కార్య నిర్వాహక వ్యవస్థకు న్యాయవ్యవస్థ ప్రత్యామ్నాయం కాదు. అదే సమయంలో న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఎంతో ముఖ్యం.
– కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ.
న్యాయ దేవతకు జయం కలగాలి.
దేశవాళి ఆవుల కోసం ప్రత్యేక డెయిరీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు దాణాను ఉత్పత్తి చేసేవారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది.
– కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్.
గోవు మా తల్లికి కోటి దండాలు అంటారన్న మాట అలాగే అదే చేతుల్తో గోవధశాలలు మూయించండి ప్లీజ్.
కేసీఆర్ హిట్లర్. నదులు పారుతున్నాయని ప్రాజెక్టులు కట్టేస్తారా? కేసీఆర్‌ను బాబు ఎందుకు నిలదీయడం లేదు.
– కర్నూలు జలదీక్షలో జగన్
హిట్లర్… ముస్సోలినీ వంటి రాజకీయ కుట్రలు తమరి నాన్నగారివల్లనే కదా వీళ్ళంతా నేర్చుకొంది. మీరు కెసిఆర్‌తో కలిసే బాబును బజారుకీడ్చాలని ఈ దీక్షా చేపట్టారని జనం చెవులు కొరుక్కొంటున్నారు.
ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ అనర్హుడు. అతడు పూర్తిగా భారతీయుడు కాదు. అతను ఆర్థిక వ్యవస్థకు అపకారం చేస్తున్నాడు.
– భాజపా నేత సుబ్రమణ్య స్వామి.
స్వామీగారూ! రాజన్‌కు మూడిందన్న మాట.
గ్రామం నుంచి సంస్థాగత నిర్మాణం. కాంగ్రెస్ దళం తెలంగాణలో లక్షన్నర మందితో ఏర్పాటు.
– కాంగ్రెస్ వర్గాలు.
ఇప్పుడేం అవసరమొచ్చింది. 12 రాష్ట్రాల నుండి 6 చిన్న రాష్ట్రాలకు మీ చిన్న రాజావారు తెచ్చారు. ఇప్పుడేమో మీరు దళాలు, దండ్లు ఏర్పాటు అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.
ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ కరువు, రైతులపై లేదు. కసాయి సర్కారు ఇది.
– కిసాన్‌మోర్చా ధర్నాలో తెలంగాణ భాజపా నేతలు.
మరి మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టండి!
నన్ను నేను శక్తివంతుడిగా భావించడంలేదు. అందరిలాగానే మనుగడ కోసం పోరాడుతున్నాను.
– డొనాల్డ్ ట్రంప్.
అందరూ మనుగడ కోసం పోరాడితే వాళ్ళ కడుపే నిండుతుంది. నీకేమయ్యా ట్రంపు ఏకంగా నీకు అధ్యక్ష పదవే వస్తుంది.
దేశంలో ‘సంఘ్’ ఉగ్రవాదం ఎక్కువైంది.
– కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్.
మరి మీదేం ఉగ్రవాదం. మసూద్ అజహర్, ఇష్రత్ జహాన్‌లు మీకు దేవదూతలు. దేశాన్ని ప్రేమించేవాళ్ళు ఉగ్రవాదులా! నెత్తిన వెంట్రుకలు ఊడేకొద్ది బుద్ధి పలుచబడితే ఎలాగండీ!
అహంకారంతో పాలిస్తే కేసీఆర్‌కు పతనం తప్పదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి.
– సీపిఎం నేత సురవరం ప్రతాపరెడ్డి.
ప్రతీది ప్రజా వ్యతిరేకమైతే ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది. అయినా పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపడుతుందా!
ఏడాది ముందే అభ్యర్థులు. కొద్దిరోజుల్లో 60మందితో తొలి జాబితా. 2019 ఎన్నికలే మా లక్ష్యం.
– తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
సార్ ఇది 2016. ముందున్నది ముదుసళ్ళ పండుగ.
ప్రతి దానికీ గాంధీ కుటుంబం పేర్లేనా!
– సినీ నటుడు రిషీకపూర్.
అయ్యో రామ! మీరు ఇన్నాళ్ళకు మేల్కొన్నారా!
అసత్యాలు మాట్లాడితే కేసులు పెడతాం. కాంగ్రెస్‌కు వ్యూహాలు లేవు. లక్ష్మణ్ కొత్త బిచ్చగాడు.
– తెలంగాణ సీఎం కేసీఆర్.
ఊరుకోండి సీఎంగారూ! పాతవాళ్లు మాట్లాడితే తెలివి లేదు అంటావ్. కొత్తవాళ్లు మాట్లాడితే బిచ్చగాళ్ళు అంటావ్. మరీ ఇటువంటి భాష మంచిది కాదు.
రాష్ట్రాల్లో ఓటమికి సోనియా, రాహుల్ బాధ్యులు కారు.
– కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే.
అంటే గెలిస్తే మాత్రం రాహుల్‌గాంధీ రాజకీయ వ్యూహం, సోనియా చాణక్య దర్పణం, శహబాష్!!!?
– డా. పి. భాస్కరయోగి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి