉండదు.

                 సకారాత్మకత లేకుండా సత్యశోధన చాలా కష్టం. విగ్రహాన్ని ఆరాధించడం.. చిత్తానికి ఏకాగ్రతను, ఆత్మతృప్తిని కలిగించి మనిషిని యోగమార్గం వైపు తీసుకెళ్తుంది. విగ్రహంపై పరమాత్మ స్వరూపస్వభావం బ్రహ్మభావన కలిగిస్తుంది. మనచుట్టూ ఆవరించి ఉన్న విశ్వాకారుడైన పరమాత్మతో అనుసంధానం కలిగించే ప్రాథమిక విద్య విగ్రహారాధన. అస్పష్టంగా ఉన్న తత్వాన్ని స్పష్టంగా ఉన్న మాధ్యమం సాయంతో చేరేందుకు నిర్మించిన ఆధ్యాత్మిక వంతెన అది.

-డాక్టర్‌ పి.భాస్కర యోగి
ఆంధ్రజ్యోతి నవ్య నివేదన
15-01-2018 సోమవారం..
              
              

అది మిచిగన్ ఎవెన్యూలోని భవనం. ఈ భవనం చికాగో కళాభవనం (art institute) అంగరంగవైభవంగా ఉన్న సుదినం. 1893 సెప్టెంబర్ 11వ తేదీ సర్వమత మహాసభ జరిగే స్థలానికి కొలంబస్ భవనం అని పేరుపెట్టారు. ప్రపంచ ప్రదర్శనగా శిల్పాలు, చిత్తరువులు, కంచు విగ్రహాలు, 4వేలమంది ప్రతినిధులు, రోమన్ మేధావి మార్కస్ టులియస్ సిసిరో, గ్రీసు దేశపు వక్త డెమస్తనీస్ పాలరాతి శిలావిగ్రహాలు - ఆ విగ్రహానికి ఎడమవైపు కుడిచేతిని పైకెత్తి, ఒక విహంగాన్ని ఎగురేస్తూ నిలబడి ఉన్న రోమన్ విద్యాదేవత ‘మినర్వా’ రాగి విగ్రహం ఆ ప్రాంగణానికి శోభను చేకూర్చాయి. అంత శోభాయమానమైన ప్రాంగణంలో వేలాదిమంది మధ్య కొద్దిసేపట్లో సింహగర్జనకు సిద్ధంగా ఉన్న వేదాంత కేసరి స్వామి వివేకానంద ఎరుపురంగు దుస్తులు, పసుపురంగు తలపాగా ధరించి 31వ ఆసనంలో ఆసీనులయ్యారు.
అందరూ నిశ్శబ్దంగా కూర్చొన్నారు. హఠాత్తుగా పియానో వాద్యం మొదలైంది. అక్కడి ప్రతినిధులంతా ‘్భగవంతుణ్ని స్తుతించండి’ అనే స్తుతి చదివారు. మొదట గ్రీకు చర్చ్ ఆర్చిబిషప్ జానే్త, పదేళ్లకుపైగా అమెరికాలో ఉన్న మజుందార్, కన్ఫ్యూషియన్ మత ప్రతినిధి ఫుంగ్‌క్వాంగ్, శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ ధర్మ ప్రతినిధి ధర్మపాలుడు ప్రసంగాలు చేశారు. తన మదిలో భారతమాతను గురించి ఎన్ని భావోత్తుంగ తరంగాలున్నాయో తెలియదుకానీ వౌనంగా కూర్చొన్నాడు. అతని మనస్సులో ఎన్ని ఆధ్యాత్మిక విజ్ఞాన రాశులున్నాయో చెప్పలేంగాని గంభీర వదనుడై గమనిస్తున్నాడు. గురుదేవులైన శ్రీరామకృష్ణులను, ఆయన ఆరాధ్య దేవత కాళీమాత, మాతృమూర్తి శారదామాతను తనలోకి ఆవాహన చేసుకొంటున్నట్లుగా స్వామి వివేకానంద కూర్చొని అన్నీ వింటున్నాడు. తన వంతు రాగానే ఒక్కసారి సరస్వతిని మనసులో ప్రార్థన చేశాడు. ‘‘అమెరికా సోదర సోదరీమణులారా!’’ అని తన గంభీర స్వరంతో చెప్పగానే దిక్కులు పిక్కటిల్లేలా కరతాళ ధ్వనులు మారుమోగాయి. కాషాయ వస్త్రాలు ధరించిన తేజోమూర్తి అయిన యువకుని ఈ సంబోధన అక్కడి ప్రతినిధుల హృదయాల్లో సరికొత్త ఉత్సాహం కలిగించింది. కరతాళ ధ్వనుల స్వాగతం స్వామీజీలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. ‘‘సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనానే్నగాక, సర్వమతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం’’ అంటూ హిందూమత ఔన్నత్యాన్ని స్వామి చెప్పారు. ఆ తర్వాత కొనసాగిస్తూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేరున మీకు నా అభివాదాలు. సమస్త మతాలకూ, సమస్త ధర్మాలకూ తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేరున మీకు నా అభివాదాలు. నానాజాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనసహస్రాల పేరిట మీకు నా అభివాదాలు’’ అంటూ ఉపన్యాసంతో ఉరకలెత్తించారు.
స్వామి ప్రసంగం ప్రపంచమత మహాసభను కొత్తమార్గంవైపు నడిపింది. స్వామీజీ ప్రసంగం గొప్పతనాన్ని గురించి పాశ్చాత్య ప్రసిద్ధ పత్రికలన్నీ అద్భుతంగా అభివర్ణించాయి. ఉపన్యాసం చిన్నదే అయినా ప్రపంచమత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహా సందేశం అది. ‘‘ఆయన మాటల్లో అగ్నికణాలు విరజిమ్మాయి’’ అని రోమరోలావంటి వాళ్లు పేర్కొన్నారంటే ఆయన ప్రభావం ఏమేరకు ఉందో మనం ఊహించుకోవచ్చు.

స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడిన తరువాత రెండు ముఖ్య పరిణామాలు సంభవించాయి. భారతీయ ఆధ్యాత్మిక పాండిత్యాన్ని పురాణఫక్కీలో చెప్పడం అలవాటున్న మన దేశస్థులకు ‘ఆధునిక ఆధ్యాత్మిక ప్రబోధం’ ఎలా చేయాలో తెలిసివచ్చింది. పాశ్చాత్యులకు మన మత విశ్వాసాలపై ఉన్న అజ్ఞానపుటలు చిరిగిపోయాయి. సముద్రం దాటవద్దన్న భ్రమలో ఉన్న మన పండితులకు వివేకానందుని విప్లవాత్మక నిర్ణయం ఓ మార్గాన్ని సృష్టించింది. ఆయన తర్వాత పాశ్చాత్య దేశాలను అంతే స్థాయిలో అద్వైత తత్వంలో ముంచిన స్వామి రామతీర్థ, యోగుల జీవితాలను, భారతీయతత్వ చింతనను పాశ్చాత్యులకు అందించిన పరమహంస యోగానందలకు స్వామి వేసిన మార్గమే పూలబాటగా మారింది. భారతీయ యోగవిద్యను ప్రబోధించే పరమహంస యోగానంద విరచిత ‘ఏ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ అనే పుస్తకం వందేళ్ల తరువాత కూడా ఎన్నో పాశ్చాత్య విశ్వవిద్యాలయాలకు పాఠ్యగ్రంథంగా ఉందంటే మనం నమ్మలేం. పాశ్చాత్యులు - ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు హిందూమతం అంధ విశ్వాసుల మతమనీ, అనాగరికమనీ అప్పటివరకు భావించారు. కానీ వివేకానందుడు అమెరికా వెళ్లాక చేసిన ప్రసంగాల పరంపర వారి అజ్ఞానాన్ని విధ్వంసం చేసింది. అమెరికాలోని ఎన్నో నగరాల వీధుల్లో స్వామి చిత్రపటాలు పెడితే దారిన వెళ్లేవారు రెండు నిమిషాలు వినమ్రంగా అక్కడ నిలబడి వౌనంలోకి వెళ్లేవారంటే వారికి స్వామిపై ఎంత గౌరవం ఏర్పడిందో ఊహించుకోవచ్చు. ఒకవేళ భారతదేశం నుంచి స్వామి వివేకానందుడు అమెరికా వెళ్లకపోయి ఉంటే ఆయనకు ఈ దేశంలో గౌరవం దక్కేది కాదు. తగిన గుర్తింపు వచ్చేదీకాదు. పాశ్చాత్య దేశాల్లో హిందూ ధర్మవైభవం ప్రకటితమయ్యేది కాదు అన్న ఓ మహనీయుని మాటలు అక్షర సత్యాలు. స్వామి ప్రభావం అంత గొప్పది కాబట్టే పూర్ణయోగాన్ని ప్రకటించిన అరవిందుణ్ని, స్వాతంత్య్రోద్యమంలో వీరావేశంతో పనిచేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను ఏకకాలంలో ఆకర్షించగలిగాడు.
మత విశ్వాసాలకు మానవీయ దర్శనంతో ప్రవచించిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద. ‘మతాలెన్నో మార్గాలన్ని’ అని ప్రబోధించిన శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ జాతికి అందించారు. గ్రంథస్తమైన హైందవ మత ప్రాచీనతను, ఆధ్యాత్మిక అంతరంగాన్ని ఉపనిషత్తుల వెలుగులో ప్రపంచానికి చూపించారు. తమ మతమే గొప్పది, తమ ప్రవక్త ద్వారానే జ్ఞానం పొందగలరు, తమ దేవుడే మోక్షం కల్పించగలడు అనుకొన్న సంకుచిత వైదేశీ మతాల కళ్లు తెరిపించి ‘‘ఏకం సద్విప్రా బహుదావదన్తి’’ అన్న సనాతన ధర్మ సూత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన దివ్యమూర్తి స్వామి వివేకానంద.
‘‘హైందవునికి ప్రపంచంలోని మతాలన్నీ వివిధ పరిస్థితులలోను, సందర్భాల్లోను ఉన్న స్ర్తి, పురుషులంతా ఒకే గమ్యంవైపుగా చేసే ప్రయాణమే. ఒకే కాంతి వివిధ రంగు అద్దాలగుండా ప్రసరించి వివిధ రంగుల్లో కానస్తుంది. మనల్ని రక్షించుకోవడానికి ఈ వైవిధ్యాలు అవసరం’’ అని హైందవ మత గొప్పతనాన్ని అన్యమతాల తలబిరుసుతనాన్ని ఏకవాక్యంలో కడిగి పారేశారు స్వామి వివేకానంద.
అలాగే విజ్ఞానం, మతం రెండూ పరస్పర భిన్నకోణాలని పాశ్చాత్యుల నిశ్చితాభిప్రాయం. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన శాస్తవ్రేత్తను శిక్షించిన మతాలను చూస్తే ఇలాంటి అభిప్రాయం కలగడం సహజమే! ఈ రోజుకూ భారతదేశంలోని అభ్యుదయవాదుల పేరుతో చలామణి అయ్యే వారందరూ ఇదే దురభిప్రాయంతో ఉన్నారు. దీనిని స్వామి 150 ఏళ్లనాడే ఖండించి సమన్వయం చేశారు. ‘‘ఏకత్వ స్థితిని ఆవిష్కరించడమే విజ్ఞానం. పరిపూర్ణ ఏకత్వ స్థితిని సంతరించుకోగానే విజ్ఞానం ఇక ముందుకు పోకుండా ఆగిపోతుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడమే అందుకు కారణం. ముడిసరుకు మూలతత్వాన్ని తెలుసుకొన్నాక రసాయన శాస్త్రం, మూలశక్తి మూలం కనుగొన్నాక భౌతికశాస్త్రం ఆగిపోతాయి. కానీ మరణంతో కూడుకొన్న ఈ ప్రపంచంలో మరణానికి అతీతమైన, మారుతున్న ప్రపంచంలో పరిణామం లేని ఒకే ఆధారమైన అతణ్ని కనుక్కోగానే, ఒకే ఆత్మనుండి ఇతర ఆత్మలు వెలువడుతున్నట్లు మాయవల్ల కన్పిస్తుందో ఆ ఆత్మను కనిపెట్టగానే మత విజ్ఞానం పరిపూర్ణమవుతుందని’’ స్వామి తెలిపారు.
ఇవాళ సమాజంలో రేగుతున్న కుల, మత, వర్గ వైషమ్యాలను ఆనాడే స్వామి గుర్తించారు. ‘‘కావలసింది కలహం కాదు - సహకారం. ధ్వంసం కాదు - ఐక్యత. శత్రుత్వం కాదు - శాంతియుత సమన్వయం.’’ అన్న మాటలతో స్వామీజీ చికాగో ఉపన్యాసాలు ముగిశాయి. అవి ఈనాటికీ ఆదర్శం.
భారతదేశాన్ని భారతమాతగా - ఆదిశక్తిగా దర్శించాడు స్వామీజీ. ప్రస్తుతమున్న మూడు సముద్రాల కలయికగల వివేకానంద స్మారకస్థలంలో కూర్చొని భారతమాతను దర్శించాడు. శ్రీరామకృష్ణుల దివ్యతత్వ దర్శనాన్ని భారతదేశానికి అందించడానికి శ్రీరామకృష్ణ మిషన్ స్థాపించాడు. అది ఈనాడు ఆధ్యాత్మికతత్వానికి, సేవాతత్పరతకు ఆలవాలమై అలరారుతున్నది. ‘‘్భతిక విజ్ఞానం భౌతిక సంపదలను మాత్రమే చేకూర్చగలదు. ఆధ్యాత్మిక విజ్ఞానం శాశ్వతమైన బ్రహ్మానందాన్ని చేకూర్చుతుంది’’ అని భారతీయ తత్వచింతనను ప్రపంచమంతా వినిపించారు. స్వామి శరీరం ఈ భూమిపై 39 ఏళ్లు మాత్రమే నడయాడినా అపర ఆదిశంకరునిలా ప్రపంచమంతా చుట్టబెట్టి వేదాంత విజ్ఞాన బీజాలు వెదజల్లిన భారతీయ సన్యాసి.
కులతత్వాన్ని నిరసించి ఈ దేశంలో మనిషి కాదు కుక్క కూడా ఆకలితో ఉండరాదని ఘంటాపథంగా చెప్పిన సామ్యవాది! యువకుడిగా ఉండి దక్షిణామూర్తిలా ధర్మప్రబోధం చేసిన స్వామి వివేకానంద ‘‘ఇనుప కండరాలూ, ఉక్కు నరాలూ, వజ్రసంకల్పం ఉన్న వందమంది యువకుల్ని నాకు ఇస్తే ఈ దేశప్రగతిని మార్చేస్తాను’’ అని తూటాల్లాంటి మాటలు ఈనాటికీ ఈ దేశ యువత మననం చేసుకొని ముందుకు సాగుతున్నారు. వేదాంత గర్జన చేసిన దార్శనికుడిగా, సమసమాజ స్థాపన కోరుకొన్న సామ్యవాదిగా, యువత ఆలోచనలకు అద్దంలా నిలబడ్డ విజ్ఞానిలా, భారతీయ మూర్త్భీవించిన ప్రాచీన ఋషిలా, ఆధునికతను అర్థం చేసుకున్న శాస్తవ్రేత్తలా భిన్నకోణాల్లో దర్శనమిచ్చే ఏకతామూర్తి స్వామి వివేకానంద.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125
Published Andhrabhoomi,  Friday, 12 January 2018

Published on Jul 8, 2017

బోనాల పండుగలో ప్రధానంగా పాటించాల్సిన నియమాలు || Ammaku Bonam by Dr. P Bhashkara Yogi || Episode 5 || Amrutha Kalasam || Episode 105 || Bhakthi TV Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
గోల్కొండ మరియు లష్కర్ బోనాల పండుగ ప్రాముఖ్యత || Dr. P Bhashkara Yogi || Bhakthi TVPublished on Jul 1, 2017

గోల్కొండ మరియు లష్కర్ బోనాల పండుగ ప్రాముఖ్యత || Ammaku Bonam by Dr. P Bhashkara Yogi || Episode 4 || Amrutha Kalasam || Episode 104 || Bhakthi TV Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.


బోనం వెళ్ళేటప్పుడు సిగం లేదా పూనకం ఎందుకు ఎలా వస్తుంది? || Dr. P Bhashkara Yogi || Bhakthi TVPublished on Jun 30, 2017

బోనం వెళ్ళేటప్పుడు సిగం లేదా పూనకం ఎందుకు ఎలా వస్తుంది? || Ammaku Bonam by Dr. P Bhashkara Yogi || Episode 3 || Amrutha Kalasam || Episode 103 || Bhakthi TV Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.